24, డిసెంబర్ 2009, గురువారం
ఊసుల రాతలు
ఊసుల రాతలు - భండారు శ్రీనివాసరావు
రాత్రి ఓ నక్షత్రం
రాలి ఒళ్ళో పడింది-
తెల్లారి చూస్తే అది నువ్వే
కొందరికి చందమామని చూస్తే
తమ ప్రియురాలు గుర్తుకువస్తుంది
కానీ నిన్ను చూసినప్పుడే
నాకు చందమామ గుర్తుకువస్తుంది
నిన్ను ముట్టుకుంటే
మబ్బుల్ని చుట్టుకున్నట్టు వుంటుంది
నిన్ను ముద్దుపెట్టుకుంటే
నక్షత్రాన్ని పట్టుకున్నట్టు వుంటుంది
నువ్వే నాదానివయితే
ఇక సమస్త ప్రపంచం నాదే
నా కంటి పాపలో కొలువై వున్న తరవాత
నువ్వు కనబడలేదన్న బెంగ నాకెందుకు?
రాత్రి కలలో నువ్వు
రాత్రంతా నాతో నువ్వు
ఇద్దరి మధ్యా నలుగుతూ పాపం రాత్రి
చివరికి నీ కనురెప్పల మధ్య
నిద్రపోతూ నేను
నీ మనసు మెత్తనిదే
హృదయమే ఒక పాషాణం
కానీ నా ప్రేమ వేడితో అది కరక్క పోతుందా
నేను చూడకపోతానా
గొంతు కొరబోయింది
నిన్న చాటుగా నువ్విచ్చిన
ముద్దు ఘాటు కాదు కదా
ఇంత ముద్దొస్తున్నావ్
ఓ ముద్దిస్తే నీ సొమ్మేం పోయింది?
నీ అందంలో వున్న రహస్యం ఏమిటో
ఎందరి కళ్ళు పడ్డా
దిష్టే తగలదు
నువ్వెదురుగావుంటే
యుగాలు క్షణాలు
నువ్వు కనుమరుగయితే చాలు
క్షణాలు యుగాలు
నిన్ను నేను మరవాలంటే
నన్ను నేను మరవాలి
నన్ను నేను మరవాలంటే
నిన్ను నేను మరవాలి
షాజహానుకు బుద్దిలేదు
ప్రియురాలికి గుండెలో గుడి కట్టాలి కాని
చలువరాళ్ళతో తాజమహలు కడతాడా?
నిను చూడకుంటే చస్తాను
నువు కనబడితే పడి చస్తాను
కన్ను తెరిస్తే నువ్వు
కనులు మూస్తే నువ్వు
కలల్లో నువ్వు
కనురెప్పల్లో నువ్వు
పీల్చే గాలిలో
విడిచే శ్వాసలో
రాసే రాతలో
నువ్వే-నీ నవ్వే
ఊహల్లో నేను
ఊహించుకుంటూ నువ్వు
వర్తమానాన్ని నష్టపోతున్నాము
-భండారు
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి