8, జులై 2022, శుక్రవారం

కష్టాల్లో పెన్షనర్లు |

ప్రజలకయినా ప్రభుత్వాలకయినా భారం ఒకటే!

నాకు తెలిసింది సున్నా - భండారు శ్రీనివాసరావు


చాలామంది అడుగుతుంటారు అభిమానం కొద్దీ, 'మీకు ఇన్నిన్ని విషయాలు ఎలా తెలుసు' అని. కానీ వాళ్లకి తెలియని విషయం ఏమిటంటే 'నాకు తెలిసింది సున్నా' అని.
ఒకసారి ఎప్పుడో ఇంటింటి సర్వే వాళ్ళు వచ్చినప్పుడు నా ఈ బలహీనత బయటపడింది. 'మీ మండలం ఏమిటి, మీ పోలీసు స్టేషన్ ఏమిటీ' అంటూ అడిగితె నోరెళ్ళబెట్టడం తప్ప నేనేమీ చెప్పలేకపోయాను. నేనున్న ప్రాంతాన్ని బట్టి వాళ్ళే రాసుకుపోయారు కాబట్టి నా అజ్ఞానం పూర్తిగా బయటపడలేదు.
ఒక విషయం మాత్రం నేను రూడిగా చెప్పగలను. అన్నీ తెలుసనుకుంటాం కానీ, చాలామందికి కొన్నే తెలుసు. ఆ తెలిసినవాటిలో కూడా చాలావరకు మిడిమిడి జ్ఞానం బాపతు. అయితే తెలియచెప్పడంలో కాస్త చాకచక్యం చూపిస్తే మనలో నిండుకుని వున్న అజ్ఞానం చాలావరకు అంధకారంలోనే కప్పబడిపోతుంది. సరే! ముందు ఈ అంధకారంలో నుంచి బయటపడి అసలు విషయం మాట్లాడుకుందాం.
నేను రేడియోలో పనిచేసేటప్పుడు అనేకమంది రాజకీయ నాయకులు ప్రకటనలు (డబ్బు చెల్లించే వాణిజ్య ప్రకటనలు కాదు, ఏదైనా అంశం మీద తీవ్రాతితీవ్ర ఖండనముండనలు, హర్షాతిరేకాలు, ప్రగాఢ సంతాపాలు వగయిరా వగయిరా ప్రకటనలు అన్నమాట) పట్టుకుని వస్తుండేవారు. వారిలో ఎక్కువమంది వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మళ్ళీ వారిలో మాజీలు వుండేవారు. వారిలో మళ్ళీ చాలామంది, వారి వారి నొసటిరాత ప్రకారం మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా మారి, వారివారి అధికారిక ఛాంబర్లలోనే విలేకరుల సమావేశాలు పెట్టే స్థాయికి ఎదిగిపోయినవారు కూడా వున్నారు. అదివేరే కధ.
అజ్ఞానం గురించి కదా మాట్లాడుకుంటున్నాం. ఇలా ప్రకటనలు పట్టుకొచ్చేవాళ్ళు, వాళ్ళ లెటర్ హెడ్లమీద చక్కగా ఇంగ్లీష్ లో టైపు చేయించుకుని తెచ్చేవాళ్ళు. ఒకనాడు ఒక పెద్దమనిషి, నిజంగా పెద్దమనిషే సుమా, మా వద్దకు వచ్చి ఒక ప్రకటన పాఠం చేతికి ఇచ్చారు. లెటర్ హెడ్డు మీద పలానా నియోజకవర్గం ఎంపీ అని వుంది. కానీ, నాకు తెలిసి ఆ నియోజకవర్గానికి ఆయన ఎంపీ కాదు. నా మట్టి బుర్రకు యెంత పనిచెప్పినా, ‘ఆ ఎంపీ ఈ ఎంపీ ఒకరు కాదు' అని ఓ పక్క చెబుతూనే వుంది. లెటర్ హెడ్డు మాత్రం అధికారికంగా అన్ని హంగులు, మూడు సింహాల గుర్తుతో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. కాసేపు ఆ ప్రకటన చదువుతున్నట్టుగా పరకాయించి చూసే సరికి విషయం అర్ధం అవడమే కాకుండా ఆ పెద్దమనిషి మీద జాలి కూడా వేసింది. ఎందుకంటే ఆయన నిజంగా ఆ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు సభ్యుడే. కానీ ప్రస్తుతం కాదు. గతంలో ఎప్పుడో అయిదేళ్ళు ఎంపీగా పనిచేసిన పెద్దాయనే. అయితే ఇప్పుడు మాజీ. 'అశ్వద్ధామ హతః' అన్నట్టు పేరు హోదా పెద్దగా వేసుకుని కింద చిన్న అక్షరాలతో ‘పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు’ అని బ్రాకెట్లో చిన్న అక్షరాలలో ముద్రించారు. అది చూసి 'ఇంకా అడిగిన వాడ్ని కాదు' అని నాకు నేనే సమాధాన పడ్డాను.
అలా నా అజ్ఞానం బయటపడే సమయంలో అది బయటపడకుండా నేను జాగ్రత్తగా బయటపడడం వల్ల, ఇదిగో ఇప్పుడిలా, కొంతమందయినా 'నాకు అన్నీ తెలుసు' అని అనుకునేట్టు చేయగలుగుతున్నాను. కానీ, ముందే చెప్పినట్టు, 'నాకు బాగా తెలుసు, అదేమిటంటే నాకు తెలిసింది గుండు సున్నా' అని.
తోకటపా: రేడియో 'ప్రకటనకర్త'ల్లో ఒకాయన గురించి చెప్పుకోవాలి. వారంలో రెండు రోజులు ఏదో ఒక 'ఖండన ముండన' ప్రకటన పట్టుకుని వచ్చేవాడు. రాగానే, 'ఇవ్వాళ ఎవరయినా పోయారా, పొతే సంతాపం ప్రకటించేవాళ్ళల్లో నా పేరు కూడా పెట్టండి' అనే వాడు. పోయినవాళ్ళు ఎవరో కూడా తెలియకుండానే సంతాపం చెప్పిన పుణ్యం ఎక్కడికి పోతుంది ? కొన్నాల్టికి, రాష్ట్రంలో ఒక పెద్ద దేవస్థానం కమిటీ సభ్యుడు అయ్యాడు.

అన్ని అర్హతలు ఉన్నవాడికే పదవి

మీడియా చేసిన గుండమ్మ మొగుడు

6, జులై 2022, బుధవారం

రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలు

వై.ఎస్. ను కడుపుబ్బ నవ్వించిన కాల్ సెంటర్ ఉద్యోగిని

(జులై 8 వై ఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. ఈరోజు సాక్షి దినపత్రికలో ప్రచురితం)


ఎప్పుడో పుష్కరకాలానికి ముందు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పాల్గొన్న ఒక కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సత్యం ఫౌండేషన్, నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో హెచ్.ఎం.ఆర్. ఐ. రూపకల్పన చేసిన 104 కాల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి వచ్చారు.

ముందుగా అసలు ఏమిటి ఈ కాల్ సెంటర్ అనే విషయం గురించి కొంత చెప్పడం సముచితంగా వుంటుంది. సామాన్యులకు, అసామాన్యులకు సమస్యలు అనేకం,  సమాధానం ఒక్కటే!  ఆ జవాబే 104 అనే  ఈ పధకాన్ని గుర్తించి, ప్రోత్సహించి అమలు చేయడంలో తోడ్పడింది రాజశేఖర రెడ్డి గారే కనుక. 


‘కాంతమ్మకు కాళ్ళూ చేతులూ ఆడడం లేదు. మూడేళ్ళ పిల్ల వున్నట్టుండి కాళ్ళూ చేతులూ కొట్టుకోవడం మొదలెట్టింది. యెంత పట్టుకున్నా వంకర్లు తిరిగిపోతోంది. సమయానికి మొగుడు కూడా ఊళ్ళో లేడు. టైము చూస్తే అర్ధరాత్రి. పొరుగూరుకు వెడితే కాని డాక్టరు దొరకడు. దిక్కు తోచని కాంతమ్మకు ఏం చేయాలో తోచడం లేదు.


‘మూర్తికీ శైలజకూ కొత్తగా పెళ్లయింది. హానీమూన్ కి వెళ్లి వస్తుంటే దారిలో కారు చెడిపోయింది. దానికి తోడు విడవకుండా కురుస్తున్న వర్షం ఒకటి.  ఏం చెయ్యాలో తెలియని స్తితిలో దగ్గరలో వున్న టీ స్టాలుకు వెళ్ళారు. కారు రిపేరు పూర్తయ్యేసరికి, వేళకాని వేళలో తాగిన ఆ  టీ వికటించిందేమో తెలియదు,  మూర్తికి వాంతులు మొదలయ్యాయి. కొత్త పెళ్లి కూతురికి భయంతో చెమటలు పట్టాయి. ఏడవడం తప్ప ఏం చెయ్యాలో తెలియని పరిస్తితి.


‘రామనాధానికి సర్కారు మీద చెప్పరాని కోపం వచ్చింది. వూళ్ళో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వుందన్నమాటే కాని, డాక్టరు కంటికి కనిపించడు. మిగిలిన సిబ్బంది కూడా యధా రాజా తధా ప్రజా బాపతు. మందులు మచ్చుకు కూడా దొరకవు. కూతురు, అల్లుడు పండక్కి వచ్చారు. ఒక్కగానొక్క మనుమడికి వళ్ళు పేలిపోయే జ్వరం. చూపిద్దామంటే డాక్టరు లేడు. దూరాన వున్న బస్తీకి టాక్సీ కారులో తీసుకువెళ్ళి వైద్యం చేయించాల్సి వచ్చింది. నానా హైరానా పడిన రామనాధానికి కోపం రాకుండా ఉంటుందా. వచ్చింది. కానీ ఎవరి మీద చూపించాలి ఆ కోపం? ఎవరికి పిర్యాదు చేయాలి పాపం.


‘వెంకటరావు వుంటున్న ఊరు ఓ మోస్తరుగా పెద్దదే. అక్కడ పెద్ద ఆసుపత్రులతో పాటు పెద్ద డాక్టర్లు వున్నారు. భార్యకి గుండె నొప్పి లక్షణాలు కనిపిస్తే పెద్ద డాక్టరు దగ్గరికి తీసుకు వెళ్లి, పెద్ద ఫీజు చెల్లించి, పెద్దవైద్యమే చేయించాడు. కాస్త నెమ్మదించిన తరువాత ఆ పెద్ద డాక్టరు రాసిచ్చిన పెద్ద మందుల జాబితాలో కొన్ని మందులు ఆ వూళ్ళో యెంత ప్రయత్నించినా దొరకలేదు. దొరికే షాపు ఎక్కడ వుందో తెలవక తల పట్టుకున్నాడు వెంకటరావు.

ఇలాంటి కాంతమ్మలూ, మూర్తులూ, శైలజలూ, రామనాధాలు, వెంకటరావులు ఇంకా ఎంతమందో. అందరిదీ ఒక సమస్య కాదు. కానీ ఏం చెయ్యాలి అన్నదే అందరి సమస్య.

అప్పటి ప్రభుత్వం నిపుణులను సంప్రదించి, ఎంతో ఆలోచించి ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కుంది. అదే 104.

ఇదొక టోల్ ఫ్రీ నెంబరు. రాష్ట్రంలో ఎక్కడి నుంచయినా ఈ నెంబరుకు ఉచితంగా ఫోను చేయవచ్చు. ఈ కేంద్రంలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలకు సంబంధించిన సమస్త సమాచారం కంప్యూటర్లలో నిక్షిప్తం చేసి వుంచారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, డ్యూటీలో వున్న వైద్యులు, ఇతర సిబ్బంది వివరాలు, దగ్గరలో వున్న ఎక్సరే, రక్త పరీక్షా కేంద్రాలు, బ్లడ్ బ్యాంకులు, మందుల షాపులు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు నర్సింగు హోములు, ఇలా అన్ని వివరాలు సిద్ధంగా వుండడం వల్ల ఫోను చేసిన వారు ఏ సమాచారం అడిగినా క్షణాల్లో వారికి అందించడానికి వీలుపడుతుంది. రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో డాక్టర్లు సెలవులో ఉన్నదీ, ఎక్సరే, స్కానింగు వంటి పరికరాలు మరమ్మత్తుల్లో ఉన్నదీ, ఎక్కడ ఏ ప్రాంతంలో విద్యుత్ సరఫరా కోతలు వున్నదీ ఇటువంటి వివరాలు అన్నింటినీ ప్రభుత్వ విభాగాలతో ఏర్పరచుకున్న సమన్వయం ద్వారా సేకరించి ఉంచుకుంటారు. మొదటిసారి ఫోను చేసినప్పుడు వైద్య సలహా అవసరం వున్న వ్యక్తుల వివరాలను, పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, చిరునామా అన్నింటినీ రికార్డు చేసుకుని ఒక నెంబరు ఇస్తారు. తరువాత ఎప్పుడు అవసరం వచ్చి మళ్ళీ ఫోనుచేసినా ఈ వివరాలన్నీ కేంద్రంలో కంప్యూటర్ తెరపై సిద్ధంగా వుంటాయి కనుక, డాక్టరు కాలయాపన లేకుండా రోగికి తగిన వైద్య సలహా సూచించడానికి వీలుంటుంది. ఈ కేంద్రంలో వైద్యులు రాత్రింబవళ్ళు వైద్య సలహాలు ఇవ్వడానికి సంసిద్ధంగా వుంటారు. పెద్దగా చికిత్స అవసరం పడని సందర్భాలలో డాక్టర్లు అప్పటికప్పుడు చేయాల్సిన ప్రధమ చికిత్సలు సూచించి ఉపశమనం లభించేలా చూస్తారు. మందులు ఎక్కడ లభిస్తాయో ఆ షాపుల వివరాలు సిబ్బంది తెలియపరుస్తారు. ఒకవేళ చికిత్స అవసరమని భావిస్తే 108 కి తెలియపరచి అంబులెన్సు పంపిస్తారు. 

స్థూలంగా ఇవీ 104 సేవాకేంద్రం నిర్వహించే ఉచిత సర్వీసులు.

ఇక అసలు విషయం చెప్పుకుందాం.

ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు సమయానికే సమావేశానికి వచ్చారు. ఈ పధకం ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ప్రారంభ సూచకంగా సభావేదిక మీద నుంచే 104 నెంబరుకు ఫోన్ చేశారు.

అవతల నుంచి కాల్ సెంటర్ ఉద్యోగిని క్షణాల్లో స్పందించింది.

“104కు స్వాగతం. దయచేసి మీ పేరు చెబుతారా?”

ముందు కంగు తిన్నా ముఖ్యమంత్రి తన పేరు చెప్పారు. హాజరైన సభికులు అందరూ అక్కడ ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద టీవీ తెరలపై ఇదంతా వీక్షిస్తున్నారు.

ముఖ్యమంత్రి తన పేరు చెప్పగానే, కాల్ సెంటర్ ఉద్యోగిని తన ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా రెండో ప్రశ్నను సంధించింది.

“ఎక్కడ వుంటారు, ఏం చేస్తుంటారు, మీ చిరునామా చెబుతారా?”

వై.ఎస్. ఇక నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వేశారు. ఆయన నవ్వడంతో సభాప్రాంగణం కూడా నవ్వులతో నిండిపోయింది.