23, సెప్టెంబర్ 2014, మంగళవారం
జెట్ లాగ్ కోడి
కారు వాడకపోతే డాలరు దిగొస్తుంది (ట)
మీ
దగ్గర వున్న ఓ పది నోటు తీసిచూడండి. 'ఇది తీసుకువచ్చిన వాడికి
పది రూపాయలు ఇస్తాన'ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకంతో
కూడిన హామీ (ఒక రకంగా చెప్పాలంటే ప్రామిసరీ నోటు) కనబడుతుంది. సాంకేతిక అంశాలను
అంత క్లుప్తంగా వివరించడం సాధ్యం కాకపోవచ్చు కాని పది రూపాయలకు బదులు అంతే
విలువకలిగిన బంగారం ఇస్తామన్న హామీ అన్నమాట.
అంటే
భారత దేశం ఆర్ధిక వ్యవస్థ బంగారం నిల్వలపై ఆధారపడివుందనుకోవాలి. మరి ఈ కారు
గొడవ యేమిటి అన్న అనుమానం రావచ్చు.
ఒక
డెబ్బయ్యేళ్ల క్రితం వరకు అమెరికా కూడా తన డాలరు విలువను బంగారం
నిల్వల ప్రాతిపదికగా లెక్కకట్టేది. పెట్రోలు కూడా బంగారం మాదిరిగా ప్రియమైనది(మన
దేశంలో బంగారం మరో రకంగా ప్రియమైనది అనుకోండి) అన్న జ్ఞానోదయం ముందు కలిగిన దేశం
కనుక అమెరికా ముందు జాగ్రత్త పడి పెట్రోలు ఉత్పత్తి చేసే
మధ్య ప్రాచ్య దేశాలతో ఒక వొప్పందం కుదుర్చుకుంది. అదేమిటంటే వాళ్లు పెట్రోలు ఏ
దేశాలకు అమ్మినా డాలర్లలోనే అమ్మాలి. ఏవిటి దీనివల్ల వాళ్లకు లాభం? ఓ
ఉదాహరణ చెప్పుకుందాం.
మన
పెట్రోలియం మంత్రిగారు చమురు కొనుగోళ్ళ కోసం ఓ మధ్య ప్రాచ్య దేశానికి
వెళ్ళారనుకుందాం. కాని వాళ్లు మన మన కరెన్సీ వొప్పుకోరు. డాలర్లు కావాలంటారు.
అప్పుడు మన మంత్రి గారు డాలర్లకోసం అమెరికా వైపు చూస్తారు. వాళ్ల సొమ్మేం పోయింది.
టకటకా తెల్లకాగితంపై (కరెన్సీ ముద్రణకు వాడే కాగితమే కావచ్చు) డాలర్లు
ప్రింటు చేసి మనకు ఇస్తారు.
ఈవిధంగా వచ్చిన డాలర్లతో మనం పెట్రోలు కొనుగోలు చేస్తాం.
ఈవిధంగా వచ్చిన డాలర్లతో మనం పెట్రోలు కొనుగోలు చేస్తాం.
ఇక్కడో
తిరకాసు వుంది. 'మాకీ డాలర్లు అక్కరలేదు, తిరిగి ఇచ్చేస్తాం
తీసుకోండి’ అంటే అమెరికా రిజర్వ్ బ్యాంక్ వొప్పుకోదు. డాలర్ల
బదులు మాకు బంగారం ఇవ్వండి అంటే ఆ దేశం ఎంతమాత్రం అంగీకరించదు. 'డాలర్ బదులు తిరిగి ఏదయినా ఇస్తామని హామీ ఏమైనా ఇచ్చామా చెప్పండి' అని ఎదురు ప్రశ్న వేస్తారు. మన కరెన్సీ మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్
హామీ లాగా వాళ్ల డాలర్ మీద అలాటి పూచీకత్తు ఏమీ వుండదు. అందుకే డాలర్లు
ముద్రించాలంటే తగిన బంగారం నిల్వలు వున్నాయా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఆ
దేశానికి వున్నట్టు లేదు. మరయితే, తాను కొనుగోలు చేసే
పెట్రోలుకు అమెరికా అయా దేశాలకు చెల్లింపులు ఏ కరెన్సీలో చేస్తుందనే అనుమానం
రావచ్చు.
వాళ్లకు ఇక్కడ ఓ సౌలభ్యం వుంది. ఆ
దేశాల రాజులనండి, సుల్తానులనండి తమ ఆస్తులను
సామ్రాజ్యాలను కాపాడడం కోసం అమెరికాకు డబ్బులు చెల్లించాలి. అలాగే ఆయా దేశాల్లో
అమెరికా నిర్మించిన రహదారులు మొదలయిన నిర్మాణాలకు అయిన ఖర్చు తాలూకు చెల్లింపులతో
పెట్రోలు చెల్లింపులు సరి.
సరే! అది వాళ్ల ఏర్పాటు.
మన సమస్య అమెరికా డాలర్లు. ఆ డాలర్ల ముద్రణకు అమెరికా ఉపయోగించే
తెల్ల కాగితం విలువా, మన బంగారం నిల్వల విలువా సమానం
అనుకోవాలేమో.
అంటే ఏమిటన్న మాట. మనం పెట్రోలు
దిగుమతులపై పెట్టే ఖర్చు తగ్గించుకోగలిగితే డాలర్ విలువ మన రూపాయి మారకం విలువతో
పోల్చినప్పుడు తగ్గుతుందన్న మాట. అంటే మరో ఏమిటన్న మాట. మనం కనుక ఒక్క మాట మీద
నిలబడి ఓ వారం రోజుల పాటు కార్లను రోడ్లకు దూరంగా వుంచి వాటికి విశ్రాంతి
ఇవ్వగలిగితే చాలు కొండెక్కి కూర్చున్న డాలరు దానంతట అదే దిగివస్తుందని
సూతుడు శౌనకాది మునులకు చెప్పగా వారిలో ఒకడు మన నెటిజెన్ల చెవిన వేయడం,
ఆంగ్లంలో వున్న ఆ విషయాలనన్నింటినీ కుదించి ఇలా
తెలుగులోకి అనువదించి రాయడమైనది. మంగళం మహత్. శ్రీ శ్రీ శ్రీ.
NOTE: Courtesy Image Owner
లేబుళ్లు:
Indian Rupee.American Dollar
22, సెప్టెంబర్ 2014, సోమవారం
హే కృష్ణా.......!
(Published by 'SURYA' telugu daily dated 24 -09-2014, Wednesday)
ఒక సందర్భాన్ని మననం చేసుకుందాం. మరో సన్నివేశాన్ని వూహించుకుందాం.
ఒక సందర్భాన్ని మననం చేసుకుందాం. మరో సన్నివేశాన్ని వూహించుకుందాం.
కౌరవసభలో ద్రౌపదీ వస్త్రాపహరణం. దుశ్శాసనుడు
పాంచాలి వలువలు లాగి అవమానించే సందర్భంలో సభ యావత్తు మౌనంగా మిన్నకుండి పోతుంది. దృపదరాజ
పుత్రి వేడుకోలు వినిపించుకున్న శ్రీ కృష్ణ పరమాత్మ హఠాత్తుగా ప్రత్యక్షమై ఆదుకుంటాడు.
ఇక సినిమాల్లో ఇలా హీరోలు వచ్చి ఆపదలో వున్న
హీరోయిన్లను అలా ఆదుకునే సన్నివేశాలు కోకొల్లలు. వీటి ఆధారంగా ఊహించుకుంటే-
నగరంలో ఏదో ఒక కాలేజీలో ఆడపిల్లల్ని ఆకతాయి
పిల్లలు వేధిస్తుంటారు. వారిలో ఒకమ్మాయి ధైర్యం చేసి పోలీసులకు మొబైల్ ఫోను ద్వారా సమాచారం అందిస్తుంది. నిమిషాల్లో పోలీసులు అక్కడ వాలిపోతారు.
యువతుల్ని వేధిస్తున్న అల్లరి పిల్లలపై రబ్బరు లాఠీలు ఝలిపిస్తారు. వెడుతూ వెడుతూ
'పోలీసులున్నారు జాగ్రత్త!' అంటూ హెచ్చరిక జారీచేసి వెడతారు.
ఇలా చేస్తే కాని నగరంలో ఆకతాయి మూకల్ని అరికట్టడం సాధ్యం
కాదన్న వూహ మెదిలినట్టుంది సాక్షాత్తు
తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మస్తిష్కంలో. రాజు తలచుకుంటే కొదవేముంది.
కమిటీ వేసారు. ఆ కమిటీ సభ్యులు కాలయాపన చేయకుండా నానారకాలుగా సమాచారాన్ని సేకరించి ముఖ్యమంత్రికి ఒక నివేదిక సమర్పించారు. ఈ కమిటీలో
నలుగురు సీనియర్ ఐ.ఏ.యస్., ముగ్గురు ఐ.పీ.యస్. అధికారులు వున్నారు. ఈ ఏడుగురిలో ఆరుగురు మహిళా అధికారులే కావడం ఒక విశేషం. ఈ నెల పదో తేదీనుంచి కమిటీ తన పని మొదలుపెట్టింది.
ఇరవయ్యో తేదీకల్లా ముఖ్యమంత్రికి నివేదిక అందచేసింది. ఈ మధ్యలో కమిటీ హైదరాబాదు ఐ టీ కారిడారులో వున్న వివిధ కంప్యూటర్
కంపెనీల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను
కలుసుకుంది. స్వచ్చంద సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుంది. స్వయం సహాయక
బృందాల సభ్యులతో సమావేశాలు జరిపింది.
మహిళా కళాశాలలకు వెళ్లి విద్యార్ధినుల మనోభావాలు తెలుసుకుంది. ఉద్యోగాలు గట్రా
చేయకుండా ఇంటిపట్టున వుండే గృహిణులను సయితం కలుసుకుంది. మీడియా ప్రతినిధులతో,
మహిళా జర్నలిష్టులతో ముచ్చటించింది. ఇక ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బందితో
సమావేశాలు సరేసరి. అంతే కాకుండా గుజరాత్, కేరళ రాష్ట్రాలకు బృందాలను పంపి ఈ విషయంలో అక్కడ మంచి ఫలితాలను ఇస్తున్న విధానాలను
అధ్యయనం చేసింది.
ఈ సమావేశాల్లో, ఈ సమాలోచనల్లో, ఈ సంప్రదింపుల్లో,
ఈ అభిప్రాయ సేకరణ క్రమంలో బాలికలు, మహిళల భద్రతకు సంబంధించిన అనేక అంశాలు వెలుగు
చూశాయి. ఆవిషయాలను అన్నింటినీ సాకల్యంగా పరిశీలించినమీదట, సత్వర ఫలితాలు సాధించేందుకు కొన్ని స్వల్పకాలిక చర్యలు వెంటనే చేపట్టాలని
ప్రభుత్వానికి ఈ కమిటీ సిఫారసు చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే కమిటీ సిఫార్సుల అమలుకు
వీలైన నిధులను ఆయా ప్రభుత్వ శాఖలకు విడుదల చేయాలని కూడా ఈ కమిటీ సూచించింది.
'హెల్ప్ లైన్' (ఆపన్న హస్తం) ఏర్పాటు చేయడం అనేది
కమిటీ సిఫారసుల్లో మొట్టమొదటిది.
అలాగే, జిల్లా స్థాయిలోను, నగరపాలక సంస్థ పరిధిలోను ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా పనిచేసే కేంద్రాలను నెలకొల్పాలని సూచించింది.
కమిటీ చేసిన ఇతర సిఫారసులు ఇలా వున్నాయి.
"పోలీసు శాఖలో మహిళా సిబ్బంది సంఖ్యను
ఇతోధికంగా పెంచాలి. అత్యాచార సంఘటనలు గురించిన పిర్యాదులపై సత్వరంగా విచారణ పూర్తిచేసి నేరం రుజువైన
పక్షంలో ముద్దాయిలకు కఠిన శిక్షలు పడేలాచూడడానికి జిల్లా స్థాయిలో ఫాస్ట్ ట్రాక్
కోర్టులను ఏర్పాటు చేయాలి. లైంగిక అత్యాచారాలకు గురైన బాధితులను బహిరంగంగా కాకుండా
వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించేందుకు
వీలుగా విధానాలను నిర్బంధం చేయాలి.ఢిల్లీ పోలీసు తరహాలో మహిళా రక్షక్ లను పోలీసు
కమీషనరేట్లలో, జిల్లా స్థాయి పోలీసు అధికారుల కార్యాలయాల్లో నియమించాలి. ఇంటర్
నెట్ లో అసభ్య చిత్రాలను చూపే సైట్లను పూర్తిగా నిరోధించాలి. మహిళలు, బాలికలకు
సంబంధించిన కేసుల విచారణలో ఖచ్చితమైన, ప్రామాణికమైన విధానాలను రూపొందించి అవి
సరిగా అమలయ్యేలా చూడాలి. కార్యాలయాలలో, విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగినులు, చదువుకునే
విద్యార్ధినుల భద్రతకు సంబంధించిన ఎలాటి సమాచారం వచ్చినా
రాకున్నా సకాలంలో స్పందించడానికి ఆయా ప్రాంతాలలో పోలీసు గస్తీ వ్యవస్థను పటిష్టం చేయాలి. మహిళా ఉద్యోగులు
ప్రయాణించే టాక్సీలలో మహిళా డ్రైవర్లు
మాత్రమె ఉండేలా చూడాలి.
"ఆటో రిక్షాలు, టాక్సీల నిర్వహణను మరింత
కట్టుదిట్టం చేసి వాటి రాకపోకలపై నిరంతర నిఘా పెట్టాలి. ఆర్టీసీ బస్సులు, లోకల్
రైళ్ళ వంటి ప్రజా రవాణా వ్యవస్థలను పటిష్టం చేయాలి. వివాహాలను నిర్బంధంగా నమోదు
చేసేలా చట్టాలను సవరించాలి. మద్యం వాడకం పెరగడం వల్ల మహిళలపై నేరాలు పెరిగిపోయే
అవకాశాలు వుండే కోణం నుంచి కూడా ఆలోచించి ఈ అంశంపై మరింత దృష్టి పెట్టాలి. అసంఘటిత రంగాల్లో,
ఇళ్ళల్లో పనిచేసే బాలికలు, మహిళల భద్రత పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలి. కడుపులో వున్న శిశువు ఆడపిల్ల అని తెలుసుకుని గర్భవిచ్చేధం
చేసే వికృత పోకడలను గట్టిగా అరికట్టాలి. అవసరంలో వున్న మహిళలకు న్యాయ సహాయాన్ని ఉచితంగా అందించాలి.
పడుపువృత్తిని అరికట్టే చర్యలకు మరింత పదును పెట్టాలి.
"గ్రామ స్థాయిలో స్త్రీ శక్తి సంఘాలను
ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రాల స్థాయిలో మహిళా వనరుల కేంద్రాలను నెలకొల్పాలి.
తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక మహిళా కమీషన్ ఏర్పాటుచేయాలి. విడిగా స్త్రీలకోసం
తెలంగాణలో మహిళా విశ్వవిద్యాలయం నెలకొల్పాలి."
ఈ నివేదిక చేతికి అందగానే ముఖ్యమంత్రి, కే.చంద్రశేఖర
రావు సీనియర్ అధికారులతో సుదీర్ఘ
సమాలోచనలు జరిపారు. లండన్ తరహా పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసి, హైదరాబాదు నగరాన్ని
నేర రహిత నగరంగా చేయాలనే లక్ష్యం ప్రకటించిన ముఖ్యమంత్రి, తదనుగుణంగా చర్యలు కూడా
తీసుకునే అవకాశాలు వున్నాయి. కమిటీలు ఏర్పాటుచేయడం, నివేదికలు తెప్పించుకోవడం,
వాటికి తగిన ప్రచారం కల్పించడం దరిమిలా వాటి సంగతి సమయానుకూలంగా మరచిపోవడం
ప్రభుత్వాల్లో పరిపాటే. కానీ ఈ విషయంలో తాను 'విభిన్నంగా వ్యవహరిస్తాను' అనే పేరు తెచ్చుకునే
దిశగా అడుగులు వేస్తె తెలంగాణా
ముఖ్యమంత్రికీ మంచిదే. తెలంగాణా ఆడపడుచులకూ
మంచిదే.
చూడాలి ఏం చేస్తారో! ఏం
జరుగుతుందో! NOTE: COURTESY IMAGE OWNER
లేబుళ్లు:
హే కృష్ణా.......!,
KCR
21, సెప్టెంబర్ 2014, ఆదివారం
షరా మామూలు గొప్ప మనిషి
కొందరు వృత్తి రీత్యా గొప్పవాళ్ళు అవుతారు.
మరికొందరు ప్రవృత్తి రీత్యా అవుతారు.
వృత్తి రీత్యా ప్రవృత్తి రీత్యా కూడా గొప్పవాళ్ళు
అయినవాళ్ళు అరుదుగా కనబడతారు.
హైదరాబాదు, జూబిలీ హిల్స్ ప్రాంతంలో, ఆంద్ర జ్యోతి దినపత్రిక దగ్గరలో
ఉదయపు వేళల్లో ఆజానుబాహు అయిన ఒక వ్యక్తి నింపాదిగా, ఏ హడావిడీ లేకుండా నడుచుకుంటూ
వెళ్ళే ఒక వ్యక్తి తారసపడతాడు. నాలుగు మాసాల క్రితం వరకూ ఇది దినవారీ దృశ్యమే.
అయితే ఈ మధ్య వివిధ రాష్ట్రాలు
పర్యటిస్తూ, ఆయా ముఖ్యమంత్రులతో సమావేశాలు జరుపుతూ కొంత బిజీ అయిపోయి ఆయన కనబడడం
లేదు. ఎలాటి డాబూ దర్పం లేకుండా, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చాలా సాధారణంగా కానవచ్చే ఆ పెద్దమనిషి నిజానికి అంత మామూలు మనిషేం
కాదు. ఆయన్ని ఒకసారి కలవాలని, ఆయనతో ఓ
మంచి మాట అనిపించుకోవాలని మన దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెగ ఆరాటపడిపోతుంటారు.
అలాటి మనిషి తన వృత్తి జీవితంలో పరిచయమై, అదే ప్రాంతంలో నివసిస్తున్న మా రెండో
అన్నయ్య భండారు రామచంద్రరావు వంటి వారితో కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ, పాత
ముచ్చట్లు కలబోసుకుంటూ, అక్కడ వున్న వీధుల్లో కాసేపు తిరిగి ఇంటికి చేరుకుంటారు.
కేంద్ర ప్రభుత్వంలో సహాయ మంత్రి హోదా, అంటే రాష్ట్రంలో కేబినేట్ హోదాకు సమానమైన
స్థాయి వుండి కూడా ఆయన నిరాడంబరంగానే వుంటారు. చిన్న చిన్న కార్పోరేషన్ చైర్మన్లు,
కార్పొరేటర్లు సయితం, తమకు అధికారికంగా హక్కు లేకపోయినా బుగ్గ కార్లలో తిరగాలని
ఆరాట పడే రోజులు ఇవి. అలాటిది ఆయన వాహనంపై ఇలాటి అధికార చిహ్నాలు ఏవీ వుండవు. ముందూ వెనుకా
సెక్యూరిటీ పోలీసులు అంటూ ఎవరూ కనబడరు.
పనిమీద వెడుతుంటే ట్రాఫిక్ పోలీసుల హడావిడి అసలే కనబడదు. సాధారణ పౌరుల మాదిరిగానే
ఆయన తన దినవారీ వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ వుంటారు. ఆయన ఎవరంటే,
ఈ మధ్య తిరుపతిలో ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు, మొన్న హైదరాబాదు పలక్ నుమా ప్యాలెస్ లో తెలంగాణా ముఖ్యమంత్రి
చంద్రశేఖర రావు - కేంద్రం నుంచి వచ్చిన
పద్నాలుగవ ఆర్ధిక సంఘానికి ఘనమైన విందులు ఇచ్చారు. ఆ సంఘం అధ్యక్షుడు వై వీ రెడ్డి
(వై.వేణుగోపాల రెడ్డి) ఈ షరా మామూలుగా తిరిగే పెద్దమనిషి అంటే ఓ పట్టాన నమ్మడం
కష్టం.
(శ్రీ వై.వీ.రెడ్డి)
లేబుళ్లు:
షరా మామూలు గొప్ప మనిషి,
Y.V.Reddy
20, సెప్టెంబర్ 2014, శనివారం
నెరవేరని స్కాటిష్ ప్రజల వేర్పాటువాద స్వప్నం
'బ్రిటన్ తో కలిసి వుండాలా విడిపోవాలా' అనే అంశంపై
స్కాట్ లాండ్ ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. మూడువందల ఏళ్ళకు పైబడిన
బంధాన్నే వారు బ్రిటన్ తో కోరుకున్నారు. స్కాట్ లాండ్ పార్ల మెంట్ తీర్మానం ప్రకారం ఈనెల పద్దెనిమిదో తేదీన నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో సుమారు పదకొండు శాతం తేడాతో
వేర్పాటువాదులు వోడిపోయారు.
14 వ శతాబ్దంలో ఇంగ్లాండ్, స్కాట్ లాండ్ దేశాలనడుమ
వరుసగా అనేక యుద్ధాలు జరిగాయి. 1653లో ఈ రెండు సామ్రాజ్యాలు పరస్పరం సంధి చేసుకుని ఒకే
ప్రభుత్వం కింద తాత్కాలికంగా ఏకమయ్యాయి. 1707లో
స్కాట్ లాండ్ , ఇంగ్లాండ్ లు గ్రేట్ బ్రిటన్ పేరుతొ ఒక్కటయ్యాయి. తరువాత 1801లో
ఐర్లాండ్ ని కూడా కలుపుకుని యునైటెడ్ కింగ్ డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ గా అవతరించింది.
కాని, 1922 లో ఐర్లాండ్ లోని అనేక ప్రాంతాల వారు ఆ సామ్రాజ్యం
నుంచి వేరు పడిపోయారు. అయితే స్కాట్ లాండ్ మాత్రం గ్రేట్ బ్రిటన్ లో భాగంగానే
కొనసాగుతూ వచ్చింది. లేబర్ పార్టీ ప్రభావంతో స్కాట్ లాండ్ లో వేర్పాటు ఉద్యమాలు
మొదలయ్యాయి. స్కాట్ లాండ్ కు ప్రత్యేక పాలన కోరిన లేబర్ పార్టీ తదనంతర కాలంలో తన విధానాన్ని
మార్చుకుంది. దానితో 1934లో ఈ బాధ్యతను కొత్తగా పురుడుపోసుకున్న స్కాటిష్
నేషనల్ పార్టీ తన భుజానికి ఎత్తుకుంది. కాని పాతికేళ్ళవరకు ఈ కొత్త పార్టీ తన
లక్ష్యాల దిశగా గట్టిగా అడుగులు వేయలేకపోయింది. 1970 నుంచీ స్కాటిష్ ప్రజానీకంలో
వేర్పాటువాదం పుంజుకోవడం మళ్ళీ మొదలయింది. జిమ్ కేలగాన్ నేతృత్వంలో ఏర్పడ్డ లేబర్
ప్రభుత్వం మద్దతుతో ఈవాదానికి మరింత బలం చేకూరినట్టయింది.
1979 లో
ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. వేర్పాటువాదులకు అనుకూలంగా ప్రజాతీర్పు వచ్చింది.
కానీ, మొత్తం వోటర్లలో నలభయ్ శాతానికి మించి వోట్లు వస్తేనే ఆ తీర్పుకు విలువ
వుంటుందన్న నిబంధన కారణంగా స్కాటిష్ వేర్పాటువాదానికి తొలి వోటమి ఎదురయింది. 1977 లో తిరిగి లేబర్ పార్టీ
అధికారంలోకి వచ్చిన తరువాత కానీ ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సంస్కరణలు గురించి ఎవ్వరూ
ఆలోచించలేదు. ఆ ఏడాది మరో రిఫరెండం నిర్వహించారు. కేంద్రం నుంచి బదలాయించిన
అధికారాలు కలిగిన స్కాటిష్ పార్ల మెంటు ఏర్పాటుకు అనుకూలంగా మెజారిటీ ప్రజలు వోటు
వేసారు. దరిమిలా 1988 స్కాట్లాండ్ చట్టం ప్రకారం 1999 మే ఆరోతేదీన మొట్టమొదటి
స్కాటిష్ పార్లమెంటు ఏర్పాటయింది. స్కాట్ లాండ్ కు సంబందించిన శాసనాలు సొంతంగా
చేసుకునే అధికారాన్ని ఈ పార్ల మెంటుకు దఖలు పరిచారు.
2007 స్కాటిష్
పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. ఇంగ్లాండు
నుంచి వేర్పాటు కోరుతూ 2010 లో తిరిగి రిఫరెండం
నిర్వహిస్తామన్న ఎన్నికల వాగ్దానంతో స్కాటిష్ నేషనల్ పార్టీ స్కాటిష్ పార్ల మెంటులో ఎక్కువ సీట్లు పొందిన
పార్టీగా అవతరించింది. అలెక్స్ సాల్మండ్ నేతృత్వంలో ఆ పార్టీ మైనారిటీ
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలింది. ఆ ప్రభుత్వం తన వాగ్దానానికి అనుకూలంగా మూడు ప్రత్యామ్నాయాలతో
కూడిన ఒక బిల్లును తయారు చేసి పార్ల మెంటులో ప్రవేశపెట్టింది. దురదృష్టవశాత్తు మొత్తం సభ్యులు 129 మందిలో 50 మంది సభ్యులు మాత్రమె రిఫరెండానికి అనుకూలంగా వోటు
చేసారు. సరయిన మద్దతు కూడగట్టుకోవడంలో విఫలమయిన ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకుంది.
అయితే, స్కాటిష్ నేషనల్
పార్టీ అంతటితో నిరుత్సాహపడకుండా 2011 ఎన్నికల మేనిఫెస్టోలో మళ్ళీ
రిఫరెండం వాగ్దానాన్ని పొందుపరిచింది. ఆ ఎన్నికల్లో స్కాటిష్ నేషనల్ పార్టీకి
తిరుగులేని ఆధిక్యతను ప్రజలు కట్టబెట్టారు. మొత్తం 129 సీట్లలో ఆ పార్టీ 69 స్థానాలు గెలుచుకుంది. తద్వారా రిఫరెండం జరపాలన్న తమ
ఎన్నికల వాగ్దానానికి ప్రజల మద్దతును సయితం కూడగట్టుకుంది.
2012 జనవరిలో రిఫరెండం
నిర్వహించుకోవడానికి స్కాటిష్ పార్ల మెంటుకు యునైటెడ్ కింగ్ డం ప్రభుత్వం అంగీకరించింది.
అయితే అందుకు కొన్ని షరతులు విధించింది. న్యాయమైన రీతిలో, చట్టబద్ధంగా, నిర్ణయాత్మకంగా
రిఫరెండం జరపాలని కోరింది.
రిఫరెండంలో ఎవరు వోటు
వెయ్యాలి, ఎవరు దీన్ని నిర్వహించాలి మొదలయిన విధి విధానాలను ముందుగానే ఖరారు చేయాలని
సూచించింది. న్యాయపరమయిన అంశాలను,
రిఫరెండం నిర్వహించే తేదీని ఖరారు చేసే పనిలో యూకే ప్రభుత్వం ఉండగానే, మరోపక్క సాల్మండ్ 2014 లో రిఫరెండం జరుగుతుందని
హడావిడిగా ప్రకటించారు. స్వాతంత్రేచ్చను వ్యక్తం చేసే రిఫరెండం యాక్టును స్కాటిష్
పార్లమెంటు ఆమోదించింది. 2013 ఆగస్టు ఏడో తేదీన దీనికి బ్రిటిష్ రాణి ఆమోదం లభించింది.
స్కాట్లాండ్ ను స్వతంత్ర దేశంగా మార్చుకునే ఉద్దేశ్యం కలిగిన ఒక శ్వేత పత్రాన్ని
కూడా సాల్మాండ్ ప్రభుత్వం విడుదల చేసింది. 2014 సెప్టెంబర్ 18 వ తేదీన రిఫరెండం
నిర్వహించడం జరుగుతుందని షెడ్యూల్ కూడా ప్రకటించింది. అదే సంవత్సరం స్కాట్ లాండ్
లో కామన్ వెల్త్ దేశాల క్రీడోత్సవాలకు స్కాట్ లాండ్ ఆతిధ్య దేశంగా వ్యవహరించాల్సి వుంటుంది
అనే అభ్యంతరాలను సయితం కూడా సాల్మాండ్
ఖాతరు చేయలేదు. ఈ రిఫరెండంలో పాల్గొనే వోటర్ల కనీస వయస్సును 18 నుంచి 16 ఏళ్ళకు తగ్గించింది. స్కాట్
ల్యాండ్ వెలుపల నివాసం ఉంటున్న స్కాట్ జాతీయులకు కూడా వోటింగ్ హక్కు ఇవ్వాలనే డిమాండ్ ని కూడా లెక్కపెట్టలేదు. ఇలాటి వారి సంఖ్య
సుమారు ఎనిమిది లక్షల వరకు ఉంటుందని అంచనా. స్కాట్ లాండ్ స్వాతంత్రానికి సంబందించి
నిర్వహించే రిఫరెండంలో బ్రిటన్ లోని పౌరులకు
కూడా అవకాశం కల్పించాలని యూకే పెద్దల సభలో గట్టిగా వాదనలు వినిపించాయి. అయితే
దీన్ని బ్రిటిష్ ప్రభుత్వమే తిరస్కరించింది. యునైటెడ్ కింగ్ డం ని వొదిలి పెట్టి
వేరుపడాలా లేక కలిసి వుండాలా అన్నది స్కాటిష్ ప్రజలు మాత్రమె తేల్చుకోవాలని స్కాట్
లాండ్ అడ్వొకేట్ జనరల్ చేసిన వాదనను బ్రిటిష్ ప్రభుత్వం సమర్ధించింది. అంతే కాకుండా 2014 డిసెంబర్ లోపు రిఫరెండం నిర్వహించుకోవడానికి స్కాటిష్
పార్లమెంటుకు అధికారం ఇస్తూ ఎడెన్ బర్గ్ వొప్పందంపై సంతకాలు చేసింది. దీనితో బ్రిటన్ తో కలిసి వుండాలా,
వేరుపడి స్వతంత్ర దేశంగా ఏర్పడాలా అనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడానికి స్కాట్
లాండ్ ప్రజలకు అవకాశం లభించింది.
దరిమిలా ఈనెల పద్దెనిమిదో తేదీన కట్టుదిట్టమైన
ఏర్పాట్ల మధ్య రిఫరెండం జరిగింది. 'స్కాట్ లాండ్ స్వతంత్ర దేశంగా ఏర్పడడాన్ని మీరు
కోరుకుంటున్నారా?' అని ప్రశ్న అడగాలని ముందు స్కాటిష్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రశ్న
తీరులోనే వోటర్లను ఎలా జవాబు ఇవ్వాలని కోరుకుంటున్నారో తెలిసిపోతుందని ఎలక్షన్ కమీషన్
దాన్ని త్రోసిపుచ్చింది. 'స్కాట్ ల్యాండ్
స్వతంత్ర దేశంగా వుండాలనుకుంటున్నారా?' అని ఆ ప్రశ్న రూపాన్ని మార్చాలని భావించింది. ఈ
ప్రశ్నకు వోటర్లు 'అవును' అనికానీ, 'లేదు' అని కానీ క్లుప్తంగా జవాబు ఇవ్వాల్సి వుంటుంది. మొత్తం దేశం యావత్తు ఈ 'అవును' కాదు' అనే బృందాలుగా
విడిపోయి ఉదృతంగా ప్రచారం కొనసాగింది.
ఎట్టకేలకు
జరిగిన రిఫరెండంలో 'కలిసి ఉండాలని కోరుకునే' వారికే మెజారిటీ లభించింది.
(20-09-2014)
19, సెప్టెంబర్ 2014, శుక్రవారం
పాలకొల్లు నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన తెలుగు సంగీత కెరటం మాండలిన్ శ్రీనివాస్
(Published
in Andhra Jyothy, Telugu Daily in its Edit page today)
ఎక్కడో పాలకొల్లులో జన్మించిన ఒక వ్యక్తి మరణవార్తను
బీబీసీ శుక్రవారం నాడు ప్రసారం చేసింది. "ప్రసిద్ధ భారతీయ సంగీత విద్వాంసుడు మాండలిన్ శ్రీనివాస్ దక్షిణాది నగరం
చెన్నైలో శుక్రవారం నాడు కన్నుమూసారం"టూ, అతడు మరణించిన కొద్ది గంటల్లోనే
బీబీసీ వెల్లడించింది.
బీబీసీలో ఈవార్త వచ్చిందంటే ఉప్పలపు శ్రీనివాస్
అనే నలభయ్ అయిదేళ్ళ ఈ పాలకొల్లు కుర్రవాడు ఏ స్థాయికి ఎదిగాడన్నది సులభంగా అర్ధం
చేసుకోవచ్చు. పాశ్చాత్య సంగీత పరికరం మాండలిన్ పేరే శ్రీనివాస్ ఇంటిపేరుగా
మారిపోయిందంటే దానిపై ఈ గ్రామీణ ప్రాంతపు, చదువూ సంధ్యా లేని కుర్రాడు యెంత పట్టు
సాధించాడో తెలిసిపోతుంది.
పూవు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు
పాలకొల్లులో తన తండ్రి సత్యనారాయణతో కలిసి చిన్నతనంలోనే బ్యాండ్ మేళాలలో శ్రీనివాస్ వాయిస్తూ వుండేవాడు.
బాల్యంలోనే తాను స్వయంగా నేర్చుకున్న సంగీత
విద్యతో నలుగురినీ మెప్పించేవాడు.
పాలకొల్లు అంటేనే సంగీతాభిమానుల
పుట్టిల్లు. క్లారినెట్ వాయించే ఒక సాధారణ వ్యక్తి శిలావిగ్రహం ఆ వూరి నడిబొడ్డులో
ప్రతిష్టించడం సంగీతంపట్ల ఆ వూరివారలకు
వున్నఆదరాభిమానాలకు నిదర్శనం.
బ్యాండ్ మేళంలో వాయిస్తున్న శ్రీనివాస్ అలనాటి సంగీత విద్వాంసుడు రుద్రరాజు సుబ్బరాజు గారి కంటపడడం శ్రీనివాస్
జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. ఆ కుర్రాడిలో అంతర్లీనంగా దాగివున్న ప్రతిభను చెన్నైలో
స్తిరపడిన ఆ విద్వాంసుడు చప్పున గుర్తించగలిగారు. వెంటనే తండ్రితో సహా ఆ
కుర్రాడిని వెంటబెట్టుకుని మద్రాసు తీసుకువెళ్ళారు. దగ్గర వుంచుకుని స్వయంగా సంగీతంలోని మెళకువలను బోధించారు. అసలే
దైవదత్తమైన సంగీతం శ్రీనివాస్ కు పుట్టుకతోనే అబ్బింది. పూవుకు సువాసన తోడయినట్టు
సుబ్బరాజుగారి గురు కటాక్షం సిద్దించింది. మట్టిలో దాగున్న మాణిక్యం వెలుగులోకి
వచ్చి నలుదెసలకు తన కాంతులను వెదజల్లింది. ఇంతింతయి వటుడింతయి అన్నట్టు సంగీత ప్రపంచంలో శ్రీనివాస్ ఎదుగుదలకు అడ్డులేకుండా పోయింది.
