25, డిసెంబర్ 2009, శుక్రవారం

తెలంగాణా? - సమైఖ్యాంధ్రా?

తెలంగాణా? - సమైఖ్యాంధ్రా?    

తెలంగాణా విషయంలోనూ, మావోయిష్టుల విషయంలోనూ - దాదాపు అన్ని పార్టీలదీ ఒకేమాట.
ఒక్క సీపీఎం ని మినహాయిస్తే- తెలంగాణా సెంటిమెంట్ ని కాదన్న రాజకీయ పార్టీ రాష్ట్రంలో కలికానికి కూడా కానరాదు.అలాగే- మావోయిష్టుల గురించి ప్రస్తావన వస్తే- అది శాంతి భద్రతల సమస్య ఏమాత్రం కాదని అందరూ ముక్త కంఠంతో పేర్కొంటారు. విడివిడిగా అంతా ఏకీభవిస్తారు కానీ కలివిడిగా ఒప్పుకోరు. ఎక్కడో ఏదో తెగని 'లింక్' వుందనుకోవాలి. ఆ కారణంగానే ఈ రెండు అంశాలు ఏళ్లతరబడి పరిష్కారం కాకుండా 'రావణ కాష్టాల్లా' మిగిలిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణాకి సంబంధించి వివిధ పార్టీల అభిప్రాయాల్లో స్పష్టాస్పష్టతల మాట అటుంచి అసలు నిజాయితీ లోపించిందన్న భావన సామాన్య జనంలో కానవస్తోంది. దీనికి టీ ఆర్ యస్ కూడా అతీతం కాదనేవాళ్ళు వున్నారంటే ఆశ్చర్య పోవాల్సినపనిలేదు. అయితే, తెలంగాణా ఏర్పాటు అంశాన్ని ఈ సారి తాడో పేడో తేల్చేయాలని కేసీయార్ ప్రారంభించిన నిరాహార దీక్ష గంట గంటకో మలుపు తిరుగుతూ ఆ పార్టీకి కొత్త ఊపిరి పోసింది. పార్టీకి ఉద్యమ స్వరూపం పూర్తిగా లేకుండా చేసారన్న అపవాదుని - హఠాత్తుగా రంగప్రవేశం చేసిన విద్యార్ధులు సంపూర్తిగా తుడిచిపెట్టేసారు. ఒక దశలో కేసీయార్ పని ఇక అయిపొయింది అని అనుకోవడం- అప్పటిదాకా ఆకాశానికి ఎత్తిన వాళ్ళు ఆయన్ని అమాంతం అధపాతాళంలోకి నెట్టివేయడం- తెలంగాణా ద్రోహిగా అభివర్ణిస్తూ టీవీ చానళ్ళలో తెలంగాణా అభిమానులే విమర్శల వర్షం కురిపించడం- ఇవన్నీ సినిమా రీలులా చక చకా సాగిపోయాయి. టీ ఆర్ యస్ నేత అదృష్టం ఇక్కడే తిరగబడిందని తదనంతర పరిణామాలు రుజువుచేసాయి. పళ్ళరసం తాగి దీక్ష విరమించినట్టు టీవీ తెరలపై కానవచ్చిన దృశ్యాలతో రెచ్చిపోయిన తెలంగాణా విద్యార్ధులు, యువకులు, ఉద్యోగులు కేసీయార్ని దుయ్యపడుతూ ఉద్యమ భారాన్ని తమ భుజాలకు ఎత్తుకుని వీధులకెక్కడం - పోలీసులు లాఠీలకు పని చెప్పడం- టీ ఆర్ యస్ ఆవిర్భవించిన తరువాత ఈ దశాబ్ద కాలంలో తొలిసారిగా కొందరు ప్రాణత్యాగానికి తెగబడం - ఇవన్నీ చంద్రశేఖరరావు దీక్ష కొనసాగేలా దోహదం చేసాయి. చప్పున చల్లారి పోతుందని అనుకున్న ఉద్యమం కాస్తా గప్పున ఎగసిపడింది.  కేసీయార్ అంబులపొదిలోని ఆఖరి అస్త్రం - ఆమరణ దీక్ష- నిరర్ధకం అయిపోతున్నదని అందరు అనుకుంటున్న తరుణంలో- తదనంతర పరిణామాలు ఆయన్ని మళ్ళీ 'వార్తలలోని వ్యక్తి' గా నిలబెట్టాయి. చీలిపోయాయని అనుకుంటున్న ఉద్యమ అనుకూల శక్తులను అన్నింటినీ తిరిగి ఒక తాటిపయికి చేర్చాయి. తమ ఉద్యమానికి సరిగా సహకరించడం లేదంటూ నిరాహార దీక్ష పర్వానికి పూర్వం ఏ టీవీ చానళ్ళపై కేసీయార్ నిప్పులు చెరిగారో - ఆ చానళ్ళే మళ్ళీ ఉద్యమం వేడి చల్లారిపోకుండా చూసాయి. ఈ 'సెగ' ఢిల్లీ దాకా పాకడంతో కేంద్ర హోం  మంత్రి  చిదంబరం డిసెంబర్ తొమ్మిదో తేదీన తెలంగాణాపై 'చారిత్రాత్మక' ప్రకటన చేయాల్స్సి వచ్చింది. సోనియా గాంధీ కాకుండా మరెవరయినా కాంగ్రెస్ అధినాయక పీఠంపై వున్నా ఇలాంటి నిర్ణయం అసాధ్యం అన్న రీతిలో వెలువడిన ఈ ప్రకటన తెలంగాణలో ఆనందోత్శాహాలను వెల్లివిరియ చేస్తే- అనూహ్యంగా ఆంద్ర , రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఆగ్రహ జ్వాలలను రగిలించింది. విడిపోవడానికే ఉద్యమాలు పుడతాయనే అభిప్రాయానికి భిన్నంగా 'కలసివుండాలనే' కొత్త ఆందోళనకు అంకురార్పణ జరిగింది. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా మొదలయిన ఈ ఉద్యమం మూకుమ్మడి రాజీనామాలకు దారితీయడంతో - కేంద్రానికి వేరు దారి లేక ఒక మెట్టు దిగాల్సి వచ్చింది. చిదంబరం ఈ దిశగా  చేసిన మరో ప్రకటన - తెలంగాణలో చల్లారిందనుకున్న చిచ్చును తిరిగి రగిలించింది. బందులూ, రాస్తా రోఖోలూ నిత్యకృత్యంగా మారి సామాన్య జనాలకు నరకాన్ని చూపిస్తున్నాయి. ఒక సమస్యకు పరిష్కారం మరో సమస్యకు ఆజ్యం పోయడంతో కాంగ్రెస్ అధిష్టానం తలలు పట్టుకుంటోంది.
ఈ దశలో రెండే రెండు ప్రత్యామ్నాయ మార్గాలు కనబడుతున్నాయి.
శాసన సభను సుప్త చేతనావస్తలో వుంచి కొంత కాలం పాటు 'రాష్ట్రపతి పాలన' విధించడం. పరిస్తితులు చక్కబడిన  తర్వాత తదుపరి చర్యలు అప్పటి పరిస్తితులను బట్టి తీసుకోవడం.
లేదా, రెండో ఎస్సార్సీ ( రాష్ట్ర విభజన కమీషన్ ) ఏర్పాటు గురించి ఒక ప్రకటన చేసి తాత్కాలికంగా ఉద్రేకాలను చల్లార్చడం.
ఇప్పుడున్న వాతావరణం గమనిస్తే - ఈ రెండూ ప్రత్యామ్నాయాలే కానీ పరిష్కారాలుగా భావించడానికి వీలు లేదనే చెప్పాలి.
                                                            -భండారు శ్రీనివాసరావు (డిసెంబర్- యిరవై అయిదు )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి