14, ఏప్రిల్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (141) – భండారు శ్రీనివాసరావు

 


రాజకీయ ప్రముఖుల వేషధారణ

మళ్ళీ ఇదేమి యూ టర్న్ అనిపిస్తోందా!

రాజకీయాలు ఇక రాయను, కాడి కిందపారేసాను అని రాయగానే చాలామంది మితృలు, శ్రేయోభిలాషులు ఫోన్లు చేశారు. పలానా పత్రిక వక్రించి రాసింది అంటారు కానీ, రేడియోలో నా మాటలు వక్రించి ప్రసారం చేశారు అనే మాట ఎప్పుడైనా విన్నామా! అలాగే, రాజకీయ పార్టీల సోషల్ మీడియా వాళ్ళు కూడా తప్పుపట్ట లేని ఎన్నో విశేషాలు రేడియో విలేకరిగా మీకు తెలిసి వుంటాయి కదా! వాటిని చదువరులతో పంచుకుంటే తప్పేమిటి అన్నారు. వెలుగు చూడని వార్తలు బయట పెట్టడానికి అభ్యంతరాలు వుంటే, ఇంకా తెలిసిన సంగతులు ఏమైనా వుంటే రాస్తూ వుండండి అని సలహా.

బిగ్ జీరో మరో భాగం రాయడానికి  మూడు రోజులకు పైగా  వ్యవధానం తీసుకోవడానికి ఈ తర్జన భర్జనలే కారణం. 

నిజమే! నా వృత్తి జీవితంలో ముప్పావు భాగం రాజకీయ నాయకులతోనే గడిచి పోయింది. ఎన్నెన్నో మంచి అనుభవాలు వారితో వున్నాయి. వాటిల్లో కొన్నింటిని ప్రస్తావించడం ద్వారా నా జీవిత కధకు కొంత నిండుతనం వస్తుందని అనిపించింది. అయితే ఆయా పార్టీల సోషల్ మీడియా శక్తుల కళ్ళు నా మీద పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ, నా వ్యక్తిగత జీవితంతో పాటు, నాకు తెలిసిన  వృత్తి జీవిత విశేషాలను అప్పుడప్పుడూ ప్రస్తావిస్తూ వుండాలని నిర్ణయించుకున్నాను.

మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ఇవి రాజకీయ నాయకుల గురించే కానీ, పొలిటికల్ పోస్టులు  మాత్రం కాదు.

నందమూరి తారక రామారావు అనగానే ఓ రూపం కళ్ల ముందు కదలాడుతుంది. రాజకీయ నాయకుడిగా ఆయన వేషధారణ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. కాషాయ వస్త్రాలుపెద్ద పెద్ద కళ్లద్దాలూఎడమచేయి గాల్లోకి లేపిచిద్విలాసం చిందిస్తూ.. ‘సోదర సోదరీమణులారా’ అంటూ వేదికలపై తన వాక్‌చాతుర్యంతో హోరెత్తించిన తెలుగుదేశం పార్టీ అధినాయకుడి రూపాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేం. ఇక సినిమాల్లో అయితే రాముడు, కృష్ణుడు అనగానే గుర్తుకొచ్చేది, ఎన్టీఆర్ మాత్రమే.

సినీ నటుడు కావడం వల్ల కావచ్చు రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత కూడా ఆయన అనేకసార్లు తన వేష ధారణ మార్చారు. మొదట్లో తెలుగుదేశం పార్టీ పెట్టి చైతన్య రధంపై రాష్ట్రం నలుమూలలా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నప్పుడు ఖాకీ ప్యాంటు, ఖాకీ చొక్కాతో కనిపించారు. ఆ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే తెల్లటి ధోవతి, లాల్చీని తన ఆహార్యంగా చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళు వివేకానందుడి గెటప్ తో, కొన్నాళ్ళు కాషాయ వస్త్రాలతో విభిన్నంగా కనిపించారు. ద్వితీయ వివాహం చేసుకున్న తర్వాత కాషాయాన్ని వదిలేసి మళ్ళీ మల్లెపూవులాంటి ధవళ వస్త్రధారణ స్వీకరించారు. చనిపోయేవరకు అదే ఆహార్యం. మార్పులేదు.

చాలా మంది రాజకీయ నాయకులు జీవితాంతం ప్రజలకు ఒకే వస్త్ర ధారణతో గుర్తుండి పోయారు. ఉదాహరణకు మహాత్మాగాంధీ, (కొల్లాయి గుడ్డ, చేతిలో కర్ర) జవహర్ లాల్ నెహ్రూ, (ఎర్ర గులాబీ, తల మీద టోపీ లేకపోతే నెహ్రూను నెహ్రూగా గుర్తుపట్టడం కష్టం), సుభాష్ చంద్రబోస్ (మిలిటరీ దుస్తులు లేని సుభాష్ చంద్ర బోసును ఊహించడం అసాధ్యం). అలాగే, రాజగోపాలాచారి, కరుణానిధి ఈ ఇద్దరూ హమేషా పగలూ రాత్రీ తేడా లేకుండా నల్లకళ్ళ జోళ్ళతో కనిపించేవారు. నల్లద్దాల కంటి జోడు ధరించే అలవాటు ఎం.జీ. రామచంద్రన్ కు కూడా వుండేది. కాకపోతే, నెత్తిమీద ఫర్ టోపీ అదనం. జయలలిత కూడా భద్రతా పరమైన కారణాలో, ఆరోగ్యపరమైన కారణాలో తెలియదుకానీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒకే రకం ఆహార్యంతో కానవచ్చేవారు.  

రాష్ట్రపతి అయిన తర్వాత నీలం సంజీవరెడ్డి ఆహార్యం మారిపోయింది.  అప్పటివరకు ఏళ్ళతరబడి ఒకే రకం వస్త్రధారణ. పంచె, లాల్చీ, తలమీద గాంధి టోపీ. ఇక కాసు బ్రహ్మానందరెడ్డి. ఆయనా డిటో. తలమీద టోపీని చేత్తో కొంచెం సదురుకున్నట్టు కనిపించింది అంటే అయన ఏదో కొత్త రాజకీయ వ్యూహం పన్నుతున్నారని చెప్పుకునేవారు.

ఇక పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఒకటే ఆహార్యం, తెల్లటి  పంచె లాల్చీ. విదేశీ పర్యటనలు, కొన్ని అధికారిక కార్యక్రమాలలో మాత్రం సూటు ధరించేవారు, రాష్ట్రపతి సంజీవరెడ్డి మాదిరిగా.

నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యేంతవరకు, ఆఖరికి గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో కూడా వస్త్రధారణ పట్ల అంత శ్రద్ధ చూపిన దాఖలాలు లేవు. ప్రధాని అయిన తర్వాత మాత్రం  వివిధ రకాల దుస్తులు ధరించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు వేషధారణ అనేక దశాబ్దాలుగా ఒకే రకంగా ఉంటూ వస్తోంది. తెల్లటి చొక్కా, తెల్లటి లుంగీ. ఏ పదవిలో వున్నా, ఏ హోదాలో వున్నా  ఇదే ఆహార్యం. విద్యార్థి నాయకుడిగా ఆయన్ని ప్యాంటు, చొక్కాతో చూసిన జ్ఞాపకాలు వున్నాయి.

ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు దుస్తులు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేవి. వారగా భుజం మీద కప్పుకున్న శాలువా ఆయన ప్రత్యేకత. అదిలేని టంగుటూరిని గుర్తుపట్టడం కష్టం.

ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి ఆహార్యం విభిన్నమైన రీతిలో వుండేది. చేతిలో పొన్ను కర్ర ఓ స్పెషాలిటీ.

పొతే, చంద్రబాబునాయుడు మొదటి సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఆహార్యం ఎప్పుడూ ఒకే రీతిలో ఉండేట్టు చూసుకున్నారు. ఒక రకమైన ఖాదీ వస్త్రంతో తయారుచేసిన ప్యాంటు చొక్కాను ధరించడం మొదలుపెట్టారు. కాళ్ళకు బూట్లు ధరించడం కూడా చాలాకాలం తర్వాతనే అలవాటు చేసుకున్నారు. అదీ, ముఖ్యమంత్రిగా మొదటి విదేశీ ప్రయాణం పెట్టుకున్నప్పుడు అనుకుంటాను. అమితాబ్ బచ్చన్ కు, చంద్రబాబుకు మాత్రమే  ప్రత్యేకమైన తెల్ల గడ్డం లేని రోజుల నుంచి ఆయన నాకు తెలుసు. అయితే  1978లో మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు నల్లటి మీసాలు ఉండేవి.

వై.ఎస్ రాజశేఖర రెడ్డి సయితం ఒకే రకం వస్త్రధారణ పట్ల మక్కువ చూపేవారు. పదహారణాల తెలుగుతనం ఉట్టిపడేలా తెల్లటి పంచె, లాల్చీ ధరించి తనకంటూ ఒక శైలిని రూపొందించుకున్నారు. రాజకీయాల్లో ప్రవేశించిన తొలి రోజుల్లో మూతికి  రెండు వైపులా కిందికి వాలిన మీసాలు వుండేవి. చాలాకాలం ప్యాంటు చొక్కాతోనే కనిపించేవారు. 

తెలంగాణా  మొదటి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు విషయానికి వస్తే  అనేక దశాబ్దాలుగా ఆయన వస్త్రధారణలో ఎలాంటి మార్పు లేదు. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు. ఢిల్లీ వంటి చలి ప్రదేశాలకు పోయినప్పుడు ఏమో కానీ, కాళ్లకు చెప్పులు. కొన్నాళ్ళు మెడ చుట్టూ మడిచిన ఉత్తరీయంతో కనిపించడం మొదలుపెట్టారు టీవీల్లో. ఆయన ఆహార్యంలో కానవచ్చిన మార్పు ఏదైనా ఉన్నదంటే ఇదొక్కటే.   

యువతరం రాజకీయ నాయకుల్లో ఏపీ మాజీ  ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించిన తొలిరోజుల్లో రంగు రంగుల  చొక్కాలు వేసుకున్నా, ఆ తర్వాత మోచేతుల వరకు ముడిచిన తెల్లచొక్కా, తెల్ల ప్యాంటుకు మాత్రమే పరిమితం అయ్యారు.

జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాల్లో  అనేక రకాల దుస్తులు ధరించినప్పటికీ, సొంతంగా పార్టీ పెట్టుకున్నప్పటి నుంచి, లాల్చీ పైజమా, గుబురుగా పెంచిన గడ్డం మీసాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు.

కింది ఫోటో:

నల్లటి మీసకట్టుతో  వై.ఎస్. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు



(ఇంకా వుంది)




11, ఏప్రిల్ 2025, శుక్రవారం

ఎర్రటి ఎండలో పుట్టింటికి ప్రయాణం – భండారు శ్రీనివాసరావు

  

75  ఏళ్ళక్రితం నాటిన మొక్క ఈనాడు ఒక మహావృక్షంగా తయారయింది. ఆ శీతలతరుచ్ఛాయలో మూడు దశాబ్దాలకు పైగా సేదతీరినవాడిని. మహామహులు తచ్చాడిన ఆ ప్రదేశంలో నేను సైతం అంటూ, 1975 లో ప్రవేశించి ఆడుతూ పాడుతూ హాయిగా ఉద్యోగం చేసిన వాడిని.  

నేను పనిచేసిన ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం 75 వ వార్షికోత్సవం జరుపుకోబోతోంది ఈ నెల ఏప్రిల్ పదిహేనున.

వార్తావిభాగంలో చాలా సంవత్సరాలు పనిచేశాను. చేరిన చోటనే రిటైర్ కావాలన్న నా అభిలాష నెరవేరకుండానే చివరాఖరి సంవత్సరంలో నన్ను హైదరాబాదు  దూరదర్సన్ వార్తవిభాగానికి బదిలీ చేశారు. అదొక్కటే అసంతృప్తి.  అన్ని సంవత్సరాల అనుబంధం ఉన్న హైదరాబాదు ఆకాశవాణి కేంద్రానికి డెబ్బయ్ అయిదేళ్ళ పండుగ అంటే అందులో పనిచేసిన వారికి పుట్టింటి పండుగే. మరీ ముఖ్యంగా నాకు.

రేడియో పట్ల నా అనురాగం తెలిసిన వాళ్ళు కనుక,  నాలుగు ముక్కలు మాట్లాడాలని వారినుంచి  పిలుపు. వాళ్ళు పంపిన కారులోనే ఎగురుకుంటూ వెళ్లాను. రికార్డింగు జరిగింది కాసేపే. ఎక్కువ సమయం, నేను పనిచేసిన రోజుల్లో వున్న తోటి సహోద్యోగులతో, నేను రిటైర్ అయిన తర్వాత చేరిన వారితో మాటా  ముచ్చట్లతో గడిచింది. నిజానికి ముప్పయి ఏళ్ళ పైచిలుకు కాలంలో నేను చేసింది కూడా ఇదే. అసలు ఆఫీసుకు రావడమే గగనం. వచ్చాడో ఆయన చుట్టూ అందరూ, అందరి మధ్యా ఆయన అనే పేరొకటి.

ఇరవై ఏళ్ళ క్రితం నాకు తెలిసిన ఉద్యోగులు  కూడా, మీసం లేని నన్ను  గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించారు. ముఖ్యంగా అప్పుడు న్యూస్ యూనిట్ లో మాతో పనిచేసి ఇప్పుడు స్టేషన్ డైరెక్టర్ వద్ద పీ ఎస్ గా  పనిచేస్తున్న మా న్యూస్  యూనిట్ చిట్టి చెల్లెలు శైలజ ఆనందానికి అంతులేదు. మా ఆవిడని అమ్మా అని పిలిచేది. శైలజ లాంటి ఆడపిల్ల వుంటే ఇంట్లో దీపం అక్కరలేదు అనేది మా ఆవిడ.

ఇక రేడియో గురించి నేను కొత్తగా చెప్పేది ఏముంటుంది? వార్తకు ప్రాణం విశ్వసనీయత. అదే ఇన్నేళ్ళుగా రేడియో వార్తల్ని బతికిస్తోంది. అప్పటికి ఎవరం ఉంటామో ఉండమో తెలియదు కానీ ఇదే రేడియో కేంద్రం నూరేళ్ళ పండుగ జరుపుకోవడం తథ్యం.

నిజానికి నేను చేసింది చాలా చిన్న ఉద్యోగం. 

అయినప్పటికీ, ఆలిండియా రేడియో హైదరాబాదు కంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్,  హెడ్ ఆఫ్ ఆఫీస్  బి. హరి సింగ్, కేంద్రం ప్రోగ్రాం హెడ్, ఎస్. రమేశ్ సుంకసారి, డిప్యూటీ డైరెక్టర్ న్యూస్ ఎం.ఎస్. మహేష్, అసిస్టెంట్ డైరెక్టర్ న్యూస్ సురేశ్ ధర్మపురి, న్యూస్ కరస్పాండెంట్  లక్ష్మి తమ హోదాలను పక్కనబెట్టి  బయట వరకు వచ్చి ఆదరంగా వీడ్కోలు చెప్పారు. వారి  గొప్ప మనసుకు మనసారా ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుని కారెక్కాను. 

పుట్టింటిని మరిచిపోవచ్చేమో కానీ,  పుట్టిల్లు ఎన్నటికీ మరవదు. 

తోకటపా: డ్రైవర్ చిన్నా దోవలో నాతో అనేక ముచ్చట్లు చెప్పాడు. నేను రేడియోలో చేరినప్పటికి అతడు పుట్టనే లేదట. పెరిగి పెద్దయినప్పుడు రేడియోలో  నా గొంతు వినేవాడట. అలా నన్ను గుర్తు పట్టాను అన్నాడు. మాటల మధ్యలో అడిగి నా వయసు తెలుసుకున్నాడు. 

'చూసారా! మన రేడియో స్టేషన్ కన్నా వయసులో మీరే నాలుగేళ్ళు పెద్ద' అనడం నవ్వు తెప్పించింది.

థాంక్స్ చిన్నా!

కింది ఫోటోలు ఆలిండియా రేడియోలో తీసినవి.












(11-04-2025)

10, ఏప్రిల్ 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (140) - భండారు శ్రీనివాసరావు

 వెలుగు చూడని వార్తలు

మనం రోజూ పత్రికల్లో, మీడియాలో చూస్తున్న వార్తల కంటే మీదు మిక్కిలి వార్తలు వెలుగు చూడకుండానే  అంతర్ధానం అవుతుంటాయి అనే సంగతి ఈ రంగంలో వున్నవారికే బాగా తెలుస్తుంది. కాకపోతే,  అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు అభిజ్ఞవర్గాల కధనం అనే పేరుతోనో, అసలు పేర్లే పెట్టకుండా ఇచ్చే లీకుల రూపంలోనో కానవస్తుంటాయి. సోషల్ మీడియా రంగప్రవేశం తర్వాత వీటికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అసలు వార్తల కన్నా, ఈ కొసరు వార్తలకే రంగూ రుచీ వాసనా  ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఇవే ప్రధాన వార్తలుగా చలామణీ అవుతున్నాయి. ఏడాదికోసారి ఏప్రిల్ ఒకటో తేదీన గతంలో చాలా పత్రికలు, లేనిపోని  ఊహాగానాల కధనాలు ప్రధాన శీర్షికలుగా ప్రచురించి, చివర ఎక్కడో ఈరోజు ఏప్రిల్ ఒకటి అని రాసి పాఠకులను ఫూల్స్ చేశామని సంతృప్తి పడడం జరిగేది.

రాజకీయ నాయకులకు దగ్గరగా మెసిలే కొందరు సీనియర్ జర్నలిస్టులమీద  రాజకీయ నాయకులు  కూడా విశ్వాసం వుంచి  బయటకు తెలియని సమాచారాలు, విశేషాలు చెబుతుండడం ఎప్పటినుంచో వున్న ఆచారమే. ఇలా ఉప్పు అందించే వారిలో ముఖ్యమంత్రి స్థాయి నాయకులు కూడా వుండడం రహస్యమేమీ కాదు.  తమకు రాజకీయంగా పనికి వచ్చే కొన్ని వార్తలను (నిజాలు కాదు) తమ పీ ఆర్ వొ ల ద్వారా విలేకరులకు అందిస్తుంటారు. అలాగే సాయంకాలాలు జరిగే వ్యక్తిగత భేటీల్లో కొన్ని సంగతులు బయట పడుతుంటాయి. రేడియోకి  ఇలాంటి వార్తలు పనికిరావు. ఎలాగూ వార్తల్లో ఇవ్వడు అని అర్ధం చేసుకున్న కొంతమంది నాయకులు నాతో బాహాటంగానే కొన్ని సంగతులు ముచ్చటిస్తూ వుండేవాళ్ళు. విలేకరులు కూడా తమకు ఇలా తెలిసిన ప్రతి సంగతినీ వార్తగా మలచాలి అంటే ఆ సమాచారం యజమాని దృష్టిలో పనికివచ్చేదిగా వుండాలి. అప్పుడే అది వెలుగు చూస్తుంది. ఇలా వెలుగు చూడని అనేక వార్తలు  బుద్దా మురళి వంటి సీనియర్ల వద్ద పుంఖానుపుంఖాలుగా దొరుకుతాయి.

ఇటు రాజకీయులకు, అటు జర్నలిస్టులకు లీకులు అనేవి కొత్తవి కావు. వారిరువురి నడుమా బంధాలు, అనుబంధాలు పెనవేసుకుని పోవడానికి బాగా తోడ్పడేవి నిజానికి లీకులే. పొగడ్తలతో కూడిన గొప్ప వార్తలు, వ్యాసాలు రాయడానికి చాలామంది వుంటారు. అంతకంటే కూడా, తమ రాజకీయ ప్రయోజనాలకోసం కొన్ని కట్టుడు కధలు పత్రికల్లో/ మీడియాలో రావడం వాళ్లకి ప్రధానం.

అయితే ఈ కధనాలు వాళ్ళు చెప్పినట్టే రావాలి కానీ వాళ్ళు చెప్పినట్టు ఎక్కడా బయటకి రాకూడదు. అలా బయటకు వచ్చిన లీకులపై విస్తృతంగా చర్చ జరిగిన పిమ్మట ‘ఆ వార్తలు మీడియా సృష్టి, నాకేమీ సంబంధం లేదు’ అని ఖండన ఇచ్చుకునే విధంగా వుండాలి. అలా అని ఆ వార్తలో పూర్తిగా నిజం వుండకూడదనీ కాదు. అలా అని అసలు నిజం లేదనీ కాదు. ఆ లీకు వీరుడి పేరు ఎటువంటి పరిస్థితుల్లో వెల్లడి కారాదు. (సోర్స్ చెప్పాల్సిన అవసరం మాకు లేదు’ అనే unwritten హక్కు గురించి మాట్లాడేది ఇలాంటి సందర్భాలలోనే). ఇన్ని షరతులతో లీకులు బయటకి వస్తాయి కాబట్టే వాటికి అంతటి డిమాండ్.

ఇంతకీ ఈ లీకులు ఏమిటి? ఎలా పురుడు పోసుకుంటాయి?

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించేరోజుల్లో అధికార పక్షంలోని అసంతృప్తులే ఈ లీకుల్ని విలేకరులకు ఉప్పందించేవారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే వచ్చింది. తదనంతర కాలంలో ఇవి పతాక స్థాయికి చేరి ఏది నిజమో ఏది అబద్ధమూ తెలియనంతగా మారిపోయి పాత్రికేయ ప్రమాణాలను, విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా విశ్వరూపం దాలుస్తున్నాయి.

ముఖ్యమంత్రుల కార్యాలయాల్లో పనిచేసే పౌర సంబంధాల అధికారులు ఈ లీకు వ్యవహారాలను చూస్తుంటారు. అల్లాగే మంత్రుల దగ్గర పనిచేసేవాళ్ళు.

ఒక ఉదాహరణ చెప్పుకుందాం.

అప్పటికి మీడియా విస్తృతి ఇంత లేదు. పత్రికలే రాజ్యం చేస్తున్నాయి, ఇప్పటికీ వాళ్ళదే రాజ్యం. అందుకే పలానా పత్రిక కావాలని రాసింది అని రాజకీయులు అంటుంటారు. ప్రింటులో వచ్చే వార్త ఖచ్చితం అని నమ్మేవారు ఇంకా మిగిలి వుండడమే ఇందుకు కారణం.

ఓ పత్రికా విలేకరికి ముఖ్యమంత్రి కార్యాలయంలోని సోర్స్ నుంచి ఫోన్ వస్తుంది. సంభాషణ ఇలా నడుస్తుంది.

ఏమిటి సంగతులు ఏమైనా కొత్త విషయాలు ఉన్నాయా!’

మా దగ్గర వార్తలు ఏముంటాయి? మీరిస్తేనే కదా మాకు వార్తలు’

అలా అంటావు కానీ మీరు రాసేవే మాకు వార్తలు. మొన్న చెప్పాను కదా! ఆయన వెళ్లి  ఆ పెద్దాయన్ని కలిశాడు అంటున్నారు. నీకేమైనా తెలుసా?’

తెలియదే. ఎప్పుడు?’

నేనూ విన్నదే! కనుక్కోని చెప్పు’

ఇక అక్కడినుంచి ఆ విలేకరి పని మొదలవుతుంది. ‘ఆయన’ అంటే ముఖ్యమంత్రి. మరి పెద్దాయన ఎవరు?

ఆయన’ డ్రైవర్ నెంబరుకు ఫోను చేశాడు. వీ ఐ పీ రాకపోకలు కనుక్కోవాలంటే పోలీసులు, డ్రైవర్లను మించి విలేకరులకు మంచి సోర్సు దొరకదు.

డ్రైవర్ దొరికాడు కానీ కావాల్సిన సమాచారం రాలేదు. కాకపొతే ఓ విషయం చెప్పాడు. ఆ రోజు ‘ఆయన’ అధికారిక వాహనం కాకుండా వేరే కారులో వెళ్ళిన మాట ధృవీకరించాడు. వెంట ఎవరు వెళ్లిందీ చెప్పాడు. ఆ వెంట వెళ్ళిన వాళ్ళను పట్టుకుంటే ‘ఆ పెద్దాయన’ ఎవరో తెలిసింది.

ఇవన్నీ జరిగిన సంగతులు. తర్వాత కావాల్సిన విధంగా మసాలాలు దట్టించి వార్తను వండి వార్చడమే.

అధిష్టానంపై తిరుగుబాటుకు పావులు కదుపుతున్న ముఖ్యమంత్రి!’

కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఓ సీనియర్ మంత్రిని రహస్యంగా కలుసుకుని చర్చలు జరిపిన ముఖ్యమంత్రి’

ఇది హెడ్డింగు. అసలు వార్త అనేక సోయగాలు అద్దుకుని అక్షరాల రూపంలో మర్నాడు పత్రికలో మొదటి పేజీలో దర్శనం ఇస్తుంది.

దానితో పాటే ముఖ్యమంత్రి కార్యాలయం జారీ చేసిన ‘ఖండన’ ప్రకటన కూడా ఆ పత్రిక కార్యాలయానికి చేరుతుంది.

ఇలా వుంటాయి ఆ తమాషాలు.

నలభయ్ ఏళ్ళ పాత్రికేయ జీవితంలో ఎదురయిన అటువంటి వృత్తాంతాలను, ఇంతవరకూ బయటకు రాని వార్తలను సేకరించి, సుమారు నూట యాభయ్ ఎపిసోడ్లు,   వెలుగు చూడని వార్తలు అనే పేరుతో  అక్షరబద్ధం చేసి నా కంప్యూటర్ లోనే పదిలంగా దాచుకున్నాను.

అసలు నేను నా ఈ జీవనయానం కధ మొదలు పెట్టినప్పుడు అలాంటి అన్ టోల్డ్ స్టోరీస్ రాస్తానని నన్ను తెలిసిన వాళ్ళు అనుకున్నారు.  నేను కూడా ఒక బలహీన క్షణంలో అలాంటి ఆలోచన చేసిన మాట  నిజమే. ఎందుకంటే పెద్ద కష్టం లేకుండా రోజుకు ఒకటి తీసి  పోస్టు చేస్తూ పోవడమే.

తరువాత తీరిగ్గా ఆలోచించి, దరిమిలా ఎదురయ్యే కష్టనష్టాలను బేరీజు వేసుకుని  ఆ ప్రయత్నం మానుకున్నాను.

ఎప్పుడో పాతికేళ్ళ క్రితం కళ్ళతో చూసి, చెవులతో విన్న సంఘటనలను అక్షరబద్ధం చేయాలి అంటే కత్తిమీద సామే. అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. రాజకీయ పారావారాలు గిరులు, బరులు గీసుకుని ఉచ్చనీచాలు లేకుండా  విచ్చలవిడిగా చెలరేగిపోతూ, మాటల ఈటెలు దూసుకుంటున్నప్పుడు, రామా అన్నా అందులో వేరే అర్ధం పట్టుకునే రోజులు.  ఈ బురదలో కాలు పెట్టడం అంత అజ్ఞానం మరోటి వుండదు. అడుసు తొక్కనేల కాలు కడుగనేల!

 

నిజానికి నేను 1992 లో మాస్కో నుంచి తిరిగివచ్చిన తర్వాత 2005 వరకు యాక్టివ్ జర్నలిజంలోనే వున్నాను. ఆ తరవాత కూడా వివిధ టీవీ చానళ్ల రాజకీయ చర్చల్లో పాల్గొంటూ, పత్రికలకి వ్యాసాలు రాసుకుంటూ దాదాపు పదిహేను సంవత్సరాలు అదే వృత్తిలో కొనసాగాను. వారంలో ప్రతిరోజూ ఒక టీవీకి వెడుతూ, వారాలబ్బాయి అనే పేరు కూడా తెచ్చుకున్నాను. టీవీల వాళ్ళు కూడా నా మీద కాస్త సానుభూతితో ఏది మాట్లాడినా అనుమతించేవారు. మరీ వారి పాలసీకి విరుద్ధంగా నా సంభాషణ సాగుతోందని ఎరుక కలిగినప్పుడు, ఇప్పుడో చిన్న విరామం అనో, లేక చర్చలో అతి తక్కువ సమయాన్ని ఇవ్వడం ద్వారానో ఆ పూట లాగించేవారు. ప్రశ్న అడగకుండా  కల్పించుకుని మాట్లాడే పద్దతి నాది కాదు. నేను వ్యక్తం చేసే అభిప్రాయాల తీరు నచ్చని రాజకీయ పక్షాల ప్రతినిధులు కూడా లైవ్ లో నా మాటకు అడ్డం తగిలే వారు కాదు. తెలంగాణా ఉద్యమం ఉదృతంగా వున్నప్పుడు కూడా నా సమైక్య రాష్ట్ర  వాదనను తప్పుపట్టేవారు కాదు. ప్రస్తుతం ఉప్పూ నిప్పూ మాదిరిగా కత్తులు దూసుకుంటున్న ఛానల్లకు ఆ రోజుల్లో వెళ్ళినప్పుడు,  వారి వాహనంలోనే నేను ప్రత్యర్థి ఛానల్ కు వెళ్ళిన సందర్భాలు అనేకం. అలాగే విభిన్న రాజకీయ స్వభావాలు, ఒత్తిడులు  కలిగిన పత్రికలకి రాజకీయ అంశాలపై వ్యాసాలు ఏళ్ళ తరబడి రాశాను. మాట రాలేదు, మాట పడలేదు.

కానీ రోజులు ఎప్పుడూ ఒకరకంగా వుండవు అనడానికి నా అనుభవమే సాక్ష్యం.  

తర్వాత తర్వాత రోజులు మారుతూ వచ్చాయి. ఛానల్ చర్చల్లో ఏమీ అనకపోయినా, వారి వారి సోషల్ మీడియా శక్తులు నా మీద కత్తి దూయడం మొదలు పెట్టాయి. నన్నే కాకుండా నా కుటుంబాన్ని కూడా కలుపుతూ అతి  హేయంగా వ్యాఖ్యలు పెట్టడం మొదలు పెట్టారు. సోషల్ మీడియా రాజకీయాల్లో పండిపోయిన వారికి వుండే,  దళసరి చర్మం లేనివాడిని  కనుక, వాటిని  తట్టుకోలేక ఒక మంచి రోజు చూసుకుని టీవీ చర్చలకు నేనే  స్వస్తి చెప్పాను. పత్రికలకు రాజకీయ వ్యాసాలు రాయడం మానేశాను. అంతెందుకు, సోషల్ మీడియాలో అత్యంత సన్నిహితులు పెట్టే రాజకీయ పోస్టులకు లైకులు కొట్టడం , కామెంట్లు పెట్టడం కూడా మానేశాను. మరో రకంగా చెప్పాలంటే దశాబ్దాల నుండి మోస్తూ వచ్చిన  కాడి కింద పారేశాను. చాలామంది హితైషులు, మీలాంటి జర్నలిస్టులే  ఇలా భయపడిపోతే ఎట్లా అని సలహాలు చెప్పారు. ఇది భయపడి వెనక్కు తగ్గడం ఎంత మాత్రం కాదు.  కావాలని కాలు అశుద్ధంలో పెట్టడం మాత్రం శ్రేయస్కరం కాదు. ఈ వయసులో నాకు కొత్తగా వచ్చే పేరు ప్రఖ్యాతులు ఏమీ లేవు. వీటి మీద అదనంగా ఆర్జించే సంపాదనా లేదు. అనవసరంగా బీపీలు పెరగడం తప్ప.

అంచేతే నా దారి నేనే మార్చుకున్నాను. నా రాతలు మార్చుకున్నాను. రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పాను. నిజానికి ఈనాడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు గమనిస్తుంటే, గతంలో నేను చూసిన సంఘటనలు గుర్తుకు వచ్చి ఏదైనా మంచి మాట చెప్పాలని, రాయాలని  అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. కానీ బలవంతాన నిగ్రహించుకుంటాను.

తెలిసిన రాజకీయాలు గురించి, తెలిసిన రాజకీయ నాయకులు గురించీ నాకు తెలిసిన  మంచి విషయాలు రాయకుండా ఒక జర్నలిస్టు జీవిత చరిత్ర సంపూర్ణం కాని మాట నిజమే.  మంచి మాటలు కూడా  చెప్పే పరిస్థితి  నా వంటివారికి లేకుండా పోయింది. ఇదో విషాదం!  ఇదే  ప్రయత్నం ఓ పదేళ్లు ముందు చేసివుంటే,  బహుశా నాకు తెలిసిన అనేక విషయాలు నిస్సంకోచంగా రాసివుండేవాడినేమో! ఇప్పుడు అది కుదరని పని.

ఈ కారణాల చేతనే భద్రంగా దాచుకున్న ఆ వెలుగు చూడని వార్తలను కంప్యూటర్ సమాధిలోనే  వుంచేశాను.

నమ్మకమైన సమాచారం అయినా, ఒక తరం వారికి ఆసక్తి కలిగించే విషయాలే  అయినా, ఆ సంచలనాల వైపు మళ్ళకుండా, ఏదో నా జీవితం గురించీ, దానిచుట్టూ అల్లుకున్న పరిస్థితులు గురించీ రాసుకుంటూ వెడుతున్నాను. ఒక సాధారణ వ్యక్తి సాధారణ జీవితం ఎలా గడిచిందో, గడుస్తున్నదో చెప్పడమే ఈ బిగ్ జీరో ధ్యేయంగా మార్చుకున్నాను.  

ఈ విషయంలో  అందరి నుంచి వెల్లువెత్తుతున్న అభిమానానికి వేల వేల ధన్యవాదాలు.

(రాజకీయాల ప్రసక్తి  లేని మీ జీవిత చిత్రం, రాముడు లేని రామాయణంలా వుందని కొందరు మితృలు చేస్తున్న  వ్యాఖ్యలకు ఇది చిన్నపాటి వివరణ)

కింది ఫోటోలు:

(నా వృత్తి జీవితంలో తటస్థపడిన కొందరు రాజకీయ ప్రముఖులతో నేను. దయచేసి ఇందులో ప్రాధాన్యతా క్రమాలు వెతక్కండి. సాంకేతిక ప్రతిభ లేని కారణంగా ఒక క్రమంలో పోస్టు కాలేదు. వరుసగా: చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖర రెడ్డి, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, రాహుల్ గాంధీ, చండ్ర రాజేశ్వర రావు, కె. రోశయ్య, ఎం. వెంకయ్య నాయుడు, తమిలసై, కేవీపీ, టి.అంజయ్య, నరసింహన్, కేటీఆర్, సీతారాం ఏచూరి, కిషన్ రెడ్డి, వై.ఎస్. జగన్ మోహన రెడ్డి)























(ఇంకావుంది)




















(ఇంకా వుంది)   

9, ఏప్రిల్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (139) – భండారు శ్రీనివాసరావు

 ఎవరీ పిల్లల కోడి?

ఒకప్పుడు ఆంధ్రజ్యోతి పబ్లికేషన్స్ నుంచి వనితాజ్యోతి అనే మహిళల పత్రిక వెలువడేది. వాసిరెడ్డి కాశీరత్నం గారు దానికి  ప్రతినిధి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీ వాసిరెడ్డి నారాయణ రావు గారి సతీమణి.  

ఎప్పుడో  నలభయ్  అయిదేళ్ళ క్రితం వెతుక్కుంటూ చిక్కడపల్లి త్యాగరాయగాన  సభ దగ్గర వున్న మా ఇంటికి వచ్చారు. నా కోసం కాదు, మా ఆవిడకోసం. వెంట ఒక ఫోటోగ్రాఫర్ కూడా. వచ్చేసరికి మా ఆవిడ నడుపుతున్న అమ్మవొడి చైల్డ్ కేర్ సెంటర్ పిల్లలతో కీసరబాసరగా వుంది. వనితాజ్యోతి పత్రిక కోసం ఇంటర్వ్యూ చేద్దామని వచ్చారు. నోటు పుస్తకంతో కాశీరత్నం గారు, చంకన బిడ్డలతో మా ఆవిడ. ఆ గందరగోళం నడుమనే ఆమె ఇంటర్వ్యూ చేసి తమ పత్రికలో ప్రచురించారు.

అది యధాతధంగా:    

చిట్టి పొట్టి చిన్నారుల చిన్నారి ప్రపంచం – వాసిరెడ్డ్డి కాశీరత్నం

చిక్కడపల్లి సుధా హోటల్ నుంచి త్యాగరాయ గానసభకు వెళ్ళే రోడ్డులో “అమ్మ ఒడి” అని బోర్డు కనిపిస్తుంది. ‘అమ్మకొంగు ముడి విడలేని చిన్నారుల బడి’ అని కూడా ఓ ట్యాగ్ లైన్ వుంటుంది.

అదే భండారు నిర్మలాదేవి నిర్వహించే డే కేర్ సెంటర్ “అమ్మ ఒడి”.

గేటు తీసుకుని లోపలకు వెడితే...

ఆ గది అంతా పసివారి కోలాహలంతో నిండి వుంటుంది. పాల కోసం ఏడుస్తూ చేతులు చాపే చిన్నారుల దగ్గరినుంచి కాలిమువ్వలు ఘల్లుఘల్లుమంటూ తిరిగే దీపిక దాకా అంతా నిర్మలాదేవికి మాలిమి అయినవారే.

“ఈ పిల్లలంతా ఇలా కోలాహలంగా అరుస్తున్నారు కదా! మీకు తల నొప్పిగా ఉండదూ” అని ప్రశ్నిస్తే నవ్వుతుంది నిర్మల.

“మొదట్లో సంగతి ఎలా వున్నా తరువాత పిల్లలు బాగా అలవాటు అయ్యారు. ఇప్పుడు పిల్లలు లేకపోతె నేనుండలేను. ఏదో ఒక  కారణం వల్ల ఒక పిల్లవాడో, పాపో రాకపోతే ఆ  రోజు  నా మనసు తహతహలాడుతుంది. ఏమిటీ అనుబంధం అని ఆశ్చర్యం వేస్తుంది” నిర్మల జవాబు.

ముద్దులొలికే ఆ పసివాళ్లు పెద్దవాళ్ల మనస్సులకు బంధాలు వేసి లాగుతారు కదా!

“మొదటి నుంచీ నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. నా పిల్లలు ఇద్దర్నీ బాగానే పెంచాను. మా పక్కన వుండే పూర్ణ చంద్రావతి నాకీ సలహా ఇచ్చారు. ముందుగా ఆవిడే వాళ్ళ పాప దీపికను నాకు అప్పగించి ఆఫీసుకు వెళ్ళేవారు. ఆ తర్వాతనే జేమ్స్ తట్టా బుట్టాతో వచ్చాడు”

అక్కడే ఆ పిల్లల దగ్గరే పిల్లల కోడిలా కూర్చుని కబుర్లు చెబుతోంది నిర్మల.

“ఇదిగో కార్తీక్. వీళ్ళమ్మ మ్యూజిక్ కాలేజీలో పనిచేస్తుంది. ఇటు చూశారా, హేమంత్. ఇదిగో ఇటు గౌతమ్. పద్మ ప్రియ. వీళ్ళ తల్లులు బ్యాంకుల్లో పనిచేస్తారు. ఈ చిన్నారి అపర్ణ అమ్మ యూనివర్సిటీలో, సురేశ్ వాళ్ళమ్మ టెలిఫోన్స్ లో పనిచేస్తారు”

ఒక్కొక్క బేబీని పేరుపేరునా పిలిచి చూపిస్తోంది నిర్మల.

“ఇంత పసివాళ్లు కదా! ఎలా మాలిమి అయ్యారు”

“మొదట్లో కొంతమంది మారాం చేశారు. శ్రీనివాస్ వచ్చినప్పుడు రెండున్నర ఏళ్ళవాడు. కొంచెం కష్టం అయింది. చంక దిగేవాడు కాదు. ఇంట్లో వంటంతా  వాడిని ఎత్తుకునే చేసేదానిని. ఆ తరవాత అలవాటు అయ్యాడు అనుకోండి. శైలజ రాగానే వాళ్లమ్మ చంక నుంచి నా మీదకు దూకేసింది. వీళ్ళందరికీ కబుర్లు చెప్పాలి. మాటలు నేర్పాలి. సాయంత్రం అయ్యేసరికి మొహాలు కడిగి, పౌడరు వేసి, బొట్టూ కాటుక పెట్టి వారి తల్లులకు అప్పగించేదాన్ని. కొంతమందికి స్నానాలు కూడా ఇక్కడే.  కొందరికి జడలు వేయాలి. వాళ్ళ అమ్మావాళ్ళు ఇచ్చి వెళ్ళిన డ్రస్సులు వేయాలి. మరీ చిన్నవాళ్లను లాలిపాటలు పాడి నిద్ర పుచ్చాలి. పెండ్లి వారిన పంపినంత పని వుంది.”

“ఇంత పనీ మీరొక్కరే చేయగలుగుతారా?

“అరుగో వున్నారు కదా! జయవిజయుల్లాగా. పెద్ద ఆయా సుశీల. చిన్న ఆయా పద్మ. వాళ్లిద్దరే నాకు సాయం”

“ఈ పసివాళ్లకు ఏదైనా సుస్తీ చేస్తే మీరేం చేస్తారు”

“చాలాసార్లు చిన్న చిన్న చిట్కా వైద్యాలు నేనే చేస్తుంటాను. మా పిల్లలు పసివాళ్ళుగా వున్నప్పుడు మా అత్తగారు, వదిన గార్ల నుంచి నేర్చుకున్నాను. నిజానికి ప్రతి తల్లీ ఒక రకంగా చిన్నసైజు  డాక్టరే. చాలా మంది తల్లులు పిల్లలకు నీళ్ళ పాలు పడతారు. ఇది మంచిది కాదు. తల్లులకు  పాలు ఎలా కలపాలో, ఎంత పొడి వేయాలో చెబుతుంటాను.  సాధారణంగా పసివారికి నెలకు రెండు డబ్బాలు పడతాయి. పాల పొడి డబ్బాలు, పాల సీసాలు వాళ్ళే ఇస్తారు. సీసాలను ఇక్కడే నీళ్ళలో ఉడికించి స్టెరిలైజ్ చేస్తాము. ఒక్క జేమ్స్ ను మాత్రమే రెండు మూడు సార్లు ఆసుపత్రికి తీసుకు వెళ్ళాల్సి వచ్చింది. తక్కిన పిల్లలతో ఎలాంటి ఇబ్బందీ లేదు. మా పెద్ద వదిన గారి కొడుకు మనోహర్ ఈ ఏరియాలో మంచి పేరున్న పిల్లల డాక్టర్. ఇంగ్లాండ్ లో చదువుకుని వచ్చాడు. అసలు విసుగన్నదే లేని మనిషి. ఎప్పుడు ఫోన్ చేసి సలహా అడిగినా ఏం చేయాలో చెప్పేవాడు. అలాంటి డాక్టర్ మనోహర్  మా చుట్టం అని తెలియగానే చాలా మంది తలిదండ్రులు సంతోషపడ్డారు కూడా”

“మరి ఈ తల్లులందరూ మీకు రెగ్యులర్ గా పే చేస్తుంటారా”

తల ఊపింది నిర్మల.

“చాలా రెగ్యులర్ గా పే చేస్తారు. పొద్దున్నే ఎనిమిదిన్నరకల్లా పిల్లల్ని నాకు అప్పగిస్తారు. మళ్ళీ సాయంత్రం అయిదున్నర లోపు తీసుకు వెడతారు. ఎవరో కొద్దిమంది షాపింగ్ కూడా ముగించుకుని వస్తారు. అదే కొంచెం కష్టం అనిపిస్తుంది. మా పిల్లలు అప్పటికే స్కూలు నుంచి వచ్చేవారు. వాళ్లకు ఏదైనా తినడానికి చేసి పెడదాం అంటే కుదిరేది కాదు. పాపం ఇద్దరూ అలా మిగిలిన పిల్లలతో ఆడుతూ కాలక్షేపం చేసేవాళ్ళు”

మనసుకు తృప్తి కలిగించే పనులు చేస్తున్నప్పుడు మిగిలిన బాధలు ఒక లెక్కలోనివి కావు అన్నట్టు మాట్లాడింది నిర్మల.

తనకు నచ్చిన పని దొరికితే మనిషికి ఎంత సంతృప్తి లభిస్తుందో నిర్మలను చూసినప్పుడు నాకనిపించింది.

ముద్దులొలికే ఆ చిన్నారుల కబుర్లు, ముచ్చట్లు వింటూ నవ్వుకుంటున్న ఆ ‘భాగ్యశాలి’కి వీడ్కోలు చెప్పి అమ్మ ఒడి నుంచి బయటకు వచ్చాను.

-వాసిరెడ్డి కాశీరత్నం

కట్ చేస్తే  

సరిగ్గా ముప్పై తొమ్మిది  సంవత్సరాల తర్వాత :

 

చివరాఖరి నవ్వు



2019, ఆగస్టు.

హైదరాబాదు పంజాగుట్ట గలేరియా మాల్ లో ఓ షాపు. తను లోపలికి వెళ్ళింది. నేనూ వెంటే వెళ్లాను. అక్కడి సేల్స్ గర్ల్ కు  చిన్న తల నూనె సీసా చూపించింది.

ఎంత”

ట్వెల్ ఫిఫ్టీ”

ఆ అమ్మాయి ధర చెప్పగానే, నేను తొందరపడి,

అయితే నాలుగివ్వండి” అన్నాను పర్సులో నుంచి యాభయ్ నోటు తీస్తూ.

అప్పుడు వినపడింది నవ్వు.

ముందు సేల్స్ గర్ల్ అనుకున్నాను.

ఆమె వైపు చూస్తే అమ్మాయి నా మొహంలోకి చూస్తూ సన్నగా మందహాసం చేస్తోంది. మరి అంత బిగ్గరగా నవ్వుతోంది ఎవరు?

తీరా చూస్తే మా ఆవిడే.

ఇంకా నవ్వుతోంది. చిన్నగా కాదు. పగలబడి నవ్వుతోంది. అందరూ చూస్తున్నారు అనే ధ్యాస లేకుండా.

బహుశా అంత హాయిగా నవ్వింది మా నలభయ్ ఎనిమిదేళ్ళ వైవాహిక జీవితంలో మొదటిసారి అనుకుంటా. అందుకే అలా చూస్తుండి పోయాను.

అంతగా నవ్వు తెప్పించే మాట అమాయకంగా ఏమన్నాను?

తర్వాత తెలిసింది, ఆమె నవ్వింది నా అమాయకత్వాన్ని చూసి కాదు, నా తెలివి తక్కువతనాన్ని చూసి అని.

ఉబెర్ లో ఇంటికి వస్తున్నప్పుడు కూడా ఆ నవ్వు అలా తెరలు తెరలుగా వస్తూనే వుంది.

మీకు కిలో కాఫీపొడుం రేటు తెలవదు, అలాంటి షాపుల్లో పదీ పరక్కూ దొరుకుతాయని ఎలా అనుకున్నారు” అని నవ్వుతూనే అంది.

ఇంతకీ ఆ రోజు జరిగింది ఏమిటంటే సినిమా చూసి వస్తూ  షాపులోకి వెళ్ళాము. ఏదో తల నూనె కొన్నది. చూడబోతే చిన్నసీసా.

డబ్బులు ఇవ్వబోతూ నేనడిగిన ప్రశ్న”ఎంత” అని. “ట్వెల్ ఫిఫ్టీ” అన్నది షాపులోని అమ్మడు. “పన్నెండున్నర రూపాయల సీసా కోసం మళ్ళీ మళ్ళీ రావడం ఎందుకు, ఒకేసారి నాలుగు సీసాలు కొనుక్కోవచ్చు కదా” అంటూ యాభయ్ నోటు తీశాను. నిజానికి దాని ధర పన్నెండు వందల యాభయ్ రూపాయలు. ఈ విషయం తనకు తెలుసు. నాకు తెలవదు. మరి నాది అమాయకత్వమో, తెలివితక్కువతనమో కూడా తెలియదు. ఏదైతేనేం అది చూసే ఆమెకు నవ్వొచ్చింది. మామూలుగా కాదు. తెరలుతెరలుగా.

ఇలా పగలబడి నవ్వడం మొదటిసారి. నాకప్పుడు తెలియదు, మరో వారం తర్వాత అదే చివరిసారి అవుతుందని.

ఇప్పుడు కూడా ఆ మాల్ కి నా మనుమరాలు జీవికను వెంటబెట్టుకుని వెళ్లి ఆ షాపు దగ్గర కాసేపు తచ్చాడుతాను. నవ్వు వినబడుతుంది కానీ మనిషి కనబడదు.  

నవ్వు లాగే జ్ఞాపకాలు.

తెరలు తెరలుగా అలా వస్తూనే వుంటాయి.

ఎక్కడో ఆపాలి!

 

కింది ఫోటో :

మా ఆవిడ నడిపిన అమ్మవొడి




 

(ఇంకా వుంది)