8, అక్టోబర్ 2014, బుధవారం

నిదురపోరా తమ్ముడా!


'కంట నిదుర రాకపోతే పడ్డావనుకో ప్రేమలో' అని ఓ సినీ కవి సూత్రీకరించారు. కాకపొతే ఈ సూత్రం ఒక వయస్సులో ఉన్నవారికి మినహా అన్ని వయస్సులవారికీ వర్తించదనుకోండి. ఈ సంగతి అలా ఉంచితే -


నిదురించే తోటలోకి తీపి కబురు వచ్చింది.
ఏమిటా మొద్దు నిద్దర మూడు ఝాములు పొద్దెక్కేదాకాదాకా అని పెద్దలు సణుగుతున్నా దుప్పట్లో మునగ దీసుకుని పండుకునే వారికోసం ఏడాదిలో ఒక రోజును అంతర్జాతీయ నిద్రా దినోత్సవానికి కేటాయించారు. ప్రతి ఏటా మార్చి నెల మూడో శుక్రవారం నిద్రాప్రేమికుల దినోత్సవం అన్నమాట. నిద్రతో కొన్ని రోగాలు నయం చేయొచ్చన్న ఓ వైద్య ప్రక్రియను ప్రచారం చేసే ఉద్దేశ్యంతో మొదటిసారి 2008 మార్చి 18 వ తేదీన ఈ అంతర్జాతీయ నిద్రా దినోత్సవాన్ని(వరల్డ్ స్లీప్ డే) నిర్వహించారు. మంచి ఆరోగ్యంతో మర్నాడు మేలుకోవడం కోసం ఈ రాత్రి బాగా నిద్ర పొండి!అన్నది నిర్వాహకుల నినాదం. ఇంకా మనవైపు జనంలోకి రాలేదు కానీ నిద్రతో రోగాలు నయం చేసే ప్రక్రియ కొన్ని దేశాల్లో బాగానే ప్రాచుర్యంలో వుందన్నది వారి ఉవాచ..
అన్ని వయస్సుల్లోని వారికి నిద్ర అవసరం గురించి ప్రచారం చేయాలన్నది నిర్వాహకుల అభిప్రాయం. అప్పుడే పుట్టిన శిశువులు, స్కూలు పిల్లలు, ఈడొచ్చిన పిల్లలు, యువతీ యువకులు, మధ్య వయస్కులు, వృద్ధులు ఇలా అన్ని వయసులవారు నిద్రకు తగినంత సమయం కేటాయిస్తే రోగాలబారిన పడకుండా ఎంచక్కా గుండెలమీద చేయివేసుకుని గుర్రుపెట్టి నిద్రపోవచ్చని వీరు బల్ల గుద్ది చెబుతున్నారు. వీళ్ళంతా విదేశీయులు కనుకా, మన రామాయణాది పురాణాల అవగాహన అంతగా లేని వారు కనుకా నిద్రకు నిలువెత్తు నిదర్శనం లాటి కుంభకర్ణుడు మొదలయిన పురాణ పాత్రల ప్రస్తావన తీసుకురాలేకపోతున్నారు. లేకపోతె, ఎంత నిద్రపోతే అంత బలం అన్నటాగ్ లైన్ తో ఏకంగా కుంభకర్ణుడి బొమ్మనే వారి 'లోగో' గా పెట్టుకునివుండేవారు. రాక్షసుడి చిత్రం ప్రచారానికి పనికిరాదని ఎవరయినా అభ్యంతరం చెబితే మన వేంకటేశ్వర స్వామి వారి అనుంగు సోదరులు వరద రాజస్వామివారు వుండనే వున్నారు. తమ్ములుంవారికి ఆయన భక్త కోటి భక్తి పారవశ్యంతో సమర్పించిన మొక్కుబళ్ల ద్రవ్యాన్ని లెక్కిస్తూ లెక్కిస్తూ అలసిపోయి కొలమానికను తలగడగా పెట్టుకుని నిద్రలోకి జారిపోయిన వరదరాజస్వామిని మించిన 'నిద్రాదేవత' మరొకరు దొరకడం దుర్లభం కూడా. ఇక్కడా మగపెత్తనమేనా అని గునిసేవారికి లక్ష్మణులవారి  అర్ధాంగి ఊర్మిళాదేవి ఉండనే వుంది. 
అయితే,  'నిద్ర తెరపీ' అని పిలుచుకుంటున్న ఈ వైద్య విధానంలో అదేపనిగా నిద్ర పోవాలని మాత్రమే వైద్యులు చెబుతారని అనుకోవడం పొరబాటు. శరీరాన్ని ఆరోగ్యవంతంగా వుంచుకోవాలని అనుకునేవారు ఎలా నిద్ర పోవాలి, ఎంత నిద్ర పోవాలి, ఎంతసేపు నిద్రపోవాలి  అని మాత్రమే  వీరు సలహాలు ఇస్తారు. 'నిద్ర పట్టడం లేదు బాబోయ్' అని గాభరా పడిపోయే వారికి నిద్ర మాత్రలతో అవసరం లేకుండా నిద్రపట్టే పద్ధతులు చెప్పి వారిని నిద్రకు దగ్గర చేస్తారు. నిద్దట్లో లేచి ఆ తరవాత మళ్ళీ నిద్రపట్టక జాగారం చేసేవారు, రాత్రంతా నైట్ డ్యూటీలు చేసి మరునాడు నిద్రపట్టక పక్కవారిని నిద్రపోనీకుండా వేధించే వారూ, రాత్రివేళ అంతా నిద్ర పోతున్న సమయంలో నిద్దట్లోనే లేచి నడకలు సాగించే వారూ ఇదిగో ఈ అమాంబాపతు జనమంతా ఈ తెరపీ వైద్యులను ఆశ్రయిస్తుంటారు. నిద్ర పట్టకపోవడమేమిటండీ మరీ విడ్డూరం కాకపొతే!అని దవళ్ళు నొక్కుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. మా మూడోవాడు వున్నాడు చూడండీ! పక్కమీద అలా వాలిపోయాడా ఇక అంతే! ఏనుగులతో తొక్కించినా లేస్తే వొట్టు!అని వాపోయేవాళ్ళూ వున్నారు. ఇలాటి వారికోసమే, మాయాబజారు సినిమాలో శ్రీకృష్ణులవారి చేత మత్తు వదలరా! నిద్దుర మత్తు వదలరా!!అనే పాట పాడించారు. ఆ పాట వింటూ మరింత నిద్రలోకి జారిపోయినవాళ్ళు కూడా వున్నారని చెప్పుకునేవారు. ఘంటసాల వారి గాత్ర మాధుర్యం అలాటిది మరి.
నవ్వడం ఓ భోగం! నవ్వలేకపోవడం ఓ రోగం!అన్నారు జంధ్యాల. అలాగే, ‘నిద్రపట్టడం ఓ భోగం. నిద్ర పట్టకపోవడం ఓ రోగంఅని దీనికి అన్వయించి చెప్పుకోవచ్చు. వెనుకటి రోజుల్లో మనుషులమీదా, మనసుల మీదా ఇన్ని రకాల వొత్తిళ్ళు లేనప్పుడు వున్నవాడూ, లేనివాడూ హాయిగా ఆరుబయట పండుకుని మరింత హాయిగా నిద్రపోయేవాళ్ళు. కడుపునిండా తిండి తిననివాళ్ళు ఉంటారని  వాళ్లకు తెలుసుకానీ కంటినిండా నిద్రపోని జనం వుంటారన్నది వాళ్లకు బొత్తిగా తెలియని విషయం. ఈ నాడు ఇన్ని సౌకర్యాలు వుండికూడా కాసింత నిద్రకు నోచుకోని కోటీశ్వరులు కోట్లలో వున్నారు. నిద్రకోసం 'మందే మందు' అనుకునే మందుబాబులు, నిద్ర మాత్రలు, మత్తు ఇంజెక్షన్లతో నిద్రకు దగ్గర కావాలని ఆరాటపడే గమ్మత్తు బాబులు  ఈనాడు కోకొల్లలుగా కానవస్తారు. అందుకే బ్యాంకు బాలెన్సు వున్న కుబేరులకన్నా కంటి నిండా నిద్రపోగలిగిన పేదవాడే అధిక సంపన్నుడని చెబుతారు.
హైదరాబాదులో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే హెచ్ ఎం ఆర్ ఐ – 104 అనే ఒక సంస్త వుంది. 104 నెంబరుకు ఫోన్ చేస్తే అక్కడ ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో వుండే డాక్టర్లు అనేక రకాల అనారోగ్య సమస్యలకు ఉచితంగా సలహాలు, సూచనలు ఇస్తారు. రోజుకు దాదాపు యాభయ్ వేల మంది వైద్య సలహాలకోసం ఈ కాల్ సెంటర్ ను సంప్రదిస్తుంటారు. వీరికొచ్చే కాల్స్ లో చాలామంది నిద్రపట్టడం లేదు ఏం చేయాలని అడిగేవారు వుంటున్నారట. బహుశా, రాత్రింబగళ్ళు సలహాలు దొరికే కేంద్రం కావడంవల్ల, అర్ధరాత్రీ అపరాత్రీ అనకుండా సలహాలు ఇచ్చే వైద్యులు అందుబాటులోవుండడం వల్ల - నిద్రపట్టని వారిపాలిట ఈ కేంద్రం వరంగా మారి వుంటుంది. ప్రపంచ జనాభాలో 45 శాతం నిద్రలేమితో అనారోగ్యాలబారిన పడుతున్నారని ఈ కేంద్రం సేకరించి విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.
హెచ్ ఎం ఆర్ ఐ 104 ఉచిత ఆరోగ్య వైద్య సలహా కేంద్రం కొన్నాళ్ళ క్రితం రూపొందించిన విశ్లేషణ ప్రకారం యువతలోనే, ప్రధానంగా నగర ప్రాంతాలలోని యువతీ,యువకుల్లో ఈ నిద్రలేమితనం ఎక్కువగా వున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తుపై ఆందోళన, రకరకాల మానసిక వొత్తిళ్ళు ఇందుకు కారణగా అక్కడి వైద్యులు పేర్కొంటున్నారు.నిద్ర లేమితో బాధపడుతున్న వారిలో 92 శాతం మంది 16 నుంచి 40 ఏళ్ళ మధ్య వారేనని తేలింది. వీరిలో అధిక సంఖ్యాకులు బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే వుండడం విశేషం. దాదాపు తొంభయ్ వేలమందికి పైగా వివిధ వయస్కుల వాళ్ళు ఈ కేంద్రానికి ఫోన్ చేసి నిద్ర సంబంధిత రుగ్మతల విముక్తికి సలహాలు తీసుకున్నారంటే ఈ సమస్య తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.
నిద్ర సరిగా పట్టకపోయినా, నిద్ర లేమితో బాధపడుతున్నా దాన్ని అలక్ష్యం చేయకూడదు. ఎందుకంటె, పర్యవసానాలు మరిన్ని సమస్యలకు దారితీసే అవకాశం వుంది. 'ఉత్తిష్టత జాగ్రత - మేలుకోండి. మంచిగా నిద్రపట్టే మార్గాన్ని మేలుకునివున్నప్పుడే వెతుక్కోండి. మంచి నిద్రతో చక్కటి ఆరోగ్యాన్ని ఉచితంగా సంపాదించుకోండి. సంపాదన యావలో పడి బంగారం లాటి నిద్రకు దూరం కాకండి.
చక్కటి కవిత్వం రాయడానికి ఇంటినిండా తాటాకులూ, చేతిలో ఘంటం వుంటే చాలదూ - నిరుపహతీ స్తలంబు, రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురవిడెంబు, బంగరు టూగుటుయ్యెలఎట్సెట్రా ఎట్సెట్రా వుండాలని కవి పెద్దన గారు ఏనాడో ఓ పెద్ద జాబితా కవిత్వరూపంలో చెప్పారు. అలాగే మంచి నిద్ర పట్టడానికి కూడా కొన్ని చిట్కాలున్నాయిట. పడకవేయడానికి ముందు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసి, వేడి వేడి అన్నం తినాలట. నచ్చిన పుస్తకం కాసేపు తిరగేయాలట. పడకా, పడక గదీ ఆహ్లాదకరంగా వుండేట్టు చూసుకోవాలట. రాత్రిపూట గదిలో వెలుతురూ కూడా కంటికి ఇంపుగా వుండాలిట. అందుకే కాబోలు ఈ మధ్య మినుకు మినుకు మని మెరిసే తారలతో కూడిన నీలాకాశాన్ని పడక గది పైభాగంలో కృత్రిమంగా తీర్చిదిద్దుకునే ఆధునిక పద్ధతులను అనేకమంది ఆశ్రయిస్తున్నారు. పోతే, మత్తు పదార్దాలకూ, మాదక ద్రవ్యాలకూ దూరంగా వుంటే నిద్ర భేషుగ్గా పడుతుందట. కానీ మందు కొడితేనే కానీ నిద్రపట్టదు అని అనుకునేవాళ్లకు ఈ సలహా రుచించకపోవచ్చు.అయితేవైద్యులు మాత్రం మత్తు పానీయాలవల్ల నిద్ర పట్టదనీ, పట్టినా సరిగా పట్టదనీ వాళ్ల లెక్కలు వాళ్ళు చెబుతున్నారు. నిద్రకు మొహం వాచిన వాళ్లకు వాళ్ల మాట వింటే పోయేదేమీ లేదు, మందు తప్ప.

ముందే చెప్పినట్టు పొద్దున్నేఆరోగ్యంగా లేవడం కోసం రాత్రంతా హాయిగా నిద్దుర పోండి.
NOTE: Courtesy Image Owner 

7, అక్టోబర్ 2014, మంగళవారం

టచప్  

పొద్దున్న 10 టీవీ 'న్యూస్ మార్నింగ్' ప్రోగ్రాం కి  వెడుతుంటే మాదాపూర్ రోడ్లు మహ ముచ్చటగా కనిపించాయి. నిగనిగలాడే నల్లటి రోడ్లు, తళతళలాడే తెల్లటి గీతలు, ఓహ్ యెంత బాగున్నాయో అనిపించింది. అయితే ఈ ముచ్చట కాసేపే. ఆర్టీసీ క్రాస్ రోడ్   దగ్గర అంతా షరా మామూలే. మామూలు అలవాటయిన పాత ఇంకుడు గుంతల రోడ్లే.  ఓహో! ఇదంతా  మేయర్ల సదస్సు పుణ్యం కాబోలు. చిన్నప్పుడు ఊళ్ళోకి మంత్రిగారు వస్తే బాటకు (రోడ్లు వుంటే కదా!) ఇరుపక్కలా సున్నం ఒక వరుసగా పోసేవారు. అది చూసి ఎవరో పెద్దాయన వస్తున్నారని అనుకునే వాళ్ళు. పద్దతుల్లో కాస్త తేడా వచ్చింది కానీ మనస్తత్వాలు మాత్రం మారలేదు. వున్నరోడ్డుకే కొంత షోకు చేస్తారు. అన్నట్టు రోడ్డంటే గుర్తుకు వచ్చింది. ఆ మధ్య ఒక అధికారి ఎవరో, మూన్నెళ్ళ తరువాత హైదరాబాదులో   రోడ్లమీద గుంత చూపిస్తే పదివేలు పందెం అన్నట్టు గుర్తు. ఆ అధికారికి గుర్తుందో లేదో! 


(NOTE: COURTESY IMAGE OWNER)
    

పల్లెకు పోదాం! (Back to village)



'
పల్లెకు పోదాం పదండి' అని నేను 2005 లో  రిటైర్ కావడానికి ముందే రాశాను. ఒక్క దేవినేని మధుసూదనరావు గారనే పెద్ద మనిషి వారి భార్య శ్రీమతి జయశ్రీ గారు  మాత్రమే ఈ పని చేసి చూపించారు.  హైదరాబాదులో ఉద్యోగ బాధ్యతలు పూర్తికాగానే వాళ్ల స్వగ్రామం వెళ్ళిపోయారు. పెరట్లోనే కూరగాయలు పండించుకుంటూ,   పుస్తకాలతో సాహితీ సేద్యం చేస్తూ హాయిగా వుంటున్నారు.  చదువులకోసమో, ఉద్యోగాలకోసమో బస్తీలకు వచ్చినవాళ్ళు ఇళ్లు కట్టుకుని అక్కడే సెటిలై పోకుండా,  స్వగ్రామాలకు తిరిగి వెళ్ళిపోతే బస్తీలమీద ఇంత భారం ( జనాభా, నీళ్ళు, వాహనాలు, విద్యుచ్చక్తి వగయిరా రూపంలో) పడదని నా వాదన. కానీ ఏం లాభం జీవితంలో
ఎన్నో అనుకుంటాం కొన్నే చేయగలుగుతాం.



 (స్వగ్రామంలో మా ఇల్లు)

6, అక్టోబర్ 2014, సోమవారం

ముఖ్యమంత్రి గారు ...నిన్న ఆదివారం 'ఈనాడు' చదివారా!


మంచి పనులు చేస్తున్న మంచి మనుషులను వెతుకుతూ దేశాలు తిరగనక్కరలేదు. 'ఈనాడు' యాజమాన్యం ప్రతి ఆదివారం ప్రచురించే 'చిన్న పుస్తకం'లో ఇలాటి పెద్ద మనసున్నవాళ్ళు ప్రతివారం కానవస్తారు.
నిన్న అక్టోబర్ ఐదో తేదీ ఈనాడు చిన్ని పుస్తకంలో 'పేద పిల్లలకోసం పబ్లిక్ స్కూలు' నడుపుతున్న నరేంద్ర మూర్తి గారిని గురించిన సచిత్ర కధనం ప్రచురించారు. అందరూ చదివే వుంటారు కనుక చదవని కొందరికోసం అందులోని విషయాలు కొద్ది కొద్దిగా.



'పెళ్ళీ పిల్లలు ఈ వలయంలో చిక్కుకోవడం ఇష్టం లేని మూర్తిగారు, స్వామీ వివేకానంద నుంచి స్పూర్తి పొంది బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. 1982లో హైదరాబాదులో ఓ మురికివాడ కాలనీ పిల్లలకోసం ఆయన నెలకొల్పిన   స్కూల్లోని విద్యార్ధులే ఆయన కుటుంబం. నయా పైసా అస్తి లేదు. సొంత ఇల్లు లేదు. పాఠశాలలోనే ఆయన తలదాచుకుంటారు. స్కూల్లో చదువుకునే వాళ్ళందరూ పేదవారి పిల్లలే.

ఆ స్కూల్లో ఫీజులు వుండవు. డొనేషన్లు వుండవు. రిజర్వేషన్లు వుండవు. పుస్తకాలనుంచి మధ్యాహ్న భోజనం  దాకా అన్నీ ఉచితమే. ఇంతవరకు ఒక్క పైసా కోసం కూడా ప్రభుత్వాల ముందు సాగిల పడలేదు.... ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఆ బడిని ఓ గుడిలా చూసుకుంటారు. ఎందుకంటె వాళ్ళ తలితండ్రులు  నిరక్ష రాస్యులు. పొట్టకొస్తే అక్షరం ముక్క లేని వాళ్ళు. రోజు కూలీకి వెడితే కాని పొట్టగడవని పేదవాళ్ళు. చదువనేది పగటికలగా మిగిలిన వాళ్ళు. కాబట్టే తమకు అక్షర భిక్షపెట్టి ప్రయోజకులుగా చేస్తున్న ఆ బడి అంటే వాళ్ళకు అంత భక్తీ, గౌరవం....."     

నాకు తెలిసింది సున్నా

చాలామంది అడుగుతుంటారు అభిమానం కొద్దీ, 'మీకు  ఇన్నిన్ని విషయాలు ఎలా తెలుసు' అని. కానీ వాళ్లకి తెలియని విషయం ఏమిటంటే 'నాకు తెలిసింది సున్నా' అని.  మొన్నీమధ్య సర్వే వాళ్ళు వచ్చి అడిగారు,  'మీ మండలం ఏమిటి, మీ పోలీసు స్టేషన్ ఏమిటీ' అంటూ.  నోరెళ్ళబెట్టడం తప్ప నేనేమీ చెప్పలేకపోయాను. నేనున్న ప్రాంతాన్ని బట్టి వాళ్ళే రాసుకుపోయారు కాబట్టి నా అజ్ఞానం పూర్తిగా బయటపడలేదు.
ఒక విషయం మాత్రం నేను రూడిగా చెప్పగలను. అన్నీ తెలుసనుకుంటాం కానీ, చాలామందికి కొన్నే తెలుసు. ఆ తెలిసినవాటిలో కూడా చాలావరకు  మిడి మిడి జ్ఞానం బాపతు.  అయితే తెలియచెప్పడంలో కాస్త చాకచక్యం చూపిస్తే  మనలో నిండుకుని వున్న  అజ్ఞానం చాలావరకు అంధకారంలోనే కప్పబడిపోతుంది. సరే! ముందు ఈ అంధకారంలో నుంచి బయటపడి అసలు విషయం మాట్లాడుకుందాం.


నేను రేడియోలో పనిచేసేటప్పుడు అనేకమంది రాజకీయ నాయకులు ప్రకటనలు (డబ్బు చెల్లించే వాణిజ్య ప్రకటనలు కాదు, ఏదైనా అంశం మీద తీవ్రాతితీవ్ర  ఖండన ముండనలు, హర్షాతిరేక  ప్రకటనలు,  ప్రగాఢ సంతాప ప్రకటనలు వగయిరా అన్నమాట) పట్టుకుని వస్తుండేవారు. వారిలో ఎక్కువమంది వివిధ పార్టీలకు చెందిన  ఎమ్మెల్యేలు, ఎంపీలు, మళ్ళీ వారిలో మాజీలు వుండేవారు. వారిలో మళ్ళీ చాలామంది, వారి వారి నొసటిరాత ప్రకారం  మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా మారి, వారి వారి ఛాంబర్లలోనే విలేకరుల సమావేశాలు పెట్టే  స్థాయికి ఎదిగిపోయేవారు. అదివేరే కధ.
అజ్ఞానం గురించి కదా మాట్లాడుకుంటున్నాం. ఇలా ప్రకటనలు పట్టుకొచ్చేవాళ్ళు, వాళ్ళ లెటర్ హెడ్లమీద చక్కగా ఇంగ్లీష్ లో టైపు చేయించుకుని తెచ్చేవాళ్ళు. ఒకనాడు ఒక పెద్దమనిషి, నిజంగా పెద్దమనిషే సుమా, మా వద్దకు వచ్చి ఒక ప్రకటన పాఠం చేతికి ఇచ్చారు. లెటర్ హెడ్డు మీద పలానా నియోజకవర్గం ఎంపీ అని వుంది. కానీ పేరు వేరుగా వుంది. నా మట్టి బుర్రకు యెంత పనిచెప్పినా ' ఆ ఎంపీ ఈ ఎంపీ ఒకరు కాదు' అని చెబుతూనే వుంది. లెటర్ హెడ్డు అధికారికంగా అన్ని హంగులు, మూడు సింహాల గుర్తుతో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. కాసేపు ఆ ప్రకటన చదువుతున్నట్టుగా పరకాయించి చూసే సరికి విషయం అర్ధం అవడమే కాకుండా ఆ పెద్దమనిషి మీద జాలి కూడా వేసింది. ఎందుకంటె ఆయన నిజంగా ఆ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించిన పార్ల మెంటు సభ్యుడే. కానీ ప్రస్తుతం కాదు. గతంలో ఎప్పుడో అయిదేళ్ళు ఎంపీ గా పనిచేసిన పెద్దాయనే. అయితే  ఇప్పుడు మాజీ.  'అశ్వద్ధామ హతః' అన్నట్టు పేరు హోదా పెద్దగా వేసుకుని కింద చిన్న అక్షరాలతో పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు అని బ్రాకెట్లో  చిన్న అక్షరాలలో ముద్రించారు. అది చూసి 'ఇంకా అడిగిన వాడ్ని కాదు' అని నాకునేనే సమాధాన పడ్డాను.
అలా మరోసారి నా  అజ్ఞానం బయటపడే సమయంలో అది బయటపడకుండా నేను జాగ్రత్తగా బయటపడడం వల్ల,  ఇదిగో ఇప్పుడిలా,  కొంతమందయినా 'నాకు అన్నీ తెలుసు' అని అనుకునేట్టు చేయగలుగుతున్నాను. కానీ, ముందే చెప్పినట్టు, 'నాకు బాగా తెలుసు, నాకు తెలిసింది సున్నా' అని.
తోక టపా: రేడియో 'ప్రకటన కర్త'ల్లో ఒకాయన గురించి చెప్పుకోవాలి. వారంలో రెండు రోజులు ఏదో ఒక 'ఖండన ముండన' ప్రకటన పట్టుకుని వచ్చేవాడు. రాగానే, 'ఇవ్వాళ ఎవరయినా పోయారా, పొతే సంతాపం ప్రకటించేవాళ్ళల్లో నా పేరు కూడా పెట్టండి' అనే వాడు. పోయినవాళ్ళు ఎవరో కూడా తెలియకుండానే సంతాపం చెప్పిన  పుణ్యం ఎక్కడికి పోతుంది ? కొన్నాల్టికి,  రాష్ట్రంలో ఒక పెద్ద దేవస్థానం కమిటీ సభ్యుడు అయ్యాడు. (06-10-2014)
NOTE: Courtesy Image Owner 

5, అక్టోబర్ 2014, ఆదివారం

ఒరులేయవి యొనరించిన........


క్షౌర శాలలకు మంగళవారం సెలవు. సంప్రదాయాల ప్రకారం మంగళ వారం మంగళకరమైనదంటారు. అలాటి శుభకరమయిన రోజున క్షౌర శాలలకు మాత్రమే సెలవెందుకు ఇస్తారుసరే! ఆ సంగతి వొదిలేద్దాం. కానీ జవాబు దొరకని మరికొన్ని ప్రశ్నలు కూడా తరచూ నా మదిలో రొద చేస్తూంటాయి.
బార్బర్ షాపుకు వెళ్ళేవారిలో చాలామంది పాత దుస్తులు ధరించి వెడుతూ వుండడం కద్దు. మడత నలగని ఇస్త్రీ బట్టలు వేసుకుని క్షౌరానికి వెళ్ళే వాళ్లు బహు కొద్ది మంది మాత్రమే కానవస్తుంటారు. ఎందుకిలాఅన్నది మరో ప్రశ్న.


స్నానం చేసి క్షౌరానికి వెళ్ళేవాళ్ళు కలికానికి కూడా దొరకరేమో. బహుశా క్షౌర కార్యక్రమం అన్నది ఒక రకం  మైల’ గా భావించే మనస్తత్వం చాలామందిలో వుండడమే దీనికి కారణమేమో.
క్షౌరం సంగతి పక్కనపెట్టండి. ఇల్లు వూడ్చేటప్పుడు కానీకడిగి తుడిచేటప్పుడు కానీ శుభ్రమయిన దుస్తులు ధరించకుండా వుండడం కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఎందుకంటే ఇల్లు వూడ్చేటప్పుడు ఎలాగూ మురికి అంటుకుంటుంది. అందుకని ఆ పని పూర్తి చేసిన తరువాతే కాళ్ళూ  చేతులు కడుక్కుంటే పోలా అన్న భావన మనల్ని ఆ పని చేయిస్తుంది.
ఇదేదో మన దేశానికి మాత్రమే పరిమితమయిందన్న నా ఆలోచన తప్పని ఈ మధ్యనే తెలుసుకున్నాను. అమెరికాలో సెటిల్ అయిన నా భారతీయ మిత్రుడొకరు ఇటీవల మా ఇంటికి వచ్చారు. ఆ సమయంలో నేను బార్బర్ షాపుకు వెళ్ళే పనిలో వున్నాను. శుభ్రంగా గడ్డం చేసుకునిస్నానం చేసి బార్బర్ షాపుకు బయలుదేరుతున్న నన్ను చూసి అతగాడు రవ్వంత ఆశ్చర్యపోయినట్టు అతడి ముఖ కవళికలను బట్టి అర్ధం అయింది.
అయితేఈ విషయంలో నా అభిప్రాయాలు నాకున్నాయి.
క్షౌర శాలలో కూర్చున్నప్పుడు నా వొంటినుంచి వెలువడే చెమట వాసన వల్ల  నాకు క్షౌరం చేస్తున్న వ్యక్తికి ఇబ్బంది కలిగించరాదన్నదే నా ఉద్దేశ్యం. అలాగే జుట్టును కత్తిరించే క్రమంలోమాసిపోయిన నా కాలర్ ను వెనక్కి మడిచేటప్పుడు దాని దుర్గంధం అతగాడికి సోకరాదని కూడా నేననుకుంటాను.  మనం ఏవయితే  అసహ్యించుకుంటామో వాటిని  ఇతరులు  కూడా ఏవగించుకునే అవకాశం వుంది. మహాభారతంలోని  – ‘ఒరులేయవి యొనరించిన’  పద్యపాదం మనకు బోధించిన నీతి ఇదే.

బార్బర్ షాపుకు వెళ్ళేటప్పుడు శుభ్రంగా వెళ్ళాలన్న జ్ఞానోదయం’ కలగడానికి  మరో  అంశం కూడా  దోహదం చేసింది.
కొన్నేళ్ళక్రితం ఓ మాగజైన్ లో ఓ  విషయం చదివాను.
జపానులో ఓ కార్ల తయారీ సంస్త యజమాని తన కంపెనీకి సర్వీసింగ్ కోసమో మరమ్మత్తుల కోసమో   వచ్చే వాహనాలను  ఆయా విభాగాలకు  పంపేముందు వాటిని శుభ్రంగా కడిగించేవాడు.
ఇలా చేయడం అవసరమారిపైర్  చేసేటప్పుడోసర్వీసింగ్ చేసేటప్పుడో ఎలాగో మురికి అవడం తధ్యం. మళ్ళీ వాటిని శుభ్రంగా కడగడం కూడా తప్పనిసరి. అలాంటప్పుడు ముందుగా కడిగి పంపడం అనే కంచి గరుడ సేవ ఎందుకనే డౌటేహం’ కలగడం కూడా అంతే తధ్యం.
ఈ రకం సందేహాత్ములకు ఆయన ఇచ్చే వివరణ ఈ విధంగా వుంటుంది.
నా కంపెనీలో పనిచేసే వారికి నేను ఇచ్చే గౌరవం అది. వారు పనిచేసే వాతావరణం పని చేయడానికి అనువుగా  వుండాలన్నది నా అభిప్రాయం. దీనితో విభేదించేవారు సర్వీసింగు నిమిత్తం వచ్చే వాహనాల అడుగు భాగాన్ని చూసివుండరని నా ఉద్దేశ్యం. బురదమట్టి కొట్టుకుని  నానా చండాలంగా వుంటుదది. అక్కడ బిగుసుకుపోయిన నట్లు,బోట్లను వొట్టి చేతులతో వూడదీసి బిగించడం అనే ప్రక్రియ యెంత  దుర్భరమో తెలిసినవాళ్లెవరూ ఈ రకమయిన  ప్రశ్నలు వేయరు.’
ఈ వార్త చదివినప్పటినుంచి  బార్బర్ షాపుకు వెళ్ళేటప్పుడు నా తీరు పూర్తిగా మారిపోయింది. స్నానాదులను ముగించుకునిశుభ్రమయిన దుస్తులు ధరించి ఆఫీసుకు యెలా వెడుతున్నామోఅలాగే బార్బర్ షాపుకు కూడా వెళ్లాలనే నియమాన్ని ఆ రోజు నుంచి  ఖచ్చితంగా పాటిస్తూ వస్తున్నాను.


అద్దంలో  ముఖ సౌందర్యం ఎలావుండాలని  మనం కోరుకుంటామో ఆవిధంగా మనల్ని తీర్చి దిద్దే బార్బర్లకు,  ఎంతో కొంత టిప్పు’ ఇచ్చి సరిపుచ్చుకోవడం  మాత్రమే కాకుండాచెమట వాసన వేయని కాలర్ నుమెడను వారికి అప్పగించడంలో వున్న తృప్తి ఎలాటిదో  అప్పటినుంచి నాకు అనుభవం లోకి వచ్చింది.  నేను క్రమం తప్పకుండా నెలనెలా  క్షౌరం చేయించుకునే  మహేష్’ - నాలో వచ్చిన ఈ మార్పుని గమనించాడో లేదో నాకు తెలియదు. అయితే నాకు క్షౌరం చేసేటప్పుడుతోటి పనివారిని చూస్తూ గర్వంగా కాలర్ ఎగరేయడం ఓసారి నా కళ్ళబడింది. ఆ క్షణంలో అతడి కళ్ళల్లో కానవచ్చిన కాంతిని నేను నేరుగా చూడలేకపోయినా నా అంతర్నేత్రంతో పరికించగలిగాను.  ఇతరుల శ్రమనుఇబ్బందులను గుర్తించి నడుచుకోవడంలో ఎంతో తృప్తి  వుంది అన్న వాస్తవం  తెలుసుకోగలిగాను. అది బోధ పడిన తరువాత ఈ విషయంలో  నేను కొంత అధికంగా పడుతున్న శ్రమ’ లెక్కలోకి రావడం లేదు.  
NOTE: Courtesy Image Owner 

4, అక్టోబర్ 2014, శనివారం

రాయని కధ


ఎన్నాళ్ళ బట్టో ఒక కధ రాయాలని కోరిక. సిరా పెన్నులూ, కాగితాల రాతల కాలం చెల్లిపోయింది కానీ ఆ కధ ఇంకా ఒక రూపానికి రాలేదు. క్లుప్తంగా ఆ కధ ఏమిటంటే -
ఒక పనిమనిషి దారంటపోతూ పోతూ ఒక రూపాయి కాసుని నిర్లక్ష్యంగా రొంటిన దోపుకుపోవడం ఒక బిక్షగాడు చూస్తాడు. ఆ ఒక్క రూపాయి వుంటే తనకీ పూట తిండి సమస్య వుండదు కదా అని నిట్టూరుస్తాడు. పనిమనిషి ఆలోచనలు వేరు. వున్న ఒక్క రూపాయి ఏ మూలకూ చాలదు. మరో తొమ్మిది అర్జంటుగా కావాలి. పిల్లాడికి స్కూల్లో పది రూపాయలు ఫీజు కట్టడానికి ఆఖరి గడువు కూడా అయిపోయింది. రేపటిలోగా కట్టకపోతే పేరు కొట్టేస్తామని పంతులయ్య చెప్పాడు కూడా. యజమానురాలి ఇంటికి వెళ్లేసరికి ఆవిడ ఓ పది నోటు గూట్లో విసరడం చూస్తుంది. 'నిన్ననగా చెప్పాను ఈ మనిషికి ఏం లాభం, వంద ఉంటేగాని టైలర్ దగ్గర వున్న జాకెట్లు ఇంటికి రావు. వున్న ఈ పదీ ఎందుకూ పనికి రావు' ఆవిడ గొణుగుడు ఏనాడూ వినే అవకాశం బొత్తిగా లేని ఆమె మొగుడు ఓ గుమాస్తా రావు. పద్దులు రాస్తేకానీ పొట్టా గడవదు. పొద్దూ గడవదు. దుకాణం షావుకారుకు ఒక వంద ఇవ్వడం ఒక లెక్క కాదు. కానీ  'విసిరి పారేసేది కూడా లెక్కించి పారేయాల'నే తత్వం ఆయనది. అయితే  ఆయన గోల వేరే. సాయంత్రానికల్లా పది వేలు జమ చేయాలి. సరుకులు  సప్లయి చేసేవాడి దగ్గర బాకీ కొండలా పెరిగిపోతోంది. పది వేలు ఆయనకి పెద్ద విషయమేమీ కాదు. కానీ ఆ ఏజెంటు అవసరం వేరే. గంటలో లక్ష కావాలి. 'ఎవడిస్తాడా ఎవడ్ని పట్టాలా' అని రాత్రంతా ఆలోచిస్తూనే వున్నాడు. వందకు పది మిత్తి (వడ్డీ) తీసుకుని అప్పులు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఇనప్పెట్టె తెరిచి ఆలోచిస్తున్నాడు. దాంట్లో కట్టల పాములు పుట్టలు పెట్టినట్టు అన్నీ పెద్ద నోట్ల కట్టలే. కోటికి తక్కువ వుండవు. వడ్డీ వ్యాపారి నిలువు గుడ్లేసుకుని ఆ నోట్ల వంక చూస్తున్నాడు. ఎన్ని సార్లు లెక్కపెట్టినా అందులో రెండు కోట్లే లెక్క తేలుతున్నాయి. తన అవసరమా పదికోట్లు. ఎలా ఎలా ? ఇలా సాగిపోతుంది.


నిన్న శుక్రవారం 'సాక్షి' దినపత్రిక 'ఫ్యామిలీ' పేజీలో సుప్రసిద్ధ దర్శకుడు కృష్ణ వంశీ గారి ఇంటర్వ్యూ చదివాను. సినిమా దర్శకుల్లో, బాపూ విశ్వనాద్ గార్ల సరసన పెట్టతగ్గ గొప్ప దర్శకుడు ఆయన. చాలా బాగా తన అనుభవాలను నిష్కర్షగా, నిర్మొహమాటంగా అన్నింటికీ మించి మనసులో ఏదీ దాచిపెట్టుకోకుండా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ పోయారు. ఇంటర్వ్యూ చేసిన డి.జి.భవాని గారు  కూడా మంచి ప్రశ్నలు వేసి చక్కటి సమాధానాలు రాబట్టారు.  అందులో ఒకదాని జవాబు చదివినప్పుడు, నా మనసు పొరల్లో కదలాడుతున్న కధ గిర్రున తిరిగింది.
ఆ ప్రశ్న: "మనిషికి సరిపోయేంత డబ్బు అంటే ...యెంత?"
కృష్ణ వంశీ జవాబు: "ఒక మంచి ఇల్లు. ఏసీ రూము. తిరగడానికి కారు. అందులో పుష్కలంగా పెట్రోలు పోయించ గలిగే కెపాసిటీ, ఏడాదిలో రెండుసార్లు విహార యాత్రలకు వెళ్ళడానికి కావాల్సిన డబ్బు, రెండు పూటలా తిండి, తాగడానికి మందు, పీల్చడానికి సిగరెట్లు, వేసుకోవడానికి మంచి బట్టలు, కట్టుకోవడానికి సెల్ ఫోన్ బిల్లు, మనమీద ఆధారపడే కుటుంబ సభ్యులను సౌకర్యంగా ఉంచగలిగే స్థోమత.....ఇంతకు  మించి ఏం వున్నా,  వాడు ఆ ఇంటికి వాచ్ మన్ కిందే లెక్క. పెద్ద ఇల్లుంటే దాన్ని మెయింటైన్ చేయడానికి పని మనుషులను పెట్టుకోవాలి. వాళ్ళు బయటకు వెడుతుంటే ఇంట్లోంచి ఏమైనా పట్టుకెళ్ళిపోతారేమో అన్న టెన్షన్. ఇక సుఖం ఏం వుంటుంది?..."
అందరికీ తెలిసిన ఓ ఇంగ్లీష్ జోకుని తెలుగులోకి మార్చి రాసిన ఒక జోకు కూడా నాకెందుకో గుర్తుకువచ్చింది.
'అమ్మా! అన్నం తిని రెండు రోజులయింది ఏమైనా పెట్టమ్మా?
"అన్నం లేకపోతే మరి పాయసం తినలేకపోయావా?"
(ఇందులో కృష్ణ వంశీ గారి ప్రసక్తి కేవలం కాకతాళీయం. నా మనసులో కధ బయటకు తీయడానికి కేవలం ఒక విండో గా వాడుకున్నాను. ఇందులో ఏదయినా మనస్తాపం కలిగించే విషయం వుంటే వారికి ముందస్తు క్షమాపణలు- భండారు శ్రీనివాసరావు)