30, మే 2016, సోమవారం
ప్రత్యామ్నాయం లేని ప్రజానాయకుడు కేసీఆర్
సూటిగా....సుతిమెత్తగా..........
(జూన్ రెండో తేదీ తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం)
తెలంగాణా వచ్చేసింది. వచ్చి కూడా రెండేళ్ళయింది. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతం ప్రజలు అవిశ్రాంతంగా కంటున్న స్వప్నం
నెరవేరింది. ఈ నిజం నీటి మీది రాత కాదు, రాతి మీది గీత. చెరపడం అసాధ్యం. చెరపాలనే ఆలోచన అవివేకం.
రెండు సంవత్సరాల క్రితం, 2014 జూన్ రెండో తేదీన,
భారత దేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా ఏర్పడ్డ
తెలంగాణాకు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాధినేతగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు
తొలి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రజల నమ్మకాలు విచిత్రంగా వుంటాయి.
ప్రత్యేక తెలంగాణా సాధన ఖ్యాతిని ఏపార్టీకి ఆ పార్టీ తమ ఖాతాలో వేసుకోవాలని చూసినా
ప్రజలు మాత్రం కేసీఆర్ వల్లనే కొత్త రాష్ట్రం సాధ్యపడిందని బలంగా నమ్ముతున్నారు. ఈ
నమ్మకమే ఆయన బలం. ఎవర్నీ లెక్కచేయకుండా వ్యవహరించే ఆయన పని తీరుకు ప్రజల్లో వున్న
ఈ నమ్మకమే ఊపిరి పోసింది.
ఎవరెన్ని విమర్శలు చేసినా, వ్యాఖ్యానాలు చేసినా ఆయన లెక్క చేసే రకం కాదు. 'బంగారు తెలంగాణా కల సాకారం చేయడానికి ఏమైనా చేస్తా, ఏమైనా చెబుతా'
అనే ఒకే ఒక్క మాటతో ప్రత్యర్ధుల వాదనలను
పూర్వపక్షం చేయడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగానే వుంటారు. ఒకరకంగా ఇది కేసీఆర్ బలమూ, బలహీనత రెండూ.
అరకొర మెజారిటీతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం
ఎన్నాళ్ళు౦టుంది అని కొందరు మొదట్లోనే మెటికలు విరిచారు. తెలంగాణా వాదం కొడిగడుతూ
వుండడం వల్లనే, రెండేళ్ళ నాటి అసెంబ్లీ ఎన్నికల్లో
టీఆర్ఎస్ సీట్లు గణనీయంగా తగ్గిపోయాయని లెక్కలు కూడా వేశారు. గతంలో ఉమ్మడి
రాష్ట్రంలో టీడీపీలో చోటుచేసుకున్న ‘నాదెండ్ల టైపు’ తిరుగుబాటు టీఆర్ఎస్ లో కూడా
తప్పదని ఊహాగానాలు చేశారు. తెలంగాణా ఏర్పడిన జూన్ రెండో తేదీకి పూర్వమే, విడిపోయిన రెండు జర్మనీలు తిరిగి ఏకం అయిన ఉదాహరణలను ప్రస్తావిస్తూ, కొత్త రాష్ట్రానికి పురిట్లోనే సంధి కొడుతుందన్నతీరులో, సంధి ప్రేలాపనలు చేసి, ఆ ప్రాంతపు ప్రజల్లో లేనిపోని
అనుమానాలు రగిలించే ప్రయత్నాలు కూడా
చేశారు.
ఇవన్నీ రాజకీయపరమైన అంశాలు, కాబట్టి వాటిల్లో వాస్తవం కంటే రాజకీయం పాలు కాస్త ఎక్కువ వుండే అవకాశం
హెచ్చు.
మరోపక్క ఆర్ధిక నిపుణులు తెలంగాణా
రాష్ట్రం ఎదుర్కోబోయే బాలారిష్టాలు గురించి అనుమానాలు వ్యక్తం చేసారు. నవజాత రాష్ట్రంలో, ‘కారు’ చీకట్లు కమ్ముకుంటాయన్నారు.
విద్యుత్ కొరతతో పరిశ్రమలు,
వ్యవసాయ రంగం ఇక్కట్లపాలవుతుందన్నారు.
హైదరాబాదులో వున్న ప్రముఖ కంప్యూటర్ సంస్థలు బిచాణా ఎత్తేసి బెంగుళూరో, మరో వూరో తరలి వెడతాయని జోస్యం చెప్పారు.
అసలు అన్నింటికీ మించి మరో భయం
పెట్టారు. హైదరాబాదులో ఏళ్ళతరబడి నివాసం వుంటున్న సీమాంధ్ర ప్రజానీకం దిక్కుతోచని
స్తితిలో, బిక్కుబిక్కుమంటూ అభద్రతాభావంతో రోజులు లెక్కించే పరిస్తితి
ఏర్పడగలదని లెక్కలు వేసారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ కొత్త రోజుల్లో తీసుకున్న
సర్వజనుల సర్వే వంటి సరికొత్త నిర్ణయాలను తమ వాదాలకు మద్దతుగా ఉదహరించారు.
ఇలా లేనిపోని అనేక అనుమానాలతో నూర్రోజులు గడిచాయి. రాను రాను, పోను పోను ఆ సందేహాల్లో సాంద్రత తగ్గింది.
ఏడాది తిరిగిపోయింది. అన్ని అనుమానాలు పటాపంచలు అయ్యాయి. సందేహాలు
తొలగిపోయి, కొత్త ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది.
ఏడాది గడిచినప్పుడు కేసీఆర్ పాలనకు
లభించిన ఒక చక్కటి కితాబును ఇక్కడ గుర్తు
చేసుకోవాలి.
ఈ కితాబు ఇచ్చింది కూడా ఆషామాషీ
మనిషేమీ కాదు. మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా వున్నప్పుడు చాలాకాలం ఆయన వద్ద సమాచార
సలహాదారుగా పనిచేసిన ఆర్ధిక వ్యవహారాల పాత్రికేయుడు సంజయ్ బారు. నిజానికి ఈ బారు గారు ప్రత్యేక
తెలంగాణాకు బద్ధ వ్యతిరేకి. కరడుగట్టిన సమైక్యవాది. తన మనస్సులోని ఈ మాటని అయన
ఏనాడూ దాచుకోలేదు. అలాటి సంజయ్ బారు తెలంగాణా కల సాకారం అయిన ఏడాది తరువాత అన్నమాట ఇది. నిజానికి అక్షరాలా రాసిన మాట ఇది.
‘డెక్కన్ హైదరాబాదు గురించి నేను
భయపడ్డది ఏమీ జరగలేదు. ఇక్కడివారికి అరమరికలు తెలియవు, ఆదరించి అక్కున చేర్చుకునే తత్వం ఇక్కడివారి సొంతం. అన్నింటికీ మించి
ఈ నగరానికి వున్న ప్రత్యేక ఆకర్షణ,
శోభ, సౌందర్యం ఇవేవీ చెరిగిపోలేదు. (తెలంగాణా ఏర్పడ్డ తరువాత) ఇవన్నీ చరిత్ర
పుటల్లో చేరిపోతాయేమో అని నేను భయపడ్డాను. కానీ నా సందేహాలన్నీ పటాపంచలయ్యాయి'
అని ఒక ఆంగ్ల జాతీయ దినపత్రికలో రాసిన వ్యాసంలో
పేర్కొన్నారు.
సంజయ్ బారు చెప్పినట్టు భయాలు,
అనుమానాలు, సందేహాలు తొలగిపోయాయి. అయితే
తెలంగాణాపై తెలంగాణా ప్రజలు పెంచుకున్న కోటి ఆశల మాటేమిటి? అవన్నీ నీటిమూటలేనా? నెరవేరే మాటలేనా?
తెలంగాణా రాకముందు, వచ్చిన తరువాత తెలంగాణా సాధకుడిగా పేరు మూటగట్టుకున్న కేసీఆర్ గతంలో
చెప్పిన మాటలు ఏమిటి? ఇప్పుడు చేస్తున్న ఆలోచనలు
ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
చూస్తుండగానే మరో రెండేళ్ళ కాలం
గడిచింది.
బాలారిష్టాల దశ దాటి, బాల తెలంగాణా బలం పుంజుకుంటోంది. బుడిబుడి అడుగులు వేస్తోంది.
రెండేళ్ళ కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్
అనేకానేక మాటలు చెప్పారు. మాటలు చెప్పడం ఆయనకు కొత్త కాదు. ఉద్యమ కాలంలో పోరాటానికి ఊపిరిలూదింది కూడా ఆయన ఆ మాటలతోనే.
జనాలను సమ్మోహితుల్ని చేసి ఆ మాటల మత్తులో కూరుకుపోయేలా చేయగల వాక్చాతుర్యం కలిగిన
ఏకైక నాయకుడాయన.
గత రెండేళ్ళ కాలంలో కేసీఆర్ నోటివెంట
అనేక మాటలు వర్ష రుతువులో వానచినుకుల్లా అనేక సందర్భాల్లో రాలిపడ్డాయి.
ఆకాశ హర్మ్యాలు, ఆరు లేన్ల రహదారులు, హరితహారాలు,
ప్రతి గృహానికి నల్లా నీళ్ళు, ప్రతి పొలానికీ సాగు నీళ్ళు, కనురెప్పపాటు కూడా పోని కరెంటు, గొడ్డూ గోదాతో ఇంటిల్లిపాదీ హాయిగా కాపురం వుండే చక్కటి రెండు పడకల
చిన్నారి లోగిళ్ళు, చదువుకునేవారికి దమ్మిడీ ఖర్చులేని చదువు, చదువయిన వారికి వెంటనే కొలువు, చదువంటని వారికి తగిన ఉపాధి, ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి , తెలంగాణలో ప్రతి బీడు పొలాన్ని కృష్ణా, గోదావరి జలాలు తడిపేలా సాగు
నీటి ప్రాజెక్టుల రీ డిజైనింగు, .......ఒకటా రెండా? ఇవన్నీ చదువుతున్నప్పుడు, వీటన్నిటి గురించి వింటున్నప్పుడు ఒక
బక్కపలచటి మనిషి మనస్సులో ఇన్నిన్ని ఆలోచనలా! యెంత విడ్డూరం అనిపిస్తుంది. బంగరు తెలంగాణా తప్ప ఈ మనిషి
కేసీఆర్ కు వేరే ఏ ఇతర ఆలోచలు లేవా? రావా? అనికూడా అనిపిస్తుంది. ఇవన్నీ
నెరవేరితే తెలంగాణా బంగారం కాకుండా ఉంటుందా! ఈ కలలు కల్లలు కాకూడదని కోరుకోనివారు
తెలంగాణా గడ్డ మీద ఎవరయినా ఉంటారంటారా?
తెలంగాణా ప్రజల్లో అత్యధికులు ఆయన
మాటల్ని ఇప్పటికీ విశ్వసిస్తారు. ఇక ముందు
కూడా నమ్ముతారు. ఎందుకంటే కేసీఆర్
తెలంగాణాను నమ్ముకున్నారు. తెలంగాణా
ఆయన్ని నమ్ముకుంది. ఆయన్ని కాక వేరెవర్నయినా నమ్మితే ఎన్నో కష్టాలు పడి తెచ్చుకున్న తెలంగాణకు ఏమైనా
ఇబ్బంది కలుగుతుందేమో అన్న సంశయాన్ని వారిలో రగిలించడంలో కేసీఆర్ పూర్తిగా
కృతకృత్యులయ్యారు. ఆయనపై పెంచుకున్న ఆ నమ్మకంతోనే వాళ్ళు ఆయన్ని నేటికీ
నమ్ముతున్నారు. ఆ కారణంగానే ఈ రెండేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్
విజయాలకు ఎదురులేకుండా పోతోంది. ఆకర్ష్ అనండి, మరోటి అనండి, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధుల్ని టీఆర్ఎస్ లో విలీనం
చేసుకుంటున్న విధానాన్ని ప్రజాస్వామ్య ప్రియులు హర్షించక పోయినా, మరోపక్క సామాన్య తెలంగాణా
జనాలు మాత్రం ఆయనకు, ఆయన పార్టీకి
ప్రతిఎన్నికల్లో నీరాజనాలు పడుతుండడానికి ఈ ‘నమ్మకమే’ కారణం. నిజానికి రాజకీయాల్లో పనితీరుకు నిఖార్సయిన నిదర్శనం ఎన్నికల్లో సాధించే
విజయాలే.
బంగారు తెలంగాణా సాధన కోసం అందర్నీ
కలుపుకు పోవడం అంటే ఇతర పార్టీల వారిని తమ పార్టీలో కలుపుకోవడం కాదనే విమర్శలు
లేకపోలేదు. ప్రజాతీర్పు అనుకూలంగా వున్నంతకాలం
ఏ విమర్శలు, ఆరోపణల గురించి పట్టించుకోవాల్సిన అవసరం వుండదన్నది నేటి రాజకీయాల్లో
కొత్త థియరీ. దీనిప్రకారం, ప్రజాస్వామ్యంలో ఒక
పార్టీని అంచనావేయడానికి విజయాన్ని మించిన గీటు రాయి లేదు. ఈ విషయంలో ఇంతవరకు టీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత అదృష్టవంతులనే చెప్పాలి. 2014 సార్వత్రిక ఎన్నికల తరువాత తెలంగాణాలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఆ పార్టీ తన
విజయాలను మరింత మెరుగుపరుచుకుంటూ వస్తోంది.
పన్నెండేళ్ళ పైచిలుకు సాగిన ఉద్యమ
కాలంలో కేసీఆర్ పలవరించినా,
కలవరించినా తెలంగాణా గురించే. అధికారంలో
లేనప్పుడు అదే ధ్యాస, వున్నప్పుడు అదే ధ్యాస. తెలంగాణాలో అణువణువూ ఆయనకు కొట్టిన పిండి.
గూగుల్ పరిజ్ఞానంతో దానికి మరిన్ని
మెరుగులు దిద్దుకున్నారు. అసెంబ్లీ సాక్షిగా సేద్యపు నీటి ప్రాజెక్టులపై
కేసీఆర్ ఇచ్చిన పవర్
పాయింట్ ప్రజెంటేషన్ దీనికి
తార్కాణం. అలాగే, ఎక్కడ ఏ విషయం ప్రస్తావనకు వచ్చినా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాన్ని
తెలంగాణాకు ముడిపెట్టి మాట్లాడ్డం ఆయనకు అలవాటు. కొందరికి అది
మొండితనం అనిపించి వుంటుంది, కానీ ఆయన లెక్కచేసేరకం కాదు. ఈ లెక్కలేనితనమే ఒకరకంగా ఆయనకు
తెలంగాణా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తిరుగులేని నాయకుడిగా
నిలబెట్టింది. తెలంగాణా యాసలో అలవోకగా ప్రసంగించే చాతుర్యం అందరినీ కట్టిపడేసింది.
రాజకీయ శత్రువులు సయితం మెచ్చుకునే ఆయనలోని
లక్షణం ఇదే.
మరి ఇలా మాటలతోనే సరా, జనాలు
సరిపెట్టుకుంటారా అంటే యెంత మాత్రంకాదని
ఘంటాపదంగా చెప్పొచ్చు. అయితే, చేసింది ఎలా
చేశాము, చేయలేనిది ఎందుకు చేయలేకపోయాము, లేదా ఎందుకు చేయలేము అనే విషయాలు
నిర్భయంగా, నిబద్ధతతో చెప్పగలిగే నాయకులను ప్రతిపక్షాలు తప్పుపడతాయేమో, కానీ
సామాన్య జనం చక్కగా అర్ధం చేసుకుంటారు.
నిజమే! ఎన్నికలకు ముందు చెప్పినవి
అన్నీ చేసి చూపించడం మానవ మాత్రులకు సాధ్యం కాని పని. కానీ, అన్నీ కాకపోయినా కొన్ని అయినా చేసి చూపించడం రాజకీయ పార్టీల ధర్మం.
లేని పక్షంలో రాజకీయ నాయకుల వాగ్దానాలపట్ల ప్రజల్లో విశ్వాసం కుదురుకోవడం కష్టం.
ఇది ప్రజాస్వామ్యానికి మేలు చేయదు.
చూస్తుండగానే రెండేళ్ళ పుణ్యకాలం చరిత్ర పుటల్లోకి చేరిపోతోంది.
చరిత్రలో నిలబడి పోవాలంటే చేయాల్సినవి చాలా వున్నాయి. ప్రజలు తమ తీర్పు ద్వారా
అప్పగించిన సమయంలో మిగిలివున్న వ్యవధానం మూడేళ్ళే.
పరిష్కారం కాకుండా వున్న తెలంగాణా
సమస్యలు అన్నింటికీ పాత పాలకుల పాపమే కారణం అన్న వాదన ఇన్నేళ్ళు జనంలో చాలామంది
నమ్మారు. ఇంకా కొన్నాళ్ళు నమ్ముతారు. మరి కొన్నాళ్ళ తరువాత నమ్మేవాళ్ళు
తగ్గిపోవచ్చు. అసలు మిగలకపోవచ్చు.
ఏ రంగంలో అయినా శాశ్వతంగా నిలదొక్కుకోవాలి అంటే నిజాయితీ, నిబద్దత, విశ్వసనీయత చాలా ముఖ్యం. రాజకీయాలకి ఈ సూత్రం మరింత బాగా
అన్వయిస్తుంది.
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, విమానాశ్రయాలు కాదు,
మొత్తం ప్రజానీకం అభివృద్ధి చెందడమే నిజమైన
అభివృద్ధి అని కేసీఆర్ చెబుతుంటారు. ఆయన అదృష్టం ఏమిటంటే చెప్పింది చేసి చూపెట్టగల
అధికారం, అవకాశం ఆయన చేతుల్లోనే వున్నాయి. చూడాలి ఏం చేస్తారో!
కలలు కనమని కలాం చెప్పారు. ఆ కలలు నిజం చేసుకునే ప్రయత్నాలు చేయాలని కూడా
చెప్పారు. అదే జరగాలి ఇప్పుడు. కేసీఆర్ తన ప్రతి మాటా ఆచరణలోకి వచ్చే విధంగా
చర్యలు మొదలు పెట్టాలి. ఇంకా మూడేళ్ళ వ్యవధానం లెక్కకు మాత్రమే మిగిలివుంది.
వాస్తవంగా వుంది రెండేళ్ళ లోపే.
కోటి ఆశల నేపధ్యంలో, శతకోటి అనుమానాల నీలి నీడల్లో కొత్త రాష్ట్రం తెలంగాణా ఏర్పడింది. ఈ
రెండేళ్లలో అనుమానాలు తీరిపోయాయి. మరి
ప్రజల ఆశల సంగతి?
రెండేళ్ళ పసికందు తెలంగాణా
రాష్ట్రాన్ని చేతుల్లో పట్టుకుని,
కనుపాప మాదిరిగా పెంచుతున్న టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల
చంద్రశేఖర రావు ఎదుట నిలిచిన ప్రశ్న ఇది. ఆయన మాత్రమే జవాబు చెప్పగలిగిన ప్రశ్న
కూడా.
తెలంగాణా భవిష్యత్తు గురించిన పూర్తి
బాధ్యత ఆయనదే. దానిపైనే ఆయన పార్టీ భవితవ్యం కూడా ఆధారపడివుంటుంది.
ఉపశ్రుతి:
కేసీఆర్ చెప్పిన భద్రాచలం కధ
ఇది జరిగి దాదాపు మూడేళ్ళు.
2013 జులై 30 వ తేదీన ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్
కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో ఆ ఘడియ
కోసం ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ శ్రేణుల ఆనందానికి అవధి లేకుండాపోయింది.
ఆగస్టు నాలుగో తేదీన టీఆర్ఎస్ అధినేత
చంద్రశేఖరరావు హైదరాబాదులో ఏర్పాటయిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. రాజకీయ నాయకులు
అంతసేపు మాట్లాడితే భరించడం కాస్త కష్టం. కాని ఆయన చెప్పిన విషయాలు, తడుముకోకుండా,
అసహనానికి గురికాకుండా విలేకరుల ప్రశ్నలకు
జవాబులు ఇచ్చిన తీరు సభికులను కట్టి పడేశాయి. సభికులు అని ఎందుకు అంటున్నానంటే అది
విలేకరుల సమావేశంలా లేదు. ఓ మోస్తరు బహిరంగ సభలా వుంది. గిట్టని వాళ్ళు ఆయన్ని
‘మాటల మాంత్రికుడు’ అంటుంటారు కాని నిజంగా ఆయన మాటల్ని మంత్రించి వొదలడంలో దిట్ట.
ఆయన చెప్పిందంతా తిరిగి రాయాలంటే ఓ గ్రంధం అవుతుంది. తెలంగాణా కల నెరవేరిననాడు ఆ
కొత్త రాష్ట్రాన్ని ఎలా తీర్చి దిద్దబోతున్నదీ ఆయన సవివరంగా చెప్పారు. వినడానికి
అంతా కల మాదిరిగానే వుంది. నూతన తెలంగాణా ఆవిష్కృతం అయ్యే క్రమంలో ఆయన చెప్పిన
విషయాలు – ఒక రకంగా ఏదో ఒక సందర్భంలో చెప్పినవే అయినా – వాటన్నిటిని ఆయన గుది గుచ్చి చెప్పిన తీరు ‘ప్రత్యక్షప్రసారం’లో చూస్తున్న మిత్రుడు ఒకరు
బెజవాడ నుంచి ఎస్.ఎం.ఎస్. పంపారు. ఆయన ఓ
అయిదేళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి, ఇప్పుడు చెప్పినంతగా యావత్
ఆంద్రప్రదేశ్ ని అభివృద్ధి చేసివుంటే ఇప్పుడీ గొడవలే ఉండేవి కావన్నది దాని
తాత్పర్యం.
‘భద్రాచలం సంగతేమిటి’ అని ఒక విలేకరి
అడిగిన ప్రశ్నకు జవాబుగా చరిత్రలోని ఒక వృత్తాంతాన్ని కేసీఆర్ వివరించారు.
కొన్నాళ్ళు బ్రిటిష్ అంధ్రాలో వున్న భద్రాచలం, అంతకు
పూర్వం తెలంగాణాలోనే వుండేది. భక్త రామదాసును బందిఖానాలో వేసింది అప్పటి
గోలకొండ కోటలోనే. పొతే, భద్రాచలానికి పొరుగున బ్రిటిష్ ఇండియాలోని వైజాగ్ ప్రాంతంలో ఒక
ముష్కరుడు గ్రామాలమీద పడి దోపిడీలు చేస్తుంటే బ్రిటిష్ సాయుధ సాయాన్ని కోరడం, వాళ్ళు ఆ దోపిడీదారుడి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడం, చేసిన సాయానికి కృతజ్ఞతగా నవాబు గారు గోదావరి ఆవల వైపువున్న ప్రాంతాన్ని
వారికి దఖలు పరచడం – ఇదంతా వినడానికి చాలా ఆసక్తిగా అనిపించింది. అదే కేసీఆర్
ప్రత్యేకత.
28, మే 2016, శనివారం
ఎక్కివచ్చిన మెట్లు
నడిచి వచ్చిన జీవితం బాగా గుర్తుంది
అని చెప్పడం పెద్ద అబద్ధం కాకపోయినా మన మనస్సుని మోసం చేసుకోవడమే.
హైదరాబాదు వచ్చిన కొత్తల్లో
చిక్కడపల్లి లోని మా ఇంటికి రెండు ఫర్లాంగుల దూరంలో మెయిన్ రోడ్డుమీద, సుధా హోటల్
వద్ద సిటీ బస్ స్టాపు వుండేది. అక్కడి నుంచి నేరుగా రేడియో స్టేషన్ కు కాని, సెక్రెటేరియేట్
వెళ్ళాలంటే రామ్ నగర్ నుంచి విజయనగర్
కాలనీకి వెళ్ళే 139 నెంబరు బస్సు ఒక్కటే దిక్కు. ఒక్కటే అవటాన దానికి టెక్కు సహజం. అంచేత
దాని రాకపోకలు అనూహ్యం. కావున, మన రూటుది కాకపోయినా మరో బస్సును పట్టుకుని ప్రయాణం
చేయడం తప్పనిసరి. అలా నిత్యం బస్సుల్లో తిరిగే రోజుల్లో సిటీ బస్సు ప్రయాణీకుల
పాట్లు బాగా అర్ధం అయ్యేవి.
ఆ తరువాత కొన్నాళ్ళకు ఆటో శరణ్యం
అయింది. అప్పుడు కానీ నాకు ఆటో బాధలు అర్ధం కాలేదు. రమ్మన్న చోటుకు రావడం వాళ్లకు ఇష్టం వుండేది
కాదు. వాళ్ళు అలా రాననడం నాకు నచ్చేది కాదు. వాళ్ళతో ప్రతిరోజూ నా పొట్లాటలు మా
ఆవిడకు నచ్చేవి కావు. సినిమాకని బయలుదేరి ఆటోవాడు రానంటే, అతడు చెప్పిన చోటుకే తీసికెళ్ళమని
అందులో ఎక్కి కూర్చుని మధ్యలో పోలీసు
స్టేషన్లకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉండేవి. రోడ్డు మీద మన మాట చెల్లకపోయినా,
పోలీసుల దగ్గర విలేకరిగా చెల్లుబాటయ్యేవి. ఇంతా చేసి మనం అడిగే ఫేవర్ ఒక్కటే,
మీటరు మీద వచ్చే ఆటో మాట్లాడి పెట్టమని. వాళ్ళకది చిటికెలో పని. ఆ విధంగా ముందుకు
పోతూ, కొంతమంది ఆటో డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేసేంతవరకు నా చేష్టలు
శృతిమించడంతో, మా ఇంటిల్లిపాదీ స్కూటర్ కొనుక్కోవడం ఒక్కటే దీనికి తరుణోపాయమని ఒక
ఏకగ్రీవ తీర్మానం చేసారు.
కొన్నాళ్ళకు ఆ ముచ్చటా తీరింది.
స్కూటర్ నడపడం మొదలెట్టాక, ఇక ద్విచక్ర
వాహనదారుల కడగండ్లన్నీ కళ్లకు కట్టినట్టు కనిపించడం మొదలయింది. హెల్మెట్ ఉదంతంతో ఆ అధ్యాయమూ ముగిసింది.
ఇప్పుడు పిల్లల పుణ్యమా అని కారు యోగం.
ఈ దశలో, అదేమిటో కారు ఆసాముల కష్టాలమీదనే నా ధ్యాస.
జీవితం అన్నాక ఒక్కోమెట్టు నింపాదిగానో,
హడావిడి గానో ఎక్కుతుంటాం.
మరి అదేమి చిత్రమో, చూపు ఎక్కేపై మెట్టు మీదనే కానీ,
ఎక్కివచ్చిన కింది మెట్టు మీద వుండదు.
NOTE: COURTESY IMAGE OWNER
నారద శాంతి
కొన్నేళ్ళ క్రితం అమెరికా వెళ్ళినప్పుడు,
వాషింగ్టన్ స్టేట్ లో సియాటిల్ కు దగ్గరలో వున్న మౌంట్ రేనియర్ అనే అగ్ని పర్వతం చూడడానికి వెళ్లాం. మధ్య
దారిలో, కొండ సానువుల్లో ‘నారద జలపాతాన్ని’ మా కుమారుడు చూపించాడు. ‘నారద ఫాల్స్’
అని రాసి వున్న ఆ ప్రాంతంలో ఒక కొండ పై నుంచి ఈ జలపాతం ధారలుగా దుముకుతోంది. నారదమహర్షి
త్రిలోక సంచారి. కాబట్టి ఆ దేశంలో కూడా అడుగుపెట్టాడేమో తెలియదు.
(అమెరికాలో నారద జలపాతం)
తగవులమారి అనే పేరుపడ్డప్పటికీ
నిజానికి నారదుడు శాంతి కాముకుడు.
కాబట్టే, నారద జయంతిని పత్రికా దినోత్సవంగా
పాటించి ఆ సందర్భంగా కొందరు జర్నలిష్టులను సత్కరించాలన్న సత్సంకల్పం
‘సమాచార భారతి’ అనే సంస్థకు కలిగింది. నారదుడి మాదిరిగానే విలేకరులు కూడా నిత్య
సంచారులే. కాబట్టి జర్నలిష్టులను సన్మానించాలనే ఆలోచన చేసి ఉండవచ్చు.
ఆ సన్మానితుల్లో ఒకనాటి నా రేడియో
సహోద్యోగిని సుప్రశాంతి కూడా వుండడం వల్ల నేనూ ఆ కార్యక్రమానికి వెళ్లాను.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, బీజేపీ శాసనమండలి సభ్యులు
సోము వీర్రాజు కూడా వచ్చారు. పూర్వాశ్రమంలో నా మిత్ర బృందంలోని విలేకరులు అనేకమంది అక్కడ కలిసారు. హాయిగా ఒక
పూట గడిచిపోయింది.
పొతే, సుప్రశాంతి గురించి ఒక మాట.
సర్కారు ఉద్యోగం, అందులో సెంట్రల్
గవర్నమెంట్, అందులోను ఆలిండియా రేడియో రిపోర్టర్, వీటిని మించి సొంత ప్రాంతంలో
పోస్టింగు, ఇన్ని కలిసి వస్తే నాలాగా కాలర్ తో పాటు తల కూడా ఎగరేస్తూ వుండాలి.
అదేం చిత్రమో తలవంచుకుని పనిచేయడం తప్ప పాపం ఆ అమ్మాయికి వేరే పని తెలియదు.
బహుశా, వృత్తి పట్ల సుప్రశాంతికి వున్న
ఈ అంకితభావమే ఆమెను ఉత్తమ జర్నలిష్టు అవార్డుకు ఎంపిక చేయడంలో దోహదపడి వుంటుంది.
(ఈ గ్రూపులో కుడి నుండి మూడో ఆవిడే ఉత్తమ మహిళా జర్నలిష్టు సుప్రశాంతి)
ఆమెకు నా అభినందనలు.
27, మే 2016, శుక్రవారం
నెహ్రూను మరచిపోతున్నామా ? లేదా ఆయనే మరపున పడుతున్నాడా?
సూటిగా....సుతిమెత్తగా........భండారు
శ్రీనివాసరావు
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 29-05-2016, SUNDAY)
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 29-05-2016, SUNDAY)
జవహర్లాల్ నెహ్రూ, కొన్ని జ్ఞాపకాలు
నెహ్రూ ను మరచిపోతున్నామా ? లేదా ఆయనే మరపున
పడుతున్నాడా?
శుక్రవారం పొద్దున్న జ్వాలా
నరసింహారావు ఫోన్ చేసి, పత్రికల్లో ఓ మూల వేసిన చిన్న సంస్మరణ ప్రకటనకు నెహ్రూ స్మృతిని పరిమితం చేసినట్టున్నారు అన్నాడు. నిజమే, ఆరోజు భారత ప్రధమ ప్రధాని
నెహ్రూ వర్ధంతి. 1964 మే 27 న పండిత జవహర్ లాల్ నెహ్రూ పరమపదించారు. ఆ వార్త తెలిసిన దేశప్రజానీకం శోకాబ్దిలో
మునిగిపోయింది.
ఆ రోజు నాకు బాగా గుర్తుంది.
నెహ్రూ మరణించిన వార్త రేడియోలో
విన్నప్పుడు మా వూళ్ళో అనేకమంది భోరున విలపించారు. చాలా తక్కువ మంది ఆ రాత్రి
భోజనాలు చేశారు. ఇంటిమనిషిని పోగొట్టుకున్న విషాదం వారిలో కానవచ్చింది.
‘మన సారధి, మన సచివుడు మన జవహరు మనకిక
లేడంటూ ఆ మరునాడు ఆంధ్రప్రభ మొదటి పుటలో
ఎనిమిది కాలాలతో పతాక శీర్షిక పెట్టింది.
నెహ్రూ గురించిన అనేక జ్ఞాపకాలు నా
మదిలో పదిలంగా వున్నాయి.
ఒకసారి బెజవాడలో ప్రధానమంత్రి మీటింగు
జరిగింది. చుట్టుపక్కల నుంచే కాదు,
ఇరుగు పొరుగు జిల్లాలనుంచి సొంత ఖర్చులతో
రైళ్లల్లో, బస్సుల్లో వెళ్ళిన వాళ్ళలో నేనూ వున్నాను. ఓపెన్ టాప్ కారులో ప్రయాణిస్తూ, ప్రజలు అభిమాన పురస్సరంగా
ఆయనపై విసురుతున్న పూలదండలను నెహ్రూ ఒడుపుగా పట్టుకుని తిరిగి జనాలమీదకే విసరడం
బాగా గుర్తుండిపోయింది.
నెహ్రూ ప్రధానిగా వున్న రోజుల్లో ఆయన
యెంత నిరాడంబరంగా వుండేవారో తెలుసుకోవడానికి ఒక ఫోటో చూస్తే తెలిసిపోతుంది. నెహ్రూ
అధికార నివాసంలో జరిగిన విలేకరుల గోష్టికి సంబంధించిన ఫోటో ఇది.
అ గదిలో కూర్చోవడానికి వీల్లేక
నిలబడి, సోఫా అంచుల మీద కూలబడి విలేకరులు ప్రశ్నలు అడుగుతుంటే ఎదురుగా ఒక
సోఫాలో తలపట్టుకు కూర్చున్నది నెహ్రూ అంటే ఒక పట్టాన నమ్మడం కష్టం. తలపై గాంధీ
టోపీ లేకుండా జవహర్లాల్ ని చప్పున గుర్తుపట్టడం తేలిక కాదు. (అదేం చిత్రమో గాంధీ
ఎప్పుడూ ఆలాంటి టోపీ పెట్టుకున్న సందర్భం లేదు, అయినా దానికి గాంధీ టోపీ అనిపేరు)
‘నిశ్శబ్దం చాలా భయంకరంగా వుంటుంది’ అనే
డైలాగు వుంది ఓ సినిమాలో.
ఒక్కోసారి నిశ్శబ్దం దిమ్మ
అదరగొడుతుంది.
లెఫ్ట్ నెంట్ జనరల్ నిరంజన్ మాలిక్ అనే
రిటైర్డ్ సైనికాధికారి చెప్పిన విషయం ఇది.
1947 లో దేశానికి స్వతంత్రం వచ్చిన
కొత్తల్లో, భారత సర్వ సైన్యాధ్యక్షుడిగా
ఎవరిని నియమించాలి అనే విషయంలో సీనియర్ సైనికాధికారులతో జవహర్ లాల్
నెహ్రూ ఒక
సమావేశం ఏర్పాటు చేసారు. అందులో నెహ్రూ చేసిన ప్రతిపాదన
అధికారులను నివ్వెర పరచింది. ‘ఈ పదవికి భారత సైన్యంలో తగినవాళ్ళు ఎవ్వరూ లేరు.
కాబట్టి కొంతకాలం పాటు ఎవరయినా అనుభవం కలిగిన బ్రిటిష్
అధికారితోనే వ్యవహారాలు నడిపించాలనేది నెహ్రూ ఉద్దేశ్యం. ఆ మాటే ఆయన మొహమాటం లేకుండా
చెప్పేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రే అలా అంటుంటే కాదనే ధైర్యం
ఎవరికి వుంటుంది. అందువల్ల ఇష్టం లేకపోయినా తల ఊపారు. ఇంతలో నాథూ సింగ్ రాథోర్ అనే
సీనియర్ అధికారి లేచి నిలబడి మాట్లాడడానికి అనుమతి కోరాడు. అలా ధైర్యంగా ఒక
ఆధికారి చొరవ తీసుకుని అడగడంతో నివ్వెర పోవడం
నెహ్రూ వంతయింది. అయినా తేరుకుని, చెప్పదలచుకున్నది సూటిగా, భయపడకుండా చెప్పమని
ప్రోత్సహించాడు. అప్పుడు రాథోర్ ఇలా అన్నాడు.
‘సర్! దేశాన్ని పాలించే సమర్ధత కలిగిన
నాయకుడు కూడా మనకు లేడనుకుందాం. అలా అని, బ్రిటన్ నుంచి మంచి అనుభవశాలిని మన ప్రధానమంత్రిగా తెచ్చుకోవడం
సబబుగా ఉంటుందా?’
రాథోర్ అలా అడగడంతో అక్కడ కొద్దిసేపు
నిశ్శబ్దం రాజ్యం చేసింది. నెహ్రూకు కూడా అతడు అడిగిన దాంట్లో విషయం బోధ పడింది.
అయన వెంటనే రాథోర్ వైపు తిరిగి ‘ఈ పదవి నీకే ఇస్తాను, నువ్వు నిభాయించుకునిరాగలవా?’ అని అడిగారు.
రాథోర్ తొట్రు పడకుండా సమాధానం
చెప్పాడు. ‘సర్! మన సైన్యంలో అత్యంత
సమర్థుడు అయిన ఓ అధికారి వున్నారు.ఆయన నా సీనియర్. జనరల్ కరియప్ప. మా
అందరిలోకి చాలా చేవకలిగినవాడు’
ఆ విధంగా జనరల్ కరియప్ప భారత దేశపు
మొదటి సర్వ సైన్యాధ్యక్షుడు కాగలిగారని నిరంజన్ మాలిక్ కధనం.
నెహ్రూ గారు
ప్రధానమంత్రిగా వున్న రోజుల్లో నాటి సోవియట్ యూనియన్ అధినాయకుడు కృశ్చెవ్ అధికార
పర్యటనపై ఢిల్లీ వచ్చారు. పాలం విమానాశ్రయంలో స్వాగతం
పలకడానికి నెహ్రూ స్వయంగా వెళ్ళారు. అనంతరం విదేశీ అతిధిని వెంట బెట్టుకుని జవహర్
లాల్ నెహ్రూ కారులో నగరానికి వస్తున్నారు. మార్గ మధ్యంలో అక్కడక్కడా కొందరు పౌరులు
ముంగాళ్ళ మీద కూర్చుని
కాలకృత్యాలు తీర్చుకోవడం కృశ్చెవ్ కంట పడింది. అదేమిటని అడిగిన కృశ్చెవ్ ప్రశ్నకు
సూటిగా జవాబు చెప్పడానికి నెహ్రూ గారికి తల కొట్టేసినంత పనయింది.
1951లో ఒక వార్తాపత్రికలో 'పాకిస్తాన్ తో మనకు యుద్ధం తప్పదు' అని ఒక జ్యోతిష్కుడు రాసిన వ్యాసాన్ని ప్రచురించారు. అది చదివిన అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు చాలా కోపం వచ్చింది. జ్యోతిష్యం, హస్తసాముద్రికం వంటి వాటికి వ్యతిరేకంగా ఒక చట్టం చేయాలని సంకల్పించేంత వరకు వెళ్ళింది ఆయన ఆగ్రహం.
నెహ్రూ ప్రజాస్వామ్య వాది అనేందుకు చరిత్రలో మరికొన్ని ఉదాహరణలు వున్నాయి. స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో జవహర్ మాటకు ఎదురుండేది కాదు. జవహర్ లాల్ నెహ్రూ పట్ల పార్టీలో వ్యక్తి ఆరాధన శృతి మించుతోందనీ,
దానిని అరికట్టకపోతే ఆయనలోని అహంభావం మరింత పెరిగి ఒక సీజర్ మాదిరిగా తయారవుతాడనీ,
ఇది పార్టీకి ఎంతమాత్రం మేలు చేయదనీ కలకత్తా నుండి వెలువడే ఒక పత్రికలో వ్యాసాలు వెలువడుతుండేవి. వాటిని 'చాణక్య'
అనే కలం పేరుతొ రాస్తున్నది స్వయంగా జవహర్ లాల్ నెహ్రూ అన్న నిజం చాలా ఏళ్ళవరకు ఎవ్వరికీ తెలియదు. నెహ్రూను తీవ్రంగా వ్యతిరేకించేవారెవ్వరో ఆ పేరుతో ఆ వ్యాసాలు
రాస్తున్నారని అనుకునేవారు.
రేడియోలో పనిచేసేవారు ఉద్యోగ రీత్యా
దేశంలోని వివిధ ప్రాంతాలలో పనిచేయాల్సి వస్తుంది. హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం
డైరెక్టర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన వీ.వీ. శాస్త్రి (వేమూరి విశ్వనాధ శాస్త్రి) చెప్పిన ఆసక్తికర ఉదంతం ఇది.
ఆయన భోపాల్ లో పనిచేసేటప్పుడు జవహర్ లాల్ నెహ్రూ దగ్గర
కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐ.సీ.ఎస్. అధికారి కె.పీ.ఎస్. మీనన్ ఏదో కార్యక్రమంలో
పాల్గొనడం కోసం ఆ నగరానికి రావడం జరిగింది. ఆయన వద్ద గతంలో పనిచేసిన సంగ్లూ అనే
అధికారి అప్పుడు భోపాల్ రేడియో కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆయన పూనికపై వీ.వీ. శాస్త్రి వెళ్లి మీనన్ ను కలుసుకుని రేడియో కేంద్రానికి ఆహ్వానించారు.
నిజానికి ఆయన మరునాడు విదేశీ ప్రయాణం పెట్టుకున్నారు. అయినా, రేడియో మీది గౌరవంతో, సంగ్లూ మీది అభిమానంతో తన ప్రయాణం
వాయిదా వేసుకున్నారు. ఆరోజు రేడియో స్టేషన్ కు వచ్చిన మీనన్, మాటల సందర్భంలో తన అనుభవాలు
కొన్ని చెప్పారు.
మీనన్ గారు ఆరోజు చెప్పిన విషయాల్లో ఒకటి మన రాష్ట్రానికి సంబంధించింది కావడం వల్ల శాస్త్రి గారికి బాగా గుర్తుండిపోయింది.
“ భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అనేక సంస్థానాలను ఇండియన్ యూనియన్ లో విలీనం చేసే
ప్రక్రియ కొనసాగుతోంది. నిజాం నవాబు ఈ చర్యను తీవ్రంగా ప్రతిఘటించడంతో ఎలాటి చర్య
తీసుకోవాలనే విషయంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒక ఉన్నత స్థాయి సమావేశం
ఏర్పాటు చేశారు. హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్న ఆ సమావేశం గంటల
తరబడి కొనసాగింది. అర్ధరాత్రి కావొస్తోంది. సర్దార్ పటేల్ మగత నిద్రలోకి
జారిపోయినట్టు కళ్ళు మూసుకుని వున్నారు. భారత సైన్యాలను హైదరాబాదు పంపే విషయంలో సుదీర్ఘంగా చర్చ సాగుతోంది. కళ్ళు మూసుకుని
అంతా వింటున్న సర్దార్ పటేల్ లేచి ఒక్కసారిగా ఇలా అన్నారట.
‘ ఇండియన్ ఆర్మీ ఇప్పటికే హైదరాబాదు చేరిపోయింది. మేజర్
జనరల్ చౌదరి అక్కడే వున్నాడు.’
పటేల్ మాటలు విని అక్కడివారంతా
మ్రాన్పడిపోయారు.
నెహ్రూ సంగతి చెప్పక్కర లేదు.
అప్పట్లో కలం కూలీ జీ. కృష్ణ గారు ఢిల్లీలో ఆంధ్ర పత్రిక విలేఖరిగా పనిచేస్తుండేవారు. ఆ రోజుల్లో పార్లమెంటు సభ్యులయిన బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి నివాసానికి నారాయణ దొరగారు వచ్చారు. సాలూరు ప్రాంతీయుడయిన కునిసెట్టి వెంకట నారాయణ దొర పాత కాలపు కాంగ్రెసువాది.
అప్పటి సంగతులను గురించి శ్రీ జీ. కృష్ణ తమ ‘విలేఖరి లోకం’లో ఇలా గుర్తు చేసుకున్నారు.
“దొరకు ఇంగ్లీష్ రాదు. హిందీ కూడా రాదు. వచ్చీ రాగానే జవహర్ లాల్ నెహ్రు గారితో మాట్లాడాలన్నాడు. వెంటనే వచ్చి కలవవచ్చని ప్రధాని కార్యాలయం నుంచి వర్తమానం వచ్చింది. పదిహేను నిమిషాలు టైం ఇచ్చారు.
“దొరగారు ఖద్దరు దుస్తులు ధరించి వెళ్లారు. వెంటనే దర్శనం లభించింది. దొరగారు గదిలోకి వెళ్ళగానే గులాబీ పువ్వు నెహ్రూ షేర్వాణీకి తగిలించడానికి ముందుకు కదిలాడు. నెహ్రూ గారు అమాంతం అతడిని పట్టి ఎత్తి సోఫా మీద పడేశాడు. అప్పటినుంచి కాసేపటిదాకా ఇద్దరూ నవ్వులే నవ్వులు. దీనికి కొంత నేపధ్యం వుంది.
1936 లో ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రాలో ప్రచారానికి వచ్చిన నెహ్రూకు అంగరక్షకుడిగా అప్పటి ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శి బులుసు సాంబమూర్తి గారు వెంకట నారాయణ దొరను నియమించారు. నెహ్రూకు తెలుగు రాదు.. దొరకు హిందీ రాదు. అయినా సైగలతో గడిపేశారు. బొబ్బిలిలో నెహ్రూ పై జస్టిస్ పార్టీవాళ్లు రాళ్లవర్షం కురిపించారు. అంతే! దొర అమాంతం నెహ్రూను ఎత్తుకుని ఫర్లాంగు దూరం తీసుకువెళ్లాడు. జవహర్ లాల్ యెంత గింజుకున్నా దొర వొదలలేదు.
మళ్ళీ 1953 లో ఢిల్లీలో తనను చూడవచ్చిన దొరను కూడా నెహ్రూ అమాంతం ఎత్తి సోఫాలో కుదేసి పాత స్మృతులను నెమరువేసుకున్నారని కృష్ణ గారు రాశారు.
ఉపశృతి:
మా రెండో బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు గారు. ఖమ్మం జిల్లా రెబ్బవరం కాపురస్తులు. కొద్దికాలం అస్వస్థులుగా వుండి కన్ను మూశారు. గతించి కూడా చాలా కాలం అయ్యింది. స్వాతంత్రోద్యమ కాలంలో పద్నాలుగు మాసాలకు పైగా కఠిన కారాగార శిక్ష అనుభవించారు. మా పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారు కూడా ఆయనతో పాటే జైల్లో వున్నారు. ఈ ఇద్దరు గర్భంతో వున్న భార్యలను పుట్టింట్లో (అంటే మా ఊరు కంభంపాడులో మా అమ్మానాన్నల వద్ద వొదిలి) దేశం కోసం జైలుపాలయ్యారు. సరే! అది అలా వుంచితే -
ఓరోజు బంధువుల ఇంట్లో జరిగిన కార్యక్రమంలో మా మేనల్లుడు అంటే రామచంద్ర రావుగారి కుమారుడు కొలిపాక రాంబాబు ఓ వృత్తాంతం చెప్పాడు. మా బావగారు సుస్తీ చేసి ఆసుపత్రిలో వున్నప్పుడు ఆయన్ని అడిగాడట. 'నాన్నా! మీలాటివాళ్ళు లక్షల మంది నానా కష్టాలు పడితే ఈ స్వాతంత్రం వచ్చింది. మీరు నిజంగా కోరుకున్నది ఇలాటి దేశాన్నేనా'
ఆయన ఇలా జవాబు చెప్పారట.
'స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో నెహ్రూ గారు ఆంధ్రాలో ఓ మీటింగులో మాట్లాడడానికి వచ్చారు. ఖమ్మం నుంచి నలభై యాభయ్ మందిమి బయలుదేరి రైల్వే స్టేషన్ కు వెళ్లాము. టిక్కెట్లు కొనడానికి వెడితే అక్కడి స్టేషన్ మాస్టారు అన్నారట 'నెహ్రూ గారి మీటింగుకు టిక్కెట్లు ఎందుకండీ'
అని. బహుశా ఆరోజు గట్టిగా 'కాదుకూడదు'
అని గట్టిగా వాదించి వుంటే దేశం ఈనాడు ఈ స్తితిలో వుండేది కాదేమో! ఫ్రీ ఇండియా అంటే జనాలకు అన్నీ ఫ్రీ అనే భావన ప్రబలేది కాదు. ఇది మనదేశం,
దీని లాభనష్టాలన్నీ మనవే అన్న అభిప్రాయం బలపడకుండా పోయింది. మేము కోరుకున్న దేశం ఇదా అంటే ఇది కాదని చెప్పగలను కానీ కోరుకున్న ఆ దేశం యెలా వస్తుందో, ఎప్పుడూ వస్తుందో మాత్రం చెప్పలేను. బహుశా నేనయితే చూస్తానన్న ఆశలేదు' (27-05-2016)