26, డిసెంబర్ 2009, శనివారం

జనహితమే సర్వజన సమ్మతం - భండారు శ్రీనివాసరావు

జనహితమే సర్వజన సమ్మతం  - భండారు  శ్రీనివాసరావు

ఎక్కడి వీవిస్ లక్ష్మణ్! ఎక్కడి గిల్‌క్రిస్ట్! ఎక్కడి సెహ్వాగ్! ఎక్కడి జయసూర్య! ఎక్కడి హర్భజన్! ఎక్కడి హేడెన్! హద్దుల్ని కాదనుకుని - సరిహద్దుల్ని దాటుకుని క్రీడా స్పూర్తితో క్రికెట్ చరిత్రని తిరగరాస్తున్న ఐ పీ ఎల్ పోటిల్లో పాల్గొంటున్న దిగ్గజాలని చూస్తుంటే ఏమనిపిస్తుంది? విశ్వమంతా ఒకటై - ఒకే వేదికగా మారుతున్న తరుణంలో 'మన రాజకీయం ' ఏ దిశగా సాగుతోంది? ఏ దరి చేరబోతుంది?

రాష్ట్ర విభజనని ప్రజలు మనస్పూర్తిగా కోరుకుంటే ఏ రాజకీయ శక్తీ దాన్ని ఆడ్డుకోలేదు. ఈ ఆకాంక్ష జనానిదయితే మన్నించాల్సిందే. రాజకీయమైనదయితే ఆలోచించాల్సిందే'. ఇటీవలికాలంలో - దాదాపు అన్ని పార్టీలు - ఏదో ఒక రూపంలో - ఏదో ఒక స్థాయిలో తెలంగాణా సెంటిమేంట్‌ని కొద్దో గొప్పో పులుముకోవాలిని ప్రయత్నిస్తూ ఉన్నాయి.

ఈ పార్టీల్లోని కొందరు పెద్దలకి ఇది తక్షణ రాజకీయ అవసరంగా మారింది. అదే ఇందులోని విషాదం. అయితే, సమైక్యవాదం నుంచి అంగుళమైనా ఎడం జరగని ఎడమ పార్టిల్లో సీపియంని ప్రధమంగా చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కూడా ఈ కోవలోకే వస్తారు. అభివృద్ధి నినాదం ప్రాతిపదికపైనే ఉప ఎన్నికల సమరాంగణంలోకి అడుగు పెట్టాలన్నది ఆయన అభిమతం. సమైక్య రాష్ట్ర సిద్ధాంతాన్ని బలపరిచే పార్టీల్లో పెద్ద పీట వేయాల్సిన మరో పార్టి టీడీపి.

ప్రత్యేక రాష్ట్రమే పరమావధిగా పుట్టుకోచ్చిన తెలంగాణా రాస్ట్ర సమితి నాయకుడు చంద్రశేఖరావు - వ్యూహాత్మకంగానో లేదా గత్యంతరం లేకనో తెచ్చిపెట్టిన ఉప ఎన్నికల ఉసురు అన్ని పార్టిలనూ చుట్టుముడుతోంది. తెలంగాణా పట్ల అనేక రాజకీయ పక్షాల్లో నెలకొని ఉన్న అసందిగ్ధ పరిస్థితికి - ఈ ఉప ఎన్నికల ఫలితాలే స్వస్తి వాచకం పలకగలవన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.

దేశం స్వాతంత్ర్యం పొందిన దరిమిలా - అనేక కొత్త రాష్ట్రాలు పురుడు పోసుకున్నాయి. పొరుగున ఉన్న అనాటి మద్రాసు(తమిళనాడు) రాష్ట్రం నుంచి విడిపోయి ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం - తరువాత కొద్ది కాలానికే - భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్దాంత ప్రాతిపదిక పై - తెలంగాణా ప్రాంతాన్ని కలుపుకుని - ఆంధ్ర ప్రదేశ్ గా ఆవిర్భవించింది. ఒకే భాష మాట్లాడే వారికి కూడా, విడివిడిగా రాస్ట్రాలు వున్నప్పుడు - ఆంధ్ర ప్రదేశ్ ని కూడా ప్రజాభిష్టం మేరకు విభజించడంలో తప్పేమి లేదు. అయితే తప్పల్లా - ప్రజల ఆకాంక్షని అంచనా వేయడంలో చేస్తున్న తప్పులే. రాష్ట్ర విభజన అన్నది ఎవరో కొందరి రాజకీయావసరాల కోసం కాకుండా మెజారిటీ ప్రజల అబీష్టం మేరకు జరగాలి. జరగనున్న ఉప ఎన్నికల ఫలితాలు ఈ దిశగా కొంతమేరకు ఉపకరించే అవకాశం ఉంది.

ఏ వేర్పాటు ఉద్యమానికయినా, వెనుకబడినతనమే ప్రాతిపదిక. దీని ఆధారంగా పెచ్చరిల్లే భావోద్వేగాలే విభజన ఉద్యమాలకు ఊపిరిపోస్తాయి. ఈ విధంగా ప్రజ్వరిల్లే శక్తిని అడ్డుకోవడం అతికష్టం అని గతంలో తెలంగాణా ప్రజా సమితి నిరూపించింది కూడా. అయితే, అప్పటికి అంటే 1969 నాటికి ఇప్పటికీ పరిస్థితుల్లో ఇసుమంత కూడా మార్పు రాలేదంటే నమ్మడం కష్టం. తెలంగాణాలో ఇంకా కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదంటే నమ్మచ్చుకాని తెలంగాణాలో అసలు అభివృద్ధి జరగలేదని వాదించడం కేవలం రాజకీయమే అవుతుంది. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. 1969 నాటికి వూహకు సయితం అందని ఉదార ఆర్ధిక విధానాలు ఈనాడు శరవేగంగా అమలవుతున్నాయి. ప్రపంచీకరణ సిద్దాంతం నేల నాలుగు చెరగులా బలంగా వేళ్ళూనుకుంటున్న నేపధ్యంలో - అసలు దేశాలు మధ్యనే హద్దులు చెరిగిపోతున్నాయి.

పొట్ట గడవక కొందరూ - డాలర్లు వేటలో మరికొందరూ - ఉపాథి కోసం ఇంకొందరూ ఉన్నవూరు వదిలిపెట్టి వెళ్ళడం అన్నది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కావడంలేదు. అవకాశాలు వెతుక్కుంటూ అన్ని ప్రాంతాలవారు అన్ని చోట్లకీ వలస వెడుతున్నారు.
ఏదో ఒకనాడు - తెలుగువాడే అమెరికాకి అధ్యక్షుడు కాగలడని ఆ దేశంలో ఉంటున్న తెలుగువారే భరోసాగా చెబుతున్నారంటే ఇక భౌగోళిక రేఖలకి, దేశాల సరిహద్దులకీ - అర్థమేముంటుంది? పోతే - ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని - భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు ఏపాటి మిగులుతాయో అర్ధం చేసుకోలేని విషయమేమి కాదు.
ఆ మాటకి వస్తే - దేశాలయినా, రాష్ట్రాలైనా, ప్రజలైనా విడిపోవడం - కలిసిపోవడం పెద్ద విషయమేమి కాదు. విభజన కుడ్యాన్ని కూలగొట్టుకుని - రెండు జర్మనీలు కలిసిపోయాయి. అమెరికాని సయితం శాసించగలిగిన స్థాయికి ఎదిగిన సోవియెట్ యూనియన్ - అంగ, వంగ, కళింగ దేశాల మాదిరిగా విచ్చిన్నమయింది.

కాబట్టి - చరిత్ర నుంచి నేర్చుకున్నవారు - చరిత్ర హీనులు కాలేరు. మనసులూ - మనుషులూ కలుషితం కావడం ఏ సమాజానికి క్షేమకరం కాదు. విడీపోయినా చేతులు కలిసే వుండాలి. మనసులు మసి బారకుండా ఉండాలి .
సర్వేజనాః సుఖినోభవంతు!
(మే - 2008 )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి