10, నవంబర్ 2016, గురువారం

కరెన్సీ నోట్లను ప్రభుత్వాలు రద్దు చేయొచ్చా! అటువంటి అధికారం వాటికి ఉందా!


ఈ  అంశాలపై  తీవ్రమైన చర్చ సాగుతోంది.
రద్దు చేసే అధికారం వుంది అని వాదించేవాళ్ళతో ఏ చిక్కూ లేదు. కానీ లేదనే వాళ్ళు ఒక వాదం చెబుతున్నారు. ఒక రూపాయి నోటు మీద ఫైనాన్స్ సెక్రెటరీ సంతకం వుంటుంది. అదే అంతకు మించిన విలువకలిగిన నోట్లమీద ‘ఇది ప్రామిసరీ నోటు. ఇది కలిగిన వాళ్లకు అదే విలువను తిరిగి చెల్లిస్తామని రిజర్వ్ బ్యాంకు పూచీ ఇస్తున్నట్టు రాసివుంటుంది.

(I PROMISE TO PAY THE BEARER THE SUM OF ONE HUNDRED RUPEES/ FIVE HUNDRED RUPEES/ ONE THOUSAND RUPEES) ప్రామిసరీ నోటు చెల్లుబడికి కొంత కాల వ్యవధి వుంటుంది. పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోటు కు కాల వ్యవధి వుండదు. ఒకవేళ కాలదోషం పడితే అంటే బాగా నలిగిపోయి చిరిగిపోయే స్థితికి చేరుకుంటే దాన్ని రిజర్వ్ బ్యాంకులో ఇచ్చి కొత్త నోటు తీసుకునే వీలుంది. ప్రభుత్వాలకు కరెన్సీని   చెలామణీ నుంచి తప్పించే అధికారం వుంటుంది కానీ వాటిని పూర్తిగా రద్దుచేసే అధికారం లేదన్నది వారి వాదన. పాత నోటు అంటే చెలామణీ నుంచి తప్పించిన నోటుకి బదులు వేరే నోటు ఖచ్చితంగా తిరిగి ఇవ్వాల్సి వుంటుంది.  బ్యాంకులు డిపాజిట్ చేయడానికి తిరస్కరించ కూడదు అనేది వారి అభిప్రాయం. కాకపొతే, అలాంటి డిపాజిట్ దారులని ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నించే వీలుంటుంది.

ఈ వాదన ఎంతవరకు సబబు అనేది ఇటువంటి ఆర్ధిక విషయాల్లో నిష్ణాతులయిన వాళ్ళే చెప్పాలి

NOTE: COURTESY IMAGE OWNER       

9, నవంబర్ 2016, బుధవారం

బిచ్చగాడి వీలునామా!


ఓ బిచ్చగాడు వీలునామా రాసి చనిపోయాడు.
“ నా ముల్లెలో మూడు వేల అయిదు రూపాయల నోట్లు, ఆరు వేల పది రూపాయల నోట్లు, ముప్పయివేల వంద రూపాయల నోట్లు ఇంకా బోలెడు చిల్లర పైసలు వున్నాయి. ఈ సంపద కూడబెట్టడానికి నేను జీవితాంతం రేయింబవళ్ళు కష్టపడ్డాను. అయితే ఇది అనుభవించడానికి నాకు వారసులు ఎవరూ లేరు. అందుకే, ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఏవైనా సంక్షేమ కార్యక్రమాలకు  వాడాలని వీలునామా రాస్తున్నాను.”
చిత్రం! ఈ వార్త అన్ని పత్రికల్లో మొదటి పేజీలో ప్రముఖంగా వచ్చింది.  


Modi's Surgical Strike

Prime Minister Narendra Modi's Surgical Strike on BLACK MONEY 

8, నవంబర్ 2016, మంగళవారం

నేను సైతం.....

నేను సైతం ఈరోజు నా దేశ ఋణం కొద్దిగా తీర్చుకున్నాను
ఈరోజు ఊబెర్ అద్దె వాహనంలో ప్రయాణించాను. అతడికి బిల్లు చెల్లించాను. తరువాత ఊబెర్ కంపెనీ నుంచి నాకు వచ్చిన మెయిల్ లో ఇలా వుంది:
Before Taxes
112.26

Service tax (4.2%)
4.71

Swachh Bharat Cess (0.15%)
0.17

Krishi Kalyan Cess (0.15%)
0.17
https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEj2xvmyRz4n7U92_ulsVgfeEe-7sD20GewQaPtLOLB7AGFahrIp0mf-e5LdYf2Sq7HHWWGqehJqjPdVkfuzGii0KpjUfcK-fPNX_TKgrEpb6oteLLhMKGP6PRc-ys202znBWoRlzuf0swzTtvoTpieBs-NSwEUpjZweiJpDw3mu=s0-d-e1-ft

COLLECTED
₹ 117.31



అంటే ఏమిటన్నమాట. సర్వీసు టాక్స్ 4.2 శాతం , నాలుగు రూపాయల డెబ్బయి ఒక్క పైసలు, స్వచ్చ భారత్ సెస్సు  0.15 శాతం పదిహేడు పైసలు, క్రిషి కళ్యాణ్ సెస్సు 0.15  శాతం  మరో పదిహేడు పైసలు  చెల్లించినట్టు రసీదులో వుంది. నా దగ్గరనుంచి వసూలుచేసిన ఈ సొమ్ము క్షేమంగా సర్కారు ఖజానాకు చేరుతుందని ఆశించడం సగటు పౌరుడిగా నా ధర్మం. ఇలా ప్రతి రోజూ, ప్రతి పౌరుడు తాను పెడుతున్న ప్రతి ఖర్చులో   సర్కారుకు చెల్లించే పన్ను, సెస్సు  వివరాలు ఎప్పటికప్పుడు ఇలా తెలియచేస్తూ సర్కారు ఖజానాలో మనకో ఖాతా తెరిచి అందులో నమోదు చేస్తుంటే కాలర్ ఎగరేసుకుని తిరగొచ్చు. ఎందుకంటే ఈదేశంలో ప్రతి ఒక్కరూ అనుమానం ముందు పుట్టి తరువాత వాళ్ళు పుడతారు. ఇంతకీ ఈ సొమ్ము( అక్షరాలా అయిదు రూపాయల అయిదు పైసలు) ఖజానాలో జమ అయినట్టేనా!     

5, నవంబర్ 2016, శనివారం

అమెరికాలో అలా....ఇండియాలో ఇలా...

రేపు (నవంబరు ఒకటి) ఈ సమయానికి సింగపూర్ వెళ్ళే విమానంలో ఉంటాను. అమెరికా ఎన్నికల దినం నవంబర్ 8 నాడు అక్కడే (సింగపూరులో) ఉంటాను కాబట్టి ఇవాళ పొద్దున్న ఎర్లీ ఓటింగుకి వెళ్లాను. అక్కడ లైన్ లో మా అమ్మాయి కూడా ఉంది. ఇద్దరం ఓటు వేసేశాం. అంతకు ఓ గంట ముందు మా అర్థాంగి కూడా ఓటు వేసేసి ఇంటి కొచ్చి గొప్పలు చెప్పుకుంది. ఎవరు, ఎవరికి  ఓటు వేశామో చెప్ప కూడదు. నా జాతకం ప్రకారం సాధారణంగా నేను ఎవరి కి ఓటు వేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఓడి పోతారు. అంచేత నా సంగతి అమెరికాలో నవంబర్ 8 రాత్రికి తెలిసిపోతుంది. అదీ సంగతి.”
ఐదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కోసం అమెరికా నుంచి సింగపూరు వెడుతూ వంగూరి చిట్టెన్ రాజు ఫేస్ బుక్ లో అక్టోబర్ 31 న పెట్టిన పోస్టింగు ఇది. 
శుక్రవారం నాడు హైదరాబాదులో ఉంటున్న మా అన్నయ్య రామచంద్రరావు గారు అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళ అబ్బాయి రాజేష్ తో మాట్లాడినప్పుడు అతడూ ఇదే సంగతి చెప్పాడు. ఇప్పుడే ఓటు వేసి వస్తున్నానని రాజేష్ ఫోనులో  చెబుతుంటే ‘అదేమిటి! ఎనిమిదో తేదీ కదా ఎలక్షన్లు’ అని ఆశ్చర్యపోవడం ఈయన వంతయింది. అప్పుడు ‘ఎర్లీ వోటింగు దాని కధాకమామిషూ’ రాజేష్ వివరించి చెప్పాడు.
పోలింగు సమయానికి వూళ్ళో లేనివాళ్ళు, లేదా ఆ రోజున వేరే పనులు వుండి ఓటు వేయలేని వాళ్ళకోసం ఏర్పాటు చేశారు ఈ ఎర్లీ పోలింగు పద్ధతి. ముందుగా వెళ్లి ఓటు హక్కు వినియోగించు కోవడానికి వీలుగా ఆయా ప్రాంతాల్లో పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా కూడా ఈ సారి ఈ విధంగానే ఎర్లీ ఓటింగు విధానంలో ఓటు వేసేశారు కూడా.
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఎవరయినా విదేశస్తులు ఆ దేశం వెడితే అసలక్కడ ఎన్నికలు జరుగుతున్నాయని కూడా వారికి అనిపించదు. ముఖ్యంగా ఇండియా నుంచి వెళ్ళిన వాళ్లకు. ఎందుకంటే మన దగ్గర ఎన్నికలు వస్తే ఆ హడావిడి చెప్పాల్సిన పనిలేదు. బహిరంగ సభలు, ఉపన్యాసాలు, ఊరేగింపులు, వాల్ పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగులు, ఇలా ఎన్నికల యుద్ధ వాతావరణం చాలా కాలం కొనసాగుతుంది. అమెరికాలో కూడా ఈ గందరగోళం కొంత లేకపోలేదు. కాకపొతే అది ఇళ్ళల్లో టీవీలకే పరిమితం. టౌన్ హాల్స్ లో జరిగే ఎన్నికల సమావేశాలకు ఓ వెయ్యి మంది హాజరయితే అదొక భారీ బహిరంగ సభ కింద లెక్క.
కాకపొతే ఇలా మర్యాదగా ఎన్నికలు జరుపుకుంటూ పొతే మర్యాద కాదనుకున్నారేమో కానీ, ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు ఇద్దరూ పోటీపడి తమ ఎన్నికల  ప్రసంగాల్లో అనకూడని మాటలు అన్నారు. పలకకూడని పలుకులు పలికారు. చేయకూడని ఆరోపణలు చేసుకున్నారు. వీటిని ఇంటింటికీ మోసుకు వెళ్ళడంలో అక్కడి మీడియా కూడా తన పాత్ర అవధుల మేరకు పోషించిందనే చెప్పాలి.
ఇదంతా చూసి, చదివి, విని ఇక్కడ అందరం అక్కడేదో జరిగిపోతోందన్న భ్రమల్లో వున్నాం. కానీ ఏమీ జరగదు, ఎనిమిదో తేదీన ఎన్నిక తప్ప.   

4, నవంబర్ 2016, శుక్రవారం

పుష్కరం నాటి అమెరికా


నేను హైస్కూల్ లో చదువుకునే రోజుల్లో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు గారు అమెరికా సందర్శించి – ‘నేను చూసిన అమెరికాఅని ఒక పుస్తకం రాశారు. అది చదివి ఆ పుస్తకానికి అలా ఎందుకు పేరు పెట్టారా అని అనుకునేవాడిని. ఇన్నేళ్ళ తరవాత ఇప్పుడు అమెరికాలో అయిదు మాసాలు వుండి వచ్చిన తరవాత అర్ధమయింది. అదొక సువిశాల దేశం. టూరిస్టులుగా వచ్చిన వాళ్ళే కాదు, ఎన్నో ఏళ్లుగా అక్కడ వుంటూ వచ్చిన వాళ్ళు కూడా అమెరికాని పూర్తిగా చూడడం కుదరని పని. అందుకే చూసిన మేరకే అవగాహన చేసుకుని అక్షరబద్ధం చేసేందుకే ఈ ప్రయత్నం.
వీసాలు అంత కఠినం
అమెరికా వెళ్లడం అన్నది మన దేశంలో చాలా మందికి తీరని కల. ఎందుకంటె వీసా నిబంధనలు అంత కఠినతరం. డబ్బున్నవాళ్ళు కూడా మరో మరో విదేశానికి వెళ్లి వచ్చినంత సులభంగా అమెరికా వెళ్ళలేరు. అలాగే ఆనాటి సోవియట్ యోనియన్ కూడా. అయితే, ఓ పుష్కర కాలం క్రితం ఆకాశవాణి పుణ్యమా అని మాస్కోవెళ్లి అయిదేళ్ళు రేడియో మాస్కోలో పనిచేసివచ్చాను. ఆ రోజుల్లో ప్రపంచ దేశాల్లో అమెరికాకు పోటీగా నిలబడిన మరో ఏకైక అధికార ధ్రువం సోవియట్ యూనియన్. అనేక దశాబ్దాల తరబడి అప్రతిహతంగా సాగిన మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం అంతిమ ఘడియలు చూడగలిగే అరుదయిన అవకాశం లభించిన నేను –‘మార్పు చూసిన కళ్ళు ‘ – అనే పేరుతొ ఆనాటి అనుభవాలను గ్రంధస్తం చేయాలనుకున్నాను. కానీ అది తీరని కోరికగానే మిగిలిపోయింది. ( తదనంతర కాలంలో వచ్చిన బ్లాగులపుణ్యమా అని పుస్తకరూపంలో తీసుకురాలేకపోయిన దానిని - దాదాపు పదిహేడు భాగాలు - నా బ్లాగులో (http://www.bhandarusrinivasarao.blogspot.com) పొందుపరచగలిగాను.పోతే, ఇప్పుడు- సియాటిల్ లో వుంటున్న మా పెద్దకుమారుడు సందీప్, అమెరికా చూసే అవకాశాన్ని కల్పించి సోవియట్ యూనియన్ అమెరికాలు రెండింటినీ చూడగలిగిన కొద్దిమంది హైదరాబాద్ జర్నలిష్టులలో నన్ను కూడా చేర్చాడు. నాకు తెలిసి ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్లు ఐ వెంకటరావు,కే. శ్రీనివాసరెడ్డి  ఈ రెండు దేశాలను చూసినవారిలో వున్నారు. ఈ అవకాశం ఇకముందు  ఎవరికీ దొరికే వీలు కూడా లేదు. ఎందుకంటే అంత పెద్ద కమ్యూనిస్ట్ దేశం - అంగ వంగ కలింగ దేశాల మాదిరిగా విచ్చిన్నమై చరిత్ర పుటల్లో మిగిలిపోయింది. కాగా, మిత్రుడు మాగంటి కోటీశ్వర రావు పూనికతో ఎలాటి టెన్షన్ పడకుండా లభించిన పది సంవత్సరాల వీసాలతో నేనూ మా ఆవిడ నిర్మల, హైదరాబాదులో 2003 సెప్టెంబర్ ఆరో తేదీ శనివారం మలేసియన్ ఎయిర్ లైన్స్ లో బయలుదేరి కౌలాలంపూర్ మీదుగా సుమారు ముప్పయి గంటలు ప్రయాణం చేసి తిరిగి అదే రోజు, అంటే శనివారం నాడే అమెరికాలోని అతి పెద్ద విమానాశ్రయాల్లో ఒకటయిన లాస్ ఏంజెల్స్ చేరుకున్నాము. భూమండలానికి ఆవలవైపువున్న దేశానికి చేరడంవల్ల కాలగమనంలో వచ్చిన మార్పు ఇది. (2003)
(ఆరంభానికి ప్రారంభం) 