అంతవరకూ కర్నాటక సంగీతంలో మాండలిన్ వంటి పాశ్చాత్య పరికరానికి చోటులేదు. సంగీత
కచ్చేరీలలో ఎక్కువగా కానవచ్చే 'హార్మోనియం' కూడా ఆకాశవాణి గుర్తింపు పొందడానికి దాదాపు యాభయ్
ఏళ్ళు పట్టింది. అలాటిది, తమిళనాడులోని సంగీత విద్వాంసులందరి మూకుమ్మడి ప్రశంసలు పొందిన శ్రీనివాస్, మాండలిన్ సమేతంగా ఆకాశవాణి స్టూడియోలో సగౌరవంగా
అడుగుపెట్టడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా పోయింది. పాలకొల్లులో పుట్టి అనేక
ప్రపంచదేశాలలో మాండలిన్ ప్రదర్శనలు ఇచ్చి,
అనేకానేక పురస్కారాలు పొంది, సమకాలీన సంగీత దురంధరుల సరసనే సముచిత స్థానం
సంపాదించుకున్న శ్రీనివాస్ అకాల మృత్యువు వొడికిచేరడం నిజంగా విచారకరం. సామాజిక
అసమానతలు మనుషులలోని అసలయిన ప్రతిభను అణచిపెట్టలేవు అనడానికి మాండలిన్ శ్రీనివాస్
నిలువెత్తు నిదర్శనం.
-ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు
(19-09-2014)
లేబుళ్లు:
మాండలిన్ శ్రీనివాస్
18, సెప్టెంబర్ 2014, గురువారం
దేవుడితో ముచ్చట
ఏకాంబరం దేవుడ్ని కలుసుకున్నాడు. ఆ రోజెందుకో
దేవుడు కూడా ఖాళీగా వుండి ఏకాంబరం అడిగే చొప్పదంటు ప్రశ్నలు అన్నింటికీ జవాబులు చెప్పాడు.
'దేవుడూ దేవుడూ నిన్నొకటి అడగనా?'
'దాందేవుంది
అలాగే అడుగు'
'ముందే చెబుతున్నాను.
అడిగిన తరువాత ఇదేం పిచ్చి ప్రశ్న అని ఆట పట్టించకూడదు సుమా!'
'మనుషులందరూ నా సంతానమే. సంతానం అంటే అందరికీ
పిచ్చి ప్రేమే కదా! అడుగు. చేతనయిన జవాబు చెబుతాను'
'ఈరోజు తెల్లారిన దగ్గరినుంచి ఒక్కటీ సరిగ్గా
జరగడం లేదు. రాత్రి
సరిగా నిద్రపట్టక ఆలస్యంగా లేచాను. తయారై ఆఫీసుకు వెడదామని చూస్తె కారు స్టార్ట్
కాలేదు'
'హోటల్లో భోజనానికి వెడితే నా శ్రాద్ధం, ఉడికీఉడకని
అన్నం నా మొహాన తగలేశాడు. తినబుద్దికాక రోడ్డుపక్కన బండి వద్ద దొరికింది తినేసి ఆఫీసుకు
చేరాను. అక్కడ ఆఫీసరు మాత్రం చక్కగా వడ్డించాడనుకో, ఆలస్యం అయినందుకు'
'ఇంకా...'
'ఇంకా అంటే చాలావుంది. ఫ్రెండుతో మాట్లాడుతుంటే ఫోను చార్జ్ అయిపోయింది'
'తరవాత....పోనీలే! ఇప్పుడు నేను చెప్పనా! నీకీ రోజు
ఎందుకు ఇలా గడిచిందో. నువ్వు ఆలస్యంగా లేవడం మంచిదయింది. ఇది నా నిర్వాకమే. నువ్వు
నిద్రపోతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ అయింది. ఆ సమయంలో నువ్వు బాత్ రూమ్ లో వుండి వుంటే షాక్ కొట్టేది'
'కారు స్టార్ట్ కాకపోవడానికి కూడా కారణం నేనే. ఆ
వేళప్పుడు మీ వీధిలో బాగా తాగి ఒకడు కారు అడ్డదిడ్డంగా నడుపుతున్నాడు. నువ్వు వెళ్ళినట్టయితే
ప్రమాదం జరిగుండేది'
'హోటల్లో అన్నం సరిగ్గా ఉడకలేదన్నావు. అది వండిన
మనిషికి ఈ రోజు వొంట్లో బాగా లేదు. అంటురోగం. అతడు వండిన వంట తినకపోవడమే
మంచిదయింది'
'ఏదో ఫ్రెండూ ఫోనూ అని చెప్పావు చూడు. వాడు
నిజానికి నీ ఫ్రెండు కాదు. వాడేదో వెధవ పనిచేస్తూ నిన్నూ ఆ ముగ్గులో దించాలని ఫోను
చేసాడు. అదే టైం కి చార్జ్ అయిపోవడం వల్ల నువ్వా కేసులో చిక్కోలేదు'
'హోరి దేవుడా! వీటి
వెనుక ఇంత కధ ఉందా! తెలియక నిన్ను అనవసరంగా ఆడిపోసుకున్నానే! నన్ను మన్నించు
మహాత్మా!'
'పరవాలేదులే ఇవన్నీ
నాకు అలవాటే. మంచి జరిగితే దేవుడి దయ అంటారు. లేకపోతే దేవుడే చేశాడు అంటారు. మంచీ
చెడూ అన్నీ నా ఖాతాలోకి తోసేస్తుంటారు. నాకు ధన్యవాదాలు చెప్పనక్కరలేదు కానీ, ఈ
రోజు గడవడానికి ఇంకా సమయం వుంది. ఏదన్నా చేతయిన మంచి పని ఒకటి చేసి ఇతరులచేత మంచి
అనిపించుకో. అది చాలు'
(నెట్లో
తిరుగాడుతున్న ఓ ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)
NOTE: Courtesy Image Owner
లేబుళ్లు:
దేవుడితో ముచ్చట
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)






