26, డిసెంబర్ 2009, శనివారం

వార్త - వ్యాఖ్య - గెలుపే లక్ష్యం - పవరే ముఖ్యం

వార్త - వ్యాఖ్య - గెలుపే లక్ష్యం - పవరే ముఖ్యం
-భండారు శ్రీనివాసరావు

ఇప్పుడు రాష్త్రంలో అన్ని రాజకీయ పక్షాలది ఒక్కటే మాట. అదే ’మార్పు’.కాకపోతే ఆ మార్పు అనేది తమకు అనుకూలంగా ఉండాలన్నదే వాటి కోరిక. మార్పు కోసమే పెట్టిన పార్టీ చిరంజీవిది.’ప్రేమేలక్ష్యం - సేవే మార్గం’ అనే టాగ్ లైన్ తో ప్రజారాజ్యం పార్టీపెట్టి, నా రూటే సెపరేటన్నవాడు కాస్తా, షరా మామూలు రాజకీయాల్లోకి సరాసరి దిగిపోయి, కామాలు లేని హామీలు గుప్పిస్తూ ’నన్ను ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మీదేనంటూ’ ఆ భారాన్ని జనం మీదకే నెట్టేసి కొత్తరకం ’మార్పు’ ను కోరుకునే పనికి శ్రీకారం చుట్టారు.కాగా పార్టీ మారి, వేరే పార్టీ పెట్టేసి, నెలలు నిండకముందే దాన్ని మరో పార్టీలో కలిపేసిన ’మార్పు’దేవేందర్ గౌడ్ ది. ’తల్లీ బైలెల్లినాదో’ అంటూ తల్లి తెలంగాణా పార్టీ స్థాపించి - కధానాయకి పాత్రకంటే సెకండ్ హీరోయిన్ వేషం నయమనుకుని టీ ఆర్ ఎస్ లో కలిసిపోయిన ’మార్పు’ విజయశాంతిది. ’జై తెలంగాణా’ అంటూ తెలంగాణా ఆత్మగౌరవ నినాదానికి ఊపిరి ఊది, వేర్పాటు ఉద్యమానికి పురుడు పోసిన తెలంగాణా రాష్ట్ర్రసమితి ప్రధాన ధ్యేయాన్ని కాసేపు జమ్మిచెట్టు ఎక్కించి - మహాకూటమిలో చేరిపోయిన పెను’మార్పు’ కె.చంద్రశేఖర రావుది.తోక పార్టీలుగా అందరిచేతా ముద్దుగా పిలిపించుకుంటూ ’మార్పే ధ్యేయం - మార్పే లక్ష్యం - మావో దైవం’ అంటూ,మార్పుకు ట్రేడ్ మార్క్ తమదేనంటూ ఎర్రరంగుని అన్ని రంగుల్లో కలిపేసిన ’మార్పు’ లెఫ్ట్ పార్టీలది.’అయిదేళ్ల అధికారంలో చేసింది చాలా వుంది. చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది, కాబట్టి మమ్మల్ని మార్చకుండా మరో అయిదేళ్లు అవకాశం ఇస్తే ఇంకా మంచి మార్పు తెచ్చి ’చేతిలో’ పెదతామన్నది వై ఎస్సార్ మార్క్ ’మార్పు’.
ఇక చంద్రబాబు నాయుడి సంగతి.
’నేను నవ్వాను - లోకం మారింది, నేను మారాను - లోకం నవ్వింది’ అనే తరహాలో - సగటు తెలుగు సినిమా సెకండాఫ్ లో హీరో మాదిరి ’మార్పు’ఆయనది.

పోతే అసలు సిసలు’మార్పు’ కోసం లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ పడుతున్న పాట్లు, కంటున్న కలలు లోక విదితమే. ఎన్నికల్లో ప్రతీదానికి రేటు కట్టి ఓటు కొనుక్కోవడం తప్పున్నర తప్పు అన్నది ఆయన థియరీ.

’ఆయన సొమ్మేంపోయింది. గెలిచినా, ఓడినా పోయేదేమీ లేదు. రాజకీయాలు కుదిరేపని కాదనుకున్నడు, పొలిటికల్ పార్టీ బోర్డు తిప్పేసి మళ్లీ’జనహితం మనమతం, మనమతమే జనహితం’ అంటూ సుద్దులు చెబుతూ బుల్లి తెరపై వొదిగిపోగలరు. మా సంగతి అలా కాదే! గెలిచి తీరాల్సిన పరిస్థితి. సుమతీ శతకాలూ, సూక్తి ముక్తావళులూ ఎన్నికల్లో ఓట్లు పెట్టవు అన్నది రాజకీయుల వాదన. అందుకే - ఓటర్లని ప్రలోభపెట్టడానికి వారు తొక్కని అడ్డ దారులు ఉండవు. ఓటర్లని ఆకర్షించడానికి వేయని పిల్లి మొగ్గలు వుండవు. ఈ విషయంలో వెనకడుగు వేసే పార్టీ అంటూ వుండనే వుండదు.

అందుకే నరం లేని నాలుక, మండు వేసవిలో వారి చేత హామీల వర్షం కురిపిస్తోంది. కలర్ టీవీలు, నెలసరి భత్యాలు, భూసంతర్పణలు, పసుపు కుంకుమలు, ఉచిత వైద్యాలు, ఫ్రీ చదువులు, కరెంటు మీది - బిల్లు మాది హామీలు - ఒకటా, రెండా సెర్చిచేసి, రీసెర్చిచేసి కనుక్కున్న సంక్షేమ పథకాలతో పార్టీల మేనిఫెస్టోలు - ఓటర్లకు అరచేతిలో ’నరకం’ చూపెడుతున్నాయి. ఎలా ఇస్తారన్నదానికి లెక్కలు లేవు. ఎన్నాళ్లు ఇస్తారన్నదానికి జవాబులు లేవు. ఇందులో ఒకరు తక్కువ తిన్నదీలేదు. ఎదుటివాడిని తిననిచ్చిందీ లేదు. ముసాయిదా మేనిఫెస్టోల్లోనే ఇన్నిన్ని హామీలుంటే - ఇక అసలు మేనిఫేస్టోల్లో హామీలు ఏమేరకు వుంటాయన్నది భేతాళ ప్రశ్నే! ఈ విషయంలో ఆర్థికమంత్రి రోశయ్యగారికి కలిగిన ధర్మసందేహం ఆలోచించతగిందే!

’సర్కారు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ గోడుగోడున గోలపెడతారు. ప్రతి పక్షాలు మేనిఫెస్టోల పేరుతో అర్ధం, పర్ధంలేని హామీలు గుప్పిస్తుంటే కోడ్ ఉల్లంఘన కిందికి రాదా’!అన్నది ఆయన లేవనెత్తిన పాయింట్. ఇది పాయింటే కాదంటోంది రాష్ట్ర్ ఎన్నికల కమీషన్. పాపం దాని కష్టాలు దానివి. పని ఎక్కువ, పనిచేసేవారు తక్కువ. పరిశీలన కొచ్చిన ఫిర్యాదుల సంగతి చూడాలంటే ఏండ్లు పూండ్లు పడుతుంది. ఈ లోగా ఎన్నికలు పూర్తయిపోతాయి. మరో ఎన్నికలు వస్తాయి. కానీ ప్రజాస్వామ్య చక్రం తిరుగుతూనే వుంటుంది.

(ఏప్రిల్ - 2009 )





--------------------------------------------------------------------------------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి