4, జులై 2026, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (337 ) : భండారు శ్రీనివాసరావు

 

 

వైట్ హౌస్

 

ఈ మధ్య టీవీ 9 మేనేజింగ్ ఎడిటర్ శ్రీ రజనీకాంత్,  అమెరికా ప్రెసిడెంట్ నివాస భవనం వైట్ హౌస్  విశేషాలను వివరిస్తున్న ఒక వీడియో సాంఘిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వైట్ హౌస్ ప్రాంగణ ప్రవేశం అంత దుర్బేధ్యమైన పనేమీ కాదు. ఇక వైట్ హౌస్ ప్రవేశం అంటారా అది అంత సులభం కాదు, అలాగని అంత కష్టం కూడా కాదు. ముందుగా అనుమతి తీసుకుంటే ఇది సాధ్యమే.

 

నిరుడు ఇదే సమయంలో అమెరికా వెళ్ళినప్పుడు వైట్ హోస్ ని అతి దగ్గరగా చూడగలిగాము. ఆ ప్రాంగణంలో స్వేచ్ఛగా తిరిగాము. ఫోటోలు తీసుకున్నాము. అక్కడ ఎవరూ మీరెవరు అని అడిగిన వాళ్ళు కనిపించలేదు. సీక్రెట్ కెమెరాలు వున్నాయేమో,  సీక్రెట్ పోలీసులు మఫ్టీలో వున్నారేమో తెలియదు. తెలిసిందల్లా అణువణువునా శోధనలు లేవు.  తనిఖీలులేవు. ఎటు తిరిగినా వద్దన్న వాడు లేడు. అడ్డగించిన వాడు లేడు. ఇది నిజమా! మీరు వెళ్ళింది నిజంగా వైట్ హౌస్ కేనా అనే సందేహాలు రావడం సహజం. కానీ ఇది స్వానుభవం. ఎప్పటిదో కాదు, నిరుటి అనుభవమే.  

  

ఆ కధా కదన మెట్టిదనిన.

 

నేను, నా పెద్ద కుమారుడు సందీప్ సియాటిల్ నుంచి బయలుదేరి సాల్ట్ లేక్ సిటీ మీదుగా రాత్రంతా విమానంలో ప్రయాణం చేసి బాల్టిమోర్ ఎయిర్పోర్ట్ చేరుకునే సరికి ఉదయం ఆరుగంటలు. మా మూడో అన్నయ్య కుమారుడు సత్య సాయి వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకు వెళ్ళాడు. రాత్రి నిద్ర బాకీ మొత్తం బుధవారం పగటి వేళ తీర్చుకున్నాము.


ఎందుకంటే మర్నాడు గురువారం, ఆ మర్నాడు శుక్రవారం రెండు రోజులు  హెక్టిక్ స్కెడ్యూలు. మా అన్నయ్య పిల్లలు అమెరికాలో వుండడం వల్ల నా ప్రయాణం నల్లేరు మీద బండిలా సాగుతోంది.
ఒకరకంగా చెప్పాలి అంటే గవర్నర్ గారి పర్యటన మాదిరిగా వుంది. అన్నీ ఎరెంజ్ చేసి కారూ, విమానమూ ఎక్కమంటారు.



గురువారం అంతా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ సీ అంతా కలయ తిరిగాము. Nations' most famous address వైట్ హౌస్ మా ప్రియారిటీ.

సెక్యూరిటీ హడావిడి వుంటుందని అనుకుంటూ వెడితే అక్కడ ముగ్గురు నలుగురు సాయుధ పోలీసులు మాత్రమే కనిపించారు. కనిపించారు కానీ, లోపలకు వెడుతున్న మమ్మల్ని ఎవరు మీరు అని తనిఖీలు చేయలేదు. కనీసం గుర్తింపు కార్డులు చూపించమని కూడా అడగలేదు. సెక్యూరిటీ చెక్ ద్వారాలు లేవు.  ముందుగా ఆన్ లైన్లో బుక్ చేసుకుంటే విజిటర్లను లోపలకు కూడా అనుమతించే ఏర్పాటు వుందట.

విచిత్రం ఏమిటంటే వైట్ హౌస్ కు వెళ్ళే మార్గంలో, దానికి కూతవేటు దూరంలో పేవ్ మెంట్ మీద ఇద్దరు బిచ్చగాళ్లు (హోం లెస్) కనిపించారు. అదే దోవలో దారి పక్కన టోపీలు, టీ షర్టులు అమ్ముకుంటున్న వాళ్ళు కనిపించారు.

అమెరికా పార్లమెంట్, లింకన్ మెమోరియల్, వాషింగ్ టన్ మెమోరియల్ (ఎత్తైన స్థూపం) చూసాము. ఎటు తిరిగినా, ఏమి చేసినా, ఫోటోలు తీసుకుంటున్నా, అక్కడ అడిగేవాళ్ళు, అభ్యంతర పెట్టేవాళ్ళు ఎవరూ లేకపోవడం చిత్రంగా అనిపించింది. అటకాయించే భద్రతా సిబ్బంది మాకు కనబడలేదు.

అమెరికా రాజధానిలో మేము చూసినంత మేరకు , పెద్ద పెద్ద భవనాలు వున్నాయి కానీ, ఆకాశ హర్మ్యాలు కానరాలేదు. దానికి కారణం అడిగితే, వాషింగ్ టన్ మెమోరియల్ స్థూపం కంటే మించి ఎత్తైన భవనాలు నిర్మించరాదని చట్టం వుందని చెబుతారు.

తోకటపా:

వైట్ హౌస్ పైన ఎగురుతున్న అమెరికన్ జాతీయ పతాకం కిందనే నలుపు తెలుపులో మరో జెండా ఎగురుతుంటుంది. యుద్ధాల్లో మరణించిన లేదా ఆచూకీ తెలియకుండా పోయిన అమెరికన్ సైనికుల స్మృత్యర్ధం రూపొందించిన పతాకం అది.
















(ఇంకా వుంది)

3, జులై 2026, శుక్రవారం

ఇదెక్కడి గోల? – భండారు శ్రీనివాసరావు

 

ఉన్నది పోతుందన్న బెదురుతో

అనుకున్నది రాదేమో అన్న అదురుతో

కొట్టుకుంటూ తిట్టుకుంటూ

కొండ కెక్కేవాళ్లము

మీ అండకోరే వాళ్ళము”

ఇదీ ఈనాటి అన్ని అర్హతలు కలిగిన సాధారణ ఓటరు పరిస్థితి” అని సూత్రీకరించాడు ఒకాయన.  

ఇక్కడ మామూలు ఓటరు అంటే నేను కాదు. కంప్యూటర్స్ లో ప్రావీణ్యం వున్న వాళ్ళు కాదు. చదువుకున్న వాళ్ళు కాదు. చదువు లేని వాళ్ళు కాదు. ఇరవై నాలుగేళ్ల క్రితం  2002 లో తాము   నియోజకవర్గంలో, ఏ పోలింగ్ స్టేషన్ లో, ఏ నెంబరు బూతులో ఓటు వేశామో అనే విషయంలో కనీస పరిజానం పరిజ్ఞానం లేని వాళ్ళు వీళ్ళు.  అది ఎలా తెలుసుకోవాలో తెలియని వాళ్ళు. అయినా వాళ్ళు ఓటు వేసే వయసు నుంచీ ఓటు వేయడం తమ కర్తవ్యంగా పాటిస్తున్న వాళ్ళు. కానీ ఏమి లాభం?

గత ఇరవై నాలుగేళ్ళలో భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఊహాతీతంగా, సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందింది.  రాష్ట్రాల విభజన జరిగింది. నియోజక వర్గాలు మారాయి. పోలింగ్ స్టేషన్ల పేర్లు, పోలింగ్ బూత్ ల నెంబర్లు మారాయి.

మొత్తం ఓటర్లలో ఆయా రాజకీయ పార్టీల ఓటర్లు ఇరవై నుంచి నలభయ్ శాతం వుంటారు. అభిమానులు మరో పది శాతం వుంటారు. అసలు ఓటు జోలికే పోని నిర్లిప్త జనం మరో పది శాతం వుంటారు. మరి,  మరో ముప్పయి శాతం మంది రాజకీయ రంగు, సొంటు లేని వాళ్ళు వుంటారు. కానీ ఓటు హక్కు అంటే వారికి  అపరిమితమైన ప్రేమ. అది లేకపోతే తాము చనిపోయినట్టే, జనాభా లెక్కల్లో లేనట్టే అని బాధ పడే రకం.

వీళ్ళే ముందు చెప్పిన :

ఉన్నది పోతుందన్న బెదురుతో

అనుకున్నది రాదేమో అన్న అదురుతో

కొట్టుకుంటూ తిట్టుకుంటూ

కొండ కెక్కేవాళ్లము

మీ అండకోరే వాళ్ళము”

అర్ధం అయిందా ప్రభువులూ!

ఏ సంస్కరణ తీసుకువచ్చినా దాన్ని సామాన్యుల కోణంలో ఆలోచించి రూపొందించాలి.

అప్పుడే ఆ సంస్కరణలు బహుళ జనామోదం పొందుతాయి.  

అయాం ఎ బిగ్ జీరో : (336) : భండారు శ్రీనివాసరావు

 

మా ఊరి ‘శ్రీమంతుడు’
ఏడాదికి ఒకసారైనా మా సొంతూరు కంభంపాడుకు పిల్లాజెల్లా అందరం కట్టగట్టుకుని పొలోమని వెళ్ళేది, అరకొరగా మిగిలివున్న సొంత ఆస్తుల అజమాయిషీ కోసం కాదు, మా కుటుంబంలో మిగిలి ఉన్న ఆత్మీయతలు, ఆప్యాయతలు రుచి చూడడం కోసం.
మాకు జన్మ ఇచ్చిన అమ్మా నాన్నల సంస్మరణార్థం మా మూడో అన్నయ్య ( కీర్తిశేషులు భండారు వేంకటేశ్వర రావు) నిర్మించిన అమ్మా నాన్నల గుడి (అమ్మపర్తి) ని సందర్శించి మాతా పితరులకు నివాళి అర్పించడం కోసం.
బతికి వున్నప్పుడు భారంగా నడిచేకాలం అదేమిటో చనిపోయిన తరువాత పరుగులే పరుగులు.
కింది ఫోటోలో వున్న గుడిలో వున్నది దేవుళ్ళూ దేవతలూ కాదు, మా ఇలవేలుపులు, మా అమ్మా నాన్నలు.
మా నాన్నగారు భండారు రాఘవ రావు నా చిన్నతనంలోనే చనిపోయారు. మా అమ్మగారు వెంకట్రావమ్మ చనిపోయి దాదాపు ముప్పయి యేళ్ళు దాటిపోయాయి.
1993 లో మా అమ్మ హైదరాబాదులో చనిపోయినప్పుడు మొత్తం కర్మ కాండ యావత్తూ, ఇంటిల్లిపాదిమీ కాశీ వెళ్లి అక్కడ జరిపించాము. అది మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారి అభీష్టం మేరకు జరిగింది.
మొదటి మాసికం మా స్వగ్రామం కంభంపాడులో. అప్పటికల్లా, మా మూడో అన్నయ్య భండారు వెంకటేశ్వర రావు ఎంతో శ్రద్ధ తీసుకుని ‘అమ్మా నాన్న’గుడి కట్టించాడు.
కాశీలో కర్మ కాండకు కర్త అయిన మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారూ, తలితండ్రులకు గుడి కట్టించిన మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు ఇద్దరూ ఇప్పుడు లేరు. వారి స్మారక చిహ్నాలు కూడా ఈ గుడి పక్కనే వున్నాయి.
మూడు దశాబ్దాల నాటి ఈ దేవాలయాన్ని మా మూడో అన్నయ్య కుమారులు రఘు, రమేష్, సత్యసాయి ఇటీవల మళ్ళీ తీర్చిదిద్దారు.
మా ఊరు కంభంపాడు అనేది ఇక పాస్ పోర్టులో ప్లేస్ ఆఫ్ బర్త్ కాలం కు పరిమితమయిపోతుందేమో అని ఒక్కోసారి భయం వేస్తుంటుంది. ఒకప్పుడు అమ్మా నాన్నల అబ్దీకాలకోసం ఏడాదికి రెండు సార్లు అయినా సొంతూరుకు వెళ్లి వచ్చేవాళ్ళం. మా మూడో అన్నయ్య పోయిన తరువాత తద్దినాలు కూడా హైదరాబాదుకే మారిపోయాయి.
ఈ నేపధ్యంలో ఇంగ్లండులో (ప్రస్తుతం అమెరికాలో) ఉంటున్న మా అన్నయ్య కుమారుడు సత్యసాయి, ఏడాదికోసారి, సంక్రాంతి నాడు హైదరాబాదులో స్థిరపడిన మా కుటుంబాలను కంభంపాడు రప్పించే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ కార్యక్రమానికి వాడు కర్త అయినప్పటికీ, వాడి సోదరులు రఘు, రమేశ్ ఇద్దరూ కర్మా, క్రియలు.
ఈ విధంగా అయినా ఏడాదికోమారు సొంతూరు చూసే అవకాశం కలుగుతోంది. ఒకసారి అలా వెళ్ళినప్పుడు పరిచయం అయిన వ్యక్తి మా ఊరి ‘శ్రీమంతుడు’.
వీరి పేరు చావా నరసింహారావు. మా చిన్నప్పుడు ఈ పేరుతోనే నాకో క్లాస్ మేట్ ఉండేవాడు. కనుక్కుంటే అతడూ, ఈయనా ఒకరు కారని తేలింది. పిల్లలు ఖమ్మంలో ఏదో వ్యాపారంలో బాగానే స్థిరపడ్డారు. ఈ నరసింహారావు మాత్రం ఊళ్లోనే వుండిపోయి, వ్యవసాయం చేసుకుంటున్నాడు. కష్టపడే తత్వం, నిరాడంబర జీవనం వల్ల నాలుగు రాళ్ళు వెనకేసుకోగలిగారు. అయినా ఊరికి ఏదైనా చేయాలని తపన. లక్షలు ఖర్చు పెట్టి ఊరిలో రామాలయాన్ని కట్టించారు. మేము చదువుకున్న బడి ఇప్పుడు హైస్కూలు అయింది. వేరే ప్రాధమిక పాఠశాల మంజూరు అయితే దానికి ఒక చక్కటి భవనం కట్టి పెట్టారు. ఆ మధ్య వానలకు మా అన్నయ్య ఎప్పుడో కట్టించిన గ్రామ కచ్చేరీ దెబ్బతింటే, దానిని సొంత డబ్బులతో పునరుద్ధరించే కార్యక్రమం నెత్తికి ఎత్తుకున్నారు. ఊళ్ళో టెలి మెడిసిన్ సెంటర్ పెట్టాలని ఓ స్వచ్చంద సంస్థ ముందుకు వస్తే వారికి కావలసినవన్నీ అమర్చి పెట్టడానికి సిద్ధం అంటూ ఈయన ముందే సిద్ధం అయిపోయారు. ఇవన్నీ బాగా డబ్బులు వుండి చేస్తున్న పనులు కావు. సొంత ఖర్చులు తగ్గించుకుని చేస్తున్న వితరణలు.
నిజమైన ‘శ్రీమంతుడు’ చావా నరసింహారావు గారు. సందేహం లేదు.
కింది ఫోటోలు:
అమ్మా నాన్నల గుడి, మా ఊరి శ్రీమంతుడు శ్రీ చావా నరసింహా రావు








(ఇంకావుంది)