25, డిసెంబర్ 2009, శుక్రవారం

వార్తకు ప్రాణం విశ్వాసం - వార్త వ్యాఖ్య - భండారు శ్రీనివాస రావు

(November 16- National Press Day)



వార్తకు ప్రాణం విశ్వాసం 
- వార్త వ్యాఖ్య - భండారు శ్రీనివాస రావు (ఆకాశవాణి - హైదరాబాద్ - ప్రాంతీయ వార్తా విభాగం సౌజన్యంతో )
చాలా ఏళ్ళనాటి సంగతి.
కేంద్రంలో ఆనాడు సహాయ మంత్రిగావున్న డాక్టర్ కే ఎల్ రావు గారు మా వూరు రావాల్సివుంది. గంటలు గడిచిపోతున్నా మంత్రిగారి జాడ లేదు. చీకటి పడింది. ఇంతలొ దూరంగా వూరి పొలిమేరల్లో మోటార్ కార్ల హెడ్ లైట్ ల కాంతి కనబడింది. అమ్మయ్య వచ్చేసారులే అనుకున్నాం. కానీ, కాసేపటి తరవాత ఆ లైట్ ల వెలుతురు కూడా కానరాలేదు. మంత్రిగారి పర్యటన మొదలుకాకుండానే ముగిసిపోయింది.
మర్నాడు ఉదయం రేడియో లో ప్రాంతీయ వార్తలు విన్నప్పుడు అసలు విషయం తెలిసింది. సరయిన రహదారి లేకపోవడంవల్ల దారి తప్పిన మంత్రిగారి పరివారం- మా వూరికి వచ్చే దారి కనుక్కోలేక - విధి లేని పరిస్థితిలో ప్రోగ్రాం రద్దుచేసుకుని యెకాయెకిన విజయవాడ తిరిగి వెళ్ళిపోయిందట. ఆ సాయంత్రం వచ్చిన పత్రిక ద్వారా మరికొన్ని విశేషాలు తెలిసాయి. మునేటికి అవతల - దారీ తెన్నూ లేకుండావున్న అనేక గ్రామాలను కలుపుతూ రోడ్డు వేయాలని కే ఎల్ రావు గారు నిర్ణయించారట. మంత్రి గారు రాకపోయినా- రోడ్డు వస్తున్నందుకు గ్రామస్తులు సంతోషించారు.
పొతే- ఆరోజు సాయంత్రం వచ్చిందని చెప్పానే ఆ ఆంద్ర పత్రిక ఒక్కటే మా వూరు మొత్తానికి దిక్కు. ఉదయం ముద్రించిన పేపర్ సాయంకాలానికి కానీ మా వూరు చేరేది కాదు. బస్సు సదుపాయాలు అంతంత మాత్రం. రోడ్ల సంగతి సరేసరి. చెప్పాల్సిన పని లేదు.
ఆంద్ర పత్రిక - కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి పత్రిక. పందొమ్మిదివందల ఎనిమిది లోనే ఆనాటి బొంబాయి లో దాన్ని ప్రారంభించారు. అప్పటికే కొన్ని పత్రికలూ వస్తున్నప్పటికీ - తెలుగు పత్రికా రంగంలో ఆ పత్రిక స్థానం ఎవరూ కాదనలేనిది. పంతులు గారు కూడా పత్రికను వాణిజ్య ప్రాతిపదిక పై నడపలేదు. పైపెచ్చు- బొంబాయి నుంచి ప్రతి రోజూ తన స్వంత ఖర్చులపై పత్రికను ఆంద్ర ప్రాంతంలోని గ్రంధాలయాలకూ , రీడింగ్ రూంలకూ పంపేవారు. తెలుగునాట పత్రికలూ చదివే ఆసక్తి పెరగడానికి పంతులుగారి ఈ ప్రయత్నం దోహదం చేసింది కూడా.
ఇక మళ్ళీ మా వూరికి వెడితే-
గూడా సత్యనారాయణ సిద్దాంతి గారనే వయో వృద్దుడు - తనకొచ్చే కొద్దిపాటి ఆదాయంలో - మూడు రూపాయలు నెలసరి చందా కట్టి - పోస్ట్ లో పత్రికను తెప్పించుకునేవారు. పేపర్ రాగానే- వూళ్ళో చడువుకున్న వాళ్ళూ- చదువుకోని వాళ్ళూ - ఒక చోట చేరిపోయేవాళ్ళు. అప్పయ్య మాస్టారు - తన కంచు కంఠంతో వార్తలను ఆమూలాగ్రం చదివి వినిపించేవారు.
"అమెరికా అధ్యక్షుడిగా జాన్ ఫిట్జరాల్ద్ కెన్నడీ ఎన్నిక- వోటమి అంగీకరిస్తూ నిక్సన్ ప్రకటన-
" కాంగోలో జరిగిన విమాన ప్రమాదంలో ఐరాస సెక్రెటరీ జనరల్ దాగ్ హామర్ షెల్డ్ దుర్మరణం - దుర్ఘటనపై నీలినీడలు-
" మన సారధి- మన సచివుడు- మన జవహర్ - మనకిక లేడు-"
ఇలా సాగిపోయేవి ఆ వార్తలు.
వాటిని వినేవాళ్ళలో చాలామందికి అమెరికా అనే మరో దేశం వుందని తెలియదు. కాంగో ఎక్కడ వుందో- లియోపాల్డ్ విల్లీ అనేది వూరు పేరో - పూవు పేరో తెలియదు. తెలిసిందల్లా - తెలియనిది తెలుసుకుంటున్నామన్న తృప్తి . కొత్త సంగతులు తెలుసుకోవాలన్న ఆసక్తి. యిదే పత్రికలకు వున్న శక్తి.
అందుకనే- సమాచార మార్పిడికి వున్న ఈ బలాన్ని ఆవాహన చేసుకున్న పత్రికలు ప్రజలమీద పట్టుపెంచుకుంటూ వస్తున్నాయి.
అంతటి శక్తి స్తోమతలను ఇముడ్చుకున్న పత్రికా రంగం చరిత్ర గురించి- ఈ రోజు జాతీయ పత్రికా దినం పాటిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ముచ్చటించుకుందాం.
అనేక శతాబ్దాల క్రితం ప్రభుత్వ ప్రభుత్వ ప్రకటనలే - అంటే రాజ శాసనాలే- సమాచార పత్రాలుగా వెలువడేవి. ప్రాచీన రోము సామ్రాజ్యంలో - జూలియస్ సీజర్ - లోహ, శిలా ఫలకాలపై శాసనాలను చెక్కించి - బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శించే వారట .చైనాలో- పదహారో శతాబ్దంలోనే - మింగ్ ప్రభువుల కాలంలో వార్తా పత్రికలను ప్రచురించిన దాఖలాలు వున్నాయి. పదహారు వందల యాభయ్ ఆరులో మొదలై ఇప్పటిదాకా వెలువడుతున్న పత్రిక ఒకటి వుంది. ఈ స్వీడన్ పత్రికను - ఆ తరవాత మరో పత్రికతో విలీనం చేసిన పిదప కూడా - పాత పేరుని దానికి జోడించి ప్రచురిస్తూ వుండడం ఒక విశేషం. అంటే మూడు వందల నలభయ్ మూడు సంవత్సరాలుగా ఏకబిగిన నడుస్తున్న అతి ప్రాచీన పత్రిక ఇదే అన్న మాట.
పోతే - పన్దొమ్మిదవ శతాబ్దం ఆరంభంలో పారిశ్రామిక విప్లవం పుణ్యమా అని - వార్తా పత్రికల తీరుతెన్నులే పూర్తిగా మారిపోయాయి. పద్దెనిమిది వందల పదునాలుగులోనే - లండన్ టైమ్స్ పత్రిక- నిమిషానికి పదకొండు వందల కాపీలు ముద్రించగల అచ్చు యంత్రాన్ని సమకూర్చుకుంది. క్రమంగా ఈ రంగంలో పోటీ పెరిగిపోయి- చవక పత్రికలు రంగ ప్రవేశం చేసాయి. పెన్నీ ప్రెస్ అనే వార్తా పత్రిక - తన ధరను సాటి పత్రికల ధరలో ఆరో వంతుకు తగ్గించి అమ్మడం మొదలుపెట్టి- అమ్మకాలను గణనీయంగా పెంచుకుంది.
ఇక ప్రస్తుతానికి వస్తే- ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్న అవకాశాలను- సాధన సంపత్తులనూ అందిపుచ్చుకున్న ఈ నాటి పత్రికలూ సర్వాంగ సుందరంగా ముస్తాబై పాఠకులను ఆకర్షిస్తున్నాయి.
ఈరోజు జాతీయ పత్రికా దినం కాబట్టి- కనీసం ఈ రోజయినా పత్రికా విలువలను గురించి కొంత నిష్కర్షగా చర్చ జరగాల్సిన అవసరం వుంది. కాలానుగుణమైన మార్పుల మూలంగా- మిగిలిన రంగాల్లో కానవస్తున్న వికృత ధోరణుల నీలినీడలు పత్రికా రంగంపై కూడా ప్రసరిస్తున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో ఈ చర్చ అవసరం మరింత పెరిగింది.
ఒక పెద్ద పత్రికలో వార్త పడినప్పుడు జనం దాని గురించి మాట్లాడుకోవడం సహజం. చదువుకున్న వాళ్ళు దాన్ని గురించి మరింత చర్చించుకుంటారు కూడా. నిరక్షరాస్యులయితే విని అవునా అని అనుకుంటారు. అధికారులు స్పందిస్తారు. అనధికారులు వీలుని బట్టి ఖండిస్తారు. లేదా హర్షిస్తారు. సాధారణంగా జరిగే వ్యవహారం ఇది.
నిజాయితీ, నిబద్దతా, విశ్వసనీయతా - వార్తకు ప్రాణం పోస్తాయి. ఇవి లేని వార్తకు ప్రాణం వుండదు. ప్రామాణికం వుండదు. కానీ- ఈనాటి పత్రికల్లో - ఆ మాటకి వస్తే - మీడియాలో - ఈ మూడింటికీ ఎంత విలువ ఇస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే.
విశ్వసనీయత కంటే మనుగడే ప్రధానమనుకున్నప్పుడు - పత్రికల ద్వారా సాధించాలనుకున్నదీ - సంపాదించాలని అనుకున్నదీ 'ఇంకేదో' వుందనుకున్నప్పుడు - పత్రికా స్వేచ్ఛకి అర్ధమే మారిపోతుంది.
జాతీయ పత్రికా దినం సందర్బంగా ఏర్పాటు చేసే సభలు సమావేశాల్లో ఈ అంశానికి తగిన ప్రాధాన్యం లభించగలదని ఆశిద్దాం.
(భండారు శ్రీనివాస రావు - పదమూడు నవంబర్ )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి