6, డిసెంబర్ 2013, శుక్రవారం

ఈ ఏడు ‘తాతయ్య తద్దినం’ లేదా?


భండారు వారి వంశానికి ‘జాతీయ పర్వదినం’ అంటూ వుంటే అది తిధుల ప్రకారం ఈరోజే.  కొన్ని దశాబ్దాల నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏటా  ఈరోజు తాతయ్య తద్దినం అంటూ ఎక్కడెక్కడినుంచో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు పిల్లాపాపతో కలసి  రెక్కలుకట్టుకుని మా వూళ్ళో వాలిపోయేవాళ్ళు. ఆయన (మా నాన్నగారు భండారు రాఘవరావు గారు) పోయి అరవై ఏళ్ళు దాటింది. నాకప్పటికి అటూఇటూ కాని వయసు. బయట వూళ్ళో వుండి చదువుకోవడం వల్ల మా నాన్న రూపు అస్సలు గుర్తులేదు. ఆయన చనిపోవడానికి కొన్ని రోజులముందు, మంచానపడ్డ స్తితిలో ఆయన్ని  మా బావగారొకరు  ఫోటో తీసారు. ఆ ఫోటో  మా ఇంటి వరండాలో చాలా ఏళ్ళు అలాగే వుంది. పాత కాలపు కెమేరాతో తీసిన ఆ ఫోటోలో గుర్తుపట్టి, గుర్తుంచుకోగలిగిన పోలికలేవీ కనిపించేవి కాదు. అందువల్ల మా నాన్న నాకు సంబంధించినంతవరకు ఓ జ్ఞాపకం మాత్రమే. కాకపొతే, మా పెద్దన్నయ్యగారితో కలసి తద్దినం పెట్టేవాడి తమ్ముడి పాత్రలో యాభయ్ సంవత్సరాలకు  పైగా వొదిగిపోయాను. తాతయ్య ఎవరో తెలియకపోయినా ఆడామగా తేడా లేకుండా ఆయన వారసత్వ సంతానం అందరికీ ఏటా మా వూళ్ళో పెట్టే మా నాన్నగారి తద్దినం మాత్రం బాగా గుర్తుండి పోయింది. పెళ్ళికి తరలివెళ్ళినట్టు అంతా బళ్ళు కట్టుకుని ఎంతెంతో దూరాలనుంచి తరలివచ్చేవాళ్ళు. పేరుకు తద్దినం అయినా వూళ్ళో వుండే మా మూడో అన్నయ్య కార్యదక్షత కారణంగా అదొక వేడుకలా జరిగిపోయేది. అందుకే ‘పర్వదినం’ అనేది.

ఇన్నేళ్ళుగా ఒక్క నాగా లేకుండా సాగుతూ వచ్చిన ఈ వేడుకకు ఈ ఏడాది బ్రేకులు పడ్డాయి. అనివార్యమైన పరిస్థితుల్లో తద్దినం పెట్టడానికి బదులు శాస్త్రంలో చెప్పినట్టుగా పితృదేవతలకు తర్పణాలు వొదిలి తృప్తి పడాల్సివస్తోంది. ఈ విషయంలో నా అశక్తతను ఈ ఏడాది అందరూ మన్నిస్తారని అనుకుంటున్నాను. –భండారు శ్రీనివాసరావు (07-12-2013)            

5, డిసెంబర్ 2013, గురువారం

పీర్లు గుండాన పడ్డాయి


తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విధానం (ప్రాసెస్) మొదలయిందని  సుమారుగా నాలుగేళ్ల క్రితం అంటే 2009  డిసెంబర్ తొమ్మిదో తేదీన నాటి హోం మంత్రి చిదంబరం బహిరంగంగా ప్రకటన చేసిన తరువాత మళ్ళీ ఇన్నేళ్ళకు ఓ నాలుగు రోజులు ముందుగానే ఈనాటి  కేంద్ర హోం మంత్రి షిండే కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ బిల్లును క్యాబినెట్ ఆమోదించిందని  ఇంకో ప్రకటన చేసారు.  దరిమిలా టీవీల్లో చర్చోపచర్చలు అనంతంగా సాగాయి.

ఇల్లలుకగానే పండగ కాలేదని, పార్లమెంటులో బిల్లు పాసయినప్పటి మాట కదోయి నాయనా!అంటూ  కొందరు పాత  పల్లవినే కొత్తగా ఎత్తుకుంటే,  కేంద్ర కాబినెట్ నిర్ణయంతో  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినట్లేగాఇంకా అనుమానాలు ఎవరికైనా వున్నాయాఇంకా మభ్య పెట్టేవారిని ఏమనాలి?అంటూ మరికొందరు డౌటేహులు ప్రశ్నలు గుప్పిస్తున్నారు.



రాష్ట్ర విభజనను మనసారా కోరుకునే వారు తెలంగాణలో నూటికి తొంభయ్ తొమ్మిది శాతం మంది వుండవచ్చు. అలాగే  సమైక్య రాష్ట్రాన్ని కావాలనుకునేవారు జనాభాలో అధిక సంఖ్యాకులు వుండవచ్చు. ఎలాగయినా పరవాలేదు రాష్ట్రాన్ని చీల్చినా సరే ఇప్పటిమాదిరిగా వుంచినా సరే మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండిఅనే వాళ్లు కనీసం ఒక శాతం అయినా వుంటారు. వోట్ల పండుగలో గుర్తుకువచ్చే ఈమాదిరి  అల్పసంఖ్యాకులు అసలు ఇలాటి సమయాల్లో అసలే గుర్తుకురారు.
రాష్ట్రాన్ని రెండుగా చీల్చాలి.  ఓకే. ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. కాదన్నవాడికి కర్రు కాల్చి వాత పెట్టండి.
రాష్ట్రం సమైక్యంగా వుండాలి. మరీ ఓకే!  కాదుకూడదు అని నిర్ణయాలు తీసుకున్నవారిని సోదిలోకి లేకుండా తరిమి కొట్టండి.
మీచేతిలో వజ్రాయుధం పెట్టుకుని, అట్ట ఆయుధాలతో ఆటలు ఆడుతున్న రాజకీయనాయకులను చూసి భయపడాల్సిన ఖర్మ మీకేమిటి?
ప్రజాస్వామ్యంలో నాయకులు గొప్పవాళ్ళు కావచ్చు. కానీ వాళ్ళను గొప్పవాళ్ళను చేస్తున్నది మాత్రం మన జనమే!

(05-12-2013) 

1956 లో ‘తెలంగాణా’ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డుపడ్డదెవరు? ఐతరేయ బ్రాహ్మణమా?



ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటయినప్పుడు నా పుట్టిన తేదీ ప్రకారం అప్పటికి నా వయస్సు కొంచెం అటూ ఇటుగా పదకొండేళ్లు. అప్పటి విశేషాలు గుర్తుండే వీలు లేదు కాబట్టి నాటి పరిస్తితులను సింహావలోకనం చేయడానికి వీలుగా ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు ఆరు మాసాలముందు ఆంధ్ర పత్రిక దినపత్రిక ఏప్రిల్ నాలుగో తేదీన మొదటి పుటలో ప్రధాన శీర్షికతో ప్రచురించిన వార్తను యధాతధంగా అక్షరం పొల్లు పోకుండా కింద ఇవ్వడం జరిగింది.

అయితే ఓ చిరు విజ్ఞప్తి 

రాష్ట్ర విభజన గురించి ఆందోళనలు, చర్చోపచర్చలు ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో, పీర్లు గుండానపడుతున్న సందర్భంలో - ఆ నాటి (1956) స్తితిగతులను ఓమారు స్పురణకు తెచ్చుకోవాలన్న ఉద్దేశ్యంతో చేస్తున్న ఈ ప్రయత్నంలో మరో రకం ఆలోచనకు తావివ్వరాదని నా అభ్యర్ధన.


సంపుటం - 43 సంచిక - బుధవారం 4-4-1956 6 పేజీలు అణా


ఆంధ్ర ప్రదేశ్అనే పేరుకు తెలంగాణా నాయకుల సమ్మతి

కోస్తా జిల్లాలకోసం గుంటూరు లో హైకోర్టు బెంచి నెలకొల్పే నిర్ణయం

అక్టోబర్ లోగా విలీనం మినహా కార్యాలయాల తరలింపు అసాధ్యం అని డాక్టర్ బూర్గుల ప్రకటన 

(
ఆంధ్ర పత్రిక ప్రతినిధి)

కర్నూలు, ఏప్రిల్ 3

ఆంధ్ర ప్రదేశ్అని నూతన రాష్ట్రానికి పేరు పెట్టడానికే చివరికి ఆంధ్ర తెలంగాణా నాయకులు తీర్మానించారు.

ఆంధ్ర ప్రాంత న్యాయవాదుల ప్రాబల్యానికి హైదరాబాద్ న్యాయవాదులు భయపడుతున్న కారణం వల్ల- రాయలసీమపై న్యాయ విచారణాధికారాన్ని హైదరాబాదు కోర్టుకు ఒప్పగించి, కోస్తా జిల్లాలకోసం గుంటూరులో హై కోర్టు బెంచి నెలకొల్పాలని కూడా ఉభయ ప్రాంతాల నాయకులు నిర్ణయించారు.

ఆంధ్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాద్ రెవిన్యూ మంత్రి శ్రీ కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి, హైదరాబాద్ వ్యవసాయ మంత్రి డాక్టర్ చెన్నారెడ్డి, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ జె.వి. నరసింగరావు, ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు, ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, పూర్వ ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం, విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు పాల్గొన్నారు.

నూతన రాష్ట్ర నామకరణం విషయమై కొంత దీర్ఘ చర్చ జరిగింది.

హైదరాబాద్ నాయకుల్లో శ్రీ రంగారెడ్డి, శ్రీ చెన్నారెడ్డి, శ్రీ నరసింగరావు – ‘తెలుగు ప్రదేశ్అని కానీ, ‘తెలంగాణాఅని కానీ కొత్త రాష్ట్రానికి పేరు వుంచాలని దీర్ఘవాదం చేశారు.

'ఆంధ్ర' లో దోషం లేదు

తదితరులు, హైదరాబాద్ ముఖ్యమంత్రి తో సహా ఆంధ్ర అనే పదంలో దోషం ఏమీ లేదని వాదించారు.

ఆ పేరు ఉపనిషత్తుల కాలం నుంచి వ్యవహారంలో వుంది. ఆ పేరు ఐతరేయ బ్రాహ్మణంలో కనబడుతుంది. ఆంధ్ర పితామహ, శ్రీకృష్ణదేవరాయంధ్ర భాషానిలయం ఈ మొదలయిన ప్రఖ్యాత వ్యవహార నామములు బట్టి చూచినట్టయితే ఆంధ్ర ప్రజలకు, తెలంగాణా ప్రజలకు భేదం కనబడదు. అందరినీ ఆంధ్ర అనే పదం తోనే వ్యవహరించారు

చివరికి ఆంధ్ర ప్రదేశ్అనే నూతన రాష్ట్రానికి పేరు వుంచాలని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.



4, డిసెంబర్ 2013, బుధవారం

వినదగునెవ్వరు చెప్పిన ....


"అపజయాలెప్పుడూ పురోగమనానికి అడ్డంకులుగా మారవు. అడ్డుపడేవల్లా వోటమి గురించిన ఆందోళనలే!"

"కార్యశూరుడికి ‘రేపు’ అనేది ఎప్పటికీ రానిరోజే.  ‘ఈరోజు’, ‘ఇప్పుడు’ అనే పదాలు తప్ప, ‘రేపు’ అనే పదం  అతడి నిఘంటువులో వుండదు"

"కష్టతరమైన కార్యాలను అవి సులభంగా వున్నప్పుడే పూర్తిచేయాలి. సరైన సమయం అంటూ ఎదురు చూడడం అంటే వాటిని ముదరబెట్టుకోవడమే అవుతుంది"

"బద్దకంగా జోగుతూ పడుకున్న బలిష్టమైన ఎద్దు కన్నా చురుగ్గా కదలాడే చిన్న చీమే ఎన్నో రెట్లు శక్తివంతమైనది"
(04-12-2013)

1, డిసెంబర్ 2013, ఆదివారం

కార్టూన్


దూరం నుంచి చూసినప్పుడు అతడేమోనని అనిపించింది. కానీ అతడేనా అన్న అనుమానం కూడా అప్పుడే  పొడసూపింది.
ఆ సాయంత్రం మళ్ళీ కనిపించాడు. తెల్లటి ఆఫ్రాన్ వేసుకుని.  హుందాగా నెమ్మదిగా నడుస్తుంటే అతడి వెనుక వినమ్రంగా అడుగులు వేస్తూ అమెరికన్ డాక్టర్లు.
సందేహం లేదు, అతడే.  ఎక్కడో ఇండియాలో మారుమూల పల్లెటూళ్ళో వుండే భాస్కరం ఇలా ఇక్కడ అమెరికాలో. నమ్మశక్యం కాని విషయం. కానీ కళ్ళెదుట కనబడుతుంటే నమ్మకపోవడం యెలా? చూస్తుండగానే ఆ డాక్టర్ల బృందం నన్ను దాటుకుని వెళ్ళిపోయింది.
ఆ మరునాడు అదే హాస్పటల్ లో మా కోడలు ప్రసవించింది. ఆడపిల్ల.  మా ఇంట్లో పిల్లి పిల్లకు కూడా మగ పిల్లే పుడుతుంది అందరూ హాస్యోక్తిగా చెప్పుకునేవారు. అలాటప్పుడు మళ్ళీ కొన్ని తరాల తరువాత ఆడపిల్ల పుట్టింది.  అదీ శుక్రవారం నాడు. మా ఆవిడ సంతోషానికి అంతే  లేదు. మా వాడు ఆ పసిపిల్ల ఫోటోని తీసి అప్పటికప్పుడే అప్ లోడ్ చేసేసాడు కూడా.  వాడు పుట్టినప్పటి రోజులు గుర్తొచ్చాయి. ‘..అమ్మాయి ప్రసవించింది. మగపిల్లవాడు. తల్లీ పిల్లవాడు క్షేమం’ అంటూ మామగారు రాసిన కార్డుముక్క బారసాల నాటికి కాని చేరలేదు.
అమెరికా వచ్చిన పని అలా శుభంగా ముగిసిపోయిన తరువాత మళ్ళీ భాస్కరం గుర్తుకు వచ్చాడు. తెల్లగా పొట్టిగా వుండేవాడు. అతడు చదువుకునే సోషల్ వెల్ ఫేర్ హాస్టల్ కు నేను వార్డెన్ ని. చదువులో చురుకే కాని ఆవేశం పాలు ఎక్కువ. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా రగిలిపోయేవాడు. అప్పటికప్పుడు దాన్ని సరిదిద్దాలని చూసేవాడు. కానీ ఆ ప్రయత్నంలో అతడు ఎప్పుడూ గెలిచిన దాఖలాలు లేవు.  ఎందుకంటే వ్యవస్థ అలాటిది.  తుప్పుపట్టిపోయింది కానీ  మూలాలు మాత్రం చాలా గట్టివి.
భాస్కరాన్ని ఎవరయినా చూస్తే మళ్ళీ మరచిపోవడం కష్టం. పొట్టిగా గిడసబారినట్టు వుండే అతడి ఆకారం అందుకు కారణం. నేలకు నాలుగు అడుగుల ఎత్తు. ఎవరితోనయినా మాట్లాడాలి అంటే తలను పూర్తిగా వెనక్కు వాల్చి పైకి చూస్తూ మాట్లాడేవాడు. అతడిని అలా చూస్తుంటే నవ్వు ఆపుకోవడం చాలా కష్టం.
‘అవును మాస్టారు. నన్ను చూసి అందరూ నవ్వుతారు. తప్పేం లేదు. పత్రికలో కార్టూన్ చూసి నేనూ నవ్వుకుంటాను. అలాగే వాళ్ళూ. పోనీ లెండి నన్ను చూసి నవ్వుకుంటున్నారు. ఏడవకుంటే చాలు’ అన్నాడొకసారి. అంతే!  మళ్ళీ అతడ్ని చూసి నేను యెప్పుడూ నవ్వలేదు.
హాస్టల్లో జరిగిన ఓ అన్యాయాన్ని గట్టిగా ప్రతిఘటించినందుకు అతడ్ని ఫైనల్ పరీక్షలు రాయనివ్వలేదు. నేను వెళ్ళి గట్టిగా చెప్పాను.
‘అన్యాయాన్ని సరిదిద్దాలనే నీ తపనలో తప్పులేదు. కానీ దాన్ని సరిదిద్దే క్రమంలో బంగారం లాంటి నీ భవిష్యత్తు పాడుచేసుకోకు. ముందు నిన్ను నీవు నిరూపించుకో. ఆ తరువాత అందరూ నీ దారికి వస్తారు’ అని అతడికీ, ఆ తరువాత ప్రిన్సిపాల్ కీ నచ్చచెప్పి పరీక్షలు రాసేలా చూసాను. ఆ సంవత్సరం అతడే స్కూలు ఫస్ట్. ఇంటర్ లో అనుకుంటాను రాష్ట్రం మొత్తంలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు.  పత్రికల్లో అతడి ఫోటోలు కూడా వేసారు. ఆ తరువాత భాస్కరాన్ని నేను చూడలేదు. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఇక్కడ ఇలా.


మర్నాడు కోడల్ని డిస్చార్జ్ చేస్తున్నారు. నర్సులు వచ్చి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా భాస్కరం మా గదిలోకి వచ్చాడు. చేతులు జోడించి నమస్కరిస్తూ ‘ యెలా వున్నారు మాస్టారు’ అన్నాడు. అతడలా రావడం చూసి మావాడు నివ్వెరపోయాడు. భాస్కరం ఆ ఆసుపత్రికి డైరెక్టర్ ట.
‘నేను నిన్ననే మిమ్మల్ని చూసాను. కానీ మిమ్మల్ని కలవాల్సింది అక్కడ కాదు. ఇలా మీదగ్గరకు వచ్చి పలకరిస్తేనే నాకు తృప్తి. ఇది మీరు పెట్టిన భిక్షే!’ అన్నాడు. నాకు ఆశ్చర్యంతో కొంతా, ఆనందంతో కొంతా నోరు పూడుకుపోయింది. కళ్ళు చెమర్చాయి. చెప్పొద్దూ! కాస్త గర్వంగా కూడా ఫీలయ్యాను. అసలే గొప్పగా వున్న ఆ ఆసుపత్రి ఇంకా గొప్పగా కనిపించింది.

(01-12-2013)

IMAGE COURTESY OWNER 

25, నవంబర్ 2013, సోమవారం

కిరణ్ కుమార్ రెడ్డి – ముఖ్యమంత్రిగా మూడేళ్ళు


మూడేళ్ళ క్రితం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆనాటి పరిస్థితుల్లో ఏడాది కొనసాగడం కూడా అబ్బురమే అనుకున్నారు. అయితే అటు పరుగులు చేయకుండా ఇటు అవుట్ కాకుండా (NO RUNS – NOT OUT) క్రీజులో వుండిపోయే క్రికెట్  ఆటగాని మాదిరిగా మొత్తం మీద ఆయన  మూడేళ్ళు బండి లాగించేశారు.


(మూడేళ్ళక్రితం ఇదే రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి) 

రోశయ్యగారి తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, మంత్రుల శాఖల్లో సీనియర్లను కూడా పక్కనబెట్టి మార్పులు చేసిన విధానం గమనించిన వారికి కొత్త ముఖ్యమంత్రి ‘మొనగాడేమో’ అన్న అభిప్రాయం కలిగింది. కానీ,  అది కరిగి  కనుమరుగై పోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
ఏ రాజకీయ నాయకుడికయినా ముఖ్యమంత్రి పదవి అనేది ఓ కమ్మటి కల. ఏళ్ళూ పూళ్ళూ  ఎదురుచూస్తూ కూర్చున్నా  ఆ కల సాకారం కావడం  అంత సులభం కాదు.  ప్రత్యేకించి ఈ పరిస్తితి కాంగ్రెస్ పార్టీలో మరింత ఎక్కువ. ఢిల్లీలో కొలువుతీరివుండే ఎంతోమంది అధిష్టాన దేవతలను ప్రసన్నం చేసుకుంటే కాని నెరవేరని కల. అందుకే ముఖ్యమంత్రిగా కిరణ్ పేరు వెల్లడయినప్పుడు రకరకాల వదంతులు వెలుగులోకి వచ్చాయి. సోనియా గాంధీ,  సీఎం మార్పు విషయం గురించి ఆలోచన చేసినప్పుడు ఆమె మనస్సులో మెదిలిన పేరు, అంతకుముందు  స్పీకర్ గా పనిచేసిన  కే. ఆర్. సురేష్ రెడ్డి.  ఆయన ఎన్నికల్లో వోడిపోయిన సంగతి ఆ క్షణంలో గుర్తుకురాక,  ‘స్పీకర్ రెడ్డి’ అనడంతో అప్పుడు స్పీకర్ గా వున్న కిరణ్ కుమార్ రెడ్డి పేరును అధిష్టాన దేవతలు ఖరారు చేసారని సూతుడు శౌనకాది మునులకు చెప్పినట్టు ఓ  కధ ప్రచారంలోకి వచ్చింది కూడా.   
ఇలాటి నేపధ్యంలో – ఒక్కసారి కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనుభవం కూడా లేని కిరణ్ కుమార్ రెడ్డిచేత ఏకంగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించడం కాంగ్రెస్ వర్గాల్లో అత్యంత చర్చనీయాంశం అయింది.    స్పీకర్ హోదానుంచి నేరుగా ముఖ్యమంత్రి పదవికి ఎగబాకిన  కిరణ్ కుమార్ రెడ్డి అదృష్టాన్ని ఆహ్వానించిన వారికంటే కన్ను కుట్టిన వారి సంఖ్యే సొంత పార్టీలో ఎక్కువగా వుండడం కాంగ్రెస్ సంస్కృతి తెలిసిన వారికి ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. సరిగ్గా అదే జరిగింది. రోశయ్య గారిని మార్చడం అంటూ జరిగితే ఆ వరమాల తమ మెడలోనే పడేట్టుగా లోపాయికారి ప్రయత్నాలు సాగించిన సీనియర్ మంత్రులకు ఈ పరిణామం సహజంగానే మింగుడు పడలేదు. కాబట్టే మొదటి ముద్దలోనే ఈగ పడిందన్న చందంగా తొలినాళ్ళలో ఆయనకు సొంత మంత్రులనుంచే సహకారం అందకుండా పోయింది. పరిపాలన మీద పట్టు చిక్కించుకోవడం మాట అటుంచి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడమే గగనమైపోతోందన్న మాటలు వినబడ్డాయి. ఒకపక్క రాష్ట్ర విభజన ఉద్యమం, మరోపక్క కొత్తగా పుట్టుకొచ్చిన జగన్ పార్టీ విసురుతున్న సవాళ్లు - కొత్త ముఖ్యమంత్రికి కంటిమీద కునుకు లేకుండా చేసాయి. దానికి తోడు పీసీసీ అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ నియామకంతో కిరణ్ పాలనకు రోజులు మూడాయన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లోనే బాగా సాగింది. కాంగ్రెస్ నుంచి కొత్త పార్టీలోకి వలసలను అరికట్టలేకపోతున్నారన్న అపప్రధ  ఓ పక్క. మరోపక్క ఉపఎన్నికల్లో పాలకపక్షం పరాజయ పరంపర. సొంత గొడవలే తప్ప ప్రజలగోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఇంకో పక్క. ఒక కాంగ్రెస్  ముఖ్యమంత్రి రాత్రికి రాత్రే  మాజీ ముఖ్యమంత్రి కావడానికి ఇవి చాలు. కానీ, కిరణ్ అదృష్టం ఏమిటో గాని అధిష్టానం ఇవేవీ పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే మొదటి ఏడాది కాలం ఇట్టే గడిచిపోయింది. రెండో ఏడాది ఇవన్నీ మరింత ముదిరి పాకాన పడ్డాయి. అయినా ఆయన కుర్చీ కిందకు నీళ్ళు రాకపోవడం చూసి కాంగ్రెస్ పార్తీవాళ్ళే ఆశ్చర్యపోవడం మొదలెట్టారు. చూస్తుండగానే మూడో ఏడు. ఈలోగా పాలన మీద పెద్దగా కాకపోయినా ఓ మోస్తరుగానయినా ముఖ్యమంత్రికి పట్టుకుదిరింది. ఆయన్ని  మార్చరేమో అన్న అనుమానం మొదలు కాగానే ముందు మొరాయించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ  ఎందుకయినా మంచిది అన్న ధోరణిలో సర్దుకుపోవడం మొదలెట్టారు. అంతకు ముందు ప్రైవేటు సంభాషణల్లో ‘కిరణ్’ అంటూ  తేలిగ్గా మాట్లాడిన వాళ్లందరూ ‘గౌరవనీయులయిన ముఖ్యమంత్రి గారు,  పూజ్యులయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు’ అని ముందూ వెనుకా గౌరవ వాచకాలు తగిలించి మరీ మాట్లాడడం గమనిస్తే క్రమేపీ పార్టీపై ఆయన పట్టు బిగిస్తున్న సంగతి బోధపడుతుంది. దీనికి తోడు ఆయనొక ‘సీతయ్య- ఎవ్వరి మాటా వినడు’ అనే పద్ధతిలో సాగిన ప్రచారం కూడా కిరణ్ కుమార్ రెడ్డికి కొంత కలిసివచ్చింది.
వాస్తవానికి  ముఖ్యమంత్రిగా కిరణ్ సాధించిన ఘన కార్యాలు ఏవీ లేవు. ఏవో కొన్ని కొత్త పధకాలకు రూపకల్పన చేసి అమలుచేస్తున్నా,  వాటిలో కొన్నింటికి ‘తన పేరు’  పెట్టుకోవడం అన్న సంగతి పక్కన పెడితే,  వాటిపై తనదైన ముద్ర వేసుకోవడంలో కానీ, వాటికి  తగిన ప్రాచుర్యం కల్పించుకునే విషయంలో కానీ, గతంలో చంద్రబాబు, రాజశేఖర రెడ్డి చూపించినట్టుగా  కిరణ్ కుమార్ రెడ్డి అంతగా  ఆసక్తి ప్రదర్శించకపోవడం కూడా ముఖ్యమంత్రిగా ఆయన వైఫల్యాల జాబితాలో చేరిపోయింది. ఎన్నికల్లో పార్టీని గెలిపించి మరోసారి అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత అంటూ లేకపోవడం వల్లనే ఆయన ఇలా నిరాసక్తంగా వ్యవహరిస్తున్నారన్న నింద కూడా వుంది.   
సాఫల్య వైఫల్యాలు యెలా వుంటేనేం,  ముఖ్యమంత్రిగా మూడేళ్ళు పూర్తిచేసిన రికార్డు ఆయన ఖాతాలో చేరిపోయింది. 1975 నుంచి తీసుకుంటే ‘ఎమర్జెన్సీ’ కాలపు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, ‘వాజ్ పేయీ నీడన చంద్రబాబు, అధిష్టానం చల్లని చూపుల్లో రాజశేఖర రెడ్డిని మినహాయిస్తే, ఇటీవలి కాలంలో కిరణ్ కుమార్ రెడ్డిదే అరుదయిన రికార్డ్.  కాంగ్రెస్ పార్టీలో ఉద్దండ నాయకులు మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి వీరెవ్వరికీ ఈ రికార్డ్ లేదు. వీరిలో రెండు మార్లు ఈ పదవి పొందిన వారు వున్నారు కానీ ఏకబిగిన మూడేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేయలేదు.
ఇక కిరణ్ కుమార్ రెడ్డి గురించి చెప్పుకోవాల్సిన ఆసక్తికరమైన అంశం ఒకటుంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో తెలంగాణా అంశం ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టింది. బలహీనుడయిన ముఖ్యమంత్రిగా ముద్ర వేసింది. విచిత్రం ఏమిటంటే మళ్ళీ తెలంగాణా అంశమే కిరణ్ కుమార్ రెడ్డిని  అత్యంత శక్తిమంతుడిని చేసింది. ఈ విషయంలో ఆయన అధిష్టానాన్ని దిక్కరిస్తున్న తీరు ‘కొందరి దృష్టిలో’ అయినా ఆయన్ని ‘మొనగాడి’ని చేసింది.

నిజానికిది ఒక ‘రాజకీయ విచిత్రం’  (25-11-2013)

23, నవంబర్ 2013, శనివారం

ఎన్టీయార్ పెళ్లి శుభలేఖ

1942

అంటే డెబ్బయ్యేళ్లు దాటిపోయాయి. అప్పటి శుభలేఖ ఇది.
అంత పాతది సరే. అంతకంటే విలువైనది  కూడా! 
అదేమిటంటే -
ఆంధ్రుల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి   పెళ్లి పిలుపు ఇది.
అందుకే ఇది అరుదయినదీ, అంతే అపురూపమైనదీ.
నెట్ మిత్రుడు ఒకరు దీన్ని పంపారు.
అసలైనదేనా అనే సందేహాలు పక్కనపెడితే ఎంచక్కా సంతోషం కలిగించే పాత పెళ్లి పత్రిక ఇది. 




(ఎన్టీయార్  పెళ్లి పత్రిక)