4, ఆగస్టు 2012, శనివారం

నృత్య దాన కర్ణుడు


నృత్య దాన కర్ణుడు
ఇటీవల కన్నుమూసిన నృత్య దాన కర్ణుడు వెంపటి చిన సత్యం గారి గురించి ఆర్ వీ వీ కృష్ణారావు గారు కలబోసుకున్న తలపుల్లో కొన్ని.  


వెంపటి చిన్న సత్యం గారు పోయారని టీవీ చానల్స్ లో స్క్రోల్లింగ్ చూడగానే కొంత సేపు మా ఇంట్లో స్తభ్ధత ఏర్పడింది.  మా ఆవిడ నేను కొంతసేపు బాధ పడ్డాము. క్రితం ఏడాది వో ప్రోగ్రాములో
చూసినప్పుడు బాగా పండి పోయి కనిపించారు. ఎప్పుడేనా రాలి పోయేలా కనపడ్డారు. జ్ఞాపకం కూడా బాగా తగ్గినట్టు అనిపించింది.
"చిన సత్యం గారితో  సాన్నిహిత్యం నా సుకృతం. నేను బెజవాడలో పనిచేసే రోజుల్లో   వో పదిహేను  సంవత్సరాలకు పైగా చిన్న సత్యం గారితో చాలా సన్నిహితంగా  మెలిగాను. ఆయన బెజవాడ వచ్చారంటే చాలు మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళే వరకు ఆయనతోటే వుండేవాడిని, భోజనం పడకతో సహా.  ఎప్పుడు వచ్చినా  మమత హోటల్ లోనే  దిగే వారు. ఎన్నెన్నో విషయాలు,  నాకు సంబంధం లేనివి కూడా  నాతో చెబుతుండేవారు. బెజవాడలో మా కొక సభ వుండేది,   త్యాగరాజ సంగీత కళా సమితి అని.  మాస్టారు ప్రోగ్రాములన్నీ అక్కడ పెట్టేవాళ్ళం.  మొదటిసారిగా  నేను చిన్న సత్యం గారిని కలిసింది రైల్లో. 1971 లో   వుద్యోగంలో చేరిన కొత్తల్లో  వో సారి ఢిల్లీ నుంచి  జీ టీ ఎక్స్ ప్రెస్ లో  హైదరాబాద్ వస్తున్నప్పుడు కలిసాం. పొద్దుటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు  ఏదో మాట్లాడుకుంటూనే  వున్నాము.  ఆ తర్వాత రెండు మూడు రోజులకు రవీంద్ర భారతిలో హేమ మాలిని డాన్స్  ప్రోగ్రాం. మాస్టారు నట్టువాంగం.  మీరూ  రండి’ అని పిలిచారు.  ప్రోగ్రాం కి  వెళ్ళాను. చాలా మంది జనం వున్నారు.  సత్యం గారిని పట్టుకోవడం  కష్టమే.  పైగా టికెట్ కొనకుండా వూరికే చూడడానికి వచ్చిన ప్రేక్షకుడిని.  మొత్తానికి మాస్టర్ గారికి కబురు పెట్టడం ఆయన బయటకు వచ్చి నన్ను తీసుకెళ్ళి కూర్చో పెట్టడం నాకు బాగా గుర్తు.  తరవాత నాలుగేళ్ళకు మళ్ళీ కలిసాం.  అప్పుడు ఆయన,  ‘శోభ నాయుడు ప్రోగ్రాం  బెజవాడ  మీ సభలో పెట్టండి’ అని కోరారు.  అల్లాగే కానీ, మా దగ్గర డబ్బులు పెద్దగా లేవ’ని చెప్పాను.
‘డబ్బు వద్దు. మీరు మంచి పబ్లిసిటీ ఇవ్వండి. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు వుంది’ అని అన్నారు.  మద్రాస్ నుంచి పోస్టర్లు కొట్టించి పంపారు. మేము చాలా బాగా ఆర్గనైజ్ చేశామనే చెప్పాలి.   మంచి కవరేజే వచ్చింది.  తర్వాత  శోభానాయుడు చాలా గొప్ప కూచిపూడి డాన్సర్  అయ్యారు. మాస్టారుకి  చాలా ఇష్టమయిన స్టూడెంట్  శోభానాయుడనే చెప్పాలి. ఆ అమ్మాయికి తన విద్వత్ అంతా ధార  పోశారు. ఆమె చేత  ఆంధ్ర మెట్రిక్  కట్టించి బెజవాడలోనే   పరీక్ష రాయించారుతన తదనంతరం  కూచిపూడి అకాడెమికి ఆమెను వారసురాలిని చెయ్యాలనుకున్నారు కూడా.   కానీ,  శోభానాయుడు తర్వాత హైదరాబాద్ లో  వేరే అకాడెమి పెట్టుకొన్నారు.  మాస్టారుకి అదో పెద్ద షాక్.
"తదాదిగా, నేను మాస్టారుతో మమేకం  అయ్యాను. బెజవాడ  వస్తే మా ఇంటికి వచ్చేవారు. వోపూట   భోజనం చేసే వారు కూడా.  శ్రీనివాస కళ్యాణం,  రుక్మిణి కళ్యాణం,  క్షీరసాగర మధనం, హరవిలాసం, చండాలిక నృత్య రూపకాలతో పాటు, ఆయన శిష్యుల సోలో పెర్ఫార్మెన్సులు ఎన్నో పెట్ట్టించాము.   ఎప్పుడూ ఇంత ఇవ్వమని అడగలేదు. మా దగ్గర ప్రోగ్రాం  చేస్తే ఆయనకు రెండు మూడు వందల కంటే మిగిలేది కాదన్న విషయం నాకూ  తెలుసు. బెజవాడలో ప్రోగ్రాం అంటే  కూచిపూడి నుంచి ఆయన బంధు మిత్రులందరూ వచ్చేవారు.  వాళ్ళనందరినీ వూరికి  పంపించమని అడగడానికి ఎంతో మొహమాట పడేవారు. 
సభ నిర్వహించడం నాకు తెలుసు. మా వాళ్ళందరికీ నా ప్రోగ్రాం  చూడాలని వుంటుంది. ఇక్కడ కంటే ఇంకో చోట ఆవకాశం లేదు. మీరు వాళ్ళందరిని హాల్ లోకి పంపారు.  నాకు మీరు ఏమిచ్చినా  పర్వాలేదు’ అని ఎంతో వినమ్రంగా చెప్పే వారు. ప్రోగ్రాం  అయిన తర్వాత వాళ్ళంతా గ్రీన్ రూంలోకో లేదా ఆయన బస చేసిన చోటికో  వచ్చే వారు.  వాళ్ళ బాధలన్నీ ఆయనతో చెప్పుకొనే వారు.  సత్యం గారు మేము ఇచ్చిన  పారితోషికంలో చాలా మటుకు అక్కడికక్కడే  వాళ్లకు పంచి పెట్టడాన్ని నేను కళ్ళారా  చూసాను.  వాళ్ళు వెళ్లిన తర్వాత నాతో అనే వారు. ‘మా వాళ్ళు చాలా పేద వాళ్ళు.  నాకు వాళ్ళందరిని పైకి  తీసుకు రావాలని వుంది’.   అనడమే కాదు అలా చేసేవారు కూడా.
సత్యం గారికి కూచిపూడి అన్నా, కూచిపూడి వారన్నా  ప్రాణం.  మద్రాస్ వెళ్ళినా కూచిపూడి కోసం తహ తహలాడేవారు.  కూచిపూడి డాన్సు పైకి  వస్తే మా వాళ్ళంతా బాగు పడతారని ముప్ఫయి ఏళ్లుగా తపన పడుతూ వచ్చారు. ఈవేళ కూచిపూడికి  అంతర్జాతీయ ప్రాముఖ్యం వచ్చింది.  కూచిపూడి భాగవతులుగా వొకప్పుడు గర్భ దారిద్ర్యం అనుభవించిన  వారంతా ఈవేళ కూచిపూడి డాన్సు మాస్టర్లు గా పేరు పొందారు.  మాష్టారు ఎప్పుడు బెజవాడ  వచ్చినా  ఏదో టైం చూసుకొని కూచిపూడి వెళ్లి వచ్చే వారు.  అందర్నీ పలకరించి రావడం, సిద్ధేంద్రక్షేత్రాన్ని అభివృద్ధి పరచడం, వారి కుల దేవత బాల త్రిపుర సుందరి అమ్మవారి గుడి బాగు చెయ్యడం - వీటిల్లోనే   ఆయన తల మునకలు అయ్యే వాళ్ళు. ‘మా  వాళ్ళలో వొకరికి మరొకరికి పడదు. కొట్టుకు చస్తూ  వుంటారు  చెప్పినా వినడం లేదు’ అని బాధ పడే వారు. కూచిపూడి వెళ్లినప్పుడల్లా వొకరిద్దర్ని తనతో పాటు   మద్రాస్ తీసుకు వెళ్ళే వారు. చిన్న సత్యం గారు మద్రాస్ వెళ్ళే సమయానికి అక్కడ వేదాంతం రాఘవయ్య, వెంపటి పెద్ద సత్యం, పసుమర్తి కృష్ణ మూర్తి వంటి కూచిపూడి వాస్తవ్యులు సినిమా రంగంలో ఉన్నత స్థితిలో వున్నారు.  పేరుతో పాటు డబ్బుకూడా సంపాదించుకొన్నారు.  అయినా వాళ్ళెవరికీ  పట్టలేదు, కూచిపూడి గురించి కాని కూచిపూడి నృత్యం గురించి  కాని.  చిన్న సత్యం వొక్కరే  నిలబడ్డారు.  తన స్కూల్ కి ‘కూచిపూడి ఆర్ట్ అకాడెమి’ అని పేరు పెట్టుకొన్నారు. అది ఎందరికి నాట్య బిక్ష పెట్టిందంటే, ఇప్పుడు  కేవలం డాన్సు మీద ఆధార పడ్డ వాళ్ళయినా, సినిమా వాళ్లయినా సరే, ప్రతివారూ తాము  కూచిపూడి ఆర్ట్ అకాడెమి చిన్న సత్యం గారి శిష్యులమని చెప్పుకునే వారే.


కేంద్ర సంగీత నాటక అకాడెమి 1965 ప్రాంతంలో కూచిపూడి డాన్సును ప్రోత్సహించేందుకు  పాతిక వేల రూపాయిల గ్రాంట్ ఇచ్చి వో నృత్య రూపకం చెయ్యమని కోరింది.  అప్పట్లో బెజవాడ  రేడియో స్టేషన్ లో పనిచేస్తున్న బందా కనకలింగేశ్వర రావు గారి  కృషి ఫలితంగా లభించిన ఈ అవకాశాన్ని అప్పట్లో అందరిలోకి చిన్నవాడయిన చిన్న సత్యంగారికి  అప్పగించారు. దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు ఇందుకోసం క్షీర సాగర మధనం రూపొందించారు. రజని కాంతరావు  గారు సంగీతం సమకూర్చారనుకొంటా.   మహంకాళి సత్యనారాయణ, వేదాంతం సత్యనారాయణ శర్మ, చింతా కృష్ణ మూర్తి వంటి ఉద్దండులు ఇందులో పాత్రధారులు. బీసెంట్ రోడ్ లోని మోడరన్  కేఫ్ లో వీరందరికీ బస ఏర్పాటు చేసి రిహార్సల్ చేయించే వారు. రోజు వీరంతా వెళుతుంటే లక్ష్మి జనరల్ స్టోర్స్ శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు కూచిపూడి భాగవతులను  చూసి ‘ఇంత గొప్పవారు చిరిగిన శాలువాలు వేసుకోవడం ఏమిట’ని కొత్త సిల్క్ శాలువాలు ఇచ్చారుట. వీళ్ళంతా కొత్త శాలువాలు  ట్రంక్ పెట్టెల్లో పెట్టుకొని మళ్ళీ చిరిగిన  శాలువాలే వేసుకొని బీసెంట్ రోడ్లో తిరిగేవారుట. ‘అంత అమాయకులు. మావాళ్ళకి ఏమీ తెలియదు’ అంటూ వాపోయే వారు చిన్న సత్యం మాష్టారు.
ఓ సారి శ్రీనివాస కళ్యాణం ప్రోగ్రాం  పెట్టాం మొదటిసారిగా బెజవాడలో. అప్పటికే ఆ నృత్య నాటకానికి ఎంతో పేరు వచ్చింది. రేపు ప్రోగ్రాం  అనగా మాకు ఫోన్ వచ్చింది. ‘పద్మావతి పాత్ర వేసే శోభానాయుడుకి వంట్లో బాగో లేదు. ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేసుకోవాల్సింద'ని.  మేమంతా కుదేలయిపోయాము. కొందరేమో 'ఇదో నాటకం' అని తిట్టిపోశారు కూడా.  నెల రోజులు పోయిన తర్వాత పెట్టుకోమన్నారు.  ఈ సారి ఇంకో మార్పు.  శ్రీనివాసుడు వేసే మంజు భార్గవి రావడం లేదు అని. అప్పటికే ఆవిడ సినీ  స్టార్ అని కొంత గ్లామర్  వుంది. ఆవిడా,  శోభానాయుడు అయితేనే ఆ ప్రోగ్రాం  బావుంటుంది.  కాని మాస్టర్ గారికి ఎందుకో ఓ  సినిమాలో ఆవిడ వేషం నచ్చ లేదుట. మంజు భార్గవి కాక క్షేమవతి వేస్తుంది అని చెప్పారు.  మా నిర్వాహకులలో కొందరికి ఈ మార్పు నచ్చలేదు.
‘ప్రోగ్రాం  వద్దే వద్దు’ అన్నారు. కాని ఇది చిన్న సత్యం గారి ప్రోగ్రామాయే. ఎవరు వేసారన్నది ముఖ్యం కాదని ఒప్పించాము. మొత్తం మీద  చాలా చాలా బాగా వచ్చింది.  వేదవతి ప్రభాకర రావు గారు కూడా కనకదుర్గతో కలసి పాడారు. దృశ్య కావ్యం అంటే ఏమిటో చూపించారు.  అయిన తర్వాత మాష్టారు గారికి పది వేల రూపాయిలు ఇస్తే ‘వొద్దు మీ సభకి కార్పస్  ఫండ్ గా వుంచండి’ అని తిరిగి ఇచ్చేసారు.
మళ్ళీ ఎనిమిదేళ్ళ  తర్వాత ‘మంజు భార్గవి శ్రీనివాసుడుగా కావాలన్నారు కదా ఈసారి వేద్దాం’ అన్నారు.  అయితే ఈ సారి శోభానాయుడు లేదు. అలా బెజవాడ  అభిమానులకు శోభానాయుడు మంజు భార్గవి చిన్న సత్యం కాంబినేషన్ లో శ్రీనివాస కళ్యాణం చూసే భాగ్యం కలగలేదు.”  (04-08-2012)


2, ఆగస్టు 2012, గురువారం

కదిలింది జగన్నాధ రధము


కదిలింది జగన్నాధ రధము
కలయో వైష్ణవ మాయయో అన్నట్టు ప్రభుత్వంలో ఏదో కదలిక. దాదాపు రెండేళ్ళకు పైబడి  నిర్వికారంగా, నిస్తేజంగా, నిస్సత్తువుగా,  చేష్టలుడిగి  నిష్క్రియాపరత్వానికి నిలువెత్తు నిదర్శనంగా వున్న రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో చిన్న కదలిక.
ఉప ఎన్నికల కదన రంగంలో వరుస పరాజయ పరంపరతో చావుదెబ్బలు తిని, కన్నులొట్టబోయిన కాంగ్రెస్ పార్టీకి పూర్వ జవసత్వాలు కలిగించే సంకల్పంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  మొదలు పెట్టిన ఇందిరా పల్లె బాటకు జనాలనుంచి నీరాజనాలు లభించకపోయినా వ్యతిరేకత కూడా పెద్ద స్తాయిలో ఎదురుకాకపోవడం  చాలాకాలం తరువాత కిరణ్ సర్కారుకు దక్కిన  ఊరట.
బహుశా రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో మున్నెన్నడు కనీ వినీ ఎరుగని స్వేచ్ఛనూ, వాక్స్వాతంత్ర్యాన్ని కాంగ్రెస్ వాదులు ఈనాడు  అనుభవిస్తున్నారనుకోవాలి. పార్టీకి చెందిన  సీనియర్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, పొన్నం ప్రభాకర్ లు ఇటీవల టీవీ తెరలపై చేసిన  మాటల యుద్ధం చూసిన వారికి ఈ అభిప్రాయం కలగడం సహజం.  మెడలో వేసుకున్న మువ్వన్నెల కాంగ్రెస్ కండువాలను మినహాయిస్తే, వారిద్దరెవరో  తెలియని వారికి  ఆ ఇద్దరు  ఒకే పార్టీకి చెందినవారంటే నమ్మకం కుదరడం కష్టం.
రోశయ్యను మార్చి ఆ స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయాల్సివచ్చినప్పుడు అధిష్టానదేవతలు తెలిసి చేశారో, తెలియక చేశారో కాని వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేసిన వారికెవ్వరికీ అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీ స్పీకర్ గా వున్న కిరణ్ కుమార్ రెడ్డికి ఆ అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రిగా  వై.ఎస్. తీసుకున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో పార్టీని డెబ్బతీస్తాయన్న అనుమానంతోనే  వై.ఎస్. వద్ద పనిచేసిన  మంత్రులెవ్వరికీ రోశయ్య స్తానంలో ముఖ్యమంత్రి పదవి అప్పగించలేదని భాష్యం చెబుతున్నవాళ్ళు కూడా  వున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి అధిష్టానం పరిగణన లోకి తీసుకున్న యువకుడు, విద్యాధికుడు అన్న రెండు అంశాలను – రుజువు చేసుకోవడంలో ఆయన చాలావరకు   వైఫల్యం చెందారనే చెప్పాలి. ఆయనకు ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి వ్యవహార శైలితో పోల్చి చూసుకుని  కిరణ్ పని తీరును అంచనావేయడం సహజంగా జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా, ఏ చిన్న సంఘటన జరిగినా - వారిద్దరూ  తక్షణం  హెలికాప్టర్ లో రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. ఇలా చేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయా అన్నది సందేహమే. కానీ, ఈ ఆకస్మిక పర్యటనల ద్వారా వారిరువురికీ ప్రజాదరణ అనే రాజకీయ లబ్ది లభించింది. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశం పట్ల వెంటనే స్పందిస్తారన్న నమ్మకం జనంలో ఏర్పడింది. యువకుడయిన కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం  ఈ విషయంలో
అధిష్టానం తన మీద వుంచిన భరోసాను నిలబెట్టుకోలేకపోయారనే చెప్పాలి. ఇటీవలి కాలాన్ని మినహాయిస్తే , ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరవాత ఆయన ఎక్కువ సమయం సచివాలయంలో, సీ.ఎం. క్యాంప్ కార్యాలయంలోనే గడుపుతూ వచ్చారు. అధికారులతో సమీక్షా సమావేశాలు జరుపుతూ పాలన సాగిస్తున్నారని ఆయన పార్టీవారే ఎద్దేవా చేస్తుంటారు. క్షేత్ర స్తాయిలో సమాచారం తెలుసుకోవడానికి ఆయన అధికారులమీదనే ఎక్కువ ఆధారపడతారని కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే చెబుతారు. 
నిజానికి ఆయన మంచి సమయంలో ముఖ్యమంత్రి అయ్యారు. చిన్న వయస్సులో  అధిష్టానం ఆయనకు పెద్ద పదవిని అయాచితంగా అప్పగించింది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ వ్యవధానం వున్న తరుణంలో ముఖ్యమంత్రి కావడం వల్ల అనుకున్న పనులు అనుకున్న వ్యవధిలో పూర్తిచేసే అవకాశం వుంటుంది. పైగా అధిష్టానం మద్దతు పూర్తిగా వుంది. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికయినా ఇది గొప్ప వరం. కిరణ్ ఈ వరాన్ని చక్కగా వినియోగించుకున్న దాఖలాలు లేవని  ఆయన సన్నిహితులే పరోక్ష సంభాషణల్లో వొప్పుకుంటూ వుంటారు.
ఏతావాతా జరిగింది అనవసర కాలయాపన. పుణ్యకాలం కాస్తా ఉపఎన్నికలతోనే గడిచిపోయింది. ఈ ఉపఎన్నికలకు మూలకారణం వై ఎస్ ఆర్ పార్టీ అయినప్పటికీ, వాటిని నివారించి, ఘోర పరాభవాన్ని పార్టీ మూటగట్టుకునే అవకాశాన్ని చేజేతులా కిరణ్ కుమార్ రెడ్డి కల్పించారని ఆయన పార్తీవాళ్ళే అపవాదు వేస్తున్నారు.
ఏ లెక్క ప్రకారం చూసినా  వైఫల్య ముఖ్యమంత్రి అనే కితాబును కిరణ్ కు ఇవ్వకతప్పదని అంటున్నారు. అధిష్టానానికీ ఈ విషయం తెలుసు. కానీ, ముఖ్యమంత్రిని మార్చడం వల్ల వచ్చే లాభం కన్నా మార్చడం వల్ల ఒనగూడే నష్టం ఎక్కువ అన్న వాస్తవం తెలుసు కనుక వాళ్ళూ కిమ్మిన్నాస్తిగా వుండిపోతున్నారు. అధిష్టానం నిస్సహాయత,  ప్రధాన  ప్రతిపక్షం అయిన తెలుగు దేశం నిష్క్రియాపరత్వం కలసి  వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని  కొందరు భాష్యం చెబుతున్నారు.      
నిజమే. ఇప్పుడు  ఆయన ఎదుర్కుంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కానీ, నమ్మి అధికారం వొప్పగించిన ప్రజల సమస్యల మాటేమిటి? ప్రజలకు సమస్యలను  దూరం చేస్తే వారు పాలకులకు దగ్గరవుతారు. ఇది చరిత్ర చెప్పే సత్యం. 
పదవి తాత్కాలికం అనుకున్నప్పుడు పదిమందికి శాశ్వితంగా పనికొచ్చేపనులు పదవిని లెక్కచేయకుండా   ధైర్యంగా చేయడానికి వీలుంటుంది. పదవినే శాశ్వితం చేసుకోవాలనుకున్నప్పుడు నలుగురికీ పనికొచ్చే పనులు చేయడానికి అవసరమయిన సంకల్పం కొరవడుతుంది.
ఇది దృష్టిలో వుంచుకుంటే  సమర్ధవంతమయిన పాలన సాగించేందుకు మార్గం సులువవుతుంది. (02-08-2012)

26, జులై 2012, గురువారం

కొత్త కుటుంబం



కొత్త కుటుంబం

‘నేను పుట్టడానికి కొన్ని నెలల ముందు నుండే  నన్ను మట్టుబెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ పనికి పూనుకుంది కూడా ఎవరో కాదు నా కన్నతల్లే కావడం విధి విచిత్రం’
కధలెలా రాయాలి అని కొత్త రచయితలకు మార్గ నిర్దేశం చేస్తూ కీర్తిశేషులు ఆరుద్ర రాసిన వ్యాసం ఈ విధంగా మొదలవుతుంది. కధ ఎత్తుగడ ఎలావుండాలి, తొలి వాక్యంతోనే  పాఠకులను యెలా ఆకట్టుకోవాలి అనే అంశానికి ఉదాహరణగా ఆయన ఈ రెండు వాక్యాలను ఉటంకించారు.
పుట్టడానికి ముందే చంపే ప్రయత్నం అంటే ‘అబార్షన్’ అనుకోవాలి. తల్లే దానికి పూనుకున్నదంటే ఆమెకు పెళ్లి కాకుండానే గర్భం వచ్చిందని భావం. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోవాల్సిన పాపే ఈ మాటలు చెబుతోందంటే అబార్షన్ విఫలమయిందని అర్ధం. రెండు చిన్న వాక్యాలలో ఇంత కధను ఇమడ్చగలిగితే ఇక ఆ కధ పట్ల పాఠకుల ఆసక్తి అపరిమితంగా పెరిగిపోయే అవకాశం కూడా  అంతే  వుంటుంది.
ఆరుద్ర గారిలా కాకపోయినా నేను చెప్పబోయే  ఈ  కధ ముగింపు  బాగానే ఉంటుందనుకుంటున్నాను.
నా చిన్నతనంలో  మా ఇంటికి ఓ  కొత్త అతిధి ఒకరు వచ్చారు. వచ్చారు అనడం కంటే తీసుకు వచ్చారు అంటే బాగుంటుందేమో. ఆ రోజుల్లో మాది ఓ చిన్న బస్తీ. బజారు పనిమీద వెళ్ళినప్పుడు  కనబడిన ఈ అతిధి మా నాన్నను ఇట్టే ఆకర్షించాడు. రోజూ ఒకసారయినా పనిపెట్టుకుని బజారుకు వెళ్లి అతగాడిని  చూసివస్తుండేవాడు. అలాటిది ఒకరోజు ఏమయితే అయిందని అతడిని ఏకంగా ఇంటికే తీసుకువచ్చాడు.
 ఆ రోజుల్లో మాది ఓ చిన్న బస్తీ. బజారు పనిమీద వెళ్ళినప్పుడు  కనబడిన ఈ అతిధి మా నాన్నను ఇట్టే ఆకర్షించాడు. రోజూ ఒకసారయినా పనిపెట్టుకుని బజారుకు వెళ్లి అతగాడిని  చూసివస్తుండేవాడు. అలాటిది ఒకరోజు ఏమయితే అయిందని అతడిని ఏకంగా ఇంటికే తీసుకువచ్చాడు. అంతే! అతడి రాకతో,  ఆ రోజునుంచి  మా ఇంటి వాతావరణం  పూర్తిగా మారిపోయింది.
అతిధి అంటే ఒకటి రెండు రోజులుండి పోయేవాడు. అదేమి  చిత్రమో కాని,  వచ్చిన వాడు వచ్చినట్టే  టంకంలా మా ఇంటికి అతుక్కుపోయాడు.ఇంట్లో అడుగు పెట్టిన కొత్త అతిధి, కొత్తా పాతా తేడాలేకుండా   ఇంటిల్లిపాదినీ ఇట్టే ఆకట్టుకున్నాడు. కధ అంతటితో ఆగలేదు.  ఇరుగింటి వాళ్ళు,పొరుగింటివాళ్ళు  చిన్నా పెద్దా  అంతా కట్టగట్టుకుని  అతడి ముచ్చట్లు వినడానికి మా ఇంటి మీదికి  ఎగబడేవారు. మొదట్లో ఉదయం  ఓ గంటా సాయంత్రం ఓ రెండు గంటలు కాబోలు అందరితో కలుపుగోలుగా మసలుకునేవాడు. ఆ తరువాత మాత్రం ముంగిలా ముసుగేసుకుని తొంగునేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. కొన్ని సార్లు అతడి మాటలు అర్ధం అయ్యేవి. మరికొన్నిసార్లు అర్ధం అయినట్టు వుండేవి. ఇంకొన్ని సార్లు అతడు ఏం మాట్లాడుతున్నాడో, యే భాషలో మాట్లాడుతున్నాడో తెలిసేది కాదు. అర్ధం కాకపోయినా అతడి మాట తీరు అందరికీ  నచ్చేది. ఇది అది అని లేకుండా   చరిత్ర, లెక్కలు, పురాణాలు ఏది కదిల్చినా వాటిల్లో అతడికున్న పరిజ్ఞానం మాత్రం  అమోఘం. సినిమా కబుర్లు మొదలు పెట్టాడంటే చాలు  ఇక వాటికి అంతూపొంతూ  వుండేది కాదు.
నాకయితే అతడు మంచి స్నేహితుడిగా మారిపోయాడు.మొదట్లో మాదిరిగా ఉదయం, సాయంత్రం అన్న పద్ధతికి స్వస్తి చెప్పి  పొద్దస్తమానం కబుర్లతో కాలక్షేపం చేసేవాడు.అలా అస్తమానం  అతడితో గడుపుతూ అతడు చెప్పే కబుర్లు వింటూ వుండడం మా అమ్మానాన్నకు పోను పోను నచ్చేది కాదు. ఎందుకంటే అతడు చిన్న పిల్లల కధలు మాత్రమే కాదు ఒక్కోసారి రాత్రి పొద్దుపోయిన తరువాత వీలుచూసుకుని   కొన్ని పెద్ద పెద్ద  ముచ్చట్లు కూడా చెప్పేవాడు. ముందు ఛీ పాడు అనుకునే దాన్ని. కానీ రానురాను   అతడు చెప్పే ఆ మాటల్లో నాకు   తెలియకుండానే ఆసక్తి పెరగడం  మొదలయింది. ఇదంతా మా అమ్మనాన్నకు రుచించేది కాదు. ‘అస్తమానం అతడితో ఏమిటా కబుర్లు. బుద్దిలేకపోతే సరి’ అని మా అమ్మ కసురుకునేది కూడా.
చూస్తుండగానే యాభయ్  ఏళ్ళు గడిచిపోయాయి. అతిధిగా ఇంట్లో కాలుమోపిన అతడు రోజులు గడుస్తున్నకొద్దీ అభ్యాగతి గా మారిపోయి  ఇప్పుడు అదే ఇంట్లో ఓ మూలన పడివున్నాడు. ఇప్పటికీ కబుర్లకు కొదవ లేదు. వినేవాళ్ళకే  కొరత. విశేషం ఏమిటంటే మొదట్లో విసుక్కున్న మా అమ్మ ఇప్పుడు అతడి రంధిలో పడిపోయింది. అతడు చెప్పే అత్తాకోడళ్ళ కధలంటే చెవికోసుకునేవరకు వెళ్ళిపోయింది. మా నాన్నా అంతే. అతడిని చూస్తే చిరాకుపడే వాడల్లా ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. పేపరు చదవడం కూడా మానేసి అతడు చెప్పే రాజకీయాలు  వింటూ కూర్చుంటున్నాడు.  
ఇంతకీ పేరు చెప్పడం మరచిపోయినట్టున్నాను కదూ. అందరికీ తెలిసిన పేరే. అతడి  అసలు పేరు టీవీ. జాతకనామం  దూరదర్శన్. కాలం గడుస్తున్నకొద్దీ అర్జునుడి మాదిరిగానే  రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. పూటకో ఛానల్ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో ఇప్పుడు  రోజుకో పేరు.  కొద్దికాలం క్రితమే పెళ్లి చేసుకున్నాడు. అతడి భార్య పేరు కంప్యూటర్. ముగ్గురు పిల్లలు. పెద్దాడి పేరు ఇంటర్నెట్. రెండో సంతానం సెల్ ఫోన్. కొత్తగా ఓ మనవడు వచ్చాడు వాళ్ల కుటుంబంలోకి. అతడికి ముద్దుగా ఐ పాడ్ అని నామకరణం చేశారు.
మా పాత కుటుంబంలో ప్రవేశించిన ఈ కొత్త కుటుంబం తామరతంపరగా పెరిగిపోతూనే వుంటుందేమో. 
(26-07-2012) 

23, జులై 2012, సోమవారం

ఇలాగయినా అర్ధం చేసుకోండి!


ఇలాగయినా  అర్ధం చేసుకోండి!
 “నా వయస్సు కేవలం ఎనభై ఆరు  సంవత్సరాలు. గత అరవై ఏళ్లుగా మీ బాంక్ ఖాతాదారుగా వున్నాను. ఉద్యోగం చేసేటప్పుడు, ఇప్పడు రిటైర్ అయిన తరువాత కూడా అదే బ్యాంకు లో నా ఖాతా కొనసాగిస్తూ వచ్చాను.నేను ఖాతా తెరిచినప్పుడు మీది చాలా చిన్న బ్యాంకు. అయినా సర్వీసు చాలా గొప్పగా వుండేది. మీ బ్యాంకులో పనిచేసే సిబ్బంది అనేకమందితో నాకు వ్యక్తిగత పరిచయాలు వుండేవి. ఆ రోజుల్లో బ్యాంకు కు వచ్చినప్పుడల్లా అంతా ఆత్మీయ వాతావరణం కనబడేది. ఇప్పటిలా ఏసీలు లేవు. సోఫాలు లేవు. కంప్యూటర్లు లేవు. టోకెన్ తీసుకుని పిలుపుకోసం ఎదురు చూసేవాళ్ళం. మరి ఇప్పుడో – బ్యాంకు కు ఏదో పెద్ద పని వుంటే తప్ప రావాల్సిన పని లేకుండా చేశారు. అక్కడ పనిచేసేవారు ఎవరో, యెలా వుంటారో  నాకు తెలియదు. నేనెవరో వారికి తెలియదు.
“ఈ సొదంతా యెందుకు? అసలే మీరు మీ పనితో బిజీగా వుంది వుంటారు.  అసలు విషయానికి వస్తాను.
“మొన్నీమధ్య మా డ్రైవర్  కు జీతం చెక్కు ఇచ్చాను.అతను ఆ చెక్కు బ్యాంకులో ఇచ్చే సమయానికి నా ఖాతాలో సరిపడా డబ్బులు లేవనే సాకుతో దాన్ని తిరగగొట్టారు. మామూలుగా నా పెన్షన్ మీ బ్యాంకు కే నెలనెలా దానంతట అదే జమ అయ్యేలా ముందుగానే ఏర్పాటు చేసుకున్నాను.అయినా చెక్కు రిటర్న్ చేశారు. నా లెక్క ప్రకారం మా డ్రైవర్ నేనిచ్చిన చెక్కును  బ్యాంకులో జమ చేయడానికీ,  దాన్ని గౌరవించి మీరు డబ్బు చెల్లించేలా  సరిపడే  డబ్బు నా ఖాతాలోకి చేరడానికీ నడుమ  కొన్ని నిమిషాలకంటే ఎక్కువ వ్యవధి పట్టి  వుండదు. యేది ఏమయినా మీరు మీ రూల్స్ ప్రకారం దాన్ని తిరగ్గొట్టారు. ఏం చేస్తాం? కంప్యూటర్ తన పని తాను చేసుకుపోయింది.గత పదేళ్లుగా ప్రతి నెలా నా పెన్షన్ డబ్బులు ఒక్క రోజంటే ఒక్క రోజు  వార కూడా లేకుండా నా ఖాతాకు జమ అవుతున్నాయని దానికి తెలియదు కదా.           

“నేను నెట్లో సరి చూసుకున్నాను. నా పెన్షన్ డబ్బులు అదే రోజు నా ఖాతాకు జమ అయ్యాయి. అయినా డబ్బులు లేకుండా చెక్కు ఇచ్చి మీ బ్యాంకును ఇబ్బంది పెట్టినందుకు పరిహారంగా ఓ అయిదు వందలు  నా ఖాతా నుంచి మీరు వసూలు చేసిన సంగతి కూడా అప్పుడే తెలిసింది. ఇంత ఖచ్చితంగా పనిచేస్తున్నందుకు మీకూ మీ సిబ్బందికీ, మీ కంప్యూటర్లకూ నా  ధన్యవాదాలు.
“అయితే, ఈ సంఘటన వల్ల ఇన్నాళ్ళుగా  మీ బ్యాంకు పట్ల నేను అనుసరిస్తూ వచ్చిన విధానంలో మార్పు తీసుకురావాల్సిన అగత్యం బోధపడింది. అందుకు కూడా మీకు మరోసారి నా  ధన్యవాదాలు.
“ఏమయితేనేం !  ఇన్ని రోజులుగా మీ బ్యాంకు తో నాకున్న సంబంధ బాంధవ్యాలను ఓ సారి సమీక్షించు కున్నాను. దాన్నిబట్టి తెలిసిందేమిటంటే-
“నానుంచి మీరు ఏదయినా సమాచారం కోరినప్పుడల్లా నేను దాన్ని స్వయంగా బ్యాంకుకు వచ్చి తెలియచేస్తున్నాను. కానీ, నాకేదయినా అవసరం  వచ్చి మీ బ్యాంకు ఫోను చేసినప్పుడు మాత్రం  ముందుగా రికార్డు చేసివుంచిన ఓ  స్వరం బదులిస్తుంది. పైగా ఏదయినా అనుమానం వచ్చి దాన్ని నివృత్తి చేసుకోవడానికి ఎంతో సమయం  వృధా చేసుకుంటూ, బుద్ధిమంతుడయిన రాముడి మాదిరిగా ఆ మానవాతీత స్వరం అడిగే  అనేక ప్రశ్నలకు జవాబులు ఇవాల్సివస్తోంది. ఒకటి నొక్కండి, రెండు నొక్కండి అంటూ కంప్యూటర్ జారీ చేసే ఆదేశాలను అనుసరిస్తూ చిన్న పనికి కూడా నా పుట్టిన తేదీని, తలిదండ్రుల పేర్లతో సహా ప్రవర చెప్పుకుంటే కాని పని జరగని పరిస్తితితో రోజురోజుకూ విసుగెత్తి పోతోంది.
“అందుకే, ఇప్పుడు నేనొక నిర్ణయానికి వచ్చాను. అది తెలిపేందుకే ఈ ఉత్తరం.
“నేను కాని ఇతర ఖాతాదారులు కాని పడుతున్న ఇబ్బందులు మీకు తెలియాలంటే ఇంతకంటే నాకు వేరు మార్గం తోచడం లేదు. మా వూరికి మీ వూరెంత దూరమో, మీ వూరికి మా వూరంతా దూరం అనే సామెత మీరెరుగనిది కాదుకదా. ఇక చిత్తగించండి.    
“ఇన్నేళ్ళుగా మీ బ్యాంక్ కు నేను కట్టాల్సిన ఇంటి రుణం నెలసరి వాయిదాలు  ఇకనుంచి నేరుగా మీ బ్యాంకు కు  జమ అయ్యే పద్ధతికి స్వస్తి చెబుతున్నాను. వాటిని ముందు ముందు చెక్కు ద్వారానే  చెల్లిస్తాను.అది కూడా మీరు లిఖిత పూర్వకంగా నామినేట్  చేసిన మీ  బ్యాంకు ఉద్యోగి పేరిట రిజిస్టర్ పోస్ట్ లో  పంపిస్తాను. అతడు కాకుండా నేను పంపిన ఆ  కవరును మరెవ్వరూ తెరవడానికి పోస్టల్ రూల్స్ అంగీకరించవని నేను ముందుగానే  మీకు తెలియచేసుకుంటున్నాను.  
“నేను ఈ ఉత్తరంతో పాటు పంపుతున్న నమూనా దరఖాస్తులో ఆ ఉద్యోగి వివరాలు తిరుగు టపాలో పదిరోజుల లోపల నాకు పంపాలని కోరుతున్నాను. దరఖాస్తు ఏడెనిమిది పేజీలు వుందని భయపడకండి. కానీ  ఏమీ చేయలేను. బ్యాంకులో ఖాతా తెరిచేటప్పుడు ఖాతాదారుడి గురించి మీరెంతగా తెలుసుకోవాలని అభిలషిస్తారో అదేమేరకు నేనూ మీ ఉద్యోగి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోగోరితే మీరు అభ్యంతర పెట్టాల్సిన విషయంగా నేను భావించడం లేదు.   
“ఇకపోతే, మరో విషయం. మీ ఉద్యోగి తెలియచేసే విషయాలు, అతగాడి ఆర్ధిక పరిస్థితులు ఇవన్నీ సక్రమంగా వున్నాయని ఓ గుర్తింపు పొందిన నోటరీ ధృవపరచాల్సివుంటుంది.
“ ఆ తరువాత, నేను నా వీలును బట్టి మీరు నామినేట్ చేసిన ఉద్యోగికి ఒక పిన్ నంబరు పంపుతాను. నాతో  ఏదయినా విషయం చరించాలని అనుకున్నప్పుడు అతడు విధిగా ఆ నెంబరును ముందు  పేర్కొనాల్సి వుంటుంది.
“మీలాగానే నేను కూడా మా ఇంట్లో ఫోనుకు కొన్ని ప్రత్యేకమయిన ఏర్పాట్లు చేసుకున్నాను.ఇకనుంచి మీ బ్యాంకు నుంచి నాకు ఫోన్ చేయాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. ఇవేమీ కొత్తవి  కావు. అనేక సంవత్సరాలుగా మీ బ్యాంకు ఖాతాదారులం అందరం పాటిస్తూ వస్తున్నవే. ‘అనుసరణ పొగడ్తకు నమూనా’ అంటారనే నానుడి మీకు తెలియనిదని అనుకోను.        
“ప్రతి ఖాతాదారుడు ఎంతో ముఖ్యమయిన వ్యక్తి అని బ్యాంకుల్లో రాసిపెడుతుంటారు కదా. అందుకే,  నాకు ఫోను చేయాల్సిన అవసరం పడ్డప్పుడల్లా ఈ కింది సూచనలు పాటించండి. 
* ఇంగ్లీష్ లో మాట్లాడాలనుకుంటే * బటన్ ప్రెస్ చేయండి.
* నన్ను కలుసుకోవాలని అనుకుంటే ఒకటి నొక్కండి.
* నేను బకాయి పడ్డ వాయిదా గురించి తెలుసుకోవాలని అనుకుంటే ‘రెండు’ నొక్కండి.
* మీ ఫోను కాల్ నా మొబైల్ కి బదిలీ చేయాలనుకుంటే ‘మూడు’ నొక్కండి.

* నా మెయిల్ కు సమాచారం పంపాలి అనుకుంటే పాస్ వర్డ్ తప్పనిసరి.
·       ఒక్కోసారి నా నుంచి ఫోనులో జవాబు రావడం ఆలశ్యం అయితే మీరు కొద్ది సేపు రికార్డు చేసిన సంగీతాన్ని వినాల్సివుంటుంది. ముందు ముందు ప్రకటనలు కూడా వినాల్సిన పరిస్తితి ఏర్పడినా ఆశ్చర్య పోనక్కరలేదు.
·       ఈ ఏర్పాటుకు అయ్యే వ్యయంలో కొంత మీనుంచి నేను  వసూలు చేయాల్సివుంటుంది.ఇలాటి వ్యవహారాలు మీకు కొట్టిన పిండే కనుక మీరు విభ్రాంతికి గురి కానవసరం లేదు.
·       నూతన సంవత్సరానికి ముందు ఇలాటి ఉత్తరం రాయడం నాకూ ఇబ్బందిగానే వుంది. కాకపోతే, షరా మామూలుగా మీకూ, మీ బ్యాంకు సిబ్బందికీ, మానవాతీత స్వరంతో మాట్లాడే కంప్యూటర్లకూ కొత్త సంవత్సరం ఆనందదాయకంగా గడవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మరింత సౌభాగ్యవంతంగా కూడా గడవాలని కోరుకోవాలని వుంది. కానీ, నాలాటి కష్టమర్ల సంఖ్య మరింత పెరిగితే ఖర్చులు కూడా పెరిగి బ్యాంకు రాబడి తరిగి సౌభాగ్యం కొంత తగ్గే అవకాశం వుండగలదన్న భయంతో ఆ ఆకాంక్షను వ్యక్తం చేయకుండా అణచిపెట్టుకుంటున్నాను.
·        పీఎస్: దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ముసలివాళ్ళం కదా అని  మమ్మల్ని పిచ్చివాళ్లని కూడా  చేయాలని చూడవద్దు.
 (అమెరికాలో నివసించే ఎనభయ్ ఆరేళ్ళ వృద్ధురాలు తన బ్యాంకు మేనేజర్ కు రాసిన ఉత్తరం ఇది. సహజంగా హాస్యప్రియుడయిన  ఆ అధికారి ఆ ఉత్తరం చదివి, చిన్నబుచ్చుకోకుండా పెద్ద మనసుతో దాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’కు పంపితే ఆ పత్రిక దాన్ని యధాతధంగా ప్రచురించింది)
(23-07-2012)  

15, జులై 2012, ఆదివారం

‘ఈగ’ ఖరీదు



‘ఈగ’ ఖరీదు
‘ఈగ’ ఖరీదు అక్షరాలా నాలుగువేల ఎనిమిది  వందల ఎనభై రూపాయలు. ఇదెలాగంటారా! చిత్తగించండి.



హైదరాబాదులో థియేటర్ కు వెళ్లి సినిమా చూడడమనేది చాలా అరుదు. అధవా, ఎప్పుడయినా వెళ్ళామంటే గోకుల్ థియేటర్ కే. అదీ ఏదయినా కొత్త సినిమా మొదటి వారంలోనే. ఎందుకంటే ఆ సినిమాహాల్లో వారం వారం పిక్చర్లు మార్చి వేస్తుంటారు. ఆ థియేటర్ ఓనర్లలో ఒకడయిన శ్రీనివాస యాదవ్, మా రెండో అన్నయ్య కుమారుడు సుభాష్ చంద్ర బోస్ చిన్ననాటి స్నేహితులు కావడం మూలాన, టిక్కెట్లు దొరకవు అన్న బాధ లేకపోవడం మూలాన, మా అన్నదమ్ముల కుటుంబసభ్యులం అందరం కట్టగట్టుకుని వెళ్ళే సందర్భం కావడం మూలాన,  సాధారణంగా నేను కూడా ఇరవై నుంచి పాతిక వరకు వుండే ఈ ‘కొత్త సినిమా ప్రేక్షక వర్గంలో’ చేరుతూనే వుంటాను. అలా చూసిన సినిమా నాలుగు రోజులు గుర్తుండి పోయే సినిమా కావడం అన్నది సక్రుత్తు గా జరిగే విషయం.
నిన్న శనివారం కూడా అలాటి సందర్భం వచ్చింది. పెద్దా చిన్నా, పిల్లా మేకా, ముసలీ ముతకా  పాతికమందిమి కలిసి వెళ్లి ఆ థియేటర్లో ‘ఈగ’ సినిమా చూసాము. చూసినవాళ్లలో మెజారిటీ రాజమౌళి అభిమానులే కాబట్టి సినిమా గురించిన చర్చ హద్దులలోనే సాగింది. ‘ఈగ’ వీక్షణానంతరం ‘సాయి’ వాళ్లింట్లో భోజనాలు మొదలు పెట్టబోయేలోగా సెల్లు సుతారంగా మోగింది. చూస్తే బ్యాంకు నుంచి అలర్ట్  మెసేజి. ‘ఫలానా షాపులో మీరు ఇప్పుడే ఇంత తగలేశారు. తగలేయగా పోను మీకు ఇంకా తగలడివున్న బ్యాలెన్సు ఇంత’ అంటూ ఓ శ్రీముఖం. కార్డు సొంతదారునయిన నేను,  ఆ కార్డుకు  ‘యాడాన్’  కార్డు సొంతదారిణి ( అదేవిటో తెలుగు కూడా అలాగే తగలడి చస్తోంది సుమా) అయిన మా ఆవిడ వైపు ఓ చూపు పారేసి, సినిమా మధ్యలో కూడా లేచి వెళ్లి షాపింగు చేసి వచ్చిన ఆవిడ సామర్ధ్యాన్ని కంటి చూపుతోనే మెచ్చుకోబోయాను. కానీ నా వాలకాన్ని పసికట్టిన మా ఆవిడ ‘యేమయిందంటూ’ తన తరహాలో గుడ్లురిమి చూస్తూ నాకర్ధమయ్యే భాషలో ఇతరులకు తెలియకుండా అడిగింది. అలా నలుగురిలో పడ్డ పాము ఎవరిచేతిలో చావకుండా ‘ఇప్పుడేంచేయాల’న్న ప్రశ్నను మాముందుంచి తాను చల్లగా తప్పుకుంది. కార్డును డీయాక్టివేట్ చేయడం ఒక్కటే మార్గమని మా కుటుంబం యావత్తూ ఏకాభిప్రాయానికి వచ్చేలోగా చేతిలో సెల్లు మరోమారు మోగింది. చూస్తే ఏముంది. బ్యాంకు నుంచి మరో ఎస్సెమ్మెస్ ఎలర్ట్. ‘ఏంచేయాలేంచేయాలని అలా ఆలోచిస్తూనే వుండండి, ఈ లోగా మీ కార్డు కొట్టేసిన దొంగ గారు,   ‘విజిటింగు కార్డు బదులు క్రెడిట్ కార్డు నొక్కేస్తే పోయేద’న్న ‘ఈగ’ సినిమా డైలాగు పట్టుకుని ఇప్పటికప్పుడే మరో రెండువేల ఐదువందలకు దర్జాగా షాపింగు చేసి అంత దర్జాగా వెళ్లిపోయాడన్నది’ ఆ ఎలర్టు సారాంశం.
ఈ తరహా చర్చల్లో పడితే, ‘ఈగ’ సినిమా బడ్జెట్ పదికోట్లనుంచి ముప్పయి కోట్లకు పెరిగిపోయిన చందంగా దొంగ గారి షాపింగ్ స్ప్రీ అదే తరహాలో సాగిపోయే ప్రమాదాన్ని మేమందరం కొంచెం కొంచెం పసికడుతున్న  తరుణంలో ‘రాచ పీనుగ తోడు లేకుండా  కదలదు’ అన్నట్టు పోయిన కార్డుతో పాటు మరో బ్యాంకు కార్డు కూడా కనబడం లేదని మా శ్రీమతి చావుకబురు చల్లగా చెప్పింది. దాంతో అందరం ఎమర్జెన్సీ యమర్జెంటుగా ప్రకటించేసుకున్నాం.   తలా ఒక లాప్ టాప్ పట్టుకుని కొందరూ,  సెల్ ఫోన్లతో మరికొందరూ,  లాండ్ లైన్ సాయంతో ఇంకొందరూ ఒక్కుమ్మడిగా రంగంలోకి దిగి, ‘ఒకటి నొక్కండి, ఏడు నొక్కండి’ అనే బ్యాంక్ కస్టమర్ కాల్ సెంటర్ సూచనలను ఖచ్చితంగా  పాటించే పనిలో పడ్డాం.  ఆ కంగారులో ‘యాడాన్’ కార్డుతో పాటు నా ప్రైమరీ కార్డు లావాదేవీలను కూడా జయప్రదంగా స్తంభింపచేశాం.  దరిమిలా,  ‘మూడు వర్కింగు  డేస్ నుంచి  పదిహేను దినాలలోపల మీకు కొత్త కార్డు జారీ చేస్తామ’ని – మా పుట్టిన తేదీలు, మాతాపితరుల నామాలు వాళ్ల రికార్డులతో పోల్చుకున్న పిమ్మట కాల్ సెంటర్ వాళ్లు ప్రకటించారు.
‘అమ్మయ్య’ అని అనుకుంటున్న  సంతోషం కాస్తా కాసేపటిలోనే  ఆవిరావిరయిపోయింది.
అదేమిటంటే మేము మళ్ళీ ‘1975’ మోడల్ సంసారానికి మారిపోయాము. అంటే ఏమిటి? ‘చేతిలో క్యాషూ  లేదు, జేబులో  కార్డూ లేదు’ అనే పాత  రోజులకన్న మాట.
ఇంతకీ, ‘ఈగ’ సంగతేమిటంటారా!  ‘ప్రధమ కబళే మక్షికాపాతః’ అన్నట్టు ఈ కార్డు తస్కరణ ఉదంతం ‘ఈగ’ ను కమ్మేసింది.
ఇంటిల్లిపాదిదీ ఒకటే మాట. ‘సినిమా చాలా బాగుంది. రాజమౌళి హాట్స్ ఆఫ్’  సినిమాలు బాగా చూసేవారు కాబట్టి వాళ్ల మాటే  రైట్ అనుకోవాలి. అయితే-
విలన్ని  ఓసారి ‘ఈగ’  చంపేసినట్టుగా చూపించిన తరువాత కధానాయిక  కాల్చిన బాణసంచాలో ‘పని పూర్తయింది’ అనే సందేశం కనిపిస్తుంది. అక్కడితో సినిమా ఆపేసివుంటే బాగుండేదని నాకనిపించింది. అట్టే సినిమాలు చూడని నా అభిప్రాయం కరెక్టని నేనూ అనుకోవడం లేదు. బహుశా బడ్జెట్ ముప్పయి కోట్లని అంటున్నారు కదా. దానికోసం సినిమా నిడివి పెంచారేమోనని మాత్రం అనుకుంటున్నాను. (15-07-2012)