21, సెప్టెంబర్ 2014, ఆదివారం

షరా మామూలు గొప్ప మనిషి



కొందరు వృత్తి రీత్యా గొప్పవాళ్ళు అవుతారు. మరికొందరు ప్రవృత్తి రీత్యా అవుతారు.
వృత్తి రీత్యా ప్రవృత్తి రీత్యా కూడా గొప్పవాళ్ళు అయినవాళ్ళు అరుదుగా కనబడతారు.
హైదరాబాదు, జూబిలీ హిల్స్  ప్రాంతంలో, ఆంద్ర జ్యోతి దినపత్రిక దగ్గరలో ఉదయపు వేళల్లో ఆజానుబాహు అయిన ఒక వ్యక్తి నింపాదిగా, ఏ హడావిడీ లేకుండా నడుచుకుంటూ వెళ్ళే ఒక వ్యక్తి తారసపడతాడు. నాలుగు మాసాల క్రితం వరకూ ఇది దినవారీ దృశ్యమే. అయితే ఈ  మధ్య వివిధ రాష్ట్రాలు పర్యటిస్తూ, ఆయా ముఖ్యమంత్రులతో సమావేశాలు జరుపుతూ కొంత బిజీ అయిపోయి ఆయన కనబడడం లేదు. ఎలాటి డాబూ దర్పం లేకుండా, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా  చాలా సాధారణంగా  కానవచ్చే ఆ పెద్దమనిషి నిజానికి అంత మామూలు మనిషేం కాదు.  ఆయన్ని ఒకసారి కలవాలని, ఆయనతో ఓ మంచి మాట అనిపించుకోవాలని మన దేశంలోని  అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెగ ఆరాటపడిపోతుంటారు. అలాటి మనిషి తన వృత్తి జీవితంలో పరిచయమై, అదే ప్రాంతంలో నివసిస్తున్న మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు వంటి వారితో కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ, పాత ముచ్చట్లు కలబోసుకుంటూ, అక్కడ వున్న వీధుల్లో కాసేపు తిరిగి ఇంటికి చేరుకుంటారు. కేంద్ర ప్రభుత్వంలో సహాయ మంత్రి హోదా, అంటే రాష్ట్రంలో కేబినేట్ హోదాకు సమానమైన స్థాయి వుండి కూడా ఆయన నిరాడంబరంగానే వుంటారు. చిన్న చిన్న కార్పోరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు సయితం, తమకు అధికారికంగా హక్కు లేకపోయినా బుగ్గ కార్లలో తిరగాలని ఆరాట పడే రోజులు ఇవి. అలాటిది ఆయన వాహనంపై  ఇలాటి అధికార చిహ్నాలు ఏవీ వుండవు. ముందూ వెనుకా సెక్యూరిటీ పోలీసులు  అంటూ ఎవరూ కనబడరు. పనిమీద వెడుతుంటే ట్రాఫిక్ పోలీసుల హడావిడి అసలే కనబడదు. సాధారణ పౌరుల మాదిరిగానే ఆయన తన దినవారీ వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ వుంటారు. ఆయన ఎవరంటే,
ఈ మధ్య తిరుపతిలో ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మొన్న హైదరాబాదు పలక్ నుమా ప్యాలెస్ లో తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు -  కేంద్రం నుంచి వచ్చిన పద్నాలుగవ ఆర్ధిక సంఘానికి ఘనమైన విందులు ఇచ్చారు. ఆ సంఘం అధ్యక్షుడు వై వీ రెడ్డి (వై.వేణుగోపాల రెడ్డి) ఈ షరా మామూలుగా తిరిగే పెద్దమనిషి అంటే ఓ పట్టాన నమ్మడం కష్టం.


(శ్రీ వై.వీ.రెడ్డి)

ఒక విచిత్రం ఏమిటంటే, హోదాలను పక్కనబెట్టి సాదాసీదాగా జీవనం గడిపే పెద్దవారి గురించి చెప్పుకునే వారు చాలామంది కనిపిస్తారు. కానీ అలాటి వారిని ఆదర్శంగా తీసుకుని అనుసరిద్దామనుకునే వాళ్ళు తక్కువగా కానవస్తారు. అయినా కానీ, ఇలాటివారిమధ్యన  మసలగలిగే అవకాశం లభించినందుకు సంతోషించాలి.

20, సెప్టెంబర్ 2014, శనివారం

నెరవేరని స్కాటిష్ ప్రజల వేర్పాటువాద స్వప్నం


'బ్రిటన్ తో కలిసి వుండాలా విడిపోవాలా' అనే అంశంపై స్కాట్ లాండ్ ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. మూడువందల ఏళ్ళకు పైబడిన బంధాన్నే వారు బ్రిటన్ తో కోరుకున్నారు. స్కాట్ లాండ్ పార్ల మెంట్  తీర్మానం ప్రకారం ఈనెల పద్దెనిమిదో తేదీన  నిర్వహించిన ప్రజాభిప్రాయ  సేకరణలో సుమారు పదకొండు శాతం తేడాతో వేర్పాటువాదులు వోడిపోయారు.
14 వ శతాబ్దంలో ఇంగ్లాండ్, స్కాట్ లాండ్ దేశాలనడుమ వరుసగా అనేక యుద్ధాలు జరిగాయి. 1653లో ఈ రెండు సామ్రాజ్యాలు పరస్పరం సంధి చేసుకుని ఒకే ప్రభుత్వం కింద తాత్కాలికంగా ఏకమయ్యాయి. 1707లో స్కాట్ లాండ్ , ఇంగ్లాండ్ లు గ్రేట్ బ్రిటన్ పేరుతొ ఒక్కటయ్యాయి. తరువాత 1801లో ఐర్లాండ్ ని కూడా కలుపుకుని యునైటెడ్ కింగ్ డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ గా అవతరించింది. కాని, 1922 లో ఐర్లాండ్ లోని అనేక ప్రాంతాల వారు ఆ సామ్రాజ్యం నుంచి వేరు పడిపోయారు. అయితే స్కాట్ లాండ్ మాత్రం గ్రేట్ బ్రిటన్ లో భాగంగానే కొనసాగుతూ వచ్చింది. లేబర్ పార్టీ ప్రభావంతో స్కాట్ లాండ్ లో వేర్పాటు ఉద్యమాలు మొదలయ్యాయి. స్కాట్ లాండ్ కు ప్రత్యేక పాలన కోరిన లేబర్ పార్టీ తదనంతర కాలంలో తన విధానాన్ని మార్చుకుంది. దానితో 1934లో ఈ బాధ్యతను కొత్తగా పురుడుపోసుకున్న స్కాటిష్ నేషనల్ పార్టీ తన భుజానికి ఎత్తుకుంది. కాని పాతికేళ్ళవరకు ఈ కొత్త పార్టీ తన లక్ష్యాల దిశగా గట్టిగా అడుగులు వేయలేకపోయింది. 1970 నుంచీ స్కాటిష్ ప్రజానీకంలో వేర్పాటువాదం పుంజుకోవడం మళ్ళీ మొదలయింది. జిమ్ కేలగాన్ నేతృత్వంలో ఏర్పడ్డ లేబర్ ప్రభుత్వం మద్దతుతో ఈవాదానికి మరింత బలం చేకూరినట్టయింది.
1979 లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. వేర్పాటువాదులకు అనుకూలంగా ప్రజాతీర్పు వచ్చింది. కానీ, మొత్తం వోటర్లలో నలభయ్ శాతానికి మించి వోట్లు వస్తేనే ఆ తీర్పుకు విలువ వుంటుందన్న నిబంధన కారణంగా స్కాటిష్ వేర్పాటువాదానికి తొలి వోటమి ఎదురయింది. 1977 లో తిరిగి లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కానీ ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సంస్కరణలు గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. ఆ ఏడాది మరో రిఫరెండం నిర్వహించారు. కేంద్రం నుంచి బదలాయించిన అధికారాలు కలిగిన స్కాటిష్ పార్ల మెంటు ఏర్పాటుకు అనుకూలంగా మెజారిటీ ప్రజలు వోటు వేసారు. దరిమిలా  1988 స్కాట్లాండ్ చట్టం ప్రకారం 1999 మే ఆరోతేదీన మొట్టమొదటి స్కాటిష్ పార్లమెంటు ఏర్పాటయింది. స్కాట్ లాండ్ కు సంబందించిన శాసనాలు సొంతంగా చేసుకునే అధికారాన్ని ఈ పార్ల మెంటుకు దఖలు పరిచారు.     
2007 స్కాటిష్ పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి.  ఇంగ్లాండు నుంచి వేర్పాటు కోరుతూ 2010 లో తిరిగి రిఫరెండం నిర్వహిస్తామన్న ఎన్నికల వాగ్దానంతో స్కాటిష్ నేషనల్ పార్టీ  స్కాటిష్ పార్ల మెంటులో ఎక్కువ సీట్లు పొందిన పార్టీగా అవతరించింది. అలెక్స్ సాల్మండ్ నేతృత్వంలో ఆ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలింది. ఆ ప్రభుత్వం తన వాగ్దానానికి అనుకూలంగా మూడు ప్రత్యామ్నాయాలతో కూడిన ఒక బిల్లును తయారు చేసి పార్ల మెంటులో ప్రవేశపెట్టింది. దురదృష్టవశాత్తు  మొత్తం సభ్యులు  129 మందిలో  50 మంది సభ్యులు మాత్రమె రిఫరెండానికి అనుకూలంగా వోటు చేసారు. సరయిన మద్దతు కూడగట్టుకోవడంలో విఫలమయిన ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకుంది.
అయితే, స్కాటిష్ నేషనల్ పార్టీ అంతటితో నిరుత్సాహపడకుండా  2011 ఎన్నికల మేనిఫెస్టోలో మళ్ళీ రిఫరెండం వాగ్దానాన్ని పొందుపరిచింది. ఆ ఎన్నికల్లో స్కాటిష్ నేషనల్ పార్టీకి తిరుగులేని ఆధిక్యతను ప్రజలు కట్టబెట్టారు. మొత్తం 129 సీట్లలో ఆ పార్టీ  69 స్థానాలు గెలుచుకుంది. తద్వారా రిఫరెండం జరపాలన్న తమ ఎన్నికల వాగ్దానానికి ప్రజల మద్దతును సయితం కూడగట్టుకుంది.
2012 జనవరిలో రిఫరెండం నిర్వహించుకోవడానికి స్కాటిష్ పార్ల మెంటుకు యునైటెడ్ కింగ్ డం ప్రభుత్వం అంగీకరించింది. అయితే అందుకు కొన్ని షరతులు విధించింది. న్యాయమైన రీతిలో, చట్టబద్ధంగా, నిర్ణయాత్మకంగా రిఫరెండం జరపాలని కోరింది.
రిఫరెండంలో ఎవరు వోటు వెయ్యాలి, ఎవరు దీన్ని నిర్వహించాలి మొదలయిన విధి విధానాలను ముందుగానే ఖరారు చేయాలని సూచించింది. న్యాయపరమయిన అంశాలను, రిఫరెండం నిర్వహించే తేదీని ఖరారు చేసే  పనిలో యూకే ప్రభుత్వం ఉండగానే, మరోపక్క  సాల్మండ్ 2014 లో రిఫరెండం జరుగుతుందని హడావిడిగా ప్రకటించారు. స్వాతంత్రేచ్చను వ్యక్తం చేసే రిఫరెండం యాక్టును స్కాటిష్ పార్లమెంటు ఆమోదించింది. 2013 ఆగస్టు ఏడో  తేదీన దీనికి బ్రిటిష్ రాణి ఆమోదం లభించింది. స్కాట్లాండ్ ను స్వతంత్ర దేశంగా మార్చుకునే ఉద్దేశ్యం కలిగిన ఒక శ్వేత పత్రాన్ని కూడా సాల్మాండ్ ప్రభుత్వం విడుదల చేసింది. 2014 సెప్టెంబర్ 18 వ తేదీన రిఫరెండం నిర్వహించడం జరుగుతుందని షెడ్యూల్ కూడా ప్రకటించింది. అదే సంవత్సరం స్కాట్ లాండ్ లో కామన్ వెల్త్ దేశాల క్రీడోత్సవాలకు స్కాట్ లాండ్ ఆతిధ్య దేశంగా వ్యవహరించాల్సి వుంటుంది అనే అభ్యంతరాలను సయితం కూడా  సాల్మాండ్ ఖాతరు చేయలేదు. ఈ రిఫరెండంలో పాల్గొనే వోటర్ల కనీస వయస్సును 18 నుంచి 16 ఏళ్ళకు తగ్గించింది. స్కాట్ ల్యాండ్ వెలుపల నివాసం ఉంటున్న స్కాట్ జాతీయులకు కూడా వోటింగ్ హక్కు ఇవ్వాలనే  డిమాండ్ ని కూడా లెక్కపెట్టలేదు. ఇలాటి వారి సంఖ్య సుమారు ఎనిమిది లక్షల వరకు ఉంటుందని అంచనా. స్కాట్ లాండ్ స్వాతంత్రానికి సంబందించి  నిర్వహించే రిఫరెండంలో బ్రిటన్ లోని పౌరులకు కూడా అవకాశం కల్పించాలని యూకే పెద్దల సభలో గట్టిగా వాదనలు వినిపించాయి. అయితే దీన్ని బ్రిటిష్ ప్రభుత్వమే తిరస్కరించింది. యునైటెడ్ కింగ్ డం ని వొదిలి పెట్టి వేరుపడాలా లేక కలిసి వుండాలా అన్నది స్కాటిష్ ప్రజలు మాత్రమె తేల్చుకోవాలని స్కాట్ లాండ్ అడ్వొకేట్ జనరల్ చేసిన వాదనను బ్రిటిష్ ప్రభుత్వం సమర్ధించింది. అంతే  కాకుండా 2014 డిసెంబర్ లోపు రిఫరెండం నిర్వహించుకోవడానికి స్కాటిష్ పార్లమెంటుకు అధికారం ఇస్తూ ఎడెన్ బర్గ్ వొప్పందంపై  సంతకాలు చేసింది. దీనితో బ్రిటన్ తో కలిసి వుండాలా, వేరుపడి స్వతంత్ర దేశంగా ఏర్పడాలా అనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడానికి స్కాట్ లాండ్ ప్రజలకు అవకాశం లభించింది.
దరిమిలా ఈనెల పద్దెనిమిదో తేదీన కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య రిఫరెండం జరిగింది. 'స్కాట్ లాండ్ స్వతంత్ర దేశంగా ఏర్పడడాన్ని మీరు కోరుకుంటున్నారా?' అని ప్రశ్న అడగాలని ముందు స్కాటిష్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రశ్న తీరులోనే వోటర్లను ఎలా జవాబు ఇవ్వాలని కోరుకుంటున్నారో తెలిసిపోతుందని ఎలక్షన్ కమీషన్  దాన్ని త్రోసిపుచ్చింది. 'స్కాట్ ల్యాండ్ స్వతంత్ర దేశంగా వుండాలనుకుంటున్నారా?' అని ఆ ప్రశ్న రూపాన్ని మార్చాలని భావించింది. ఈ ప్రశ్నకు వోటర్లు 'అవును' అనికానీ, 'లేదు' అని కానీ క్లుప్తంగా  జవాబు ఇవ్వాల్సి వుంటుంది. మొత్తం దేశం యావత్తు ఈ 'అవును' కాదు' అనే బృందాలుగా విడిపోయి ఉదృతంగా ప్రచారం కొనసాగింది.
ఎట్టకేలకు జరిగిన రిఫరెండంలో 'కలిసి ఉండాలని కోరుకునే' వారికే మెజారిటీ లభించింది.

(20-09-2014)

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

పాలకొల్లు నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన తెలుగు సంగీత కెరటం మాండలిన్ శ్రీనివాస్

(Published in Andhra Jyothy, Telugu Daily in its Edit page today)
ఎక్కడో పాలకొల్లులో జన్మించిన ఒక వ్యక్తి మరణవార్తను బీబీసీ శుక్రవారం నాడు ప్రసారం చేసింది. "ప్రసిద్ధ భారతీయ సంగీత  విద్వాంసుడు మాండలిన్ శ్రీనివాస్ దక్షిణాది నగరం చెన్నైలో శుక్రవారం నాడు కన్నుమూసారం"టూ, అతడు మరణించిన కొద్ది గంటల్లోనే బీబీసీ వెల్లడించింది.
బీబీసీలో ఈవార్త వచ్చిందంటే ఉప్పలపు శ్రీనివాస్ అనే నలభయ్ అయిదేళ్ళ ఈ పాలకొల్లు కుర్రవాడు ఏ స్థాయికి ఎదిగాడన్నది సులభంగా అర్ధం చేసుకోవచ్చు. పాశ్చాత్య సంగీత పరికరం మాండలిన్ పేరే శ్రీనివాస్ ఇంటిపేరుగా మారిపోయిందంటే దానిపై ఈ గ్రామీణ ప్రాంతపు, చదువూ సంధ్యా లేని కుర్రాడు యెంత పట్టు సాధించాడో తెలిసిపోతుంది.


పూవు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు పాలకొల్లులో తన తండ్రి సత్యనారాయణతో కలిసి చిన్నతనంలోనే  బ్యాండ్ మేళాలలో శ్రీనివాస్ వాయిస్తూ వుండేవాడు. బాల్యంలోనే తాను  స్వయంగా నేర్చుకున్న సంగీత విద్యతో నలుగురినీ  మెప్పించేవాడు. పాలకొల్లు అంటేనే  సంగీతాభిమానుల పుట్టిల్లు. క్లారినెట్ వాయించే ఒక సాధారణ వ్యక్తి శిలావిగ్రహం ఆ వూరి నడిబొడ్డులో ప్రతిష్టించడం  సంగీతంపట్ల ఆ వూరివారలకు వున్నఆదరాభిమానాలకు నిదర్శనం.
బ్యాండ్  మేళంలో వాయిస్తున్న శ్రీనివాస్  అలనాటి సంగీత విద్వాంసుడు  రుద్రరాజు సుబ్బరాజు గారి కంటపడడం శ్రీనివాస్ జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. ఆ కుర్రాడిలో అంతర్లీనంగా దాగివున్న ప్రతిభను చెన్నైలో  స్తిరపడిన ఆ విద్వాంసుడు  చప్పున గుర్తించగలిగారు. వెంటనే తండ్రితో సహా ఆ కుర్రాడిని వెంటబెట్టుకుని మద్రాసు తీసుకువెళ్ళారు. దగ్గర  వుంచుకుని స్వయంగా  సంగీతంలోని మెళకువలను బోధించారు. అసలే దైవదత్తమైన సంగీతం శ్రీనివాస్ కు పుట్టుకతోనే అబ్బింది. పూవుకు సువాసన తోడయినట్టు సుబ్బరాజుగారి గురు కటాక్షం సిద్దించింది. మట్టిలో దాగున్న మాణిక్యం వెలుగులోకి వచ్చి నలుదెసలకు తన కాంతులను వెదజల్లింది.  ఇంతింతయి వటుడింతయి అన్నట్టు సంగీత ప్రపంచంలో  శ్రీనివాస్ ఎదుగుదలకు అడ్డులేకుండా పోయింది. అంతవరకూ కర్నాటక సంగీతంలో మాండలిన్ వంటి పాశ్చాత్య పరికరానికి చోటులేదు. సంగీత కచ్చేరీలలో ఎక్కువగా కానవచ్చే 'హార్మోనియం' కూడా  ఆకాశవాణి గుర్తింపు పొందడానికి దాదాపు యాభయ్ ఏళ్ళు పట్టింది. అలాటిది, తమిళనాడులోని సంగీత విద్వాంసులందరి మూకుమ్మడి  ప్రశంసలు పొందిన శ్రీనివాస్,  మాండలిన్ సమేతంగా ఆకాశవాణి స్టూడియోలో సగౌరవంగా అడుగుపెట్టడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన  అవసరం లేకుండా పోయింది. పాలకొల్లులో పుట్టి అనేక ప్రపంచదేశాలలో మాండలిన్ ప్రదర్శనలు  ఇచ్చి, అనేకానేక పురస్కారాలు పొంది, సమకాలీన సంగీత దురంధరుల సరసనే సముచిత స్థానం సంపాదించుకున్న శ్రీనివాస్ అకాల మృత్యువు వొడికిచేరడం నిజంగా విచారకరం. సామాజిక అసమానతలు మనుషులలోని అసలయిన ప్రతిభను అణచిపెట్టలేవు అనడానికి మాండలిన్ శ్రీనివాస్ నిలువెత్తు నిదర్శనం.
-ఆర్వీవీ  కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు     

(19-09-2014)

18, సెప్టెంబర్ 2014, గురువారం

దేవుడితో ముచ్చట


ఏకాంబరం దేవుడ్ని కలుసుకున్నాడు. ఆ రోజెందుకో దేవుడు కూడా ఖాళీగా వుండి ఏకాంబరం అడిగే చొప్పదంటు ప్రశ్నలు అన్నింటికీ జవాబులు చెప్పాడు.
'దేవుడూ  దేవుడూ నిన్నొకటి అడగనా?'
 'దాందేవుంది అలాగే అడుగు'
 'ముందే చెబుతున్నాను. అడిగిన తరువాత ఇదేం పిచ్చి ప్రశ్న అని ఆట పట్టించకూడదు సుమా!'
'మనుషులందరూ నా సంతానమే. సంతానం అంటే అందరికీ పిచ్చి ప్రేమే కదా! అడుగు. చేతనయిన జవాబు చెబుతాను'
'ఈరోజు తెల్లారిన దగ్గరినుంచి ఒక్కటీ సరిగ్గా జరగడం లేదు. రాత్రి సరిగా నిద్రపట్టక ఆలస్యంగా లేచాను. తయారై ఆఫీసుకు వెడదామని చూస్తె కారు స్టార్ట్ కాలేదు'
'హోటల్లో భోజనానికి వెడితే నా శ్రాద్ధం, ఉడికీఉడకని అన్నం నా మొహాన తగలేశాడు. తినబుద్దికాక రోడ్డుపక్కన బండి వద్ద దొరికింది తినేసి ఆఫీసుకు చేరాను. అక్కడ ఆఫీసరు మాత్రం చక్కగా వడ్డించాడనుకో, ఆలస్యం అయినందుకు'
'ఇంకా...'
'ఇంకా అంటే  చాలావుంది. ఫ్రెండుతో మాట్లాడుతుంటే  ఫోను చార్జ్ అయిపోయింది'
'తరవాత....పోనీలే! ఇప్పుడు నేను చెప్పనా! నీకీ రోజు ఎందుకు ఇలా గడిచిందో. నువ్వు ఆలస్యంగా లేవడం మంచిదయింది. ఇది నా నిర్వాకమే. నువ్వు నిద్రపోతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ అయింది. ఆ సమయంలో నువ్వు  బాత్  రూమ్ లో వుండి వుంటే షాక్ కొట్టేది'
'కారు స్టార్ట్ కాకపోవడానికి కూడా కారణం నేనే. ఆ వేళప్పుడు మీ వీధిలో బాగా తాగి ఒకడు కారు అడ్డదిడ్డంగా నడుపుతున్నాడు. నువ్వు వెళ్ళినట్టయితే ప్రమాదం జరిగుండేది'
'హోటల్లో అన్నం సరిగ్గా ఉడకలేదన్నావు. అది వండిన మనిషికి ఈ రోజు వొంట్లో బాగా లేదు. అంటురోగం. అతడు వండిన వంట తినకపోవడమే మంచిదయింది'
'ఏదో ఫ్రెండూ ఫోనూ అని చెప్పావు చూడు. వాడు నిజానికి నీ ఫ్రెండు కాదు. వాడేదో వెధవ పనిచేస్తూ నిన్నూ ఆ ముగ్గులో దించాలని ఫోను చేసాడు. అదే టైం కి చార్జ్ అయిపోవడం వల్ల నువ్వా కేసులో చిక్కోలేదు'     
'హోరి దేవుడా! వీటి వెనుక ఇంత కధ ఉందా! తెలియక నిన్ను అనవసరంగా ఆడిపోసుకున్నానే! నన్ను మన్నించు మహాత్మా!'
'పరవాలేదులే ఇవన్నీ నాకు అలవాటే. మంచి జరిగితే దేవుడి దయ అంటారు. లేకపోతే దేవుడే చేశాడు అంటారు. మంచీ చెడూ అన్నీ నా ఖాతాలోకి తోసేస్తుంటారు. నాకు ధన్యవాదాలు చెప్పనక్కరలేదు కానీ, ఈ రోజు గడవడానికి ఇంకా సమయం వుంది. ఏదన్నా చేతయిన మంచి పని ఒకటి చేసి ఇతరులచేత మంచి అనిపించుకో. అది చాలు'


(నెట్లో తిరుగాడుతున్న ఓ ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)

NOTE: Courtesy Image Owner 

17, సెప్టెంబర్ 2014, బుధవారం

అతడు – ఆమె – ఆవిడ



‘ ఓసారెళ్ళి ఆవిడ్ని చూసిరండి. ఒకటే కబుర్లు చేస్తోంది.’
శంకరం కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. భార్య  నోటి వెంట ‘ఆవిడ’ ప్రస్తావన రావడం ఈ అయిదేళ్ళలో ఇదే మొదటిసారి.
పెళ్ళయిన నాటి నుంచీ ఇదే తంతు.
'నేను మీ జీవితంలోకి వచ్చాను. అంతే. ఇక ఆవిడ ప్రస్తావన మన మధ్య రావడానికి వీల్లేదు’ దాదాపు హుకుం జారీ చేసింది.
మొదటి రాత్రే తనంటే ఏమిటో స్పష్టంగా తెలియచెప్పింది.  కాస్త వయసు మీదపడ్డ తరువాత పెళ్లి చేసుకుంటే ఇంతేనేమో. తానూ అప్పటినుంచి కుక్కిన పేను మాదిరిగానే పడివుంటున్నాడు, 'భార్య గీసిన గీత దాటడు' అనే పేరు బయట మారుమోగుతోందని తెలిసినా. ఇక, ఇంట్లో  ‘ఆవిడ’ ప్రసక్తి తేనంతవరకు, రానంతవరకు  భార్య తనని పల్లెత్తు మాట అనదు. పొరబాటున వచ్చిందంటే చాలు ఇక తన మాట వినదు.
ఏమిటో ఈ ఆడవాళ్ళు. మరో ఆడదాని మాట  మొగుడి నోట వెంట 'వినాల'ని కూడా అనుకోరు.
ఇంతకీ  శంకరం భార్య మొగుడ్ని  వెళ్ళి చూసిరమ్మని చెప్పిన ‘ఆవిడ'  ఎవరో కాదు, శంకరాన్ని నవమాసాలు మోసి కని పెంచిన అతడి కన్నతల్లి. పదిహేనేళ్ళ క్రితం తండ్రి చనిపోయిన నాటి నుంచి తన బాగోగులు చూస్తూ తను ఒక ఇంటివాడు అయ్యేంతవరకు కనిపెట్టుకుని చూసిన మనిషి.  పెళ్ళయిన మరుసటి నెలలోనే, కోడలి దాష్టీకం పుణ్యమా అని ఇల్లు వొదిలి పెట్టి పరాయి ఇంట్లో తలదాచుకుంటూ, ‘వంటలమ్మగా’  రోజులు వెళ్లమారుస్తోంది.
భార్యే స్వయంగా చూసి రమ్మని చెప్పడంతో ఇక  శంకరం ఆఘమేఘాలమీద తల్లి దగ్గర వాలిపోయాడు. తనకోసమే కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నట్టు వుంది. కానీ ఆ తల్లి కళ్ళల్లో కొడుకుని చూసిన తృప్తే తప్ప జీవం లేదు.
'నీతో కలిసి భోంచేయాలని వుందిరా శంకరం. నీకు అంత తీరుబడిఉందా? వెంటనే వెళ్ళాలా!' అని అడిగింది. పర్మిషన్ తీసుకునే వచ్చాడు కనుక 'దానికేముందమ్మా! అన్నం తినడమే కాదు ఈరోజంతా నీతో కలిసేవుంటాను' అనేసాడు. ఆ తల్లి తబ్బిబ్బయింది. తత్తరపాటుతో లేచి వెళ్లి వంట మొదలు పెట్టింది. శంకరం కూడా పక్కనే పీట వేసుకు కూర్చున్నాడు. ఆవిడ ఒక పక్క వంట చేస్తూనే శంకరం చిన్నతనపు అల్లరి గురించీ, తిండి అలవాట్లు గురించి గుర్తుచేసుకోవడం మొదలుపెట్టింది. ఆ కబుర్లు వింటుంటే చిన్నప్పుడు తల్లిని ఎంతగా ప్రాణాలు కొరుక్కు తినేవాడో అ విషయాలన్నీ కన్నీటిపొర తెరలా  కమ్మిన కళ్ళల్లో  గిర్రున తిరిగాయి. 
ఇద్దరూ కలిసి అన్నం తిన్నారు. తిన్నంత సేపూ తనివితీరా  కబుర్లు చెప్పుకున్నారు. పాత సంగతులు గుర్తుచేసుకున్నారు. కానీ ఆవిడ పొరబాటున కూడా 'ఆమె' ప్రసక్తి తీసుకురాలేదు.
బయలుదేరేటప్పుడు ఒక మూట చేతిలో పెట్టింది. ఇంటికి చేరగానే ఆ మూటను భార్య చేతిలో పెట్టాడు. ఆమె విసురుగా దాన్ని అటక మీదకు గిరవాటు వేసింది.
రోజులు గడిచాయి. మళ్ళీ కబురు. కానీ ఈసారి ఆవిడ నుంచి కాదు. ఆవిడ వంటలు చేసిపెట్టే వారినుంచి.
'అంతా అయిపొయింది. ఇన్నేళ్ళు మా ఇంట్లో వంటలు చేసి పెడుతోంది కానీ ఆవిడ ఎవ్వరో, ఎవరి తాలూకో కూడా తెలియదు. మొత్తం మీద మీ చిరునామా కనుక్కునేసరికి ఇన్నాళ్ళు పట్టింది. అనాధ శవాలకు అంతిమ సంస్కారాలు చేసే ఒక సంస్థ వారు ఆపని పూర్తిచేశారు'
శంకరం బావురుమన్నాడు. ఇంటివారు కబురుచేసిన దానిప్రకారం తల్లితో కలిసి భోంచేసిన రాత్రే ఆవిడ కన్ను మూసింది. భార్యకు ఇచ్చిన మూట జ్ఞాపకం వచ్చి అటక మీద నుంచి తీసి చూశాడు. తల్లికి పుట్టింటివాళ్ళు పెట్టిన నాలుగు బంగారు గాజులు, వొంటిపేట చంద్రహారం అందులో వున్నాయి. వాటితో పాటే ఓ చీటీ.
'ఒరేయ్ శంకరం. నువ్వు పెళ్లి చేసుకుని కోడల్ని తీసుకురాగానే  ఇవి ఇద్దామనుకున్నాను. ఇల్లు వొదిలి రావడం వల్ల కుదరలేదు. తరువాత ఇద్దామని ఎన్నోసార్లు అనిపించినా మళ్ళీ దేనికోసమో ఆరాటపడుతోంది అని అనిపించుకోవడం ఇష్టం లేక ఆ ఉద్దేశ్యం మానుకున్నాను. నా తరువాత ఇవన్నీ కోడలికే దక్కాలి. మనసులో ఏవీ పెట్టుకోకుండా తీసుకోమని చెప్పు. నేను ఇక ఎన్నో రోజులు బతుకుతానని అనుకోను. నిన్ను చూసాక ఇక నా ఆఖరి కోరిక కూడా తీరిపోయింది'
శంకరం ఆశ్చర్యంతో ఏడుపు ఆపేసాడు. మరొకరు ఆ గదిలో రోదిస్తున్న ధ్వని సన్నగా  వినబడుతోంది.


(NOTE: COURTESY IMAGE OWNER)

ఉప ఎన్నికల ఫలితాలు దేనికి సంకేతం?


(Published by  SURYA daily in its edit page on 18-09-2014)
సాధారణంగా సార్వత్రిక ఎన్నికల దరిమిలా వెంటనే వచ్చే ఉపఎన్నికల ఫలితాలు ఆయా పాలకపక్షాల తల  రాతను మార్చలేవు. ప్రతికూల  ఫలితాలు వచ్చినా,  వాటి మనుగడ ప్రశ్నార్ధకం అయ్యే అవకాశం అసలే వుండదు. అంచేత ఉపఎన్నికల ఫలితాలపై చర్చకు ప్రాధాన్యత తక్కువ. సంకీర్ణయుగంలో వీటికి కొంత ప్రాముఖ్యత వుండే వీలుంది  కాని ప్రస్తుత తరుణంలో దానికీ అవకాశం లేదు. ఎందుకంటే,  గత సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ కూటమికీ, ఆంద్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి, తెలంగాణలో కేసీయార్ ఆధ్వర్యంలోని టీ.ఆర్.యస్. కు ప్రజలు ఎవరి మీదా ఆధారపడి మనుగడ కొనసాగించే అగత్యంలేని  మెజారిటీతో ఆయా పార్టీలకి అధికార పగ్గాలను అప్పగించారు. అందువల్ల ఉపఎన్నికల ఫలితాలు తారుమారయినా కూడా వాటికి అద్యతన భావిలో ఎదురయ్యే ముప్పు ఏమీ వుండదు. అయినా కానీ, ఫలితాల్లో ప్రతికూలతను తేలిగ్గా తీసుకుంటే ముందు ముందు మరిన్ని ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశాలను తోసిపుచ్చలేము. అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే నానుడి ప్రకారం,  'గెలిచి తీరుతాం' అనే నమ్మకం వున్న పాలక పక్షాలు, 'గెలవడం అంత తేలిక కాదు' అనే అనుమానం వున్న ప్రతిపక్ష పార్టీలు కూడా  ఉప  ఎన్నికలను  సయితం ఒక సవాలుగా తీసుకుని ఎన్నికల రణక్షేత్రంలో అడుగుపెడతాయి. తమకున్న శక్తియుక్తులనన్నింటినీ పణంగా పెట్టి పోరాడతాయి. గెలిచిన పక్షంలో  తమ పాలనకు మెచ్చి ప్రజలిచ్చిన కానుకగా అభివర్ణించుకుంటూ పాలక పక్షం జబ్బలు చరుచుకుంటుంది. అదే ప్రతిపక్షానికి ఆ అవకాశం దక్కితే, పాలకపక్షం పట్ల ప్రజల్లో వేగంగా పెరుగుతున్న వ్యతిరేకతకు ఈ ఉపఎన్నిక ఫలితం ఒక సంకేతం అంటూ  బొబ్బలు పెడుతుంది. ఇది ఎన్నాళ్ళనుంచో సాగుతూ వస్తున్న జనమెరిగిన రాజకీయమే.
ఈ వాస్తవాలను గమనంలో ఉంచుకుని ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన 54 అసెంబ్లీ, మూడు  లోక సభ స్థానాల్లో ఉపఎన్నికల ఫలితాలను సమీక్షించుకుంటే తేటతెల్లం అయ్యేది ఒక్కటే. అదేమిటంటే రాజకీయపార్టీల పట్ల ప్రజల ఆదరణ ఎప్పుడూ  ఒకే తీరున ఉండదనీ, ఆ ఆదరణలో హెచ్చుతగ్గులు అతిసహజమనీ.



నాలుగునెలలక్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశం నాలుగుచెరగులా మారుమోగి, ప్రజలను అనూహ్యంగా ఆకట్టుకున్న 'నమో' మంత్రం ఈ ఉపఎన్నికల్లో పనిచేయలేదు. అప్పుడు ప్రభంజనం మాదిరిగా ఉత్తర ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో లోక సభ సీట్లను కొల్లగొట్టిన బీజేపీ, తాజాగా ఆ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో చతికిలపడిపోయింది.  యూపీలో గత అసెంబ్లీ  ఎన్నికల్లో గెలుచుకున్న పది సీట్లలో బీజేపీ ఏకంగా ఏడింటిలో వోటమి చవిచూసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రాష్ట్రంలో ఆ పార్టీ ఎనభయ్ లోకసభ స్థానాల్లో అక్షరాలా డెబ్బయ్ ఒకటి  గెలుచుకుని 'మోడీ హవా' అంటే ఏమిటో యావత్ దేశానికి రుజువుచేసి నెలలు తిరక్క ముందే ఈ మాదిరి పరాజయం మూటగట్టుకోవడం అన్నది నిజంగా బీజీపీ నాయకులకు మింగుడు పడని ఫలితమే. అలాగే మరో దారుణమైన వోటమి రాజస్థాన్ లో ఎదురయింది. ఆ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం పాతిక లోకసభ స్థానాల్లో ఏ ఒక్కటీ బీరుపోకుండా అన్నింటినీ తన ఖాతాలో వేసుకుని విజయకేతనం ఎగరేసిన బీజేపీకి ఈసారి అక్కడ జరిగిన నాలుగు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఒక్కటంటే ఒకే స్థానం దక్కింది. కిందటి ఎన్నికల్లో తుడిచిపెట్టుకుని పోయిన కాంగ్రెస్ పార్టీకి మిగిలిన మూడు దక్కాయి.   ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో కేంద్రంలో పనిచేస్తున్న ఎండీయే సర్కారు పట్ల వోటర్ల వైఖరి ఈ కొద్దికాలంలోనే ఇంతగా మారిపోవడానికి ఆయన చేసిన ఘోర తప్పిదాలు ఏమీ లేవు. ఎన్నికలకు ముందు మోడీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కూడా ఏవీ లేవు, ఈ స్వల్పకాలంలో అవేవీ అమలుచేయలేదని కినుక వహించడానికి. అయినా ఇలా ఎందుకు జరిగింది? ఇప్పుడు అందరి మనస్సుల్లో మెదులుతున్న ప్రశ్నే! దానికి మోడీయే స్వయంగా వివరణ ఇచ్చారు. మొదట్లో చెప్పుకున్న విధంగానే ఆ వివరణ సాగింది. కొత్త పద్ధతిలో తాను పరిపాలన  సాగిస్తున్నాననీ, ఉపఎన్నికల ఫలితాల నేపధ్యంలో తనపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలకు తన పని తీరు అర్ధం కావడానికి కొంత  సమయం పడుతుందనీ  ఆయన అన్నారు. ప్రతిపక్షాలు సరే! వాళ్ళు ఎట్లాగో విమర్శలు చేయక మానరు. ఈ ఫలితాలవల్ల ఇప్పటికిప్పుడు మోడీ సర్కారుకు వచ్చే ముప్పు  ఏవీలేని మాట కూడా నిజమే.  కానీ ప్రజలనుంచి  సయితం  ఇలాటి ప్రశ్నలు మొదలుకాకుండా చూసుకోవాలి. మోడీ విశ్వసిస్తున్నట్టు ప్రజలు మార్పు కోరుకుంటారు. అలా కోరుకునేవారు గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి పట్టం కట్టారు. మళ్ళీ వాళ్ళు మరోసారి మార్పుకోరుకోకుండా చూసుకోవడానికి ఈ ఉపఎన్నికల ఫలితాలను    ఒక హెచ్చరికగా పరిగణించాలి. లేని పక్షంలో ప్రజల ఆదరణ, ఆగ్రహంగా మారడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఈ సూత్రం ఒక్క మోడీకే కాదు ప్రజలు కోరుకుని ప్రభుత్వ పగ్గాలు అప్పగించిన అన్ని రాజకీయ పార్టీలకీ వర్తిస్తుంది. (17-09-2014)                         

15, సెప్టెంబర్ 2014, సోమవారం

పరాశర గోత్రోద్భవభవస్య




ఖ్యాతి, భృగువు భార్య. ఆమె యందు భృగువు ఇద్దరు పుత్రులనుకన్నాడు. వారు పేర్లు ధాత, విధాత. వారి పుత్రులు ప్రాణుడు, మృకండుడు.
ఈ ఇద్దరికీ జన్మించిన  పుత్రసంతానం ఇలా వుంది....ప్రాణుని కొడుకు ద్యుతిమంతుడు. అతడి కుమారుడు  అజావంతుడు, అజావంతుని పుత్రుడు వంశుడు. పొతే,  మృకండుముని పుత్రుడు మార్కండేయుడు. ఈ మహామునికి జన్మించినవాడు వేదశిరుడు. ఇక్కడికి ఇలా ఉండనీ!
నవబ్రహ్మల్లో ఇంకొకడు మరీచి మహర్షి. ఈ మహర్షికి సంభూతి భార్య. వీరి సంతానం పౌర్ణమాసుడు. ఇతడికే విరజుడు పర్వతుడు అని ఇద్దరు పుత్రులు.
ఇట్లాగే మరొక బ్రహ్మ అంగీరసుడున్నాడు. ఈతని భార్య స్మృతి. సినీవాలి, కుహువు, అనుమతి అనే కన్య వీరి సంతానం.
అత్రి మహర్షి అనే బ్రహ్మకు అనసూయ సతి. మహాసాధ్వి ఈమె. వీరికి సోముడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు జన్మించారు. స్వాయంభువ మన్వంతరంలో ఇతడే అగస్త్యమహర్షి.
పులహునికి క్షమ యందు కర్దముడు, చార్వరీవంతుడు, సహిష్ణువు అని ముగ్గురు పుత్రులు జన్మించారు.
క్రతువునకు సంనతి అనే భార్య వల్ల బొటనవ్రేలి కణుపు ఎంత పరిమాణంలో ఉంటుందో, అంత ప్రమాణంలో వాలభిల్యుడు మొదలైన 60 వేల మంది పుత్రులు కలిగారు.
వసిష్ఠునికి ఊర్జవల్ల ఊర్థ్వబాహుడు, రజుడు, అనఘుడు, గోత్రుడు, సవనుడు, సుతపుడు, శుక్రుడు జన్మించారు. వీరు ఉత్తమ మనువుకాలంలో సప్తర్షులు.
బ్రహ్మ పెద్దకొడుకు వహ్నికి, స్వాహావల్ల గొప్ప ఓజస్సంపన్నులైన ముగ్గురు పుత్రులు కలిగారు. వీరే శుచి, పావకుడు, పవమానుడు. వీరికి తిరిగి జన్మించిన సంతానం 45 మందికి, ఈ వహ్ని మొదలగు అగ్నులు కలిసి మొత్తం 49 మంది అగ్నులుగా సుప్రసిద్ధులు.
బ్రహ్మవల్ల సృజింపబడిన అగ్నిష్వాత్‌, బార్హిషద్‌, అనగ్న, సాగ్నాది సంతతి తెలిసింది కదా! స్వధాదేవికి పితృదేవుని వల్ల పితృగణాలు, మేన - వైతరణి అనే యిద్దరు బ్రహ్మవాదినులైన కన్యలు కలిగారు. సర్వశుభలక్షణలు, గొప్పజ్ఞానవంతురాళ్లు. దక్షకన్యల గురించిన సంగతులన్నీ విన్నావు కదా! ఈ వైనం శ్రద్ధగా స్మరించిన వారికి సంతానహీనత కలుగదు" అని చెప్పాడు "పరాశరుడు"

(బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు)


ఇదంతా అందరికీ అర్ధం అయ్యే రీతిలో చెప్పింది ఎవరో చెప్పాల్సిన పనిలేదు. ఇలా చెప్పగలిగిన ఒకే ఒక్కరు అందరికీ తెలిసిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అంటే మా గోత్రం "పరాశర" - అదీ విషయం - ఇంకో విషయం ఇది మోచర్ల  కృష్ణమోహన్ గారి  సౌజన్యం - భండారు శ్రీనివాసరావు