8, జనవరి 2010, శుక్రవారం

మార్పు చూసిన కళ్ళు (ఆనాటి మాస్కో అనుభవాలు) - మూడో భాగం - భండారు శ్రీనివాసరావు



రష్యన్ మహిళ నోట తెలుగు మాట









మరునాడు తెల్లవారుతూనే రేడియో మాస్కో తెలుగు విభాగంలో పనిచేసే లిదా స్పిర్నోవా అనే ఆవిడ మా ఫ్లాట్ కు వచ్చి తనని తానూ పరిచయం చేసుకుంది. 'శ్రీనివాసరావు గారూ! మీ ఆగమనం కోసం ఎన్నో మాసాలుగా ఎదురుచూస్తూ రోజులు గడుపుతున్నాము' అంటూ ఆ రష్యన్ మహిళ - జగదేకవీరుడు సినిమాలో సరోజాదేవి మాదిరిగా తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే అది చూసి నేనూ మా ఆవిడా అవాక్కయ్యాము. దేశం కాని దేశంలో తెలుగు మాట్లాడే విదేశీ వనిత ఒకరు వున్నారని తెలుసుకుని యెంతో సంతోషపడ్డాము. మాస్కో వాతావరణానికి సరిపడే ఉన్ని దుస్తులు, కాలిజోళ్ళు మా అందరికి కొనిపెట్టమని ఆఫీసు వాళ్లు డబ్బులిచ్చి మరీ ఆమెను పంపారన్న సంగతి తెలుసుకుని మరింత సంబరపడ్డాము.లిదా తీసుకెళ్ళి కొనిపెట్టిన ఉన్ని దుస్తులు వేసుకున్నతరవాత మా రూపు రేఖా విలాసాలన్నీ పూర్తిగా మారిపోయాయి. అవి ధరించి ఉన్ని టోపీలు పెట్టుకుంటే ఆడెవరో, మగెవరో ఒక పట్టాన గుర్తు పట్టడం కష్టం. ఎవరయినా ముందు ఉన్నితో చేసిన 'ఇన్నర్లు' వేసుకోవాలి. వాటిపై పాంటూ షర్టూ కోటూ వేసుకుని 'ఫర్' తో చేసిన లాంగ్ కోటు ధరించాలి. మామూలు బూట్లు పనికిరావు. 'ఫర్' బూట్లు, 'ఫర్' సాక్స్ లేకపోతె ఇంతేసంగతులు.


 అయితే ఈ దసరా వేషం ఇంటినుంచి ఆఫీసుకు చేరేవరకే. అక్కడికి వెళ్ళిన తరవాత ఈ చలి దుస్తులన్నీ అక్కడి ప్రత్యెక కవున్టర్ లలో ఒప్పగించి పాంటూ షర్టుతో ఎంచక్కా తిరగగలిగేలా ఎయిర్ కండిషన్ ఏర్పాట్లు చేశారు. ఇక రేడియో మాస్కో విభాగంలో నా సహచరులు - ముందు చెప్పిన లిదాతో పాటు, విక్టర్, గీర్మన్ పనిచేసేవారు. ఈ ముగ్గురికీ తెలుగు వచ్చు. మరో ఇద్దరు - నటాషా, సెర్గీలకు రష్యన్ తప్ప మరొకటి తెలియదు. వాళ్ళతో నా సంభాషణ సైగలతోనే సాగేది. సజావుగా పని చేసుకోవడానికి మా మధ్య భాష ఎంతమాత్రం అవరోధం కాలేదు. వీళ్ళల్లో నటాషా మరీ చిన్న పిల్ల. యిరవై నిండకుండానే ఇద్దరికి విడాకులు ఇచ్చి మూడో మొగుడితో కాపురం చేస్తోంది. యివన్నీ రష్యన్లకు చాలా మామూలు. మా ఆవిడ శిలా విగ్రహం మాస్కో పురవీధుల్లో వేయించాలని సరదాగా జోక్ చేస్తుండేది. ఎందుకంటె, పెళ్ళయి పదహా రేళ్లయినా ఇంకా అదే మొగుడితో కాపురం చేస్తున్నందుకట.

క్రమంగా కొత్త ప్రదేశంలో- కొత్త జీవితానికి, కొత్త వాతావరణానికీ అలవాటు పడడం ప్రారంభించాము. మా పిల్లలు, సందీప్, సంతోష్- ఇద్దర్నీ ఇండియన్ ఎంబసీకి అనుబంధంగా వున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ - కేంద్రీయ విద్యాలయ్ లో చేర్పించాము. రష్యన్ స్కూళ్ళలో మధ్యాన్న భోజనం, పుస్తకాలతో సహా అన్నీ ఉచితం. పోతే, ఇండియన్ స్కూల్లో ఇందుకు విరుద్ధం. అయినా, రష్యన్ మీడియం లో చేర్పిస్తే ఇండియా కు తిరిగి వెళ్ళిన తరవాత చదువులకు ఇబ్బంది అవుతుందని ఇండియన్ స్కూల్ నే ఎంచుకోవాల్సివచ్చింది.


 అక్కడాఎడ్మిషన్లు  అంత సులభంగా రాలేదు. మేము రష్యన్ ప్రభుత్వం పనుపున వచ్చాము కాబట్టి హార్డ్ కరెన్సీ లో అంటే డాలర్లలో ఫీజు కట్టాలని ప్రిన్సిపాల్  గంగల్  కండిషన్ పెట్టారు. మాకిచ్చే జీతం మీలాగా డాలర్లలో కాదు - రూబుళ్ళలో ఇస్తారని యెంత మొత్తుకున్నా ఆ బెంగాలీ బాబు గారు వినిపించుకోలేదు. ఇక గత్యంతరం లేక - ఆ రోజుల్లో కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్ కు డైరెక్టర్ జనరల్ గా పని చేస్తున్న కె యస్ శర్మ గారికి (తదనంతర
కాలంలో శర్మ గారు ప్రసార భారతికి సీ ఈ ఓ గా పనిచేసారు.) ఫోన్ చేసి విషయం వివరించాను.


 ఆయన కూల్ గా విని - రేపు ఉదయం పోయి ప్రిన్సిపాల్ ని కలవమని తాపీగా చెప్పారు. మర్నాడు నేను వెళ్లేసరికి స్కూలంతా చాలా హడావిడిగా కానవచ్చింది. మాస్కో రేడియో శ్రీనివాసరావు వచ్చాడా అని ప్రిన్సిపాల్ అప్పటికే వాకబు చేయడం మొదలు పెట్టారు. నిబంధనలు ఏ గాలికి పోయాయో తెలియదు కాని, మా ఇద్దరు పిల్లలకు మేము అనుకున్న పద్దతిలో ఎడ్మిషన్ లభించింది. ఆ స్కూలు చదువు వాళ్ళిద్దరి జీవితాల్లో పెనుమార్పు తీసుకురాగలదని కలలో కూడా ఊహించలేదు

. ఎదుగుతున్న దశలో విదేశంలో - వాళ్లకు లభించిన ఎక్స్పోజర్  భవిష్యత్ లో యెంతో ఉపకరించింది. ముందు ఇబ్బంది పెట్టిన గంగల్  గారు కూడా పిల్లల చదువు విషయంలో తీసుకున్న శ్రద్ధ మరచిపోలేనిది. అలాగే శర్మ గారు. అడగకనే వరాలిచ్చే దేవుడిగా ప్రసార భారతిలో సిబ్బంది మన్ననలందుకున్నారు.

 (ఉందిలే 'మంచు కాలం'  ముందూ ముందునా)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి