30, డిసెంబర్ 2021, గురువారం

నిలబెట్టుకోలేని మాట - భండారుశ్రీనివాసరావు

 

ఈ మాట అనగానే రాజకీయుల వాగ్దానాలు గుర్తొస్తే చేసేదేమీ లేదు.

కానీ, నేను చెప్పబోయే 'ఈ మాట' ఎవరికి వారు ఇచ్చుకునేమాట. కొత్త ఏడాదిలో 'ఇది చేస్తాం అది మానేస్తాం' అంటూ మనకు మనమే ఇచ్చుకునే మాట అన్నమాట.

ఈ మాట్లాట మానేసి అసలు విషయానికి వద్దాం.

న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పేరుతో ఎన్నో చేయాలని అనుకుంటాం. అదేం పాపమో ఏడాది మొదట్లోనే వాటికి పురిటి సంధి కొడుతుంది.

చాలామంది మగ పురుషులు ప్రతిఏడాది తమకుతాము ఇచ్చుకునే వాగ్దానం కామన్ గా ఒకటుంది. అదేమిటంటే మందు కొట్టడం మానేస్తాం, సిగరెట్లు తాగడం ఆపేస్తాం అని. కానీ, కామన్ గా జరిగేది ఏమిటంటే మర్నాడు సీను షరా మామూలే. హాల్లో పీఠం వేసుకుని, విలాసంగా సిగరెట్టు వెలిగించి, మందహాసంతో మందు గ్లాసు పట్టుకున్న తరువాత కూడా ఎందుకో ఏమిటో ఈ మాట అస్సలు గుర్తురాదు. ఆవిళ్ళు (ఆవిడలు అనగా భార్యలు) పనిగట్టుకుని గుర్తుచేయబోయినా 'ఆ మాట నిరుడు కదా చెప్పాను' అనేస్తారు అదేదో పూర్వ జన్మ వృత్తాంతం అన్నట్టు. కావున, కావుకావుమని చెప్పేదేమిటంటే, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తరువాత నిలబెట్టుకోలేదెందుకని రాజకీయ నాయకులను నిలదీసే హక్కు మనకు బొత్తిగా లేదని.

మనం మాట తప్పడానికి కూడా ఓ కారణం వుంది. ఈ కొత్త ఏడాది పాతపడి గిర్రున ఏడాది తిరిగి మరో కొత్త ఏడాది మళ్ళీ వస్తుందని.

వాళ్ళు మాట తప్పడానికి కూడా దాదాపు అదే కారణం.

అయిదేళ్ళ తరువాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు మరో మాట ఇస్తే పోలా అని.

కావున, అల్లా ఆలోచించి ఎన్నికల్లో ఇచ్చిన పాత మాటలన్నీ (వోట్ల వొట్లు అన్నమాట) మూటగట్టి మన గట్టునే పెట్టి వెడుతున్నారు.

31-12-2021

29, డిసెంబర్ 2021, బుధవారం

ఎవడబ్బసొమ్మనీ కులుకుతూ తిరిగేవు

 

ఒకరిని అంటే పడే రోజులు కావివి. అంచేత నామీదే వేసుకుని చెబుతున్నాను.
కొన్నేళ్ళ క్రితం అమెరికా నుంచి మా అబ్బాయి వచ్చాడు. చుట్ట పక్కాలకు, స్నేహితులకు కొన్ని కానుకలు పట్టు కొచ్చాడు. వాటి మీద వున్న ప్రైస్ టాగ్స్ తీసేస్తుంటే నేనన్నాను, ‘అలా వుంచి ఇస్తే తీసుకున్న వాళ్లకు వాటి విలువ తెలుస్తుంది కదా’ అని. వాడన్నాడు, ‘ఏదో గొప్ప కోసం తేలేదు, అభిమానం కొద్దీ తెచ్చాను’. నాకేమనాలో తోచలేదు. కానీ భేషజాలకు సంబంధించిన ఒక పాఠాన్ని ఆరోజు మావాడి నుంచి నేర్చుకున్నాను.
ఆరోజు గుడికి వెళ్ళాము. అక్కడ తిరిగే ఫ్యాన్ల మీదా, వెలిగే ట్యూబ్ లైట్ల మీదా వాటిని విరాళంగా ఇచ్చిన దాతల పేర్లు రాసివున్నాయి. చేసిన పనిని గొప్పగా చెప్పుకోవడంలో తాపత్రయమే నాకు వాటిలో కనిపించింది.
ఇంటికి వస్తే టీవీలో సినిమా వస్తోంది. ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా!’ బందీఖానాలో కొరడా దెబ్బలు తింటూ కంచెర్ల గోపన్న (భక్త రామదాసు) పాడుతున్నాడు. తాను భద్రాద్రి రాముడికి, సీతమ్మకు చేయించిన నగల జాబితా వాటి ఖరీదు గురించి వివరిస్తున్నాడు.
ఏవిటో ఒకదానికొకటి సంబంధం లేని అంశాలు అనిపిస్తోంది కదూ. సహజం.
అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాల క్రెడిట్ తమకు దక్కాలంటే తమకు దక్కాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడుతున్న తాపత్రయం నేపధ్యంలో చూస్తే వీటికి ఉన్న సంబంధం బోధపడుతుంది.
ప్రాజెక్టుల మీదా, పధకాల మీదా ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు నిజానికి ఆయా పాలక పార్టీలది కాదు, పన్నులు కడుతున్న ప్రజలది.
ప్రజలు చూసి చూసి విసుగెత్తి ఎప్పుడో అప్పుడు, రామదాసు గారు ఎద్దేవా చేసినట్టు, ‘ఎవడబ్బసొమ్మని కులుకుతూ తిరిగేరు’ అని ప్రభుత్వాలని నిలదీయకుండా జాగ్రత్త పడడం మంచిదేమో!

28, డిసెంబర్ 2021, మంగళవారం

“శ్రీ ఆంజనేయం....”


‘............”

‘శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం.. చెప్పండి అత్తయ్యా! మిమ్మల్నే

‘............’

‘మీరు దండకం చెప్పకపోతే నేను మీ తమ్ముడి గారెతో ఫోన్ చేసి మాట్లాడించను. మరి చెప్పండి! శ్రీ ఆంజనేయం! ప్రసన్నాంజనేయం!..’

‘....ప్రభాదివ్య కాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం  భజే హం పవిత్రం భజే సూర్య మిత్రం భజే రుద్రతేజం భజే బ్రహ్మ తేజం బటంచున్  ....’

అందుకున్న ఆమె  గొంతునుంచి ఆంజనేయ దండకం తుదివరకు సాగిపోయింది.

ఆ స్వరం  పీలగా, సన్నగా, ఎక్కడో నూతిలోంచి వస్తున్నట్టు వున్నా ఉచ్ఛారణ లోపం లేకుండా, ఎనిమిది పదుల ఆ వృద్ధురాలు ఎక్కడా తడబడకుండా ఏ పదం మరచిపోకుండా  ఆలపిస్తుంటే చూడడానికి ఆ దృశ్యం కమనీయంగాను వుంది.  దయనీయంగాను వుంది.

వృద్ధాప్యం పైనపడి ఎక్కడ మతిమరపుకు లోనవుతారో అని ఉదయం సాయంత్రం ఆమె కోడలు దగ్గర వుండి చేయిస్తున్న అసాధారణ  ధారణ కసరత్తు ఇది.

ఒకప్పుడు ఒంటి చేత్తో పదిమందివున్న సంసారాన్ని సరిదిద్దిన ఆ ఇల్లాలు తుర్లపాటి భారతి. ఒక పక్కన కార్పొరేట్ ఉద్యోగాన్ని  వర్క్ ఫ్రం హోం చేస్తూనే,  మరో పక్క వృద్ధురాలు, ఆశక్తురాలు అయిన అత్తగారిని లాలించి, అవసరమయితే బెదిరించి దండకాలు, లలితా సహస్రనామాలు వల్లె వేయిస్తున్న మహిళ ఆవిడ కోడలు స్వర్ణ.

దండకం చెప్పకపోతే మీ తమ్ముడితో ఫోనులో మాట్లాడించేదిలేదంటూ ఆ కోడలు బెదిరించిన ఆ తమ్ముడిని నేను.

ఈ సాయంత్రం నా కొడుకూ, కోడలు నన్ను వెంటబెట్టుకుని సికింద్రాబాదులోని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కానవచ్చిన ఈ దృశ్యం కమనీయంగా ఉన్నట్టా! దయనీయంగా ఉన్నట్టా!

హాట్సాఫ్ స్వర్ణా!




(28-12-2021)

26, డిసెంబర్ 2021, ఆదివారం

నిదురపోరా తమ్ముడా! – భండారు శ్రీనివాసరావు

(ఈరోజు ఆంధ్ర ప్రభ దినపత్రికలో ప్రచురితం)


'కంట నిదుర రాకపోతే పడ్డావనుకో ప్రేమలో' అని ఓ సినీ కవి సూత్రీకరించారు. కాకపొతే ఈ సూత్రం ఒక వయస్సులో ఉన్నవారికి మినహా అన్ని వయస్సులవారికీ వర్తించదనుకోండి.
ఈ సంగతి అలా ఉంచితే -
నిదురించే తోటలోకి తీపి కబురు ఒకటి వచ్చింది. అదేమిటంటే,
‘ఏమిటా మొద్దు నిద్దర మూడు ఝాములు పొద్దెక్కేదాకా’ దాకా అని పెద్దలు సణుగుతున్నా దుప్పట్లో మునగ దీసుకుని పండుకునే వారికోసం, ఏడాదిలో ఒక రోజును అంతర్జాతీయ నిద్రా దినోత్సవానికి కేటాయించారు. అంటే నిద్రాప్రేమికుల దినోత్సవం అన్నమాట. నిద్రతో కొన్ని రోగాలు నయం చేయొచ్చన్న ఓ వైద్య ప్రక్రియను ప్రచారం చేసే ఉద్దేశ్యంతో మొదటిసారి 2008 మార్చి 18 వ తేదీన ఈ అంతర్జాతీయ నిద్రా దినోత్సవాన్ని(వరల్డ్ స్లీప్ డే) నిర్వహించారు.
‘మంచి ఆరోగ్యంతో మర్నాడు మేలుకోవడం కోసం ఈ రాత్రి బాగా నిద్ర పొండి!’ అన్నది నిర్వాహకుల నినాదం. ఇంకా మనవైపు జనంలోకి రాలేదు కానీ నిద్రతో రోగాలు నయం చేసే ప్రక్రియ కొన్ని దేశాల్లో బాగానే ప్రాచుర్యంలో వుందన్నది వారి ఉవాచ..
అన్ని వయస్సుల్లోని వారికి నిద్ర అవసరం గురించి ప్రచారం చేయాలన్నది నిర్వాహకుల అభిప్రాయం. అప్పుడే పుట్టిన శిశువులు, స్కూలు పిల్లలు, ఈడొచ్చిన పిల్లలు, యువతీ యువకులు, మధ్య వయస్కులు, వృద్ధులు ఇలా అన్ని వయసులవారు నిద్రకు తగినంత సమయం కేటాయిస్తే రోగాలబారిన పడకుండా, ఎంచక్కా గుండెలమీద చేయివేసుకుని గుర్రుపెట్టి నిద్రపోవచ్చని వీరు బల్ల గుద్ది చెబుతున్నారు. వీళ్ళంతా విదేశీయులు కనుకా, మన రామాయణాది పురాణాల అవగాహన అంతగా లేని వారు కనుకా, నిద్రకు నిలువెత్తు నిదర్శనం లాటి కుంభకర్ణుడు మొదలయిన పురాణ పాత్రల ప్రస్తావన తీసుకురాలేకపోతున్నారు. లేకపోతె, ఎంత నిద్రపోతే అంత బలం అన్నటాగ్ లైన్ తో ఏకంగా కుంభకర్ణుడి బొమ్మనే వారి 'లోగో' గా పెట్టుకునివుండేవారు. రాక్షసరాజు చిత్రం ప్రచారానికి పనికిరాదని ఎవరయినా అభ్యంతరం చెబితే, మన వేంకటేశ్వరస్వామి వారి అనుంగు సోదరులు వరద రాజస్వామివారు వుండనే వున్నారు. తమ్ములుంవారికి ఆయన భక్త కోటి భక్తి పారవశ్యంతో సమర్పించిన మొక్కుబళ్ల ద్రవ్యాన్ని లెక్కిస్తూ లెక్కిస్తూ అలసిపోయి, కొలమానికను తలగడగా పెట్టుకుని నిద్రలోకి జారిపోయిన వరదరాజస్వామిని మించిన 'నిద్రాదేవత' మరొకరు దొరకడం దుర్లభం కూడా. ఇక్కడా మగపెత్తనమేనా అని గునిసేవారికి లక్ష్మణులవారి అర్ధాంగి ఊర్మిళాదేవి ఉండనే వుంది. మొగుడు లక్ష్మణులవారు సీతారామ సమేతంగా పదునాలుగేళ్ళు వనవాసం చేసినన్నాళ్లు, అన్నేళ్ళు ఏకధాటిగా నిద్రపోయిన ఘన చరిత్ర ఊర్మిళ దేవి ఖాతాలో వుంది.
అయితే, 'నిద్ర థెరపి' అని పిలుచుకుంటున్న ఈ వైద్య విధానంలో అదేపనిగా నిద్రపోవాలని మాత్రమే వైద్యులు చెబుతారని అనుకోవడం పొరబాటు. శరీరాన్ని ఆరోగ్యవంతంగా వుంచుకోవాలని అనుకునేవారు ఎలా నిద్ర పోవాలి, ఎంత నిద్ర పోవాలి, ఎంతసేపు నిద్రపోవాలి అని మాత్రమే వీరు సలహాలు ఇస్తారు. 'నిద్ర పట్టడం లేదు బాబోయ్' అని గాభరా పడిపోయే వారికి నిద్ర మాత్రలతో అవసరం లేకుండా నిద్రపట్టే పద్ధతులు చెప్పి వారిని నిద్రకు దగ్గర చేస్తారు. నిద్దట్లో లేచి ఆ తరవాత మళ్ళీ నిద్రపట్టక జాగారం చేసేవారు, రాత్రంతా నైట్ డ్యూటీలు చేసి మరునాడు నిద్రపట్టక పక్కవారిని నిద్రపోనీకుండా వేధించే వారూ, రాత్రివేళ అంతా నిద్ర పోతున్న సమయంలో నిద్దట్లోనే లేచి నడకలు సాగించే వారూ, ఇదిగో ఈ అమాంబాపతు జనమంతా ఈ థెరపి వైద్యులను ఆశ్రయిస్తుంటారు.
‘నిద్ర పట్టకపోవడమేమిటండీ మరీ విడ్డూరం కాకపొతే!’ అని దవళ్ళు నొక్కుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. ‘మా మూడోవాడు వున్నాడు చూడండీ! పక్కమీద అలా వాలిపోయాడా ఇక అంతే! ఏనుగులతో తొక్కించినా లేస్తే వొట్టు!’ అని వాపోయేవాళ్ళూ వున్నారు. ఇలాటి వారికోసమే, ఓ సినిమాలో శ్రీకృష్ణులవారి చేత ‘మత్తు వదలరా! నిద్దుర మత్తు వదలరా!!’ అనే పాట పాడించారు. ఆ పాట వింటూ మరింత నిద్రలోకి జారిపోయినవాళ్ళు కూడా వున్నారని చెప్పుకునేవారు. ఘంటసాల వారి గాత్రమాధుర్యం అలాటిది మరి.
“నవ్వడం ఓ భోగం! నవ్వలేకపోవడం ఓ రోగం!” అన్నారు జంధ్యాల. అలాగే, ‘నిద్రపట్టడం ఓ భోగం. నిద్ర పట్టకపోవడం ఓ రోగం’ అని దీనికి అన్వయించి చెప్పుకోవచ్చు. వెనుకటి రోజుల్లో మనుషులమీదా, మనసుల మీదా ఇన్ని రకాల వొత్తిళ్ళు లేనప్పుడు వున్నవాడూ, లేనివాడూ హాయిగా ఆరుబయట పడుకుని మరింత హాయిగా నిద్రపోయేవాళ్ళు. కడుపునిండా తిండి తిననివాళ్ళు ఉంటారని వాళ్లకు తెలుసుకానీ, కంటినిండా నిద్రపోని జనం వుంటారన్నది వాళ్లకు బొత్తిగా తెలియని విషయం. ఈనాడు ఇన్ని సౌకర్యాలు వుండికూడా కాసింత నిద్రకు నోచుకోని కోటీశ్వరులు కోట్లలో వున్నారు. నిద్రకోసం 'మందే మందు' అనుకునే మందుబాబులు, నిద్ర మాత్రలు, మత్తు ఇంజెక్షన్లతో నిద్రకు దగ్గర కావాలని ఆరాటపడే గమ్మత్తు బాబులు ఈనాడు కోకొల్లలుగా కానవస్తారు. అందుకే బ్యాంకు బాలెన్సు వున్న కుబేరులకన్నా కంటినిండా నిద్రపోగలిగిన పేదవాడే అధిక సంపన్నుడని చెబుతారు.
నిద్ర సరిగా పట్టకపోయినా, నిద్ర లేమితో బాధపడుతున్నా దాన్ని అలక్ష్యం చేయకూడదు. ఎందుకంటె, పర్యవసానాలు మరిన్ని సమస్యలకు దారితీసే అవకాశం వుంది. 'ఉత్తిష్టత జాగ్రత! మేలుకోండి. మంచిగా నిద్రపట్టే మార్గాన్ని మేలుకునివున్నప్పుడే వెతుక్కోండి. మంచి నిద్రతో చక్కటి ఆరోగ్యాన్ని ఉచితంగా సంపాదించుకోండి. సంపాదన యావలో పడి బంగారంలాటి నిద్రకు దూరం కాకండి’ అని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
చక్కటి కవిత్వం రాయడానికి ఇంటినిండా తాటాకులూ, చేతిలో ఘంటం వుంటే చాలదూ - “నిరుపహతీ స్తలంబు, రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురవిడెంబు, బంగరు టూగుటుయ్యెల” ఎట్సెట్రా ఎట్సెట్రా వుండాలని కవి పెద్దన గారు ఏనాడో ఓ పెద్ద జాబితా కవిత్వరూపంలో చెప్పారు. అలాగే మంచి నిద్ర పట్టడానికి కూడా కొన్ని చిట్కాలున్నాయిట. పడకవేయడానికి ముందు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసి, వేడి వేడి అన్నం తినాలట. నచ్చిన పుస్తకం కాసేపు తిరగేయాలట. పడకా, పడక గదీ ఆహ్లాదకరంగా వుండేట్టు చూసుకోవాలట. రాత్రిపూట గదిలో వెలుతురూ కూడా కంటికి ఇంపుగా వుండాలిట. అందుకే కాబోలు ఈ మధ్య మినుకు మినుకు మని మెరిసే తారలతో కూడిన వినీలాకాశాన్ని నేరుగా పడక గదిలోకి తీసుకువచ్చి గది పైభాగంలో కృత్రిమంగా తీర్చిదిద్దుకునే ఆధునిక పద్ధతులను అనేకమంది ఆశ్రయిస్తున్నారు. పోతే, మత్తు పదార్దాలకూ, మాదక ద్రవ్యాలకూ దూరంగా వుంటే నిద్ర భేషుగ్గా పడుతుందట. కానీ 'మందు కొడితేనే కానీ నిద్రపట్టదు' అని అనుకునేవాళ్లకు ఈ సలహా రుచించకపోవచ్చు. అయితే, వైద్యులు మాత్రం మత్తు పానీయాలవల్ల నిద్ర పట్టదనీ, పట్టినా సరిగా పట్టదనీ వాళ్ల లెక్కలు వాళ్ళు చెబుతున్నారు. నిద్రకు మొహం వాచిన వాళ్లకు వాళ్ల మాట వింటే పోయేదేమీ లేదు, మందు తప్ప.
ముందే చెప్పినట్టు, పొద్దున్నేఆరోగ్యంగా లేవడం కోసం రాత్రంతా హాయిగా నిద్దుర పోండి.



25, డిసెంబర్ 2021, శనివారం

ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గుడిపూడి శ్రీహరి


1975 లో నేను హైదరాబాదు ఆలిండియా రేడియో ప్రాంతీయ వార్తా విభాగంలో అసిస్టెంట్  ఎడిటర్ (రిపోర్టింగ్) గా చేరినప్పుడు, నా ఉద్యోగ బాధ్యత కాకపోయినా వారానికి మూడు రోజులు ఉదయం ఆరుగంటల నలభయ్ అయిదు నిమిషాలకు ప్రసారం అయ్యే ప్రాంతీయవార్తల బులెటిన్ ఎడిటింగ్ బాధ్యతలు చూసేవాడిని. అప్పుడు పరిచయం గుడిపూడి శ్రీహరి.

తిరుమలశెట్టి శ్రీరాములు, డి. వెంకట్రామయ్య, జ్యోత్స్నాదేవి రెగ్యులర్ న్యూస్ రీడర్లు. మాడపాటి సత్యవతి గారు అసిస్టెంట్ ఎడిటర్. అప్పుడప్పుడు  వార్తలు చదివేవారు. వారి వీక్లీ ఆఫ్స్, సెలవు రోజుల్లో వార్తలు చదవడానికి క్యాజువల్ న్యూస్ రీడర్లుగా పీ.ఎస్.ఆర్. ఆంజనేయ శాస్త్రి, సురమౌళి, గుడిపూడి శ్రీహరి గార్లు వచ్చేవారు. అప్పుడప్పుడు అనుకోకుండా గొంతు  పట్టేసిన సందర్భాలు వచ్చేవి. అప్పుడు నేనే  బులెటిన్ పేపర్లు పట్టుకుని వెళ్లి స్టూడియోలో కూర్చుని వార్తలు చదివేసేవాడిని. (ఈ  అనుభవం తర్వాత రోజుల్లో నాకు అక్కరకు వచ్చింది. రేడియో మాస్కోలో వార్తలు చదవడానికి నన్ను ఎంపిక చేసే సమయంలో, వస్తుతః నేను రేడియో విలేకరిని అయినప్పటికీ, , అవసరార్థం నెత్తికి ఎత్తుకున్న ఈ అనుభవం పనికివచ్చింది)

ఉదయం పూట న్యూస్ రీడర్లు చదివే వార్తలను ఎడిట్ చేసి ఇవ్వడం నా బాధ్యత. ఉద్యోగంలో చేరకముందే, స్కూలురోజులనుంచే వీళ్ళు చదివే వార్తలు నేను రేడియోలో  వింటూ ఉండేవాడిని. అలాంటి వాళ్ళతో కలిసి పనిచేసే మహత్తర అవకాశం నాకు రేడియో ఉద్యోగం ఇచ్చింది.

శ్రీహరి సంగతి కదా చెప్పుకుంటున్నాం.

ఆయన వయసులో నాకంటే పెద్ద.  కానీ ఆహార్యంలో నాకంటే కుర్రవాడు. హాలీవుడ్ సినిమా హీరో మల్లే నెత్తిన హ్యాటు. చలవ కళ్ళజోడు, కోటు, బూటుతో మోటార్ సైకిల్ మీద ఆయన రేడియో ప్రాంగణంలో ప్రవేశిస్తూ వుంటే చూడాలి. శ్రీహరి గారి దగ్గర రకరకాల హ్యాట్లు (టోపీలు కాదు,ఇంగ్లీష్, హిందీ   సినిమాల్లో  హీరోలు పెట్టుకునేవి), పలురకాల నల్ల కళ్ళజోళ్లు, కొట్టవచ్చేటట్టు కనబడే ముదురు రంగుల బుష్ కోట్లు, వీటన్నితో అసలు వయసు కంటే చాలా చిన్నవాడిగా కనబడేవాడు. అంచేత నేను కూడా చనువు తీసుకుని ఏకవచనంలోనే సంబోధించేవాడిని. ఆయనా అల్లాగే నన్నూ ఏమోయ్ శ్రీనివాసరావ్ అని పిలిచేవాడు. అలా అరమరికలు లేని స్నేహం మా నడుమ వుండేది. ఇప్పుడు అలాంటి చనువువుందని చెప్పలేను. వయసు పెరుగుతున్న కొద్దీ ఇచ్చ్చిపుచ్చుకునే మర్యాదలు, పలకరింపుల్లో తేడాలు రావడం సహజం.   

ఆహార్యానికి తగ్గట్టే శ్రీహరి వార్తలు చదివే తీరు కూడా విభిన్నంగా వుండేది. బయట కులాసాగా తిరిగినట్టే స్టూడియో లోపల కూడా బేఫికర్ గా వార్తలు చదివేవాడు. వార్తలు చదువుతూ గొంతు సవరించుకోవడం, ఊపిరి పీల్చి వదిలిన ధ్వని ఇవన్నీ మా రేడియో వాళ్లకి నచ్చవు. అదే రిపోర్టులో రాసి ఆయనకు చెప్పమనే వారు. నేను చెబితే ఆయన నవ్వి ఇలా అన్నాడు.

‘మనం పోటీ ప్రపంచంలో ఉన్నాము. ఇలా అనేవాళ్ళు ఎప్పుడయినా బీబీసీ వార్తలు విన్నారా! వాయిస్ ఆఫ్ అమెరికా వార్తలు విన్నారా! అక్కడ ఇటువంటివి సహజంగా తీసుకుంటారు. నిజానికి అలా చేయడం వల్ల ఈ ప్రోగ్రాము ముందుగా రికార్డు చేసింది కాదు, లైవ్ ప్రోగ్రాం అని శ్రోతలకు తెలుస్తుంది కూడా

ఆయన చెప్పింది నాకు సరిగ్గానే అనిపించింది.

ఈ మధ్యనే శ్రీహరికి భార్యావియోగం కలిగింది. ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం అన్నమాట.



       

ఏదిష్టం? – భండారు శ్రీనివాసరావు

గయలో శ్రాద్ధకర్మలు చేసిన పురోహితుల వారు అడుగుతున్నారు, మీకేది ఇష్టమో దాన్నిఇక్కడ వదిలిపెట్టండి అని.

కళ్ళల్లో నీటిపొర. ఎదురుగా వున్న మనుషులు మసగ్గా కనిపిస్తుంటే, అంతఃచక్షువులకు ఎప్పటెప్పటి సంగతులో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

చిన్నతనంలో తనకు నెయ్యి అంటే తగని ఇష్టం. చారడు నెయ్యి అరచేతిలో పోస్తే కాని ముద్ద ముట్టేవాడు కాదు. చిన్ని చిన్ని వేళ్ళని దగ్గరికి  ముడుచుకుని, అరచేతిని గుంటగా చేసి అది నిండేదాకా నెయ్యి పోయాలి. చేతి వేళ్ళ సందులనుంచి జారిపోయి గుంట నిండేది కాదు. మధ్యతరగతి సంసారాల్లో ఇలా నేతివడ్డన ఎలా సాధ్యం. అయినా నేతి కోసం గుక్క పట్టి ఏడిచేవాడు. ఇది పని కాదనుకుని చిన్న వెండి గిన్నె చేయించి అందులో నెయ్యి నింపి తన కంచం పక్కన పెట్టేవాళ్ళు.  అదేమిటో కొన్నేళ్ళకు ఆ ఆలవాటు అదే పోయింది. నేతి మీది ఇష్టం తగ్గిపోయింది.

ఇలాగే ఎన్నో ఇష్టాలు జీవితంలో భాగమై అవే మెల్లగా తప్పుకున్నాయి.

ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత ఏది ఇష్టం అంటే ఏమి చెప్పాలి?

మీరు ఇప్పటిదాకా నాచేత నువ్వులూ, నీళ్ళూ తర్పణాలు వదిలించిన నా భార్య అంటే ఇష్టం మాత్రం అలాగే మిగిలిపోయిందని, కానీ వదలడానికి వీలు లేకుండా ముందే ఆమె నన్ను వదిలిపోయిందని ఆయనగారితో  ఎలా చెప్పాలి?     

వాజ్ పాయ్ జ్ఞాపకాలు – భండారు శ్రీనివాసరావు

 

అరవై అయిదేళ్ళ పైమాటే. అప్పటికి ఆ పార్టీ పేరు జనసంఘ్. ఇప్పుడు బీజేపీ. ప్రమిదె గుర్తు. బెజవాడలో ఎన్నికలప్పుడు ఏదో ఒక మూల గోడలమీద ఈ గుర్తు కనబడేది. కానీ జనం గుర్తు పెట్టుకునే వాళ్లు కాదు. ఆరోజుల్లో, ఢిల్లీ నుంచి ఒక పెద్దాయన వస్తున్నాడు, మునిసిపల్ స్కూలు ఆవరణలో సాయంత్రం మీటింగు అంటూ వూళ్ళో టముకు వేసారు. తెలిసీ తెలియని వయసు. అయినా పెద్దవాళ్ళతో కలిసి వెళ్లాను. కాసేపటి తరువాత ఆ వచ్చినాయన మాట్లాడడం మొదలు పెట్టాడు. శుద్ధ హిందీ. ఒక్కరికీ అర్ధం అయినట్టు లేదు. మాటల జడివాన మొదలయింది. పిడుగులు పడ్డట్టుగా ప్రసంగం సాగింది. ఒక్క ముక్క అర్ధం కాకపోయినా స్పీచ్ అంటే ఇలా వుండాలి అని అనిపించింది. వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఆయనకు అప్పటికప్పుడే అభిమానులు అయిపోయారు. ఆయన ఎవరో కాదు, తదనంతర కాలంలో దేశానికి అయిదేళ్ళు సుస్తిర పాలన అందించిన ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్.
భాష అర్ధం కాని వారిని సయితం తన వాగ్ధాటితో కట్టిపడేసిన ఆయనకు చివరి రోజుల్లో మాట పడిపోవడం ఏమిటో విధి వైచిత్రం కాకపొతే.
చనిపోయి ఏళ్ళు గడిచిపోయినా ఇప్పటికీ ప్రజల మనస్సులో జీవించేవున్న వాజ్ పాయ్ జయంతి ఈరోజు.

24, డిసెంబర్ 2021, శుక్రవారం

ఉచిత సలహా – భండారు శ్రీనివాసరావు

 నిర్మాతల గురించి హీరోలు, ధియేటర్ల వాళ్ళని గురించి నిర్మాతలు, ప్రేక్షకులను గురించి సినిమాహాలు వాళ్ళు, మొత్తం సినీ పరిశ్రమ  బాగోగులు గురించి ప్రభుత్వాలు,  సానుకూల, సానుభూతి దృక్పథం అలవరచుకోవడం ఒక్కటే పరిష్కారం అనిపిస్తోంది. ఎవరి గిరిలో, బరిలో వాళ్ళుంటే సమస్య ఇంకా బిగుసుకుపోవడం తప్ప జరిగేది ఏమీ వుండదు.

అన్నింటికన్నా ముఖ్యం ఈ సమస్యను రాజకీయ కోణం నుంచి చూడకపోవడం. రాజకీయం ప్రవేశించిన తర్వాత ఏ సమస్యా పరిష్కారం అయిన దాఖలాలు తక్కువ.

ఎవరో మిత్రుడు అన్నట్టు ఇది ఉచిత సలహానే. ఎందుకంటే ధియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడం మానేసి మూడేళ్లు అయింది. సమస్యతో నేరుగా సంబంధం లేదు కాబట్టి ఎన్ని సలహాలు ఇచ్చినా ఇవ్వవచ్చు.

(24-12-2021)

ఉబుంటు – భండారు శ్రీనివాసరావు

మీరు కరక్టుగానే చదివారు. ఉబుంటు

దక్షిణాఫ్రికాలోని కొండజాతి జనుల భాషకు చెందిన పదం ‘ఉబుంటు’
దీనికి అర్ధం తెలుసుకునే ముందు ఒక ఉదంతం గురించి చెప్పుకుందాం.
పాశ్చాత్య ప్రపంచానికి చెందిన పరిశోధకుడు ఒకడు ఆ కొండ జాతి ప్రజలు నివసించే ప్రాంతానికి వెళ్ళాడు. ఆడుకుంటున్న కొంతమంది పిల్లలు కనిపించారు. వారిని ఆటపట్టించాలని అనిపించిన ఆ పెద్దమనిషి వారిని దగ్గరకు పిలిచాడు. ఒక స్వీట్ ప్యాకెట్ దూరంగా వున్న చెట్టు మొదట్లో వుంచి చెప్పాడు వారితో.
“మీలో ఎవరు ముందుగా పరిగెత్తుకుంటూ వెడితే వారిదే ప్యాకెట్టు”.
పిల్లలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. వెంటనే ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు. అంతా కలిసి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ స్వీట్ ప్యాకెట్ అందుకున్నారు.
తెల్ల మనిషి అది చూసి తెల్ల మొహం వేశాడు. అడిగాడు పిల్లల్ని ఎందుకలా చేసారని. వారు చెప్పిన జవాబే ఈ ‘ఉబుంటు’.
వారి భాషలో ఉబుంటు అంటే మానవత్వం. ఒకరి కోసం మరొకరు అనే అర్ధంలో వాడతారు.
కొండకోనల్లో నివసించేవాళ్ళు అయితేనేం నాగరీకులకంటే వారి గుండె కొండ కంటే పెద్దది.

23, డిసెంబర్ 2021, గురువారం

సింహం తల మనిషి శరీరం


పీవీ గారి వంటి గొప్పవారి గురించి నా బోటి చిన్నవాళ్ల జ్ఞాపకాలు కొన్నే వుంటాయి. అదే అదృష్టం అనుకుని మననం చేసుకుంటూ వుండాలి.



మరణించడానికి కొన్ని నెలలముందు, శ్రీ పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి యెలా వుండేదో ఒక విలేకరిగా నాకు తెలుసు. ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా అధికారులు, అనధికారులు, మందీ మార్బలాలు, వందిమాగధులు, ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు, ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.

నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్ ఆర్వీవీ కృష్ణారావు గారు, గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్నతరవాత, రాజ్ భవన్ గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. ‘పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అక్కడవున్న భద్రతాదికారిని అడిగాము. అతడు తాపీగా 'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.

పెట్టిన తరవాత, మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్ మాచ్ చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే, మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు నా వైపు చూస్తూ, 'మీ అన్నయ్య పర్వతాలరావు ఎలావున్నాడయ్యా !' అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం, పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు, రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేశారు. అసలు పీవీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ పీవీగారి గొప్పతనం. ఆ తరవాత కూడా ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు ‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది, కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల, కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత, కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము.
అంతకుముందు పీవీ గారిని మరోసారి ఢిల్లీలో కలిసాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత ఉచ్ఛస్థానంలో వున్న పీవీ గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నిశ్శబ్ధం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే, 'పీవీ గారిని కలవడానికి వీలుంటుందా' అని హిందీలో అడిగాను. అతగాడు బంగ్లాలో ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు.
'పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది' అన్నారు ఆయన తన మొహంలో భావాలు ఏమీ తెలియకుండా.
'మాస్కో ఎందుకయ్యా వేరే దేశంలో మీ రేడియో ఉద్యోగాలు లేవా ? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలావుంటావు' అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ గారు, నేను వూహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను.

పీవీ గారు మాజీ ప్రధానమంత్రిగా పాల్గొన్న ఒక సదస్సు హైదరాబాదులోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగింది.
మధ్యాన్నం భోజన విరామ సమయంలో విలేకరులు ఒక్కొక్కరుగా కలుస్తున్నారు. ఆలిండియా రేడియో ప్రాంతీయ విభాగంలో పనిచేసే ఆర్వీవీ కృష్ణారావు గారు నేనూ కాస్త వెనగ్గా నిలబడివున్నాం.
చివరికి ఆయనే మమ్మల్ని దగ్గరకు పిలిచారు.
‘ఏమయ్యా కృష్ణారావూ. ఢిల్లీలో పద్మనాభరావుకి కూడా చెప్పాను. ఏవయ్యా నా టేపులు?”
పీవీ గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తెలుగులో అనేక రేడియో ప్రసంగాలు చేశారు. వాటిని గురించి చేసిన వాకబు ఇది.
కృష్ణారావు గారు ఏదో చెప్పారు.
ఆయన నా వైపు తిరిగారు.
‘మీ అన్నయ్య (కీర్తిశేషులు పర్వతాలరావు గారు) పుట్టపర్తిలో ఉంటున్నాడట కదా! ఏం చేస్తున్నాడు?”
‘నరసింహావతారం గురించి పుస్తకాలు రాస్తున్నాడు’
‘అలా అయితే నేనడిగానని చెప్పు. మనిషి శారీరకంగా సింహం కంటే బలహీనుడు. ఆ అవతారంలో సింహం తలా, మనిషి శరీరం ఏమిటో రాయమని చెప్పు’
నమస్కారం పెట్టి మేము వచ్చేశాము.

పీవీ గారి సందేహానికి మా అన్నయ్య ఆ పుస్తకంలో చాలా పెద్ద వివరణే ఇచ్చారు.

ఓపిక ఉన్న వారు చదువుకోవడానికి పూర్తి పాఠం ఇస్తున్నాను.

హిరణ్యకశిపుడు స్వతహాగా మహాబలుడు. దానికి తోడు తపశ్శక్తితో పొందిన వరాలు. అతడిని చంపేందుకు వెళ్ళే విష్ణువు నర సింహ మిశ్రమ రూపం ధరించాల్సి వుంటుంది. అలాంటప్పుడు రెంటిలోనూ గల బలమైన అంశాలనే స్వీకరించాల్సి వుంటుంది. నరుని మేధ సింహపు మేధ కన్నా చురుకు. సింహపు శరీరం నరుడి దేహం కన్నా బలమైనది. కనుక నరుని తల, సింహపు శరీరం కలిస్తే రెండు బలమైన అంశాలను స్వీకరించినట్టు అయ్యేది. కాని విష్ణువు ఈ అవతారానికి సింహపు తల, మనిషి శరీరం ఎన్నుకున్నాడు. రెండు బలహీనమైన అంశాల మిశ్రమం అది. మరి విష్ణువు అలా ఎందుకు చేశాడు? కొందరు కరాటే ఉదాహరణ చెప్పారు. కరాటేలో చేయి బలహీనంగా వుండడంకన్నా ఆ చేయిని ప్రయోగించడంలో చూపే వేగం, గురి, ఏకాగ్రత ప్రధానం. కనుక బలహీనమైన శరీరాన్ని ఎన్నుకున్నా ఇబ్బంది లేదని వారి అభిప్రాయం. అలా అనుకున్నా అట్టి ఏకాగ్రత నరుని మేధ సాధించినట్టు సింహపు మెదడు సాధించగలదా! మానసిక పటుత్వాన్ని సాధించడం నరునికే సాధ్యం కాని సింహానికి కాదు. జంతువు కావాలంటే సింహమే ఎందుకు? జిత్తులమారి నక్క తల అయితే ఇంకా ఎక్కువ ప్రయోజనకారిగా వుండేదేమో! మరి స్వామి సింహపు తలనే ఎందుకు ఎన్నుకున్నట్టు!

హిరణ్యకశిపుడు యావత్ ప్రకృతిని తన కనుసన్నలలోకి తెచ్చుకున్నాడు. అసలు హిరణ్యకశిపుడు అంటే అర్ధం ఏమిటి? కళాప్రపూర్ణ వేదుల సూర్యనారాయణ శర్మగారీ విషయాన్ని తమ ‘అంతరార్ద భాగవతం’ లో చెప్పారు. హిరణ్యం అంటే ప్రకృతి (బంగారం కూడా). కశిపుడు అంటే హింసించేవాడు. ప్రకృతిని తన దోవన పోనీయకుండా, తాను చెప్పిన దోవనే అది నడవాలని కట్టడి చేసినవాడు. ప్రకృతిని అలా నిర్బందించడమే హింస. ఆ రాక్షసుడి కట్టడిలో ప్రకృతి విలవిలలాడిపోయింది.

అస్మదీయంబగు నాదేశమున గాని

మిక్కిలి రవి మింట మెరయ వెరచు’

అని ప్రగల్భాలు పలికిన వాడు ఆ రాక్షస రాజు.

అలాగే ఇంద్రుడు, యముడు, అగ్ని, వాయువు అంతా గడగడలాడారు.

పృధు చక్రవర్తి కాలంలో కూడా ప్రకృతి అన్నివిధాల ఆయనకు అనుకూలంగా నడిచింది. దున్నకుండానే పంటలు పండేవి. పృధువు పట్ల భక్తీ గౌరవం వల్లనే కాని చండశాసనుడు అనే భయంతో కాదు. రెంటికీ ఎంత తేడా! నియంతృత్వానికి, ఆదర్శ ప్రజాస్వామ్యానికి ఉన్నంత తేడా.

అలా ప్రకృతిని తన కనుసన్నల్లో పెట్టుకోవడం ఎందుకు? ఇంద్రియ సుఖాలను అనుభవించడానికే. ప్రకృతి అందరికీ అవసరమైన మేరకు ఇస్తుంది. కానీ ఆశ పడ్డంత కాదని గాంధీజీ చెప్పారు.

నరసింహావతారంలో విష్ణువుకి మనిషి తల పనికి రాకపోవడానికి ఈ ఆబే (అత్యాశే) కారణం. మనిషికి ‘ఆశాపాశము తా కడున్ నిడుపులేదంతంబు’. అట్టి ఆశలమారి మేధ ఆబను, కక్కుర్తిని మరింత పెంచుతుంది. తృప్తి చెందదు. సింహం అలా కాదు. అది మృగరాజు. దానికి లేకితనం, పేరాశ లేవు. ఏ పూటకు ఎంత అవసరమో ఆ పూటకు అంతే వేటాడి సంపాదించుకుంటుంది. ఆ పైన దాచుకోవడం ఎరగదు. రేపుమాపు అన్న చింత దానికి లేదు. అన్ని జంతువులూ అలా కాదు. పులీ, చిరుతపులి కూడా వేటాడిన జంతువును దాచుకుని తింటాయి. సింహానికి అది పనికిరాదు. తన కడుపు నిండితే పక్క నుంచి పోయే జంతువులను కూడా అది పట్టించుకోదు. రేపుతో లంకె పెట్టుకొని తత్వం. ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అంతకన్నా నిస్సంగత్వం లేదు. ఇలాంటి తత్వం సమాజానికి ఎంతో అవసరం. అట్టి సంస్కృతి వుంటే ప్రస్తుత పర్యావరణం ఇంత దెబ్బతినేది కాదు. అనేక పక్షి, జంతుజాలాలు అంతరించిపోయేవి కావు. మనిషిలో ఆబ పెరగడం వల్లనే ఈ వినాశనమంతా.

అట్టి ఆబ (GREED) లేని సింహం తలను స్వామి ఎంచుకోవడం హిరణ్యకశిపుని ఆబ (GREED) కు వ్యతిరేకంగా వుండే సమాజాన్ని ఆవిష్కరించడం కోసమే. మనిషి శరీరాన్ని ఎంచుకున్నా దాని బలహీనత వల్ల స్వామికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. స్వామిది సంకల్పబలం. నిజానికి తాను ఎలాంటి చావు చావాలో హిరణ్యకశిపుడే కోరుకున్నట్లయింది. అతడు కోరిన కోర్కెలే, అతడు పెట్టిన నిబంధనలే అతడిని సంహరించే వ్యక్తి ఎలా ఉండాలో, ఏ సమయంలో ఎక్కడ ఎలా అతడిని చంపాలో నిర్దేశించాయి”

(ఓం నమో శ్రీ నారసింహాయ, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్య చరిత్ర, ప్రధమ సంపుటం, రచన: కీర్తిశేషులు భండారు పర్వతాలరావు, సమర్పణ: శ్రీ వేదభారతి, హైదరాబాదు)

 

 

 


21, డిసెంబర్ 2021, మంగళవారం

మంచి ఎమ్మెల్యే – భండారు శ్రీనివాసరావు

 మంచి ఎమ్మెల్యేనా! అలాంటి వారు కూడా ఉంటారా అనకండి. ఇప్పటి సంగతి నాకు తెలియదు. వున్నారేమో! కానీ నేను విలేకరిగా పనిచేసే రోజుల్లో కొంతమంది  తటస్థపడ్డారు. ఒకరు బత్తిన సుబ్బారావు గారు, మరొకరు చప్పిడి వెంగయ్య గారు. ఇంకొకరు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. వేరొకరు చిక్కాల రామచంద్ర రావు గారు. ఇంకా వున్నారు కానీ ప్రస్తుతానికి ఈ నలుగురి గురించి చెప్పుకుందాం.

బత్తిన సుబ్బారావు గారు గోదావరి జిల్లానుంచి శాసన సభకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఒకానొక కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. అతి పేద దళిత కుటుంబం నుంచి మంత్రి స్థాయికి ఎదిగినా ఆయన ఆర్ధిక పరిస్తితిలో ఏమార్పూ లేదు. ఆయన తల్లిగారు కూలీపని చేసుకుని జీవనం గడిపేవారు. రాజ్యసభ ఎన్నికల్లో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా డబ్బు తీసుకుంటారని ప్రచారం సాగే రోజుల్లో, అనారోగ్యానికి గురై, నిమ్స్ ఆసుపత్రిలో వుండి కూడా వీల్ చైర్ మీద వెళ్లి పైసా తీసుకోకుండా ఓటు వేసి వచ్చారు. చివరకు ఎంతటి గర్భదారిద్య్రంలో కూరుకు పోయారంటే చనిపోయినప్పుడు దహనం చేయడానికి డబ్బులు లేని దౌర్భాగ్య స్తితి.

ఈ విషయాన్ని అప్పటి బీజేపీ శాసనసభ్యులు శ్రీ వేమా, మరికొందరు గోదావరి జిల్లాల సభ్యులు అసెంబ్లీలో ప్రస్తావిస్తే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి ప్రభుత్వం తరపున కొంత ఆర్ధిక సాయం ప్రకటించారు.

అలాగే, ప్రకాశం జిల్లాకు చెందిన చప్పిడి వెంగయ్య గారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ అభ్యర్ధిగా ఆయన 1994 లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చాలా సింపుల్ గా వుండేవారు.

‘ఎన్నిసార్లు మొత్తుకున్నా ఫలితం వుండడం లేదు, కనీసం ఈసారయినా నా పేరు సరిగా రాయండయ్యా’ అని అసెంబ్లీ కవరేజ్ కి వెళ్ళే పాత్రికేయులతో అనేవారు సరదాగా. ఆయన పేరు చప్పిడి వెంగయ్య. వెంగయ్య అయివుండదు, అది వెంకయ్య అయివుంటుందని  హైదరాబాదు రిపోర్టర్లు  తామే తీర్మానించుకుని, చప్పిడి వెంకయ్య అని రాసేవారు.

వెంగయ్య గారి ఎన్నికల ప్రచారాన్ని కవర్ చేయడానికి హైదరాబాదు నుంచి డెక్కన్ క్రానికల్ తరపున సుశీల్ కుమార్ (ప్రస్తుతం హైదరాబాదు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నతోద్యోగంలో వున్నారు) ప్రకాశం జిల్లాకు వెళ్ళారు. వెంగయ్య గారి ఇల్లు చూసి ఆశ్చర్యపోయారు. రెండే గదులు. టీవీ కాదుకదా, కనీసం రేడియో కూడా లేదు. కాలినడకనే ప్రచారం. అయినా గెలిచారు. కాదు ప్రజలు గెలిపించారు. సుశీల్ ఆ రోజుల్లో వెంగయ్య గారి గురించి క్రానికల్ లో రాసిన రైటప్ చాలా సంచలనాన్ని సృష్టించింది.

మరోసారి ఎన్నికల్లో పార్టీ ఫండ్ స్వయంగా అందచేయడానికి ఒక మంత్రిగారు వెళ్ళారు. కానీ ఆయన పైసా కూడా తీసుకోలేదు. చిత్రం! ఆ ఎన్నికల్లో ఓడిపోయారు’

రాజ్యసభకు ఎన్నికయిన శ్రీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ చాలా సౌమ్యులు. రేడియో విలేకరిగా నాకు కొంత పరిచయం వుంది. గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన రోజుల్లో కూడా ఆయన నిరాడంబరంగా వుండడం నాకు తెలుసు. వై.ఎస్.ఆర్.కు, ఆయన కుటుంబానికి బాగా కావాల్సిన వారు. గతంలో జగన్ మోహన రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేసిన జగన్ పార్టీలో చేరిపోయారు.

రాజ్యసభకు ఎన్నిక అయిన అనంతరం సుభాష్ చంద్ర బోస్ మాట్లాడిన విషయాలు విన్నప్పుడు తనని రాజకీయాల్లో ప్రోత్సహించిన వారిని ఆయన ఎలా గుర్తుంచుకున్నదీ తెలిసి ఆశ్చర్యం వేసింది. ఇలాంటి సందర్భాలలో ఎవరయినా సరే, ముందు తమ పార్టీ నాయకుడిని పొగడ్తలతో ముంచెత్తిన తర్వాతనే ఇతరులను తలుచుకుంటారు.

కానీ ఆయన ముందుగా తలచుకున్న రాయవరం మునసబు ఎవరన్నది ఈ తరం వారికి తెలియదు. ఆయనే తనకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పించారన్నారు. ఒకానొక కాలంలో రాయవరం మునసబు అంటే జిల్లామొత్తానికి తెలిసిన పేరు. ఆయన జిల్లా దాటి రాజకీయాలు చేసింది లేదు. కానీ రాష్ట్ర రాజధానివరకు ఆయన ఎవరో తెలుసు.

తర్వాత తలచుకున్న పేరు వై.ఎస్. ఆయన తనను రాజకీయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ని చేశారని సుభాష్ చంద్ర బోస్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆ పిదప వై.ఎస్. జగన్ వల్లనే తనకు ఇన్ని రాజకీయ పదవులు వచ్చాయని చెప్పుకొచ్చారు.

పదవిని అనుభవించిన రోజుల్లో నాయకుడే తమ అధినాయకుడని ప్రస్తుతించి పదవి పోగానే అతడెవరో తెలియనట్టుగా ప్రవర్తించే రాజకీయ నాయకులు కోకొల్లలుగా ఉన్న నేటి రాజకీయాలు మాత్రమే తెలిసిన ఈనాటి తరానికి ఈ రకం నాయకులు నిజంగా కొత్తే.

ఈ విధేయతలు అనేవి పార్టీ వ్యవహారాలు. అవి పక్కన పెడదాం. మరి ఆయన నిరాడంబరత్వం. దాన్ని గురించి తప్పనిసరిగా చెప్పుకోవాలి.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పిల్లి సుభాష్ చంద్ర బోస్ మంత్రిగా వున్నప్పుడు మా అన్నయ్య భండారు రామచంద్రరావు గారు మా వదినె గారితో కలిసి వైజాగ్ నుంచి హైదరాబాదు రైల్లో వస్తున్నారు. ఇద్దరికీ ఏసీ సెకండ్ క్లాసులో అప్పర్ బెర్తులు దొరికాయి. కింద బెర్తులు ఖాళీగా వుంటే, టీసీని అడిగారు. రాజమండ్రిలో ఒక మంత్రి గారి కోసం రిజర్వ్ అయ్యాయి, లాభం లేదు అన్నాడాయన. మంత్రి గారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వుంటుంది కదా, ఈ సెకండ్ ఏసీ ఎందుకు అనేది మా అన్నయ్య అనుమానం.

రాజమండ్రి వచ్చేసరికి తొమ్మిది దాటింది. మంత్రిగారు భార్యతో కలిసి బోగీలోకి వచ్చారు. సామాన్లు సర్దుకున్న తరువాత ఆయన మా అన్నయ్యని అడిగారట. మీ మిసెస్ పైకి ఎక్కి పడుకోవడం కష్టం, ఆవిడ, మా ఆవిడ కింద బెర్తుల్లో పడుకుంటారు, మనం పైన సర్డుకుందాం అన్నారట ఆ మంత్రిగారు. ఇది విని మా అన్నయ్య ఎంతో ఆశ్చర్యపోయారు.

ఆయన ఎవరో కాదు, ఈనాటి రాజ్యసభ సభ్యులు అయిన పిల్లి సుభాష్ చంద్ర బోస్ గారు.

మంత్రిగారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వున్న మాట నిజమే. కానీ మా మేడం గారు ఆయనతో ప్రయాణం చేస్తే మాత్రం సెకండ్ ఏసీ బుక్ చేయమంటారు”

మర్నాడు ఉదయం సికిందరాబాదులో రైలు దిగిన తర్వాత మంత్రిగారి పియ్యే మా అన్నగారి అనుమానం తీర్చారు.

మరో ఉదంతం చెప్పుకుందాం.

మంత్రిగారు ఆఫీసులో రివ్యూ మీటింగులో వుండగా ఇంటర్ కం మోగింది.

అవతల పియ్యే.

సార్! ఇంటి నుంచి ఫోన్, మేడం గారు లైన్లో వున్నారు’

మంత్రిగారు విసుగ్గా ఫోన్ తీసుకున్నారు. మరింత విసుగ్గా అన్నారు.

ఎన్ని సార్లు చెప్పాను, ఆఫీసులో మీటింగులో వున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని. ఇంతకీ ఏమిటంత అర్జంటు పని’

‘........’

కారు పపించాలా! ఎందుకు ఈమీటింగు కాగానే నేనే ఇంటికి వస్తున్నాను. ఈ అరగంటలో కొంపలేం మునగవ్. డ్రైవర్ అటూ ఇటూ రెండు సార్లు తిరగడం దండగ. నేను వచ్చాక వెడుదువ్ కాని’

ఆరోజు మంత్రి ఛాంబర్లో దివాలా తీసిన ప్రూడెన్షియల్ సహకార పట్టణ బ్యాంకు గురించిన మీటింగ్ జరుగుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారులయిన సహకార శాఖ కార్యదర్శి శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సహకార శాఖ రిజిస్ట్రార్ శ్రీ గార్గ్, ఆ బ్యాంక్ లిక్విడేషన్ వ్యవహారాలను చూడడానికి నియమితులయిన ఎస్బీఐ రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ అయిన మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు అందులో పాల్గొంటున్నారు.

నిజానికి మంత్రులు ఇంటి పనులకోసం అధికారిక వాహనాలను వాడుకోవడం అనేది సామాన్యంగా జరిగే విషయమే. అలాటి వాటిని చాలా సాధారణ విషయంగా తీసుకోవడానికి జనం అలవాటుపడ్డారు. ప్రతి మంత్రికీ ఆయన శాఖ కిందికి వచ్చే కార్పొరేషన్ వాళ్ళే వాహనాలు ఒకటో రెండో అదనంగా సమకూర్చడం అనేది బహిరంగ రహస్యమే. మరి ఇదేమిటి ఈ మంత్రిగారు భార్య కారు కావాలంటే ఇలా విసుక్కుంటున్నారు?

ఆయన అంతే! ఆయన మంత్రే కాని అందరివంటి వాడు కాదు. ఆయన పేరే చిక్కాల రామచంద్రరావు. అనేకమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవులు నిర్వహించారు. మంత్రి అయిన తర్వాత కూడా ఆయన తన సొంత అంబాసిడర్ కారునే వాడేవారు. ప్రభుత్వం ఇచ్చే అలవెన్స్ వాడుకునేవారు.

సింపుల్ గా వుండడం ఆయనకు ఇష్టం. మంత్రిగా వున్నప్పుడు ఈ ఇష్టాన్ని మహబాగా తీర్చుకున్నారు.