2, డిసెంబర్ 2025, మంగళవారం

పెనం నుంచి పొయ్యి లోకి – భండారు శ్రీనివాసరావు

 

కొండ నాలుక్కి మందేస్తే వున్న నాలుక ఊడింది అనే నానుడి చందాన అయిందేమిటి అనిపించింది కొంతసేపటి క్రితం.
మా వీధి రోడ్డు మరమ్మతుల గురించి పోస్టు పెడితే మొత్తం మీద యంత్రాంగం చురుగ్గా కదులుతోందనే భావన కలిగింది, జరుగుతున్న పనులు చూసి. ఆ సంతోషంలోనే సంబంధిత అధికారులను, నాయకులను అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలుపుతూ మరో పోస్టు పెట్టాను.
ఈ రోజు కిందికి వెళ్లి చూస్తే పనివాళ్లు నిర్విరామంగా పనిచేస్తూ కాన వచ్చారు. వారి పిల్లలు అక్కడే ఆడుకుంటూ కనిపించారు. నాకూ వాళ్ళతో కాసేపు ముచ్చట్లు చెప్పాలని అనిపించింది. ఇద్దరూ కవల పిల్లలు లాగా వున్నారు. వాళ్ళ ఫోటో తీసి వాళ్లకు చూపిస్తే , అదోలా చూసారు కొంత ఆశ్చర్యంతో, శ్రీశ్రీ రాసిన ‘మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసాన హరివిల్లు విరిస్తే’ గేయాన్ని గుర్తుకు తెస్తూ.
ఈ లోగా నా ఆనందం ఆవిరయింది. మా పక్క వాటాలో వుండే రవిగారు వచ్చి, రోడ్డు మరమ్మతుల కారణంగా మంచి నీళ్ళ పైపు లైన్ దెబ్బతిని, నీళ్ళు లీక్ అవుతున్నాయని చావు కబురు చల్లగా చెప్పారు.
రోడ్డు వేసేది ఒక డిపార్ట్ మెంటు. వాటర్ పైప్ లైన్ల పర్యవేక్షణ మరో శాఖది. సంబంధిత అధికారులు ఎట్టకేలకు ఫోన్ లో అందుబాటు లోకి వచ్చారు. రోడ్డు కింద మూడు అడుగుల లోపున పైప్ లైన్లు వుంటాయని, మేము అరడుగు లోపలకి కూడా తవ్వలేదని, కాబట్టి ఈ లీకేజీతో మాకు సంబంధం లేదని ఒకరు తేల్చేశారు.
ఈ రోజు నీళ్ళు చాలా తక్కువ ప్రెషర్ తో రావడం వల్ల, పైపు దెబ్బతిన్నదేమో అనే అనుమానం కలిగిందని రవి గారి కధనం. ఈ విషయం చెప్పడానికి రవి గారు లా కాలేజీ దగ్గర వున్న వాటర్ వర్క్స్ ఆఫీసుకు వెళ్ళారు. సంబంధిత ఉన్నతాధికారి లేరు, రేపు వస్తారని వాకబు చేస్తే తెలిసింది. ఆయన నెంబరు నాకిచ్చి రవి గారు ఆయన పనిమీద వెళ్ళిపోయారు.
ఆ అధికారికి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. తెలియని నెంబరు నుంచి కాల్ వస్తే ఆన్సర్ చేయడానికి నా లాగా ఆయన ఖాళీగా వుండే ఉద్యోగం చేయడం లేదు కదా! రెండు మూడు సార్లు చేసి ఊరుకున్నాను.
చిత్రంగా ఆయన నుంచి ఫోన్ వచ్చింది. ధన్యవాదాలు చెప్పి, విషయం వివరించాను. రేపు వాటర్ డే కాదు అని కూడా చెప్పాను. రేపు ఉదయం ఫస్ట్ అవర్ లో మా వాళ్ళు వస్తారు. సమస్య ఏమిటో తెలుసుకుని సరి చేస్తారు అని ఒక చల్లని మాట చెప్పారు.
లోగడే చెప్పాను కదా! పై వాళ్ళు సమస్య వింటే సామాన్యుడు సగం సమస్య తీరినట్టుగా సంతోషిస్తాడు. ప్రస్తుతం నేను అదే సంతోషంలో వున్నాను.
అన్నింటికీ మించి అక్కడ ఆడుకుంటున్న పసి పిల్లల నవ్వులే నాకు మరింత సంతోషాన్ని ఇచ్చాయి.
మన సమస్యలు సరే! ఎప్పుడూ వుండేవే. ఫోన్ చేస్తే కనీసం ఎవరో ఒకరు వింటున్నారు. కానీ ఈ పసిపాపల భవిష్యత్తు సంగతేమిటి? వారి సమస్యలు అనంతం.
వినేవాళ్ళు, చూసేవాళ్ళు, తీర్చేవాళ్ళు వున్నారా!
వుంటే అంతకంటే కావాల్సింది ఏమిటి?






02-12-2025