3, నవంబర్ 2016, గురువారం

నేరం యెట్లా అవుతుంది?

ఒక కలెక్టర్ తన కొడుకుని వెంటబెట్టుకుని రిపబ్లిక్ డే పెరేడ్ కి వెళ్ళాడు. ఒక ఎస్పీ తన కొడుకుని తన ఆఫీసులో కూచో బెట్టుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి భార్య భర్తకు కేరేజీతో భోజనం తీసుకువెళ్ళి తినిపించేది. ఒక ప్రధానమంత్రి తన బంధు మిత్రుల సమేతంగా ఒక దీవిలో హాలిడే గడిపి వచ్చారు. ఇలాంటి దేశంలో ఒక ప్రధాన అర్చకుడు చేసింది ఘోరం యెట్లా అవుతుంది ? నేరం యెట్లా అవుతుంది?

వదంతుల నడుమ అమెరికా అధ్యక్ష ఎన్నికలు


సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి ప్రతిఫలించినట్టు ఎక్కడో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతుంటే దాని ప్రభావం మన దేశంలో కూడా కనబడుతోంది. ఎన్నికల ప్రచారం మొదలయిన తొలి రోజుల్లో తన ప్రత్యర్ధి డెమొక్రాట్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ కంటే బాగా వెనుకబడి వున్నట్టు కానవచ్చిన రిపబ్లికన్  అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్,  పోలింగు ఘడియ దగ్గర పడే వేళకు బాగా పుంజుకుని ప్రత్యర్ధి మీద స్వల్ప ఆధిక్యత కనబరచారంటూ వెలువడిన వార్తలతో భారతీయ మార్కెట్లు గత బుధవారం నష్టాల్లో ముగిశాయి. వారిద్దరి నడుమా పోటీ నువ్వానేనా అనే రీతిలో సాగుతోందనే మీడియా వార్తల నేపధ్యంలో ఇన్వెస్టర్లు వేచి చూసే  ధోరణి అవలంబిస్తూ వుండడం దీనికి కారణమని విశ్లేషకుల అభిప్రాయం.
పిడుగులు పడ్డా అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు నాలుగేళ్ళకోసారి జరిగితీరుతాయి.  అదీ  ఆ నెలలో ఒక నిర్దిష్ట దినం రోజున. అంటే నవంబరు నెలలో మొదటి సోమవారం మరునాడు వచ్చే మొదటి మంగళవారం రోజున. దీనికి  ఇంత తిరకాసు ఎందుకు?,   మొదటి మంగళవారం అంటే సరిపోతుంది కదా అనే సందేహం రావచ్చు. దానికి ఒక కారణం వుంది. ఆ మొదటి మంగళవారం మొదటి తేదీనే రావచ్చు. అందుకే ఈ మెలిక. అంటే ఏమిటన్న మాట ఈ నిర్దిష్ట ఎన్నికల దినం నవంబరు రెండు నుంచి ఎనిమిది వరకు మారే అవకాశం వుంది. ఈ సారి సోమవారం ఏడో తేదీ కాబట్టి ఎన్నికలు ఆ మరునాడు మంగళవారం  ఎనిమిదో తేదీన జరగనున్నాయి. 1788 నుంచి ఇంతవరకు ఈ విధానం ఎటువంటి మార్పులు, మినహాయింపులు లేకుండా  అమలవుతోంది.


అంతా సజావుగా సాగితే  ఎనిమిదో తేదీన అమెరికన్ అధ్యక్ష ఎన్నికల క్రతువు పూర్తవుతుంది. గతంలో ఎన్నడూ లేనిది ఈసారి సజావుగా అనే పదం వాడడానికి కూడా కారణం లేకపోలేదు. ఈ తడవ  అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో సాగుతున్న ప్రచార సరళి గతంలో ఎన్నడూ ఎరగని అధమ స్థాయికి దిగజారి పోయింది. రకరకాల మీడియా ఊహాగానాలు జోరందుకున్నాయి. ట్రంప్ విజయావకాశాలు మెరుగుపడుతున్నాయన్న సంకేతాలు మొదటిసారి వెలువడడంతోనే వదంతులు కూడా లెక్కకు మిక్కిలి పెరిగిపోవడం మొదలెట్టాయి. ఇవి పతాక స్థాయికి చేరాయనడానికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. కొందరు  ప్రపంచ దేశాల నాయకులు రహస్యంగా సమావేశమై ట్రంప్ శ్వేతభవనంలోకి అడుగు పెట్టకుండా నిరోధించాలని వ్యూహ రచన చేస్తున్నారనీ, ఇందులో భాగంగానే ప్రెసిడెంట్ ఒబామా ఎన్నికల తేదీకి ముందుగానే దేశంలో మార్షల్  లా విధించి ఎన్నికలు వాయిదా వేయడమో, లేదా పూర్తిగా రద్దు చేయడమో చేస్తారనే చర్చలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. ఇవన్నీ గమనించినప్పుడు మన దగ్గరే పరిస్తితి కొంతలో కొంత మేలనిపించడం సహజం.
సరే! ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం పోటీలో వున్న ఇద్దరిలో గెలుపెవరిది అనే విషయంలో పోటీ మొదట్లో వున్న స్పష్టత ఇప్పుడు అంత స్పష్టంగా వున్నట్టు లేదు. ఇరువురి నడుమ జయాపజయాలు గురించిన అంచనాల్లో తొలుత కానవచ్చిన తేడా క్రమంగా తగ్గిపోయింది. ఇది  మీడియా ఊహాగానాల ఫలితం  కావచ్చు. తుదకు  అసలు ఫలితంలో తేడా కూడా వుండొచ్చు. పోలింగు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వదంతుల తీవ్రత కూడా బాగా పెరిగిపోతోంది. అమెరికాలో అనేక ఎన్నికలను చాలాకాలంగా చూస్తూ వస్తున్న వాళ్ళు సైతం గతంలో ఎన్నడూ ఎన్నికల ప్రచారం ఇంతగా గాడితప్పిన దాఖలాలు లేవంటున్నారు.
మీడియా ఎలాగూ సంచలన కేంద్రంగా పనిచేస్తుంది కనుక ఇటువంటి చర్చలు ఎలాగూ తప్పవు. ఎనిమిదో తేదీన ఎన్నికలు జరగకా తప్పదు. వేచి చూడడమే విజ్ఞుల పని.  ఫలితాల విషయం పక్కన బెట్టి అమెరికాలో రాజకీయ క్షేత్రంలో వస్తున్న గణనీయమైన మార్పులు గురించి కొంత చెప్పుకుందాం.   
గత నాలుగు దశాబ్దాల కాలంలో అమెరికాలో కార్పొరేట్ల ప్రాబల్యం పెరుగుతూ వస్తోంది. దేశంలో రాజకీయ వ్యవస్థని శాసించడానికి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు తమ నిధుల్లో సింహ భాగాన్ని వెచ్చిస్తున్నాయి. అందుకు తగ్గ ప్రతిఫలాలను ప్రభుత్వాలనుంచి రాబట్టుకుంటున్నాయి. 1970 కి పూర్వం కూడా ఈ కార్పొరేట్ల ప్రభావం ప్రభుత్వాల  మీద వుండేది కానీ ఇప్పటితో పోలిస్తే చాలా స్వల్పం. అరవయ్యవ దశకంలో అప్పటి పాలకులు జాతి శ్రేయస్సును దృష్టిలో వుంచుకుని పౌర సమాజానికి మేలు చేసే కొన్ని మార్పులు తలపెట్టారు. కార్పొరేట్ల లాబీ బలంగా లేకపోవడం వల్ల ఆ రోజుల్లో వాటిని నిలవరించగల సత్తా వాటికి లేకపోయింది. కొత్త మార్పులను అవి హరాయించుకోలేకపోయాయి. దాంతో తమ ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు వందలాది వ్యాపార వ్యవస్థలు, డెబ్బయ్యవ దశకం మధ్యలో మొట్టమొదటి సారి  లాబీ చేయగల సామర్ధ్యం ఉన్నవారిని తమ కంపెనీల్లో  నియమించుకుని ప్రభుత్వాలపై, వాటి విధానాలపై ప్రభావం చూపడం మొదలు పెట్టాయి. అంతే  కాదు తమకు అనుకూలంగా వ్యవహరించే పార్టీలకు అపారమైన నిధులు సమకూర్చిపెట్టడానికి కూడా శ్రీకారం చుట్టాయి. మొదట్లో ప్రభుత్వాన్ని శత్రువుగా పరిగణించిన కార్పోరేట్ శక్తులు కాలక్రమంలో పాలకులను తమకు ఉపయోగపడే శక్తివంతమైన సాధనంగా మార్చుకునే మార్గాన్ని కనుగొనే ప్రయత్నాలు సాగించాయి. ఏతావాతా జరిగింది, జరుగుతున్నది ఏమిటంటే  ఆ దేశంలో ఏ పార్టీ ప్రభుత్వం అయినా కార్పొరేట్ల అధీనంలోకి తెలిసో తెలియకో వెళ్లి పోతుండడమే.
ఈ పరిణామాలు అమెరికాకే పరిమితం కాదు. మన దేశంలో కూడా మొగ్గ తొడిగి పుష్పిస్తున్నాయి.
పొతే, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు, అధ్యక్షులకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు:
1789 లో జార్జ్ వాషింగ్టన్ పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ఆయన మీద పోటీ చేసేవారే కరువయ్యారు. నిజానికి ఆయన ఏ పార్టీకి ప్రతినిధిగా ఎన్నికల్లో పోటీకి నిలబడలేదు.
1872 లో యులిసెస్ ఎస్. గ్రాంట్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే పోటీ లేకుండా కాదు. ఆయన మీద  పోటీకి దిగిన ప్రత్యర్ధి పోలింగుకు ముందు హఠాత్తుగా మరణించడం వల్ల గ్రాంట్ మహాశయులు నేరుగా వైట్ హౌస్ లో చేరిపోయారు.
ఆండ్రూ జాక్సన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున వైట్ హౌస్ లో మద్యం ఏరులై పారింది. మందుబాబులు అర్ధరాత్రి అయినా కదలక పోవడంతో చివరికి జాక్సన్ చేసేది లేక మెల్లగా అక్కడి నుంచి జారుకుని ఆ రాత్రి ఓ హోటల్ లో గడపాల్సిన పరిస్తితి ఏర్పడింది.
ఆల్ స్మిత్ అనే అభ్యర్ధి మద్యపానాన్ని తన ఎన్నికల నినాదం చేసుకున్నాడు. ‘నాకు వేసే ప్రతి  ఓటు పూటుగా మందు కొట్టడానికి లైసెన్సు బిళ్ళ’ అంటూ  ప్రచారం చేసుకున్నాడు.
రూధర్ ఫోర్డ్ బి హేస్ తరహా వేరు. వైట్ హౌస్ లో ఇచ్చే విందుల్లో మందు సరఫరా చేసే పద్ధతికి ఆయన భరతవాక్యం పలికారు.
అమెరికా అధ్యక్షులు నివసించే భవనానికి వైట్  హౌస్  అని నామకరణం చేసింది ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్. అంతకు ముందు ఆ భవనాన్ని ప్రెసిడెంట్ నివాసం (ప్రెసిడెంట్స్ ఎగ్జిక్యూటివ్ మాన్షన్) అని పిలిచేవాళ్ళు.
రూజ్ వెల్ట్ కి మరో ఘనత కూడా వుంది. ఆయన నాలుగు పర్యాయాలు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజ్యాంగాన్ని సవరించి ఒకే వ్యక్తి రెండు తడవలకు మించి అధ్యక్షుడిగా ఎన్నిక కారాదని పరిమితి  విధించారు.
జేమ్స్ కె పోల్క్  నిజానికి అమెరికాలోనే కాకుండా యావత్  ప్రపంచంలో కూడా ఆదర్శ ప్రాయుడయిన రాజకీయ నాయకుడు. ఎందుకంటే ఎన్నికల సమయంలో తాను చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని అధికారంలోకి వచ్చిన తరువాత తుచ తప్పకుండా నెరవేర్చి చూపెట్టారు. అంతే కాదు, అవకాశం వున్నప్పటికీ రెండోసారి పోటీ చేయడానికి  ఆయన ఇచ్చగించలేదు.
అమెరికన్ అధ్యక్షులు అందరిలో విలియం హెన్రీ హారిసన్ అత్యంత దురదృష్టవంతుడు. ఎందుకంటే అధ్యక్షుడిగా ఎన్నికై,  వైట్ హౌస్ లో ప్రవేశించిన ముప్పయి రెండు రోజుల్లోనే కన్నుమూశారు.
గ్రోవర్ క్లీవ్ లాండ్ అధ్యక్షుడిగా వున్న రోజుల్లో ఎవరు ఫోను చేసినా, ఆపరేటర్  తో నిమిత్తం లేకుండా  ఆయనే స్వయంగా రిసీవ్ చేసుకునేవారు.   
వైట్ హౌస్ కి వచ్చిన అతిధులతో అధ్యక్షుడు కరచాలనం చేసే సంప్రదాయాన్ని థామస్ జెఫర్ సన్ ప్రవేశపెట్టారు. అంతకు ముందు ప్రెసిడెంటుని కలవడానికి  వచ్చినవారు గౌరవ పురస్సరంగా ఒంగి అభివాదం చేసేవారు.
రచయిత ఈమెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595

31, అక్టోబర్ 2016, సోమవారం

ఎంతచెట్టుకు అంత గాలి (కధానిక)


పది కోట్లు ఖరీదు చేసే రాజశేఖరం కారు ఎయిర్ పోర్ట్  ప్రైవేటు గేటు  దాటి టార్మాక్ మీద ఆగివున్న అతడి సొంత విమానం వద్దకు చేరుకుంది.  పైలట్  స్వయంగా వెంటబెట్టుకుని అతడ్ని లోపలకు తీసుకువెళ్ళాడు. కాసేపు తనని డిస్టర్బ్ చేయవద్దని సిబ్బందికి చెప్పి రాజశేఖరం  బెడ్ పై వాలిపోయాడు. ఆలోచనాలోచనాలకి నిద్ర ఎలా పడుతుంది.  ఒకటా రెండా! రెండే రెండు రోజుల్లో లక్షకోట్లు సిద్ధం చేయాలి? దేశదేశాల్లో విస్తరించివున్న తన వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలి పోకుండా వుండాలంటే అంత మొత్తం వెంటనే కావాలి. ఎలా అన్నదే జవాబు దొరకని ప్రశ్న.
రాజశేఖరాన్ని విమానం ఎక్కించి తిరిగివస్తున్నాడు అతడి కంపెనీ సీయీఓ బెనర్జీ. నున్నటి రోడ్డు మీద కారు మెత్తగా సాగిపోతోంది. కోటుజేబులో నుంచి తీసి చూసుకున్నాడు. కోటి రూపాయల చెక్కు. అవసరం అంటే బాసు మరో మాట అడ్డు చెప్పకుండా చెక్కు రాసి ఇచ్చాడు. అది సరే. మరో కోటి యెట్లా! వారం రోజుల్లో సర్దుబాటు చేస్తానని మాట ఇచ్చాడు. ఒక్కగానొక్క కూతురికి చక్కటి సంబంధం కుదిరింది. రెండు కోట్లు కట్నం. మరో మూడు  పెళ్లి ఖర్చులకి. పరపతి అంతా వాడితే,  మూడు కోట్లు సర్దుబాటు అయ్యాయి. మరో కోటి కావాలి. ఎల్లా అన్నదే కోటి రూపాయల ప్రశ్న.
బెనర్జీని ఇంట్లో దించి అటునుంచి అటే ఆఫీసుకు చేరుకున్నాడు అతడి పర్సనల్ అసిస్టెంట్ రామారావు. దారి మధ్యలో  బెనర్జీ ఇచ్చిన కోటి చెక్కు బ్యాంకులో డిపాజిట్ చేసాడు. తనకు అవసరం అని చెబితే ఏ కళన ఉన్నాడో మహానుభావుడు లక్ష రూపాయల కట్ట తన చేతిలో పెట్టాడు. ఆఫీసుకు వెళ్లి  కారు దిగుతుండగానే సెల్ మోగింది. చూడకుండానే అర్ధం అయిపొయింది ఆ ఫోను ఎవరు చేసారో. కుర్చీలో కూర్చుంటూ వుండగానే మరోసారి మోగింది. గతి లేక ఆన్సర్ చేసాడు.
“చూడండి రామారావు గారు, ఇప్పటికి ఆరు సార్లు డిఫాల్ట్ అయ్యారు. మంచి కంపెనీ అని మీ పర్సనల్ లోన్ విషయంలో ఇన్నాళ్ళు చూసీ చూడనట్టు ఊరుకుంటున్నాము. ఇక ఆగడం కష్టం. పైనుంచి  మాకు ప్రెషర్ పెరుగుతోంది. ఏం  చేస్తారో తెలవదు. రెండు రోజుల్లో ఆరు కిస్తీల బకాయిలు వడ్డీతో కలిపి ఒకేమాటు కట్టేయండి. ఇది ఫైనల్. వార్నింగు అనుకున్నా మేము చేయగలిగింది లేదు’        
అప్పు చేసి కొన్న కొత్త విల్లాలో గృహప్రవేశం చేసి ఏడాదికూడా కాలేదు. కొడుకూ, కోడలు ఉద్యోగాలు చేస్తున్నారన్న  భరోసాతో అంత అప్పు చేశాడు. అయితే నెల తిరగకుండానే వాళ్ళని బెంచిలో పెట్టారు. విల్లా  చాలా పెద్దది. కానీ,  అప్పు అంతకంటే  పెద్దదిగా కనబడుతోంది. బాసు ఇచ్చిన లక్ష వడ్డీకి కూడా సరిపోదు. మరి మిగిలిన పాతిక లక్షలు ఎల్లా.
ఇంటికి వస్తూనే డ్రైవర్ పరంధాములుకి లక్ష ఇచ్చి బ్యాంకులో కట్టమన్నాడు. బ్యాంకు వాళ్ళు ఒప్పుకుంటారో, లేదో! రామారావుకు మనసులో ఏదో మూల అనుమానం.
స్కూటర్ నడుపుతున్నాడే కాని పరంధాములు మనసు మనసులో లేదు. పిల్లాడు ఇంజినీరింగు మూడో ఏడు చదువుతున్నాడు. ఇంటిల్లిపాదీ కడుపు కాల్చుకుని చదివిస్తున్నారు. ఒక్క ఏడాది ఎలాగో లాక్కువస్తే వాడి జీవితం ఒడ్డున పడుతుంది. చదివి ఉద్యోగం చేసి ఇంటి కష్టాలు తీర్చాలని అతడూ శ్రద్ధగా చదువుతున్నాడు.  కానీ శ్రద్ధ ఒక్కటే సరిపోదు కదా! కాలేజీ  వాళ్లకి ఫీజు కూడా కావాలి. పదివేలు ఫీజుకట్టమని, లేకపోతే పేరు తీసేస్తామని  కాలేజీలో చెప్పి పది రోజులు అవుతోంది. అమ్మగార్ని అడిగితే ‘అయ్య ఎయిర్ పోర్ట్ కి వెళ్ళారు, వచ్చిన తరువాత అడిగి చూడు’ అన్నది. దిగాలు పడ్డ తన మొహం చూసి ఏవనుకున్నదో లోపలకు వెళ్లి ఓ ఐదువేలు తెచ్చి ఇచ్చి, మిగిలింది ఎక్కడయినా తెచ్చి  పని గడుపుకో’ అంది. బ్యాంకులో కట్టమని యజమాని ఇచ్చిన లక్ష రూపాయలు జేబులో వున్నాయి. కానీ తనకు కావాల్సింది ఐదు వేలే! అవి ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు?      
బ్యాంకులో డబ్బు కట్టి పరంధాములు ఇల్లు చేరేసరికి కధ వేరే విధంగా వుంది. పక్కింటి పిల్లాడికి  ప్రాణం మీదకు వచ్చింది. చిన్నాసుపత్రి నుంచి పెద్దాసుపత్రికి ఇలా తిప్పడంతోనే, అలా  తిరగడంతోనే ఆ పిల్లాడి తండ్రి చిక్కిపోయింది.  రోగం మాత్రం పెద్దది అయ్యింది.  'ఏవేవో పరీక్షలు జరూరుగా  చేయాలి, అయిదు వేలు కట్టమన్నారు. ఇల్లంతా వెతికినా యెర్ర ఏగానీ లేదు. చివరికి పరంధాములే వాళ్లపాలిట పరంధాముడు అయ్యాడు. అతడి పిల్లాడి ఫీజు డబ్బు ఆసుపత్రిలో ఫీజుగా మారింది.
అయిదు వేలు యెట్లా అన్న ప్రశ్న మళ్ళీ పదివేలకు రూపు మార్చుకుంది.
పిల్లాడి ఫీజు సమస్య కూడా జవాబు దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. 

26, అక్టోబర్ 2016, బుధవారం

పనికొచ్చే ముక్క


నాకొక మంచి నాస్తిక మితృడు వున్నాడు. ఒక రోజు వాళ్ళింటికి వెళ్ళే సరికి రేడియోలో ఆధ్యాత్మిక  ప్రవచనాలు వింటూ కనిపించాడు. నా మొహంలో ఆశ్చర్యం గమనించి అతడే చెప్పాడు.
ఆచార్యుల  బోధనల్లో దేవుళ్ళ ప్రసక్తి ఎలా వున్నప్పటికీ, మంచి జీవితం గడపడానికి పనికొచ్చే అనేక విషయాలు వుంటాయని, అంచేతే వాటిని క్రమం తప్పకుండా వింటుంటానని అన్నాడు.

భేషయిన మాట!   

24, అక్టోబర్ 2016, సోమవారం

ఈ భోగం ఎన్నాళ్ళు?

రాత్రంతా సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు సంచరిస్తున్నట్టుగా చప్పుళ్ళు. తెల్లారి బాల్కానీనుంచి కిందికి చూస్తే నల్ల తివాచీ పరిచినట్టు కొత్త రోడ్డు. 


కాంట్రాక్టర్ ఎవడో మంచివాడులాగా వున్నాడు, ఎవరికీ ఇబ్బంది లేకుండా రాత్రి సమయంలో పని పూర్తిచేశాడు. మూడు పొరల్లో వేశాడు. పైకి దిట్టంగానే కానవస్తోంది.
‘అయినా ఈ భోగం ఎన్నాళ్ళులే, గట్టిగా ఒక వాన పడిందాకనే’ అంటున్నాడు పక్క పోర్షన్ ఆయన. ఎవరి అనుమానాలు వాళ్ళవి. అందుకే లోగడ చెప్పుకున్నట్టు ప్రతి రోడ్డు పూర్తి చేయగానే ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పేరు, పర్యవేక్షణ చేసిన అధికారి వివరాలు, ఫోను నెంబర్లు, రోడ్డు ఖర్చు, వేసిన తేదీలతో సహా అక్కడే రోడ్డు పక్కన బోర్డులు పెట్టిస్తే ఆ రోడ్డు మంచి చెడుల బాధ్యులను నిర్ణయించినట్టు అవుతుంది. ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదు.

22, అక్టోబర్ 2016, శనివారం

చెత్త పేపర్లు


అపార్ధం చేసుకోకండి. ఇక్కడ కవి హృదయం పత్రికలు అనికాదు.
పత్రికల ద్వారా అనునిత్యం ఇంటింటికీ చేరుతున్న చెత్త అని అర్ధం.
అదిగో మళ్ళీ అపార్ధం మొహం పెట్టారు. ఇదేమీ బాగాలేదు. దిన పత్రికలు రాసుకొస్తున్న చెత్త అని కాదు,  ఇళ్ళకు మోసుకొస్తున్న చెత్తాచెదారం అని.
పత్రికల్లో పేజీలను మించి ప్రకటన కరపత్రాలు వాటిల్లో ఉంటున్నాయి. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వేర్వేరు డబ్బాల్లో వేయమంటున్నారు సర్కారు వారు. ఆ పనికి ఇది అదనం. టమాటాలు కిలో కేవలం యాభయ్ రూపాయలు మాత్రమే అనే దగ్గర మొదలు పెడితే, కోట్లకు పడగలెత్తిన ఆసాములు సయితం ఓ కన్నేసి చూడడానికి సంశయించే రమ్యహర్మ్య భవంతుల వరకు ఈ ప్రకటనల కరపత్రాలు, పత్రిక తెరవగానే ముందు కంట్లో పది ఆ తరువాత  ఇల్లంతా పరచుకుంటాయి. పత్రిక కొంటే ఈ చెత్త అదనం అన్నమాట.
పత్రికల సర్క్యులేషన్ నిర్ధారించడానికి ఏవేవో లెక్కలు వుంటాయి. ఓ పత్రికా మిత్రుడు (ఆయన నా మిత్రుడు, పత్రికలకు కాదు) సరదాగా ఓ మాట అన్నాడు, ‘ఏ పత్రికలో ఈ రకం చెత్త యెంత ఎక్కువ వుంటే అది అంత గొప్ప ప్రజాదరణ కలిగిన పత్రిక’ అని.
ఇక కొన్ని ఇంగ్లీష్ పత్రికలు ఈ చెత్తను జాతీయం చేసుకుని ఏకంగా తమ పత్రికల పేజీల్లోకే జొప్పించి అదనపు రాబడి పెంచుకుంటున్నాయనే అపవాదు వుంది. అది వేరే విషయం.
పైన చెప్పిన మిత్రుడే మరో మాట చెప్పారు.
“అనవసరంగా ఇంతంత పెట్టుబడులు పెట్టి పత్రికలు పెట్టడం ఎందుకు, ఏదో ఒక చిన్న పత్రికను ఇంట్లోనే ముద్రించి (సాంకేతికత పుణ్యమా అని ఆ వెసులుబాటు వుంది), టీవీలు చూస్తూ వార్తలు గిలికేసి  పెద్ద పెద్ద సర్క్యులేషన్ కలిగిన  పెద్ద పత్రికల పొట్టలో కూరితే, కాణీ ఖర్చులేకుండా ఇంటింటికీ చేరుతుంది కదా!”
మంచి ఐడియానే! ఆలోచిస్తే పోయేదేమీ లేదు, కాసింత టైం తప్ప.          

21, అక్టోబర్ 2016, శుక్రవారం

రాజకీయ వారసులు, వారసత్వ రాజకీయాలు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 23-10-2016, SUNDAY)
అది సంపద కావచ్చు, అధికారం కావచ్చు.
వాటిని కూడబెట్టినవారికి ఒకటే సమస్య, తమ వారసులకు వాటిని భద్రంగా ఒప్పచెప్పడం ఎలా అన్నదే!
ఒకడు వ్యవసాయం చేస్తూ లాభాలు గడిస్తూ పొలాలు కొంటూ పోతాడు. పిల్లలు ఉద్యోగాల పేరుతొ విదేశాలకు యెగిరి పోతుంటే ఆ భూముల్ని ఎవరు చూడాలి, ఎవరు కాపాడాలి, ఎవరు అనుభవించాలి?
పెద్దతనం మీద పడినప్పుడు అన్నేళ్ళుగా ఇంటి వ్యవహారాలపై పెత్తనం చేస్తూ వచ్చిన ఆ ఇంటి పెద్దమనిషికి పట్టుకునే పెద్ద బెంగ.
మరొకడు వైద్యం చేస్తూనో, ఇంకొకడు  వకీలుగా ప్రాక్టీసు చేస్తూనో పది తరాలకు సరిపడా పోగుచేస్తాడు. పోయేటప్పుడు తన కడుపున పుట్టిన పిల్లలకే  ఆ ప్రాక్టీసు ఒప్పచెప్పాలని తెగ మధన పడతారు.
అలాగే నటీనటులు, వ్యాపారస్తులు, పారిశ్రామిక వేత్తలు అందరికీ ఒకే కోరిక, తమ సామ్రాజ్యాలకు తమ పిల్లలే వారసులు కావాలని.  ఈ విషయంలో వీళ్ళందర్నీ తలదన్నే వర్గం ఒకటుంది, అది రాజకీయం.  
పూర్వం రాజులు, మహారాజులకి వారసులే రాజ్యానికి వచ్చేవారు. వారసుల నడుమ పొరపొచ్చాలు వస్తే మహా భారత యుద్ధాలు జరిగిన చరిత్ర మనది. రాజ్యాధికారం వారసత్వ హక్కు అని కొందరు, కాదు, రాజ్యం వీరబోధ్యం అంటూ మరికొందరూ చరిత్ర పుటల్ని రక్తసిక్తం చేసారు.
రాజకీయ వారసత్వం గురించి ముచ్చటించుకునే ముందు ఓ పూర్వకాలపు ముచ్చట చెప్పుకోవాలి.
ఒక రాజుగారికి వయసయిపోయింది. పేరుకు తొమ్మిదిమంది యువరాజులు వున్నారు కానీ వారందరూ పనికి పోతరాజులే కాని సింహాసనం మీద కూర్చోదగిన వాళ్ళు కాదు. తన వారసుడు ఎవరనే విషయంలో రాజుగారు తన ఆస్థాన గురువును సంప్రదించాడు. ‘తండ్రిగా అయితే నీకు ఇష్టం వచ్చిన వాడిని వారసుడిగా ఎంచుకో. రాజుగా అయితే రాజ్య క్షేమాన్ని దృష్టిలో ఉంచుకో’ అని గురువు సలహా ఇస్తాడు.
రాజులు, రాచరికాల సంగతి సరే. ప్రస్తుతం ప్రజాస్వామ్య యుగంలో జీవిస్తున్నాం. అయినా రాజకీయాల్లో ఈ వారసుల మాట పదేపదే వినబడుతోంది. మొన్నటికి మొన్న తమిళనాడులో డీ ఎం కే కురువృద్ధుడు కరుణానిధి  తన రాజకీయ వారసుడిగా చిన్న కుమారుడు స్టాలిన్ పేరు ప్రకటించి, ఆ పార్టీలో, తన కుటుంబంలో ప్రకంపనలు సృష్టించారు. ప్రస్తుతం అధికారంలో లేని పార్టీ కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం జరిగేదో తెలియదు.
ఈ పవిత్ర భారత దేశంలో ఒక విచిత్రమైన ద్వైదీభావం వుంది. ఇప్పటికీ ఎన్నికల్లో రాజకీయ వారసులే ఫలితాలను ప్రభావితం చేస్తారు. కానీ జనాన్ని విడిగా అడిగి చూడండి. తద్విరుద్ధంగా మాట్లాడతారు. నవతరం ఓటర్లలో  కొంత మార్పు కానవస్తోంది. కేజ్రీవాల్ పార్టీ పెట్టి ‘నేను భిన్నమైన వాడిని’ అంటే మురిసిపోయారు. ‘మా చుట్టూ పోలీసులు వుండరు, ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకోము, అధికారానికి వచ్చినా నేనూ మా  మంత్రులు బుగ్గ కార్లు వాడము, పెద్ద భవంతుల్లో ఉండము, అంతేకాదు, ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేయరు, అలాంటివాళ్ళకి టిక్కెట్లు ఇవ్వము’ అని తెగేసి చెబుతుంటే వినేవాళ్ళకు విచిత్రంగా అనిపించింది.
‘సెహభాష్, మనకు కావాల్సింది ఇలాంటి వాళ్ళే!’  అని జనం  క్యూలల్లో నిలబడి ఓట్లు వేసి గెలిపించారు.
అంటే, వారసత్వ రాజకీయాలతో, రాజకీయ వారసులతో జనాలు అంతగా విసుగెత్తి పోయారని అనుకోవాలా!
విసుగెత్తిపోయిన మాట నిజమే కానీ వారి  వరస పూర్తిగా మారలేదు.
ప్రస్తుతం వున్న లోక సభలో మూడింట రెండువంతుల మంది సభ్యులు నలభై ఏళ్ళ లోపువాళ్ళు. అయితే వారి దగ్గరి బంధువుల్లో చాలామంది రాజకీయాల్లో తలనెరిసినవాళ్ళే. ప్రస్తుత లోకసభలో ఇరవై మంది అత్యంత సంపన్నులయిన సభ్యుల్లో పదిహేనుమంది వారసత్వంగా  ఎన్నికల్లో గెలిచి వచ్చినవాళ్ళే కావడం గమనార్హం. మరో సంగతి ఏమిటంటే ఈ నలభై వసంతాల యువ పార్లమెంటు సభ్యులు పది మందిలో తొమ్మిది మంది రాజకీయ వారసులుగా కాంగ్రెస్ టిక్కెట్టు మీద గెలిచి సభలో అడుగుపెట్టారు.
దేశ రాజకీయాల తీరు తెన్నులు గమనించేవారికి తెలిసే వుంటుంది. అనేక నియోజకవర్గాల్లో ఒక కుటుంబం పెత్తనమే నడుస్తూ వుంటుంది. వాళ్ళు ఏ పార్టీలో వుంటే జనాలు ఆ పార్టీకే ఓట్లు వేస్తుంటారు.  వీటికి ఏ పార్టీ మినహాయింపు కాదుకాని, వామపక్షాలు, బీజేపీ కొంత మెరుగు.
ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో కూడా రాజకీయ వారసులు వున్నారు. అయితే పార్టీలు వాళ్ళ కుటుంబాల పెత్తనంలో ఉండడానికి ఒప్పుకోవు. కానీ, మన దేశంలో, పొరుగున వున్న పాకీస్తాన్ లో, ఇంకా ఫిలిప్పీన్స్ లో పరిస్తితి ఇందుకు భిన్నం. మన దేశంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ లోనే కాకుండా, బిజూ జనతా దళ్, రాష్ట్రీయ లోక్  దళ్, సమాజ్ వాదీ పార్టీ, నేషనలిష్ట్ కాంగ్రెస్  పార్టీ  వంటి  ప్రాంతీయ పార్టీల్లో కూడా ఈ వారసత్వ సంస్కృతి వుంది.
వారసుల గొడవతో సంబంధంలేని రాజకీయ నాయకుల జాబితా తయారు చేసి అక్షర క్రమంలో  కుదిస్తే అదిలా వుంటుంది.
అహమద్ పటేల్, అరవింద్ కేజ్రీవాల్, జయలలిత, మమతా బెనర్జీ, మన్మోహన్ సింగ్, మాయావతి, నరేంద్ర మోడీ, నితీష్ కుమార్, రాహుల్ గాంధి.