12, జులై 2012, గురువారం

నువ్వెవరివో నాకు తెలుసు




నువ్వెవరివో నాకు తెలుసు 

గొర్రెల కాపరి లొల్లాయి పదాలు పాడుకుంటూ గొర్రెల్ని కాసుకుంటూ వెడుతున్న సమయంలో ఓ పొడవాటి కారు అతడి పక్కగా వచ్చి ఆగింది. అందులోనుంచి ఓ పొడవాటి మనిషి సూటూ బూటూ వేసుకుని దిగాడు.
గొర్రెల కాపరిని చూడగానే అతగాడికి ఆట పట్టించాలని అనిపించింది. అనిపించి అతడితో ఇలా అన్నాడు.
ఇదిగో అబ్బీ! నీ దగ్గర చాలా గొర్రెలు వున్నట్టున్నాయి. అవి ఎన్ని వున్నాయో నేను ఖచ్చితంగా అంచనా వేసి చెప్పాననుకో, వాటిల్లో ఒకదాన్ని నాకిచ్చేస్తావా?’
సూటు ఆసామీ మాటలు గొర్రెల కాపరికి వింతగా అనిపించాయి. తనను ఆట పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని తెలిసి కూడా కాపరి అతడి పందేన్ని ఒప్పుకున్నాడు.
సూటు దొరవారు వెంటనే కారులోనుంచి లాప్ టాప్ తీసాడు. మొబైల్ ఫోనుకు, ఫాక్స్ మిషన్ కు కలిపాడు.నెట్ కనెక్ట్ చేసి నాసా వెబ్ సైట్ లోకి వెళ్లి జీపీఆర్ ఎస్ సిస్టం తో గొర్రెలమంద వున్న ప్రదేశాన్ని స్కాన్ చేసాడు.  
          కంప్యూటర్లో ఏవేవో అంకెలు వేసాడు. ఎన్నెన్నో లెక్కలు కూడాడు. చివరికి ప్రింటర్ నుంచి నూటయాభై పేజీల ప్రింటవుట్ తీసాడు.అంతాచేసి చివరికి గొర్రెల లెక్క తేల్చాడు. అయ్యా! కాపరిగారూ! మీవద్ద వున్న గొర్రెలు చిన్నా పెద్ద ఆడా మగా అన్నీ కలిపి అక్షరాలా పదిహేనువందల నలభై మూడుఅన్నాడు.
అతడంత ఖచ్చితంగా గొర్రెల సంఖ్యను చెప్పడంతో ముందు కంగారు పడ్డా కాపరి తొందరగానే తేరుకున్నాడు.
 అయ్యా దొరవారూ! చాలా బాగా లెక్క చెప్పారు. పందెం ప్రకారం నా మందలోనుంచి మీకు నచ్చిన గొర్రెను తీసుకెళ్లండి
దొర తన తెలివితేటలకు తానే మురిసిపోతూ మంద నుంచి ఓ బలిసిన గొర్రెను ఎంపిక చేసుకుని తన కారు వెనుక సీటు కింద పెట్టుకున్నాడు.   
           కారు స్టార్ట్ చేసి వెళ్ళబోయేలోగా వెనుకనుంచి గొర్రెల కాపరి స్వరం వినిపించింది.
అయ్యా! మీరెవరో ఏంచేస్తుంటారో నాకు తెలవదు. కానీ నేనూ మీలాగే మీ వృత్తి ఏమిటో వూహించి చెప్పగలను. సరిగ్గా చెబితే నా గొర్రెను నాకిచ్చి వెడతారా?’
పందెం గెలుచుకున్న సంతోషంలో దొర వెంటనే దానికి ఒప్పుకున్నాడు.
గొర్రెల కాపరి కాసేపు ఆలోచించినట్టు   నటించి మీరు ఆడిటర్ అయివుంటారు. అవునా! నా అంచనా కరెక్టే కదా!అన్నాడు.
దొరకు మతిపోయినంత పనయింది.
అవును. నేను ఆడిటర్నే. అంత సరిగ్గా యెలా చెప్పగలిగావుఅడిగాడు గొర్రెను తిరిగి ఇచ్చేస్తూ.  
            కాపరి ఇలా జవాబు చెప్పాడు.
అదేమంత పని. చాలా సులభం.
నేను అడగకుండానే ముందు మీరే నా వద్దకు వచ్చారు. అది మొదటి సంగతి.  నాకు తెలిసిన విషయం నాకే చెప్పడానికి పందెం రూపంలో ఫీజు అడిగారు చూసారు అక్కడ దొరికిపోయారు.  మూడో పాయింటు ఏమిటంటే  నా వృత్తి గురించి  మీకు ఎంతమాత్రం తెలియదని మీకు మీరే రుజువు చేసుకున్నారు. మీరు ఆడిటర్ అని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి.

(నెట్ ఇంగ్లీష్ కధనానికి అనువాదం) 

12-07-2012

9, జులై 2012, సోమవారం

ఒరులేయవి యొనరించిన........


ఒరులేయవి యొనరించిన........
క్షౌర శాలలకు మంగళవారం సెలవు. సంప్రదాయాల ప్రకారం మంగళ వారం మంగళకరమైనదంటారు. అలాటి శుభకరమయిన రోజున క్షౌర శాలలకు మాత్రమే సెలవెందుకు ఇస్తారు? సరే! ఆ సంగతి వొదిలేద్దాం. కానీ జవాబు దొరకని మరికొన్ని ప్రశ్నలు కూడా తరచూ నా మదిలో రొద చేస్తూంటాయి.
బార్బర్ షాపుకు వెళ్ళేవారిలో చాలామంది పాత దుస్తులు ధరించి వెడుతూ వుండడం కద్దు. మడత నలగని ఇస్త్రీ బట్టలు వేసుకుని క్షౌరానికి వెళ్ళే వాళ్లు బహు కొద్ది మంది మాత్రమే కానవస్తుంటారు. ఎందుకిలా? అన్నది మరో ప్రశ్న.
స్నానం చేసి క్షౌరానికి వెళ్ళేవాళ్ళు కలికానికి కూడా దొరకరేమో. బహుశా క్షౌర కార్యక్రమం అన్నది ఒక రకం  మైలగా భావించే మనస్తత్వం చాలామందిలో వుండడమే దీనికి కారణమేమో.
క్షౌరం సంగతి పక్కనపెట్టండి. ఇల్లు వూడ్చేటప్పుడు కానీ, కడిగి తుడిచేటప్పుడు కానీ శుభ్రమయిన దుస్తులు ధరించకుండా వుండడం కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఎందుకంటే ఇల్లు వూడ్చేటప్పుడు ఎలాగూ మురికి అంటుకుంటుంది. అందుకని ఆ పని పూర్తి చేసిన తరువాతే కాళ్ళూ  చేతులు కడుక్కుంటే పోలా అన్న భావన మనల్ని ఆ పని చేయిస్తుంది.
ఇదేదో మన దేశానికి మాత్రమే పరిమితమయిందన్న నా ఆలోచన తప్పని ఈ మధ్యనే తెలుసుకున్నాను. అమెరికాలో సెటిల్ అయిన నా భారతీయ మిత్రుడొకరు ఇటీవల మా ఇంటికి వచ్చారు. ఆ సమయంలో నేను బార్బర్ షాపుకు వెళ్ళే పనిలో వున్నాను. శుభ్రంగా గడ్డం చేసుకుని, స్నానం చేసి బార్బర్ షాపుకు బయలుదేరుతున్న నన్ను చూసి అతగాడు రవ్వంత ఆశ్చర్యపోయినట్టు అతడి ముఖ కవళికలను బట్టి అర్ధం అయింది.
అయితే, ఈ విషయంలో నా అభిప్రాయాలు నాకున్నాయి.
క్షౌర శాలలో కూర్చున్నప్పుడు నా వొంటినుంచి వెలువడే చెమట వాసన వల్ల  నాకు క్షౌరం చేస్తున్న వ్యక్తికి ఇబ్బంది కలిగించరాదన్నదే నా ఉద్దేశ్యం. అలాగే జుట్టును కత్తిరించే క్రమంలో, మాసిపోయిన నా కాలర్ ను వెనక్కి మడిచేటప్పుడు దాని దుర్గంధం అతగాడికి సోకరాదని కూడా నేననుకుంటాను.  మనం ఏవయితే  అసహ్యించుకుంటామో వాటిని  ఇతరులు  కూడా ఏవగించుకునే అవకాశం వుంది. మహాభారతంలోని  – ‘ఒరులేయవి యొనరించిన’  పద్యపాదం మనకు బోధించిన నీతి ఇదే.

బార్బర్ షాపుకు వెళ్ళేటప్పుడు శుభ్రంగా వెళ్ళాలన్న జ్ఞానోదయంకలగడానికి  మరో  అంశం కూడా  దోహదం చేసింది.
కొన్నేళ్ళక్రితం ఓ మాగజైన్ లో ఓ  విషయం చదివాను.
జపానులో ఓ కార్ల తయారీ సంస్త యజమాని తన కంపెనీకి సర్వీసింగ్ కోసమో మరమ్మత్తుల కోసమో   వచ్చే వాహనాలను  ఆయా విభాగాలకు  పంపేముందు వాటిని శుభ్రంగా కడిగించేవాడు.
ఇలా చేయడం అవసరమా? రిపైర్  చేసేటప్పుడో, సర్వీసింగ్ చేసేటప్పుడో ఎలాగో మురికి అవడం తధ్యం. మళ్ళీ వాటిని శుభ్రంగా కడగడం కూడా తప్పనిసరి. అలాంటప్పుడు ముందుగా కడిగి పంపడం అనే కంచి గరుడ సేవ ఎందుకనే డౌటేహంకలగడం కూడా అంతే తధ్యం.
ఈ రకం సందేహాత్ములకు ఆయన ఇచ్చే వివరణ ఈ విధంగా వుంటుంది.
నా కంపెనీలో పనిచేసే వారికి నేను ఇచ్చే గౌరవం అది. వారు పనిచేసే వాతావరణం పని చేయడానికి అనువుగా  వుండాలన్నది నా అభిప్రాయం. దీనితో విభేదించేవారు సర్వీసింగు నిమిత్తం వచ్చే వాహనాల అడుగు భాగాన్ని చూసివుండరని నా ఉద్దేశ్యం. బురద, మట్టి కొట్టుకుని  నానా చండాలంగా వుంటుదది. అక్కడ బిగుసుకుపోయిన నట్లు,బోట్లను వొట్టి చేతులతో వూడదీసి బిగించడం అనే ప్రక్రియ యెంత  దుర్భరమో తెలిసినవాళ్లెవరూ ఈ రకమయిన  ప్రశ్నలు వేయరు.’
ఈ వార్త చదివినప్పటినుంచి  బార్బర్ షాపుకు వెళ్ళేటప్పుడు నా తీరు పూర్తిగా మారిపోయింది. స్నానాదులను ముగించుకుని, శుభ్రమయిన దుస్తులు ధరించి ఆఫీసుకు యెలా వెడుతున్నామో, అలాగే బార్బర్ షాపుకు కూడా వెళ్లాలనే నియమాన్ని ఆ రోజు నుంచి  ఖచ్చితంగా పాటిస్తూ వస్తున్నాను.
అద్దంలో  ముఖ సౌందర్యం ఎలావుండాలని  మనం కోరుకుంటామో ఆవిధంగా మనల్ని తీర్చి దిద్దే బార్బర్లకు,  ఎంతో కొంత టిప్పుఇచ్చి సరిపుచ్చుకోవడం  మాత్రమే కాకుండా, చెమట వాసన వేయని కాలర్ ను, మెడను వారికి అప్పగించడంలో వున్న తృప్తి ఎలాటిదో  అప్పటినుంచి నాకు అనుభవం లోకి వచ్చింది.  నేను క్రమం తప్పకుండా నెలనెలా  క్షౌరం చేయించుకునే  మహేష్’ - నాలో వచ్చిన ఈ మార్పుని గమనించాడో లేదో నాకు తెలియదు. అయితే నాకు క్షౌరం చేసేటప్పుడు, తోటి పనివారిని చూస్తూ గర్వంగా కాలర్ ఎగరేయడం ఓసారి నా కళ్ళబడింది. ఆ క్షణంలో అతడి కళ్ళల్లో కానవచ్చిన కాంతిని నేను నేరుగా చూడలేకపోయినా నా అంతర్నేత్రంతో పరికించగలిగాను.  ఇతరుల శ్రమను, ఇబ్బందులను గుర్తించి నడుచుకోవడంలో ఎంతో తృప్తి  వుంది అన్న వాస్తవం  తెలుసుకోగలిగాను. అది బోధ పడిన తరువాత ఈ విషయంలో  నేను కొంత అధికంగా పడుతున్న శ్రమలెక్కలోకి రావడం లేదు.  
(18-03-2012)
(‘నెట్లో’ చదివిన ఆంగ్ల మూలానికి స్వేచ్చానువాదం. – భండారు శ్రీనివాసరావు)                 

7, జులై 2012, శనివారం

రామోజీరావు మొదటి ఓటమి


రామోజీరావు మొదటి ఓటమి
(వెటరన్ జర్నలిస్ట్  శ్రీ వి.హనుమంతరావు రాసిన ‘జర్నలిస్ట్ అంతర్వీక్షణం’ పుస్తకం నుంచి కొన్ని భాగాలు)



“యు.ఎన్.ఐ. నుంచి రాజీనామా చేసి హైదరాబాదులో కొత్తగా ప్రారంభించిన ‘ఈనాడు’ ఎడిషన్ లో చేరాను. నాతో  కలిపి మరో ముగ్గురు ఎడిటర్లు – ఏబీకే ప్రసాద్, పొత్తూరి వేంకటేశ్వర రావు, టీవీ కృష్ణ పనిచేసేవారు. రామోజీ రావు చీఫ్ ఎడిటర్. వ్యాసాలూ, సంపాదకీయాలు రాయటం రాకపోయినా, ‘ఈనాడు’ అన్ని ఎడిషన్లు చదివి ఆయనకు తప్పు అని తోచినవన్నీ ఎర్ర పెన్సిల్ తో మార్క్ చేసేవారు. ప్రముఖ ఇంగ్లీష్ పత్రికల్లో  వచ్చే ఆసక్తికరమయిన వ్యాసాలను అనువాదం చేయించి ‘ఈనాడు’లో ప్రచురించేవారు. హిందూ పత్రిక స్తాయిలో తెలుగులో పత్రిక తేవడం తన లక్ష్యం అని చెప్పుకునేవారు. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చేవరకు  ఒకరకంగా బాగానే వుందనిపించేది. ఆ తరవాత రామారావును, తాజాగా చంద్రబాబును భుజాన వేసుకుని పత్రికను నడిపించిన వైనం పాఠకులకు చిరపరిచితమే.”  
“ఈనాడులో ఉద్యోగం అంటే ఎన్నాళ్ళు వుంటుందో ఎప్పుడు వూడుతుందో తెలవదు. హైదరాబాదులో నలుగురు పాత్రికేయులు ఎక్కడయినా కలిస్తే అందులో ఇద్దరు ‘ఈనాడు’ మాజీలు. వ్యాపార రీత్యా ఆయన (రామోజీరావు) యెంత ప్రతిభ చూపించారో, ఉద్యోగుల విషయంలో అంత కాఠిన్యం ప్రదర్శించారు. వేజ్ బోర్డు సిఫారసులను అమలుచేయాలని కోరుతూ కార్మికులు ఇచ్చిన విజ్ఞప్తిని వారి ఎదుటే చెత్తబుట్టలో పడేసారు. సిబ్బంది సమ్మెతో ఇరవై మూడు రోజులు ‘ఈనాడు’ పత్రిక  ప్రజల ముఖం చూడలేదు. సుప్రీం కోర్టు -  సమ్మె చట్ట బద్ధమే అని ఇచ్చిన తీర్పుతో రామోజీ రావు సుమారు కోటి రూపాయలు చెల్లించుకోవాల్సివచ్చింది. రామోజీ రావుకు అది మొదటి  ఓటమి.”
“పత్రికల్లో ప్రచురించే వార్తను అనుకూలంగాను, ప్రతికూలంగాను మలచి ప్రచురించవచ్చు. కాబట్టి పాఠకులకో చిన్న హెచ్చరిక. నల్లటి అక్షరాలన్నీ నిజాలని నమ్మకండి. పూర్తిగా అబద్ధమనీ అనుకోవద్దు.”
“పత్రిక ప్రకటనల వ్యవహారాలు చూసే మేనేజర్ ఇంకో గంటలో పత్రిక అచ్చవుతుందనగా వెళ్లి, అరపేజీ,లేదా పావు పేజి వ్యాపార ప్రకటన ప్రచురించి తీరాలి అంటే, సంపాదక వర్గం ఆ మేరకు వార్తలు తీసేసి ఆ వ్యాపార ప్రకటనను ప్రచురించి తీరాలి.”
“నేను ఈ వృత్తి (జర్నలిజం) లో ప్రవేశించినప్పటి ఆర్ధిక పరిస్థితులు ఇప్పడు తలచుకుంటే నవ్వొస్తుంది. బస్తా బియ్యం ఎనిమిది రూపాయలు. అణాకు నాలుగు ఇడ్లీలు. ముప్పై కిలోమీటర్ల బస్సు ప్రయాణానికి నాలుగణాలు. పూటకూళ్ళమ్మ హోటల్లో మూడుపూటల నెల భోజనానికి నాలుగున్నర రూపాయలు.”
“1955  మధ్యంతర ఎన్నికలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల నడుమ అతి భీకరంగా జరిగాయి. కమ్యూనిష్టులు అధికారంలోకి వచ్చేస్తున్నారు; పుచ్చలపల్లి సుందరయ్య ముఖ్యమంత్రి, రాజేశ్వర రావు హోం మంత్రి అనే వాతావరణం రాష్ట్రంలో నెలకొంది. కాని, చివరకు కమ్యూనిష్టులు ఓడిపోయారు. రాష్ట్రంలో పార్టీ పత్రిక విశాలాంధ్ర తప్ప మిగతా పత్రికలన్నీ కాంగ్రెస్ కొమ్ము కాశాయి. ప్రముఖ సంపాదకుడు నార్ల వేంకటేశ్వర రావు సంపాదకత్వంలో ఆంధ్రప్రభ ముందు వరసలో నిలబడి కమ్యూనిష్టులకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. విశాలాంధ్ర, ఆంధ్రప్రభల మధ్య కార్టూన్ల యుద్ధం హోరాహోరీగా నడిచింది. ప్రతి కార్టూనుకు  జవాబుగా మరో కార్టూన్ ప్రభలో వచ్చేది. అప్పటికీ, ఇప్పటికీ రాష్ట్రంలో పత్రికల సత్య నిష్ఠ గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రిక అయిన ఆంధ్ర ప్రభ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అనుకూలంగా రాస్తే, దాని తమిళ్ ఎడిషన్ దానికి వ్యతిరేకంగా రాసేది. ఇదంతా పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడం కోసమే.”
“హైదరాబాదులో  (యు.ఎన్.ఐ.) వార్తా సంస్థలో నాకు ముందు పనిచేసిన డి. సీతారాం కు వున్న  కాంటాక్టులు (పరిచయాలు) అన్నీ ఇన్నీ కావు. నేను బాధ్యతను స్వీకరించిన తరువాత ఒక రాత్రి ఎవరో ఫోను చేసి ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక విమానం వచ్చిందని చెప్పి ఫోను పెట్టేసారు. బహుశా నా పాత మిత్రుడి (సీతారాం) కాంటాక్ట్ అయివుంటుంది. మరుసటి రోజు బ్యాంకుల జాతీయకరణ వార్త పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. ఆ రోజున రాష్ట్రపతి సికిందరాబాదులోని రాష్ట్రపతి నిలయంలో బస చేసి వున్నారు. అంటే సంతకం కోసం విమానంలో ప్రత్యేక దూత వచ్చాడన్న మాట.”
 “రాజకీయ నాయకులకు పత్రికలతో చాలా అవసరం వుంది. దానికోసం  జర్నలిష్టుల ప్రాపకం కావాలి. అందుకోసం ఏం చేయాలన్న చేస్తారు. ఫ్లాట్లు, స్కూటర్లు, కార్లు, మందు  సీసాలు ఏదీ కాదనర్హం. యాభయ్యవ దశకంలో నేను ఢిల్లీ లో విలేఖరిగా పనిచేసేటప్పుడు ఒక విదేశీ రాయబార కార్యాలయం ప్రతినెలా ఒక స్కాచ్ బాటిల్  ని  ఎంపిక చేసుకున్న జర్నలిష్టుల ఇళ్లకు పంపేది. అందుకు ప్రతిఫలంగా ఏమీ అడిగే వారు కాదు. కొన్ని నెలలు గడిచిన తరువాత తమకు ఫలానా ప్రభుత్వ సమాచారం కావాలని మెల్లగా బయట పెట్టేవారు. సీసాలు సీసాలు పట్టించిన తరువాత కాదనే ధైర్యం ఎవరికి వుంటుంది?”
(జర్నలిష్ట్ అంతర్వీక్షణం – పాత్రికేయ జీవితంలో ఆరు దశాబ్దాల అనుభవాలు – అనుభూతులు – రచన : శ్రీ వి.హనుమంత రావు – ప్రచురణ : డేటా న్యూస్ ఫీచర్స్, హైదరాబాద్ – 500 084)
07-07-2012.

6, జులై 2012, శుక్రవారం

మరో ఆకాశ ‘వాణి’ మూగబోయింది


మరో ఆకాశ ‘వాణి’ మూగబోయింది
‘ఆకాశవాణి విజయవాడ కేంద్రం – ప్రాంతీయ వార్తలు చదువుతున్నది – కొప్పుల సుబ్బారావు’
దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ప్రతిరోజూ ఉదయం ఆరూ నలభయ్ అయిదు కల్లా ఠంచనుగా వినిపిస్తూ వస్తున్న స్వరం నిన్న గురువారం రాత్రి  శాశ్వితంగా మూగబోయింది.
విజయవాడ కేంద్రంలో న్యూస్ రీడర్ ఉద్యోగంలో చేరకముందు కూడా సుబ్బారావు న్యూస్ రీడరే. చేరిన తరువాత న్యూస్ రీడరే. ఉద్యోగ విరమణ అనంతరం కూడా న్యూస్ రీడరే. తాత్కాలిక ప్రాతిపదికపై వార్తలు చదివినప్పుడూ అదే నిబద్ధత. ఉద్యోగం శాశ్వితమై, చకచకా మెట్లెక్కి పై మెట్టు చేరుకున్న తరువాత కూడా వార్తలు చదవడం అంటేనే అతడికి ఇష్టం. అరవైయేళ్ళు నిండి ఉద్యోగ విరమణ చేసిన తరువాత కూడా వార్తలు చదవడానికే అతడిష్టపడ్డాడు. బహుశా, గుండె జబ్బు రాకుండా వుంటే, అతడలా వార్తలు చదువుతూనే వుండేవాడేమో.
తలలో నాలుక అంటే సుబ్బారావే అని అతడి సహోద్యోగులు చెబుతుంటారు. సాధారణంగా ఉద్యోగంలో హోదాలు పెరుగుతున్నకొద్దీ, అంతకు ముందు చేసిన ఉద్యోగం పట్ల చిన్న చూపు కలిగివుండడం కద్దు. కానీ, కొప్పుల సుబ్బారావు తరహానే వేరు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా ఆయన అడ్డా ఆకాశవాణే! వార్తా విభాగంలో పనిలేకపోతే, మరో విభాగంలో ప్రత్యక్షం. అక్కడి వారికి, అడగకుండానే, డబ్బింగులో సాయపడడం అతడి నైజం. డబ్బింగు ప్రస్తావన వచ్చింది కాబట్టి సుబ్బారావు గురించి మరో కోణాన్ని గుర్తు చేసుకోవాలి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించిన అనేక కార్యక్రమాలకు జాతీయ స్తాయిలో పురస్కారాలు లభించాయి. వాటిల్లో చాలా వాటికి డబ్బింగు బాధ్యత నిర్వహించింది సుబ్బారావే అన్న సంగతి చాలామందికి తెలియదు. ఎందుకంటే అతడు పేరు కోసం ఎప్పుడూ చూసుకోలేదు. పని మీదనే దృష్టి.
కొప్పుల సుబ్బారావుతో కలసి విజయవాడ ఆకాశ వాణి కేంద్రంలో న్యూస్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించిన ఆర్వీవీ కృష్ణారావు గారు సుబ్బారావుతో తన సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు.
‘విజయవాడలో దాదాపు పదకొండేళ్లపాటు కలసి పనిచేశాము. సుబ్బారావుకు ఆఫీసే సర్వస్వం. స్టుడియో లో అడుగుపెట్టేముందు బయటనే చెప్పులు వొదిలేసి వెళ్ళేవాడు. ఒక్కరోజు కూడా ఈ నియమాన్ని దాటలేదు. వార్తలు చదివే గదే అతడికి గుడి. వృత్తిపట్ల అంతటి నిబద్ధతత వున్న ప్రభుత్వ ఉద్యోగిని నేను చూడలేదు. అలాగే, తనకు సాయం చేసిన వారిని ఎన్నడూ మరచిపోయేవాడు కాదు. అతడు ఆకాశవాణిలో ప్రవేశించడానికి అప్పటి డైరెక్టర్ బాలాంత్రపు రజనీకాంత రావు గారు మాట సాయం చేశారన్నది అతగాడి నమ్మకం. అందుకు కృతజ్ఞతగా తన కుమార్తెకు ‘రజని’ అని పేరు పెట్టుకున్నాడు.’
సుబ్బారావు మరణవార్త విని ఈ ఉదయం  ఫోనులో కృష్ణారావు గారు చెప్పిన మాటలివి.
అతను పనిచేసేది విజయవాడలో. నేనేమో  హైదరాబాదు రేడియోలో. ఉదయం, మధ్యాహ్నం వార్తలకోసం ఫోను చేసేవాడు. అడిగినప్పుడల్లా ఏదో ఒక వార్త లేదనకుండా చెప్పేవాడిని. అంతే! దాన్ని యధాతధంగా రాసుకుని ముక్కునపట్టి ఒప్పచెప్పినట్టు వెంటనే వార్తల్లో చదివేసేవాడు.  
హైదరాబాదు ఎప్పుడు వచ్చినా వెంటనే నాకు ఫోను చేసేవాడు. ఏమాత్రం వీలున్నా వచ్చి కలిసి వెళ్ళేవాడు. గత పాతికేళ్ళుగా మా నడుమ ఈ సంబంధం కొనసాగుతూ వచ్చింది.
అదేమిటో మొన్నీ మధ్య హైదరాబాదు వచ్చాడట. ఫోను చేయలేదు. వచ్చి కలవ లేదు.
ఎందుకంటే అతడు హైదరాబాదు రాలేదు. తీసుకువచ్చారు.
నన్ను కలవలేదు. ఎందుకంటే ఆసుపత్రిలో చేర్చారు.
ఇక కలవడు కూడా. ఎందుకంటే కలవలేనంత దూరతీరాలకు తరలిపోయాడు.
అతడు రాలేడు.  నేనే వెళ్ళాలి.
(కలసి ఎప్పుడూ పని చేయకపోయినా, మనసు కలిపి స్నేహం చేసిన  కొప్పుల సుబ్బారావుకు ఆత్మశాంతి కలగాలని మనసారా కోరుకుంటూ – భండారు శ్రీనివాసరావు)
(06-07-2012)  

5, జులై 2012, గురువారం

నీళ్ళ యుద్ధాలు – ఫలించని జోస్యాలు – భండారు శ్రీనివాసరావు


నీళ్ళ యుద్ధాలు – ఫలించని జోస్యాలు – భండారు శ్రీనివాసరావు

“ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రపంచంలో జరిగే యుద్ధాలు దేశాలను  ఆక్రమించుకోవడం కోసమో,ముడి చమురు  వనరులకోసమో జరగవు. ముందు ముందు దేశాల నడుమ జరగబోయే యుద్ధాలకన్నింటికీ  ఒకే ఒక కారణం ‘నీళ్ళు’.  నీటి కోసం జరిగే యుద్ధాలనే భవిష్యత్తులో జనం చూడబోతారు.”
దాదాపు పదిహేనేళ్ళ క్రితం ఇస్మాయిల్ సెరగెల్దిన్ అనే ఈజిప్టు దేశస్తుడు ఈ జోస్యం చెప్పారు. ఆయన వరల్డ్ బ్యాంకు వైస్ ప్రెసిడెంటుగా వున్నప్పుడు భవిష్యత్తు గురించి చేసిన ఈ అంచనా అప్పట్లో ప్రపంచ రాజకీయ నాయకులను ఎంతగానో కలవర పరచింది. అదృష్టవశాత్తు ఇస్మాయిల్ గారి జోస్యం నిజమవలేదు కాని సాగు నీరు, తాగు నీరు అవసరాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న దృష్ట్యా తలెత్తుతూ వచ్చిన నీటి  తగాదాలు మాత్రం  అనేక దేశాల నడుమ ఉద్రిక్తతల పెరుగుదలకు దోహదం చేసిన మాట వాస్తవం.
ఆసియా ఖండంలో ఇరిగేషన్ డాముల కింద నీరు పంచుకునే విషయంలో బోలెడు,బొచ్చెడు  తగాదాలు. భారత దేశం పాకిస్తాన్ నడుమ జలవిద్యుచ్చక్తి పంపిణీ విషయంలో ముదిరి పాకాన పడుతున్న వివాదాలు, మరోపక్క  చైనా, నేపాల్, బంగ్లాదేశ్ ల నడుమ నదీ జలాల వివాదాలు. జీవ నదులన్నా ఎండిపోతాయేమో కాని ఈ తగాదాలకు మాత్రం ముగింపు  అంటూ వున్నట్టులేదు.
పోతే, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, కీర్గిజిస్తాన్ ల వ్యవహారం కూడా విభిన్నంగా లేదు. అము దారియా, సర్ దారియా నదులు, అలాగే నీటిమట్టం స్తాయి బాగా పడిపోతున్న అరల్ సీ విషయంలో ఈ దేశాల నడుమ సాగుతున్న నీటి పంచాయతీలు రోజు రోజుకూ ముదిరిపోతున్నాయి.
ఇక, అర్జెంటీనా, ఉరుగ్వేలు - ప్లేట్ నదీ జలాలను పంచుకునే విషయంలో తలెత్తిన వివాదాన్ని హేగ్ లోని అంతర్జాతీయ న్యాయ స్తానం వరకూ తీసుకువెళ్ళాయి. రియో గ్రాండే, కొలరాడో నదీ జలాలు గురించి అమెరికా, మెక్సికో లు జుట్లు పట్టుకుంటున్నాయి.           

తిగ్రిస్ నదిలో తన వాటా నీళ్ళను ఇక ముందు వాడుకోవడానికి వీల్లేదని ఇరాక్ సిరియాను డిమాండ్ చేసి ఎంతో కాలం కాలేదు. మధ్యప్రాత్యంలో పాలస్తీనా ఇజ్రాయెల్ దేశాలు, ఇరాన్, ఇరాక్ దేశాలు టర్కీ డాం లనుంచి వచ్చే నీటి సరపరాల విషయంలో అవగాహన కుదరక తలలు పట్టుకుంటున్నాయి.
ఆఫ్రికాలో జమ్బెజీ నది ఉపనది అయిన చోబే నది, బోత్స్వానా, మొజాంబిక్ దేశాల నడుమ చిచ్చు రేపింది.
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం వివిధ దేశాల నడుమ జలాల పంపిణీ జరిగే నదులు దాదాపు రెండు వందల యాభయ్ కి పైగా వున్నాయి. ఈ నదుల పరీవాహక ప్రాంతాన్ని లెక్క వేస్తే, అది ఈ భూగోళం ఉపరితలంలో సగానికి పైగా  వుంటుంది. అంతర్జాతీయంగా నదీ జలాల వివాదాలు వున్న దేశాలు మూడు వందలకు పైగా వున్నాయి కాని, వీటిల్లో సాయుధ సంఘర్షణలకు దారితీసే వివాదాలు చాలా తక్కువనే చెప్పాలి. గత శతాబ్ద కాలంలో నీళ్ళ కోసం జరిగిన యుద్ధాలు కేవలం ఏడు మాత్రమే లెక్క తేలాయి.
నీరే ప్రాణాధారమన్నారు శతకకారులు. సేద్యానికయినా, పరిశ్రమలకయినా, తాగ డానికయినా నీళ్ళు అవసరం. నానాటికి పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని 2025 నాటికి  మానవాళి అవసరాలు తీర్చడానికి  ప్రపంచ వ్యాప్తంగా వున్న నదుల్లో పారే నీటిపై అపరితమయిన వొత్తిడి ఏర్పడగలదని ఐక్యరాజ్య సమితి (ఐ.ఎన్.డి.పి.) అంచనా. ఈ నేపధ్యంలో నీళ్లపై హక్కులు, నీటి  కేటాయింపులు గురించిన ఉద్రిక్తతలు బాగా పెరిగే అవకాశం వుందని వరల్డ్ వాటర్ ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న కాలంలో ప్రపంచ రాజకీయాల్లో నీటి  తగాదాలు ప్రధానాంశంగా మారే వీలుందని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. దేశాల నడుమ సరిహద్దు వివాదాల్లో నదీ జలాల పంపిణీ అంశం కీలకం కాగలదని పేర్కొన్నది. చాద్, సోమాలియా, యెమెన్ దేశాల మధ్య సంఘర్షణలకు నీటి తగాదాలకు సంబంధం వుందన్నది పెంటగాన్ అభిప్రాయం.                  
ఈ పంచాయతీలు కేవలం దేశాలకే పరిమితం కాలేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని నీటి వినియోగదారులు కూడా వీటికి అతీతం కాదన్నది జగమెరిగిన సత్యం.
మన దేశంలో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య రగిలిన చిచ్చుకు కావేరి నదీ జలాలు కారణం. అలాగే, ఆంధ్ర, ఒడిశాల నడుమ వంశధార నదీ జలాల  వివాదం.
పోతే, పొలాల్లో నీరు కావిడి తగాదాలు, వీధి కొళాయిల వద్ద ఆడంగుల  కొట్లాటలు పాత సినిమాలు చూసేవారందరికీ  అనుభవైకవేద్యం.
ఇదంతా ఇప్పుడెందుకంటారా! కృష్ణాజిల్లాలో ఎండిపోతున్న నారుమళ్లకు నీరిస్తే తెలంగాణా వాదులకు కోపం. శ్రీశైలం నుంచి నీరు వొదిలితే సీమ నాయకులకు ఆగ్రహం.
పారే నీటికి ప్రాంతం లేదు. ఎక్కడో పుట్టి, ఎక్కడెక్కడో ప్రవహించి సముద్రంలో కలిసే నదులకు ఒక రాష్ట్రం అంటూ లేదు. చిక్కల్లా నీటితోనే. ఆ నీటిని తమ స్వార్ధానికి వాడుకునే మనుషులతోనే. (05-07-2012)   

2, జులై 2012, సోమవారం

ప్రామిస్ మి ఫాదర్!


ప్రామిస్ మి ఫాదర్!

(ఎలాటి ఇంగ్లీష్ మూలప్రతినయినా భావం చెడకుండా తెలుగులోకి స్వేచ్చానువాదం చేయగల సామర్ధ్యం నాకున్నదని  మనసు మూలల్లో నాకో గర్వం. ఆ నా అహంభావం ‘నెట్లో’ కనబడ్డ ‘ ఓ కొడుకు లేఖ’ విషయంలో పటాపంచలయిపోయింది. అందుకే దాన్ని యధాతధంగా ఇంగ్లీష్ లోనే అందరితో పంచుకోవాలనిపించింది.) 

PROMISE ME FATHER!


Dad,


Firstly you should know that you are a hero for me, right from a young age, you were and are a source of admiration and inspiration. I talk proudly when I get to speak about you and all you have achieved in life,  you  did the best you could to earn the love and respect of not just the family but even the society. For that you should always be proud.


I wanted to tell this to you since a long time,   I am sure you would agree that the last thing I want to see is tears flowing through the toughest lady I have seen in my life, your wife and my mom. Yesterday, maybe she said what she said because she felt it, or a slip of tongue, whatever the case, maybe you could have not reacted to it...maybe you could have focused on the newspaper or Sunday  the cross word puzzle, then maybe you would not have said what you said. I know one thing,  when we are upset, we tend to say things we do not mean, we want to say things to the other person just with one intention, and this is to hurt them even harder than what we felt. I am not sure anger ever helped me convey a clear message. I realised that most often I get my message across while talking and not shouting. I am not trying to tell you to change, I am not a better judge than you on how to handle a life...you are far ahead of me in terms of everything.


What I am trying to say  is, try and keep yourself calm, if you can smile and accept a delay, a repair, a breakdown, an un-invited guest,  tasteless food, someone like mom wanting to do something else from you, the lift breakdown, power failure, the BSNL  line getting disconnected, driver coming in late, laptop issues, internet issues, traffic on the roads,...and anything else that you know isn't that important that it will change the direction of your life.


What's really important is to accept, we are loved even more when we have the courage to accept humility to apologize when we make a mistake and respecting every ones opinion. As I know  I have made many mistakes in the past   because of my temper...I can tell you safely, that a few things I said to  people very close to me hurt me even still.


Dad,

My only intention of writing this letter is  to share my feelings..not to hurt you in any way. I want you to know we have tremendous love and respect towards you and it won't change.

Maybe..life is best enjoyed when we see it as a spectator.You  get to look at everything around, but we get to choose what should affect us.

My limited experience told me that I could have avoided 90% of arguments, because at  the end of the day, it did not matter if I won an argument, because an argument has neither charm or serves a purpose. 

Remember, I will be always with you, behind you to support you as you have been supporting our family all these  years. And I also remember , the  life I have now is because you gave it.


Your son.


PS: What a maturity among younger generation? The present society needs more such sons and less such fathers. Hope you agree.


"HOLDING ONTO ANGER IS LIKE DRINKING POISON AND EXPECTING OTHER PERSON TO DIE - BUDDHA"

1, జులై 2012, ఆదివారం

డాక్టర్స్ డే


డాక్టర్స్ డే
అయిదేళ్లక్రితం డిసెంబర్ నెలలో ఓ మంగళవారం.
వైద్యుడనేవాడు ఎలావుండాలో అలాగే యెలా వుండకూడదో ఆనాడు  హైదరాబాదులోని నిలోఫర్ ఆసుపత్రిలో జరిగిన రెండు సంఘటనలు అద్దం పట్టి చూపించాయి.
ఆ ఆసుపత్రికి చెందిన జూనియర్ డాక్టర్లు (జూడాలు అని సంక్షిప్త నామం – ఎవరు పెట్టారో కాని బాగా ఆలోచించి పెట్టినట్టున్నారు) ‘హమ్ ఏక్ హై’  అంటూ ఆస్పత్రి వెలుపల చేరి నినాదాలు చేస్తున్న సమయంలో –
‘నిలో ఫర్ లో  మరో పసి కందు మృతి – వైద్య సాయం అందక  మరణించిన శిశువుల సంఖ్య పదికి పెరిగింది, పదిహేనుకు  పెరిగిందంటూ క్రికెట్ స్కోరు మాదిరిగా టీవీ ఛానళ్లలో అదేపనిగా స్క్రోలింగులు వస్తున్న సమయంలో-
ఒక మృత శిశువును  వొడిలో పెట్టుకుని ‘తల్లి తెలంగాణా’ అధినేత్రి ‘రాములమ్మ’ అదే ఆసుపత్రి ఆవరణలో టీవీ కెమెరాల ముందు వీరంగం వేస్తున్న సమయంలో-
అదే  ఆసుపత్రిలో అదే ఆసుపత్రికి చెందిన కొందరు సీనియర్ డాక్టర్లు  మూడు కాళ్లు, నాలుగు పాదాలు కలిగిన ఆరేళ్ళ అనాకారి బాలుడికి తొలి దశ శస్త్రచికిత్సను  విజయవంతంగా  పూర్తిచేసి, ‘వైద్యో నారాయణో హరి’ అనే సూక్తిని నిజం చేశారు.
అంతకుముందు ఆదివారం రాత్రి అదే  ఆసుపత్రిలో ఒక మజ్లిస్ శాసన  సభ్యుడికీ, జూడాలకూ నడుమ మొదలయిన  సంవాదం సాగి, సాగి, చిలికి చికి  గాలివానగా మారింది. ఆ శాసన సభ్యుడు  తమపై దాడికి దిగారని ఆరోపిస్తూ, అతడిని అరెస్టు చేయాలనీ, అతడి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలనీ డిమాండు చేస్తూ జూడాలు ఆకస్మికంగా మెరుపు సమ్మెకు దిగి విధులను బహిష్కరించారు. విధి నిర్వహణలో  వున్న వైద్యులపై దాడులను ఎవ్వరూ సమర్ధించరు. కానీ, వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన పసిప్రాణాలతో చెలగాటమాడే వైఖరిని కూడా ఎవరూ హర్షించరు. సమాజంలో నానాటికీ పెరిగిపోతున్న అవాంచనీయ ధోరణులు, అసహన వైఖరులు పవిత్రమయిన వైద్య వృత్తిని కూడా వొదిలిపెట్టకపోవడమే ఆందోళన కలిగించే విషయం. ఆలోచించాల్సిన విషయం.
ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారానికి ఆందోళనలూ, సమ్మెలూ అవసరమని అందరూ ముక్త కంఠంతో చెబుతుంటారు. కానీ అవే ఆందోళనలు ప్రజలకు మరికొన్ని కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయన్న  వాస్తవాన్ని మరచిపోతుంటారు. నిజమే, ఆనాటి సంఘటనవల్ల  జూడాలలో ఒకరిద్దరి ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని వారు  సమ్మెకు దిగారు సరే, కానీ వారి ఆందోళలన వల్ల వైద్యం సమయానికి అందక  అనేక నిండు ప్రాణాలే పోయాయి. వాటి సంగతేమిటి?  ఇలాటి వాస్తవాలను గుర్తించనంతవరకూ, అలా ఆందోళనలకు దిగే వారికి ప్రజల మద్దతు లభించదు. సరిగ్గా అదే జరిగింది కూడా.

మొత్తమ్మీద జూడాల సమ్మె ముగిసింది. అన్ని సమ్మెలు యెలా ముగుస్తాయో దీనికీ అలాటి ముగింపే లభించింది.
కానీ, వైద్యుల ప్రవర్తనపై మీడియాలో మాత్రం విస్తృత చర్చే జరిగింది.
వాస్తవానికి సమాజంలో వైద్యులది విశిష్టమయిన స్తానం. అందుకే డాక్టరును ‘డాక్టరు గారు’ అని గౌరవంగా
సంబోధిస్తారు. నలుగురిలో వారికి పెద్దపీటవేసి మన్నన చేస్తారు. రోగాలబారి నుంచి కాపాడే అపర ధన్వంతరులుగా, ప్రాణబిక్ష పెట్టే కలియుగ దైవాలుగా కొలుస్తారు. నాకిప్పటికీ గుర్తు. మా చిన్నతనంలో మా వూరికి వారానికోసారి ఓ డాక్టరుగారు సైకిలు మీద వచ్చేవారు. చిన్న చితకా జ్వరాలకు తనతో  తెచ్చుకున్న తోలుపటకా సంచీనుంచి మందు  గోలీలు ఇచ్చి వైద్యం చేసేవారు. పంటలు  చేతికందినప్పుడు వూళ్ళోని పెద్ద పెద్ద ఆసాములు ఏడాదికోసారి కొలిచి ఇచ్చే ధాన్యం మినహా ఆ డాక్టరు గారు ఏనాడూ రోగులనుంచి  ఫీజు వసూలు చేసిన దాఖలా లేదు. ఆయన వూరికి వస్తే చాలు దేవుడే నడిచివస్తున్నట్టుగా జనం భక్తి ప్రపత్తులు ప్రదర్శించేవారు. ‘సైకిల్ డాక్టరుగార’ని పిలవడం మినహా ఆయన అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు. నాడి  పట్టుకుని చూసి ‘ఇప్పుడెలావుందయ్యా రాముడూ’ అని ఆప్యాయంగా అడగగానే సగం రోగం చేతులతో తీసివేసినట్టు వుండేది. చుట్టుపక్కల అయిదారు వూళ్ళకు ఆయనే దిక్కు. సైకిల్ తొక్కుకుంటూ రోజుకో వూరు చుట్టబెట్టేవారు. ఆ రోజుల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే. కరెంటు వుండేది కాదు. ఉక్కపోస్తున్నా, నులక మంచంమీద కూర్చుని తన మానాన తాను రోగులకు వైద్యం చేస్తుండేవారు. కళ్ళల్లో కారుణ్యం. మోహంలో చెదరని చిరునవ్వు. ఆయన హస్తవాసిపట్ల అందరికీ అపరితమయిన గురి. జనాలకు కొండంత ధైర్యంగా వుండేది.
మరి ఇప్పుడో. ఆ చిత్రం పూర్తిగా మారిపోయింది.
రోగులు పెరిగారు. రోగాలు పెరిగాయి. వైద్యులూ పెరిగారు. ఇచ్చే మందులూ  పెరిగాయి. వాటి ఖరీదులూ పెరిగాయి.  పెరగనిదల్లా వైద్యులపట్ల రోగులకు వుండే భరోసా! వుండాల్సిన దిలాసా!!
మా చిన్న తనం రోజులు కానీ, అయిదేళ్ళ క్రితం సంఘటన కానీ గుర్తుచేసుకున్నప్పుడు, మార్పేమయినా కానవస్తున్నదంటారా!
కనీసం ఈనాడు ‘డాక్టర్స్ డే’ జరుపుకుంటున్న సమయంలోనయినా మంచి మార్పు వస్తుందని ఆశించవచ్చంటారా!!  (01-07-2012)