25, డిసెంబర్ 2009, శుక్రవారం

యిద్దరు మిత్రులు -వైఎస్సార్ - చంద్రబాబు

  సరిగ్గా   ముప్పయేళ్ళ క్రితం, మార్చి 15వ తేదిన - 'ఇద్దరు మిత్రులు ' రాష్ట్ర శాసనసభలలో కొత్త సభ్యులుగా అడుగుపెట్టారు. ఆ ఇద్దరు - భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులు కాగలరని ఆనాడు ఎవ్వరూ వూహించి ఉండరు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో తొలి అడుగులు కలిసి వేసిన ఆ ఇద్దరి దారులు వేరైపోతారని కానీ, ఆ ఇరువురి మధ్య వెల్లి విరిసిన స్నేహం ఆవిరి కాగలదని కానీ ఏమాత్రం అనుకోవడానికి అవకాశం లేని రోజులవి. ఆ ఇద్దరూ ఎవరన్నది పెద్ద ప్రశ్నా కాదు - సమాధానం చెప్పలేనంత క్లిష్టమైనది కాదు. కాకపోతే, ఒకప్పటి ప్రాణస్నేహితులయిన రాజశేఖరరెడ్డి - చంద్రబాబు కొన్ని విషయాలలో చాలా అదృష్టవంతులయిన రాజకీయ నాయకులనే చెప్పాలి.

1978 లో వైఎస్సార్ తో రచయిత

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు - ఆయన పార్టికి ఆయనే అధినేత - కేంద్రంలో సయితం ఆయిన కనుసన్నల్లో పనిచేసే ప్రభుత్వాలే కొనసాగాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్ టి రామారావుగారికి కూడా ఈ వైభోగం లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎప్పుడూ చుక్కెదురే. ఇక రాజశేఖరరెడ్డి విషయం తీసుకుంటే - ఆయన ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించేనాటీకి - కాంగ్రెస్ పార్టి అధిష్టానం తీరుతెన్నులే పూర్తిగా మారిపోయాయి. తరచుగా ముఖ్యమంత్రులను మార్చే విధానానికి సోనియాగాంధి నాయకత్వంలోని ఆ పార్టి అధిష్టానం తిలోదకాలు ఇచ్చింది.



ముఖ్యమంత్రి వైఎస్సార్ తో రచయిత


స్వపక్షంలోనే విపక్ష రాజకీయాలు - చెపట్టిన ప్రతి అబివృద్ధి కార్యక్రమానికి ఏవో ఒక రకమైన ఆరోపణలు మరకలు - మీడియాలో ఒక వర్గంపై ప్రత్యక్ష యుద్ధాలు - దూరమైన మిత్ర పక్షాలు - దగ్గరవుతున్న శత్రుగుడారాలు ఇవన్నీ సహజంగా పాలకపక్షానికి చికాకు కలిగించే అంశాలే. అయినా కాని - మందహాసం చిందిస్తూ మీడియాలో కనపడే రాజశేఖరెడ్డిని చూసే వారికి కలత చెందాల్సిన ఈ అంశాలేవీ ఆయనని కలవర పరుస్తున్న దాఖలాలు కనపడటలేదు. మంత్రివర్గం ఏర్పాటులో - పార్టిలో అసమ్మతిని ఏదో ఒక రూపంలో రెచ్చగొట్టే విషయాల్లో అధిష్టానానికి ఇంకా ఎంతో కొంత పట్టువున్నట్టూ కానవచ్చినా - ముఖ్యమంత్రిని మార్చేసాహసానికి పునుకోలేని స్థితిలో ఉండడం రాజశేఖరరెడ్డి కి శ్రీరామరక్షగా మారింది. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలను ధీమంతంగా ఎదుర్కోగలిగిన రాజకీయ జవసత్వాలు ఉన్న ప్రత్యామ్నాయ నాయకత్వం రాష్ట్ర కంగ్రెస్‌లో లోపించడం రాజశేఖరేడ్డికి మరో కవచం. జనాకర్షణ శక్తి ఆయనలో తగ్గిపోయినట్టు - స్వపక్షంలో విపక్షం ఎంత గగ్గోలు పెట్టినా - అందులో వాస్తవం ఉందని నమ్మడానికి ఆధారాలు లేవు. అందుకే - చంద్రబాబు - రాజశేఖరరెడ్డి అదృష్టవంతులయిన రాజకీయ నేతల కోవలోకి చేరిపోయారని చెప్పడం. పార్టీలో - ప్రభుత్వంలో ఎదురులేని స్థితికి చేరుకోవడం - అస్తిత్వానికి ముప్పులేకపోవడం - సహజంగానే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అవి అతిగా పెరిగిపోయి - అహంకారానికి మితిమీరిన ఆత్మవిశ్వాసానికి దారితీయనంతకాలం - ఎలాంటి అనర్థాలకు అవకాశం ఉండదు. రెండోతరం చివరాఖరి దశలని మినహాయిస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబుది మరింత కలిసివచ్చిన కాలం. ఇంటా - బయటా ఆయన పేరు మారుమ్రోగిపోయింది. ప్రపంచపటంలో ఆంధ్రప్రదేశ్‌కి చోటు దక్కింది. ఎన్నారైలకి  రాష్ట్రంలో ఓటు హక్కు ఇస్తే - ఆయన మరికొన్ని దశాబ్దాలవరుకు ముఖ్యమంత్రిగా కొనసాగగలరన్న వూహాగానలకు ఈ ఎన్నారైల అభిమానం ఊపిరి పోసింది. ఆకాశానికి నిచ్చెనలు వేసి - అంధ్ర ప్రదేశ్‌ని పైక్కించే పధకాల రచనకు కంప్యుటర్ వేగంతో శ్రీకారం చుట్టింది.

కాలు విరిగి ఆసుపత్రిలోవున్న రచయితను ముఖ్యమంత్రి హోదాలో పరామర్సిస్తున్న చంద్రబాబు


ఆ తర్వాత జరిగింది చరిత్ర - మిత్రపక్షాలు వైరి పక్షాలుగా మారి వీధులకెక్కారు. ప్రకృతి కన్నేర్ర చేయడంతో - వరుస కరువులతో రైతాంగం వెన్ను విరిగింది. విధ్యుత్ కొరత కడగండ్లని మరింత పెంచిమిది. సంస్కరణలు ధరలు పెంపుకు దోహదంచేసి - పరిస్థితులు మరింత దిగజారేలా చేశాయి. జరుగుతాయనుకున్న ఎన్నికలు మరింత దూరం జరగడం - తాత్కాలిక సర్కారు పాలాధికారులకు ఎన్నికల కమీషన్ ముక్కుతాడు విధించడం - చంద్రబాబుని మరింత వుక్కిరి బిక్కిరి వేశాయి. ముందరి కాళ్ళకు బంధాలు వేశాయి. ప్రత్యేక తెలెంగాణా పేరుతో వుద్యమం ప్రారంభించి - ఎన్నికల్లో పోటిచేసిన ట్. ఆర్. స్. నేత చంద్రశేఖర రావుతో - కాంగ్రెస్ వ్యుహాత్మాకంగా చేతలు కలపడంతో - రాష్ట్రంలో తెలుగుదేశం పరిపాలనకు చరమగీతం పాడినట్టయింది.
కణకణమండే ఎండాకా కాలంలో రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో జరిపిన సూదీర్ఘ పాదయాత్రతో సాధించిన కాంగ్రెస్ విజయంతో - చంద్రబాబు పాలన - రెండో టరం వ్యవధి పూర్తికాకుండానే ముగిసిపోయింది.

ఇక రాజశేఖరెడ్డి విషయానికి వస్తే - ఆయన సరైన సమయంలో ముఖ్యమంత్రి అయ్యారనే చెప్పాలి. 2004లో కాంగ్రెస్ గెలిచి వుండని పక్షంలో - భవిష్యత్తులో ఆయనకి   ఈ అవకాశం లభించే పరిస్థితి వుండేదికాదు. గతంలో కూడా ముఖ్యమంత్రి రేసులో ఆయన లేకపోలేదు. అప్పుడే ఈ పదవి ఆయనికి లభించి ఉంటే - రెండేళ్ళో - మూడేళ్ళో ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన కాంగ్రెస్ మాజీల జాబితాలో ఆయన చేరిపుండేవారేమో. ఈ సారి సరైన తరుణంలో ముఖ్యమంత్రి కాగలిగారు. కనుక - మూడేళ్ళ పదవీకాలాన్ని జయప్రదంగా పూర్తిచేసుకుని పూర్తి టర్మ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఒక రికార్డ్ సృష్టించే దిశగా ముందుకు సాగుతున్నారు.

రాజశేఖరరెడ్డిది  ఆశ్రిత పక్షపాత బుద్ది. అందుచేతనే,  అందరిని కలుపుకుపోవడం లేదన్న  విమర్శలు సొంత పార్టి వారే చేస్తున్నారు. కాకపోతే ఈ విషయంలో ఆయన కారణాలు ఆయనకు వుండవచ్చు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అధికార పర్వంలో నిర్వహింఛిన కాలం బహు తక్కువ. కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు సయితం ఆయన్నీ ,  ఆయన అనుచరులనీ  ఆదరించి అందలం ఎక్కించింది లేదు. అందుకే ఎంతో కాలం వేచి చూసిన తర్వాత లభించిన అధికార  తాయిలాన్ని పంచే విషయంలో ఆయన తన అనుచర గణానికి పెద్ద పీట వేయడంలో ఆశ్చర్యపోవల్సింది లేదు. అందుకే నమ్ముకున్నవారికి వైఎస్సార్ కొమ్ముకాస్తారని అన్నా కూడా ఆయన  అభ్యంతరపెడుతున్నదీ లేదు.

దటీజ్ రాజశేఖరరెడ్డి.

ఆయన్ని బాగా తెలిసుకున్నవాళ్ళందరికి ఇది బాగా తెలిసిన సంగతే.

                                                                      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి