24, జనవరి 2012, మంగళవారం

బెజవాడ సొగసు చూడ తరమా!


బెజవాడ సొగసు చూడ తరమా!

(బెజవాడ మీద రాసిన బ్లాగు చదివి ఎంతోమంది స్పందించారు. అందరికీ ధన్యవాదాలు. పోతే, ప్రత్యేకించి దాసు కృష్ణ మూర్తి గారు బెజవాడతో తన అనుబంధాన్ని, జ్ఞాపకాలను వివరంగా పేర్కొంటూ ఇంగ్లీష్ లో సుదీర్ఘంగా రాశారు. దాన్ని తెలుగులో అనువదించి అందరితో పంచుకోవాలని అనిపించింది.నాకు రాసిన లేఖలో  కృష్ణమూర్తి గారు తనని తాను పరిచయం చేసుకుంటూ - I live in the United States. I am a migratory bird with three migrations, first to Hyderabad, second to Delhi and the third to America. I stayed in Bezwada for 27 years, Hyderabad 29 years, Delhi 20 years and the U.S. 11 years.- అని రాశారు. దీనిబట్టి ఇక వారి వయస్సును, అనుభవాన్ని అర్ధం చేసుకోవచ్చు. వారి ఫోటో ఒకటి సంపాదించగలిగితే ఈ వ్యాసానికి మరింత పరిపూర్ణత్వం సిద్ధించేది. కాని తొలి పరిచయంలోనే ఫోటో పంపమని అడిగే చనువు తీసుకోలేకపోయాను – భండారు శ్రీనివాసరావు ) పీఎస్: నాగేస్రావ్ అనే పాఠకుడు ఇచ్చిన సలహా ప్రకారం దాసు గారి  వెబ్ సైట్  నుంచి ఆయన ఫోటో సేకరించడం జరిగింది- రచయిత 



దాసు కృష్ణమూర్తి గారు 

   
“బెజవాడ నగర సందర్శనను సినిమా హాళ్ళు, హోటళ్ళతో మొదలు పెడదాము.
అప్పట్లో బెజవాడలో రెండంటే రెండే సినిమా హాళ్ళు వుండేవి. ఒకటి మారుతీ సినిమా, రెండోది నాగేశ్వరరావు హాలు.(బహుశా నాగేశ్వరరావు హాలంటే  కృష్ణ మూర్తి గారి ఉద్దేశ్యం దుర్గాకళా మందిరం కావచ్చేమో!) ఇది ముప్పయ్యవ దశకంలో మాట. ఈ సినిమా హాళ్ళకు ఆ రోజుల్లోనే సొంత జెనరేటర్లు వుండేవి.

“సాయం సమయాల్లో ఈ సినిమా హాళ్లనుంచి ఎడ్లబండ్లు సినిమా ప్రచారానికి  బయలుదేరేవి. వాటిల్లో కొందరు కూర్చుని వాయిద్యాలు వాయిస్తూ వుండేవారు. నలుగురు చుట్టూ  చేరగానే సినిమాల తాలూకు కరపత్రాలు పంచుతూ వుండేవారు. ఆ బళ్ళు కనబడగానే వెంట పరిగెత్తుకెళ్ళి ఆ కరపత్రాలు వీలయినన్ని పోగేసుకోవడం మాకు సరదాగా వుండేది. ఎన్ని ఎక్కువ పాంప్లేట్లు పోగేస్తే అంత గొప్ప.

1937 లో పరిస్తితి కొంత మారింది. నాగేశ్వరరావు గారు ఎడ్లబండి స్తానంలో మోటారు వ్యాను ప్రవేశపెట్టారు. దాన్ని రంగురంగుల సినిమా పోస్టర్లతో అందంగా ఆకర్షణీయంగా అలంకరించేవారు. లౌడ్ స్పీకర్ల ద్వారా సినిమా పాటలు వినిపించేవారు. టంగుటూరి సూర్యకుమారి పాడిన రికార్డులను ప్రత్యేకంగా వేసేవారు. ఇలా సాగే సినిమా ప్రచారం కొన్నాళ్ళ తరువాత కొత్త పుంతలు తొక్కింది. సాలూరు రాజేశ్వరరావు, శ్రీరంజని, రామతిలకం నటించిన ‘కృష్ణ లీల’ సినిమా విడుదల అయినప్పుడు ఆ సినిమా నిర్మాత -  కరపత్రాలను విమానం నుంచి వెదజల్లే ఏర్పాటు చేశారు. నిజంగా ఆ రోజుల్లో అదొక సంచలనం.    
“సినిమా నిర్మాతల నడుమ పోటీలు పెరగడం నాకు బాగా గుర్తు. ఒకాయన ద్రౌపది వస్త్రాపహరణం నిర్మిస్తే మరొకరు పోటీగా ద్రౌపదీ మాన సంరక్షణ పేరుతొ మరో సినిమా తీసి విడుదల చేశారు. ఒకరు మాయాబజారు (పాతది) తీస్తే ఆయన ప్రత్యర్ధి శశిరేఖా పరిణయం పేరుతొ అదే కధను తెరకెక్కించారు. అలాగే సినిమాలు ఆడే ధియేటర్ల నడుమ కూడా పోటీ తత్వం వుండేది.

“అప్పటిదాకా పౌరాణిక చిత్రాలదే హవా. రెండో ప్రపంచ యుద్ధానికి కొద్ది ముందు సాంఘిక చిత్రనిర్మాణానికి నిర్మాతలు చొరవ చూపడం మొదలయింది. ముందు భానుమతి, పుష్పవల్లి తో ‘వరవిక్రయం’ వచ్చింది. తరువాత వైవీ రావు, రామబ్రహ్మం, హెచ్ ఎం రెడ్డి, బీఎన్ రెడ్డి వంటి హేమాహేమీలు  రంగ ప్రవేశం చేసి సాంఘిక చిత్ర నిర్మాణాన్ని ముమ్మరం చేశారు. రైతు బిడ్డ, మాలపల్లి,ఇల్లాలు, గృహలక్ష్మి.వందేమాతరం, దేవత వంటి పలు చిత్రాలు ఈ పరంపరలో రూపుదిద్దుకున్నవే. చలనచిత్రాలను పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్లు  అందరికీ బెజవాడలోని గాంధీనగర్ రాజధాని. సినిమాలు మద్రాసులోనో, కొల్హాపూర్, కలకత్తాలలోనో  తయారయినా వాటిని విడుదల చేయడానికి అవసరమయిన అన్ని హంగులూ, ఏర్పాట్లు చేయాల్సింది మాత్రం  బెజవాడలోనే.

“ఆ రోజుల్లో ఇలా ఇబ్బడిముబ్బడిగా సినిమాలు తీసేవాళ్ళు కాదు. చిత్రానికి చిత్రానికీ నడుమ కనీసం పదిహేనురోజులో,నెల రోజులో వ్యవధానం వుండేట్టు చూసుకునేవారు. సినిమా విడుదలలు లేని ఖాళీ రోజుల్లో ఆ ధియేటర్లలో డ్రామాలు ఆడేవాళ్ళు.
        
“నలభయ్యవ దశకంలో మరో ధోరణి కనబడింది. తెలుగు సినిమాలు దొరక్కపోతే అరవ చిత్రం వేసేవాళ్ళు. హాలు మధ్యలో అనువాదకుడు నిలబడి కొన్ని డైలాగులను తెలుగులో అనువదించి చెబుతుండేవాడు. ఇంటర్వెల్ సమయంలో సినిమా సాంగ్స్ పేరుతొ ఆ సినిమా పాటల పుస్తకాలను అమ్మేవాళ్ళు. వాటికి మంచి గిరాకీ వుండేది.

“బుకింగ్ కౌంటర్ల దగ్గర ఒక వరుసలో నిలబడి టిక్కెట్లు తీసుకునే సంప్రదాయం వుండేది కాదు. కౌంటర్ తెరవగానే అంతా ఒక్కసారిగా మీదపడేవారు. సినిమా టిక్కెట్టు కొనడం అంటే దాదాపు ఒక యుద్ధం చేసినట్టు వుండేది. టిక్కెట్టు తీసుకుని బయటపడేసరికి చొక్కాలు చినిగి పోయేవి. వొళ్ళంతా చెమటలు  పట్టి బట్టలు తడిసిపోయేవి.

“సినిమాహాళ్లలో పారిశుధ్యం పూజ్యం అనే చెప్పాలి. ఆ రోజుల్లో నేల క్లాసు అని ఒక  తరగతి వుండేది. ఆ క్లాసులో  పైన నేల మీద  కూర్చున్న వారిలో ఎవరి పిల్లవాడయినా మూత్రం చేస్తే అది కింద దాకా పారుతుండేది. కింది వైపు కూర్చున్న వారి లాగూలు తడిసేవి. మరుగు దొడ్ల సౌకర్యం వుండేది కాదు. “ఇంటర్వెల్  కాగానే ప్రేక్షకులు ఒక్కమారుగా గుంపులు గుంపులుగా బయటకు వచ్చి సినిమా హాలు గోడల్ని ప్రక్షాళన చేసేవాళ్ళు.

1939 లో అనుకుంటా బెజవాడలో కొత్తగా రామా టాకీసు వచ్చింది. తరువాత వరుసగా గవర్నర్ పేటలో  లక్ష్మీ టాకీసు, వన్ టౌన్ లో  సరస్వతీ మహలు వచ్చాయనుకుంటాను.
     
“ఇక రెస్టారెంట్ల విషయానికి వస్తే-

“వూళ్ళో దాదాపు అన్నీ శాఖాహార భోజన హోటళ్ళే! బ్రాహ్మణ హోటళ్ళు.  చాలావరకు ఉడిపి అయ్యర్లవే. బాగా ప్రాచుర్యం పొందిన వెల్కం హోటల్, మోడరన్ కేఫ్ లాటి హోటళ్ళు కూడా ఉడిపి వారివే. ఒక్క అణా (రూపాయిలో పదహారో వంతు) పెడితే రెండు ఇడ్లీలు, వేడి వేడి సాంబారు, కారప్పొడి, కొబ్బరి చట్నీ, అల్లప్పచ్చడి – అన్నీ లేదు అనకుండా వడ్డించే వాళ్లు.      

”గవర్నర్ పేటలోని బీసెంటు రోడ్డు దగ్గర మొదలు పెడితే గాంధీనగరం వరకు అన్నీ హోటళ్ళే!  మాంసాహారం లభించే హోటళ్ళను మిలిటరీ భోజన హోటళ్ళు అనేవారు. వాటిని  ఎక్కువగా కేరళ వాళ్లు నడిపే వాళ్లు. అలాగే, బయట నుంచి  బెజవాడకు వచ్చిన వాళ్ల చేతుల్లో కొన్ని వృత్తులు వుండేవి. పాల వ్యాపారం చాలావరకు విజయనగరం నుంచి వచ్చిన వారు చూసుకునేవారు. ఒరిస్సా నుంచి వచ్చిన వారు - పాయిఖానాలు  శుభ్రం చేసే పని చూసేవారు. దర్జీ పని, జట్కాలు (గుర్రబ్బండ్లు) ముస్లింల  ఇలాకాలో వుండేవి. రాకపోకలకు రిక్షాలే గతి. సైకిల్  రిక్షాలు రాకపూర్వం వాటిని మనుషులు లాగేవారు. సిటీ బస్సులు వుండేవి కావు. కాకపొతే, బెజవాడ, ఏలూరు, బందరు, గుడివాడల మధ్య బస్సులు తిరిగేవి. ఆ బస్సులకు పై కప్పుమాత్రమే వుండేది. పక్కన ఏమాత్రం ఆచ్చాదన లేకపోవడంతో వర్షం వస్తే అంతే సంగతులు. ప్రయాణీకులు పూర్తిగా తడిసిపోయేవాళ్ళు. కృష్ణా నది మీద రోడ్డు వంతెన లేని కారణంగా బెజవాడ నుంఛి  గుంటూరుకూ, ,తెనాలికీ  బస్సు సర్వీసు వుండేది కాదు. 
అధికారుల పెత్తనం జోరుగా వుండేది. పోలీసు అధికారి కానీ రెవెన్యూ అధికారి కానీ బస్సు ఎక్కాల్సి వస్తే బస్సును ఏకంగా ఆయన ఇంటి దాకా తీసుకువెళ్ళేవాళ్ళు.
“మా ఇల్లు గవర్నర్ పేటలో వుండేది. ఇంటి నుంచి కొత్తపేటలోని హిందూ హై స్కూలు వరకూ నడిచే వెళ్ళే వాళ్ళం. తరువాత మేము చేరిన ఎస్ ఆర్ ఆర్ అండ్ సీ వీ ఆర్ కాలేజీ మాచవరం లో వుండేది. అప్పుడు కూడా మాది నటరాజా సర్వీసే. స్కూల్లో టీచర్లు, కాలేజీలో లెక్చరర్లు అంతా కాలినడకనే వచ్చేవాళ్ళు. దుర్గాగ్రహారంలో వుండే విశ్వనాధ సత్యనారాయణ గారు, చతుర్వేదుల నరసింహం గారు కాలేజీకి నడిచే వచ్చేవాళ్ళు. మాకు వాళ్లు లెక్చరర్లు. దోవలో ఇంగ్లీష్ సాహిత్యం  గురించి చర్చించుకునే వారు. కొత్తగా విడుదలయ్యే ఇంగ్లీష్ సినిమా మొదటి ఆట చూడడం కోసం ప్లాన్లు వేసుకునేవాళ్ళు. కాలేజీ ప్రిన్సిపాల్ పుట్టపర్తి శ్రీనివాసాచారి గారు మాత్రం జట్కా బండిలో వచ్చేవారు. కొందరు లెక్చరర్లు సైకిళ్ళపై చేరుకునే వారు. (వీలు దొరికితే మరి కొన్ని సంగతులు మరోసారి)
(24-01-2012)

14, జనవరి 2012, శనివారం

తెలుగునాట సంగీతాన్ని బ్రోచేవారెవరురా!


తెలుగునాట సంగీతాన్ని బ్రోచేవారెవరురా! ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు 
  
సంగీతం గురించిన వ్యాసాలు చదివి స్పందించిన మైత్రేయి, చెన్నాప్రగడ - వీరిరువురూ  తెలుగునాట కర్నాటక సంగీతానికి తమిళనాట వున్నంత  ఆదరణ ఎప్పుడు వస్తుందో అన్న  ఆవేదన వ్యక్తం చేసారు.  అలా రావడానికి ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు తీసుకోవాలో చర్చ జరగాలి అన్నారు. వారి ఈ  ఆవేదనతో పాలు పంచుకునే వారు తెలుగునాట ఎందరో వున్నారు.
అందులో  భాగంగానే ఈ నాలుగు వాక్యాలు.



తిరువాయూరు త్యాగరాజ ఆరాధనోత్సవాలు 

 జనవరి పద్నాలుగు శనివారం త్యాగరాజ స్వామి ఆరాధన జరుగుతోంది.  తంజావూరు జిల్లా తిరువాయూర్ లో త్యాగరాజు సమాధి వద్ద అందరూ ఆయన రాసిన కీర్తనలు గానం చేస్తూ వుంటారు.  తొంభై శాతం మంది తమిళులే. కాని వారు పాడేవన్నీ తెలుగులో త్యాగరాజు రాసిన కీర్తనలే.  ఆంధ్ర ప్రాంతం నుంచి త్యాగరాజు పూర్వీకులు తిరువాయూర్ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. అయినా తెలుగు మర్చిపోలేదు.  తమిళదేశం నడిబొడ్డులోవున్నా తెలుగు లోనే కీర్తనలు రాసారు. త్యాగరాజు  సిద్ధి  పొందిన తర్వాత  ఆయన సమాధి నిర్లక్ష్యంగా పడి వుంటే బెంగుళూరు నాగరత్నమ్మ అనే వో గొప్ప విద్వాంసురాలు తాను  సంపాదించినదంతా ధారపోసి సమాధి మందిరం కట్టించి ఓ  పెద్ద ప్రాంగణంగా అభివృద్ధి చేశారు. త్యాగరాజ  కీర్తనలన్నీ తెలుగులో  పాలరాతి మీద చెక్కించారు.  సంగీతం అంటే చెవి కోసుకునే వారందరూ అక్కడికి వెళ్లి త్యాగరాజ స్వామి సమాధిని సందర్శించి నివాళులు అర్పిస్తుంటారు.  మార్గశిర బహుళ పంచమి నాడు త్యాగరాజ వర్ధంతిని పురస్కరించుకుని ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.  సంగీతం కావాలనుకొంటే తెలుగు వచ్చి తీరాలి.  సంగీత త్రిమూర్తులు త్యాగరాజు, ముత్తు స్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి ఎవ్వరూ తమిళంలో కీర్తనలు రాయలేదు.  అన్నమయ్య, సదాశివ బ్రహ్మేంద్రంతో పాటు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కూడా తెలుగులోనే కీర్తనలు రాశారు. తమిళనాడులో కచేరీలు జరిగినా వొకట్రెండు  మినహా అన్నీ తెలుగులో కీర్తనలే. వాళ్లకు సంగీతమే ప్రధానం.  ఈ వొక్క విషయంలో మాత్రం వాళ్లు తమ సహజసిద్ధమయిన  భాషాదురభిమానాన్ని కాస్త  పక్కన పెడతారు. తెలుగువాళ్ళం మనకి అంత వొరపు లేదు.   
1940లో ఓసారి  తమిళులందరికీ  తెలుగులో ఎందుకు పాడాలి ? మన తమిళంలో పాడలేమా ? అనుకుని ఓ  ప్రయత్నం చేసారు.   రాజా అన్నామలై చెట్టియార్, కల్కి కృష్ణ మూర్తి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు.  సంగీతానికి కులాన్ని కూడా ఆపాదించారు, బ్రాహ్మణుల చేతిలో చిక్కుకు పోయిందని. అప్పుడు చెట్టియార్  మ్యూజిక్ అకాడెమి  ప్రెసిడెంట్ కూడా.  రెండు మూడేళ్ళు కష్టపడ్డా ఫలితం కనపడలే. తమిళం సంగీత పరమయిన భాష కాదని వారికి తేలిపోయింది.  సంగీతానికి తెలుగు, సంసృతం,  కన్నడం, మలయాళం సరిపోతాయి కాని తమిళం పనికి రాదని అర్ధమయింది.
 1980 లో మరోసారి దండపాణి దేశికర్,  మదురై   సోమసుందరం ఎక్కువ తమిళ  కీర్తనలు పాడడం ప్రారంభించారు.  అయితే శ్రోతలు తగ్గడంతో వారూ ఈ ప్రయత్నంలో వెనక్కి తగ్గారు.  ఇదంతా ఎందుకంటే ఇంత గొప్ప తెలుగు కీర్తనలు వున్నా మనం ఎందుకు ఆదరించడం లేదు ? అన్న ప్రశ్నకు సమాధానం అన్వేషించడానికే. తమిళనాడులో వున్న  ప్రాభవం తెలుగునాట రావాలంటే ఏమి చెయ్యాలో తెలియని అయ్యోమయంలో వుండి పోయాం.  ఎందుకు ? ఎందుకు ?ఎందుకు ? అన్న ప్రశ్నలే ఈ అయోమయంలో నుంచి పుట్టుకు వస్తున్నాయనుకోవాలి.
తెలుగునాట కూడా వొకప్పుడు సంగీతానికి మంచి ఆదరణ వుండేది. విజయనగరం సంస్థానంలో సంగీత సాహిత్యాలకు పెద్ద పీట వేశారు. పాతికేళ్ళక్రితం వరకు విజయనగరంలో సంగీతం నేర్చువడం అంటే  ఎంతో గొప్ప. అల్లాగే కచేరీలు వినడానికి ఎన్నో సభలు ఉండేవి. కాకినాడ సరస్వతి గానసభ అన్నిటి కంటే పాతది. సూర్యకళా మందిరం అని ఆరోజుల్లోనే సంగీతం కోసం ఓ ఆడిటోరియం  కట్టారు.  టి.ఆర్. మహాలింగం, చెంబై వైద్యనాధ భాగవతార్, ముసిరి సుబ్రమణ్య అయ్యర్, అరియక్కుడి రానుజ అయ్యంగార్,  సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, పాల్ఘాట్ మణి అయ్యర్,  పళని సుబ్రహ్మణ్యం,  పట్టమ్మాళ్ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, వసంత కుమారి, మధురై మణి అయ్యర్, జీ ఎన్ బీ   వంటి విద్వాంసులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కచేరీలు చేసే వారు. బెజవాడలో  కనకదుర్గ కళాసమితి, త్యాగరాజ సంగీతకళా సమితి, సద్గురు సంగీతసభ వాళ్లు  నెలవారీ కచేరీలు  ఏర్పాటుచేసే వారు. ఏడాదికోసారి ఉత్సవాలు ఉండేవి. అమలాపురంలో త్యాగరాజ ఉత్సవాలు చేసేవారు.  పాలకొల్లు వర్తక సంఘంవారి త్యాగరాజ ఉత్సవాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈనాటి  మాండొలిన్  శ్రీనివాస్ పాలకొల్లు నుంచి వచ్చినవాడే. తెనాలిలో నారుమంచి సుబ్బారావుగారి సీతారామగాన సభ అంటే తమిళ సంగీత  విద్వాంసులకు ఎంతో గౌరవం. ఇలా ఎన్నయినా చెప్పవచ్చు గత వైభవం  గురించి.  ఇప్పుడు ఈ సభలు కనుమరుగయిపోయాయి. 
1966 ప్రాంతంలో హైదరాబాదులో  త్యాగరాజ గానసభ ప్రారంభమయింది.  మొదటి రోజుల్లో  చిక్కడపల్లి లేబర్ వెల్ఫేర్  సెంటర్ ఓపెన్ స్టేజి పైన కచేరీలు జరిగేవి. కే.ఎల్. రెడ్డి గారని టెలిఫోన్స్  డిస్ట్రిక్ట్ మేనేజర్ వుండేవారు. వయోలిన్ వాయించేవారు.  ఇప్పటి హైదరాబాద్ సిస్టర్స్ లలిత, హరిప్రియలు  వోణీలు వేసుకొని కచేరీలు చెయ్యడం చాలామందికి గుర్తు వుండేవుంటుంది. హైదరాబాద్ బ్రదర్స్ శేషాచారి, రాఘవాచారిల గురువు సుసర్ల శివరాం, ఆర్. జానకీదేవి, వీ.ఎస్. అనంతరావు, మారెళ్ళ కేశవ రావు, నేతి శ్రీరామశర్మ, కోలెంక వెంకటరాజు, ఆకెళ్ళ మల్లిఖార్జున శర్మ, వాసా పద్మనాభం వంటి స్థానిక విద్వాంసులు సభ స్థిరపడడానికి దోహదపడ్డారు.  త్యాగరాజ గానసభ నిలదొక్కుకొని ఓ  ఆడిటోరియం కట్టిన తర్వాత త్యాగరాజ విగ్రహం మాత్రం పెట్టి సంగీతాన్ని వొదిలేసింది.  హాలు  అద్దెకు ఇచ్చుకోవడం మినహా సంగీతానికి ఇప్పుడు చేస్తున్నదేమి లేదు. నిజానికి ఇప్పుడున్న ఆర్ధిక స్తోమతకు చక్కటి కచేరీలు ఏర్పాటు చెయ్యొచ్చు.  ఇప్పటి నిర్వాహకులకు ఆ శ్రద్ధ వున్నట్టు లేదు. (14-01-2012)

12, జనవరి 2012, గురువారం

‘కొలవెరి కొలవెరి కొలవెరి ది’


 ‘కొలవెరి కొలవెరి కొలవెరి ది’ - ఆర్వీవీ  కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు 

‘వై దిస్ కొలవెరి కొలవెరి  కొలవెరి ది’ అంటూ తమిళ నటుడు ధనుష్ సృష్టించిన ‘కొలవెరి పాట’ పుట్టించిన  ప్రభంజనంతో  జనం ఓ పక్క  ఊగిపోతూ వుంటే,  'సా పా సా' లు ఎవరికి  కావాలోయ్!”  అనే వాళ్లకు ‘మద్రాస్ సంగీతోత్సవం’ ఓ  చక్కటి జవాబు.
రాయపేటలోని మ్యూజిక్ అకాడెమి హాలు   పొద్దున్నుంచి  రాత్రి దాకా సంగీత అభిమానులతో నిండిపోతూ వుండేది. పక్కనే వున్నమరో చిన్న ఆడిటోరియం ‘కస్తూరి శ్రీనివాస బిల్డింగ్’ లో  ఎల్సీడీ స్క్రీన్ పెట్టి కచేరీలు లైవ్ ఇస్తుంటే  ఆ హాలు  కూడా ఖాళీ లేకుండా నిండిపోయేది.  ఇవన్నీ ఫ్రీ  కాదు. టిక్కెట్టు  పైనే.  పదిహేను రోజుల సీజను టిక్కెట్టు  అక్షరాలా తొమ్మిదివేల రూపాయలు. అన్నీ   ముందే అయిపోయాయి.  ఇక రోజువారీ టిక్కెట్టు  మూడు వందల రూపాయలు.  పైన  బాల్కనీ వెనక రోలో సీటు వంద రూపాయలు. ఏ కచేరీకి  ఆ కచేరీ టిక్కెట్లు కచేరీ ప్రారంభం కావడానికి ముందు ఏ రోజుకారోజు  ముందే అమ్ముతారు. దానికి  పెద్ద క్యూ.  ఎల్సీడీ  స్క్రీన్ మీద చూసే హాలులో వేశ రుసుము యాభయ్ రూపాయలు. అలాగే, ఆడిటోరియం క్యాంటీన్ ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. వెనక అయిదారు రూపాయలకు దొరికే కాఫీ ఇప్పడు ఇరవై. భోజనం ఏకంగా నూట పాతిక పైమాటే. సంగీతం అంటే చెవికోసుకునే అభిమానులు  టిక్కెట్టు ధరను  లెక్కపెట్టక పోవచ్చు. పైగా సంగీతాన్ని ప్రోత్సహించే తత్వం అక్కడి వారిది. కాకపొతే, సహజంగా భోజన ప్రియులయిన తమిళ సోదరులు క్యాంటీన్ ధరలను హరాయించుకోలేకపోతున్నారేమోనన్న భావన కలిగింది.  
అయితే, ఈ సంగీతోత్సవాల నిర్వహణను కొన్నేళ్లుగా గమనిస్తూ వస్తున్నవారికి గతానికీ ఇప్పటికీ ఎంతో మార్పు కనపడుతోంది. టాప్ కార్పోరేట్  సంస్థలతోపాటు మీడియం, స్మాల్ స్కేల్  కంపెనీలు కూడా ఇప్పుడు వీటికి స్పాన్సర్లే. కాంపౌండ్ మొత్తం  అంగుళం ఖాళీ లేకుండా బ్యానర్లు  కట్టేశారు.  టయోటా కంపెనీ  వాళ్ళయితే ఏకంగా ఓ  పడవలాంటి లేటెస్ట్ మోడల్ కారుని డిస్ ప్లే కి పెట్టారు. సంగీతాన్ని మహా  గొప్పగా మార్కెట్ చేసేసారు. ఇక సీడీలు,మ్యూజిక్ వాయిద్యాల  అమ్మకాలు సరేసరి.  అంతా డిజిటల్ అయిపొయింది కదా. శ్రుతి కోసం తంబురా చేతితో మీటడం పోయింది. ఎలక్ట్రానిక్ శ్రుతి బాక్సులు వచ్చేసాయి. తోడుగా   ఇప్పుడు ఎలక్ట్రానిక్ వీణ కూడా వచ్చింది.  ఏ పాట కావాలంటే అది అలవోకగా వాయించేయొచ్చేమో. ఇక లోపల ప్రేక్షకుల్లో   కూడా చాలా మార్పు వచ్చింది. మొన్నటి దాకా సంగీతం వినడానికి తలనెరిసిన వాళ్ళు, పెద్ద వయస్సు వాళ్ళు ఎక్కువగా వచ్చే వారు.  హాలులో  మూడు వంతులు వీళ్ళు వుంటే మిగిలిన ఒక వంతు  యువతరం వారన్న మాట. కానీ ఇప్పుడు సీను పూర్తిగా  మారిపోయింది. వినే వాళ్ళలో మూడొంతుల మంది ముప్ఫయ్ ఏళ్ల లోపు వాళ్ళే.  అలాగే స్టేజి మీద విద్వాంసులు కూడా. ఇన్నాళ్ళు సాయంకాలం స్లాట్లు సీనియర్ విద్వాంసులకు కేటాయించి, ఉదయం మధ్యాహ్నం కచేరీలు జూనియర్లకు ఇచ్చే వారు. సాయంత్రం హాలు కిటకిటలాడితే ప్రొద్దుట, మధ్యాహ్నం కాస్త పలచగా వుండేది. ఇప్పుడలా కాదు. సాయంకాలం పాడేవాళ్ళంతా యువతరం ప్రతినిధులే.  ఎంతో అలవోకగా కచేరీలు చేసేస్తున్నారు.  ముప్ఫయ్యేళ్ల వయస్సులో ముప్ఫయ్యేళ్ల అనుభవాన్ని రంగరించి చూపుతున్నారు. ఎన్నెన్నో అపురూప కీర్తనలు చక్కగా వినిపిస్తున్నారు. శాస్త్రీయ  సంగీతం యువతరానికి దూరం అయిపోతున్నదేమో అన్న సందేహం ఇక ఏ  మాత్రం అక్కర్లేదు. అన్ని రంగాల్లో మాదిరిగా  సంగీతంలో కూడా ఈనాటి యువతరం ప్రదర్శిస్తున్న చొరవకు, అనురక్తికి   జోహార్లు. మరో విషయం.  ఇది వరకు సంగీతం నేర్చుకొంటే చదువు అబ్బదు అనేవారు. ఇప్పటి పరిస్థితి వేరు.  ఈనాడు సంగీతాన్ని వృత్తిగా  చేపట్టిన వాళ్ళంతా పెద్ద పెద్ద చదువులు చదివినవారే. చాలా మంది ఐ.ఐ.టి., ఐ.ఐ.ఎం.లలో పట్టభద్రులు.  అందుకేనేమో గతంలో ఇరవై ఏళ్ళు సాధన చేస్తే కాని రాని విద్వత్తు ఇప్పుడు చాలా త్వరగా వంటపడుతోంది.   అలాగే సంగీతం చాలా ఖరీదయిన వ్యవహారంగా మారిపోయింది కూడా.   వీళ్ళు డిమాండ్ చేస్తున్న పారితోషికం కూడా చాలా ఎక్కువే. లక్షల్లో వుంటోంది. బహుశః ఇతర రంగాల్లో వున్న వాళ్ళ సహాధ్యాయులకు తీసిపోకుండా తాము కూడా సంపాదించాలన్న కుతూహలం కావచ్చు. సీనియర్ విద్వాంసుల నుంచి నేర్చుకోవాలన్న తపన కూడా వీరిలో కనపడడం మరో మంచి విషయం.
మొన్నటి మ్యూజిక్ ఫెస్టివల్లో  ఎమ్మెస్ గోపాలకృష్ణన్, టీకే మూర్తి,  ఉమయాల్పురం శివరామన్. ఆర్కే శ్రీకంఠన్, వి. కమలాకరరావు, లాల్గుడి జయరామన్  వంటి వారు యువతరంతో డీ కొనవలసివచ్చింది.  రెండు తరాల మధ్య   గమనించ తగ్గ తేడా వొకటి వుంది.  సరే! యువతరం విద్వాంసులు అద్భుతంగా  కచేరీలు చేస్తున్నారు. కొన్ని కొన్ని సందర్భాలలో సీనియర్లను కూడా మరిపిస్తున్నారు. బానే వుంది.  మన ( కర్ణాటక ) సంగీతానికి ఇతర సంగీతరీతులకు ఒక మౌలికమైన తేడా వుంది.   మనది ఆధ్యాత్మికతోకూడినది. భౌతికమైన అనుభూతి ఒక్కటే ప్రధానం   కాదు. సీనియర్లు  పాడినప్పుడు కలిగే భక్తిభావం యువతరం పాడినప్పుడు కొరవడుతున్నదనే చెప్పాలి. కాకపొతే ఇది అందరికీ వర్తించకపోవచ్చు సుమా.  (12-01-2012)    

5, జనవరి 2012, గురువారం

సంగీతం మధుర సంగీతం



సంగీతం మధుర సంగీతం – ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు

'సంగీతము చేత బేరసారములుడిగెన్'

చిన్నప్పుడు సంగీతం నేర్చుకొందామనుకొనే  వారందరికీ  కాషన్ గా ఈ సామెత చెప్పేవారు.  అయితే కొంతమంది పెళ్ళిచూపుల్లో అదనపు అర్హత కోసం చిన్నప్పుడు ఆడపిల్లలకి ఇళ్ళల్లో నాలుగయిదేళ్లపాటు  సంగీతం చెప్పించేవారు.  దొంగరాముడు సినిమాలో  వీరభద్రయ్య {రేలంగి} తన కూతురుకి ఇలాగే పెళ్లి సంగీతం చెప్పిస్తాడు.  పెళ్లి చూపుల్లో 'జార చోరా భజన చేసితిరా' అని 'దారిని తెలుసుకొంటి' అనే త్యాగరాజ కీర్తనలో  ఓ  చరణాన్ని పెళ్లి కూతురు చేత  పాడిస్తారు దర్శకుడు కేవీ రెడ్డి గారు.

అదలా వుంచితే,

తెలుగునాట  ద్వారం వెంకటస్వామి నాయుడు, చిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్లే, దాలిపర్తి పిచ్చిహరి, హరి నాగభూషణం, తూమాడ సంగమేశ్వర శాస్త్రి, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, మహావాది వెంకటప్పయ్య  వంటి పాటా తరానికి చెందిన సంగీత విద్వాంసులు ప్రసిద్ధిచెందారు. పోతే, సుసర్ల దక్షిణా మూర్తి గారు త్యాగరాజు శిష్య పరంపరలోని వారు.  ఈ మహా విద్వాంసుల శిష్యకోటిలో తెలుగు వారికి అఖండ ఖ్యాతి తెచ్చిపెట్టిన వారు మంగళంపల్లి బాలమురళి కృష్ణ, శ్రీపాద పినాకపాణి, నేదునూరి కృష్ణ మూర్తి, వోలేటి వెంకటేశ్వర్లు, షేక్ చిన్న మౌలా, ఈమని శంకర శాస్త్రి .  ఇంకా ఎందరో  విద్వాంసులు కర్నాటక సంగీతంలో  అగ్రశ్రేణిలో నిలిచారు.  ఈ విషయంలో మనం ఎంత గొప్పవాళ్ళ మైనా  తమిళులు కర్నాటక సంగీతం వాళ్లదేనని అనుకొంటారు. కొంత వాస్తవం కూడా. కర్నాటక సంగీతానికి  తమిళనాట ఉన్నంత ఆదరణ మన ప్రాంతంలో లేదు. మద్రాసులో కచేరి చేసి అక్కడి వాళ్ళ చేత ‘సెహభాష్’ అనిపించుకొంటేనే ఇక్కడ కూడా గౌరవం. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అన్న సూత్రం ఇక్కడ పని చెయ్యదు.  సంగీతంలో మాత్రం రచ్చ  గెలిస్తేనే  ఇంట్లో గౌరవిస్తాం.
  ఫిడేలు నాయుడు గారి నుంచి ఈతరం మాండొలిన్ శ్రీనివాస్ దాకా ఇదే వరస, ఇదే బాణీ.



  
ఈ మధ్య  ముగిసిన చెన్నై  మ్యూజిక్ సీజనులో ఈ వాస్తవం మరోమారు బోధపడింది.  మార్గశిర మాసం వచ్చిందంటే చెన్నై వాసులకు  ఓ పండగ. డిసెంబర్ పదిహేనో తారీకు నుంచి జనవరి ఒకటో  తారీకు దాక చెన్నైలో సంగీతం తప్పితే ఏమీ వుండదు.  నగరంలో నలుమూలలా కనీసం ఓ  పది పదిహేను ప్రాంతాల్లో ప్రతి  రోజూ హీనపక్షం  అయిదారు సంగీత  కచేరీలయినా  జరుగుతూ వుంటాయి. ఎక్కడ చూసినా హడావుడే. ఎక్కడెక్కడినుంచో  కర్నాటక సంగీత అభిమానులు చెన్నై చేరుకుంటారు.  ప్రొద్దుట తొమ్మిది నుంచి రాత్రి పది దాకా కచ్చేరీలు  వినడమే వారి పని. చెవుల తుప్పు వొదిలిపోతుంది. మరో ఏడాదికి సరిపడా ఆనందాన్ని మనస్సులో నింపుకుని సంగీతాభిమానులు తిరుగుమొగం పడతారు.

ఇక చెన్నైలో  మ్యూజిక్ అకాడమీది  ఓ ప్రత్యేకత. మొన్న ముగిసిన డిసెంబరులోనే ఈ అకాడమీ  85 వ సంగీతోత్సవం  జరుపుకొంది. నిజానికి పాశ్చాత్య ధోరణులు అన్ని రంగాలను ముప్పేటలా ముసురుకుంటున్న ఈ రోజుల్లో ఇది  ఎంతో గొప్ప విషయం అనే చెప్పుకోవాలి.


 అకాడమీలో కచేరి చెయ్యడం అంటే ఆర్టిస్టులకు  అంతకంటే  గొప్ప గౌరవం ఇంకోటి  వుండదు. అలాగే సంగీత అభిమానులకు అకాడమీలో  కచేరి వినడం.  అంత కంటే గొప్ప అనుభవం వుండదు.  జీవితంలో వొక్కసారైనా అకాడమీలో  కచ్చేరి వినాలన్నది వారి నరనరాల్లో జీర్ణించుకుపోయే కోరిక. మంచి సంగీతం వినాలనుకునే వారికి   మ్యూజిక్ అకాడమీ హాలు ఒక వరప్రసాదం లాటిది. ఎందుకంటె అక్కడి ఏర్పాట్లు అలాటివి. ఎక్కడ కూర్చున్నా కూడా  చక్కగా, శ్రావ్యంగా వినిపించే సౌండ్ సిస్టం.  మన రవీంద్ర భారతి అధికారులు ఓ సారి వెళ్లి చూడాలి.  ఆ సీటింగ్ ఆరెంజిమెంటు,  సౌండ్ సిస్టం దేనికదే ప్రత్యేకం.  వాళ్ళను పొగడడం, మన వాళ్ళను కించబరచడం అని  కాదు.  మనకు కూడా ఇక్కడ అటువంటి చక్కటి  అనుభూతి కలగాలని మాత్రమె.

అకాడమీ  టీటీకె ఆడిటోరియంలో అడుగు పెట్టగానే ‘హాల్ అఫ్ ఫేం’ లో అకాడమీ  వార్షిక ఉత్సవాలకు అద్యక్షత  వహించిన విద్వాంసుల ఫోటోలు.  అలా అద్యక్షత వహించినవారికే ఆ ఏడాది ‘సంగీత కళానిధి’ బిరుదు  ఇస్తారు. నిజమయిన సంగీత కళాకారులకు దీన్ని మించిన సత్కారం వుండదు. కళానిధి బిరుదును మించిన పురస్కారం వుండదు. పద్మ విభూషణ, పద్మ భూషణ, పద్మశ్రీ  పురస్కారాలు కూడా  సంగీత కళానిధికి సాటిరావని భావించే సంగీత విద్వాంసులు వున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ 85  ఏళ్లలో సంగీత కళానిధిపొందిన తెలుగు వారు చాలా తక్కువ.  ద్వారం వెంకట స్వామి నాయుడు, చిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్లే, రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ , (ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు  మృణాలిని  మాతామహులు),  మంగళంపల్లి బాల మురళి కృష్ణశ్రీపాద పినాక పాణి, నేదునూరి కృష్ణ మూర్తి, షేక్ చిన్న మౌలా మాత్రమే  ఈ అరుదయిన సంగీత  పురస్కారం పొందిన కొద్దిమంది తెలుగువారిలో వున్నారు. సంగీత చక్రవర్తులుగా పేరొందిన ఎందరో  మహామహుల సరసన   వీళ్ళ ఫోటోలు చూస్తూ వుంటే తెలుగువాళ్లకు  వొళ్ళు పులకరించడం ఖాయం.

ఈ స్తాయి కలిగిన మరికొందరు సంగీత కళాకారులు తెలుగునాట లేకపోలేదు. కారణం తెలియదు కాని వారికి ఈ మహత్తర గౌరవం దక్కలేదు. పారుపల్లి,  పిచ్చి హరి,  ఈమని శంకర శాస్త్రి, చిట్టిబాబు ఈ గౌరవం అందుకోకుండానే అందరాని తీరాలకు తరలిపోయారు. ఇక సంగీత  కురువృద్ధుడు  నూకల చిన్న సత్యనారాయణ ఇప్పటికీ అంత వయస్సులో కూడా కచ్చేరీలు చేస్తూ అభిమానులను అలరిస్తూనే వున్నారు. మల్లాది బ్రదర్స్, హైదరాబాదు సిస్టర్స్, మాండొలిన్ శ్రీనివాస్ ఎప్పుడో ఒకనాడు చెన్నై  మ్యూజిక్ అకాడమీలో తెలుగు బావుటా ఎగురవెయ్యకపోరు. అదే సంగీతాభిమానుల ప్రగాఢ అభిలాష.

చెన్నై సంగీతోత్సవం వివరాలు మరోసారి. (05-01-2012)