3, నవంబర్ 2016, గురువారం

రమణ దీక్షితులు


తిరుమల శ్రీవారి దేవాలయంలో ప్రధాన అర్చకుడిగా నలభై ఏళ్ళుగా విధులు నిర్వహిస్తున్న రమణ దీక్షితులు గురించి ఆయన మాటల్లోనే విందాం.
“నేను తిరుపతిలోనే పుట్టి పెరిగాను. మా తండ్రి గారు వేంకటపతి దీక్షితులు తిరుమల శ్రీవారి దేవాలయంలో ప్రధాన అర్చకులు.
“ నా చిన్న తనంలో, అంటే, 1960 ప్రాంతంలో తిరుపతి చాలా చిన్న పట్టణం. వూళ్ళో రెండు సినిమాహాళ్ళు, రెండే రెండు కార్లు, నాలుగు స్కూటర్లు వుండేవంటే నాటి పరిస్తితులను ఊహించుకోవచ్చు.
నా తలితండ్రులకి నేను ఏకైక సంతానాన్ని. మునిసిపల్ స్కూల్లో, ఎస్.వీ.ఆర్ట్స్ కాలేజీలో చదువుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీ;హెచ్.డీ. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాను.
“తరతరాలుగా మా కుటుంబీకులే శ్రేవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా వుంటూవస్తున్నారు. అంచేత ఏదో ఒకరోజు ఈ బాధ్యతలు నేను స్వీకరించాల్సి వస్తుందని నాకు తెలుసు.
“శ్రీవారి ఆలయంలో అర్చకత్వం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో నియమనిష్టలు అవసరం. అందుకే నా పెంపకం కూడా ఆ కోణంలోనే సాగింది. ప్రాధమిక పాఠశాల స్థాయి నుంచి గట్టి క్రమశిక్షణలో పెరిగాను. ఆహారవిహారాల్లో కూడా కఠిన నియమ నిబంధనలు ఉండేవి.
“ఇప్పటికీ కూడా నా భోజనం చాలా సింపుల్. ఉడకబెట్టిన కూరగాయలు తప్పించి ఒండిన అన్నం కూడా ముట్టను.
“దురదృష్టం నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుండగానే మా తండ్రి గారు విష్ణు సాన్నిధ్యం చేరుకున్నారు. దాంతో మా తండ్రి గారి అడుగు జాడల్లో అర్చకత్వం స్వీకరించాను. అదేసమయంలో నా చదువు కొనసాగించాను. మాలిక్యులర్ బయాలజీలో డాక్టరేట్ తీసుకున్నాను. అమెరికాలోని సౌత్ కరోలినా యూనివర్సిటీలో సీటు వచ్చింది.
  
 “అయితే వైఖానస ఆగమ సూత్రాల ప్రకారం తిరుమల ఆలయంలో పనిచేసే అర్చకులు సముద్రాన్ని దాటి ప్రయాణం చేయరాదు.ఈ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ నాకు లభించిన ఈ అవకాశాన్ని వదులుకున్నాను.
వంశపారంపర్యంగా నాకు లభించిన సువర్ణ అవకాశం అని అనుకోవడం లేదు. తన సేవకు అర్హులైన వారిని ఆ స్వామే నిర్ణయించుకుంటారు. అది దైవ నిర్ణయం తప్ప వేరు కాదు”