20, నవంబర్ 2014, గురువారం

ఇదే తేలిక

  
చిదంబర స్వామి  చెన్నై సముద్ర తీరంలో ఏకాంతంగా ధ్యానం చేసుకుంటూ వుండగా హఠాత్తుగా దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని విలాసంగా అన్నాడు.
చిదంబరస్వామికి ముందు నోట మాట రాలేదు. తరువాత తెలివి తెచ్చుకుని  'స్వామీ! ఇక్కడ నుంచి నేరుగా సముద్రం మీద శ్రీలంకకు వంతెన నిర్మిస్తే ప్రజలకు ఎంతో సదుపాయంగా వుంటుంది. దయచేసి నలుగురికీ ఉపయోగపడే ఆ వరం ప్రసాదించు' అన్నాడు.
దేవుడు మరింత విలాసంగా నవ్వుతూ అన్నాడు.
'నేనేదో నీ భక్తికి మెచ్చి వరం కోరుకోమంటే నువ్వేమో జనాలు వాళ్ళ  అవసరాలు అంటూ ఏవేవో సాధ్యం కాని కోరిక కోరుతున్నావు. మళ్ళీ అడుగుతున్నాను. నీకేదయినా పనికొచ్చే విషయం వుంటే అడుగు. తీర్చేసి వెడతాను'
'అలా అయితే అల్లాగే అడుగుతాను. నాకు పెళ్ళయి పదేళ్ళవుతోంది. నా భార్య మనసు ఇంతవరకు అర్ధం కాలేదు. ఆడవారి మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలా?'
దేవుడి మోహంలో నవ్వు మాయమయింది.
'ఇందాక ఏదో శ్రీ లంకా, వంతెన అంటున్నావు. ఉత్త రోడ్డు వంతెన చాలా లేక దానికి రైలు వంతెన కూడా వుంటే బాగుంటుందా చప్పున చెప్పు'



(సురేష్ బాబు కొల్లూరు పోస్ట్ చేసిన ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)

NOTE: Courtesy Image Owner)

అలవాటులో పొరబాటు

వార్త : హైదరాబాదు కేబీఆర్ పార్కులో కాల్పులు
వ్యాఖ్య : అమ్మయ్య! కాల్చింది పోలీసు కనుక సరిపోయింది. అలవాటుగా గురి తప్పి వుంటుంది.


19, నవంబర్ 2014, బుధవారం

మీ ఆడగుర్రం ఫోను చేసింది



ఏకాంబరం ఉదయం లేచి వరండాలో పేపరు చదువుకుంటున్నాడు.  ఇంతలో భార్య సూరేకాంతం అప్పడాల కర్రతో ఏకాంబరం మాడుపై ఒక్కటిచ్చింది. ఏకాంబరం కుయ్యో మొర్రో అంటూ మొత్తుకున్నాడు. మొత్తుకోవడం అయిపోయిన తరువాత ఎందుకలా కొట్టావ్ అని అడిగాడు.
'ఎందుకా' సూరేకాంతం చెప్పింది.       
'మీ ప్యాంటు జేబూలో కల్యాణి అని రాసిన చిట్టీ వుంది. ఎవత్తది ముందా సంగతి చెప్పండి'
ఏకాంబరానికి నిలువు గుడ్లు పడ్డాయి. కానీ వెంటనే తమాయించుకున్నాడు.
'ఓస్ ఆ కళ్యాణా! అది రేసు గుర్రం. మొన్న నా ఫ్రెండు గుర్నాధం కల్యాణి మీద పందెం కాయమని గుర్తుగా రాసిచ్చాడు'
అది విని సూరేకాంతం నొచ్చుకుంది. మంగళ సూత్రాలు కళ్ళకద్దుకుని లేచి వెళ్లి ఇంత వెన్నపూస తెచ్చి ఏకాంబరం మాడుకు రాసింది.
వారం తిరిగిందో లేదో ఏకాంబరం మాడు మళ్ళీ పగిలింది. ఈసారి సూరేకాంతం అప్పడాలకర్ర కాకుండా ఇనుప గరిటె తిరగేసి కొట్టింది. ఆ దెబ్బకు ఏకాంబరం మూర్చపోయాడు. తేరుకున్న తరువాత షరామామూలుగా అడిగాడు భార్యని, ఈసారి కొట్టడానికి కారణం ఏమిటని.
భార్య చెప్పిన జవాబు విని ఏకాంబరం మళ్ళీ మూర్చపోయాడు.
'మీ కల్యాణి - అదే మీ ఆడగుర్రం - ఇందాక మీ కోసం ఫోను చేసింది'

(కొల్లూరు సురేష్ బాబు గారి ఇంగ్లీష్ పోస్ట్ కి స్వేచ్చానువాదం)

NOTE : Courtesy Image Owner 

పార్టీ ఫిరాయింపులు ఎవరి పుణ్యం? ఎవరికి శాపం?

(Published in 'SURYA' telugu daily in its Edit page on 20-11-2014, Thursday)

పార్టీ ఫిరాయింపుల పర్వం తెలంగాణా అసెంబ్లీని కుదిపివేస్తోంది. తమ పార్టీ ఉనికికే ప్రశ్నార్ధకంగా మారిన ఈ అంశాన్ని కాంగ్రెస్ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. సభనుంచి  వరుస సస్పెన్షన్ లకు  గురయిన కాంగ్రెస్ సభ్యులు ఏకంగా గవర్నర్ కే పిర్యాదు చేసారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనీ, టీ.ఆర్.ఎస్. దుందుడుకు చర్యలకు ముకుతాడు వేయాలనీ కోరారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును  అనర్హుడిగా ప్రకటించి  తక్షణం ఆయన్ని ఆ పదవినుంచి తప్పించాలని విజ్ఞప్తి చేసారు.  
పార్టీ ఫిరాయింపులను దొంగతనంతో సమానంగా పరిగణించాలని ఫిరాయింపుల తాకిడితో తల్లడిల్లుతున్న తెలంగాణా కాంగ్రెస్ కోరుతున్నట్టు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి.
నిజమే. ఒక పార్టీ టిక్కెట్టుపై ఎన్నికయిన వారిని మరో పార్టీలోకి తీసుకోవడం అంటే ఒక రకంగా అది దొంగతనమే. మరొకరి సొత్తును అపహరించడమే. కానీ 'నేను చేస్తే ఒప్పు నువ్వు చేస్తే తప్పు' అనే ద్వంద్వ వైఖరే ఈ వాదానికి బలం లేకుండా నిర్వీర్యం చేస్తోంది.  
గతంలో ఎన్నికలకు ముందూ, లేదా ఎన్నికలు ముగిసిన తరువాత కొద్దికాలం పాటు ఈ ఫిరాయింపులు నడిచేవి. మారుతున్న కాలానికి పరిస్తితులకు  అనుగుణంగా ఇప్పుడవి నిత్యకృత్యంగా మారాయి. దీనికి ఎవ్వరు కారణం అంటే అన్ని పార్టీలకూ ఇందులో అంతో ఇంతో భాగం వుంది. ఈ సంస్కృతి ప్రబలడానికి అందరూ ఎంతో కొంత పాత్ర పోషించబట్టే గట్టిగా తమ వైఖరిని సమర్ధించుకోవడానికి అదే అడ్డం పడుతోంది. ఫిరాయింపులను పోత్సహించేవారు, ఫిరాయింపులవల్ల నష్టపోయేవారిని ఉద్దేశించి 'నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష' అని ఎద్దేవా చేయడానికి వీలు కల్పిస్తోంది.
తెలంగాణా ప్రాంతానికి సంబంధించి ఫిరాయింపుల తాకిడికి ఎక్కువగా నష్టపోయింది తెలుగు దేశం పార్టీ. 'ఇక తెలంగాణాలో టీడీపీకి భవిష్యత్తు లేద'ని అధికారపక్షం అయిన టీ.ఆర్.ఎస్. నాయకులు చేసిన,  చేస్తున్న ప్రచారానికి భయపడో, లేదా తమ భవిష్యత్తును మరింత ఖచ్చితంగా చెప్పాలంటే వర్తమానాన్ని  పదిలం చేసుకోవాలనే తాపత్రయంతోనో కొందరు టీడీపీ నాయకులు పార్టీని విడిచిపెట్టి టీ.ఆర్.ఎస్. తీర్ధం పుచ్చుకోవడం జరిగింది. మరికొంతమంది తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఈ బాటలోనే వున్నారని ప్రచారం సాగుతోంది. అధికారంలో వున్నన్నాళ్ళు  పార్టీని అంటిపెట్టుకుని  వుండి, అన్ని రకాల పదవులను, వాటి తాలూకు వైభోగాలను  అనుభవించి, తీరా  అధికారానికి దూరం కాగానే పార్టీని విడిచిపెట్టి  వెళ్ళడం కేవలం స్వార్ధం కోసమే అని టీడీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలకు ప్రజల్లో ఆదరణ దొరకకపోవడానికి కారణం  కూడా గతంలో వారు అనుసరించిన ఇటువంటి  విధానాలే. గత అయిదేళ్ళ కాలంలో ఇలాటి సందర్భాలు అనేకం అందరికీ అనుభవైకవేద్యం. 'వేరే పార్టీవాళ్లు తమ పార్టీలోకి వస్తే  అది తమ ఘనత అనీ, తమ  శక్తి సామర్ధ్యాలపట్ల అపార నమ్మకంతోనే  వాళ్ళు తమ పార్టీలో చేరారనీ లోగడ ఘనంగా చెప్పుకున్న విషయమే ఇప్పుడు ముందరి కాళ్ళకు బంధంగా మారింది. పార్టీ ఫిరాయింపులకు గురవుతున్న అన్ని పార్టీలదీ ఇదే వరస. ఎందుకంటె ఎవ్వరూ దీనికి అతీతులు కాదు. ఎవ్వరికీ పార్టీ ఫిరాయింపులనేవి అంత అంటరానివి కావు. ఎన్నికలకు ముందు  కాంగ్రెస్ లో ఇక భవిష్యత్తు  లేదు అని నిర్ధారణ చేసుకున్న కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు టీడీపీలో చేరడానికి  బారులు తీరినప్పుడు, వారిని పార్టీలో చేర్చుకోవడం నీతి బాహ్యం అని భావించి తలుపులు మూసివున్నట్టయితే ఆ పార్టీకి ఇప్పుడు విమర్శించడానికి తగిన నైతిక బలం చేకూరివుండేది. ఎన్నికలు ముగిసి ప్రజలు తమకు పూర్తి స్థాయిలో అధికార పగ్గాలు అప్పగించిన తరువాత కూడా వై.సీ.పీ. నుంచి గెలుపొందిన ఒక పార్లమెంటు సభ్యుడిని   టీడీపీలో చేర్చుకున్నప్పుడు కూడా ఆ చర్య అనైతికం అని  అనిపించకపోవడం అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట, అప్పుడది రాజకీయ అవసరం. కాబట్టి జంపు జిలానీలకు పార్టీలో స్థానం కల్పించారు. ఈ పార్టీ ఆ పార్టీ అనికాదు అందరూ ఈ విషయంలో ఒకే మాట, ఒకే బాట.  అనుకూలంగా వున్నప్పుడు ఒక మాటా, ప్రతికూలంగా వున్నప్పుడు మరో మాటా చెబుతూ వచ్చే ఇటువంటి రెండు నాలుకల ధోరణి కారణంగానే రాజకీయ నాయకుల మాటల పట్ల  ప్రజలకు విశ్వాసం కొరవడుతోంది.  
సరే. ఇదంతా వర్తమానం. ముందు ఎలా వుంటుందో ఎవరికీ తెలియదు. కాబట్టి గతంలోకి కొంత తొంగి చూస్తె ముందేం  చేస్తే బాగుంటుంది అన్న విషయం బోధపడే అవకాశం వుంటుంది.  
పార్టీ ఫిరాయింపులకు మొదటి బీజం పడింది, స్వతంత్ర భారతంలో 1967 లో జరిగిన నాలుగో సార్వత్రిక ఎన్నికల  అనంతరం.  ఆ విత్తనం   యెంత బలంగా పడిందంటే  ఈ ఫిరాయింపుల ఫలితంగా 1967 - 1973  మధ్య ఆరేళ్ళ కాలంలో పదహారు రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయాయి. ప్రజలచేత ఎన్నికయిన  మొత్తం రెండువేల ఏడువందలమంది ప్రజా ప్రతినిధులు,  తాము ఎన్నుకున్న వోటర్ల ప్రమేయం లేకుండా  వేరే పార్టీల్లో చేరిపోయారు. 1967  నుంచి మూడేళ్ళలో ప్రతి అయిదు మంది ఎమ్మెల్యేలలో ఒకరు పార్టీ మారారంటే ఫిరాయింపులు యెంత తీవ్రంగా జరిగాయో అర్ధం చేసుకోవచ్చు. ఏదో ప్రతిఫలం లేకుండా ఈ గోడ దూకడాలు జరగవు అనే నమ్మకానికి ఊతం ఇవ్వడానికా అన్నట్టు  అలా దూకిన వాళ్ళలో పదిహేనుమంది ఏకంగా ముఖ్యమంత్రులు అయ్యారు. 212 మంది మంత్రులు కాగలిగారు. వ్రతం చెడ్డా ఫలితం దక్కించుకున్న బాపతు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ వికృత పోకడలకు మొదటి అడ్డుకట్ట వేయడానికి మన రాజకీయ నాయకులకు దాదాపు పదిహేడేళ్ళు పట్టింది.
1984  డిసెంబర్  29 వ తేదీన కర్ణాటకలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం   28 స్థానాలకుగాను నాటి పాలకపక్షం అయిన జనతా పార్టీని  మట్టి కరిపించి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వం లోని కాంగ్రెస్ ఇరవై నాలుగు సీట్లు గెలుచుకుని తన సత్తా ప్రదర్శించింది. ఆనాడు రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి  రామకృష్ణ హెగ్డే  వోటమికి నైతిక బాధ్యత వహించి గవర్నర్ కు మంత్రివర్గం తరపున రాజీనామా పత్రం సమర్పించారు. మామూలుగా అయితే అటువంటి పరిస్తితుల్లో గవర్నర్ లేదా కేంద్ర ప్రభుత్వం ముందు రెండు ప్రత్యామ్నాయాలు.  ఒకటి  జనతా పార్టీనుంచి  ఫిరాయింపులు ప్రోత్సహించి  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం. లేదా, రాష్ట్రపతి పాలన  విధించడం.  అంతకుముందు  శ్రీమతి ఇందిరాగాంధీ రాజకీయ ఎత్తుగడలకు అలవాటు పడిన వారందరూ యువనేత రాజీవ్ గాంధీ కూడా తల్లి బాటలోనే పార్టీ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారని అనుకున్నారు. అయితే రాజీవ్ గాంధీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, కర్ణాటకలో అసెంబ్లీ రద్దు చేయడానికి వీలుగా గవర్నర్ కు స్వేచ్ఛ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులకు రాజీవ్ యెంత వ్యతిరేకం అన్నది ఈ ఒక్క ఉదంతంతో తేటతెల్లమయింది. అంతేకాదు, రాజీవ్ గాంధీ పార్టీ ఫిరాయింపులను చాలా తీవ్రంగా తీసుకున్నారు. ప్రధానమంత్రి పదవి స్వీకరించిన రెండోవారంలోనే పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాలని, అందుకు రాజ్యాంగాన్ని సవరించి ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. ఇక ఏమాత్రం కాలయాపన చేయకుండా పార్లమెంటులో తమ పార్టీకి వున్న తిరుగులేని  ఆధిక్యతను ఆసరాగా చేసుకుని   52 వ రాజ్యంగ  సవరణ ద్వారా ఈ చట్టాన్ని తీసుకువచ్చి ఈ దశగా తొలి అడుగు వేసారు. ఏ పార్టీ అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా ఇటువంటి చట్టాన్ని తీసుకువచ్చిందో అదే పార్టీ కాలక్రమంలో ఫిరాయింపులకు పుట్టిల్లుగా మారింది. అయితే ఈ విషయంలో ఏ ఒక్క పార్టీకి మినహాయింపు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటె ప్రతి పార్టీ తన స్వప్రయోజనాలకోసం ఈ చట్టానికి తూట్లు పొడవడమే కాకుండా చట్టంలోని కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకుని పార్టీ ఫిరాయింపులను యధేచ్చగా ప్రోత్సహిస్తూ రావడం మరో విషాదం.      
ఈ ఏడాది జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో మన రాష్ట్రానికి సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన  ఫిరాయింపులు చోటుచేసుకున్నాయి.
ఎన్నికలకు  ముందు వివిధ పార్తీలకు  చెందిన  పందొమ్మిదిమంది సీనియర్ నాయకులు తమ పార్టీలకు గుడ్ బై చెప్పి  వేరే పార్టీల్లో చేరిపోయి పోటీ చేసారు. వీరిలో పదహారుమంది సిట్టింగు ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఆఖరు నిమిషంలో గోడ దూకాలని  తీసుకున్న వారి నిర్ణయానికి ప్రజల ఆమోదం లభించలేదు. ఫలితంగా  వోటమి చవిచూడాల్సి వచ్చింది.
టీడీపీ  అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా చివరి నిమిషంలో ఇరవై ఆరుమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులకు తెలుగుదేశం తీర్ధం ఇవ్వడమే కాకుండా, టిక్కెట్లు, బీ ఫారాలు ఇచ్చి ఎన్నికల బరిలో నిలబెట్టారు. అయన వ్యూహం సగం సగం  పనిచేసింది. వారిలో పదమూడుమంది గెలిచారు. మరో పదమూడుమంది పరాజయం పాలయ్యారు.
అలాగే తెలంగాణా ప్రాంతంలో టీ.ఆర్.ఎస్.  అధ్యక్షుడు కేసీయార్  సయితం ఇదే ఎత్తుగడ అనుసరించారు. ఆయన వేరే పార్టీల్లోని పదమూడుమంది సీనియర్లను పార్టీలో చేర్చుకుని ఎన్నికల  గోదాలో నిలబెట్టారు. కాకపోతే ఈ ప్రయోగం  మిశ్రమ ఫలితాలను  ఇచ్చింది. వీరిలో ఎనిమిది మంది వోడిపోగా, అయిదుగురు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ సయితం ఎన్నికల  చివరి ఘడియలో ఇద్దరు సిట్టింగు ప్రత్యర్ధి  ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని  పోటీకి నిలబెట్టింది కానీ వారిరువురూ వోడిపోయారు.
ఈ రాజకీయ కప్పదాట్లు అనేవి మన దేశానికీ, మన ప్రాంతాలకు  మాత్రమే పరిమితం కాదు. అనేక దేశాల్లో ఈ సంస్కృతి రెక్కలు విప్పుకుని విస్తరిస్తోంది. ఉదాహరణకు  నైజీరియా. వచ్చే ఏడాది అక్కడ జరిగే ఎన్నికల మాటేమో కానీ రాజకీయ నాయకుల  పార్టీ మార్పిళ్లు మాత్రం చాలా వేగంగా పెద్దఎత్తున సాగుతున్నాయి. లేబర్ పార్టీ అభ్యర్ధిగా గెలిచి గవర్నర్ అయిన ఒలుసేగం మిమికో  గాలివాటం చూసుకుని ఆ పార్టీకి  రాం  రాం చెప్పేసారు. 2009 ఫిబ్రవరిలో ఆయన ఆండో స్టేట్  గవర్నర్ అయి,  తిరిగి  2012 అక్టోబర్ లో సయితం అయన అదే లేబర్ పార్టీ టిక్కెట్టు పై మళ్ళీ గెలిచి మళ్ళీ  గవర్నర్ కాగలిగారు. ఆ రాష్ట్రానికి  ఇలా రెండోసారి వరుసగా గవర్నర్ అయిన వారు ఎవ్వరూ లేరు. లేబర్ పార్టీ పుణ్యమా అని అలాటి రికార్డు అయన సొంతం అయింది.  కానీ మిమికో ఈసారి రూటు మార్చి పాలకపక్షంలో దూరిపోయి తన అదృష్టాన్ని మరో రకంగా పరీక్షించుకునే పనిలోపడ్డారు.

'పిల్లి  చనిపోయేలోగా ఏడు (గండాలు) చావులు తప్పించుకుంటుంది' అని ఆంగ్లసూక్తి.  అనంబ్రా రాష్ట్ర మాజీ గవర్నర్  డాక్టర్ పీటర్ ఓబీ ఈ సామెతకు సరిగ్గా అతికినట్టు  సరిపోతారు. ఈయన గారు అధికారంలో వున్న రోజుల్లో ఆ అధికారాన్ని దుర్వినియోగం  చేయడం ఎల్లా అనే ఒక్క దానిమీదనే దృష్టి పెడతారని, వేరే ధ్యాసలు ఏవీ  పెట్టుకోరని ఆయనకో పేరుందని అంటారు. అనడం ఏమిటి ఆయనపై ఇలాటివి చాలా కేసులు వున్నాయి. ఆరోపణలు వచ్చినప్పుడల్లా పదవి పోగొట్టుకోవడం,  మళ్ళీ  కోర్టు నుంచి ఉపశమన ఉత్తర్వులు తెచ్చుకుని తిరిగి పదవి పొందడం ఆయనకు అలవాటుగా మారింది. అదేమి  చిత్రమో తెలియదు కానీ ప్రతిసారీ కోర్టు రూలింగులు ఆయనగారికి అనుకూలంగానే వచ్చేవి. అందుకే పిల్లి ఏడు  గండాలు తప్పించుకున్నట్టు ఆయనకూడా ప్రతిసారీ వొడ్డున పడగలుతున్నారు. అన్ని తెలివితేటలు ఉండబట్టే ఈ సారి ఎన్నికలకు ఏడాది ముందే ఆయన ముందు చూపుతో పాలకపక్షం పీడీపీలో చేరిపోయారు. అంతా ఇలా అధికారపక్షం  వైపు దూకుతుంటే పాలక పక్షానికి  చెందిన  నాయకుడు, ప్రస్తుత  పార్లమెంటు స్పీకర్ అయిన అమిను తంబువాల్, ఈ మధ్యనే తన సొంత పార్టీ పీడీపీ ని వొదిలి పెట్టి ప్రతిపక్షం ఏపీసీ లో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. చూడాలి ప్రజలు ఎవరి అదృష్టాన్ని  ఎలా తిరగరాస్తారో. (19-11-2014)


(కార్టూనిస్ట్ శ్రీధర్ కి కృతజ్ఞతలతో)

18, నవంబర్ 2014, మంగళవారం

పత్రికల తలరాతలు

(ఒకానొక పత్రిక ప్రచురించడానికి సంకోచించిన వ్యాసం ఏమిటని పాలా కొండల రావు గారు, జిలేబీ గారు అడిగారు. అది ఇదే)


పత్రికల తలరాతలు

పూర్వం సోవియట్ యూనియన్ కమ్యూనిష్టుల ఏలుబడిలో వున్న కాలంలో – ఇజ్వెస్తియా, ప్రావ్దా అనే రెండు రష్యన్ పత్రికలు రాజ్యం చేస్తూ వుండేవి. ఇజ్వెస్తియా ఆనాటి సోవియట్ ప్రభుత్వ అధికార పత్రిక. (ఇజ్వెస్తి అంటే ‘వార్త ’ అని అర్ధం). పొతే, ప్రావ్దా. ఇది కమ్యూనిస్ట్ పార్టీ పత్రిక. (ప్రావ్దా అంటే ‘నిజం’) వీటి సర్క్యులేషన్ కోట్లలో వుండేదంటే నమ్మడం కష్టం. కానీ నిజం. ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో నేను ‘రేడియో మాస్కో’ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు – మాస్కోలో ప్రతి రష్యన్ పౌరుడి చేతిలో ఈ రెండింటిలో ఏదో ఒక పత్రిక విధిగా దర్శనమిచ్చేది. గోర్భచెవ్ - ‘గ్లాస్నోస్త్’ పుణ్యమా అని భావ వ్యక్తీకరణ స్వేచ్చ లభించిన రష్యన్లు – ‘ఇజ్వెస్తియా లో ప్రావ్దా లేదు – ప్రావ్దా లో ఇజ్వెస్తియా లేదు’ అని చెప్పుకుని నవ్వుకునేవాళ్ళు. 


ప్రభుత్వాలు కానీ, పార్టీలు కానీ నడిపే పత్రికల్లో విశ్వసనీయత మాట అటుంచి – ఆ పత్రికలు వాటి కరపత్రాలుగానో, ప్రచార పత్రాలుగానో మిగిలిపోతాయి తప్ప – ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించగల పటిష్ట పునాదులుగా పనికిరావన్న థియరీ ఒకటుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో వుండడం వల్లనే ఆకాశవాణి, దూరదర్శన్ వార్తలకు విశ్వసనీయత ప్రశ్నార్థకమయిందని చెప్పేవారు కూడా లేకపోలేదు.

ఇప్పుడు జరుగుతున్న చరిత్ర గమనిస్తుంటే – ఈ సిద్ధాంతానికి కూడా కాలం చెల్లిపోతున్నదన్న సూచనలు కానవస్తున్నాయి. పార్టీలు, ప్రభుత్వాలే కాదు – ప్రైవేటు రంగంలో ప్రచురితమవుతున్న పత్రికల పరిస్తితి సయితం ఇందుకు భిన్నంగా లేదన్న భావన ఊపిరి పోసుకుంటోంది. పార్టీలనూ, ప్రభుత్వాలనూ తామే శాసించగలమన్న ధీమా ప్రబలడమే దీనికి కారణం. పైపెచ్చు, ఏదయినా విషయం ప్రజలకు చేరాలంటే ఈనాడు మీడియాను మించిన మార్గం లేకపోవడం కూడా ఈ ధీమాకు దన్ను ఇచ్చింది. అందుకే సమాజంలో మీడియా వారంటే అన్ని వర్గాల్లో అంత మన్ననా మర్యాదా. అలాగే అంత భయం బెరుకు కూడా.

గతంలో, ఒక ముఖ్యమంత్రి దగ్గర పీఆర్వో గా పనిచేసిన అధికారి, ఏదయినా పనిపై ముఖ్యమంత్రిని కలవాలని వచ్చిన వారికి ఒక మార్గం చెబుతుండేవారు. విజ్ఞప్తి పత్రాలు ఇచ్చేబదులు, యే జర్నలిష్టునయినా పట్టుకుని ‘ఆ విషయం’ పత్రికలో వచ్చేలా చూసుకోమని సలహా ఇచ్చేవారు. అలా వచ్చిన వార్తపై ముఖ్యమంత్రి స్పందించి ‘తక్షణచర్య’ తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు ప్రెస్ రిలీజ్ ఇచ్చేవారు. పత్రికల్లో పడే వార్తలకు గౌరవం ఇస్తారనే మంచి పేరు ముఖ్యమంత్రికి రావడం తో పాటు , ఆ వార్తలు రాసే జర్నలిష్టులకు ‘పలుకుబడి’ కూడా పెరిగింది. ఈ ‘ఉభయతారక విధానం’ ఆ పీఆర్వోకి ‘అత్యంత సమర్ధుడైన అధికారి’ అనే కితాబుని కట్టబెట్టింది.

ఒక పెద్ద పత్రికలో వార్త పడ్డప్పుడు జనం దాన్ని గురించి మాట్లాడుకుంటారు. చదివిన వాళ్ళు దానిపై మరింత చర్చించుకుంటారు. నిరక్షురాస్యులయిన వారు ఆ వార్త విని ‘ఔనా’ అనుకుంటారు. అధికారులు స్పందిస్తారు. అనధికారులు వీలునుబట్టి ఖండిస్తారు లేదా హర్షిస్తారు. సాధారణంగా జరిగే తంతు ఇది. నిజాయితీ, నిబద్ధత, విశ్వసనీయత వార్తకు ప్రాణం పోస్తాయి. ఇవి లేని వార్తకు ప్రాణం వుండదు. ప్రామాణికం వుండదు. కానీ, ఈనాడు ఈ మూడింటికీ ఏమాత్రం విలువ ఇస్తున్నారో తెలియని విషయం కాదు.

వార్తకు ప్రాణం పొయ్యడం కంటే పత్రికల మనుగడే ముఖ్యం అనుకున్నప్పుడు –పత్రికల ద్వారా సాధించాల్సిందీ, సంపాదించాల్సిందీ ఇంకేదో వుందనుకున్నప్పుడు – పత్రికా స్వేచ్చకు అర్ధమే మారిపోతుంది.

‘కలం కూలీ’గా తనను తాను సగర్వంగా చెప్పుకున్న సుప్రసిద్ధ పాత్రికేయులు, కీర్తిశేషులు జి. కృష్ణ గారన్నట్టు – ‘పత్రికల రాతలే వాటి ‘తలరాతలను’ మారుస్తాయి.
  

17, నవంబర్ 2014, సోమవారం

పత్రికాస్వేచ్ఛకు సరికొత్త భాష్యాలు

  

అవి ఎమర్జెన్సీ రోజులు.

హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తవిభాగంలో నేను కొత్తగా అడుగుపెట్టాను.



 పత్రికా స్వేచ్చ పట్ల అపరితమయిన గౌరవాభిమానాలతో జర్నలిజాన్ని  వృత్తిగా స్వీకరించిన నా స్నేహితుడొకరు ఒక ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. రేడియోలో పనిచేస్తున్న  నాకు, తన మాదిరిగా  వృత్తిపరమయిన స్వతంత్రం లేదనే భావన అతనిది. సర్కారు జర్నలిస్టుగా ముద్రవేసి నన్ను ఆట పట్టించడం అతగాడికో అలవాటుగా మారింది. దీనికి ఎప్పుడో ఒకప్పుడు అడ్డుకట్ట వేయాలనే తలంపులో వున్న నేను - ఒక రోజు అతడిని బాహాటంగా సవాలు చేసాను. నాకో వార్త చెప్పు. అది యధాతధంగా సాయంత్రం రేడియో వార్తల్లో వస్తుందో రాదో చూద్దాము. అలాగే నేను చెప్పిన వార్త రేపు ఉదయం నీ పేపరులో వస్తే నీకు స్వేచ్ఛవుందని ఒప్పుకుంటాను.

పత్రికా స్వేచ్ఛ పట్ల  అపారమయిన గౌరవం వున్న నా స్నేహితుడు, నేను విసిరిన సవాలుని స్వీకరించాడు. ఫలితం గురించి చెప్పాల్సిన పని లేదు. అతను పంపిన వార్తకు అతడి పేపర్లో అతీగతీ లేదు. నేను ఫోనులో చెప్పిన వార్త అదే సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో ప్రసారమయింది. అప్పటినుంచి ఇప్పటివరకు మా స్నేహ బంధం కొనసాగుతూ వచ్చింది కానీ ఆతను ఎప్పుడు పత్రికా స్వేచ్ఛ  గురించిన ప్రసక్తి నా వద్ద తీసుకురాలేదు.

ఈ ఒక్క చిన్న ఉదాహరణతో పత్రికాస్వేచ్ఛ భాష్యం చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఈ స్వేచ్ఛ  అనేది జర్నలిష్టులకన్నా వారు పనిచేసే పత్రికల యాజమాన్యాలు ఎక్కువగా అనుభవిస్తున్నాయని అభిప్రాయపడడంలో తప్పులేదేమో.

నా ఈ అభిప్రాయం బలపడడానికి యిటీవల జరిగిన మరో సంఘటన దోహదం చేసింది.
ఆకాశవాణి, దూరదర్శన్ వార్తా విభాగాలలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేసి పదవీ విరమణ అనంతరం అడిగిన పత్రికలవారికి వారు అడిగిన అంశాలపై నా అనుభవాలను జతచేసి వ్యాసాలు రాసే పనిని ఒక పనిగా పెట్టుకున్నాను. ఈ పత్రికలు కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్న పత్రికలు. కానీ వాటి సంపాదకులు ఎవ్వరు కూడా నేను రాసిన అంశాలతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా - ఏనాడూ ఒక చిన్నవాక్యాన్ని సయితం ఎడిట్చేయలేదు. రాసినవి రాసినట్టు ప్రచురిస్తూ వస్తున్నాయి. పేరుకు చిన్న పత్రికలయినా పెద్దమనసుతో పత్రికా స్వేచ్చకుపెద్ద పీట వేస్తున్నాయి. ఈ నేపధ్యంలో - బాగా ప్రాచుర్యంలో వున్న ఒక పెద్ద దినపత్రిక సంపాదక వర్గం వారు ఈ మధ్య ఫోను చేసి ఒక అంశంపై ఆర్టికిల్ అడిగి మరీ రాయించుకున్నారు. వారు అడిగిన వ్యవధిలోనే పంపడం జరిగింది కానీ ఆ వ్యాసం మాత్రం వెలుగు చూడలేదు. కారణం కూడా వారే సెలవిచ్చారు. నేను పంపిన ఆర్టికిల్ లోని విషయం వారి ఎడిటోరియల్ పాలసీకి అనుగుణంగాలేదట. అందుకే ప్రచురించలేదట.
నార్ల వెంకటేశ్వర రావు గారు, నండూరి రామమోహనరావు గారు, పురాణం సుబ్రమణ్యశర్మ గారు మొదలయిన ఉద్దండ జర్నలిస్టులు సంపాదకులుగా వున్నప్పుడు వారి పత్రికలలో వారి మార్గదర్సకత్వంలో   ఉపసంపాదకుడిగా పనిచేసిన అనుభవం నాకున్నది. ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం రావడానికి ఈ అనుభవమే అక్కరకు వచ్చింది. తెలుగు జర్నలిజానికి పునాది రాళ్లుగా నిలిచిన వీరెవ్వరు - ఎడిటోరియల్ పాలసీఅంటే ముందు పేర్కొన్న పత్రిక వైఖరి మాదిరిగా వుంటుందని వుంటుందని ఎప్పుడు చెప్పలేదు. ఆ పాలసీ అనేది కేవలం పత్రిక రాసే సంపాదకీయాలకు మాత్రమే  పరిమితం కావాలి కాని, . పత్రికలో పడే ప్రతి వార్తా, ప్రతి వ్యాసం ఆ పత్రికా విధానానికి అనువుగా వుండాలని పట్టుబడితే ఇక పత్రికాస్వేచ్చకు  అర్ధమేముంటుంది?

నిజంగా జరిగిన ఒక ఉదంతంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
ఒకానొక ప్రముఖ దినపత్రిక సమాజంలో నైతిక విలువలు భ్రష్టు పట్టిపోతున్నాయని తన సంపాదకీయాలలో గగ్గోలు పెడుతుండేది. ఒక రోజు ఆ సంపాదకుడికి ఒక లేఖ వచ్చింది. అందులో ఇలావుంది.

అయ్యా! సమాజం పట్ల, ఆ సమాజంలో లుప్తమవుతూవస్తున్న నైతిక విలువలపట్ల మీకున్న ఆవేదన మెచ్చదగినదిగావుంది.

అయితే మీకు తెలియని విషయం ఒకటుంది. మీ పత్రిక ఆఫీసు దగ్గరలో  ఓ చాయ్ దుకాణం వుంది. పావలా మనది కాదనుకుని అరకప్పు టీ తాగిస్తే అరకాలం వార్త మీ పేపర్లో రాసే సిబ్బంది ఆ దుకాణంలో ఎప్పుడు సిద్దంగా వుంటారు. సమాజం సంగతి సరే! ముందు మీ ఇల్లు చక్కపెట్టుకోండి







ఆలస్యం చేస్తే 'చూడలేని' సినిమా 'పరంపర'


ఎవరో అన్నట్టు ఈరోజుల్లో చాలా సినిమాలు చూడలేనివే. కొన్ని కోట్లు పెట్టి తీస్తారు. పెద్ద యాక్టర్లు. పెద్ద పెద్ద సెట్టింగులు. ముందుగా టిక్కెట్లు కొనుక్కుని వెడితే 'ఇంకా ఎప్పుడు అయిపోతుందిరా నాయనా' అనిపిస్తాయి. ఆ విధంగా 'చూడలేని' సినిమాలు అవి. మరికొన్ని, నిజంగా చాలా కొన్నే. వీటిని తీసేవారికీ దమ్ముండాలి. చూసేవారికీ దమ్ముండాలి. ఎవరో చెబితే పోనీ చూద్దాం అనుకుని, ఆర్చుకుని తీర్చుకుని వెళ్లేసరికి 'ఆ బొమ్మ' ఎంచక్కా ఎగిరిపోతుంది. ఆ విధంగా ఆ సినిమాలు కూడా 'చూడలేనివి'.
నిన్న ఆ రెండో బాపతు సినిమా ఒకటి చూడడం తటస్తించింది. 'చక్రవాకం' టీవీ సీరియల్ 'ఫేం' బిందు నాయుడు  గారి భర్త డాక్టర్  బాలాజీ  మొన్న ఫోన్లో మాట్లాడుతూ మాట వరసకు చెప్పినట్టు చెప్పారు,  'పరంపర అనే సినిమా వచ్చింది చూడండి' అని. 'వీలుంటే కాదు, వీలుచేసుకుని చూడండి, ఎందుకంటె ఇటువంటి సినిమాలు ఎక్కువ రోజులు ఆడవు'  అని ఆయన  చెప్పకపోయినా విషయం నాకు అర్ధం అయింది.


ఆదివారం మధ్యాహ్నం జూబిలీ క్లబ్ లో జ్వాలా ఫ్యామిలీ, మా ఫ్యామిలీ  లంచ్. మాటల సందర్భంలో మళ్ళీ 'పరంపర' ప్రస్తావన. అది ఎక్కడ ఆడుతుందో తెలుసుకుని ఆరుగంటల ఆటకు వెళ్ళండి అని పదో నెంబరు కౌంటర్ లో నా పేరు చెప్పండి అని లంచ్ కు వచ్చిన బుంటీ చెప్పింది. 'మంచి పుస్తకాన్ని కొని చదవాలి, మంచి సినిమా టిక్కెట్టు కొని చూడాలి' అని ఈ మధ్య ఓ తిరుగులేని స్వచ్చంద  ప్రతిన చేసుకుని పాటిస్తున్న నేను,  కాస్త ముందుగానే థియేటర్ కు వెళ్లి పలానా వారు చెప్పిన పలానా కౌంటర్ దగ్గర  పలానా వారి పేరు చెబుతుండగానే కౌంటర్లోని అమ్మడు 'ఎన్ని టిక్కెట్లు' అని అడిగింది. దాంతో బోధ పడింది చూడబోతున్న సినిమా 'రెండో రకం చూడలేని' సినిమా అని.
సినిమా సంగతి ఎలా వున్నా హాలు బాగుంది. జనం అనుకున్నట్టే పలచపలచగా వున్నారు. మొదటి రోజు 'మిధునం' సినిమాకు వెళ్ళినప్పుడు ఇదే అనుభవం. చాలా సంవత్సరాలక్రితం హైదరాబాదులో  'శంకరాభరణం' మొదటి ఆట చూసినప్పుడు కూడా ఇదే సీను.
సినిమా మొదలయింది. డైరెక్టర్ ఫోటోగ్రఫీ రంగానికి చెందిన  వ్యక్తి  అని నెట్లో చదివాను. అందుకే కాబోలు ప్రతి ఫ్రేము చాలా అందంగా ఉండేట్టు జాగ్రత్త తీసుకున్నారు. తండ్రీ కొడుకుల కధ. చిన్న లైనుతో కధ అల్లుకోవడం వల్ల దాన్నుంచి  దారి తప్పిపోకుండా సినిమా నడిపించారు. సినిమా ఇలా తీయాలని అనుకుని తీసినట్టు వుంది కానీ ఇలా తీస్తేనే జనం చూస్తారు అనే భావనతో తీసినట్టులేదు. అంచేత సినిమాకు డాక్యుమెంటరీ ఛాయలు అద్దుకున్నాయి. రాజీపడని ఈ తత్వం ఓ సారి సినిమాకు కీడు చేయవచ్చు, కొండొకచొ మేలూ చేయవచ్చు.
సినిమాలో ప్రధాన పాత్రధారి నరేష్. ఆయన అనగానే మనకు జంధ్యాల జ్ఞాపకం వస్తారు. నవ్వులు జ్ఞాపకం వస్తాయి. అయితే, ఇలాటి సినిమాలు తీసేవారికీ, చూసేవారికే కాదు అందులో వేషం వేసేవారికి కూడా దమ్ముండాలి. నరేష్, అయన భార్యగా నటించిన అలనాటి సీనియర్ హీరోయిన్ ఆమని  కూడా తమకు ఆ దమ్ముంది అని నిరూపించారు. మొదటి నుంచి చివరి వరకు మాసిన నెరిసిన గడ్డంతో ఒక మధ్య తరగతి మానవుడిగా, నిత్య సమస్యలతో సతమతం అయ్యే గృహస్తుగా, కోరికలకు తనకుతానే సమాధి కట్టుకుని జీవితంతో సమాధానపడే వ్యక్తిగా నరేష్ ఇందులో నటించారు. ఆ మాటకు వస్తే ఇటువంటి సినిమాల్లో నటీనటులు నటించరు. అలా అలా కధలో లీనమై జీవిస్తారు.  నరేష్, ఆమని కూడా అదేపని చేసారు.
'సినిమా అనగానే కాస్త మెలో డ్రామా వుండాలి వుండి తీరాలి' అని సినీ పండితుల ఉవాచ. కానీ దర్శకుడు ఇవేవీ పట్టించుకున్నట్టు లేదు. తను అనుకున్నట్టు తాను  తీసుకుంటూ పోయాడు. 'నేనిలాగే తీస్తాను, చూస్తే  చూడండి లేకపోతే లేదు' అనే అనే గుండె ధైర్యం  సినిమా అంతటా నిండుగా  పరచుకుంది.' చాలా సీరియస్ సినిమారా బాబోయ్' అనే వాటిల్లో కూడా అక్కడక్కడా కొంత హాస్యం చిప్పరిల్లేలా జాగ్రత్తలు తీసుకోవడం కద్దు. కానీ ఈ సినిమా దర్శకుడు మహా మొండివాడు.  రాజీ పడే ధోరణి యెంత మాత్రం  ఎక్కడా కానరాలేదు. అందుకు చెప్పాలి ఆయనకు కంగ్రాట్స్.
పొతే, నాకు చాలా రోజులనుంచి గోదావరి జిల్లాల గ్రామీణ సౌందర్యం వీక్షించాలని కోరిక. నేను కొన్న టిక్కెటు ఖరీదు  అక్కడికి వెళ్లి రావడానికి అయ్యే బస్సు చార్జీకంటే తక్కువ. నేత్రపర్వంగా వున్నాయి దృశ్యాలు.  అది చాలు అనిపించింది.
సినిమా చూసిన తరువాత బాగుందా లేదా అనే చర్చ ఎలాగూ వుంటుంది. తలా ఒక రకంగా మాట్లాడుతున్నారు.
నాకు మాత్రం ఒకటే అనిపించింది.
'ఈ సినిమా బాగుందా లేదా అనికాదు. మూసబాణీలో కొట్టుకుపోతున్న తెలుగు చలన చిత్ర రంగాన్ని ఓ మలుపు తిప్పాలంటే ఇటువంటి సినిమాలు అడపాదడపా రావాలి. అలా రావాలంటే సకృత్తుగా వచ్చే ఇటువంటి 'పరంపర' సినిమాలను టిక్కెట్టు కొని చూసి, ఇలాటివి మరికొన్ని తీయడానికి  మరి కొంతమంది ముందుకు వచ్చేలా చేయాలి.
సినిమా చూసిన ఇంకోటి కూడా  నాకనిపించింది. నేను కొన్న నూట యాభయ్ రూపాయల టిక్కెట్టులో మొత్తం సొమ్ము ఈ సినిమా తీసిన వారికే పొతే బాగుంటుందని.
అది సాధ్యం కాని  పని. అలాగే 'పరంపర' వంటి సినిమాలు తరచుగా చూడ్డం కూడా.
దర్శకుడు మధు మహంకాళి గారికి 'హాట్స్ ఆఫ్'
కానీ ఇలాటి హాట్స్ ఆఫ్ లు, అవార్డులు 'కాసు'కు సమానం కావు కదా! 

తోక టపా: ఇందులో మా రేడియో కోణం కూడా ఒకటుంది. చిత్రంలో ఒకచోట రేడియోలో వార్తలు వినబడుతుంటాయి. ఆ స్వరం ఎవ్వరిదయ్యా  అంటే,  మన ఈ ఫేస్ బుక్ ప్రపంచం మిత్రుడు, రేడియోలో ఇప్పటికీ వార్తలు చదువుతున్న పోణంగి బాలభాస్కర్ ది, వెంటనే ఫోను చేసి చెప్పాను.
  
 (17-11-2014)