26, జనవరి 2020, ఆదివారం

కొత్త రాజధానికి ఖర్చు ఎంత అవుతుందో తెలుసా ? | Latest Updates On Ap 3 Cap...



సుమన్ టీవీ ఛానెల్ లో ఇంటర్వ్యూ ఇచ్చి చాలా కాలమైంది. ఇన్నాల్టికి కళ్ళపడింది.
కర్టెసి : సుమన్ టీవీ రజని

24, జనవరి 2020, శుక్రవారం

Political Analyst Bhandaru Srinivas Rao Analysis on Pawan Kalyan Words | ...





ముప్పయి వేలమంది చూశారని అంటూ మిత్రుడు ఒకరు ఈ పాత వీడియో క్లిప్పింగ్ పంపారు. వారికి నా ధన్యవాదాలు

రేడియో విన్న రాష్ట్రపతి


కేశవాయనమః
పురుషులలో ఉత్తమ పురుషుల మాదిరిగా జర్నలిష్టులలో హిందూ విలేకరులను అలా పరిగణించే రోజులు నాకు తెలుసు.
అలాంటి ఒకానొక రోజుల్లో హిందూ కరస్పాండెంట్ (ముందు ముందు విలేకరి అంటాను, టైప్ చేయడం ఇబ్బందిగా వుంది) గా పనిచేస్తున్న దాసు కేశవరావు అనే చిన్నగా కనబడే ఈ పెద్దమనిషికి, కొన్ని రోజులపాటు నా చిలిపితనాన్ని భరించాల్సిన పరిస్తితి ఏర్పడింది.  దీనికి కారణం ఆ నాటి రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి.
సంజీవరెడ్డి గారు రాష్ట్రపతి అయిన తర్వాత తొలిసారిగా అనంతపురం వచ్చారు. ఆ పట్టణానికి దగ్గరలోనే వారి స్వగ్రామం ఇల్లూరు వుంది. అనంతపురంలో ఉన్న వారి సొంత ఇల్లు తాత్కాలికంగా రాష్ట్రపతి నిలయం అయింది. అంతటి పెద్దాయన మొదటిసారి సొంతూరు వస్తుంటే పత్రికలు ఊరుకుంటాయా! హైదరాబాదు నుంచి విలేకరులను పంపించాయి. ఇక ఆకాశవాణి సంగతి చెప్పేదేముంది. నేనూ వాలిపోయాను.
అనంతపురంలో  మెయిన్ రోడ్డుపైనే ఉన్న హోటల్లో మా బస. చెప్పానుకదా నాకు చిలిపితనం ఓ పాలెక్కువ అని. దాసు కేశవరావు గంగిగోవు లాంటి జర్నలిష్టు. మేమిద్దరం చాలా ఏళ్ళుగా స్నేహితులం. అంచేత నా గోల ఆయన మౌనంగా భరించేవాడు.
ఇద్దరమూ బయటకు పోయేవాళ్ళం. కాసేపు అటూ ఇటూ తిరిగేవాళ్ళం. మధ్యలో ఓ పబ్లిక్ కాల్ ఆఫీసు నుంచి నేను హోటల్ రిసెప్షన్ కు ఫోను చేసేవాడిని.
‘ రాష్ట్రపతి క్యాంప్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాము. మీ హోటల్లో, కేశవరావు, శ్రీనివాసరావు, హైదరాబాదు జర్నలిష్టులు వుంటే ఒకసారి కనెక్ట్ చేస్తారా! అర్జంటుగా మాట్లాడాలి’ అనే వాడిని.
హోటల్లో అడుగుపెడుతూ ఉండగానే మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ‘మీకోసం ప్రెసిడెంటు గారి ఆఫీసు వాళ్ళు ఫోన్ చేసారు’ అని చెప్పేవాళ్ళు ఆదుర్దాగా.
‘వాళ్ళు అలానే చేస్తారు. అవసరం వుంటే మళ్ళీ వాళ్ళే చేస్తారు, ఏం పర్వాలేదు’ అనేవాడిని నిర్లక్యంగా.
ఈ ట్రిక్కు బాగా పనిచేసింది. ఆ రోజు నుంచీ హోటల్లో మాకు మర్యాదలు పెరిగాయి. ఉదయం సాయంత్రం కనుక్కునేవారు. రూమ్ సర్వీసు బాగు పడింది.
‘ఇది అవసరమా’ అనేది కేశవరావుగారిలోని గంగిగోవు. ‘అవసరమే’ అనేది నాలోని పోట్లగిత్త.
ఒక రోజు ఇల్లూరు ప్రయాణం కట్టాము. ఎందుకంటే సంజీవరెడ్డి గారు ఆక్కడికి బయలుదేరారు.
ఇల్లూరులో నీలం వారిల్లు పెళ్లివారిల్లులా హడావిడిగా వుంది. తన ఈడువారిని ఆయన ఆప్యాయంగా ‘ఏమప్పా’ అంటూ పేరుపెట్టి పలకరిస్తున్నారు. చిన్నవారితో ఎప్పటి సంగతులో ముచ్చటిస్తున్నారు. వూరు ఊరంతా అక్కడే వుంది.
సాయంత్రం ఆరవుతోంది. నేను వారింటి నుంచే హైదరాబాదు ఫోన్ చేసి వార్త చెప్పాను. రాష్ట్రపతి మకాం చేస్తున్న సందర్భం కాబట్టి వెంటనే లైను కలిపారు.  అది మొదటి వార్తగా వస్తుందని నాకు తెలుసు. వెంటనే సంజీవరెడ్డి గారిని ( రాష్ట్రపతి కార్యదర్శి పేరు కూడా సంజీవ రెడ్డే. పీ.ఎల్. సంజీవ రెడ్డి. ఐ.ఏ.ఎస్. అధికారి)ని ఒక రేడియో తెప్పించమన్నాను. ఆయన నావైపు అదోలా చూస్తూ రేడియో తెప్పించారు. దాన్ని అక్కడ ఉన్న మైక్ సెట్టుకు కలిపారు.
వార్తలు మొదలయ్యాయి. అంతా నిశ్శబ్దం. రాష్ట్రపతి స్వగ్రామం వచ్చిన వార్తా విశేషాలతో బులెటిన్ మొదలయింది.
ఈ మారుమూల గ్రామంలో వార్త ,అంత త్వరగా రేడియోలో ఎలా వచ్చిందని జనం ఆశ్చర్యంగా గుసగుసలాడుకున్నారు.
నేను గర్వపడే మరో విషయం ఏమిటంటే,  ఆ నాటి శ్రోతల్లో నీలం సంజీవ రెడ్డి గారు కూడా ఒకరు.
ముందు కొంచెం రుసరుసలాడినట్టు కనిపించిన పీ.ఎల్. సంజీవరెడ్డి గారు కూడా ఖుషీ. భుజం తట్టారు, మెచ్చుకోలుగా.         

1, జనవరి 2020, బుధవారం

అధికారాంతం - భండారు శ్రీనివాసరావు


ప్రతి దానికీ ముగింపు వున్నట్టే అధికారానికి కూడా ఏదో ఒకనాడు తెర పడుతుంది. కానీ అధికారం చలాయించేవారు ఈ చేదు నిజాన్ని నమ్మరు, అది అనుభవంలోకి వచ్చేదాకా.
ఒక డైరెక్టర్ గారి కధ చెప్పుకుందాం. ప్రతి రోజూ వారి ఆఫీసులో ఒక దృశ్యం కనబడేది. దాన్ని ఫ్రీజ్ చేస్తే ఇలా వుంటుంది.
పోర్టికో. బయలు దేరడానికి సిద్ధంగా వున్న కారు. డ్రైవర్ తలుపు తెరిచి  ఒక కాలు లోపలే వుంచి, అధికారి వచ్చి కూర్చుని,  కదలమని ఆర్డర్ వేయగానే బయలుదేరదీయడానికి తయారుగా కారు పక్కనే నిలబడి ఉంటాడు. మరో నాలుగో తరగతి ఉద్యోగి కారు వెనుక తలుపు తెరిచి పట్టుకుని, డైరెక్టర్ రాకకోసం ఎదురు చూస్తుంటాడు. మరో ప్యూను  బ్రీఫ్ కేసు పట్టుకుని వెంట నడవగా ఆ ఆఫీసరు, తన కార్యాలయం నుంచి నాలుగు అడుగులు నడిచి  కారు వద్దకు వస్తాడు. అక్కడ అటూ ఇటూ తిరిగే అక్కడి సిబ్బంది ఆ కారు కదిలేవరకు కాసేపు శిలావిగ్రహాల్లా ఎక్కడి వాళ్ళక్కడ  నిలబడి వుంటారు. ఈ దృశ్యం అలా ప్రతి రోజూ సాయంత్రం ఆ అధికారి పదవీవిరమణ చేసేవరకు కనబడుతూనే వచ్చింది.
ఇంకో అధికారి కధ చెప్పుకుందాం. అంతకు చాలా ఏళ్ళ క్రితం అదే హోదాలో మరో అధికారి అదే ఆఫీసులో  పనిచేశారు. ఆయన ఆఫీసు టైముకల్లా ఇంట్లో బయలుదేరి, ఏదో సిటీ బస్సు పట్టుకుని ఆఫీసుకు వచ్చేవారు. ఆయన వచ్చిందీ, పోయిందీ ఎవరికీ తెలిసేది కాదు.
తమిళనాట ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సంస్థాపకుడు అన్నాదొరై మహాశయులు చాలా నాటకాలు రాశారు. అనేక సినిమాలకు రచనలు చేశారు. ఆయన రాసిన నాటకంలో ఒక అంకం ఇలా మొదలవుతుంది.
హాల్లో ఓ మోతుబరి కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని విలాసంగా కాలక్షేపం చేస్తుంటాడు. దగ్గరలో ఆ ఇంటి నౌకరు ఏదో పనిచేసుకుంటుంటాడు. అలా కూర్చుని కూర్చుని  ఆ మోతుబరి దొరవారికి విసుగనిపిస్తుంది. నౌకరు పిలిచి చెబుతాడు. ‘ఇదిగో ఇలా వచ్చి నా కాలు తీసి కిందపెట్టు.’
ఆకాశవాణి మాజీ సంచాలకులు డాక్టర్ పి.ఎస్. గోపాలకృష్ణ ఈ నాటకం  సంగతి నాకు మాటల మధ్యలో చెబితే నాకు ఆ ఇద్దరు డైరెక్టర్ల ఉదంతం జ్ఞాపకం వచ్చింది.
అన్నట్టు గోపాలకృష్ణ ఇప్పుడు మాజీ డైరెక్టర్ కాదు, అయన చెబితేనే  తెలిసింది. కొన్నేళ్ళ క్రితమే, అంటే రిటైర్ అయిన తర్వాత,  ఆయనకు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా ప్రమోట్ చేస్తూ సర్కారు వారు ఓ కాగితపు ఉత్తర్వు పంపారట. ఆయన ఓ పదం వాడితే అందులో ఏదో అర్ధం వుండితీరాలి. నిజంగా అది కాగితపు ఉత్తర్వే. కానీ  ఉత్తుత్తి ఆర్డరు కాదు. ఇదేమి మతలబు అంటారా. అక్కడే వుంది.  ప్రమోషన్ అయితే  ఇచ్చారు కానీ ఆర్ధికపరమైన ప్రయోజనాలు ఏవీ దానివల్ల ఒనగూరవు. ‘పలానా అధికారి పలానా హోదాలో కాకుండా పలానా పై హోదాలో రిటైర్ అయినారు కావున తెలియ పరచడమైనది’ అంటూ ఇచ్చిన ఆర్డరు. అలా అందరికీ చెప్పుకున్నా, ఎక్కడైనా  రాసుకున్నా  ఏలినవారికి ఏమీ అభ్యంతరం వుండదు.
“ఈ మాత్రం దానికి డీడీజీ అనే ఎందుకు? ఏకంగా  డీజీ అనే ప్రమోషన్ ఇవ్వొచ్చు కదా!” అనేది  నా ముక్తాయింపు. ఎప్పటిమాదిరిగానే ఓ చిరునవ్వే ఆయన సమాధానం.
ఆయన ఇంకో సంగతి కూడా చెప్పారు. ఎప్పుడో నూట యాభయ్ ఏళ్ళ క్రితం సీపీ బ్రౌన్ అనే ఇంగ్లీష్ దొరవారు ఒక మాట అన్నారట.
“ప్రభుత్వ ఉద్యోగం చేసేటప్పుడు పై అధికారి అనేవాడు, జీఓడీ-  ‘GOD’. రిటైర్ అయిన తర్వాత డీఓజీ - ‘DOG’.”