26, డిసెంబర్ 2009, శనివారం

మరో ఉచితం - వార్త - వ్యాఖ్య

మరో ఉచితం
వార్త - వ్యాఖ్య (భండారు శ్రీనివాసరావు )

ముగింపు ఇంతకంటే గొప్పగా, హుందాగా వుంటుందని " శాశనసభ సమావేశాల తీరు తెన్నులపట్ల అవగాహన వున్నవారు ఎవ్వరూ అనుకోరు. ఏమయితేనేం " 12 వ శాశనసభ ఆఖరి సమావేశాలు " "గతకాలము మేలు" అన్న చందంలోనే ముగిశాయి. సభ జరిగింది కొద్ది రోజులే అయినా, ఏనాడూ ఎజెండా ప్రకారం కార్యక్రమాలు సాగిన దాఖాలా లేదు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో చర్చలు పక్కదారి పట్టడం మినహా పక్కాగా సాగిన సందర్భంలేదు. సభా సమయాన్ని "సొంతానికి" వాడుకోవడంలో ఈ పార్టీ " ఆ పార్టీ అన్న తేడా లేకుండా, అన్ని పార్టీలు పోటి పడ్డాయి. వాటి దృష్టిలో "దుర్వినియోగం" అన్న ప్రసక్తే లేదు. ప్రత్యక్ష ప్రసారాల పుణ్యమా అని " ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు చేయాల్సినవన్నీ చేసి చూపించాయి. రాజకీయ లబ్ధి కోణం నుంచే ప్రసంగాలు సాగాయి. చర్చలు జరిగాయి. విమర్శలు వెల్లువెత్తాయి. ఆరోపణలు హోరెత్తాయి. సంభాషణలు శృతిమించాయి. అసలు ఎజెండా పక్కకు తొలిగింది. రాజకీయ ఎజెండా లెక్కకు మిగిలింది.
చట్టసభల వ్యవహారం "యూపీ" నుంచి "ఏపీ" దాకా ఇదే తంతు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుని మనమే నయమని మనకు మనమే కితాబు ఇచ్చుకోవాలో లేక " ఒక అయ్యదేవర, ఒక పుచ్చలపల్లి, ఒక నాగిరెడ్డి, ఒక సందీవరెడ్డి వంటి ఉద్ధండుల కాలం తలచుకుని బావురుమనాలో " అర్ధంకాని పరిస్థితి.

ఈ పరిస్థితి మరింత దిగజారి "దుస్థితి " గా మారకుండా వుండాలంటే ఏం చెయ్యాలన్నది ప్రధాన ప్రశ్న. శాసనసభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని నిలుపుచేస్తే " అడ్డగోలు ప్రవర్తనకు అడ్డుకట్ట పడుతుందన్నది ఒక సూచన. ఇందులోని మంచి చెడులపై విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. యనమల రామకృష్ణుడు అసెంబ్లీ స్పీకర్ గా వున్న కాలంలో ఈ ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతి లభించింది. ఆనాడు వున్న టెలివిజన్ ఛానళ్ల సంఖ్య పరిమితం కావడం వల్ల " ఫలితాలనూ, దుష్ఫలితాలనూ వెనువెంటనే బేరీజు వేయడం జరగలేదు. పైపెచ్చు తొలిరోజుల్లో " ఈ ప్రయోగం సప్ఫలితాలను ఇచ్చిన విషయం కూడా మరచిపోకూడదు. ప్రజా సమస్యలను ప్రజాప్రతినిధులు సభలో లేవనెత్తడం ద్వారా ఆయా ప్రాంతాల ప్రజల మన్నననూ, విశ్వాసాన్నీ పెంపొందింపచేసుకోవడానికి ఈ ప్రసారాలు ఉపయోగపడ్డాయి.

కానీ క్రమేణా ఈ ప్రత్యక్ష ప్రసారాల తీరుతెన్నులు మారిపోయాయి. సభ సజావుగా జరుగుతున్నప్పుడు, ప్రజా సమస్యలపై చర్చ ప్రశాంతంగా సాగుతున్నప్పుడు " అనేక ఛానళ్లు ప్రసారాలను నిలిపివేసి. రొటీన్ కార్యక్రమాలను చూపిస్తూ వుండడంతో సంచలనం ఒక్కటే ఛానళ్లను ఆకర్షించే మార్గంగా ఎంచుకోవాల్సిన దుస్థితి దాపురించింది. పేపర్లు చింపడం, ప్లకార్డులు ప్రదర్శించడంతో ప్రారంభమై " స్పీకర్ పోడియంని ముట్టడించడం, మైకులు విరవడం వరకూ ఈ సంచలనాత్మక ధోరణి పెచ్చరిల్లింది. సస్పెన్షన్‌కు గురైన వారిని మార్షల్స్ మోసుకుపోవడం అన్నది ఈ ప్రత్యక్ష ప్రసారాలతోనే మొదలయిందని శాసనసభ వ్యవహారాలను కవర్‌చేసే ఏ సీనియర్ జర్నలిస్టుని అడిగినా చెబుతారు. ప్రత్యక్ష ప్రసారాల ద్వారా " తాము ఎన్నుకున్న ప్రతినిధుల ప్రవర్తనని అంచనా వేసుకునే అవకాశం ఓటర్లకి లభిస్తుందన్న వాదన సబబైనదే. కానీ ప్రజాస్వామ్యాన్నే ఈసడించుకునే స్థితికి ప్రజలు చేరుకోవడం కూడా అభిలషణీయం కాదు. ప్రత్యక్ష ప్రసారాల వల్ల నిజానికి జరుగుతున్నదిదే! సంచలనాలకు పెద్దపీట వేసే విధానాన్ని ఛానళ్లు కొంతమేరకయినా సడలించుకోగలిగితే " ఇక పేచీ ఏమీ లేదు.

కానీ, అంతమాత్రంతో సమస్య పరిష్కారం అవుతుందనుకోలేము. ఎందుకంటే సభలో మాట్లాడినదానికి, మాట్లాడనిదానికి మరికొంత జోడించి చెప్పడానికి సభా ప్రాంగణంలోనే ప్రత్యక్ష ప్రసారాలను నిలుపు చేయడంలో లేదు. ఏది, ఎంతమేరకు ప్రసారం చేయాలనే మీడియా విధానంలో వుంది. అంటే స్వీయ నియంత్రణ ద్వారా పరిస్థితిని మెరుగుపరచడానికి వీలుంది. కానీ, సర్వం వ్యాపారమయమయిపోయి " విలువలకన్నా రేటింగులకు ప్రాధాన్యం ఇచ్చే పోటీ యుగంలో ఈ స్వీయ నియంత్రణ మంత్రం వల్ల ఏ పాటి ప్రయోజనం సిద్ధిస్తుందో అంత అర్థం చేసుకోలేని విషయమేమీ కాదు.
భరించగలిగినంతవరకూ భరిస్తూ- ఉచిత వినోదమని సరిపెట్టుకుంటూ ఆనందించడమే ఇక జనాలకు మిగిలింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి