30, సెప్టెంబర్ 2015, బుధవారం

ఫలప్రదమైన ప్రధాని మోడీ అమెరికా పర్యటన

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 01-10-2015, THURSDAY)

ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్థాయిల్లోని ప్రముఖులు జరిపే విదేశీ పర్యటనలు ఫలప్రదం కాకపోవడం అంటూ వుండదు. అయితే గతంతో పోల్చి చూసుకున్నప్పుడు తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జరిపిన అమెరికా పర్యటన అనేక విధాలుగా ప్రత్యేకతలను, విశిష్టితలను కలిగివుందని గట్టిగా చెప్పవచ్చు. మోడీ పర్యటనకు మీడియాలో వచ్చిన ప్రచార ఉధృతి ఇందుకు నిదర్శనం. ఇది చివరకు ఏ స్థాయికి పోయిందంటే అదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నిర్వహించిన ఒక అపూర్వ ప్రయోగం కూడా మోడీ పర్యటన ప్రచార ప్రభంజనంలో మరుగున పడిపోయింది. ‘భవిష్యత్ మొత్తం మా దేశానిదే. భారత దేశానికి రండి, మా దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి’  అని అమెరికాలో భారత ప్రధానమంత్రి అక్కడి పారిశ్రామిక వేత్తలను అర్ధిస్తున్న సమయంలోనే, ఇక్కడ స్వదేశంలో అదే అమెరికాకు చెందిన కొన్ని ఉపగ్రహాలను, మన రోదసీ శాస్త్రవేత్తలు, పూర్తిగా  స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఉపగ్రహ వాహక నౌకలో నిర్దేశిత కక్ష్యకు జయప్రదంగా చేర్చి, ప్రపంచంలో ఈ పాటవం కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత దేశాన్ని చేర్చి మన దేశానికి అఖండ ఖ్యాతిని కట్టబెట్టారు.


ఒకప్పుడు మోడీని తమ దేశంలోకి అడుగు పెట్టనివ్వమని భీష్మించిన  అమెరికా ప్రభుత్వం  అదే మోడీ మహాశయులను సాదరంగానే కాదు సగౌరవంగా యెర్ర తివాచీ పరిచి స్వాగతం పలికింది. పైగా ఇది మొదటిసారి కూడా కాదు. ప్రధాని కాగానే మోడీ మొదటి సారి వెళ్ళినప్పుడు కూడా ఆ అగ్రదేశం ఇదే రీతిలో వ్యవహరించింది. ఆ దేశపు ఆర్ధిక రంగం అభ్యున్నతిలో భారత దేశం నుంచి వెళ్ళిన యువ మేధావుల, సాంకేతిక నిపుణుల పాత్ర ఏమిటో పూర్తిగా అర్ధం చేసుకున్న పాలకులు కాబట్టి భారత ప్రధానికి ఆ గౌరవం ఇవ్వక తప్పని పరిస్తితి. ఏడాది కాలంలోనే మోడీ ఆ అగ్రరాజ్యం అధినేత ఒబామాతో మూడు పర్యాయాలు భేటీ కావడం ఈ వాస్తవానికి అద్దం పడుతోంది.
విదేశీ పర్యటనలలో వేషభాషలకు మోడీ ఇస్తున్న ప్రాధాన్యం ఇటు స్వదేశంలో విమర్శలకు దారి తీయడంతో ఈసారి అమెరికా పర్యటనలో రూటు  మార్చి ‘తన చాయ్ వాలా గతాన్ని’ అక్కడి జనాలకు గుర్తుచేసే ప్రయత్నం గట్టిగానే చేసినట్టు కానవస్తోంది. ఎక్కడ ఏ పదాన్ని విరిచి చెప్పాలో, ఎక్కడ ఏ భావాన్ని అందరికీ అర్ధం అయ్యేలా పలికించాలో, స్వరాన్ని ఎక్కడ పెంచాలో, గొంతును ఎక్కడ తగ్గించాలో పూర్తిగా ఆపోసన పట్టిన రాజకీయ వేత్త కావడం వల్ల, అమెరికాలో మోడీ చేసిన ప్రసంగాలకు అపూర్వ ప్రతిస్పందన అమోఘంగా లభించింది. అయితే, సభికుల నుంచి హర్ష ధ్వానాల రూపంలో లభిస్తున్న ఆదరణ మైకంలో పడిన మోడీ, కొన్ని దేశ ప్రతిష్టకు పొసగని కొన్ని అంశాలను తన ప్రసంగాలలో ప్రస్తావించి, స్వదేశంలో కొన్ని రాజకీయ విమర్శలను మూటగట్టుకున్నారు. గత విదేశీ పర్యటనలలో సయితం ఇదే రకం  విమర్శలను మోడీ ఎదుర్కున్నారు. విదేశీ సభలు, సమావేశాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రసంగాలు చేయడం అన్నది భారత ప్రధానులకు నియమం కాకపోయినా ఒక ఆనవాయితీ. స్వదేశంలో రాజకీయాలు ఎలా వున్నా, అక్కడ  ఎటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నప్పటికీ, విదేశీ గడ్డపై ఒకింత సంయమనం పాటించడం అనేది  ఆ ఆనవాయితీ. మోడీ ఈ రివాజును కావాలనే ఉల్లంఘించి గత ప్రభుత్వాల వైఫల్యాలను విదేశీ ప్రసంగాలలో జొప్పిస్తున్నారన్నది ఆయన రాజకీయ ప్రత్యర్దుల అభియోగం. నిజానికి ఇలా ప్రసంగాలు చేయడం మంచి సంప్రదాయం కాదు.  విదేశాలకు అధికార పర్యటనపై వెళ్ళినప్పుడు భారత ప్రధాని అనే వ్యక్తి యావత్ దేశానికీ ప్రాతినిధ్యం వహిస్తారు. అంతేకాని,  ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడిగా కాదు. ఆయన చేసే ప్రతి ప్రసంగం భారత ప్రతినిధిగానే సాగడం మర్యాదగా వుంటుంది. అందుకే కాబోలు ఆ స్థాయి నాయకులు, ముందుగా తయారు చేసి సిద్ధంగా వుంచుకున్న ప్రసంగపాఠం చదవడం ఓ సాంప్రదాయంగా వస్తోంది.   అయితే ప్రసంగాలలో ఘనాపాటి అనిపించుకుంటున్న నరేంద్ర మోడీకి పాఠం ఒప్పచెప్పినట్టు, ఇలా రాసుకున్న ప్రతిని చదవడం రుచించక పోవచ్చు. అలా అని గత పాలకులను, వారి పరిపాలనను కించ పరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదనే చెప్పాలి. సరే! ఇదేమంత పెద్ద విషయం కాదు. సరిచేసుకోదగ్గ సంగతే.
పొతే, నరేంద్ర మోడీ ఈ సారి జరిపిన అమెరికా పర్యటన కాలాన్ని సాధ్యమైనంత సద్వినియోగం చేసుకోవడానికే ప్రయత్నించారు. భద్రతా మండలిలో భారత సభ్యత్వం అంశాన్ని సభ్యదేశాలకు మరోమారు గట్టిగా నొక్కి  చెప్పారు. అమెరికాకు చెందిన కార్పోరేట్ దిగ్గజాలతో, గూగుల్, మైక్రో సాఫ్ట్, ఫేస్ బుక్, ఆపిల్  మొదలయిన సిలికాన్ వ్యాలీ  అధినేతలతో సమావేశాలు జరిపారు. గత ముప్పయి ఏళ్లలో  అనేకమంది భారత ప్రధానులు అమెరికాలో అధికార పర్యటనలు జరిపారు. కానీ, సిలికాన్ వ్యాలీ సందర్శించి, భారత్ లో జరుగుతున్న డిజిటల్ విప్లవం గురించి అక్కడివారికి తెలియచేయడానికి ప్రయత్నించిన మొదటి ప్రధాని మోడీనే కావడం విశేషం. అంతే కాదు ‘ఫార్ట్యూన్ – 500’ జాబితాలో వున్న నలభయ్ రెండు కంపెనీల సీ.ఈ.ఓ. ల సమావేశంలో మోడీ ప్రసంగించారు. ‘భారత దేశం అంటే రెడ్ టేపిజం కాదనీ, రెడ్ కార్పెట్’ అనీ తనదయిన శైలిలో మోడీ చేసిన చమత్కార ప్రసంగం ఆహూతులను ఆకట్టుకుందని మీడియా అభివర్ణించింది. ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి ఆ సంస్థ అధినేత జుకర్ బర్గ్ తో ప్రధానమంత్రి మోడీ జరిపిన సమావేశం ప్రపంచవ్యాప్త ప్రచారానికి నోచుకుంది. సాంకేతిక విద్యార్హతలు ఏవీ లేకపోయినా, నూతన సాంకేతిక అంశాల పట్ల ఆ వయస్సులో నరేంద్ర మోడీ  కనబరుస్తున్న ఆసక్తి బహుశా వారిని బాగా ఆకట్టుకుని వుంటుంది.
భారత ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోడీ గత కొద్ది కాలంలోనే రికార్డు స్థాయిలో విదేశీ పర్యటనలు చేసారు. ఆయన చేసిన పర్యటనల ఫలితాలకంటే, ఆ పర్యటనల తీరు తెన్నులపై మీడియాలో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వెలువడిన వ్యాఖ్యలు, కార్టూన్లు ఆయన స్థాయికి తగ్గట్టుగా లేవనే అభిప్రాయం ప్రచారంలోకి వచ్చింది. గతంలో  మోడీ విదేశ పర్యటన ముగించుకుని స్వదేశం తిరిగి వస్తున్నప్పుడు, ‘ప్రధాని మోడీ స్వల్ప కాలిక పర్యటనపై రేపు భారతదేశం వస్తున్నారని’ సోషల్ మీడియాలో  ఒక వ్యాఖ్య వచ్చింది. ఇటువంటివి ప్రచారంలో వుండడం  ఆ ఆస్థాయిలో వున్న  వ్యక్తులకు శోభస్కరం కాదు.
ఏది ఏమైనా అమెరికాలో నివసిస్తున్న అశేష భారతీయులు, వారి వారి రాష్ట్రాలతో, భాషలతో, రాజకీయాలతో నిమిత్తం లేకుండా మోడీ అమెరికాలో జరిపిన పర్యటనని చక్కగా  స్వాగతించారు. అయన చేసిన ప్రతి ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించారు. ఈ విధంగా మోడీ అక్కడి భారతీయుల మనస్సులను ఆకట్టుకోగలిగారు. ఈ కోణం నుంచి మోడీ పర్యటన అనుకున్న దానికన్నా విజయవంతం అయిందనే చెప్పుకోవాలి. (30-09-2015)

రచయిత ఈ మెయిల్:  bhandarusr@gmail.com మొబైల్: 98491 30595 
NOTE: Courtesy Image Owner                                                  

29, సెప్టెంబర్ 2015, మంగళవారం

సాయంత్రం ఖాళీయేనా?


ఎర్రబడ్డ మొహంతో బాస్ గదిలోనుంచి బయటకు వచ్చింది.
“బుద్ధిలేని మనిషి, ఆడవాళ్ళతో ఇలాగానేనా మాట్లాడేది”
“లోపల ఏం జరిగిందేవిటి?”
“ఈ సాయంత్రం ఖాళీగా వుంటావా? వేరే ఏదన్నా పని ఉందా?’ అని అడిగాడు”
“నువ్వేమన్నావు”
“ఖాళీ గానే వుంటాను అని చెప్పాను”
“అతనేమన్నాడు?”
“ఏవన్నాడు? ఇవిగో ఈ కాగితాలన్నీ చేతికి ఇచ్చి టైప్ చేయమన్నాడు”


NOTE: Courtesy Image Owner

నోటికి తాళం


పెదవి దాటిన  మాట పృధివి దాటుతుందంటారు.
అందుకే ఏదయినా ఒక మాట అనేముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలని పెద్దలంటారు.
దీనికి ఉదాహరణగా ఇంగ్లీష్ లో ఓ  కధ నెట్  సంచారం చేస్తోంది.
అదేమిటంటే-
అనగనగా ఒక పెద్దమనిషి. వూళ్ళో నలుగురి గురించీ నాలుగు రకాలుగా వ్యాఖ్యానాలు చేయడం ఆయనకో అలవాటు. నిజమో కాదో నిర్ధారణ చేసుకోకుండా అందరి మీదా నీలాపనిందలు మోపడం ఆయనకో  హాబీ. అందులో భాగంగా, ‘పక్కింటి కుర్రాడు దొంగ’ అంటూ తేలిగ్గా అతడిపై  ఓ నెపం మోపాడు. అంతటితో ఆగకుండా వైనవైనాలుగా ప్రచారాలు చేసి ‘ఆ కుర్రవాడు నిజంగానే నిజం దొంగ’ అని నలుగురు నమ్మేలా చేసాడు. పోలీసులు కూడా అది నిజమని నమ్మి ఆ కుర్రాడిని పట్టుకుని జైల్లో వేసారు. శిక్ష అనుభవించి తిరిగొచ్చిన తరువాత ఆ కుర్రాడు సదరు పెద్దమనిషిపై పరువునష్టం దావా వేసి కోర్టుకు లాగాడు.
పోతే, న్యాయమూర్తి ముందు ఆ పెద్దమనిషి మాట మార్చాడు. తానేదో ఉబుసుపోకకు అన్న మాటలే కాని ఆ కుర్రాడు దొంగ కాదన్నాడు. అతడిని బాధ పెట్టే  ఉద్దేశ్యం లేదన్నాడు.
జడ్జి అంతా విని, అతగాడికి ఓ కాగితం ఇచ్చి ఆ కుర్రాడిని గురించి లోగడ అన్న మాటలన్నీ దానిమీద రాయమన్నాడు. ఆ కాగితాన్ని ముక్కలుగా చించి ఇంటికి వెళ్ళే దారిలో విసిరేసి మర్నాడు కోర్టుకు రమ్మన్నాడు.
ఆ పెద్దమనిషి న్యాయమూర్తి చెప్పినట్టే చేసి మరునాడు కోర్టులో జడ్జి ముందు బోనులో నిలబడ్డాడు.
న్యాయమూర్తి తీర్పుచెప్పబోయేముందు,  విసిరేసిన కాగితం ముక్కలు తనకు చూపించమన్నాడు.  ‘ఇంకా అవెక్కడున్నాయి. ఎప్పుడో గాలికి  కొట్టుకుపోయాయి’ అని పెద్దమనిషి జవాబు చెప్పాడు.
అప్పుడు న్యాయమూర్తి ఇలా అన్నాడు.
వేళాకోళంగా అనే మాటలు కూడా చింపిపారేసిన కాగితం ముక్కలు లాంటివే.  గాలికి కొట్టుకుపోయిన వాటిని తిరిగి తేలేనట్టే చెడుపు చేసే మాటల్ని  కూడా. అవి అవతలి వ్యక్తికి  చేసే అపకారాన్ని గురించి కాసేపు ముందే ఆలోచిస్తే అలాటి మాటలు అనడానికి కాస్త సంకోచిస్తాము. ఏదో మాటే కదా! అన్నంతమాత్రానికే   ఏమవుతుంది అనుకుంటే ఒక్కోసారి ఇలాగే అవుతుంది. ఎదుటివాడిని గురించి మంచి చెప్పలేనిపరిస్తితే వుంటే అప్పుడు కనీసం  అసలేమీ చెప్పకపోవడం మంచిది.
మన నాలికకి మనమే యజమానులం. మనం చెప్పినట్టే అది మాట్లాడాలి. అది మాట్లాడినట్టల్లా మనం తలాడించకూడదు. ఆడిస్తే ఇలాగే తల దించుకోవాల్సిన పరిస్తితి ఎదురవుతుంది.
ముగించాడు న్యాయమూర్తి మందలింపుగా.

నీతి: నోటికి ఇలా  తాళం వేసుకోలేకపోయినా నాలుకను సంభాలించుకోవడం ఉత్తమం.
NOTE: Courtesy Image Owner 


26, సెప్టెంబర్ 2015, శనివారం

ఉద్యమ దీక్షలు


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 27-09-2015, SUNDAY)

ఆమరణమా, నిరవధికమా అన్న విషయం పక్కన పెడితే ఆంద్ర ప్రదేశ్ నూతన రాష్ట్రానికి ప్రత్యెక హోదా సాధనకోసం వై.ఎస్.ఆర్.సి.పీ . అధ్యక్షుడు జగన్ మోహన రెడ్డి తలపెట్టిన నిరాహార దీక్ష ప్రస్తుతం మీడియాలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం, కోర్టు నుంచి సానుకూల ఆదేశాలు తెచ్చుకోవడానికి ఆ పార్టీ చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడం, ఇక చేసేది లేక దీక్ష తేదీలను మార్చుకోవాల్సిరావడం ఇవన్నీ రాజకీయంగా ఆ పార్టీకి కొన్ని తలనొప్పులు తెచ్చే మాట వాస్తవమే. ‘వై.సీ.పీ. కి ఇదొక పరాజయం’ అంటూ  టీడీపీ శ్రేణులు ఇప్పటికే ప్రచారం ప్రారంభించాయి. టీవీ ఛానళ్లలో కూడా విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఒక దురదృష్టకర పరిణామం ఏమిటంటే, ఏ అంశం తీసుకున్నా అది చివరకు టీడీపీ, వై.ఎస్.ఆర్.సీ.పీ. అనే ఓ రెండు పార్టీల నడుమ వ్యవహారంగానే మలుపులు తీసుకోవడం, రంగులు  మారడం జరుగుతోంది.  నిజానికి ఇది ఎంతమాత్రం వాంఛనీయం కాదు. ప్రత్యేక హోదా కోసం జగన్ ఉద్యమం చేయడాన్ని టీడీపీ రాజకీయ ఎత్తుగడగానే భావిస్తోంది. చేస్తున్న ఆందోళన ఫలితం టీడీపీకి రాజకీయంగా నష్టం కలిగించే విధంగా వుండాలని వైఎస్ ఆర్ సీపీ భావిస్తున్నట్టు వుంది. ప్రత్యెక హోదా అనేది యావత్ ఆంద్ర ప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడేది అన్న భావం కనుమరుగయి, ఈ రెండు  పార్టీల మధ్య వాతావరణం యుద్ధాన్ని  తలపించేదిగా తయారవుతోంది. ‘అనుమతి లేకపోయినా దీక్ష జరిపి తీరుతాం’ అంటూ వై.ఎస్.ఆర్.సీ.పీ. నాయకులు మొదట చేసిన ఆర్భాటపు  ప్రకటనలు, ‘చావడానికి ఎవరయినా అనుమతి ఇస్తారా?’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఈ పరిస్తితికి అద్దం పడుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి తలపెట్టింది ఆమరణ దీక్ష అనీ, అందుకే పోలీసులు అనుమతి ఇవ్వకపోయి వుండొచ్చని టీడీపీ వాదనగా వుంటే, అది నిరవధిక దీక్ష అని వైసీపీ నాయకులు వివరణ ఇస్తున్నారు. దీక్ష ఉద్దేశ్యం రాష్ట్ర ప్రయోజనాలకోసం అయినప్పుడు అనుమతి ఇవ్వకుండా అడ్డుపడడం ఎందుకని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. గతంలో ప్రతిపక్షంలో వున్నప్పుడు  చంద్రబాబు నాయుడు చేసిన నిరవధిక దీక్షలను ఎత్తి చూపుతోంది. ముందే చెప్పినట్టు ఆ తెలుగు రాష్ట్రం చేసుకున్న దురదృష్టం ఏమిటో కానీ పాలక పక్షం టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం, ఏకైక ప్రతిపక్షం అయిన వైసీపీ రెండూ ఉప్పూ నిప్పూ తరహా పోరులో నిత్యం మునిగి తేలుతున్నాయి. ‘నిరవధిక నిరాహార దీక్ష చేస్తే ప్రత్యెక హోదా వచ్చే అవకాశం లేద’ని టీడీపీ అంటుంటే, ‘ఎలా వచ్చినా, ఎవరివల్ల వచ్చినా అది రాష్ట్రాన్ని పాలిస్తున్న టీడీపీకి మాత్రమే  కలిసివచ్చే అంశం అయినప్పుడు, ప్రతిపక్షంగా తాము చేస్తున్న ఉద్యమానికి అధికార  పార్టీ అడ్డుతగలడం ఎంతవరకు సబబ’న్నది జగన్ మద్దతుదారులు లేవదీస్తున్న పాయింటు. ఇటువంటి వ్యవహారంలో ఏ పార్టీది బాధ్యతారాహిత్యం అయినా కూడా చివరికి నష్టపోయేది రాష్ట్ర ప్రయోజనాలే అన్న ఎరుక ఆ రెండు పార్టీల్లో కానరావడం లేదు. ‘ఈ ఇరుపక్షాల  పోరు ఏ మలుపు తీసుకుంటుంది, ఎప్పుడు తీసుకుంటుంది?’ అన్నది ఇక కాలమే తేల్చాలి.
పొతే ఈ నిరాహార దీక్షల కధాకమామిషూ ఓసారి పరిశీలిద్దాం.
ఒక రకంగా రామాయణ కాలంలోనే ఈ నిరాహార దీక్షలకు తొలి బీజం పడింది. పితృవాక్యపరిపాలన కోసం రాముడు రాజ్యాన్ని విడిచి అడవి బాట పట్టినప్పుడు, రాముని తమ్ముడు భరతుడు, అన్నగారు వున్న అరణ్యానికి వెళ్లి ఆయన్ని కలుసుకుని  తిరిగి రాజ్యాధికారం స్వీకరించమని పరిపరి విధాల వేడుకుంటాడు. అతడి అభ్యర్ధనని  రాముడు నిరాకరించడంతో నిరాశకు గురయిన భరతుడు,  అక్కడికక్కడే దర్భలు పేర్చుకుని ఆమరణ నిరాహార దీక్షకు సంసిద్ధుడౌతాడు. చివరకు రాముడే నచ్చచెప్పడంతో భరతుడు దీక్ష విరమించి రాముని పాదుకలు తీసుకుని మరలిపోతాడు. ఇదొక ఐతిహ్యం.
పొతే, నిరాహార దీక్షకు పూనుకుని ప్రాణాలు ఒదిలిన సంఘటనలు చరిత్రలో రెండే రెండు నమోదయ్యాయి.  ఆంద్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు, 1952 లో మద్రాసులోని మహర్షి బులుసు సాంబమూర్తి నివాసంలో   ప్రా యోపవేశానికి పూనుకుని యాభయ్ ఎనిమిది రోజుల తరువాత కన్ను మూసి అమరజీవి అయిన  ఉదంతం వీటిల్లో ఒకటి కాగా, స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ పాలకులతో పోరాడిన విప్లవ వీరుడు జతిన్ దాస్, నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాలు ఒదిలిన సంఘటన మొట్ట మొదటిది. 1929 లో   లాహోర్ జైల్లో నిర్బంధించబడిన రోజుల్లో,  భారత స్వతంత్ర యోధులకు కూడా యూరోపు రాజకీయ ఖయిదీలకు ఇచ్చే సదుపాయాలు కలుగచేయాలని కోరుతూ ఆమరణ దీక్ష మొదలు పెట్టి, 63 రోజుల తరువాత జతిన్ దాస్  కన్నుమూసిన సంగతి చరిత్ర పుటల్లో వుంది. ఇక నిరాహార దీక్షల విషయంలో  మహాత్మా గాంధీ రికార్డు ఎన్నతగింది. మరో గొప్ప రికార్డు, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు  మాస్టర్ తారాసింగ్ ఖాతాలో వుంది. పంజాబీ సుబా సాధన కోసం  1961 లో ఆయన 48 రోజులు నిరాహార దీక్ష జరిపారు. ఆయన అడుగు జాడల్లోనే సంత్ ఫతే సింగ్, పంజాబీ మాట్లాడేవారికి ప్రత్యెక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ అనేక పర్యాయాలు నిరాహారదీక్షలు జరిపారు. 1965 ఆగస్టు 16 న దీక్ష మొదలు పెడతాననీ, సెప్టెంబర్ ఇరవై అయిదు ఉదయం తొమ్మిది గంటలలోగా ప్రత్యెక రాష్ట్రం ఏర్పాటు  గురించిన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడకపోతే ఆత్మాహుతి చేసుకుంటానని గడువు విధించి మరీ  దీక్ష ప్రారంభించాడు. అయితే, భారత పాక్  సరిహద్దుల్లో చెలరేగిన సైనిక సంఘర్షణల నేపధ్యంలో సంత్ ఫతేసింగ్ తన దీక్షా యోచన విరమించుకున్నారు. భారత ప్రధానమంత్రిగా పనిచేసిన కురు వృద్ధుడు మొరార్జీ దేశాయ్ కూడా డెబ్బయ్యవ దశకంలో రెండు పర్యాయాలు నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. గతంలో టీడీపీ అధినాయకుడు, కీర్తిశేషులు ఎన్టీ రామారావు కూడా టాంక్ బండ్ పై దీక్షకు కూర్చున్నారు. తెలంగాణా సాధన కోసం టీ.ఆర్.ఎస్. అధినేత కే.చంద్రశేఖర రావు జరిపిన నిరాహార దీక్ష కూడా బహుళ ప్రాచుర్యం పొందింది. 1969 తెలంగాణా ఉద్యమానికి తొలి బీజం, ఖమ్మం పట్టణంలోని  గాంధీ చౌక్ లో రవీంద్రనాథ్ అనే విద్యార్ధి  చేసిన నిరాహారదీక్షలో పడింది.    
పొతే విశాఖ ఉక్కు కర్మాగారం కోసం అమృతరావు అనే పెద్ద మనిషి అనేక పర్యాయాలు మొదలు పెట్టి విరమించిన నిరాహార దీక్షలు, ప్రజలకు వాటిపట్ల చులకన భావం కలిగేలా చేసాయి.
ఇలా చరిత్రలో ఎన్నో సంఘటనలు. కొన్ని నిరాహార దీక్షలు ఫలితాలు ఇచ్చాయి. మరికొన్ని ప్రచారార్భాటాలుగా మిగిలిపోయాయి. (26-09-2015)

రచయిత ఈ మెయిల్:bhandarusr@gmail.com మొబైల్: 98491 30595                            

25, సెప్టెంబర్ 2015, శుక్రవారం

నిఖార్సయిన పోలీసు అధికారి


(ఈరోజు అనుకోకుండా  మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్, తమిళనాడు  మాజీ గవర్నర్  శ్రీ పీ ఎస్ రామమోహన రావు గారిని కలుసుకోవడం జరిగింది. బహుశా దశాబ్దానికి పై చిలుకు మాటే వారిని కలిసి. ఎంతో ఆప్యాయంగా పలకరించి పాత సంగతులు గుర్తు చేసుకున్నారు. తన పక్కన వున్న  పెద్దమనిషికి  నన్ను పరిచయం చేస్తూ, ‘ఇతడు శ్రీనివాసరావు, హెల్మెట్  ఫేం ‘ అన్నారు సరదాగా. ఇంటికి వచ్చిన తరువాత రామ్మోహన రావు గారి గురించి  మదిలో మెదిలిన పాత  జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు) 



అసలు సిసలు పోలీసు అధికారి పీ ఎస్ రామమోహన రావు గారితో కొన్ని మరచిపోలేని అనుభవాలు వున్నాయి. నేను మాస్కో వెళ్ళేటప్పుడు ఆయన డీజీపీ. అప్పటికే కొందరం జర్నలిస్టులం మొదలు పెట్టిన యాంటీ హెల్మెట్ ఉద్యమంతో సీనియర్ పోలీసు అధికారులు మా పట్ల మనస్తాపంతో వున్నారు. నన్ను అరెస్టు చేయడం, ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా దర్యాప్తు కోసం వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటుచేయడం, ఆ వెంటనే నా మాస్కో ప్రయాణం - మా నడుమ సత్సంబంధాలలో పైకి కనబడని తేడా తీసుకువచ్చాయి. మాస్కో వెళ్ళబోయేముందు డీజీపీ రామమోహన రావు గారిని ఆయన ఆఫీసుకు వెళ్ళి కలిసాను. చాలా ఆప్యాయంగా పలకరించి క్షేమ సంచారాలు కనుక్కుని వీడ్కోలు చెబుతూ ఒక మాట అన్నారు. ‘మాస్కోలో పోలీసులతో జాగ్రత్త. మన దగ్గరలా హెల్మెట్ల విషయంలోలా ఠలాయిస్తే కుదరదు.’
వయసు అలాటిది మరి. నేనూ అలానే జవాబు చెప్పాను. ‘మాస్కో చాలా చలి ప్రదేశం అని విన్నాను. మంచు కురిసే రోడ్లపై ‘టూ వీలర్స్ ఎలౌ చేయరనుకుంటాను’
రామమోహన రావుగారు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా వున్నప్పుడు ఖమ్మం బస్ స్టాండులో ఒక ఉద్యోగితో సీటు రిజర్వేషన్ విషయంలో పేచీ వచ్చింది. హైదరాబాదు రాగానే ఘాటుగా ఓ పిర్యాదు రాసి పంపించాను. మూడు రోజుల తరువాత అనుకుంటాను అదే ఉద్యోగి మా మేనల్లుడిని వెంటబెట్టుకుని హైదరాబాదు వచ్చాడు.
ఏదో తెలియక చేసాడు, ఇప్పుడు ఎమ్డీ గారు నీ పిర్యాదు మీద చాలా దూరం ట్రాన్సఫర్ చేశారు, నాకు బాగా తెలిసిన వాళ్లు. నువ్వే మళ్ళీ ఏదో సర్ది చెప్పి బదిలీ క్యాన్సిల్ చేయించు’ ఇదీ మా వాడి రాయబారం.
సరేనని ఆయన ఆఫీసుకు వెళ్ళి కలిసి విషయం చెప్పాను. అప్పుడాయన ఇలా అన్నారు.
మీరు కంప్లయింటు ఇచ్చారు. మీ మీద గౌరవం కొద్దీ విచారణ కూడా జరపకుండా బదిలీ చేసాను. అదీ నేను చేసిన పొరబాటు. ఇప్పడు మీ మాట విని మరో పొరబాటు చేయడం ఇష్టం లేదు. బదిలీ క్యాన్సిల్ చేయడం చిటికెలో పని. కాని సంస్థలో డిసిప్లిన్ మాటేమిటి. ఎమ్డీ ట్రాన్స్ఫర్ చేస్తే నాకొక లెక్కా! ఒక్క రోజులో మళ్ళీ క్యాన్సిల్ చేయించుకున్నానని అందరితో చెప్పుకుంటాడు. క్రమశిక్షణ దెబ్బతింటుంది. ముందు పోయి వేసిన చోట జాయిన్ కమ్మని చెప్పండి. ఓ ఆరు నెలల తరువాత మళ్ళీ వెనక్కు వేస్తాను’
దట్ ఈజ్ రామ్మోహనరావు గారు!

23, సెప్టెంబర్ 2015, బుధవారం

నదుల అనుసంధానం – మంచీ చెడూ

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 24-09-2015, THURSDAY)

నదుల అనుసంధానం అనే పదం దేశంలో ఇప్పుడు త్వరితగతిన ప్రాచుర్యం పొందుతోంది. అటు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఇటు ఆంద్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం నదుల అనుసంధాన కార్యక్రమాలకు ఇస్తూవస్తున్న ప్రాధాన్యత కూడా ఇందుకు దోహదం చేస్తుండవచ్చు.

ఈ అనుసంధాన ప్రక్రియకు ఈ నెలలోనే తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అంకురార్పణ జరిగింది. గోదావరి జలాలను కృష్ణా నదిలో కలిపేందుకు ఉద్దేశించిన పట్టి సీమ ప్రాజెక్టును అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద పూర్తి చేసి, గోదావరి నీళ్ళను కృష్ణలో కలిపి రికార్డు వ్యవధిలో ఆ పని పూర్తి చేశానని సగర్వంగా ప్రకటించింది. అనేకానేక బాలారిష్టాలను దాటుకుంటూ పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసినట్టు ప్రభుత్వం అయితే ఆర్భాటంగా చెప్పుకుంటోంది కాని ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి వున్నాయి. ఎవరి అనుమానాలు  వారికి వున్నాయి. ఉండడమే కాదు వాటిని బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు కూడా. చెప్పిన గడువులోగా పని పూర్తిచేసిన ఘనతను తన ఖాతాలోకి వేసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం కొంత అనవసర ప్రయాస పడ్డదేమో అనికూడా అనిపిస్తోంది. తొందరగా పనిపూర్తిచేసి సకాలంలో పొలాలకు నీళ్ళు అందించే ప్రయత్నం హర్షించతగ్గదే, ములుకోల చేత  పట్టి అధికారగణాన్నీ, కాంట్రాక్టర్లను అదిలించకపోతే పనులు ముందుకు సాగని మాట వాస్తవమే. అయితే ఇటువంటి భారీ ఇంజినీరింగు వ్యవహారాల్లో కొన్ని సాంకేతికపరమైన వ్యవధానాలతో పనులు చక్కబెట్టుకోవాల్సిన అవసరం వుంటుంది. రాత్రికి రాత్రే కాలువలు తవ్వించడం వీలయినట్టు, గడువులు నిర్దేశించి ఆక్విడక్టు నిర్మాణాలు చేయడం  సాధ్యం కాకపోవచ్చు. అలా వీలు కాదని, నీళ్ళు ఒదిలిన వెంటనే  కూలిపోయిన ఆక్విడక్టు కధే చెబుతోంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి అనే చర్చ కన్నా, ఇటువంటివి జరగకుండా చేయడంలో బాధ్యత వహించి పనిచేయడం అనేది బాధ్యత కలిగిన ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం. కాకపొతే భారీ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో కొన్ని ఇటువంటి అవాంతర పరిస్తితులు తలెత్తడం సహజం కూడా. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు పోవాలి. మంత్రులు, అధికారుల మీదా, అధికారులు కాంట్రాక్టర్ల మీదా నెపాలు మోపుకుంటూ సమస్యను సాగదీయడం తగని పని. ఇక ప్రతిపక్షాలు యాగీ చేయకుండా వూరుకోవడం ఇలాటి సందర్భాల్లో అసాధ్యం. వాటికి ఆ నైతిక హక్కు లేదనడం ఒకప్పుడు ప్రతిపక్షంలో వున్నప్పుడు ఇటువంటి ఆరోపణలే చేసిన పాలక పక్షానికి తగదు. సరే! ఇప్పుడు కొత్తగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న  రాజకీయాల తీరుతెన్నులే ఆవిధంగా వున్నప్పుడు చెబితే వినేవారు ఉంటారని అనుకోవడం అత్యాశే అవుతుంది.
పొతే, అసలు నదుల అనుసంధానం అనే ప్రక్రియ మీదనే జాతీయ స్థాయిలో పుంఖానుపుంఖాలుగా చర్చలు సాగుతున్నాయి. కొందరు ఆహా ఓహో అని ప్రశంసిస్తూ వుంటే మరికొందరు దండగమారి వ్యవహారం అని ఎద్దేవా చేస్తున్నారు. మరికొందరు పర్యావరణ ప్రేమికులు ఏకంగా నదుల అనుసంధానాలను వ్యతిరేకిస్తున్నారు. ఒక వాదం మంచిదనీ, మరో వాదం చెడ్డదనీ చెప్పలేని పరిస్తితి. ప్రతి విషయంలో మంచీ చెడూ రెండూ ఉన్నట్టే ఇదీ అందుకు మినహాయింపు కాకపోవచ్చు. కాకపోతే ఈ మంచి చెడుల నడుమ పైకి కనబడని ఓ సన్నని విభజన రేఖ వుంటుంది. దాన్ని పట్టుకోగలిగితే మంచిని పెంచుకుంటూ, చెడు తీవ్రతని తగ్గించుకుంటూ మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చు.
నదులనేవిఎక్కడో పుట్టి, ఎక్కడెక్కడో పారి మరెక్కడో సుదూరాన కడలిలో  కలుస్తుంటాయి. అవి ప్రవహించే దారిలో తమ దాపున వున్న పల్లపు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ వెడతాయి. ఆ నదీ పరివాహక ప్రాంతంలో వున్న ప్రదేశాలు వాటి ఉనికికి అనుగుణంగా ప్రయోజనం పొందుతాయి. నీరు పల్లమెరుగు అనే సామెతకు తగ్గట్టుగా ఎగువ ప్రాంతాలకన్నా దిగువన వుండే ప్రాంతాలకు లబ్ది ఎక్కువ చేకూరుతుంది. ఇది ఆయా ప్రాంతాలకు ప్రక్రుతి ప్రసాదించే వరం, శాపం కూడా. అయితే తద్విరుద్ధంగా భారీ మోటార్లు వాడి పంపుల ద్వారా ఎగువ ప్రాంతాలకు కూడా నీరును తోడిపోసే సాంకేతిక ప్రక్రియలు ఉపయోగించి పట్టిసీమ వంటి ప్రయోగాలు జరుగుతున్నాయి.  
దేశంలో వున్న వేలాది నదుల్లో కొన్ని మాత్రమె జీవనదులు. చాలావరకు వర్షాధారంగా పారే నదులు. అందువల్ల వీటిని అనుసంధానం చేయడం ద్వారా ఎక్కువ ఫలితాలను సాధించవచ్చనీ, వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని పంటపొలాలకు మళ్ళించవచ్చనీ అనుసంధాన ప్రక్రియ మద్దతుదార్లు అంటున్నారు. అయితే ఇదేమీ కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచన అయితే కాదు. ఎన్నో దశాబ్దాల క్రితమే కాటన్ దొర వంటి వారు దీన్ని ప్రయోగాత్మకంగానే కాదు శాశ్విత ప్రాజెక్టులు నిర్మించి మరీ రుజువు చేసారు. ఆయన హయాంలోనే గోదావరి, కృష్ణా జలాల అనుసంధానం జరిగింది. అలాగే,  గంగా కావేరీ అనుసంధానం చేయాలని  ఎన్నో ఏళ్ళ నాడే ప్రముఖ ఇంజినీరు కేఎల్ రావు తలపోసి ప్రణాళికలు కూడా సిద్ధం చేసారు.
అలాటి ఆలోచనలే నేటి పాలకులు చేస్తున్నారు. ఇందుకోసం జాతీయ స్థాయిలో నదీనదాల అనుసంధానానికి భారీ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటి లెక్కల ప్రకారం వీటిని పూర్తి చేయడానికి అక్షరాలా పదకొండు లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా. అంచనాలే ఈ స్థాయిలో వుంటే ఈ భారీ పధకాలు పూర్తయ్యేనాటికి ఇవి ఏమేరకు పెరుగుతాయన్నది అంత సులభంగా అంచనా వేయలేని వ్యవహారం. ఇక ఈ ప్రాజెక్టు గణాంకాలు చూస్తే కళ్ళు చెదురుతాయి. నీరు సమృద్ధిగా పారే 37 హిమనదాలను నీటి లభ్యత తక్కువగా వుండే దేశంలోని ఇతర నదులతో కలిపి వాటిని కూడా స్వయం సమృద్ధ జలవనరులుగా మార్చడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందులో భాగంగా నదులను కలుపుతూ, యాభయ్ నుంచి వంద అడుగుల వెడల్పున్న  30 కాలువలను పదిహేను వేల కిలోమీటర్ల పొడవున తవ్వుతారు. చిన్నా పెద్దా అన్నీ కలిపి మూడువేల రిజర్వాయర్లు నిర్మిస్తారు. తద్వారా ఎనిమిది కోట్ల డెబ్బయి లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తారు. దీనికి తోడు,  మొత్తం  34 గిగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి మార్గం వేస్తారు.  నిజంగా కళ్ళు చెదిరే ప్రాజక్టే. సరిగ్గా అమలు చేయకపోతే, అంతకంటే నిజంగా అంతంత ప్రజాధనం నీళ్ళ పాలు చేసే ప్రాజక్టే.
అయితే  ఇదొక పార్శ్వం. ఇది రంగుల కల. నిజం అయితే, నిజం చేయగలిగితే అంతకంటే కావాల్సింది లేదు.
మరో వైపు పర్యావరణ శాస్త్రవేత్తలు, ప్రకృతి ప్రేమికులు దీన్ని పీడకలగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పరిణామాలు భయంకరంగా ఉంటాయని, పూర్తి బాధ్యతా రాహిత్యంతో కూడిన ఆలోచన అనీ కొట్టిపారేస్తున్నారు.
నదులు ప్రవహించే తీరు ప్రకృతికి అనుగుణ్యంగా ఉంటుందనీ, దానికి విఘాతం కల్పించడం వల్ల తాత్కాలిక ప్రయోజనాలు సిద్ధించినప్పటికీ దీర్ఘకాలంలో ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుందనీ వారి వాదన. ఏ నదికి ఆ నది  కొన్ని ప్రత్యేకతలు కలిగి వుంటుంది. పొడవైన కాలువలు తవ్వి వాటిని కలిపే ప్రయత్నంలో నదుల నడుమ వున్న రక్షిత అటవీ ప్రాంతాలు విధ్వంసానికి గురవుతాయి. ప్రకృతికి కొన్ని సహజ లక్షణాలు వుంటాయి. వాటిని విధ్వంసం చేయాలని  చూస్తే విలయకారకమవుతాయి అనేది హెచ్చరికతో కూడిన వారి అభిప్రాయం.
జలవనరులను కాపాడుకోవడానికి నదుల అనుసంధానం ఒక్కటే మార్గం కాదు. వాటర్  షెడ్స్, వర్షాల వల్ల సమకూరే నీటిని భవిష్యత్ అవసరాలకు భద్రపరచుకోవడం, భూగర్భ జలవనరులను పెంచుకోవడం, ఇంకుడు గుంతలు, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు పండించే పద్దతుల్ల్లో మార్పులు చేసుకోవడం ఇలా అనేక ప్రత్యామ్నాయాలు వుంటాయి. వాటినన్నింటినీ పూర్తిగా వాడుకున్న తరువాతనే నదుల అనుసంధానం వంటి భారీ ప్రాజెక్టులను గురించి తలపెట్టాలన్నది వారి మనోగతం.
ప్రభుత్వాలు నడిపేవారికి వారి ఆలోచనలు వారికి వుంటాయి. సమాజ హితంతో పాటు సొంత రాజకీయ ప్రయోజనాలు కూడా చూసుకోకతప్పదు.
పర్యావరణ పరిరక్షకులకి వీటితో నిమిత్తం వుండదు. వారిది ఒకటే కోణం.
మరి మధ్యే మార్గం ఏమీ ఉండదా!
వుండే వుంటుంది.
కాకపొతే,  వెతుక్కునే ఓపిక వుండాలి. వినే  తీరిక వుండాలి. 
(23-09-2015)

రచయిత ఈ మెయిల్:  bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595 

చీరే మేరే సప్నే


నా నలభయ్ అయిదేళ్ళ వైవాహిక జీవితంలో రెండే రెండు సార్లు మా ఆవిడకు చీరెలు కొన్న సందర్భాలు వున్నాయి. అంటే ఇన్నేళ్ళుగా ఆవిడ ఆ రెండు చీరెలతోనే నెట్టుకొస్తున్నదని అర్ధం కాదు. నేను మళ్ళీ ఎప్పుడూ కొనలేదని మాత్రమే దీని తాత్పర్యం. ఆ రెండు సందర్భాలు బాగా గుర్తుండి పోవడానికి కూడా కారణాలు వున్నాయి.
చాలా ఏళ్ళక్రితం ఒక బ్యాంకు తాలూకు మనిషి పనికట్టుకుని మరీ మా ఆఫీసుకువచ్చి వివరాలు అడిగి తీసుకుని పోస్టులో ఓ క్రెడిట్ కార్డు పంపించాడు. క్రెడిట్ కార్డులు అప్పుడే రంగ ప్రవేశం చేస్తున్న రోజులవి. అది నా గొప్పదనం అనుకున్నాకాని, నేను చేస్తున్నది  సెంట్రల్ గవర్నమెంటు నౌఖరీ కాబట్టి ఆ బ్యాంకు అంత ఉదారంగా ఆ కార్డు మంజూరు చేసిందన్న వాస్తవం అప్పట్లో నాకు బోధపడలేదు.
కార్డు చేతికి వచ్చింది కానీ దాన్ని వాడి చూసే  అవకాశం మాత్రం వెంటనే నాకు రాలేదు. అప్పట్లో ఇప్పట్లా ఏటీఎం లు లేవు. ఏదయినా వస్తువు కొనుగోలు చేసినప్పుడు మాత్రమె కార్డు వాడే వీలుండేది. ఓసారి బెజవాడ టూర్ వెళ్ళినప్పుడు మా ఆవిడకోసం బీసెంటు రోడ్డు షాపులో అయిదారొండలు పెట్టి,  ఆ క్రెడిట్ కార్డు వాడి, ఓ చీరె కొన్నాను.  అంత వరకు బాగానే వుంది. మరుసటి నెల నుంచీ ఆ బ్యాంకు తాఖీదులు రావడం, ఆ కిస్తీ కట్టే బ్యాంకు ఎక్కడో సికిందరాబాదులో వుండడం, అంతంత దూరాలు పోయి  ఓ వందో, యాభయ్యో చెల్లు వేసి రావడానికి సహజ బద్ధకం అడ్డం రావడం ఇత్యాది కారణాలతో నాకూ ఆ బ్యాంకుకూ నడుమ సంబంధ బాంధవ్యాలు పూర్తిగా చెడిపోయాయి. చీరె తాలూకు అప్పు మొత్తం వడ్డీలతో పేరుకు పోయి, అయిదారువేలకు చేరడం, చివరికి ఆఫీసులో పీఎఫ్ అడ్వాన్సు తీసుకుని ఆ అప్పు తీర్చి కార్డు ఒదిలించుకోవడం ఓ వ్యధాభరిత అధ్యాయం. అయిదారువందల నెల జీతగాన్ని పెళ్ళానికి అయిదారువేల రూపాయల (అసలు వడ్డీలతో కలిపి) చీరె కొనగలిగానన్న తృప్తితో ఆ మొదటి చీరె అంకం అలా ముగిసిపోయింది.
అలాగే మరోసారి ఆఫీసు పనిమీద ఢిల్లీ వెళ్లి, తిరిగి వచ్చే రోజు  పాలికా బజారులో నచ్చిన చీరె సెలక్టు చేసి, వచ్చీరాని హిందీలో, గీసి గీసి బేరం చేస్తున్న సమయంలో అప్పటివరకు శుద్ధ హిందూస్తానీలో మాట్లాడుతున్న షాపు వాడు అచ్చ తెలుగులోకి తిరిగిపోయి ‘అందరికీ నూట ఇరవై, మీకొక్కరికే అరవై సాబ్’ అంటూ  నన్ను మారుమాట్లాడనివ్వకుండా  మొహమాట పెట్టి  ఆ చీరె పొట్లం చేతిలో పెట్టాడు. హైదరాబాదు వచ్చిన తరువాత ఎందుకయినా మంచిదని యాభయ్ రూపాయలకే కొన్నట్టు ఫోజు పెట్టి నా ప్రయోజకత్వాన్ని ప్రదర్శించాను. చీరె రేటు చెబుతున్నప్పుడు మా ఆవిడ ‘అలాగా’ అంటూ చిన్నగా నవ్వుకున్న సంగతి గమనించలేకపోయాను. తరువాత ఇరుగు పొరుగు ఆడంగుల మాటలు  చెవిన పడ్డప్పుడు  కానీ అసలు విషయం బోధపడలేదు. అదేమిటంటే అరవై రూపాయలకు నేను కొన్న చీరె లాంటిది, మూడు నెలసరి వాయిదాలలో నలభయ్ రూపాయలకే అమ్మే షాపులు చిక్కడపల్లిలో అయిదారు వున్నాయట.

దాంతో బోధి చెట్టుతో అవసరం లేకుండానే తత్వం తలకెక్కింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఆవిడకు చీరె కొనే ప్రయత్నం మళ్ళీ చేయలేదు.                                   

21, సెప్టెంబర్ 2015, సోమవారం

?



ఏకాంబరం  ఆఫీసు పనిలో బిజీగా వున్నప్పుడు  క్రెడిట్ కార్డు నుంచి పెద్ద మొత్తంలో డబ్బు డెబిట్ అయినట్టు ఎలర్ట్ మెసేజ్ వచ్చింది. వెంటనే చేస్తున్న పని ఆపి భార్య సెల్ కి కాల్ చేసాడు.
‘ఏమిటి అప్పుడే తెల్లారిందా! షాపింగు కోసం ఊరిమీద పడ్డావ్. ఏం కొన్నావ్ అంత డబ్బెట్టి? పట్టు చీరెలా!’

‘కాదు. ఉల్లిపాయలు’  

20, సెప్టెంబర్ 2015, ఆదివారం

ఎందరో మహానుభావులు – వారిలో ఒకరికి నా నమస్కారం


సెప్టెంబరు  ఇరవై – ఈ రోజున అనేకమంది పుట్టివుంటారు. వాళ్ళల్లో కొందరు పెట్టి పుట్టినవాళ్ళు వుంటారు. వాళ్ళని గురించి తెలిసిన విషయాలను తెలియని వారికి చెప్పే అనేక వ్యాసాలు గట్రా అనేక పత్రికల్లో వస్తుంటాయి. కొందరికి అలాటి ప్రచారం దొరకదు. ఎందుకంటె ప్రచారం కోసం వాళ్ళు ఏపనీ చేయలేదు కనుక.
ఈ రెండో బాపతు మనిషి ఒకాయన కూడా ఎన్నో ఏళ్ళ క్రితం ఇదే రోజున పుట్టాడు. మాతామహుల గ్రామం కంభంపాడులో పుట్టినప్పటికీ ఆయన స్వగ్రామం మాత్రం ఖమ్మం జిల్లా వల్లభి. పుట్టిన తరువాత అక్కడ ఎన్నాళ్ళు ఉన్నాడో తెలవదు కానీ ఖమ్మం, హైదరాబాదు ఆపైన ఇంగ్లండు, ఇలా చదువుల నిమిత్తం, అలాగే ఉద్యోగపర్వంలో బూర్గుంపాడు, భద్రాచలం, హైదరాబాదు ఇలాగే రోజులు  గడిచిపోయాయి. ఒక ప్రభుత్వ డాక్టరుగానే జీవితం గడిపివుంటే ఆయన్ని గురించి రాయాల్సిన అవసరం ఉండేదే కాదు. వైద్య విద్యార్ధిగా తొలి పాఠం నేర్చుకున్నప్పుడే డాక్టర్లకు నేర్పే మరో నీతి పాఠాన్ని ఆయన ఒంటపట్టించు కున్నాడు.  జీవితాంతం దాన్నే పాటిస్తూ వస్తున్నాడు. ‘రోగికి అవసరం లేని వైద్యం చేయకూడదు, చేసిన వైద్యానికి డబ్బు తీసుకోకూడదు’ అన్నది ఆ పాఠం.

108, 104 అంటే ఏమిటో ఈరోజు తెలుగు రాష్ట్రాలలో యావన్మందికీ  తెలుసు. వాటి రూపశిల్పి ఈ డాక్టరు గారే. హైదరాబాదులో ఉంటున్నా, నెలలో చాలా రోజులు  వాళ్ళ సొంతూరు వల్లభిలో గడిపే ‘శ్రీమంతుడు’  డాక్టర్ అయితరాజు పాండు రంగారావు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.  

(డాక్టర్ ఏపీ రంగారావు)
      


ఆడవాళ్ళూ! శతకోటి దణ్ణాలు ! ( ఈ ఒక్కరోజే సుమా!)


నెల అంటే ముప్పయి రోజులు అని సెలవిచ్చాడు గతంలో హైదరాబాదు వచ్చిన ఓ కేంద్ర మంత్రి. ప్రస్తుతం మాజీ అనుకోండి. అల్లాగే ఏడాదికి అక్షరాలా మూడువందల అరవై అయిదు రోజులు అంటే కాదు కాదు ఇంకా ఎక్కువే అంటున్నారు కొందరు. ఆ సంఖ్య ఎల్లాగూ మారదు కాబట్టి ఒక్కో రోజుకూ రెండో మూడో పేర్లు తగిలించేస్తున్నారు ఈ మధ్య ఆ మరికొందరు.  ఆ లెక్కన ఇవ్వాళ అంటే సెప్టెంబరు ఇరవయ్యో తేదీని ‘భార్యల్ని ప్రశంసించే రోజు’ పొమ్మన్నారు. దానికి సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ‘ఈ ఒక్క రోజూ కట్టుకున్న ఇల్లాలిని మాటల్తో పొగిడి, మిగిలిన మూడువందల అరవై నాలుగు రోజులూ షరా మామూలుగా  అష్టోత్తరాలతో వేధిస్తే పోలా’ అనుకునేవాళ్లు కూడా ఉండవచ్చు. ‘ఆ మాత్రం దానికి ఈ ఒక్క రోజూ మొగుడితో పొగిడించుకుని, ఏడాది పొడుగునా అనరాని మాటలు పడుతూ వుండడం ఏమంత భాగ్యం’ అని ముక్కు చీత్తూ మధన పడే మగువలకూ తక్కువలేదు. ఇది ఇక్కడ ఒదిలి అసలు ఈ ‘కొత్త రోజు ‘కధాకమామిషూ’ ఏంటో చూద్దాం.
ఒక ఆంగ్ల దినపత్రిక ఈ ‘దినం’ అనగా ‘భార్యల్ని ప్రశంసించే దినం’  ప్రచార బాధ్యతని తన భుజాలకు ఎత్తుకుంది. మక్కికి మక్కి కాకుండా తెలుగులో సాగదీస్తే అది ఇలా సాగుతుంది.
‘హల్లో! ఎలా వున్నావు. మీ ఆవిడ ఎలా వుంది?’
‘మా ఆవిడా! ఓకేరా!’
‘ఏమిటీ జస్ట్ ఓకేనా! అంతేనా!’
‘..........’
‘చాలా ఆశ్చర్యంగా వుందే! ఆవిడ అంటే ఎవరనుకున్నావు. నీ అర్ధాంగి. మీ ఇంటి దీపం. ఉదయం అందరికంటే ఇంట్లో ముందు నిద్ర లేచేది ఆవిడే. ఇంట్లో అందరూ నిద్ర మంచం ఎక్కిన తరువాత అన్నీ సర్దుకుని నిద్రపోయే మనిషి కూడా ఆవిడే! నువ్వు తొడుక్కునే చొక్కా సైజు కూడా నీకు తెలవదు. ఆవిడ కొంటే తప్ప నీకు దిక్కులేదు. పిల్లలు ఏం తింటారో తెలవదు. వాళ్ళ పుట్టిన రోజులు కూడా నీకు జ్ఞాపకం వుండవు. అన్నీ కంప్యూటర్ లాగా ఆవిడ గుర్తు పెట్టుకోవాలి. ఇంట్లోకి ఏ సరుకులు కావాలన్నా ఆవిడే తేవాలి. పోపులడబ్బా ఎక్కడుందో కూడా నీకు తెలవదు. సరుకులు ఉన్నాయా నిండుకున్నాయా జవాబు చెప్పమంటే నీకు పడేవి నిండు సున్నా మార్కులే. ఈ విషయంలో ఆవిడని మించిన ఇన్వెంటరీ ఉంటుందా చెప్పు. చెప్పు అంటే జ్ఞాపకం వచ్చింది. ఆవిడ వెంట వుండి కొనిపెట్టకపొతే నీ చెప్పు సైజు కూడా నీకు తెలవదు. పిల్లల స్కూలెక్కడో, వాళ్ళేం చదువుతున్నారో, అసలు చదువుతున్నారో లేదో మీ ఆవిడ చెబితే కానీ తెలవదు. నీకీ సినిమా ఇష్టమో, నీకు ఏ కూర ఎలా చేస్తే యెంత ఇష్టమో ఆవిడకు తెలిసినంతగా నీకు బొత్తిగా తెలవదు. అల్లాంటి మనిషి ఎల్లా వుందంటే సింపుల్ గా ‘ఓకే’ అంటావా! అడిగేవాడు లేక. ఆయ్!!’             
కాబట్టి మొగుడు మిత్రాస్! (ఏవిటో నాకూ సోషల్ నెట్  వర్క్ భాష పట్టుబడుతోంది). ఒక్క రోజే కదా! మీరు మీరు కాదనుకుని, మీ ఆవిడ మీ ఆవిడే అనుకుని ఎంచక్కా నాలుగు మంచి మాటలు ఆవిడతో  మాట్లాడండి. ఆదివారం వంట పని పెట్టుకోకుండా ఏదైనా హోటల్ కు తీసుకువెళ్ళి, ‘ఛా! ఈ కూరా ఒక కూరేనా, నువ్వు వండితే ఆ రుచే వేరు’  అంటూ కాకమ్మ కబుర్లు కమ్మగా చెప్పండి. ఆడవాళ్ళు నమ్ముతారని నమ్మకం నాకయితే లేదు కానీ, ఆడవాళ్ళ గురించి నాకో బలమైన నమ్మకం వుంది. వాళ్ళు అల్ప సంతోషులు. కనీసం మిమ్మల్ని నమ్మించడం కోసమైనా వాళ్ళు మీ మాటలు నమ్మినట్టు కనిపిస్తారు.

ప్రయత్నం చేస్తే పోయేదేమీ లేదు నాలుగు మాటలు తప్ప. 


(NOTE: Image Courtesy: RotteneCARDS)
   

19, సెప్టెంబర్ 2015, శనివారం

రాజకీయం ఒక రక్షరేఖ



దుష్ట శక్తుల పీడలు సోకకుండా వుండడానికి కొందరు  తావీదులు, రక్షరేఖలు ధరిస్తుంటారు.
ఇప్పుడు రాజకీయం అలాటి రక్షరేఖగా మారిపోయింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు వర్తించే చట్టాలు, నియమ నిబంధనలు, రాజకీయ నాయకులకి వర్తించవు. ఇక్కడ మామూలు ప్రజలంటే షరా మామూలు ప్రజలే కాదు ఇంట్లో, వొంట్లో పుష్కలంగా వున్న ఖామందులు, శ్రీమంతులు, నటులు, కళాకారులు, చివరాఖరుకు జర్నలిస్టులు అందరూ వున్నారు. వీరిలో కొందరికి వారి వారి తాహతునుబట్టి కొన్ని కొన్ని ప్రత్యేక  సదుపాయాలూ, సామాజిక గౌరవాలూ ఉన్నప్పటికీ, రాజకీయ నాయకులతో పోలిస్తే అవి తక్కువే.
లక్షల్లో అభిమానులూ, కోట్లల్లో డబ్బు సంచులూ  వున్న సినీనటులు కూడా రాజకీయ రంగు పూసుకోవడం  కోసం  వెంపర్లాడేది అందుకే. కోట్లకు పడగెత్తిన శ్రీమంతులు, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న బడాబాబులూ తాము సంపాదించుకున్నదాన్ని కాపాడుకోవాలంటే రాజకీయం అనే రక్షరేకు తమకు  వుండి తీరాలి అనే నిర్ధారణకు వస్తున్నారు.  రాజకీయం, ప్రజాసేవ అనే పదాలు పొసగని వాళ్లు కూడా, డబ్బు వెదజల్లయినా  ఏదో ఒక నామినేటేడ్ పదవిలోకి  దూరిపోవాలని దూరాలోచనలు చేసేది అందుకే.
ఒక సినీ నటుడు వుంటాడు. ఏవిధంగా చూసినా కొదవలేని జీవితం. సంఘంలో గౌరవం. ఎక్కడకు వెళ్ళినా పరపతి.  ఒక్కసారి నోరారా  పలకరించినా చాలు, ఊరూరా  పులకరించిపోయే జనాలు. కానీ ఏం లాభం ? ఆదాయపుపన్ను శాఖకు చెందిన చిరుద్యోగి ఇంటికివచ్చినా చిరుచెమటలు పట్టాల్సిందే.
ఒక వ్యాపారవేత్త వుంటాడు. నేల నాలుగు చెరగులా విస్తరించిన వ్యాపారాలు. ఎక్జిక్యూటివ్ తరగతిలో విమాన ప్రయాణాలు, స్టార్ హోటళ్ళలో బసలు, నెలకు లక్షల్లో జీతాలు తీసుకుంటూ తనని కంటికి రెప్పలా కనిపెట్టుకునే  సొంత  సిబ్బంది.  ఏం సుఖం?  పనిమీద సచివాలయానికో, ప్రభుత్వ కార్యాలయానికో వెడితే పదివేల ఉద్యోగికి కూడా తీసికట్టే.
ఒక స్మగ్లర్ వుంటాడు. ప్రాణానికి వెరవని వందల మంది  గూండాలు వెంటనే  వుంటారు. ఏ కుక్కని కొట్ట కుండానే  డబ్బు రాశులు రాసులుగా  రాలిపడుతుంది. ప్రపంచంలోని సుఖాలన్నీ కాళ్ల చెంత వుంటాయి. ఏం ప్రయోజనం? రోడ్డు మీద పోలీసు కనబడితే భయపడే పరిస్తితి.

మరొకడు వుంటాడు. అతడు కళాకారుడు కాదు. విద్యావంతుడు కాదు. డబ్బున్నవాడు కాదు. పేరున్నవాడు కాదు. కానీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకే కాదు, ముఖ్యమంత్రి ఆఫీసుకే కాదు, ఆఖరుకు సాధారణ జనాలు గడప తొక్కడానికి సందేహించే పోలీసు ఠాణాలకు సైతం వేళాపాళా లేకుండా వెళ్ళగలడు. కింది స్తాయినుంచి పై స్తాయి అధికారి వరకు తలుపులు తోసుకుని వెళ్ళగలడు. తాను  వచ్చిన చెప్పి, అప్పటికప్పుడే  ఆ పనిచేసి తీరాలని పట్టుపట్టగలడు. ఒక్క మనిషికి  కూడా అధికారిక ప్రవేశం లేని చోట్లకు పదిమందిని వెంటేసుకు వెళ్ళగలడు. అతడే రాజకీయ నాయకుడు.
చట్టం తనపని తాను చేసుకుపోతుందనేది పడికట్టుమాట. చట్టం ఎవరిపట్ల యెలా తన పని చేయాలో నిర్దేశించే మీట మాత్రం  రాజకీయనాయకుల చేతిలో వుంటుంది. అతడు బిగువు  వొదిలితే చట్టం పనిచేసే వేగం కుందేలు పరుగులా పెరుగుతుంది. పగ్గం బిగిస్తే చట్టం తాబేలు నడకలా మందగిస్తుంది. అదీ రాజకీయానికి వున్న పవర్. ఎందుకని అడిగేవాడు లేడు.
చట్టం చేతులు చాలా పొడుగు అనే పొడుగాటి డైలాగులు రాజకీయ నాయకులకు వర్తించవు. వారిజోలికి వెళ్ళడానికి పోలీసులు జంకుతారు. మామూలుమనిషిని అరెస్టు చేయడానికి, పోలీసు స్టేషనుకు రప్పించడానికి వుండే నియమాలు, నిబంధనలు రాజకీయ నాయకుల విషయంలో హాం ఫట్, హుష్ కాకీ. అధవా గత్యంతరం లేక అరెస్టు చేయాల్సిన పరిస్తితే  వస్తే వారికి ఆకస్మిక అనారోగ్యం ఎక్కడినుంచో వూడిపడుతుంది. మామూలు మనిషినయితే, ‘ఒంట్లో బాగాలేదా నాయనా, బాగు చేయిస్తాం రా’ అని పోలీసు  స్టేషనుకు లాక్కెళ్లి మక్కెలు విరగబొడిచే  పోలీసులు, రాజకీయ  నాయకుల విషయం వచ్చేసరికి  వారి నిబంధనలూ, ఖాకీ దర్పాలూ అన్నీ  కట్టగట్టుకుని  గాలికి ఎగిరిపోతాయి.
రాజకీయం అనే రక్షరేకు వల్ల ఇన్ని లాభాలు వుండడం వల్లనే సమాజంలోని అన్ని వర్గాల వాళ్లు పొలోమని ఆ దారులవెంట పరుగులు తీస్తున్నారు. ఏదో ఒక పార్టీ గొడుగు కింద  వుంటే చాలు ఏవీ లేకపోయినా అన్నీ వున్నట్టే లెక్క.
ఉపశృతి: ప్రసిద్ధ సంపాదకులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు, ‘అప్పుడు - ఇప్పుడు’ అనే పేరుతొ, కీర్తిశేషులు, ప్రముఖ పత్రికా రచయిత శ్రీ జీ. కృష్ణ రచించిన గ్రంధానికి ముందుమాట రాస్తూ, ఒకానొక  సందర్భంలో కృష్ణ గారు నుడివిన వ్యాఖ్యను ఇలా ప్రస్తావించారు.
“ స్వాతంత్ర్యానంతరం మన రాజకీయ నాయకులు నేర్చుకున్నదేమిటి? కృష్ణగారు అంటారు – ‘రెండే రెండు విద్యలు. ఒకటి గుడ్డిగా పొగడడం, రెండు గుడ్డిగా వ్యతిరేకించడం’.
(19-09-2015)


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595       

16, సెప్టెంబర్ 2015, బుధవారం

490 490


నాలుగు లక్షల తొంభయ్ వేల నాలుగువందల తొంభయ్.

నేటితో (16-09-2015) పూర్తయిన నా బ్లాగు http://bhandarusrinivasarao.blogspot.in/  విజిటర్ల సంఖ్య

గర్వ భంగం

యమధర్మరాజు మహిష వాహనం ఎక్కి  యమపాశం చేతబట్టి భూలోకం బయలుదేరాడు.
కాలం తీరిన మనుషుల ప్రాణాలు పట్టి యమలోకానికి చేర్చడానికి తన కొలువులో ఎంతోమంది యమభటులు వున్నప్పటికీ యముడే  స్వయంగా భూలోక యాత్ర పెట్టుకోవడానికి ఓ కారణం వుంది.
నరలోకంలో ఓ నరుడు శాస్త్ర పరిశోధనలు  చేస్తూ చేస్తూ ఒక ప్రయోగంలో గణనీయమైన విజయం సాధించాడు. మనుషులను పోలిన మనుషులను సృష్టించే ఒక ఫార్ములాను కనుగొన్నాడు. అచ్చం తన మాదిరిగా వుండే మరో డజను మంది శాస్త్రవేత్తలను ఆ ఫార్ములా సాయంతో తయారుచేసాడు.
కానీ ఈ లోగా ఆ శాస్త్రవేత్తకు భూమిమీద నూకలు చెల్లే తరుణం ఆసన్నం కావడంతో అతడిని కొనిపోవడానికి నరకం నుంచి యమభటులు వచ్చారు. ఆ  వచ్చిన యమ భటులకు ఆ పదముగ్గురిలో అసలు శాస్త్ర వేత్త ఎవరన్నది అర్ధం కాలేదు. కనుముక్కు తీరులో కానీ, మాట వరుసలో కానీ, నడకలో కానీ ఆ పదమూడుమంది అచ్చంగా  ఒకే రకంగా వుండడంతో కాసేపు గుంజాటనపడి ఎటు తేల్చుకోలేక వారు నరకానికి తిరిగి వెళ్ళిపోయి తమ ప్రభువుతో విషయం విన్నవించుకున్నారు.
యమధర్మరాజు స్వయంగా పాశం పట్టుకుని భూలోకం రావడానికి ఇదీ నేపధ్యం.
తీరా వచ్చిన తరువాత కానీ తన భటులు పడ్డ అవస్థ ఆయనకు అర్ధం కాలేదు. వాళ్లు చెప్పినట్టు ఆ పదమూడుమందిలో అసలు శాస్త్రవేత్త ఎవరన్నది గుర్తుపట్టడం అతి కష్టం అని ఆయనకు కూడా తొందరగానే అర్ధం అయిపోయింది. కానీ సమవర్తి తన వోటమిని అంత తేలిగ్గా యెలా వొప్పుకుంటాడు చెప్పండి?
అప్పుడాయన ఏం చేశాడన్నదే ఈ చిన్న కధకు క్లైమాక్స్.
తన ఎదుట కనబడుతున్న పదముగ్గురిలో ఒకడే తనకు కావలసిన వాడు. ఆ ఒక్కడినీ కనిపెట్టడం యెలా! అందుకని వారందరినీ వుద్దేశించి ఇలా అన్నాడు.
“అయ్యా శాస్త్రవేత్త గారు. మీ మేధస్సు అమోఘం. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన మీ తెలివితేటలకు నా జోహారు. ఇటువంటి మేధావిని నా ఇన్ని కోట్ల సంవత్సరాల  సర్వీసులో ఎన్నడూ చూసి ఎరుగను. మీ పదముగ్గురిలో అసలు ఎవరు? మిగిలిన ఆ పన్నెండుమంది నకిలీలు ఎవరన్నది తెలుసుకోగలగడం  ఆ మూడు తలల విధాతకు కూడా సాధ్యం కాదనిపిస్తోంది. కాకపొతే పరీక్షించి చూడగా చూడగా  నా కళ్ళకు మాత్రం  మీ ప్రయోగంలో   ఏదో ఒక చిన్నలోపం కానవస్తోంది. ఇంత అద్భుత సృష్టి  చేసిన మహానుభావులు మీరు.  అంత చిన్న లోపాన్ని కనిపెట్టి ఎందుకు  సరిచేయలేకపోయారో నాకర్ధం కావడం లేదు..........”
........యమధర్మరాజు మాటలు ఇంకా పూర్తికానేలేదు.
ఈ లోపలే ఆ పదముగ్గురులోనుంచి ఒకడు తటాలున  బయటకు వచ్చి “నా పనిలోనే తప్పు పట్టేంత మొనగాడివా నువ్వు. తప్పు చేశానని వూరికే  అంటే సరిపోదు. ఎక్కడ ఆ తప్పు చేసానో కూడా  చెప్పు” అన్నాడు.
యముడు క్షణం ఆలశ్యం చేయకుండా ఆ మాటలు అంటున్న వ్యక్తిపై పాశం విసురుతూ చెప్పాడు. “ఇదే నువ్వు  చేసిన తప్పు. దీన్ని మీభాషలో ఇగో (EGO) అనో, గర్వం అనో అంటారు. దాన్ని చంపుకుని వుంటే  ఇప్పుడు  నీకీ  చావు తప్పేది.”  

(Image courtesy ROBO film)