19, జనవరి 2010, మంగళవారం

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మాస్కోలో మా అనుభవాలు- పదకొండో భాగం) -భండారు శ్రీనివాసరావు






ఆ వచ్చిన వాళ్ళెవ్వరూ మా బంధువులు కాదు. కనీసం ముఖ పరిచయం వున్న వాళ్ళు కూడా కాదు. కానీ ఒక్క పూట మా ఇంట్లోగడిపిన 'పుణ్యానికి' ఆత్మ బంధువులుగా మారారు.

నిజానికి అది మా ఆవిడ చేసుకున్న పుణ్యం.ఇంకా చెప్పాలంటే - ఆమెను కట్టుకుని నేను చేసుకున్న పుణ్యం. ఇది మూట కట్టుకోవడానికి చాలా రోజులముందు బందరు నుంచి నాకో రోజు ఓ కార్డు ముక్క వచ్చింది. నిజానికి రాలేదు. నేనే వెళ్లి తెచ్చుకున్నాను. మాస్కోలో వుండే విదేశీయులెవరికీ నేరుగా ఇళ్ళకు ఉత్తరాలు రావు. ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు వస్తాయి. అంటే  హైదరాబాదులో వున్న మా వాళ్ళెవారయినా నాకు ఉత్తరం రాయాలనుకుంటే నా పేరు రాసి  తరవాత  కేరాఫ్ మాస్కో రేడియో అని రాసి డిల్లీలో వున్న మన విదేశాంగ శాఖ కార్యాలయానికి పోస్ట్ చేయాలి. అలా వచ్చిన ఉత్తరాలనన్నింటినీ 'డిప్లొమాటిక్ బాగ్ లో' వారానికోసారి మాస్కోకు విమానంలో పంపుతారు.



 మన ఎంబసికి చేరిన ఉత్తరాలను మనమే వెళ్లి వెదికి తెచ్చుకోవాలి.అలా ఉత్తరాలను గాలించి తెచ్చుకోవడంలో వున్న తృప్తి అనుభవిస్తే కానీ అర్ధం కాదు. చుట్టపక్కాలనుంచివచ్చే  ఉత్తరం ముక్కకోసం ఎంతగా మొహం వాచిపోయేవాళ్లమో ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది.   మేము జవాబు రాయాలన్నా ఇదే వరస. ఇందులోవున్న ఏకైక సౌలభ్యం ఏమిటంటే మనకు ఉత్తరాలు రాసేవాళ్ళు ఎయిర్ మెయిల్ స్టాంప్  ఖర్చులు పెట్టుకోనక్కరలేదు. మామూలు తపాల స్టాంపులతో డిల్లీకి పోస్ట్ చేస్తే సరిపోతుంది. అక్కడనుంచి రాయాలన్నప్పుడు మాకూ అంతే. అందుకే ఎవరయినా వస్తున్నప్పుడు ఏమి పట్టుకురావాలని అడిగినప్పుడు ఇండియన్ స్టాంపులు తెమ్మని అడిగేవాళ్ళం. ఈ ఉత్తరాలతో పాటే ఇండియా నుంచి  ఇంగ్లీష్ దినపత్రికలు వచ్చేవి. వాటిల్లో బెంగళూరు నుంచి వెలువడే హిందూ వుండేది.



.మన రాష్ట్రం సమాచారం తెలియాలంటే హిందూలో హైదరాబాద్ నుంచి వారం వారం హెచ్ జే రాజేంద్రప్రసాద్ గారు రాసే ఆంద్ర ప్రదేశ్ న్యూస్ లెటర్ ఒక్కటే శరణ్యం.


 తరువాతి రోజుల్లో మాస్కోకు వచ్చిన అప్పటి ఆంద్ర జ్యోతి ఎడిటర్ -  ఐ. వెంకట్రావు గారు  తెలుగు పత్రిక కోసం అక్కడి తెలుగువాళ్ళు పడుతున్న  ఆరాటాన్ని గమనించి- హైదరాబాద్ తిరిగి వెళ్ళగానే ఎంబసీ ద్వారా ఆంద్ర జ్యోతి దినపత్రికను పంపడం ప్రారంభించారు.



మాస్కోలో ఉంటున్న తెలుగు వారిలో నా పరపతి పెరగడానికి ఇది దోహదం చేసింది కూడా. ఇక కార్డు విషయానికి వస్తే-
కార్డు కదా! కొంత విరామం తీసుకుందాం. ఏమంటారు?



NOTE: All the images in this blog are copy righted to their respective owners.

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు - పదో భాగం)- భండారు శ్రీనివాసరావు

   










నదిపై పిల్లల  ఫుట్ బాల్  ఆట 
నీళ్ళపై నడయాడగల యోగపురుషులున్న పుణ్య భూమి గా పేరుగాంచిన భారత దేశంనుంచి వెళ్ళిన మేము - మాస్కోలో 'నదిపై ఫుట్ బాల్ ఆడుతున్న పిల్లల'ను కళ్ళారా చూసాము.
ఉత్తర ధృవానికి చేరువగా వుండడం వల్ల, మాస్కోలో ఉష్ణోగ్రతలు సున్నాకంటే ముప్పయి నలభై డిగ్రీలు తక్కువగా వుంటాయి. ఈ చల్లదనానికి మాస్కో నగరం మధ్యలో పాయలుగా పారే మాస్కవా నదిలో నీళ్ళు గడ్డకట్టుకు పోతాయి. కాంక్రీటు మాదిరిగా గట్టిపడిన ఆ నది ఉపరితలం పిల్లలకు ఆట మైదానంగా మారిపోతుంది. ఇక దానిపై ఫుట్ బాల్ ఆటలేనా, స్కేటింగ్ లేనా, ఓహ్! అది చూసి తీరాల్సిన దృశ్యం.



సాధారణంగా మనవైపు ముసురు పట్టినప్పుడు, చల్లగాలులు వీస్తున్నప్పుడు చంటి పిల్లలను బయట తిప్పడానికి సంకోచిస్తాము. కానీ అక్కడ అలా కాదు. ఒక పక్క మంచు నిలబడి కురుస్తూనే వుంటుంది. మరో పక్క నెలలు నిండని శిశువులను సయితం చలి దుస్తుల్లో 'ప్యాక్' చేసి ఆరుబయట వొదిలేసి తల్లులు 'షాపింగ్' చేస్తుంటారు. అది చూస్తూ 'మన దేశం నుంచి వెళ్ళిన తల్లులు' ఇలా ఎలా ? అన్న ప్రశ్నలు వేసుకుని సతమతమౌతుంటారు.
తుమ్మి చిరంజీవ
అలా అని - తుమ్మని వాళ్ళూ , పడిసం పట్టని వాళ్ళూ అసలే లేరని కాదు. మనదగ్గర పల్లెల్లో ఇప్పటికీ పిల్లలు తుమ్మినప్పుడు దగ్గరున్న పెద్దవాళ్ళు వాళ్ళ నెత్తిపై తట్టి 'చిరంజీవ! చిరంజీవ!!' అని అంటూ వుండడం కద్దు. అలాగే అక్కడ కూడా ఎవరయినా తుమ్మగానే పక్కనున్నవాళ్ళు ' బూజ్ ద్దరోవా '( బహుశా దీనికి అర్ధం వెయ్యేళ్ళు బతకమని కాబోలు) అంటుంటారు. మోడరన్ అమ్మాయిల మాటేమోగాని పాత తరం మనుషులు ఇప్పటికీ చిన్న చిన్న నలతలకు ఇళ్ళల్లోనే చిట్కా వైద్యాలు చేస్తుంటారని పిలిపెంకో దంపతులు చెబుతుండేవాళ్ళు.
భోజనాలకు కటకట






పిలిపెంకో ఓసారి పట్టుపట్టి మమ్మల్ని లెనిన్ గ్రాడ్ రైల్లో తీసుకువెళ్ళాడు. అక్కడ పట్టుమని రెండు రాత్రులు కూడా గడపలేదు. ఎప్పుడు వెళ్లి ఇంట్లో పడదామా అన్న ఆరాటంతోనే సరిపోయింది. ఆ నగరంలో చూడాల్సినవి ఎన్నోవున్నాయి. కానీ తినకుండా తిరగడం అన్నదే సమస్యగా మారింది.



 శాఖాహారులకు హోటళ్ళలో తినడానికి ఏమీ దొరకదు. ముతక బియ్యంతో పొడి పొడిగా వండిన అన్నంపై ఉప్పూ మిరియప్పొడి చల్లుకు తినాలి. పెరుగు కాదు కానీ పెరుగు లాంటిది 'కిఫీర్'   దొరుకుతుంది. దానితో సరిపెట్టుకుని భోజనం అయిందనుకోవాలి. అలాగని మాంసాహారులకు రుచికరంగా అన్నీ దొరుకుతాయని అనుకోనక్కరలేదు. ఉడికించిన కోడిగుడ్లు మినహా మిగిలినవేవీ మనవైపునుంచి వెళ్ళిన వాళ్లకు అంతగా రుచిస్తాయనుకోవడానికి లేదు. మాంసాన్ని ఉప్పునీళ్ళల్లో ఉడికించి అదేమాదిరిగా సర్వ్ చేస్తారు. ఉప్పుకారాలు దట్టించి, నూనెల్లో వేయించి వేయిన్నొక్క రకాలుగా వంటలు వండుకుని తినే అలవాటు వున్న వాళ్లకు ఆ తిండి సయించడం కష్టమే. అందుకే అక్కడికి వ్యాపారపు పనులమీదనో లేక ఇండో సోవియట్ సాంస్కృతిక సంఘం ఆహ్వానం మేరకో వచ్చినవాళ్ళు భోజనానికి కటకట పడుతుంటారు.అలా వచ్చినవాళ్ళు మొదటి రోజు అక్కడి హోటళ్లు, బస ఏర్పాట్లు చూసి పరవాలేదనుకుంటారు. విందుల్లో మందు తప్ప ఇష్టపడి తినదగిన భోజనం కనబడక పోవడంతో- ఆకలి ఎరుగని దేశంలో వాళ్లకు ఆకలి కష్టాలు మొదలవుతాయి.

(భోజనానికి బస్సు వేసుకువచ్చిన అతిధులతో మా ఇల్లు ఎలా కళకళ లాడిందన్న ముచ్చట మరోసారి)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

17, జనవరి 2010, ఆదివారం

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు- తొమ్మిదో భాగం) -భండారు శ్రీనివాసరావు







పిలవకుండానే పలికే డాక్టర్లు.

ఉదయం పది గంటలు దాటుతోంది. పిల్లలు స్కూలుకు వెళ్ళారు. మా ఆవిడతో కలసి హిందీ రామాయణం కొత్త ఎపిసోడు కాసెట్ చూస్తున్నాము. ఇంతలో డోర్ బెల్ మోగింది. తలుపు తెరిచి చూస్తె నలుగురయిదుగురు రష్యన్లు. 'దోం  సెం దేసిత్  జేవిచ్ పజాలుస్తా' అందులో ఒకతను అంటున్నాడు. పజాలుస్తా (ఇంగ్లీష్ లో ప్లీజ్ ) అన్న పదం తప్ప ఏమీ అర్ధం కాలేదు. తొంగి చూస్తె వారి వెనుక ఒక చక్రాల కుర్చీ కనిపించింది. ఒక్క క్షణం కేజీబీ వాళ్ళేమోనన్న అనుమానం మనసులో మెదిలింది. వాళ్ళను లోపలకు రమ్మని సైగ చేసాను. కూర్చోమన్న నా అభ్యర్ధనను పట్టించుకోకుండా ఇంట్లో ఇంకా ఎవరయినా వున్నారా అన్నట్టుగా కలయచూస్తున్నారు. సమయానికి పిల్లలు కూడా లేకపోవడంతో- మా ఆవిడ పై అంతస్తులో వుండే జస్వంత్ సింగ్ భార్యను పిలుచుకుని వచ్చింది. ఆ కుటుంబం చాలా ఏళ్ళుగా మాస్కోలో వుంటున్నారు కాబట్టి రష్యన్ బాగా వచ్చు. ఆవిడ వాళ్ళతో మాట్లాడి హిందీలో మళ్ళీ మాకు చెప్పినదాన్నిబట్టి అర్ధం అయింది ఏమిటంటే - ఆ వచ్చిన వాళ్ళు డాక్టర్లు. మా ఇంట్లో ఎవరికో బాగా లేదని వారికి సమాచారం అందిందిట. అంతే! రయ్యిమని వచ్చేసారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ ఉండగానే కొంత ఆలస్యంగానే అయినా బుర్రలో లైటు వెలిగింది. అంతకు కొద్ది సేపటిక్రితం రేడియోకు ఫోన్ చేసి గీర్మన్ తో మాట్లాడిన సంగతి గుర్తుకు వచ్చింది. ఆఫీసు కు పోవడానికి బద్ధకం వేసి 'జలుబుగా వుంది, ఈ రోజు రాలేనని' చెప్పాను. బహుశా అతను ఈ విషయం సంబంధిత అధికారులకు చేరవేసివుంటాడని జస్వంత్ సింగ్ గారి భార్య మాకు టీకా తాత్పర్యం చెప్పింది. మాస్కోలో అంబులెన్సులు రాత్రింబగళ్ళు తిరుగుతూనే వుంటాయి. ఏ ఇంటి నుంచి సమాచారం అందిందో - ఆ ఇంటికి దగ్గరలో తిరుగాడుతున్న అంబులెన్సుకు వైర్ లెస్ లో వివరాలు తెలియచేస్తారు. నిమిషాల వ్యవధిలో వారు అక్కడికి చేరుకొని వైద్య సహాయం అందిస్తారు. మొత్తానికి ఉత్తుత్తి జలుబు పుణ్యమా అని మాస్కో జీవితంలోని మరో మంచి కోణం తెలుసుకోగలిగాము. వచ్చిన డాక్టర్ల బృందానికి ఏ భాషలో క్షమాపణలు చెప్పామో గుర్తులేదు కానీ ఆఫీసుకు డుమ్మా కొట్టడానికి మేము ఎన్నుకున్న ఎత్తుగడను అర్ధం చేసుకుని నవ్వుకుంటూ వాళ్ళు  వెళ్ళిపోవడం మాత్రం ఇంకా కళ్లల్లో మెదులుతున్నట్టేవుంది.
పోతే, పనిలో పనిగా జస్వంత్ సింగ్ గారి భార్య అంబులెన్సు సర్వీసు గురించి మరి కొన్ని సంగతులు మా చెవిన వేసి వెళ్ళింది. మైనస్ ముప్పయి, నలభయి డిగ్రీలవరకు ఉష్ణోగ్రతలు పడిపోయే ఆ నగరంలో వోడ్కా అనేది అక్కడి జనాలకు ఒక నిత్యావసర వస్తువులాంటిది. వొళ్ళు వెచ్చగా ఉంచుకోవడానికి వోడ్కా పుచ్చుకునే వారు కోకొల్లలు. ఈ విషయంలో కూడా అక్కడ మహిళలలదే పైచేయి.

మాస్కోలో 'దేవదాసులు'
 తాగి తాగి ఆ తాగిన మత్తులో మంచులో తూలి పడిపోయి ఇంటికి చేరలేని   డోసు బాబులను అంబులెన్సు బృందాలు  వెతికిపట్టుకుని ఆసుపత్రులకు చేరవేస్తుంటాయట. వారివద్దవుండే ప్రోపుస్కా (ఫోటో గుర్తింపు కార్డు) ఆధారంగా వారి ఇళ్ళకూ, ఆఫీసులకూ సమాచారాన్ని అందిస్తాయిట.  అంతే కాదు , ఆసుపత్రుల్లో అలా చేరిన వారు పూర్తిగా కోలుకునే వరకూ వాళ్లకు జీతంతో కూడిన సెలవు ఇవ్వడమనేది కొసమెరుపు.
    
(మాస్కో  గురించి మరో మంచి ముచ్చట మరో సారి )

NOTE: All the images in this blog are copy righted to their respective owners.





--

16, జనవరి 2010, శనివారం

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు-ఎనిమిదో భాగం)





దేవుడంటే నమ్మకం లేని దేశంలో పిల్లలే దేవుళ్ళు 

దేశంలో పిల్లలే ప్రత్యేకం అనుకుంటే - వారికి అన్నీ ప్రత్యేకమే.
పిల్లలకు ప్రత్యెక ఆసుపత్రులు,ప్రత్యెక స్కూళ్ళు, ప్రత్యెక ఆహారం, ప్రత్యెక దుస్తుల దుకాణాలు, ప్రత్యెక బొమ్మల షాపులు, కొన్న బొమ్మలకు వేసే చిన్ని చిన్ని గవున్లు, బొమ్మల జుట్టు శుభ్రం చేసేందుకు షాంపూలు,దువ్వెనలు, బ్యాటరీతో పనిచేసే బుల్లి బుల్లి హెయిర్ డ్రై యర్లు మొదలయినవన్నీ అమ్మే ప్రత్యెక దుకాణాలు, విశాలమయిన ఆట మైదానాలు, గడ్డకట్టే చలిలో కూడా వెచ్చని నీళ్ళు వుండే ఈతకొలనులు, ఓ పక్కన జోరున మంచు కురుస్తున్నప్పటికీ పెరాంబ్యులేటర్లలో పసిపిల్లలను కూర్చోబెట్టి ఆరుబయట తిప్పడానికి వీలయిన దుస్తులు, వారికి వేసే కాలిజోళ్ళు,మేజోళ్ళు, పక్కబట్టలు, మంచాలు,పడక గదులు - అన్నీ ప్రత్యేకం. వీటిల్లో కొన్ని పూర్తిగా ఉచితం - మరికొన్నింటి ధరలు నామమాత్రం.
మాస్కోలో పనిచేసేవారికి అపార్ట్ మెంట్ల కేటాయింపులో పిల్లలదే కీలక పాత్ర. తలిదండ్రులకు ఎన్ని గదుల ఇల్లు కేటాయించాలనేది వారి హోదాను, ఉద్యోగాన్ని బట్టి కాకుండా వారి పిల్లల సంఖ్యను బట్టి నిర్ణయిస్తారు. మాకు ఇద్దరు పిల్లలు ఉండడంవల్ల మూడు పడక గదుల అపార్ట్ మెంట్ ఇచ్చారు.



మాస్కోలో లెనిన్ స్కీ ప్రాస్పెక్ట్ అనేది ప్రధాన వీధి. ఎనిమిది లేన్ల మార్గం. వీటికి అదనంగా ట్రాములు, విద్యుత్ తో నడిచే బస్సులు తిరిగే మార్గాలు. వీటన్నిటితో యెంతో విశాలంగా వుండే ఆ వీధికి సోవియట్ వ్యవస్తకు ఆది పురుషుడయిన లెనిన్ పేరు పెట్టారు. ఆ వీధి మధ్యలో రాకపోకలకు వీలయిన మరో మార్గం వుంటుంది. కానీ దాన్ని వాడుతున్న దాఖలాలు ఎన్నడూ కానరాలేదు. బహుశా గోర్భచేవ్ వంటి నాయకులకోసం దాన్ని ప్రత్యేకించారేమోనని అనుకుండే వాళ్ళం. చివరికి తెలిసిందేమిటంటే - అది స్కూలు బస్సులు వెళ్ళే మార్గమని.

ఒకసారి ఆ మార్గంపై వెడుతున్న ఒక కాన్వాయ్ ని చూసాము. ముందు మిలీషియా వాహనం ( రష్యన్ లో పోలీసులను 'మిలీషియా' అంటారు.) దానివెంట ఒక బస్సు, దాని వెనక అంబులెన్స్, వెనుకనే మరో పోలీసు వాహనం - ఏదో స్కూలు పిల్లలు పిక్నిక్ కి వెళుతున్నప్పటి సంబడం అది అని చెప్పారు. పిల్లల్ని ఎక్కడికి తీసుకు వెళ్ళాలన్నా స్కూలు వాళ్ళు ముందు పోలీసులకు తెలియచేయ్యాల్సి వుంటుంది. అల్లా వుంటుంది అక్కడ పిల్లల పట్ల తీసుకుండే శ్రద్ధ.
వృద్ధులు - కురు వృద్ధులు
సోవియట్ యూనియన్ జనాభా తక్కువే కానీ వృద్ధుల సంఖ్య ఎక్కువే.
రేపెలా గడుస్తుంది అన్న బెంగ లేకపోవడం, చవుకగా లభించే పౌష్టికాహారం, శుభ్రమయిన గాలీ నీరూ ఇవన్నీ సోవియట్ పౌరుల ఆయు ప్రమాణాలను గణనీయంగా పెంచడానికి దోహదం చేసి వుంటాయనుకోవచ్చు. ప్రతివారికీ పని చూపించే బాధ్యత ప్రభుత్వంపై వుండడం, పిల్లలను కనడమే కానీ చదువు సంధ్యలు చూడాల్సిన అవసరం లేకపోవడం వీటన్నిటి వల్లా ఆరోగ్యం తొణికిసలాడే వృద్దులే ఎక్కువగా కానవస్తారు. ఎనభయి దాటిన స్త్రీలు కూడా గోళ్ళు గిల్లుకుంటూ ఇంటి పట్టున వుండరు. పూలూ పళ్ళు అమ్ముకుంటూ కనబడతారు. ఆత్మాభిమానానికీ, ఆత్మ స్తయిర్యానికీ ప్రతీకలుగా నిలబడతారు.
సామాన్యుల స్వర్గం
పౌర సదుపాయాలను అన్నిటినీ సామాన్యుడిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేశారు. చలి దేశం కాబట్టి - నిత్యావసరాల కోసం ఎక్కువ దూరం వెళ్ళాల్సిన పని లేకుండా నివాస భవనాలకు దగ్గరలోనే షాపులు ఉండేవి. పాలు,వెన్న, కోడిగుడ్లు అమ్మే దుకాణాలను 'ప్రోదుక్తి' అని పిలిచేవారు. అలాగే స్కూళ్ళు, దేస్కిసాద్లు (చైల్డ్ కేర్ సెంటర్లు ) సలూన్లు, పిల్లల ఆసుపత్రులు అన్ని ప్రాంతాలవారికీ అందుబాటులో ఉండేట్టు చూసారు.
(పిలవకుండానే పలికే డాక్టర్ల గురించి మరోసారి)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.





--

మార్పు చూసిన కళ్ళు (మాస్కో అనుభవాలు -ఏడో భాగం ) - భండారు శ్రీనివాసరావు






స్త్రీ బాలవృద్దులదే హవా!

అక్కడ అన్ని విషయాల్లో పెద్దపీట స్త్రీబాలవృద్ధులదే.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తుపాకి పట్టగలిగిన ప్రతి ఒక్క మగవాడినీ- వయస్సుతో నిమిత్తం లేకుండా యుద్ధరంగానికి పంపిన కారణంగా - దేశాన్ని నడిపేందుకు మహిళల తోడ్పాటు అవసరమయిందని చెప్పుకుంటారు. ఆ రోజుల్లో రైళ్ళూ బస్సులూ ట్రాములూ నడపడంతోపాటు కర్మాగారాల్లో కూడా స్త్రీలే పనిచేసారు. అందుకు కృతజ్ఞతగా ఆనాటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం- ఆడవారికి కొన్ని ప్రత్యెక హక్కులు కల్పించింది. అనేక రాయితీలు, సదుపాయాలూ వారికి సమకూర్చింది. చలి దేశం కాబట్టి చిన్నదో, పెద్దదో ప్రతివారికీ ఒక గూడు అవసరం. కొంపాగోడూ లేనివాళ్ళు మనవద్ద మాదిరిగా ప్లాటు ఫారాలపైనా, ఫుట్ పాతులపైనా రోజులు వెళ్లమార్చడానికి అక్కడ వీలుండదు. ఇళ్ళ కేటాయింపు కుటుంబంలో ఆడవారి పేరు మీద జరిపే  పధ్ధతి ప్రవేశపెట్టడంతో కాలక్రమేణా ఇంటి వ్యవహారాలలో పడతుల పట్టు పెరుగుతూ వచ్చింది. అంతే కాకుండా చదువులు ఉద్యోగాలలో మగవారితో పోటీ పడి సంపాదించుకున్న ఆర్ధిక స్వావలంబన వారి స్వేచ్చా జీవితానికి ఆలంబనగా మారింది. ఇంటిమీద హక్కులు, ఆర్దికపరమయిన వెసులుబాటు లభించడంతో ఇళ్ళల్లో వారిదే పైచేయి అయింది. నిండా యిరవయి ఏళ్ళు నిండకుండానే ఇద్దరు ముగ్గురు మొగుళ్ళకు విడాకులు ఇచ్చి నాలుగో పెళ్ళికి సిద్ధం కాగల సత్తా వారి సొంతం అయింది. మాస్కో రేడియోలో పనిచేసే నటాషా చెప్పినట్టు 'పండగనాడుకూడా పాత మొగుడేనా ' అనే వారి సంఖ్య పెరిగింది.


 సోవియట్ రష్యాలో ఏటా పెరిగిపోతున్న విడాకుల పట్ల అక్కడో జోకు ప్రచారంలోకి వచ్చింది. విడాకులు ఎవరు ఇచ్చినా, కొత్త ఇల్లు కేటాయించేవరకు పాత పెళ్ళాంతోనూ, పాత పెళ్ళాం  కొత్త మొగుడితోనూ  కలసి పాత పెళ్ళాం పాత ఫ్లాటులో కొన్నాళ్ళపాటు  నివసించాల్సిన పరిస్తితి మగవాళ్ళది. ఈ దుస్తితి పగవాళ్ళకి కూడా రాకూడదురా బాబూ! అని సరదాగా చెప్పుకునేవారు. అయితే అక్కడ ' ఏకపతీవ్రతం ' చేస్తున్న ఆడవాళ్ళు కూడా లేకపోలేదు. పిలిపెంకో అనే ఎనభై ఏళ్ళ 'యువకుడితో' మా కుటుంబానికి పరిచయం ఏర్పడింది. ఆయన గారి ఏకైక భార్య గత కొన్నిదశాబ్దాలుగా  ఆయనగారితోనే కాపురం చేస్తోంది. ఒకే మొగుడితో కాపురం అన్న సూత్రమే ఆవిడనూ, మా ఆవిడనూ జత కల్పిందని పిలిపెంకో మహాశయులవారి అభిప్రాయం. చివరికి ఈ అనుబంధం ఎంతగా పెనవేసుకుపోయిందంటే మేము ఇండియా తిరిగి వచ్చినతరవాత కూడా ఆ పిలిపెంకో దంపతులు హైదరాబాద్ వచ్చి మా ఇంట్లో వారం రోజులు వుండి వెళ్ళారు. గమ్మత్తేమిటంటే నాకూ, మా ఆవిడకు రష్యన్ తెలియదు. వారిద్దరికీ వాళ్ళ భాష తప్ప మరోటి తెలియదు.అయినా అనుబంధానికి ఇది అడ్డంకే కాలేదు. కాకపొతే -
మా పిల్లలే మాకు దుబాసీలు. మాస్కోలో కూడా.
ఇక-  చిన్న పిల్లల విషయానికి వస్తే -


 ఆ దేశం వారి పాలిట స్వర్గం. వారు ఆడింది ఆట, పాడింది పాట. చదువయిన సంధ్యయినా వారి అభిరుచి ప్రకారమే. మా అబ్బాయిని  డాక్టర్ ని చేద్డామనుకుంటున్నాము, మా అమ్మాయిని ఇంజినీరు చదివిద్దామనుకుంటున్నాము అంటే   అక్కడ కుదరదు. చిన్న తరగతుల స్తాయిలోనే వారి వారి అభిరుచులను కనుగొనే పరీక్ష - (ఇంగ్లీష్ లో యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు)- పెట్టి ఆ విద్యార్ధి డాక్టర్ అవాలనుకుంటున్నాడో, ట్రాక్టర్ డ్రైవర్ కావాలనుకుంటున్నాడో - తెలుసుకుని ఆ కోర్సులో చేర్పిస్తారు. ఇందులో తలిదండ్రుల ప్రమేయం ఏమాత్రం వుండదు. చదివించే భాద్యత కూడా సర్కారుదే కావడంవల్ల, డాక్టరుకూ, ట్రాక్టర్ డ్రైవర్ కూ జీతభత్యాలలో పెద్ద తేడాలు లేకపోవడంవల్ల , వారికీ అభ్యంతరాలు వుండవు. మరో విచిత్రమయిన సంగతేమిటంటే జననాలను ప్రోత్సహించడం. యెంత ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని  కంటే ప్రోత్సాహకాలు అంత ఎక్కువగావుంటాయి. పదిమందికి పైగా పిల్లల్ని కన్న సంతాన లక్ష్ములను జాతీయ అవార్డులతో సత్కరి స్తుంటారు. గర్భవతులయిన ఉద్యోగినులకు , గర్భం ధరించిన సమాచారం తెలిసినప్పటినుంచి ,సుఖ ప్రసవం జరిగి, పుట్టిన బిడ్డ బుడి బుడి నడకలు నడిచే వయస్సు వచ్చేవరకు ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకునేందుకు వీలుగా తల్లులకు జీతంతో కూడిన సెలవు మంజూరు చేస్తారు. ఆ పుట్టిన పిల్లలు పెరిగి పెద్దయ్యేవరకు ప్రభుత్వం వారికి కల్పించే రాయితీలూ, సదుపాయాలూ కనీ వినీ ఎరుగనివి.

దేవుడి మీద నమ్మకం లేని దేశంలో పిల్లలే దేవుళ్ళు - నమ్మలేని ఈ నిజం గురించి మరో సారి.

15, జనవరి 2010, శుక్రవారం

మార్పు చూసిన కళ్ళు (ఆనాటి మాస్కో అనుభవాలు - ఆరో భాగం- భండారు శ్రీనివాసరావు)








కన్నుకొట్టని కరెంటు దీపాలు

ఒక నగరం నగరాన్ని ఆ మాటకు వస్తే ఒక దేశం దేశాన్నీ అందులోనూ నీళ్ళు గడ్డకట్టే వాతావరణం కలిగిన దేశాన్ని వెచ్చగా వుంచడం అక్కడే చూసాను. ఏడాదిలో దాదాపు పదినెలలు మంచు దుప్పటి కప్పుకుండే మాస్కోలో దుప్పటి అవసరం లేకుండా నిద్ర పోవడం అక్కడే సాధ్యం.



 అదీ పైసా (కోపెక్) ఖర్చు లేకుండా. ఇళ్లూ వాకిళ్ళూ , ఆఫీసులు, బస్సులు, ట్రాములు, మెట్రో రైళ్ళు, సినిమా హాళ్ళు, హోటళ్లు, స్కూళ్ళు, కాలేజీలు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రష్యన్ సర్కస్ డేరాలు చివరాఖరుకు స్విమ్మింగ్ పూల్స్ అన్నీ ఎయిర్ కండిషన్ అంటే నమ్మశఖ్యమా చెప్పండి. ఇంటి బయట ఎముకలు కొరికే చలి పులి పంజా విసురుతున్నా- ఇంట్లో మాత్రం లుంగీ పైజమాలతో మసలగలిగేంత వెచ్చగా వుండేది. ఆ వెచ్చదనం కూడా ఏటిపోడుగునా ఏమాత్రం హెచ్చుతగ్గులు లేకుండా ఒకేమాదిరిగా వుండడం వల్ల ఆ అయిదేళ్ళలో ఒకసారి కూడా తుమ్మాల్సిన అగత్యం రాలేదు. ఎయిర్ కండిషన్ వ్యవస్తకు  మరమ్మతులు చేయడానికి మాత్రం వేసవిలో ఓ పదిహేను రోజులు ఈ సదుపాయాన్ని నిలుపు చేస్తారు. అసలు ఈ వ్యవస్థ పనిచేసే విధానమే మాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇళ్లు ఆఫీసులు అన్నిటిలో వేడినీరు ప్రవహించే ఇనుప గొట్టాలు వుంటాయి. ఆ గొట్టాలనుంచి సదా వెలువడే వేడితో ఇల్లంతా వెచ్చగా వుంటుంది. బయట ఉష్ణోగ్రతల్లో ఏర్పడే హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఈ గొట్టాలలో ప్రవహించే నీటి వేడిని పెంచడమో తగ్గించడమో చేస్తుంటారు. దేశ ప్రజలను పొత్తిళ్ళలో పాపాయిలమాదిరిగా వెచ్చ వెచ్చగా ఉంచేందుకు అక్కడి పాలకులు చూపించిన శ్రద్ధాసక్తులకు ఇదో చక్కని తార్కాణం.


 అలాగే రాత్రల్లా కురిసిన మంచుతో కప్పుకుపోయిన రహదారులను తెల్లవారేసరికల్లా వాహనాల రాకపోకలకు అనుగుణంగా ఒక దారికి తీసుకురావడం , అందుకు పడుతున్న శ్రమా, పెడుతున్న ఖర్చూ చూసేవాళ్ళకు కళ్ళు తిరగక మానవు. ప్రతి రోజూ అర్ధరాత్రి దాటిన  తరవాత అంటే సుమారు రెండుగంటలనుంచి ఓ రెండు మూడు గంటలపాటు రహదారులపై బస్సులు, ట్రాములు మొదలయిన వాహనాలతో పాటు మెట్రో రైళ్ళ రాకపోకలను నిలిపివేస్తారు. అక్కడినుంచి మొదలవుతుంది  యుద్ధ ప్రాతిపదికన రోడ్లపై మంచు తొలగించే కార్యక్రమం. వార్ ఫుటింగ్ అన్న పదానికి సరయిన అర్ధం తెలుసుకోవాలంటే దీన్ని  ఒక సారి పరిశీలించాలి. మొత్తం మూడు రకాల వాహనాలను ఇందులో వాడతారు. ముందు ఒక వాహనం ఉప్పు కలిపిన ఇసుకను రోడ్లపై చల్లుకుంటూ వెడుతుంది. దానితో గట్టిగా పేరుకుపోయిన మంచు నీళ్లగా కరుగుతుంది. రెండో వాహనం కింద అమర్చిన చీపురు యంత్రాలు ఆ ఇసకను, నీటిని చిమ్మివేస్తాయి. మూడో వాహనం నీటితో రోడ్లను శుభ్రంగా అద్దంలా కడిగేస్తుంది. ఇది ఏదో బాగా వర్షం పడినప్పుడు హడావిడి చేసి చేతులు దులుపుకోవడంలాంటిది కాదు. ఇది సంవత్సరం అంతా జరిగే కార్యక్రమం. పైగా నిత్య కృత్యం

'జీవితమే ఉచితమూ..'






మాస్కో గురించిన మరపురాని అనుభవం మాకు మంచినీళ్ళతో మొదలయింది.1987 లో మాస్కో బయలుదేరినప్పుడు హైదరాబాద్ లో మంచినీళ్ళకు బాగా కటకటగా వుండేది. తెల్లవారుఝామున ఎప్పుడో ఒక గంటసేపు నల్లాల్లో నీళ్ళు వొదిలేవాళ్ళు. అదీ రెండురోజులకోమారు. తాగే నీళ్ళనూ వాడే నీళ్ళను పరమపొదుపుగా వాడుకునేవాళ్ళం. అలాటి పరిస్తితుల్లో మాస్కో వెళ్ళిన మాకు రాత్రీ పగలూ అని లేకుండా కొళాయిల్లో నీళ్ళు రావడం చూసి మతి పోయింది. బాతురూముల్లో, వంటింటిలో ఎక్కడ చూసినా మంచినీళ్ళ పంపులే. ఒకటి తిప్పితే ఫ్రిజ్ వాటర్ లాంటి చల్లటి, శుభ్రమయిన మంచినీళ్ళు. మరోదాంట్లో పొగలుగక్కే వేడినీళ్ళు. ఈ ఏర్పాటు ఏటిపోడుగునా అందుబాటులో ఉండడమే కాదు, పూర్తిగా ఉచితం కూడా. మాస్కో జీవితంలో మేము ఎన్నో ఉచితాలు రుచి చూసాము. అసలక్కడ- 'జీవితమే ఉచితమూ.. ' అని పాడుకోవచ్చు అని మిత్రులకు ఉత్తరాల్లో రాసేవాడిని.

పోతే, మాస్కో విషయాలు ముచ్చటించుకునేటప్పుడు మరచిపోకుండా చెప్పుకోవాల్సింది అక్కడి కరెంటు గురించి. మేము అక్కడ వున్న అయిదేళ్ళూ కరెంటు దీపాలు కన్ను కొట్టిన పాపాన పోలేదు. వోల్టేజి సమస్య అంటే అక్కడివారికి తెలియదు. వంటింట్లో వాడే గ్యాస్ కూడా పైపుల్లో సరఫరా అయ్యేది. సిలిండర్ అయిపోతే ఎట్లారా అన్న బెంగ లేదు. పైగా కరెంటు, నీళ్ళు, గ్యాస్, ఫోన్ అన్నీ ఉచితం. ఇంటి సంగతి సరేసరి. అంత పెద్ద అపార్ట్ మెంటుకు చెల్లించాల్సిన నెల కిరాయి పది రూబుళ్ళు దాటదు.   జీతం మాత్రం అటూ ఇటూగా వెయ్యి రూబుళ్ళు.

( స్త్రీబాలవృద్ధులదే అక్కడ అసలు హవా - అదేమిటో ఇంకో మారు)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.





--

Gagging of DGP, is it justified? - Bhandaru Srinivasrao

Gagging of DGP, is it justified?




- Bhandaru Srinivasrao


To me, it appears, my colleagues in the media keep on drawing the wrath of the powers that be as well people in general. This was evident from the recent statement of the state Information and Public Relations Minister, Dr Geeta Reddy in the wake of destruction of Reliance Industries properties all over the state following three TV channels telecasting a debate on the ‘sabotage’ angle of former chief minister Dr Y S Rajasekhara Reddy’s chopper crash based on a Russian based online tabloid. According to her, the state government had sought Centre’s intervention for establishing a Monitoring Body to oversee (read restrain) print as well electronic media functioning.


Does such a gag from the government necessary? Why stretch things too far? Can’t the media draw their own self-restraining guidelines to prevent the powers that be from venturing into such proposals?


Yet again, I am convinced that my colleagues seem unwilling to learn lessons from their past mistakes and continue to indulge in hara-kiri. The latest being dragging of the state police Chief Girish Kumar into unnecessary controversy.


Well I may not be interested to go into the merits and demerits of the DGPs view point, yet I wish to reiterate that as a hardcore professional and responsible state police chief, he had the right to express his views which he feels right. And it is the responsibility of the media, which poses question should project such views in right perspective, rather than giving a ‘twist’. Of late, it has become a passion for the 24 x 7 news channels, which starve of filling up their news slots, deliberately ‘twist’ facts to serve their purpose. This is what worrying many professionals in the media field.


The pointed question to the state DGP was in his view what he feels about smaller states tackling the growing left-wing extremist problem. He was right when he says that it would be difficult for smaller states with limited resources at its command to tackle the left-wing extremist problem. I am rather aghast to understand what way such a reply can be linked to the ongoing agitation for separate statehood for Telangana?


Had the questioner been more persistent and insisted the DGP to react on the creation of separate Telangana will have any bearing on spread of extremist base, then the linking with it would have been justified by the electronic media. But, the question was ‘general’ though the intentions of the questioner may be different. Yet, such a practice is permissible when tempers are running high? Does these channel news heads so immune to such sensitive and emotive issues? Shouldn’t they be held responsible for their irresponsible professionalism which bound to further whip up regional passions and make the state police chief the ‘butt’ of criticism?


As expected, some of the politicians belonging to the region responded more vocally questioning the propriety of the state police chief to let know such views of his so open which might further vitiate the prevailing environs. And, in my view, some of these leaders’ reactions are although justified, yet they too should restrain before coming to the conclusions based on these irresponsible ‘reportage.’ Some times they too are victims of these unhealthy practices of my electronic media colleagues. Before airing their views, as responsible people’s representatives, they could have as well enquired with the state police chief, who is easily accessible to them, for clarification. Instead, quickly pouncing onto to such ‘irresponsible’ journalists reports and trying to get some mileage of it, only prove their immaturity in public life. No matured politician worth his salt tend to respond based on news reports, more so realizing the present day media! Only media savvy politicians in their bid to be in news always try to take advantage of such misreporting.


As a responsible citizen and journalist, I wish to yet again appeal to my media colleagues as well people’s representatives to verify facts before reacting on any issue, more so when it is sensitive and emotive. If you tend to continue such practices, you bound to lose whatever little credibility you enjoy among the gullible people. Beware of this fact and behave more responsibly.

( Jan.2010 )

12, జనవరి 2010, మంగళవారం

మార్పు చూసిన కళ్ళు (ఆనాటి మాస్కో అనుభవాలు) - ఐదో భాగం - భండారు శ్రీనివాసరావు














ఊలిచ్చ వావిలోవా


ఇది మాస్కోలో మేము వుండే ప్రాంతం. ఊలిచ్చ అంటే రష్యన్ భాషలో స్ట్రీట్ (వీధి) అని అర్ధం. వావిలోవా స్ట్రీట్ లో రేడియో మాస్కోకు 14 అంతస్తులు కలిగిన ఒక నివాస భవనం వుంది. రేడియో మాస్కో విదేశీ విభాగంలో ప్రపంచంలోని 86 భాషల్లో ప్రసారాలు సాగుతుండేవి. ఇందులో తెలుగుతో సహా 14 భారతీయ భాషలు ఉండేవి. వీటికి సంబంధించిన విదేశీ భాషా నిపుణులను ఆయా దేశాలనుంచి ఆహ్వానిస్తుండేవారు. వీరంతా కుటుంబాలతో సహా నివసించడానికి ఈ భవనాన్ని ఏర్పాటు చేశారు. మేము ఇండియా నుంచి రాగానే తీసుకువచ్చి దింపిన భవనం - రేడియో మాస్కవా దోం - ఇదే. ( మాస్కోని మాస్కవా అంటారు. దోం అంటే రష్యన్ లో భవనం ) . బయటకు వెళ్ళే పని లేకుండా ఇందులోనే రెస్టారెంట్, హెయిర్ కటింగ్ సలూన్ మొదలయిన వసతులతో పాటు ఎలాంటి అవసరం వచ్చినా సాయపడడానికి సిబ్బంది రేయింబవళ్ళు సిద్దంగా వుంటారు

.
 ఇంటికి కూతవేటు దూరంలో 'ప్రోదుక్తి' దుకాణం వుంది. ఇందులో అన్ని రకాల పాల పదార్ధాలు, పాల ఉత్పత్తులు దొరుకుతాయి. మరికొద్దిదూరంలో- 'రీనక్' అనే మార్కెట్ వుంది. గోర్బచేవ్ ప్రవచించి అమలు చేసిన గ్లాస్నోస్త్, పెరిస్త్రోయికా సిద్దాంతాల నేపధ్యంలో ఆవిర్భవించిన 'నయా' మార్కెట్ 'రీనక్'. ఇక్కడ అన్ని రకాల ఆహార పదార్ధాలు దొరుకుతాయి. అయితే, బయట షాపుల్లో కంటే ధరలు ఎక్కువ. ఉత్పత్తి ఖర్చుని బట్టి వస్తువు ధర ఉండాలనే సూత్రం ప్రాతిపదికగా ఈ మార్కెట్లు కొత్తగా వెలిసాయి. సామ్వ్యవాద దేశమయిన సోవియట్ యూనియన్లొ సాధారణంగా నిత్యావసర వస్తువల ధరలు అందరికీ అందుబాటులో వుండడం సహజం. కమ్యూనిస్ట్ సమాజం గురించి విన్నంతలో నేను అర్ధం చేసుకున్నది అది. కానీ అక్కడ పరిస్తితి ఊహకు అందనంతగా వుంది.

చవక అనే పదం కన్నా చవక

మా బామ్మ చెబుతూ వుండేది 'తన చిన్న తనంలో పుట్టెడు వడ్లు (పది బస్తాలు) రూపాయికి అమ్మేవారని.

మాస్కోకి వచ్చిన తరవాత బామ్మ చిన్ననాటి రోజులు మా అనుభవంలోకి కూడా వచ్చాయి.

మేము వచ్చిన కొత్తల్లో ఇండియాకు ఫోన్ చేసినప్పుడు - 'అక్కడ చవగ్గా ఏమి దొరుకుతాయి?' అని మా వాళ్ళు అడిగేవారు. 'అన్నీ చవకే' అని జవాబు చెబుతుండేవాళ్ళం.

మన రూపాయికి నూరు పైసలు మాదిరిగానే రష్యన్ రూబుల్ కు వంద కోపెక్కులు. ఒక కోపెక్కు కు దొరికే వస్తువులు కూడావున్నాయి. అగ్గిపెట్టె, కోడిగుడ్డు లాంటివి ఒక కోపెక్కు పెట్టి కొనుక్కోవచ్చు. గాలన్ పెట్రోలు ముప్పయి కోపెక్కులు. పది రూబుళ్ళు మనవి కావనుకుంటే కారు ట్యాంక్ నింపుకోవచ్చు. పాలకూ, పెట్రోలుకూ ధరలో తేడా వుండదు. ఒక్క మాస్కోలోనే కాదు- దేశ వ్యాప్తంగా ధరవరలన్నీ ఒకే మాదిరిగా వుండడం మరో విశేషం. పల్లెల్లో, బస్తీల్లో అంతా సమానమే. పైగా ప్రతి వస్తువు మీదా దాని ధర ముద్రించి వుంటుంది.ఆఖరికి ప్రతి కోడిగుడ్డు పై కూడా.  బేరసారాలకు తావు లేకపోవడం, ధర గురించిన బాధ లేకపోవడం - ఇవన్నీ భాష తెలియని మా బోంట్లకి వరంగా మారింది.

అయితే , పెరిస్త్రోయికా, గ్లాస్నోస్త్ సిద్దాంతాల అమలు ప్రభావం కొద్ది కొద్దిగా ధరవరలపై పడుతూ వచ్చి అయిదేళ్ళ తరువాత ఇండియాకు తిరిగి వచ్చే నాటికి మేము వచ్చిన మాస్కో ఇదేనా అన్నంతగా మారిపోయింది. ఇంతకుముందు పేర్కొన్న 'రీనక్' వంటి మార్కెట్లు అన్ని రంగాల్లో ప్రవేశించి - దశాబ్దాలతరబడి 'మార్పు' అంటే తెలియని సోవియట్ పౌరుల జీవితాలను అతలాకుతలం చేసాయి.
మాస్కో గోంగూర
మాస్కోలో పనిచేసే విదేశీయులకు వేతనాలు అధికంగా లభిస్తాయి కాబట్టి, రీనక్ వంటి మార్కెట్లలో వాళ్ళే ఎక్కువగా కనిపిస్తుంటారు. కాకపొతే, అక్కడ లభించే ఆహార పదార్ధాలలో తొంబయి శాతం మాంసాహారులకి పనికివచ్చేవే. ఒకటీ అరా కానవచ్చే ఆకుకూరల్లో- కొన్నింటిని మా ఆవిడ 'శబరి' లాగా కొరికి చూసి - గోంగూర 'పులుపు' కు కాసింత అటూఇటూ గా వున్న ఒక ఆకుకూరకు 'గోంగూర' అని నామకరణం చేసింది. ఆ తరవాత- మాస్కోలో మేమున్న అయిదేళ్ళూ - వచ్చిన అతిధులకు ఆ గొంగూరతోనే ఆతిధ్యం. అంతే కాకుండా - మాస్కోలో వున్న యితర తెలుగు కుటుంబాల్లో కూడా 'రీనక్ గోంగూర' ప్రధాన అధరువుగా మారిపోయింది.
('కన్ను కొట్టని కరెంటు దీపాలు' గురించి మరోసారి)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

11, జనవరి 2010, సోమవారం

మార్పు చూసిన కళ్ళు -ఆనాటి మాస్కో అనుభవాలు- నాలుగో భాగం-భండారు శ్రీనివాసరావు





మంచు కాలం


మాస్కోలో మేము అడుగుపెట్టింది ఎముకలు కొరికే చలి కాలంలో.

ఇండియా నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వెళ్ళిన మాకు ఆ వాతావరణం ఓ పట్టాన కొరుకుడుపడలేదు. కొన్నాళ్ళు వానలు, కొన్నాళ్ళు చలి గాలులు, మరికొన్నాళ్ళు మండే ఎండలు - ఇలాంటి వాతావరణం తెలుసు. కానీ అక్కడి వాతావరణం గురించిన ఒక జోక్ ఇలా ప్రచారంలో వుంది. 'మాస్కోలో మొదటి నాలుగు నెలలు చలికాలం- తరువాత మరో నాలుగు నెలలు చలికాలం. పోతే, మిగిలిన నాలుగు నెలలు చలికాలమే' ఏప్రిల్, మే నెలల నడుమ ఓ పదిహేను, యిరవయి రోజులు వేసవి కాలం పలకరిస్తుంది. అప్పుడు కూడా డిల్లీలో చలికాలం మాదిరిగా ఎండ కాస్తుంది. దానికే మాస్కో వాసులు తెగ సంబరపడిపోతారు. ఆ సంబరంలో వాళ్లకు వొంటిమీద బట్టనిలవదు. ఏటిపొడుగునా ధరించే ఎలుగుబంటి దుస్తుల్ని వొదిలిపెట్టి - ఆడవాళ్ళు స్కర్టుల్లోకి, మగవాళ్ళు నిక్కరు,టీ షర్టుల్లోకి మారిపోతారు. నిజానికి, రష్యన్ల మేని ఛాయ తెల్లని తెలుపు. కానీ చలి దుస్తుల్లో వారి అందం కాస్తా మరుగున పడిపోతుంది. ఫర్ కోట్లు, ఫర్ టోపీలు ధరించిన తరవాత ఎవరు ఆడో - ఎవరు మగో గుర్తు పట్టడం కష్టం మరి.



ఇక మాస్కో గురించి చెప్పుకోవాలంటే అక్కడ కురిసే మంచు గురించి ముందు ముచ్చటించుకోవాలి. తెల్లటి మంచు పూలరేకులమాదిరిగా నిరంతరం నింగినుంచి 'దేవతలు పుష్పవృష్టి' కురిపిస్తున్నట్టు జాలువారుతూనే వుంటుంది. ఆ మంచు వానలో దుస్తులన్నీ 'మంచు కొట్టుకు పోతాయి' కానీ 'తడిసి ముద్దయి' పోవు. ఎందుకంటె అక్కడి 'మైనస్' టెంపరేచర్లలో మంచు కరిగి నీరుగా మారే అవకాశమే లేదు. తెల్లవార్లూ ఎడతరిపి లేకుండా కురిసే మంచులో ఇళ్ళ ముందు పార్కు చేసిన కార్లు నిలువెత్తు మంచులో కూరుకుపోతాయి. ఆ మంచుని తొలగించి కార్లను మళ్ళీ రోడ్డు ఎక్కించడం వాటి యజమానులకు రోజూ ఒక సమస్యే. అందుకే చాలామంది కార్లను మంచు సమాధులలోనే ఉంచేసి , మెట్రో రైళ్ళ పయినే రాకపోకలు సాగిస్తుంటారు.

అదిగో నవలోకం





భూగర్భంలో కొన్ని వందల అడుగుల దిగువన నిర్మించిన ఒక అద్భుత నిర్మాణం 'మాస్కో మెట్రో'. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ మెట్రో రైళ్ళు - తెల్లవారు ఝామునుంచి అర్దరాత్రివరకు నిరంతరం సంచరిస్తూ లక్షలమంది ప్రయాణీకులను గమ్యాలకు చేరవేస్తుంటాయి. చిత్రమేమిటంటే- భూమిపయిన మెట్రో స్టేషన్ వున్నచోట 'ఎం' అనే అక్షరం రాసిన గుర్తు మాత్రమే వుంటుంది. ('ఎం' అనే అక్షరాన్ని ఇంగ్లీష్ లో మాదిరిగానే రష్యన్లోకూడా రాస్తారు) అక్కడనుంచి భూగర్భంలోని స్టేషన్ కు చేరడానికి ఎస్కలేటర్లు వుంటాయి . అయిదు కోపెక్కుల (రష్యన్లకు మన అయిదు పైసలతో సమానం) నాణెం అక్కడి మిషన్లో వేయగానే ఎస్కలేటర్లలోకి వెళ్ళే ద్వారం ఆటోమాటిక్ గా తెరుచుకుంటుంది.


 ఒక్కసారి అయిదు పైసలు వేసి ఏదయినా ఒక మెట్రో లోకి ప్రవేసించామంటే చాలు, దానితో మాస్కో నగరం భూగర్భంలో నిర్మించిన సుమారు నూట నలభయి స్టేషన్ లకు యెంత దూరమయినా, ఎన్నిసార్లయినా ప్రయాణం చేయవచ్చు.


 ఒక స్టేషన్ కు మరో స్టేషన్ కు పోలిక లేకుండా విభిన్న ఆకృతులతో, సోవియట్ యూనియన్ లోని వివిధ ప్రాంతాల సంస్కృతులను, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వాటిని నిర్మించిన విధానం అపూర్వం. భూ ఉపరితలానికి వందల అడుగులలోతున అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాల కాంతి లో పట్టపగలులా మెరిసిపోయే మాస్కో మెట్రో స్టేషన్ లు మయసభలను మరిపిస్తూ మానవ నిర్మిత కట్టడాల ప్రశస్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నయా అన్నట్టుగా వుంటాయి.

 అంత లోతున డజన్లకొద్దీ నిర్మించిన సొరంగ మార్గాలలో మెట్రో రైళ్ళు మెరుపు వేగంతో పరుగులుతీస్తుంటాయి. రైల్ వెళ్లి పోయిందే అన్న బెంగ లేకుండా ఒక దానివెంట మరొకటి నిమిషాల వ్యవధిలో రాకపోకలు సాగిస్తుంటాయి.


 రైలు ప్లాటు ఫారం మీదకు రాగానే తలుపులు నిశ్శబ్దంగా తెరుచుకుంటాయి. ప్రయాణీకులు దిగినదాకా ఆగి ఎక్కాల్సిన వాళ్ళు తోపులాటలు లేకుండా ఎక్కుతుంటారు. ఈ రైలు తప్పిపోతే ఇలా అనే భయం వారికి లేకపోవడమే ఇందుకు కారణం. మరో నిమిషంలో మరో రైలు వస్తుందనే భరోసా వారికి ఆ ధైర్యాన్ని ఇస్తోంది. ఒకసారి పిల్లలతో వెళ్ళినప్పుడు, వాళ్ళు ఎక్కగలిగారు కానీ నేనూ మా ఆవిడా ఎక్కేలోగానే రైలు కదిలింది. చిన్నపిల్లలయినా ఏమాత్రం కంగారు పడకుండా పక్క స్టేషన్ లో దిగిపోయి మా కోసం ఎదురుచూశారు. వెనువెంటనే వచ్చిన మరో మెట్రో రైలు లో వెళ్లి మేము వారిని కలుసుకున్నాము. మెట్రో గురించిన మరో విశేషం ఏమిటంటే - సమయ పాలన. నేను అక్కడవున్న అయిదేళ్ళు ఒక విషయం గమనించాను. మెట్రోలో మా ఆఫీసు కు వెళ్ళడానికి పద్నాలుగు నిమిషాలు పట్టేది. ఏరోజునా అరనిమిషం తేడా కూడా వచ్చేది కాదు. అంత ఖచ్చితంగా రైళ్ళు నడిచేవి.

(మాస్కోలో 'గోంగూర ' గురించి మరోసారి).

NOTE: All the images in this blog are copy righted to their respective owners.



--

9, జనవరి 2010, శనివారం

మీడియాపై నీలినీడలు - భండారు శ్రీనివాసరావు

మీడియాపై నీలినీడలు - భండారు శ్రీనివాసరావు




రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం వచ్చిన ప్రైయివేటు టీవీ ఛానళ్ళు గత కొంత కాలంగా ఈ అంశంపై చర్చోపచర్చలు కొనసాగి స్తూ వస్తున్నాయి. కొన్ని ఛానళ్ళు ఒక అడుగు ముందుకు వేసి - 'అవును' అయితే ఇది నొక్కండి, 'కాదు' అయితే అది నొక్కండని ఏకంగా ప్రజాభిప్రాయ సేకరణకే పూనుకున్నాయి. ఆ విషయం పూర్తిగా తెలుసుకోగాలిగాయో లేదో తెలియదు కానీ, స్వేచ్చకు కూడా పరిమితులుంటాయని వాటికి తెలిసివచ్చింది. పొద్దున్న లేచింది లగాయతు, టీవీ చర్చల్లో మేధావి వర్గం ప్రభుత్వ అస్తిత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న దశలో - రోశయ్య గారి ప్రభుత్వం- 'ఇద్దరు మీడియా జర్నలిష్టులను' అదుపు పేరిట అరెస్ట్ చేయడంతో అంతా యిప్పుడు తలలు పట్టుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది. 'అతి దారుణమయిన, హేయమయిన నీతి బాహ్య చర్య' అని జర్నలిస్టు సంఘాలు ఖండించడంపై ప్రజాస్పందన కొరవడడానికి కారణం అంతకు ముందు రాష్ట్రంలో జరిగిన విధ్వంస కాండకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొన్ని చానళ్ళ ప్రమేయం ఉండడమే. మీడియా స్వేచ్చపై ఒక పక్క బుల్లి తెరలపై చర్చలు సాగుతుండగానే, ఈ అరెస్టులు జరిగిపోయాయి.మరి కొన్ని చానళ్ళవారిపై పోలీసులు సుమోటోగా కేసులు పెట్టారు. విధ్వంస ఘటనలకు సంబంధించి కూడా వందకుపైగా కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని గగ్గోలు పెడుతున్న వాళ్లకు ఇది మింగుడుపడని వ్యవహారంగా మారింది. దీనికి తోడు తెలుగు చానళ్ళ మధ్య- ఆ మాటకు వస్తే - వాటి యాజమాన్యాల నడుమ కొంత కాలంగా పరోక్షంగా సాగుతున్న 'యుద్దాలు' యిప్పుడు 'టెలివిజన్ తెరలపైకెక్కి' నేరుగా డ్రాయింగ్ రూముల్లోకి చేరాయి. జర్నలిస్టులు రెండు వర్గాలుగా చీలిపోయి ప్రకటనలు గుప్పిస్తుండడంతో- అసలు విషయం నీరుకారిపోయే అవకాశం ఏర్పడింది.ఇన్నాళ్ళూ నివురుగ ప్పిననిప్పులా ఉండిపోయిన జర్నలిష్టుల 'అనైక్యత' ఇప్పుడు బజారున పడింది. స్వేచ్చ గురించి బలంగా గొంతు విప్పగల శక్తి బలహీనపడింది. ఈ పరిణామాలు ఏమాత్రం అభిలషనీయం కావని చెప్పడానికి సంకోచించనక్కరలేదు కానీ భవిష్యత్తు గురించే బాధ్యతకలిగిన జర్నలిస్టులు అలోచించాల్సిన తరుణం ఆసన్నమయింది.

పోతే, ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పత్రికా(మీడియా) స్వేచ్చకు విఘాతం కలిగించేదిగా ఉందా అనే విషయాన్ని చర్చించే ముందు కొన్ని పూర్వాపరాలను పరిశీలించాల్సి వుంటుంది.

నాకు గుర్తున్న గతంలోకి వెడితే -

అంజయ్యగారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పత్రికలవారిపట్ల ప్రత్యెక అభిమానం ప్రదర్శించేవారనేది బహిరంగ సత్యం. పత్రికల యజమానులే కాకుండా అనుదినం వార్తలు సేకరించే సాధారణ విలేకరులతో కూడా ఆయన సంబంధాలు ఆదరణ పూర్వకంగా ఉండేవి. చక్కటి తెలంగాణా పలుకుబడితో కూడిన ఆయన మాటలు వినసొంపుగా ఉండేవి. సునిశితమయిన హాస్యంతో అంజయ్యగారు చేసే వ్యాఖ్యలు- విలేకరులకు వండివార్చిన 'సిద్దాన్నం' మాదిరిగా వార్తల ముడిసరుకుగా మారిపోయేవి. మరునాడు పత్రికల్లో తను చెప్పిన విషయాలను చదువుకుని 'ఇంత చక్కగా మాట్లాడానా' అని అమాయకంగా మురిసిపోయేవారు. ఒక దినపత్రిక మాత్రం - కొత్త బాణీ కనిపెట్టి అంజయ్యగారి భాషను యధాతధంగా ప్రచురించడం మొదలుపెట్టింది. అందుకు ఆయన నొచ్చుకున్న దాఖలాలు లేవు కానీ , ముఖ్య మంత్రి స్తాయికి తగినట్టుగా లేదని జర్నలిష్టు వర్గాలలోనే కొందరు గుస గుసలాడుకున్న మాట నిజం. వున్నది వున్నట్టు రాయడంతో పాటు, అన్నది అన్నట్టు రాసే పత్రికా సంప్రదాయానికి అప్పుడే బీజం పడినట్టువుంది.



తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో - అప్పటివరకు వార్తలకోసం కాంగ్రెస్ పార్టీ వర్గ రాజకీయాలపై ఆధారపడిన పత్రికలకు కొత్త వనరు దొరికినట్టయింది.

ఏరోజుకారోజు పత్రికలలో వచ్చిన వార్తలను పరిశీలించి అదే రోజు మధ్యాన్నం ఒక పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే, రెండో పార్టీ అదే రోజు సాయంత్రం పెట్టేది. ఒకరి కామెంట్లు మరొకరికి చేరవేసే బాధ్యతను అత్యుత్సాహం కలిగిన కొందరు విలేకరులు భుజానికి ఎత్తుకునేవారు. ఇందులో వారికి యేవో స్వార్ధ ప్రయోజనాలు వున్నాయని సందేహించనక్కర లేదు. వార్తకు వార్త తెగులు అన్నట్టు ఏదో కొత్త వార్త పట్టుకెళ్లాలన్నదే వాళ్ళ ఆరాటం. దీన్ని ఆయా రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకునేవి. ఈ క్రమంలో సంబంధ అనుబంధాలు క్రమేపీ బలపడేవి. తాము చెప్పదలచుకున్న మాటలను తమనోటితో కాకుండా,తాము బయటపడకుండా, తమ చేతికి మసి అంటకుండా పత్రికలలో ప్రచురింపచేసుకునే విధానం రూపుదిద్దుకుంది.ఒక వార్త పత్రికల్లో వచ్చేలా చేసి అదే వార్తను తామే మర్నాడు ఖండించేలా వీలుకల్పించే ఈ నూతన వొరవడి - తమ రాజకీయ ప్రత్యర్ధుల పీచమణచడానికి కొందరికి బాగా ఉపయోగపడుతూ వచ్చింది. ఈ పరిణామ క్రమమే తదనంతరకాలంలో వార్తల స్తానంలో వార్తా కధనాల ఆవిర్భావానికి మార్గం వేసింది.



నూతన ఆర్ధిక సంస్కరణల అమలుతో అన్ని రంగాలలోమాదిరిగానే పత్రికారంగంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి.పత్రికల ముద్ర

ణలో రంగు, హంగులు పెరిగిపోయాయి. పెద్ద స్తాయిలో పెట్టుబడులు ప్రవహించాయి. ప్రైవేటు టీ వీ చానళ్ళ ప్రవేశంతో జర్నలిజం రంగానికి 'గ్లామరు' తోడయింది. సిబ్బంది జీతభత్యాలు కలలో ఊహించలేనంతగా పెరిగిపోయాయి. ఆహ్వానించదగిన ఈ పరిణామాలన్నీ పవిత్రమయిన పత్రికా రంగంలో స్వార్ధ శక్తులు చొరబడడానికి కొంతమేరకు తోడ్పడ్డాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల అమోఘమయిన శక్తి యుక్తులున్న ఈ రంగంపై రాజకీయుల కన్ను పడడంలో ఆశ్చర్య పడాల్సినది ఏమీ లేదు. అలాగే, రాజకీయ నిర్ణయాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బడా పారిశ్రామికవేత్తలు కూడా ఈ రంగాన్ని ఎంచుకోవడంలో వింతేమీ లేదు. ఈ రెండు బలవత్తర శక్తులూ మీడియాను తమ కనుసన్నల్లో ఉంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల పర్యవసానంగానే నిప్పుకు చెదలంటుకున్నాయని చెప్పాలి.

మీడియా విశ్వసనీయతపై ఇన్నాళ్ళుగా కదలాడుతున్న నీలినీడలు తాజా ఘటనలతో కారు మబ్బులుగా మారి మసకబారి పెద్ద ప్రశ్నను మీడియా ముందుకు తెచ్చాయి.



ఫలితంగా, మంచికో చెడుకో మీడియాపై ఒక చర్చ మొదలయింది. పత్రికలంటే పన్నెత్తి మాట్లాడడానికి జంకే వాళ్ళందరూ ఈ నాడు మీడియా నీతీ నిజాయితులగురించి నిలదీస్తున్నారు. నిరాధార వార్తలను ప్రసారం చేసే టీవీ చానళ్ళను మూసివేయాలని నిగ్గదీస్తున్నారు. బాధ్యతతో మెలగాలనీ, నిజానిజాలను ప్రసారానికి ముందే నిర్దారించుకోవాలనీ నీతి బోధలు చేస్తున్నారు. ఒకరికి దిశానిర్దేశనం చేయాల్సిన మీడియా ఈనాడు ఒకరితో చెప్పించుకోవాల్సిన దుస్తితిలో పడిపోయింది.



అందుకే, ఈ అవకాశాన్ని మీడియా ఉపయోగించుకోవాలి. ఆత్మ శోధన చేసుకోవాలి. తప్పు ఎక్కడ జరుగుతుందో, ఎలా జరుగుతుందో తెలుసుకుని దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలి. పత్రికల్లో, మీడియాలో వస్తున్న వార్తలపై , వార్తాకధనాలపై చదువరులనుంచి, వీక్షకులనుంచి విమర్శలు, అభిప్రాయాలు స్వీకరించి సరయినవాటిపై స్పందించి భేషజాలకు పోకుండా తగు మార్పులు చేసుకోవాలి. రేటింగులలో పోటీ తగ్గించుకుని నవ్యత్వం తో కూడిన కార్యక్రమాల రూపకల్పనలో పోటీ పెంచుకోవాలి. పరస్పర విమర్శలు కట్టిపెట్టి, కట్టుబాట్లు, స్వీయ నియంత్రణ ఏర్పాటు చేసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్తలో మిగిలిన అన్ని స్తంభాలు శిధిలమయినప్పుడు సరిదిద్దడానికి నేనున్నానంటూ మీడియా సన్నద్ధంగా నిలబడాలి. పూర్వ వైభవాన్నీ, వెనుకటి ఔన్నత్యాన్నీ, విలువలతో కూడిన పత్రికా సంప్రదాయాలనూ పునరుద్ధరించుకోవాలి.

కానీ, ఈ పోటాపోటీ కాటా కుస్తీ యుగంలో ఇది నెరవేరే కలేనా?

(09-01-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

8, జనవరి 2010, శుక్రవారం

మార్పు చూసిన కళ్ళు (ఆనాటి మాస్కో అనుభవాలు) - మూడో భాగం - భండారు శ్రీనివాసరావు



రష్యన్ మహిళ నోట తెలుగు మాట









మరునాడు తెల్లవారుతూనే రేడియో మాస్కో తెలుగు విభాగంలో పనిచేసే లిదా స్పిర్నోవా అనే ఆవిడ మా ఫ్లాట్ కు వచ్చి తనని తానూ పరిచయం చేసుకుంది. 'శ్రీనివాసరావు గారూ! మీ ఆగమనం కోసం ఎన్నో మాసాలుగా ఎదురుచూస్తూ రోజులు గడుపుతున్నాము' అంటూ ఆ రష్యన్ మహిళ - జగదేకవీరుడు సినిమాలో సరోజాదేవి మాదిరిగా తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే అది చూసి నేనూ మా ఆవిడా అవాక్కయ్యాము. దేశం కాని దేశంలో తెలుగు మాట్లాడే విదేశీ వనిత ఒకరు వున్నారని తెలుసుకుని యెంతో సంతోషపడ్డాము. మాస్కో వాతావరణానికి సరిపడే ఉన్ని దుస్తులు, కాలిజోళ్ళు మా అందరికి కొనిపెట్టమని ఆఫీసు వాళ్లు డబ్బులిచ్చి మరీ ఆమెను పంపారన్న సంగతి తెలుసుకుని మరింత సంబరపడ్డాము.లిదా తీసుకెళ్ళి కొనిపెట్టిన ఉన్ని దుస్తులు వేసుకున్నతరవాత మా రూపు రేఖా విలాసాలన్నీ పూర్తిగా మారిపోయాయి. అవి ధరించి ఉన్ని టోపీలు పెట్టుకుంటే ఆడెవరో, మగెవరో ఒక పట్టాన గుర్తు పట్టడం కష్టం. ఎవరయినా ముందు ఉన్నితో చేసిన 'ఇన్నర్లు' వేసుకోవాలి. వాటిపై పాంటూ షర్టూ కోటూ వేసుకుని 'ఫర్' తో చేసిన లాంగ్ కోటు ధరించాలి. మామూలు బూట్లు పనికిరావు. 'ఫర్' బూట్లు, 'ఫర్' సాక్స్ లేకపోతె ఇంతేసంగతులు.


 అయితే ఈ దసరా వేషం ఇంటినుంచి ఆఫీసుకు చేరేవరకే. అక్కడికి వెళ్ళిన తరవాత ఈ చలి దుస్తులన్నీ అక్కడి ప్రత్యెక కవున్టర్ లలో ఒప్పగించి పాంటూ షర్టుతో ఎంచక్కా తిరగగలిగేలా ఎయిర్ కండిషన్ ఏర్పాట్లు చేశారు. ఇక రేడియో మాస్కో విభాగంలో నా సహచరులు - ముందు చెప్పిన లిదాతో పాటు, విక్టర్, గీర్మన్ పనిచేసేవారు. ఈ ముగ్గురికీ తెలుగు వచ్చు. మరో ఇద్దరు - నటాషా, సెర్గీలకు రష్యన్ తప్ప మరొకటి తెలియదు. వాళ్ళతో నా సంభాషణ సైగలతోనే సాగేది. సజావుగా పని చేసుకోవడానికి మా మధ్య భాష ఎంతమాత్రం అవరోధం కాలేదు. వీళ్ళల్లో నటాషా మరీ చిన్న పిల్ల. యిరవై నిండకుండానే ఇద్దరికి విడాకులు ఇచ్చి మూడో మొగుడితో కాపురం చేస్తోంది. యివన్నీ రష్యన్లకు చాలా మామూలు. మా ఆవిడ శిలా విగ్రహం మాస్కో పురవీధుల్లో వేయించాలని సరదాగా జోక్ చేస్తుండేది. ఎందుకంటె, పెళ్ళయి పదహా రేళ్లయినా ఇంకా అదే మొగుడితో కాపురం చేస్తున్నందుకట.

క్రమంగా కొత్త ప్రదేశంలో- కొత్త జీవితానికి, కొత్త వాతావరణానికీ అలవాటు పడడం ప్రారంభించాము. మా పిల్లలు, సందీప్, సంతోష్- ఇద్దర్నీ ఇండియన్ ఎంబసీకి అనుబంధంగా వున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ - కేంద్రీయ విద్యాలయ్ లో చేర్పించాము. రష్యన్ స్కూళ్ళలో మధ్యాన్న భోజనం, పుస్తకాలతో సహా అన్నీ ఉచితం. పోతే, ఇండియన్ స్కూల్లో ఇందుకు విరుద్ధం. అయినా, రష్యన్ మీడియం లో చేర్పిస్తే ఇండియా కు తిరిగి వెళ్ళిన తరవాత చదువులకు ఇబ్బంది అవుతుందని ఇండియన్ స్కూల్ నే ఎంచుకోవాల్సివచ్చింది.


 అక్కడాఎడ్మిషన్లు  అంత సులభంగా రాలేదు. మేము రష్యన్ ప్రభుత్వం పనుపున వచ్చాము కాబట్టి హార్డ్ కరెన్సీ లో అంటే డాలర్లలో ఫీజు కట్టాలని ప్రిన్సిపాల్  గంగల్  కండిషన్ పెట్టారు. మాకిచ్చే జీతం మీలాగా డాలర్లలో కాదు - రూబుళ్ళలో ఇస్తారని యెంత మొత్తుకున్నా ఆ బెంగాలీ బాబు గారు వినిపించుకోలేదు. ఇక గత్యంతరం లేక - ఆ రోజుల్లో కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్ కు డైరెక్టర్ జనరల్ గా పని చేస్తున్న కె యస్ శర్మ గారికి (తదనంతర
కాలంలో శర్మ గారు ప్రసార భారతికి సీ ఈ ఓ గా పనిచేసారు.) ఫోన్ చేసి విషయం వివరించాను.


 ఆయన కూల్ గా విని - రేపు ఉదయం పోయి ప్రిన్సిపాల్ ని కలవమని తాపీగా చెప్పారు. మర్నాడు నేను వెళ్లేసరికి స్కూలంతా చాలా హడావిడిగా కానవచ్చింది. మాస్కో రేడియో శ్రీనివాసరావు వచ్చాడా అని ప్రిన్సిపాల్ అప్పటికే వాకబు చేయడం మొదలు పెట్టారు. నిబంధనలు ఏ గాలికి పోయాయో తెలియదు కాని, మా ఇద్దరు పిల్లలకు మేము అనుకున్న పద్దతిలో ఎడ్మిషన్ లభించింది. ఆ స్కూలు చదువు వాళ్ళిద్దరి జీవితాల్లో పెనుమార్పు తీసుకురాగలదని కలలో కూడా ఊహించలేదు

. ఎదుగుతున్న దశలో విదేశంలో - వాళ్లకు లభించిన ఎక్స్పోజర్  భవిష్యత్ లో యెంతో ఉపకరించింది. ముందు ఇబ్బంది పెట్టిన గంగల్  గారు కూడా పిల్లల చదువు విషయంలో తీసుకున్న శ్రద్ధ మరచిపోలేనిది. అలాగే శర్మ గారు. అడగకనే వరాలిచ్చే దేవుడిగా ప్రసార భారతిలో సిబ్బంది మన్ననలందుకున్నారు.

 (ఉందిలే 'మంచు కాలం'  ముందూ ముందునా)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

7, జనవరి 2010, గురువారం

మార్పుచూసిన కళ్ళు - ఆనాటి సోవియట్ మాస్కో అనుభవాలు - రెండో భాగం - భండారు శ్రీనివాసరావు






ఇంగువ తెచ్చిన తంటా


మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయం

మాస్కో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
  
అక్టోబర్ - 31,1987 - అంటే శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి రోజున - ఢిల్లీ నుంచి సోవియట్ ఎయిర్ లైనర్ 'ఎరోఫ్లోట్' లో కుటుంబంతో కలసి మాస్కో బయలుదేరాను. కొన్ని మాసాలుగా ఎదురుచూసిన క్షణం దగ్గర పడుతుంటే విమానం విండో నుంచి కిందకు చూసే ప్రయత్నం చేసాము. కళ్ళు చికిలించుకుని చూసినా దట్టంగా అలుముకున్న పొగమంచులో ఎమీకనబడలేదు. మరికొద్దిసేపటిలోనే మా విమానం మాస్కో పొలిమేరల్లోని ' శేర్మేతోవా' అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. విద్యుత్ దీపాల కాంతిలో ధగ ధగాలాడుతూ, పలుదేశాల ప్రయాణీకులతో ఎయిర్ పోర్ట్ కళకళలాడుతోంది. మాస్కోలో వేజిటేరియన్లకు ఏమీ దొరకవు ఉప్పూ , పాలూ తప్ప అన్న హెచ్చరికలతో బయలుదేరిన మేము- లగేజి కలెక్ట్ చేసుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము. హైదరాబాద్ నుంచి సూటుకేసులనిండా పట్టుకొచ్చిన వంట సంభారాలతో కస్టమ్స్ అధికారులనుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు కానీ మా ఆవిడ తెచ్చిన ఇంగువ డబ్బా కొంత తంటా తెచ్చిపెట్టింది.ఇంగువని ఇంగ్లీష్ లో ఏమంటారో ఆ క్షణాన గుర్తురాలేదు. అది తినే వస్తువనీ, వంటల్లో వాడుకుంటామనీ ఎన్నోవిదాలుగా చెప్పిచూసాను. ఇంగ్లీష్ భాష ఇసుమంతకూడా అర్ధం కాని ఆ అధికారులముందు నా ప్రయత్నం వృధా ప్రయాస అయింది. పైపెచ్చు ఘాటయిన ఇంగువ వాసన వారి అనుమానాలను మరింత పెంచింది. చివరకు ఇంగువ ముక్క నోటిలో వేసుకుని నమిలి చూపించి ప్రమాదకరమూ, మాదక పదార్ధమూ కాదని రుజువు చేసుకున్న తరవాతనే అక్కడనుంచి బయట పడగలిగాము.

ఇల్లా? హోటలా?

బయటపడ్దామని అన్నానే కానీ బయటపడడం అంత సులభమయిన విషయం కాదని మాకు వెనువెంటనే తెలిసివచ్చింది.

మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మాస్కో రేడియో తరపున 'సెర్గీ' అనే ఉద్యోగి ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. అతడి చేతిలో మా పేర్లు ఇంగ్లీష్ లో రాసివున్న ప్లకార్డు చూసి ఒకరినొకరం గుర్తు పట్టాము. హైదరాబాద్ చిక్కడపల్లిలో కొన్న స్వెట్టర్ లతో ప్రస్తుతానికి పని లాగిద్దామని దిగబడిన మమ్మల్ని చూసేసరికి అంత చలిలోనూ అతడికి చెమటలు పట్టినట్టున్నాయి. రష్యన్లో అతడు చెబుతున్నదేదో మాకు అర్ధం కావడం లేదన్న విషయాన్ని అతడే అర్ధం చేసుకుని మమ్మల్ని తీసుకువెళ్ళడానికి తెచ్చిన వాహనాన్ని ఎయిర్ పోర్ట్ లాంజ్ ఎగ్జిట్ గేటు వరకు తీసుకునివచ్చాడు. కారులో లగేజి ఎక్కించిన తరవాత- కారు డోరు తెరిచే వుంచి - ఒకే అంగలో వెళ్లి కారెక్కమని సైగలతో చూపించాడు. మేమంతా ఒక్క ఉదుటున వెళ్లి కారెక్కాము. అప్పుడు అర్ధమయింది మాకు - మా గురించి అతడు పడిన ఆదుర్దా. ఎగ్జిట్ గేటు నుంచి కారెక్కడానికి మాకు పది సెకన్లు కూడా పట్టివుండదు. కానీ ఆ కాసేపటిలోనే చేతి వేళ్ళన్నీ చలితో కొంకర్లు తిరిగిపోయాయి. మాస్కో చలి పులి విసిరే పంజా దెబ్బ మాకు మొదటిరోజునే అనుభవంలోకి వచ్చింది. అదృష్టవశాత్తూ కారులో హీటరు ఉండడంవల్ల బిగుసుకుపోయిన అవయవాలన్నీ మళ్ళీ స్వాధీనంలోకి వచ్చాయి.

పట్టపగలు మంచుదుప్పటిలో మాస్కో నగరం  

మంచు కురిసే వేళలో

మా లెక్క ప్రకారం అది పగటి వేళ అయివుండాలి. కానీ, వీధి దీపాలన్నీ దివిటీలమాదిరిగా వెలుగుతున్నాయి . వాహనాలను హెడ్ లైట్ లు వేసుకుని నడుపుతున్నారు . అదేపనిగా మంచు కురుస్తూ ఉండడంవల్ల - పగలో రాత్రో తెలియని అయోమయావస్తలో ఉండగానే మా కారు పలు అంతస్తుల భవనం ఒకదానిముందు ఆగింది


మాస్కోలో మేము కాపురమున్న 'రేడియో మాస్కవా' భవనం  

ఎయిర్ పోర్ట్ అనుభవం ఇంకా  గుర్తు ఉండడంతో ఈసారి అందరం ఎక్కువ ఇబ్బంది పడకుండానే లోపలకు ప్రవేసించాము. మమ్మల్నీ, మా సామానునీ తొమ్మిదో అంతస్తులో వున్న ఒక అపార్ట్ మెంట్ కు చేర్చి - సెలవు తీసుకున్నాడు. లోపలకు వెళ్లి చూస్తె కళ్ళు తిరిగేలావుంది. రెండు పడక గదులు, ఒక డ్రాయింగు రూము, వంటగది, సామాను గది, మంచాలు, పరుపులు,దిండ్లు, దుప్పట్లు,టీవీ, నాలుగు బర్నర్ల స్టవ్, గ్యాస్, బాత్ టబ్, షవర్ ఒకటేమిటి సమస్తం అమర్చి పెట్టి వున్నాయి. ఒక క్షణం ఇది ఇల్లా లేక హోటలా అన్న అనుమానం కలిగింది.ఆ పూతకి వంట జోలికి పోకుండా ఇండియా నుంచి తెచ్చుకున్న తినుబండారాలతోనే సరిపెట్టుకున్నాము.

రష్యన్ టీవీ తెరపై గోర్భచేవ్

 సోఫాల్లో సర్దుకు కూర్చుని టీవీ ఆన్ చేస్తే సోవియట్ కమ్యూనిస్ట్ అధినాయకుడు మిహాయిల్ గోర్బచేవ్ అనర్ఘలంగా ప్రసంగిస్తూ కానవచ్చారు. భాష అర్ధం కాకపోయినా వింటూనే నిద్రలోకి జారిపోయాము.

 'రష్యన్ మహిళ నోట తెలుగు మాట' వినడానికి కొంత వ్యవధానం)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

6, జనవరి 2010, బుధవారం

Oh Media – care common man! - Bhandaru Srinivas Rao

Oh Media – care common man!




By Bhandaru Srinivasa Rao



The all-party meeting convened by the Union Home Minister P Chidambaram over Telangana might not have accomplished its objective in attaining consensus on ‘separation’, yet in my view ensured unanimity over restoring peace. That’s interesting.



In his opening remarks, Chidambaram though appeared to remain self-explanatory regarding apprehensions expressed by various people over his December 9 and December 23 statements on the contentious issue. He said, if the first statement was based on the reported ‘consensus’ reached at the all-party meeting convened by Andhra Pradesh Chief Minister K Rosaiah, then the December 23 was on the ‘altered’ view point of major political parties thereafter. As a result, the entire Andhra Pradesh was engulfed with ‘fire’ with pro-and-anti groups indulging in violence over state’s bifurcation.



Chidambaram’s genuine concern over the democratic institutions losing its importance in resolving contentious issues such as Telangana, is understandable, His reasoning that such an impression will only give an opportunity to those who are opposing it to gain an upper hand is also indisputable. Although, he did not elaborate it in so many words, yet the ‘rider’ of his statement is ‘loud and clear’. Especially, regarding the left-wing extremist groups! “We should not send a message that we cannot resolve contentious issues through democratic process. Every issue can be found a solution with mutual consultations and dialogue” was the essence of his statement.



Whatever has happened is happened and the common man today, in both the regions, are put to inconvenience with frequent ‘rasta rokos’ ‘bandhs’ and ‘rail-roko’ agitations. Should this be continued or put a stop to initiate any further dialogue on bifurcation is the pertinent question apparently being raised by the Union Minister? And, the eight major political parties, which attended the meeting, at least accepted in principle that ‘peace’ (read normalcy) now becomes priority in their ‘agenda’ rather than the “T” issue. Hence, they agreed to issue a joint statement appealing to, especially the student community and other voluntary organizations agitating in ‘favor’ and ‘against’- to restore peace a tranquility. One should welcome this and restrain any more debates and discussions on the ‘outcome’ of the all-party meeting held under the chairmanship of the Union Minister.



As a political observer, I feel now the onus lies on my media colleagues, especially the visual media. The electronic media should restrain from holding any more debates or discussions in their respective channels, at least for couple of months, till peace prevails all over the state. Today, the common man is worst affected and I wonder ‘who had given the right to deprive the right an individual to move around, either to work place or anywhere? Doesn’t this vitiate human rights?



During the past few months, the state, which is on the forefront of development, has received a serious dent with frequent agitations all over the state. The Confederation of Indian Industry as well we the AP Chamber of Commerce expressed their concern over the state being lost of crores of investments that were to come as result of unrest. Student community lost reasonable time due to institutions shut down. Those who are preparing for competitive exams are the most worried lot today with dates drawing nearer for entrance tests of renowned institutions. All thease are to be taken into consideration by the responsible media, before airing views from different people which- in my view - many a times serving no purpose except adding fuel to the fire. (06-01-10)

4, జనవరి 2010, సోమవారం

రాయని రచయిత - డి వెంకట్రామయ్య

రాయని రచయిత - డి వెంకట్రామయ్య



శ్రీ డి.వెంకట్రామయ్య



'డి వెంకట్రామయ్య' కధలపై నేను మరింతగా యిష్టం పెంచుకుంటున్న రోజుల్లోనే ఆయన రాయడం బాగా తగ్గించారు. తగ్గించారు అనడం కంటే రాయడం మానేశారు అంటే బాగుంటుందేమో!

వస్తున్న కధల్లో రాశి పెరిగి, వాసి తగ్గి - ఆ బాపతు వాటిని 'చదవడం మానేస్తే పోలా' అని అనేకమంది చదువరులు అనుకుంటునట్టే , 'కాగితంపై కలం పెట్టగలిగినవాళ్ళందరూ కధలు రాయడం మొదలుపెట్టేసరికి- 'రాయడం మానేస్తే పోలా' అనిపించి రచనా వ్యాసంగానికి ఆయన దూరమయ్యారేమోనని నా అనుమానం.

రచయితగా నాకు తెలిసిన వెంకట్రామయ్య గారు- నాకు వృత్తిపరంగా తెలిసివచ్చేనాటికే 'కలం సన్యాసం' స్వీకరించినట్టున్నారు. అడిగినవారి కోసం అడపా దడపా రాయడం తప్పిస్తే- అప్పటినుంచీ కధా రచయితగా ఆయన రాసిందీ, రాస్తున్నదీ ఏమీ లేదనే చెప్పాలి.

1975 నవంబర్లో అనుకుంటాను- తొలిసారి వెంకట్రామయ్యగారిని హైదరాబాద్ ఆకాశవాణి వార్తా విభాగంలో సహోద్యోగిగా కలుసుకున్నాను. ప్రాచుర్యం పొందిన రచయితతో ఏ అభిమానికయినా సాన్నిహిత్యం ఉండవచ్చుకానీ పాతికేళ్ళకు పైగా ఒకే కార్యాలయంలో కలిసి పనిచేయడం అరుదు. వృత్తిరీత్యా కలసి పనిచేస్తున్నప్పటికీ- ప్రవృత్తిరీత్యా ఆయనకూ, నాకూ నడుమ శతసహస్ర వైరుధ్యాలు.

ఆయనకు నిశ్శబ్దం యిష్టం. వార్తలు ఎంపిక చేసేటప్పుడూ, వాటిని అనువాదం చేసేటప్పుడూ పనిచేసే వాతావరణం ప్రశాంతంగా వుండాలని కోరుకునేవారు. ఇందుకు నేను పూర్తిగా విరుద్ధం. నలుగురితో బాతాఖానీ వేస్తూ, గలగలా నవ్వుతూ, నవ్విస్తూ పని చేస్తూ పోవడం నా పధ్ధతి.

టేబుల్ పై కాగితాలన్నీ ఒక పధ్ధతి ప్రకారం సర్దిపెట్టుకోవడం ఆయనకలవాటు. చెత్తబుట్టకూ, రాతబల్లకూ తేడా తెలియనంతగా - నానా చెత్త మధ్య కూర్చుని చెత్త రాతలు రాస్తూ వుండడం నా ప్రత్యేకత.



ఆ రోజుల్లో ఎవరయినా వార్త పట్టుకు వస్తే- అది ఆయన చేతులో పడితే ఇంతే సంగతులు. రేడియో మార్గదర్శిక సూత్రాలనూ, ఆనాటి బులెటిన్ ప్రాదాన్యతలనూ అప్పటికప్పుడు బేరీజు వేసుకుని 'ఈ వార్త యివ్వడం కుదరద'ని మొహమ్మీదే చెప్పేసేవారు. అంత నిష్టూరంగా అలా చెప్పకపోతే ఏం అనిపించేది కానీ ఆయన మాత్రం లేనిపోని భేషజాలు తనకు సరిపడవన్న తరహానే ప్రదర్శించేవారు. స్నేహితులనో- పరిచయస్తులనో -మొహమాటపడి వ్యవహరించడం ఆయనకు చేతకాని పని. ఇలాంటి విషయాల్లో ఆయనకూ నాకూ మధ్య కొన్నిసార్లు అభిప్రాయ బేధాలు బయటపడేవి. బయట తిరిగే విలేకరులకు కొన్ని కొన్ని ఆబ్లి గేషన్స్ ఉండడానికి అవకాశం ఉండొచ్చన్న అభిప్రాయంతో ఆయన ఏకీభవించేవారు కాదు. దానితో, వార్త ఎందుకు యివ్వలేకపోయామో అన్నది సంజాయిషీ ఇచ్చుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి మాది.

పని పట్ల ఆయన చూపే నిజాయితీ, నిబద్దతా అందర్నీ కట్టిపడేసేవి. బులెటిన్ ఆయన తయారుచేసారంటే దానిపై ఆయన ముద్ర స్పష్టంగా వుండేది. అందులో యితరుల జోక్యాన్ని ఆయన అనుమతించేవారు కాదు. ప్రజాసంబందాలకు పెద్దపీట వేసే మా బోంట్లకు ఆయన ఈ మొండి వైఖరి కొండొకొచొ కొన్ని చిక్కులు తెచ్చి పెట్టేది. అయినా ఆయన ధోరణి ఆయనదే. సిద్దాంతాలూ, సూత్రాలూ వల్లించే వాళ్ళల్లో - వాటికి కట్టుబడి వ్యవహరించేవాళ్ళని చాలా తక్కువమందిని చూస్తాం! వెంకట్రామయ్యగారు దీనికి పెద్ద మినహాయింపు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగంలో చేరిన చాలా కాలం తర్వాత నాకు ఆయన కధలు రాయడం పూర్తిగా తగ్గించిన సంగతి తెలిసింది. పత్రికల్లో- మీడియాలో పనిచేసే 'రచయితల'కు సొంత రచనలు చేసే తీరిక తక్కువన్న అభిప్రాయం ఒకటి ఉంది.నిజమేనేమో!
'పని రాక్షసుడి'గా పేరు పడ్డ వెంకట్రామయ్యగారు-
విధి నిర్వహణకు మాత్రమే ప్రాధాన్యం యిచ్చే వెంకట్రామయ్యగారు-
ఉద్యోగిగా తన కర్తవ్యాన్ని వొదిలిపెట్టి-
'వెంకట్రామయ్య'గా కధలు రాసుకోగలరని అనుకోవడం భ్రమ. అందుకే ఆయన 'రాయని రచయితగా మిగిలిపోయారు.
ఆయన మిత్రుల్లో చాలామంది మాదిరిగానే నాకూ ఇది ఏమాత్రం నచ్చలేదు. ఆయనతో పెంచుకున్న చనువునీ, సాన్నిహిత్యాన్నీ, స్నేహాన్నీ ఉపయోగించుకుని- వీలుదొరికినప్పుడల్లా కధలు రాయమని పోరేవాడిని. అలా వెంట పడగా పడగా బద్ధకం వొదిల్చుకుని చివరికి ఒక కధ రాసారు.దాన్ని గురించి స్నేహితులతో చెబుతూ- 'యిది శ్రీనివాసరావు పుణ్యమే' అని - పాపపుణ్యాల పయినా, దేవుళ్ళూ దెయ్యాల పయినా ఏమాత్రం నమ్మకం లేని వెంకట్రామయ్యగారన్నట్టు గుర్తు.
అతికొద్ది 'మంచి' కధలు రాసిన రచయితగా 'డి వెంకట్రామయ్య' అసంఖ్యాక చదువరులకు పరిచయం. కానీ ఆయన పేరుపెట్టు కోకుండానో, 'గళం'పేరుతోనో - రేడియోకి అసంఖ్యాకంగా రచనలు చేసిన సంగతి అందులో పనిచేస్తున్నవారికే తెలియదు. పేరు మీద వ్యామోహం పెంచుకోకపోవడంవల్లనే ఆయనకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు రాలేదని అనుకునేవారు కూడా వున్నారు. రాసినవి 'కొద్దే' అయినప్పటికీ, పుస్తక ప్రియులను 'పెద్దగా' ఆకట్టుకున్నవే ఆయన ఖాతాలో చేరాయి. అందుకే 'ఎన్ని' రాసారన్నది కాకుండా, 'ఏమి' రాసారన్నదానికి విలువ కట్టి పురస్కారాలు ఇస్తారనే మంచి పేరున్న 'రాచకొండ రచనా పురస్కారం' ఎంపిక కమిటీ ఈ ఏడాది పురస్కారాన్ని డి వెంకట్రామయ్యగారికి ప్రకటించడం ముదావహం. పురస్కారానికి వున్న విలువ పురస్కార గ్రహీతను బట్టి మరింత పెరుగుతుంది అనడానికి ఇదో మంచి ఉదాహరణ. అలాగే, రావిశాస్త్రి గారికి వీరాభిమానిగా చెప్పుకోవడానికీ, ఒప్పుకోవడానికీ సంకోచించని వెంకట్రామయ్యగారికి ఇదో కలికితురాయి. మరెన్నో మంచి రచనలు చేయడానికి ఈ పురస్కారం ఆయనకి తగిన ప్రోత్సాహకారకం కాగలదని ఆశించడం అత్యాశ కాబోదేమో.

- భండారు శ్రీనివాసరావు

2, జనవరి 2010, శనివారం

మార్పు చూసిన కళ్ళు - ఆనాటి మాస్కోలో మా అనుభవాలు - భండారు శ్రీనివాసరావు





                  
జర్నలిష్టులందరూ తమ వృత్తి అనుభవాలను గ్రంధస్తం  చేస్తుండాలని మిత్రుడు దేవులపల్లి అమర్ చెబుతుంటారు. గ్రంధ ప్రచురణ అనేది సామాన్య జర్నలిష్టులకు అలవి కాని భారం అయినప్పటికీ, అనుభవంలోకి వచ్చిన విషయాలను కనీసం కాగితం మీద పెట్టడం వరకూ జరగాలన్నది నా అభిప్రాయం కూడా. అయినా సరే- ఇంచుమించు రెండు దశాబ్దాల క్రితం - మాస్కోలో గడిపివచ్చిన సుమారు అయిదేళ్ళ అనుభవాలను అక్షర బద్దం చేసే 
ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది.






ఏకధ్రువ ప్రపంచ వ్యవస్థను ప్రశ్నిస్తూ- లెనిన్  నూతన సామ్యవాద సిద్దాంతాలను ప్రవచిస్తూ- ఏడు దశాబ్దాలకు పైగా సాగిన మొట్టమొదటి 'సోవియట్  యూనియన్'  కమ్యూనిస్ట్ ప్రభుత్వ చరమాంకాన్ని కళ్ళారా చూడగలిగిన అరుదయిన అవకాశాన్ని ఆలంబనగా చేసుకుని -  'మార్పు చూసిన కళ్ళు'  అనే పేరుతో ఆనాటి అనుభవాలను గుదిగుచ్చి గ్రంధస్తం చేయాలనే ప్రబలమయిన  కాంక్షను  ఎన్నో ఏళ్ళుగా అదిమిపట్టుకోవాల్సి వచ్చింది.  దీనికి కారణాలు అనేకం. 
ఆ నాడు నేను చూసింది మరో ప్రపంచం. 
అప్పటికీ యిప్పటికీ యెంతో తేడా.



ఆ రోజుల్లో 'అలా వుండేది, యిలా వుండేది' అని రాస్తే నమ్మడానికి వీల్లేకుండా ఈనాటి రష్యన్ల జీవన విధానాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. రతనాలను రాశులుగా పోసి- వీధి అంగళ్ళలో విక్రయించిన  'స్వర్ణ యుగాలు'  చరిత్ర పుటల్లో ఆనవాలుగా మిగిలిపోయినట్టే - ఆ నాటి నా అనుభవాలు కూడా. 
నేను  కమ్యూనిష్టుని కాను.  వృత్తి రీత్యా వివిధ రాజకీయ పార్టీలవారితో అంటకాగి తిరిగివుండ వచ్చు కానీ  ఏ రకమయిన రాజకీయ వాసనలను నేను వొంటబట్టించుకోలేదు.  ఒక సామాన్యుడిగా అప్పటి కమ్యూనిస్ట్ రష్యాలో కాలు మోపాను . అక్కడ నేను గడిపిన 'జీవనం'  నా జీవితంలోనే ఒక సువర్ణ అధ్యాయం.  నేనూ, నా భార్యా పిల్లలూ - అత్యంత సుఖప్రదమయిన, గౌరవ ప్రదమయిన, తృప్తికరమయిన  రోజులు గడిపింది ఆ రోజుల్లోనే.  వాటిని గురించి ఏ కొంచెం చెప్పినా  గోరంతను 'కొండంత' చేసి చెబుతున్నానేమో అని అనిపించకత ప్పదు.   అందుకే  'మార్పు చూసిన కళ్ళు' అక్షరబద్ధం చేయడానికి ఇంతగా తటపటాయించాల్సివచ్చింది. 
అంతేకాదు.  కాలం గడుస్తున్నకొద్దీ - గుర్తుంచుకోవాల్సిన విషయాలు కూడా గుర్తుకురానంతగా మరపున పడడం సహజమయిన విషయం.  తేదీలు, పేర్లూ స్పురణకు తెచ్చుకోవడం క్లిష్టంగా మారుతుంది.  విషయానికి న్యాయం చేయలేకపోతున్నామేమో అన్న సంశయం  మరింత వెనక్కి లాగుతుంది. ఏతా వాతా జరిగింది ఏళ్ళతరబడి కాలయాపన.



 ( దస్వి దానియా అంటే రష్యన్ లో మళ్ళీ కలుద్దాం )  
01-01-2010 

NOTE: All the images in this blog are copy righted to their respective owners.


                    

1, జనవరి 2010, శుక్రవారం

వార్తా వంటకాలు - భండారు శ్రీనివాసరావు

వార్తా వంటకాలు   - భండారు శ్రీనివాసరావు

విషయం ఒక్కటే. కానీ చూసే  ఇద్దరికీ రెండు రకాలుగా కనిపిస్తే - వైద్య పరిభాషలో ఆ జబ్బుని యేమని పిలుస్తారో తెలియదు. ఒకే వార్త - వివిధ పత్రికల్లో వివిధ రూపాల్లో వస్తే - అందుకు కారణాలు ఏమిటో యిట్టే తెలిసిపోతున్నాయి. ఒక సభ కానివ్వండి, ఒక సంఘటన కానివ్వండి, ఒక రాజకీయ ప్రకటన కానివ్వండి లేదా విలేకరుల సమావేశం కానివ్వండి - వేర్వేరు పత్రికలు వేర్వేరు కోణాల్లో - వార్తలు 'వండి వారుస్తున్న' తీరు ఇటీవలి కాలంలో ప్రస్పుటంగా కానవస్తోంది. అలాగే మీడియా . ఏ చానల్ మార్చి చూసినా యిదే వరస.
ఎవరయినా తాము చదివే పత్రిక, చూసే చానల్ వైవిధ్య భరితంగా ఉండాలనే కోరుకుంటారు. మూసపోసినట్టుగా వుండాలనుకోరు. అందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలోని దూరదర్శన్ కు పోటీగా ప్రైవేటు చానళ్ళ శకం మొదలయినప్పుడు జనం ఆ మార్పుని సాదరంగా స్వాగతించారు. కానీ తాము కోరుకున్న మార్పు తాము కోరిన రీతిలో సాగకుండా గాడి తప్పుతున్న పద్దతిని మాత్రం వారు జీర్నిన్చుకోలేకపోతున్నారు.
యిరవై నాలుగ్గంటల నిరంతర వార్తా చానళ్ళ పుణ్యమా అని ఈ రోజు సమాచారం టన్నుల లెక్కల్లో ప్రజలకు చేరుతోంది. ఇంతంత సమాచారాన్ని మనిషి మెదడు ఏ మేరకు హరాయించుకోగలదో ఆ టీవీ చానల్ల వాళ్ళే ప్రసారం చేస్తే బాగుంటుందేమో. ఎన్ని విషయాలు విన్నా మెదడు మాత్రం దానికి వీలయినంతవరకే నిక్షిప్తం చేసుకుని మిగిలింది  వొదిలేస్తుందంటారు. యిదే నిజమయితే- టీవీ చానళ్ళ ద్వారా క్షణక్షణానికీ జనాలకు అందుతున్న సమాచారంలో చాలా భాగం గుర్తుకు రానంతగా వృధా అవుతున్నదనే అనుకోవాలి. విన్నదానికంటే చదివిందీ, చదివినదానికంటే చూసిందీ ఎక్కువ కాలం  గుర్తుండి పోతుందనే సిద్దాంతానికి - ఈ సమాచార విస్పోటనం చిల్లులు  పొడుస్తుందనే అనుకోవాలి. ప్రజలకు చిరకాలం ఏదీ గుర్తుండదు అన్న ధీమాతో - రాజకీయ నాయకులు తరచూ స్వవచనఘాతానికి పూనుకుంటూ ఉండడానికి కూడా బహుశా యిదే కారణమేమో!
01-01-10